మొటిమలు, సెగగడ్డలు చీముపొక్కులు, దద్దుర్లు, చర్మవ్యాధులు మొదలైన వాటి కారణంగా ముఖంమీద ఏర్పడిన ముదురు రంగు మచ్చలను బ్లిమిషెస్ అంటారు. ఆయుర్వేదంలో నీలిక అని పేరు. వంశపారంపర్యత, తైలగ్రంథుల అతి చురుకుదనం, ఒత్తిడి వంటివి అనేకం ఈ సమస్యను ఉధృతం చేస్తాయి.
మన చర్మపు రంగుకు కారణం మెలనిన్ అనే వర్ణ సంబంధ పదార్థం. వాతావరణ ప్రతికూలతలు, ఆహారంలో మార్పులు, హార్మోన్లలో తేడాలు, వివిధ రకాల చర్మవ్యాధులు వంటివాటి వల్ల మెలనిన్ గాఢత పెరిగే అవకాశం ఉంది. ఇలా జరిగినప్పుడు వైద్యపరిభాషలో హైపర్ పిగ్మెంటేషన్ అంటారు. ఇది ముఖచర్మం మీద కనిపిస్తే బ్లిమిషెస్ అంటారు. బ్లిమిషెస్ తయారైనప్పుడు బాధితులకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. చాలా సందర్భాల్లో మేకప్‌తో కూడా దాయలేని పరిస్థితి ఉంటుంది. అయితే ఈ సమస్యకు ఆయుర్వేద గృహ చికిత్సలు చక్కగా పనిచేస్తాయి. అలాగే కొన్ని సాధారణమైన సూచనలు పాటిస్తూ హితకరంగా ఉంటుంది.
సాధారణ సూచనలు
అతిగా రుద్దవద్దు:
చాలామంది ముఖంమీద మచ్చలు కనిపిస్తున్నప్పుడు బాగా శుభ్రం చేసుకుంటే పోతాయనే ఉద్దేశ్యంతో బాగా రుద్దుతారు. అయితే ఇలా చేయడంవల్ల చర్మం రేగి సమస్య మరింత ఎక్కువ అవుతుంది. మరికొంతమంది మందపాటి గుడ్డను నీళ్లలో ముంచి వాష్ క్లాత్ మాదిరిగా ప్రయోగిస్తారు. ఇలా చేయడం కూడా సరికాదు.
ఒత్తిడి తగ్గించుకోవాలి:
ముఖంమీదమచ్చలు తయారవడానికి ఒత్తిడి ఒక ప్రధానమైన కారణమని పరిశోధనల్లో తేలింది. ఒత్తిడివల్ల కొన్ని ప్రత్యేకమైన హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి చర్మపు రంగును మార్చే అవకాశం ఉంటుంది. కనుక ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. దీనికి మీకు ఇష్టమైన పద్ధతిని దేనినైనా ఎంచుకోవచ్చు. వ్యాయామం, ధ్యానం, చక్కని ఆహ్లాదకరమైన సంగీతం వినడం, లలిత కళలను సాధన చేయడం ఇలాంటివి ఒత్తిడిని తగ్గించుకోవడానికి చక్కగా ఉపయోగపడతాయి.
శీతల చర్యలు ఉపయోగపడతాయి:
బ్లిమ్‌షెస్ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నప్పుడు ఐస్‌క్యూబ్‌ను నిమిషంపాటు నేరుగా ప్రయోగిస్తే చక్కని ఫలితం కనిపిస్తుంది. ముఖాన్ని చన్నీళ్ళతో శుభ్రపరచుకున్న తరువాత ఐస్‌క్యూబ్‌ని మచ్చమీద ఉంచితే చర్మపు పొరల్లో చేరిన శోధ (ఇన్‌ఫ్లమేషన్) తగ్గి బ్లింషెస్ కొట్టొచ్చినట్లు కనిపించడం తగ్గుతుంది.
మొటిమలను పిండవద్దు:
చాలామంది మొటిమలు తయారైనప్పుడు తగ్గించుకునే ఉద్దేశ్యంతో గట్టిగా పిండుతారు. అప్పటికి తాత్కాలికంగా ఆ మొటిమ తగ్గినట్లే కనిపిస్తుంది. అయితే ఈ చర్యతో దాని పక్కనే కనీ కనిపించకుండా ఉండే చిన్న చిన్న మొటిమలు చిట్లి వాటిలోని స్రావాలు చుట్టుప్రక్కల వ్యాపిస్తాయి. దీంతో స్థానికంగా కణజాలం గట్టిపడి మచ్చమాదిరిగా తయారవుతుంది. కనుక ఇలా మొటిమలను పిండం మానుకోవాలి.
ఎండకు ఎక్కువగా గురికావద్దు:
సూర్యకిరణాల్లోని అతినీలలోహిత కిరణాలవల్ల చర్మం రేగే అవకాశం ఉంటుంది. ఇవి తీక్షణంగా ఉన్నప్పుడు చర్మంపైన మంటలు, దద్దుర్లు, ఎరుపుదనం వంటివి ప్రాప్తించి తదుపరి స్థితిగా బ్లింషెస్ మారే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఉదయం పనె్నండు గంటలనుంచి మధ్యాహ్నం మూడు గంటల మధ్య సూర్యకిరణాల్లో తీక్షణత ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
మీరు తీసుకునే ఆహారంగురించికూడా జాగ్రత్త తీసుకోవాలి.
ఐయోడిన్ అధిక మొత్తాల్లో ఉండే పదార్థాలు మొటిమలను మంగు మచ్చలను ఎక్కువ చేసే అవకాశం ఉన్నట్లుగా ఇటీవల జరిగిన అధ్యయనాల్ల తేలింది. సముద్ర జలచరాల మాంసంలోను, బీఫ్ వంటి మాంసాహారాల్లోనూ ఐయోడిన్ అధిక మొత్తాల్లో ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా ఛీజ్, వేరుశెనగ, జీడిపప్పు వంటి నట్స్ జాతికి చెందిన పదార్థాలు, కొవ్వు పదార్థాలు, చాక్లెట్స్, జిడ్డుకలిగిన పదార్థాలు, పాల పదార్థాలను తగ్గించాలి.
కాస్మటిక్స్‌ని జాగ్రత్తగా ఎంచుకొని వాడాలి
తైలం బేస్‌గా తయారయ్యే మేక్‌ప్‌లను ముఖంమీద మచ్చలను తీవ్రతరం చేసే అవకాశం ఉంటుంది. కాస్మటిక్స్ తయారీకోసం వాడే తైల సంబంధ పదార్థం సాధారణంగా ఫ్యాటీ యాసిడ్స్ నుంచి వచ్చినదై ఉంటుంది. కాస్మటిక్స్ వాడటం తప్పదనుకుంటే తైల ధ్రానమైన కాస్మటిక్స్ కాకుండా నీళ్లు బేస్ పదార్థంగా తయారయ్యే కాస్మొటిక్స్‌ని, జెల్స్‌ని వాడటం మంచిది.
గృహ చికిత్సలు
ముఖంమీద తయారయ్యే మచ్చలకు మీకు మీరే చక్కని లేపనాన్ని తయారుచేసుకొని వాడుకోవచ్చు. కర్పూరం 7 భాగాలు, బాదం పలుకులు 2 భాగాలు, చందనం 1 భాగం, రోజ్‌వాటర్ 30 భాగాలు... ఈ పద్ధతిలో పదార్థాలను తయారుగా ఉంచుకోవాలి. మొదట చందనం చెక్కను సానరాయిమీద అరగదీసి మెత్తని పేస్టుగా చేయాలి. తరువాత బాదం గింజలను చిన్న చిన్న రేణువులుగా నూరాలి. తరువాత మిగతా అన్ని పదార్థాలను ఒకటిగా కలిపి క్రీమ్ మాదిరిగా తయారుచేసి సీసాలో పోసి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. దీనిని ప్రతిరోజు కావలసినంత తీసుకొని మచ్చలపైన ప్రయోగిస్తుంటే కొద్దిరోజుల్లో చక్కని ఫలితం కనిపిస్తుంది.
-వాము గింజలను నూరి రసం తీసి మల్లెమొగ్గల కషాయానికి కలపాలి. దీనిని ముఖంమీద ప్రయోగిస్తే మచ్చల గాఢత తగ్గుతుంది.
-నేరేడు గింజలు ముఖంమీద మచ్చలను తగ్గించగలుగుతాయి. నేరేడుపండ్లను రాత్రంతా నీళ్లలో నానబెట్టుకోవాలి. ఉదయం మెత్తపడిన గింజలను పేస్టు మాదిరిగా నూరి ముఖానికి లేపనం చేసి ఆరిపోయేంతవరకు ఉంచుకోవాలి. బాగా ఆరిన తరువాత చన్నీళ్లతో కడగాలి. దీనిని రోజుకు రెండు మూడుసార్లు చొప్పున చేస్తే చక్కని ఫలితం కనిపిస్తుంది.
మచ్చలు మొండిగా తయారైన వారికి మరో మంచి గృహ చికిత్స ఉంది. ఈ గృహ చికిత్సను నెలరోజులపాటు నిరంతరం ఆచరిస్తే చక్కని ఫలితం కనిపిస్తుంది. 40 గ్రాముల బాదం గింజలను, 15 గ్రాముల కుంకుడు ఒలపులను, 5 గ్రా. బియ్యాన్ని, 6గ్రా. మిరియాలను తీసుకోవాలి. అన్నిటినీ కలిపి పేస్టుగా నూరి ముఖంమీద ప్రయోగించి కొద్దిగా మసాజ్ చేయాలి. దీంతో మచ్చల్లోని గాఢత తగ్గి ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
-కమలాపండు పైతొక్క(తోలు)లో మచ్చలను తగ్గించే శక్తి ఉంది. కమలాపండ్లపైనుండే తోలును సేకరించి తడి పూర్తిగా ఆరిపోయేంతవరకు ఎండలో ఆరబెట్టాలి. తరువాత మెత్తగా పొడి చేసుకొని నిల్వచేసుకోవాలి. ఈ పొడిని తగినంత తీసుకొని రోజ్‌వాటర్, నిమ్మరసం మిశ్రమాన్ని కలిపి బాహ్యప్రయోగంగా వాడితే ముఖం మీద మచ్చలు క్రమంగా తగ్గుతాయి.
-నేరుగా తేనెను మచ్చలమీద ప్రయోగించినా చక్కని ఫలితం కనిపిస్తుంది. తేనెలో కీటకనాశక శక్తి ఉండటం వల్ల సూక్ష్మక్రిములు పెరగకుండా ఉంటాయి. అలాగే దీనిలో ఉండే ఎంజైములవల్ల హైపర్ పిగ్మెంటేషన్ సైతం తగ్గుతుంది.
బ్లింషెస్ అనేవి వైద్యపరమైన కారణాలవల్ల వస్తుంటాయి. కనుక కొన్ని రోజుల గృహ చికిత్సలు ప్రయత్నించినప్పటికీ తగ్గపోతే తప్పకుండా వైద్య సలహా తీసుకోవాలి. వైద్య సలహా మేరకు కైశోరగుగ్గులు, ఆరోగ్యవర్థినివటి, మంజిష్టాది క్వాథం వంటి మందులను వాడాల్సి ఉంటుంది.
-డాక్టర్ చిరుమామిళ్ల మురళీమనోహర్
murali manoharch@hotmail.com
రక్ష ఆయుర్వేదిక్ సెంటర్,
స్టేట్‌హోం ఎదుట, సారథీ స్టూడియో రోడ్,
అమీర్‌పేట, హైదరాబాద్ - 500 073.