Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

..ఆత్మవిశ్వాసమే ఔషధం

$
0
0

ప్రశాంతి ఎం.బి.ఏ మార్కెటింగ్ ప్రథమ శ్రేణిలో పాసయ్యింది. పాతికేళ్ళ వయసొచ్చినా నలుగురిలో కలవలేకపోతున్నది. ఇంటర్వ్యూలు, పెళ్లిచూపుల్లో ఆమె ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. నలుగురి ముందుకు రాగానే బిగుసుకుపోతుంది. ఏది మాట్లాడాలన్నా భయపడుతుంది. ఒక్కోసారి నత్తి, నత్తిగా మాట్లాడుతుంది. దీనివల్ల ఉద్యోగం, పెళ్లి ఆలస్యమవుతున్నది. కుటుంబ సభ్యులతో సరదాగా గడిపే ఆమె నలుగురిలో అలా ఎందుకు ప్రవర్తిస్తుందో తల్లిదండ్రులకు అర్థం కాకుండా తల పట్టుకుంటున్నారు.
చాలామంది నలుగురితో కలవాలన్నా, కొత్తవారితో మాట్లాడాలన్నా భయపడుతుంటారు. సమూహాన్ని చూడగానే ఆందోళన చెందుతుంటారు. తెలిసిన విషయాలుకూడా చెప్పలేరు. భావాలను పంచుకోలేరు. కొత్తవారి ఎదురుగా కూర్చుని భోజనం చేయాలన్నా, పానీయాలు సేవించాలన్నా చేతులు వణుకుతాయి. ఇలాంటి సమస్య ఎక్కువగా యువతలో కనిపిస్తుంది. అయితే అన్నివయస్సుల వారిలోను ఆందోళన చెందే మనస్తత్వం ఉంటుంది. దీనివల్ల ఇంట, బయట సమస్యలు ఎదురవుతుంటాయి. తమలోని శక్తి, సామర్థ్యం, నైపుణ్యం, తెలివితేటల్ని సక్రమంగా ప్రదర్శించలేరు. అతి ముఖ్యమైన పనులు చేయాల్సినపుడు తడబాటుకు గురవుతుంటారు. సమావేశాలు, సదస్సులు, గ్రూప్ డిస్కషన్‌లలో పాల్గొనడానికి ఇష్టపడరు. తప్పనిసరైనపుడు తప్పించుకోవడానికి సాకులు వెదుకుతారు. కొన్ని సందర్భాలలో జ్వరం, విరేచనాలు, వాంతులకు గురవుతారు. ఈ లక్షణాలవల్ల వీరు పలు అవకాశాలను కోల్పోవలసి వస్తుంది.
కారణాలు
సోషియల్ యాంగ్జైటి డిజార్డర్‌ను వ్యక్తిత్వ లేదా ప్రవర్తనా లోపంగా భావించాలి. కొన్ని సందర్భాలలో దీనికి జన్యు లోపాలు కారణంగా చెప్పుకున్నా, పెంపకలోపం, పెరిగిన వాతావరణం ప్రభావం చూపుతాయి. చాలామంది తల్లిదండ్రులు పిల్లలను అతి గారాబంగా పెంచుతారు. ఎవరితో కలవనివ్వరు. సహచర పిల్లలతో ఆడుకోవడానికి అనుమతించరు. లేనిపోని సెంటిమెంట్లు నూరిపోసి పిరికివారుగా తయారు చేస్తారు. అలాగే బాల్యంలో ఎదురైన ప్రతికూల సంఘటనలు వ్యక్తుల్లో పోబియాలుగా మారే అవకాశాలున్నాయి. చిన్నతనంలో ఎదురైన అవహేళనలు, అణచివేతలు, అవమానాలు బలమైన ప్రభావం చూపుతుంటాయి. ఊహాత్మక భయాలు, కల్పనలు గతానుభవాలు మనిషికి ఆత్మన్యూనతకు గురి చేస్తుంటాయి. అలాగే యవ్వనంలోకి అడుగుపెట్టే దశలో పలు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనివల్ల సిగ్గు, బిడియం, సంకోచం తలెత్తి బిగుసుకుపోతుంటారు. మెతక స్వభావం, ఆత్మవిశ్వాసలేమి, స్వీయ గౌరవం లేకపోవడం కూడా ఆందోళనకు దారితీసే అవకాశం ఉంటుంది. భావ వ్యక్తీకరణ, నిర్ణయాత్మక శక్తి, సమస్యల పరిష్కార నైపుణ్యం తక్కువగా ఉన్నవారు ఎదుటివారి ముందుకు వెళ్లడానికి భయపడుతుంటారు.
ఆత్మవిశ్వాసము ఔషధం
ప్రతి చిన్న విషయానికి పెద్దగా భయపడి ఆందోళన చెందేవారికి ఆత్మవిశ్వాసమే ప్రధాన ఔషధం. ఎవరికివారు వారి సమస్యను తెలుసుకుని అధిగమించే ప్రయత్నం చేయాలి. సమూహం, లేదా గుంపును చూసి భయపడేవారికి అప్పుడప్పుడు గ్రూపులో ఉండేలా చూడాలి. సమూహంలో ఐదు, పది నిమిషాలు ఉండటం, మాట్లాడించడం చేయాలి. సభలు, సమావేశాల్లో పాల్గొనేలా చూడాలి. తొలుత కొద్ది సమయంతో ప్రారంభించి సమయం పెంచుకుంటూ పోవాలి. ఇలా చేయడంవల్ల అధికంగా ఉండే భయం, ఆందోళన క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. అలాగే పొరపాట్లు, తప్పులు జరిగినా ఫరవాలేదన్న భరోసా కల్పించాలి. అలాగే తప్పులు చేయడం మానవ సహజం అన్న విషయం అర్థమయ్యేలా చూడాలి. విజ్ఞత, వివేకం కల్పించాలి. దీనివల్ల నెమ్మది నెమ్మదిగా వారి పట్ల వారికి నమ్మకం పెరుగుతుంది. సమస్యలు, సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నవారే వ్యవహారంలో రాటుతేలుతారన్న సత్యాన్ని అర్థమయ్యేలా చెప్పాలి. నవ్విన నాపచేనే పండుతుంది. ఓటమి గెలుపుకు పునాది లాంటి సామెతలతో సానుకూల దృక్పథం పెంపొందించాలి. శారీరక వ్యాయామాలు, యోగాసనాలు, ధ్యానప్రక్రియలుకూడా వ్యక్తిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి దోహదపడుతాయి. కౌనె్సలింగ్, సలహాలు ఫలితమివ్వకపోయినా, సమస్య తీవ్రంగా ఉన్నా సైకియాట్ట్రిస్టును సంప్రదించి మందులు వాడాలి. మందులవల్ల తీవ్రత తగ్గిన తరువాత తిరిగి కౌనె్సలింగ్, శిక్షణ ప్రారంభించాలి. దీనికి కుటుంబ సభ్యుల మద్దతు, స్నేహితుల తోడ్పాటు కూడా అవసరం ఉంటుంది.

డాక్టర్ ఎన్.బి.సుధాకర్ రెడ్డి
Psychologist
nbsreddi@gmail.com
18-4-111/2, రైల్వే కాలనీ,
తిరుఫతి - 517 501.

ప్రశాంతి ఎం.బి.ఏ మార్కెటింగ్ ప్రథమ శ్రేణిలో పాసయ్యింది.
english title: 
atma
author: 
డాక్టర్ ఎన్.బి.సుధాకర్ రెడ్డి Psychologist nbsreddi@gmail.com

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>