ఎచ్చెర్ల, సెప్టెంబర్ 27: ఖరీఫ్ రుణ ప్రణాళిక ముగియడానికి మూడురోజులే గడువు ఉండడంతో బ్యాంకు శాఖలన్నీ రైతులతో కిటకిటలాడుతున్నాయి. 800 కోట్లు రుణ ప్రణాళిక నిర్ణయించినప్పటికీ కొత్తగా ఈ ఏడాది కొద్దిమంది అన్నదాతలకే రుణం పొందే అవకాశం లభించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు సెలవిచ్చినా బ్యాంకర్లు మోకాళ్లడ్డడంతో అన్నదాతలకు వడ్డీలేని రుణం అందకుండాపోయింది. పట్టాదారు పాసుపుస్తకాలు, దీనికితోడు కంప్యూటర్ అడంగళ్లు కావాలని నిబంధనలు విధించడం, మీసేవ కేంద్రాల ద్వారా పొందాలని రెవెన్యూ అధికారులు తప్పించుకోవడంతో అనేక మందికి ఖరీఫ్ సీజన్‌లో రుణం పొందే అవకాశం చేజారింది. జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఖరీఫ్ సీజన్‌గా పంట రుణం తీసుకున్నట్లయితే ఒకవేళ కరవు ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటించి పంటల బీమా వర్తింపజేసినట్లయితే రైతాంగం నష్టాల ఊబిలోంచి గట్టెక్కే అవకాశం లభిస్తుందని పలువురు ఈ రుణం కోసం ఆరాటపడినా ఆశాభంగం ఎదురైంది. మండల గ్రీవెన్స్‌లు, పల్లెకుపోదాం, డయల్‌యువర్‌కలెక్టర్, జిల్లా కలెక్టర్ నిర్వహించే గ్రీవెన్స్‌లలో పంట రుణం కావాలని అర్జీలతో మొరపెట్టుకున్నా బ్యాంకర్లు కరుణించే దాఖలాలు కానరాలేదు. అందువల్ల ఇప్పటికీ 50 కోట్లు పంట రుణాలు అందించాల్సి ఉందని సంబంధిత అధికారులే స్పష్టం (మిగతా 2వ పేజీలో)
చేస్తున్నారు. ఇదిలా ఉండగా కౌలురైతుల పరిస్థితి మరింత దయనీయం. జిల్లాలో సుమారు 60 వేల మంది సాగురైతులున్నప్పటికీ ప్రభుత్వం ఇటీవలి సదస్సులు నిర్వహించి 25 వేల మందినే గుర్తించింది. వీరికి రుణ అర్హతకార్డులను పూర్తిస్థాయిలో జారీ చేయలేకపోయింది. రుణ అర్హత కార్డులు పొందిన 12 వేల మంది రైతులకు కూడా పంట రుణం ఎక్కడా అందిన దాఖలాలు లేవు. ఏడాదికే ఈ రుణ అర్హత కార్డులు వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేసినప్పటికీ అదే భూమిపై అసలు రైతులు పంటరుణాలు పొంది ఉండడంతో బ్యాంకర్లు ససేమిరా అంటున్నారు. ఇలా కౌలురైతుకు ఈసారి కూడా నిరాశే ఎదురైంది. కార్డులకే కౌలురైతులు పరిమితం కావడం, అధికారులు కూడా రుణాలు ఇప్పించేందుకు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో సాగుదారుల చట్టం వీరిని ఆదుకోలేకపోయింది. ప్రతీ ఏటా కరవుకాటకాల్లో తీవ్ర నష్టాలు ఎదుర్కొని అప్పులఊబిలో కూరుకుపోయిన వీరిని ఆదుకునేందుకు బ్యాంకర్లు ముందుకు రాకపోవడం విశేషం.
జిల్లాలో 1.95 లక్షల హెక్టార్లు సాధారణ విస్తీర్ణం కాగా ఈ ఏడాది 1.70 లక్షల హెక్టార్లలో వరినాట్లు జరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సాగు విస్తీర్ణానికి తగిన రుణ ప్రణాళిక లక్ష్యాలు చేరువలో లేకపోవడం అన్నదాతలంతా ప్రైవేట్ వ్యాపారుల వలలో పడి అధిక వడ్డీలు చెల్లించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా అన్నదాతలను ఆదుకునేందుకు బ్యాంకర్లు నిబంధనలను సడలించి పంట రుణాలు అందివ్వాలని పలువురు రైతులు వాపోతున్నారు.
లక్ష్యాలు అధిగమిస్తాం
* నాబార్డు ఎల్.డి.ఎం శ్రీనివాసశాస్ర్తీ
వ్యవసాయ రుణ ప్రణాళిక లక్ష్యాలు అధిగమించేందుకు జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ బ్యాంకర్లతో నిరంతరం సమీక్షిస్తున్నామని నాబార్డు ఎల్.డి.ఎం శ్రీనివాసశాస్ర్తీ స్పష్టం చేశారు. ఇప్పటివరకు 750 కోట్ల మొత్తాన్ని పంట రుణాలుగా రైతులకు అందించామన్నారు. మిగిలిన మొత్తాన్ని రుణంగా అందించి శతశాతం లక్ష్యాలను అధిగమిస్తామన్నారు.
సిక్కోలంతా పర్యాటకమే!
శ్రీకాకుళం(కల్చరల్), సెప్టెంబర్ 27: శతాబ్ధాల సంస్కృతి, వారసత్వ సంపద, ప్రకృతి అందాలు మెండుగా ఉన్న శ్రీకాకుళం జిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా గురువారం సాయంత్రం బాపూజీ కళామందిర్‌లో నిర్వహించిన పర్యాటక ముగింపు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా సువిశాల సముద్రతీరం, అలాగే చారిత్రక పుణ్యక్షేత్రాలు ఎక్కడికక్కడే పర్యాటకులను ఆకట్టుకునేలా దర్శనమిస్తాయని కొనియాడారు. ఇప్పటికే బారువ, కళింగపట్నం, భావనపాడు తీరంలో పర్యాటకుల కోసం విశ్రాంతభవనాలు నిర్మించామన్నారు. ఇటీవలి జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాలో ప్రకృతి సంపదను చూసి అబ్బురపోయారని గుర్తుచేశారు. ప్రపంచ పఠంలో జిల్లాను ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా ఉంచడానికి అన్ని చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయాలన్న ఆలోచన (మిగతా 2వ పేజీలో)
బలంగా ఉంటే నిధులు, ప్రభుత్వ సహకారం మెండుగా లభిస్తుందన్నారు. విశాఖపట్నం కైలాసగిరి తరహాలో పొన్నాడ కొండను తీర్చిదిద్దడానికి ఇప్పటికే వుడా అనుమతులు కోరినట్లు వెల్లడించారు. మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ మాట్లాడుతూ విహార యాత్రలను విస్తృత పరచడం ద్వారా పర్యాటక రంగాన్ని జిల్లాలో విస్తరించాలన్నారు. డిసిఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి మాట్లాడుతూ నాగావళి, వంశధార, బంగాళాఖాతం, పచ్చనికొండలు, చారిత్రాత్మక ఆధారాలు కలిగిన ఈ జిల్లాలో పుట్టడం, నివశించడం ఎంతో అదృష్టమన్నారు. జిల్లా పౌరసంబంధాల అధికారి ఎల్.రమేష్ మాట్లాడుతూ పర్యాటక కేంద్రాలు అభివృద్ధి చేయడం వల్ల మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. సభాధ్యక్షులు ఇంటాక్ కన్వీనర్ దూసి ధర్మారావు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లా గొప్పతనాన్ని వివరించారు. పర్యాటక రంగం అనే అంశంపై నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రిన్సిపాల్ సురంగి మోహనరావు, నాగావళి హోటల్ అధినేత ఆనంద్, సంగీత దర్శకులు బండారు చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇదే..ఇదే..శ్రీకాకుళం అనే అంశంపై నృత్యదర్శకుడు రఘుపాతృని శ్రీకాంత్ రూపొందించిన నృత్యరూపక ప్రదర్శన ఆహుతులను అలరించింది. తొలుత కలెక్టర్ జిల్లా పర్యాటక అందాలపై చిత్రప్రదర్శనను తిలకించారు.
ఉచితం ఒట్టి మాటేనా?
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, సెప్టెంబర్ 27: ఇసుక వ్యాపారుల దందాకు అడ్డకట్టు వేసి ఇందిరమ్మ లబ్ధిదారులకు ఊతమిచ్చేలా ప్రభుత్వం ఉచితంగా ఇసుకను సరఫరా చేసేందుకు రంగం సిద్ధం చేసింది. అయితే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు నేటికీ విడుదల కాకపోవడంతో దీనిపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ముఖ్యంగా ఇసుక కొరతతో సతమతమవుతున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కష్టాలు గట్టెక్కుతాయని వారంతా భావించినప్పటికీ ఆ దిశగా సర్కార్ చర్యలు కానరాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తప్పేటట్లు లేదు. జిల్లాలో సుమారు 50 వేల మంది ఇందిరమ్మ లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక సరఫరా వర్తిస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గతంలో కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఉచితంగా ఇసుకను సరఫరా చేసేలా టోకెన్లు పంపిణీ చేశారు. అయితే అది కొంతకాలమే కొనసాగింది. లబ్ధిదారులు ముందుగా హౌసింగ్ ఎ.ఇ ద్వారా ఇందుకు టోకెన్లు పొంది సంబంధిత ఇసుక ర్యాంపు నిర్వహణకు అందజేస్తే వారు తప్పనిసరిగా ఉచితంగా ఇసుకను అందజేస్తారని సర్కార్ పెద్దలు మీడియా ముందు ప్రకటించినప్పటికీ ఆ పరిస్థితులు జిల్లాలో కానరావడం లేదు. జిల్లాలో సుమారు 30 ఇసుక ర్యాంపులు ఉన్నప్పటికీ కేవలం ఐదు ర్యాంపులకే వేలం పాటలు నిర్వహించగా కోట్లాది రూపాయలకు పాటదారులు దక్కించుకున్నారు. అయితే దీనిపై కొంతమంది కోర్టును ఆశ్రయించడంతో ర్యాంపుల్లో లావాదేవీలు నిలిపివేయాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. దీనిని సాకుగా తీసుకుని కొంతమంది ఇసుక మాఫియాగా ఏర్పడి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీనివల్ల ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇసుక వ్యవహారం గుదిబండగా మారింది. ట్రాక్టర్ ఇసుక రెండువేలకు విక్రయించి భవన నిర్మాణ యజమానుల నుంచి దోపిడీ చేస్తున్నా సంబంధిత అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ముందుచూపుతో ఇసుక మాఫియా వివిధ తోటలు, ఖాళీ ప్రదేశాల్లో నిల్వలు ఉంచి రాత్రివేళల్లో జిల్లా కేంద్రం, సమీప మండలాల్లో పలు గ్రామాలకు తరలిస్తూ చీకటివ్యాపారం సాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా మైన్స్, రెవెన్యూ, పోలీసు అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడంతో ఇందిరమ్మ లబ్ధిదారులతో పాటు చిన్న, మధ్య తరగతి ఉద్యోగులు కూడా ఈ భారాన్ని వౌనంగా భరిస్తున్నారు. అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతో (మిగతా 2వ పేజీలో)
ఇసుకాసురులు అనుకున్నంత మొత్తాన్ని ముక్కుపిండి వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. జిల్లా నుండి విశాఖ నగరానికి కూడా లారీలతో పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని పలువురు వాపోతున్నారు. ఇసుక దందా మూడుపువ్వులు, ఆరుకాయలుగా సాగుతోంది. మొబైల్ నెట్‌వర్క్‌తో విజిలెన్సు, మైన్స్ అధికారుల తనిఖీల్లో కూడా కళ్లుగప్పి అడ్డదారుల గుండా పట్టపగలే తరలిస్తూ దండీగా సొమ్ములార్జిస్తున్నారు. సంబంధిత అధికారులకు తాయిళాలు వేసి కోవర్టులుగా మార్చుకుని వారి కదలికలపై నిఘా పెట్టి ఇసుకాసురులు అక్రమాలు సాగిస్తున్నట్లు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితులు జిల్లాలో నెలకొనడంతో ఉచిత ఇసుక సరఫరా ఎట్టా సాధ్యమవుతోందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా పేదల ఇళ్ల నిర్మాణాలకు ఇసుక ఎండమావిగా మిగిలిందనే చెప్పాలి.
తెరవెనుక యత్నాలపై
అనుమానాలు
అర్హులైన నిరుపేదల ఇళ్ల నిర్మాణాలకు ఊతమిచ్చేలా సర్కార్ ఉచిత ఇసుక పంపిణీ నిర్ణయాన్ని కొంతమంది ఇసుకమాఫియా పెద్దలు అడ్డుకుంటున్నట్లు పుకార్లు షికార్లుచేస్తున్నాయి. ఉత్తరాంధ్ర నిర్మాణ రంగంలో కీలక భూమిక పోషిస్తున్న శ్రీకాకుళం ఇసుకమాఫియా కొంతమంది అధికార పార్టీ పెద్దలతో ఉచిత ఇసుక నిబంధనలు విడుదల కాకుండా అడ్డకట్టువేసినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఉచిత ఇసుకకు సంబంధించిన ఉత్తర్వులు జిల్లాకు చేరినట్లయితే ఇసుకాసురుల ఆదాయానికి భారీగా గండిపడుతుందన్న భావనతో వీరంతా సిండికేటుగా ఏర్పడి రాజధాని స్థాయిలో పైరవీలు సాగిస్తున్నట్లు వదంతలు గుప్పుమంటున్నాయి.
ఉత్తర్వులు రాలేదు
ప్రభుత్వం ఉచితంగా ఇసుకను ఇందిరమ్మ ఇళ్లకు సరఫరా చేస్తామని ప్రకటించిన విషయం వాస్తవమే. అయితే ఇప్పటివరకు దీనికి సంబంధించి జిల్లాకు ఉత్తర్వులు చేరలేదని మైన్స్ ఎ.డి గొల్ల స్పష్టం చేశారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వాహనాలను పట్టుకునేందుకు నిఘా పెడుతున్నామని, అయితే స్థానికులు సహకరించడం లేదని పేర్కొనడం విశేషం.
కిడ్నీవ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం
బయోకెమికల్ కిట్లు
పలాస, సెప్టెంబర్ 27: పలాస ప్రభుత్వాసుపత్రిలో కిడ్నీవ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం బయోకెమికల్ కిట్లు కొనుగోలు చేసినట్లు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్‌కృష్ణ వెల్లడించారు. గురువారం పలాస ప్రభుత్వాసుపత్రికి విచ్చేసిన ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు ఎదుట సునీల్‌కృష్ణ బయోకెమికల్స్ వ్యాధి నిర్ధారణ కిట్లు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉద్దాన ప్రాంతంలో కిడ్నీవ్యాధులు ప్రబలుతుండడంతో పలాసలో వ్యాధి నిర్ధారణ కోసం బయోకెమికల్స్‌ను కొనుగోలు చేయాలని, గతంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ తీర్మాణం చేసిన మేరకు ఉన్నతాధికారులు అనుమతులు మంజూరు చేయడంతో ఆసుపత్రి అభివృద్ధి నిధులు నుండి కిట్‌లను కొనుగోలు చేసినట్లు చెప్పారు. కిడ్నీవ్యాధి నిర్ధారణ పరీక్షల పేరుతో కొన్ని ప్రెవేటు ల్యాబరేటరీలు రోగులు నుంచి డబ్బులు భారీగా వసూలు చేస్తున్నారని, దీంతో పేదలు వ్యాధి నిర్ధారణ పరీక్షలకు దూరమవుతున్నారన్నారు. ఇటువంటి వారి కోసం పలాస ప్రభుత్వాసుపత్రిలో వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు బాలకృష్ణ, లక్ష్మిప్రసన్న, ప్రకాశ్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.
బస్ సర్వీసుల నిలిపివేతపై విద్యార్థుల ఆగ్రహం
గార, సెప్టెంబర్ 27: మండలం శ్రీకూర్మం నుండి జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు ఆర్టీసి సంస్థ నిర్వహించిన సర్వీసుల్లో కొన్ని రద్దు చేయడంతో విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం శ్రీకూర్మం ముఖ ద్వారం వద్ద పాఠశాల, కళాశాలలకు చెందిన విద్యార్థులు తమ నిరసనను వ్యక్తం చేస్తూ వాహనాల రాకపోకలను నిలిపి వేశారు. అనునిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే శ్రీకూర్మం రహదారి విద్యార్థుల దిగ్బంధంతో వాహనాలు నిలిచిపోయాయి. కూత వేటు దూరంలో గల జిల్లా కేంద్రానికి విద్య నభ్యసించేందుకు గాను అను నిత్యం పాఠశాల, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్ధులు ఆర్టీసి బస్సులపై ఆధారపడి వెళ్తున్నారు. శ్రీకూర్మ క్షేత్రానికి వచ్చే భక్తుల రాకపోకలు నేపథ్యంలో గతంలో ఆర్‌టిసి శ్రీకాకుళం పాత బస్టాండ్ నుండి రోజు వారీ నాలుగు బస్సులను షటిల్ సర్వీసులుగా నడిపేది. అయితే ఈ రూట్‌లో అధికంగా తిరుగుతున్న ప్రైవేటు వాహనాలు నేపథ్యంలో ఆర్ధిక సమస్యలు దృష్టిలో ఉంచుకొని రెండు బస్సులను సంస్థ రద్దు చేసింది. దీంతో పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్ధులకు ఇక్కట్లు ఆరంభం కావడంతో వారు ఆగ్రహించి తమ నిరసనను ఈ విధంగా వ్యక్తం చేసారు. వాహనాల రాకపోకలు స్థంబించడంతో గార ఎస్సై నారీమణి చొరవచూపి విద్యార్ధులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. సమాచారం తెలుసుకున్న ఆర్‌టిసి శ్రీకాకుళం డి.ఎం. ముకుందరావు రద్దు చేసిన సర్వీసుల విషయమై పరిశీలిస్తానని హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించారు. దీంతో రాకపోకలు యదావిధిగా సాగాయి.
అగ్రికెమ్‌కు అనుమతులిస్తే సహించం
ఎచ్చెర్ల, సెప్టెంబర్ 27: ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుకునే నాగార్జున అగ్రికెమ్‌కు తిరిగి ప్రభుత్వం అనుమతులిస్తే సహించేది లేదని సిటిజన్ ఫోరం ప్రతినిధులు హెచ్చరించారు. గురువారం చిలకపాలెం కూడలిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజాభిప్రాయానికి భిన్నంగా కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు జారీ చేయడం సరికాదన్నారు. తక్షణమే బాధిత గ్రామాల్లో ప్రజాభిప్రాయాన్ని సేకరించి పరిశ్రమను శాశ్వతంగా మూసివేయాలని ఇక్కడ పౌరులంతా కోరుతుండగా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడం సరైన చర్య కాదని వారు విమర్శించారు. పరిసర గ్రామాల ప్రజలు భాగస్వామ్యంతో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పాలకులు, అధికారులు అవినీతికి అలవాటు పడిపోవడం వల్లే ఇలాంటి పరిశ్రమలకు తిరిగి అనుమతులు లభిస్తున్నాయని వారు ఆరోపించారు. ఈ సమావేశంలో సిటిజన్‌ఫోరం అధ్యక్షులు బరాటం కామేశ్వరరావు, స్వామి శ్రీనివాసానంద సరస్వతీ, లోక్‌సత్తా జిల్లా అధ్యక్షులు కొత్తకోట పోలినాయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దవళ గిరిబాబు, గొలివి నర్సునాయుడు, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి సువ్వారి వెంకటసన్యాసిరావు, మాజీ సర్పంచు చిలక రాము, వంశధార విశ్రాంత ఎస్.ఇ జామి లక్ష్మణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ట్రాక్టర్ ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం
శ్రీకాకుళం (టౌన్), సెప్టెంబర్ 27: సైకిల్‌పై కళాశాలకు వెళ్తున్న విద్యార్థిపై ఇసుక లోడ్‌తో ఉన్న ట్రాక్టర్ వెళ్లడంతో విద్యార్థి అక్కడికక్కడే దుర్మరణం పాలైనాడు. దీంతో ఆగ్రహించిన సంబంధిత కళాశాలకు చెందిన విద్యార్థులు సంఘటనా స్థలికి చేరుకొని రోడ్డుకు అడ్డంగా కర్రలు ఉంచి ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని విద్యార్థులతో మాట్లాడి వారిని శాంతింపజేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రూరల్ మండలం కాజీపేటకు చెందిన విద్యార్థి గొలిగి సురేష్ (17) జిల్లా కేంద్రంలోని చైతన్య సహకార జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఎప్పటిలాగే కళాశాలకు స్నేహితులతో కలసి సైకిల్‌పై బయలుదేరాడు. అరసవల్లి దాటాక ఇసుక లోడ్‌తో వస్తున్న ట్రాక్టర్ సురేష్ సైకిల్ వెనుకవైపు ఢీకొంది. దీంతో కింద పడిపోయిన సురేష్ తలపై నుండి ట్రాక్టర్ వెనుక చక్రం వెల్లగా తల నుజ్జు నుజ్జైంది. దీంతో నివ్వెర పోయిన స్నేహితులు కళాశాలలోని విద్యార్థులకు కబురందించగా వారంతా సంఘటనా స్థలికి చేరుకొని ఆగ్రహంతో దగ్గరలోని టింబర్ డిపో వద్ద నున్న కర్రలను రోడ్డుకు అడ్డంగా పెట్టి ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ సిఐ, టూటౌన్ సిఐ వీరకుమార్‌లు చేరుకొని విద్యార్థులతోను, స్థానికులతోను మాట్లాడి సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నచ్చజెప్పి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ట్రాక్టర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అంగవైకల్యంతో బాధపడుతున్న
కుమారుడిని ఆదుకోరూ!
జలుమూరు, సెప్టెంబర్ 27: పుట్టుకతో అంగవైకల్యం కలిగి నేటికీ 14 సంవత్సరాలు పూరె్తైన తన కుమారుడిని ఆదుకోవాలని మండలం పాగోడు పంచాయతీ కొత్తూరు గ్రామానికి చెందిన గుడారి వరలక్ష్మీ, శ్రీరాములు దంపతులు అధికారులను కోరుతున్నారు. తన కుమారుడు రాము కాళ్లు, చేతులున్నా పనిచేయలేని స్థితిలో అవస్థలు పడుతున్నాడని వాపోయారు.. నోటివెంబడి మాట కూడా రావడం లేదన్నారు. ఎందరో వికలాంగులకు ప్రభుత్వం అనేక సంక్షేమ ఫలాలు అందించి తన కుమారునికి కనీసం పింఛను కూడా అందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
నాణ్యత లోపిస్తే చర్యలు
* క్వాలిటీ కంట్రోల్ ఇఇ మధుసూదనరావు
జలుమూరు, సెప్టెంబర్ 27: జిల్లాలో నూతనంగా పలు ప్రాంతాల్లో రోడ్లు, భవనాల శాఖ చేపడుతున్న పనుల్లో నాణ్యత లోపిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని క్వాలిటీ కంట్రోల్ ఇ.ఇ(రాజమండ్రి) జి.మధుసూదనరావు అన్నారు. గురువారం చల్లవానిపేట జంక్షన్ నుండి శ్రీముఖలింగం వరకు జరిగిన రోడ్డు పనుల నాణ్యతను తనిఖీ చేసారు. అంతేకాకుండా కొవిరిపేట, డి.పి.ఎన్.రోడ్లను పరిశీలించారు. పరిశీలించిన రోడ్ల వివరాలను నాణ్యత విలువలతో కూడిన నివేదికను రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులకు అందజేస్తామని స్పష్టం చేశారు. ఆయనతోపాటు ఆ శాఖ డి.ఇ డి.వి.రమణమూర్తి, ఎ.ఇ కిరణ్‌కుమార్, రోడ్లు భవనాల శాఖ డి.ఇ రామినాయుడు, జె.ఇ జగన్మోహనరావు, సిబ్బంది పాల్గొన్నారు.
రూ.143 కోట్లతో 15 మెరైన్ పోలీసుస్టేషన్లు
సంతబొమ్మాళి, సెప్టెంబర్ 27: రాష్ట్రంలో నెల్లూరు నుంచి ఇచ్ఛాపురం వరకు ఉన్న సముద్ర తీర ప్రాంతాల్లో 15 మెరైన్ పోలీసుస్టేషన్‌లు నిర్మించేందుకు 143 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని మెరైన్ డిఎస్పీ(నెల్లూరు) కింజరాపు రామకృష్ణప్రసాద్ అన్నారు. భావనపాడు షిపింగ్‌హార్బర్ వద్ద మెరైన్ పోలీసుస్టేషన్ స్థితిగతులను పరిశీలించేందుకు గురువారం విచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. ఉత్తరాంధ్ర జిల్లాలో మొదటిసారి భావనపాడు షిపింగ్‌హార్బర్ వద్ద మెరైన్ పోలీసుస్టేషన్ ఏర్పాటు చేశామని, ముఖ్యంగా తీర ప్రాంతాల్లో మత్స్యకారుల రక్షణ కోసం మెరైన్ పోలీసులు ఉన్నారని తెలిపారు. కళింగపట్నంలో ఉన్న బోటును సైతం ఇక్కడకు తీసుకువచ్చామని, అక్కడి ఎస్‌ఐ కనకరాజు, భావనపాడు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తారని, స్థానిక పోలీసులు సహకరిస్తారని చెప్పారు.
మరో మూడు బోట్లు 19 మంది సిబ్బంది ఇక్కడ ఉంటారని కళింగపట్నం నుంచి డొంకూరు వరకు సముద్రతీరంలో పెట్రోలింగ్ నిర్వహిస్తారన్నారు. శ్రీలంక, బంగ్లాదేశ్‌ల్లో ఉగ్రవాదులు ప్రవేశించి, దేశానికి ముప్పుతేవడంతో రాష్ట్ర మెరైన్ ఐజి శ్రీనివాసరెడ్డి ఈ చర్యలు చేపట్టారన్నారని పేర్కొన్నారు. ఇటీవల అంతర్వేదిలో జరిగిన బోటు ప్రమాదంలో నలుగురు జాలర్లు గల్లంతు కాగా, వారిని తాము రక్షించామని డిఎస్పీ రామకృష్ణప్రసాద్ వివరించారు.
మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళిన సమయంలో మెరైన్ పోలీసులకు వారి పేర్లు, ఎంత మంది వేటకు వెళ్తారో తెలియజేస్తే రిజిస్ట్రర్‌లో నమోదు చేస్తామని తెలిపారు. వారి సెల్‌నెంబర్లు ఇవ్వొచ్చన్నారు. లేనిపక్షంలో తామే వైర్‌లెస్‌సెట్‌లు ఇస్తామని ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తెలియజేయాలని మత్స్యకారులకు సూచనలు చేశారు. మెరైన్ పోలీసులకు ఛానల్ 3 ద్వారా సమాచారం తెలియజేస్తే మా కోస్టుగార్డులకు ఛానల్ 12 ద్వారా అప్రమత్తం చేస్తామన్నారు. అంతకుముందు రామకృష్ణప్రసాద్ మెరైన్ బోటు ఇంజన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టెంట్లు వేయాలని బోటు మేనేజర్‌కు ఆదేశించారు. అనంతరం సిబ్బందికి సూచనలు ఇచ్చారు.
స్థానికులను హోంగార్డులగా నియమించి ఉపాధి కల్పించాలని మత్స్యకార సంఘం నాయకులు పోతయ్య, చిన్నయ్య, చిన్నబాబు, రాజేష్‌లు కోరారు. వీరితోపాటు నౌపడ ఎస్‌ఐ దుర్గాప్రసాద్, సిబ్బంది, మత్స్యకారులు పాల్గొన్నారు.
ఆక్రమణల తొలగింపును అడ్డుకున్న వ్యాపారులు
ఆమదాలవలస, సెప్టెంబర్ 27: పట్టణంలోని ప్రధాన మురుగుకాలువపై ఉన్న నిర్మాణాలను గురువారం స్థానిక మున్సిపల్ అధికారులు తొలగింపు చర్యలు చేపట్టారు. ఇక్కడ రైల్వే స్టేషన్ ఎదురుగా పలు బంగారం దుకాణాలు, వస్త్ర దుకాణాలు, ఇతర వ్యాపార సముదాయాల ముందు ఉన్న ప్రధాన డ్రైనేజీలపై పలకలు వేసి కాలువపై పూర్తిగా కప్పివేయడంతో మురుగునీరు, కాలువ వల్ల చెత్తాచెదారాలను తీసేందుకు అవకాశం లేదనే ఉద్దేశ్యంతో ఈ ఆక్రమణలను తొలగిస్తున్నట్లు మున్సిపల్ అధికారులు తెలియజేసారు. పట్టణంలో అనేక చోట్ల ఆక్రమణలు ఉన్నాయని, మున్సిపల్, బస్ట్ఫా స్థలాలను కొందరు ఆక్రమించి పక్కాదుకాణాలు నిర్మిస్తున్నా వాటిని పట్టించుకోకుండా వైన్‌షాపులు ముందున్న ఫుట్‌పాత్‌లను తొలగించడం అన్యాయమని పలు వ్యాపారులు మున్సిపల్ అధికారులతో ఘర్షణ పడ్డారు. ఫుట్‌పాత్ ఆక్రమణల వలన కాలువలు తీయలేక శానిటరీ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని, ఈ ఆక్రమణలను విడిచి పెట్టే ప్రసక్తే లేదని టి.పి.ఒ సంజీవ్‌కుమార్ స్పష్టం చేశారు. ఈ ఆక్రమణల తొలగింపులో మున్సిపల్ అధికారులు సీతారాం, గోవింద్, పోలారావు తదితరులు పాల్గొన్నారు.