Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

మురికివాడల్లో మంచినీటి ఎద్దడి

$
0
0

అనకాపల్లి, సెప్టెంబర్ 27: వర్షాకాలంలో తాగునీటి వెతలు తప్పడం లేదు. గొట్టపుబోర్లు పనిచేయడం లేదు. కుళాయిల ద్వారా నీరు రావడంలేదు. ట్యాంకర్లు విధిగా రావడం లేదు. అసంపూర్తిగా నిలిచిపోయిన పక్కాగృహాలకు బిల్లులు అందడం లేదు. ధ్వంసమైన డ్రైనేజీ కాలువలను పునరుద్ధరించడంలో అధికారులు తాత్సార వైఖరి అనుసరిస్తున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం తెల్లవారు స్థానిక విజయరామరాజుపేటలో నిర్వహించిన పాదయాత్రలో అడుగడుగునా వివిధ ప్రాంతాల ప్రజలు, మహిళలు, వృద్ధులు సమస్యలను ఏకరవు పెట్టారు. వర్షాకాలంలో సైతం తీవ్రంగా ఉన్న మంచినీటి ఎద్దడిని ప్రత్యక్షంగా చూసి మంత్రి చలించిపోయారు. మీ ప్రాంతంలో మంచినీటి ఇంత తీవ్రంగా ఉందా? అని ఒకింత మంత్రి ఆశ్చర్యానికి గురయ్యారు. మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉంటే ప్రత్యామ్నాయ చర్యలు ఏం తీసుకుంటున్నారని అక్కడే ఉన్న మున్సిపల్ అధికారులపై మంత్రి నిప్పులు చెరిగారు. అవసరమైన ప్రజలకు నీరందడం లేదు. అవసరం లేనిచోట కుళాయిలవద్ద నీరు వృథాగా పోతుందని మంత్రివద్ద మహిళలు వాపోయారు. మున్సిపల్ ఇన్‌చార్జి కమీషనర్ నాగేశ్వరరావును, ఇతర అధికారులను ఈ విషయమై మంత్రి నిలదీశారు. సత్వరమే ఈ ప్రాంతానికి తాగునీరు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని అంతవరకు ట్యాంకర్ల ద్వారా సమగ్రంగా నీరందేలా చూడాలని వాటర్ వర్క్స్ విభాగం అధికారులను మంత్రి ఆదేశించారు.
డ్రైనేజీకాలువలు ధ్వంసం కావడం వలన రోడ్లపై మురికినీరు ప్రవహిస్తుందని, దోమలు స్వైరవిహారం చేస్తున్నాయని, దుర్గంధం వెదజల్లుతుందని, శ్రీరాంనగర్ కాలనీ, బర్మాకాలనీ, అంజయ్య కాలనీ ఇతర ప్రాంతాల మహిళలు మంత్రికి ఏకరవుపెట్టగా సంబంధిత కాలువలను ప్రత్యక్షంగా చూసి పునరుద్ధరించేందుకు అవసరమైన నిధులు సమకూరుస్తానని మంత్రి భరోసా ఇచ్చారు. పక్కాగృహాలు నిర్మించుకుని ఏళ్లు గడుస్తున్నా బిల్లులు అందడం లేదని దీంతో ఆర్థిక స్థోమత లేక చాలామంది అసంపూర్తిగానే ఇళ్ల నిర్మాణం నిలిపివేశారని విజయరామరాజుపేట, బర్మాకాలనీ, శ్రీరాంనగర్ కాలనీ, గాంధీనగరం, అంజయ్య కాలనీ ప్రాంతాల ప్రజలు మంత్రి గంటాకు ఏకరవు పెట్టారు. ఈ విషయమై హౌసింగ్ జిల్లా మేనేజర్ పిజివి ప్రసాద్‌ను నిలదీశారు. వెంటనే అసంపూర్తి గృహాల నిర్మాణాలను పూర్తిచేయాలని ఆదేశించారు. వీధిలైట్లు సక్రమంగా వెలగడం లేదని, మినీవాటర్ ట్యాంకులు సక్రమంగా పనిచేయడం లేదని వచ్చిన ఫిర్యాదులపై మంత్రి గంటా మున్సిపల్ అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల ప్రజలతో మంత్రి గంటా మాట్లాడుతూ మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఫోన్‌ద్వారా తెలిపినా సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. పారిశుద్ధ్యం మెరుగుకు మున్సిపల్ అధికారులు సహకరించాలన్నారు. బహిరంగ మరుగుదొడ్లు, రోడ్లపై చెత్తవేయడం వంటి వాటికి స్వస్తిపలకాలన్నారు. ఏ మాత్రం వర్షం కురిసినా తమ ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని శారదాగట్టు పక్కనున్న కాలనీవాసులు ఏకరవు పెట్టగా వెంటనే నీరుపోయేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పర్యటనలో మంత్రి గంటా వెంట కాంగ్రెస్ నాయకులు కొణతాల రఘునాథ్, మంత్రి గంటా సోదరుడు భాస్కరరావు, ఒమ్మి వెంకటియాదవ్, యలమంచిలి లక్ష్మణరావు, మాజీ కౌన్సిలర్స్ తాడి రామకృష్ణ, బిఎస్‌ఎంకె జోగినాయుడు, పలకా సత్యనారాయణ, పబ్లిక్ హెల్త్ డిఇ శ్రీనివాస్, మున్సిపల్ కమీషనర్ నాగేశ్వరరావు, మున్సిపల్ ఎఇ శేఖర్, వెంకటేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ సకలా గోవింద్, ఎండపల్లి భారతి, పూడి కుమారి పాల్గొన్నారు.
టిడిపి రెండు ముక్కలు?
ఇక అర్బన్.. రూరల్ వే ర్వేరు
అర్బన్ అధ్యక్ష పదవి కోసం పోటాపోటీ
బరిలో అయ్యన్న, వాసుపల్లి
బాబుకు అసమ్మతివాదుల ఫ్యాక్స్‌లు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, సెప్టెంబర్ 27: ఇప్పటి కే తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల మధ్య నలిగిపోతున్న తెలుగుదేశం పార్టీకి అంతర్గత సమస్యలు కూడా అధికమయ్యాయి. గతంలో విశాఖ అర్బన్, రూరల్ జిల్లాలుగా రెండు కమిటీలు పార్టీని నడిపించాయి. రెండేళ్ళ కిందట ఈ రెండు విభాగాలను ఒక్కటిగా చేసి, జిల్లా కమిటీగా ఏర్పాటు చేశారు. దీనికి అయ్యన్నపాత్రుడిని అధ్యక్షునిగా, కోన తాతారావును ప్రధాన కార్యదర్శిగా నిమించారు. జివిఎంసి పరిధిలోని 72 వార్డులకు పీలా శ్రీనివాసరావును అధ్యక్షునిగా నియమించిన సంగతి తెలిసిందే. అయితే రెండు రోజుల కిందట హైదరాబాద్‌లో బాబు సమక్షంలో జరిగిన పార్టీ సమావేశంలో జిల్లా కమిటీని మళ్లీ రెండు ముక్కలు చేశారు. ఇకపై విశాఖ అర్బ న్, రూరల్ జిల్లాలుగా వ్యవహరించనున్నారు. రూరల్ జిల్లా అధ్యక్ష పదవి చేపట్టడానికి ఇప్పుడున్న సీనియర్ నాయకుల్లో ఎవరూ ముందుకు రా వడం లేదు. ఈ బాధ్యతలు అప్పగించాడానికి అయ్యన్నపాత్రుడు సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. అలాగే బం డారు సత్యనారాయణ మూర్తి కూడా రూరల్ జిల్లా అధ్యక్ష పదవి చేపట్టడానికి ఇష్టపడడం లేదని పార్టీ వర్గాలు తెలియచేస్తున్నాయి. అయ్యన్నపాత్రు డు అర్బన్ జిల్లా అధ్యక్ష పదవి కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం పార్టీలోని కొంతమంది సీనియర్ల మద్దతును అయ్యన్న కూడగట్టినట్టు భోగ ట్టా. రూరల్ జిల్లా అధ్యక్ష పదవిని దాడి వీరభద్రరావు కుమారుడు దాడి కరుణాకర్‌కు కట్టబెట్టాలన్న ఆలోచన కూడా సాగుతున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా అర్బన్ జిల్లా అధ్య క్ష, ప్రధాన కార్యదర్శుల పదవులను కేవలం అర్బన్ నాయకులకే కేటాయించాలని పార్టీ వార్డు అధ్యక్షులు డిమాం డ్ చేస్తూ చంద్రబాబుకు గురువారం ఫ్యాక్స్‌లు పంపించారు. అయ్యన్నపై అసంతృప్తి ఉన్న వారు స్థానిక పరిస్థితులను, కుల సమీకరణలను ఫ్యాక్స్‌లలో వివరించినట్టు తెలుస్తోంది.
అర్బన్ జిల్లా అధ్యక్ష పదవిని బిసిలకు కేటాయించే అవకాశాలు ఎక్కువ గా కనిపిస్తున్నాయి. స్థానిక నాయకులకే ఈ పదవీ బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారు. పార్టీ దక్షిణ నియోజకవర్గ ఇన్‌చార్జి వాసుపల్లి గణేష్ కుమార్ కోరుకుంటున్నట్టు భోగట్టా. ప్రస్తుతం జిల్లా యాదవ సంక్షేమ సంఘ బాధ్యతలను పార్టీ ఉత్తర నియోజకవర్గ ఇన్‌చార్జ్ భరణికాన రామారావు వహిస్తున్నారు. వాసుపల్లికి కాకుంటే, పార్టీ అధ్యక్ష బాధ్యతలు భరణికానకు అప్పగించాలన్న డిమాండ్ కూడా పార్టీ వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది. ప్రధాన కార్యదర్శి బాధ్యతలను కాపు సామాజిక వర్గానికి అప్పగించాలన్న ప్రతిపాదన పార్టీ అధిష్ఠానానికి చేరినట్టు విశ్వసనీయ సమాచారం.
ఇదిలా ఉండగా పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా గణబాబును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా మణికుమారి పేరును ఖరారు చేసినట్టు తెలిసింది. విశాఖ ఉత్తర, యలమంచిలి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల విషయంలో పార్టీ స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోలేదని తెలిసింది. కాగా గాజువాక నియోజకవర్గ ఇన్‌చార్జ్ విషయంలో చాలా కాలంగా మల్లగుల్లాలు కొనసాగుతున్నాయి. ఈ పదవి కోసం కోన తాతారావు, హర్షకుమార్ పోటీ పడుతున్నారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దీనిపై ఇంత వరకూ స్పష్టత ఇవ్వకపోవడం వలన అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. చంద్రబాబుకు అత్యంత సన్నిహితునిగా వ్యవహరిస్తున్న తాతారావును ఈ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా నియమించని పక్షంలో గుడివాడ నాగమణి పేరును కొంతమంది ప్రతిపాదిస్తున్నారు. రెండు రోజుల్లో జిల్లా పార్టీలోని ఈ అస్పష్టతను చంద్రబాబు నాయుడు పరిష్కరించే అవకాశాలు ఉన్నాయి.

బ్రాండిక్స్ వ్యర్థాలతో మత్స్యసంపదకు నష్టం
* చనిపోతున్న చేపలు * మత్స్యకారుల ఆందోళన
అచ్యుతాపురం, సెప్టెంబర్ 27: బ్రాండిక్స్ నుండి వెలువడే వ్యర్థపదార్థాల వలన మత్స్యసంపద నాశనమై చేపల వేట సాగక జీవనం అగమ్యగోచరంగా మారిందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. గత నాలుగు రోజుల నుండి పూడిమడక సముద్రం తీరానికి వ్యర్థపదార్థాలవల్ల చనిపోయిన వేలాది చేపపిల్లలు చేరాయి. టన్నుల కొద్దీ చేపలు సంపద చనిపోయి తీరం చేరింది. చనిపోయిన చేపలను చూసిన మత్స్యకారులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాగైతే రానున్న రోజుల్లో మత్స్యకారులు జీవనం కనుమరుగు కానున్నదని. ఇంత పెద్ద మొత్తంలో చేపలు చనిపోలేదన్నారు. బ్రాండిక్స్ నుండి సముద్రం లోపలకు వేసిన వ్యర్థపదార్థాల పైపులైన్ వలన సముద్ర జలాలు కలుషితమై ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఎటువంటి ప్యాకేజీలు వద్దు, నష్టపరిహారాలు వద్దు సముద్రంలోకి వేసిన పైపులైన్‌ను తక్షణమే తొలగించాలని మత్స్యకారులు డిమాండు చేస్తున్నారు. పైపులైన్ వలన వందలాది మత్స్యకారుల కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదంఉంది. పైపులైను వలన ఎటువంటి ముప్పుఉండదని, డీటీపీ ట్రీట్‌మెంట్ ప్లాంటు ద్వారా శుద్ధి చేసిన వ్యర్థపదార్థాలను మాత్రమే సముద్రంలో కలుపుతామని అధికారులు, ప్రజాప్రతినిధులు నమ్మించి మత్స్యకారులను మోసగించారన్నారు. నేడు టన్నుల కొద్ది వ్యర్థపదార్థాలను సముద్రంలో కలిపి మత్స్యసంపదను నాశనం చేస్తున్నారన్నారు. కొంతమంది నాయకులు బ్రాండిక్స్ ఇస్తున్న ప్యాకేజిలకు అలవాటు పడి మోకాలడ్డుతున్నారన్నారు. నేడు బ్రాండిక్స్ పైపులైను వలన జరుగుతున్న నష్టం తీరక ముందే సెజ్ పైపులైను వేయడానికి మత్స్యకారులతో ఎటువంటి సంప్రదింపులు జరపకుండా మత్స్యకార గ్రామాన్నిఖాళీ చేయడానికి కుట్రలు చేస్తున్నారని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణం కాలుష్య నియంత్రణమండలి అధికారులు జాడ కానరావటం లేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.

అన్‌రాక్ నిర్వాసితుల సమస్యలపై
అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి
* మాజీ మంత్రి అయ్యన్న డిమాండ్
నర్సీపట్నం, సెప్టెంబర్ 27: అన్‌రాక్ నిర్వాసితులు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తక్షణమే అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి, టిడిపి జిల్లా అధ్యక్షుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. గురువారం తెలుగుదేశం, సి.పి.ఐ., సి.పి.ఎం, బి.జె.పి, లోక్‌సత్తా పార్టీల ఆధ్వర్యంలో నిర్వాసితులు,రైతులు, ఆయా పార్టీల నాయకులు ఊరేగింపుగా సబ్‌కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆర్డీవో అందుబాటులో లేకపోవడంతో నర్సీపట్నం తహశీల్దార్ సుధాకర్‌కు పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా తహశీల్దార్ దృష్టికి అయ్యన్నపాత్రుడు పలు సమస్యలను తీసుకువచ్చారు. ఫ్యాక్టరీ నిర్మాణానికి భూసేకరణ సమయంలో రైతులు, ప్రజలు, అన్ని పార్టీలు వ్యతిరేకించినా ప్రభుత్వం మొండి వైఖరితో భూసేకరణ చేపట్టిందని విమర్శించారు. భూసేకరణకు వ్యతిరేకంగా 56 రోజులపాటు ఉద్యమం జరిగిందని గుర్తు చేశారు. అప్పటి జిల్లామంత్రి కొణతాల రామకృష్ణ, జిల్లా కలెక్టర్ అన్‌రాక్ ప్రాంత నాయకులు, రైతులతో కమిటీ ఏర్పాటు చేశారన్నారు. ఈ కమిటీ సమావేశంలో పలు తీర్మానాలు చేశారన్నారు. ఈ తీర్మానాలకు విరుద్దంగా ఫ్యాక్టరీలో పనులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఫ్యాక్టరీలో వాటర్ స్టోరేజ్ ట్యాంక్ భూగర్భజలాల స్థాయి కంటే ఎక్కువ లోతుకు తవ్వడం వలన పరిసర గ్రామాల్లో మంచినీటి బోర్లు, బావులు నీరులేక ఇంకి పోతున్నాయన్నారు.
భూమిని కోల్పోయిన నిర్వాసితులకు రెండు సెంట్లు భూమి, రెండు పాడిగేదెలు ఇస్తామని ఇచ్చిన హామీ నేటికీ అమలుకు నోచుకోలేదన్నారు. భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఆర్.కార్డులు, ఇంటికో ఉద్యోగం హామీలు అమలు కాలేదన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులకు ఐడెంటిటీ కార్డులు, పి.ఎఫ్, ఇ.ఎస్.ఐ.లను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టం ప్రకారం కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని, వెంకయ్యపాలెంలో భూములు, ఇళ్ళు కోల్పోయిన 30మందికి రెండు సెంట్లు స్థలం, ఇంటి స్థలం తక్షణమే మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వ భూమిని సాగు చేస్తున్న వారికి 30 శాతంగా ఇవ్వాల్సిన నష్టపరిహారం నేటివరకు ఇవ్వలేదన్నారు. పై సమస్యలకు సంబంధించి మాకవరపాలెం తహశీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చినప్పటికీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యధోరణితో ఒప్పందాలను అమలు చేయకుండా రైతులకు, కార్మికులకు అన్యాయం చేస్తున్నారని అయ్యన్న ఆందోళన వ్యక్తం చేశారు.
కాలుష్యం కారణంగా పరిసర గ్రామాల్లో నీరు కూడా కలుషితమయ్యే ప్రమాదం ఉందని, బొగ్గుతో నిర్మాణం చేస్తున్న పవర్ ప్లాంట్ ప్రాజెక్టు వలన పంటలకు , పశువులకు , ప్రజలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. పై సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అయ్యన్న విజ్ఞప్తి చేశారు. వీటిపై చర్చించేందుకు తక్షణమే అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటుచేయాలని కోరారు. ఈకార్యక్రమంలో సి.పి.ఎం. జిల్లా కమిటీ సభ్యుడు బి.సత్తిబాబు, సి.పి. ఐ. నాయకులు బాలేపల్లి వెంకటరమణ, గురుబాబు, తాతబ్బాయి, రుత్తల బుజ్జి, బి.జె.పి. యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.గంగబాబు, దేశం నాయకులు చింతకాయల సన్యాసిపాత్రుడు, మాకిరెడ్డి అప్పారావు, అయ్యన్నయువసేన నాయకుడు చింతకాయల విజయ్‌బాబు పాల్గొన్నారు.

విద్యారంగం మెరుగుకు
మరిన్ని చట్టాలు అవసరం
* ఎమ్మెల్సీ శర్మ
మాకవరపాలెం, సెప్టెంబర్ 27: విద్యారంగం మెరుగుకు ప్రభుత్వం మరిన్ని చట్టాలు చేయాల్సి ఉందని ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ అన్నారు. గురువారం మాకవరపాలెం జెడ్పీ హైస్కూల్‌ను ఆయన సందర్శించారు. ఈసందర్భంగా ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థల్లో అందిస్తున్న విద్యను ప్రభుత్వ రంగంలో అందించేందుకు ప్రభుత్వ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని కోరారు. గడిచిన ఏడాది కార్పొరేట్ కళాశాలలకంటే ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో మంచి ప్రతిభను కనపరిచారన్నారు. విద్యా రంగంలో మార్పుల కోసం మేధావులతో ఒక కమిటీ వేసి ప్రాంతాల వారీగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. గురజాడ పేరుతో విజయనగరంలో జాతీయ స్థాయి సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని ఎమ్మెల్సీ ప్రభుత్వాన్ని కోరారు.
బాక్సైట్ద్ద్రు అభినందనీయం
ఏజెన్సీలో బాక్సైట్ వెలికితీతను రద్దు చేయడం పట్ల కేంద్ర గిరిజన సంక్ష్మే శాఖామంత్రి కిశోర్ చంద్రదేవ్‌ను ఎమ్మెల్సీ శర్మ అభినందించారు. బాక్సైట్‌పై 14 ఏళ్ళుగా తాము పోరాటం చేశామన్నారు. మాకవరపాలెం మండలం రాచపల్లిలో ఏర్పాటు చేస్తున్న అన్‌రాక్ రిఫైనరీకి పర్యావరణ అనుమతుల కోసం ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో సి.పి.ఎం. తరుపు.న చేసిన అభియోగాలు అన్ని వాస్తవమయ్యాయన్నారు. బాక్సైట్ మైనింగ్‌పై అనేక పోరాటాలు చేస్తామన్నారు. రాష్టవ్య్రాప్తంగా 250 ఎం.ఇ.ఓ. పోస్టులు ఖాళీగా ఉంటే వాటిని ఇన్‌చార్జిలతో కాలయాపన చేస్తున్నారన్నారు. స్కూల్ అసిస్టెంట్లకు జూనియర్ లెక్చరర్లుగా ప్రమోషన్ ఇవ్వాలని, పి.ఇ.టి., భాషా పండిట్‌ల పోస్టులు అప్‌గ్రేడ్ చేయాలని అంతర్ జిల్లా బదిలీలు, స్పౌజ్ కేసులు వెంటనే పరిష్కరించాలని, ఉద్యోగులకు హెల్త్‌కార్డులు మంజూరు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రిని కోరామన్నారు. ఈసమావేశంలో యు.టి.ఎఫ్.జిల్లా ఫ్రధాన కార్యదర్శి డి.నాగేశ్వరరావు, కార్యదర్శులు గడ్డినాయుడు, ప్రకాష్‌ఱావు, స్థానిక హైస్కూల్ హెచ్. ఎం. నారాయణరావు, పలు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

క్రీడల్లో బాలికలు రాణించాలి
* శ్రీకృష్ణదేవరాయ వర్శిటీ ప్రొఫెసర్ ముర్రు ముత్యాలనాయుడు
సబ్బవరం, సెప్టెంబర్ 27: భారత దేశంలో క్రీడల పట్ల బాలుర కంటే బాలికలదే పైచేయిగా రాణించాలని అనంతపూర్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ ఆచార్యులు ముర్రు ముత్యాలనాయుడు స్పష్టం చేశారు. సబ్బవరంలో నిర్వహించిన జిల్లాస్ధాయి జూనియర్ కళాశాలల బాలికల గేమ్స్ మీట్ ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. మనదేశంలో క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం లభించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చైనాలో ఒక మహానగరానికి ప్రముఖ క్రీడాకారిణి పిటి ఉష పేరును పెట్టారని తెలిపారు. మేరీ కోమ్‌ను అందరూ ఆటల్లోకి రానివ్వకుండా అడ్డుపడ్డారన్నారు. వారంతా వాటికి కుంగిపోకుండా ప్రపంచ స్ధాయి క్రీడాకారులుగా తమ నైపుణ్యాన్ని రుజువు చేసుకున్నారన్నారు. గ్రామీణ స్థాయిలో ప్రతిభగల బాలికలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు.
అంతకుముందు జిల్లావృత్తివిద్యాకోర్సుల ఎడ్యుకేషన్ అధికారి (డివిఇవో)జిఎస్‌కెవి ప్రసాద్ మాట్లాడు తూ క్రీడాకారులకు ప్రోత్సాహం లేని సంగతిని గ్రహించిన జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు క్రీడలకు తగిన బడ్జెట్‌ను మంజూరు చేయాలని ఆదేశించానన్నారు. స్పోర్ట్స్‌కోసం వెళ్లే క్రీడాకారుల కి ప్రయాణఖర్చులు మంచిభోజనాలకు సౌకర్యాలను కలుగజేస్తున్నామన్నారు. జిల్లాస్ధాయిలో పలురకాల క్రీడల్లోపాల్గొని బహుమతులు పొందిన బాలికలను ఆయన అభినంధించారు. ఈక్రీడలకు ప్రోత్సాహం అందించిన స్థానిక పిడి జి.రాంబాబును,ప్రిన్సిపాల్ బంగారుపాపను అతిథులు అభినందించారు. అనంతరం విజేతలకు బహుమతి ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్యాపకులు ఉపేంద్ర,ఎంపిడిఒ సిహెచ్.వెంకటలక్ష్మి,డిప్యూటీ డిఇఒ సత్యనారాయణ, ప్రభాకర్ వెంకట్రావు పాల్గొన్నారు.
ఐదు జిల్లాల్లో రూ.143 కోట్లతో
15 మెరైన్ పోలీసుస్టేషన్లు
సంతబొమ్మాళి(శ్రీకాకుళం జిల్లా), సెప్టెంబర్ 27: రాష్ట్రంలో నెల్లూరు నుంచి ఇచ్ఛాపురం వరకు ఉన్న సముద్ర తీర ప్రాంతాల్లో 15 మెరైన్ పోలీసుస్టేషన్‌లు నిర్మించేందుకు 143 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని మెరైన్ డిఎస్పీ(నెల్లూరు) కింజరాపు రామకృష్ణప్రసాద్ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు షిపింగ్‌హార్బర్ వద్ద మెరైన్ పోలీసుస్టేషన్ స్థితిగతులను పరిశీలించేందుకు గురువారం విచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. ఉత్తరాంధ్ర జిల్లాలో మొదటిసారి భావనపాడు షిపింగ్‌హార్బర్ వద్ద మెరైన్ పోలీసుస్టేషన్ ఏర్పాటు చేశామని, ముఖ్యంగా తీర ప్రాంతాల్లో మత్స్యకారుల రక్షణ కోసం మెరైన్ పోలీసులు ఉన్నారని తెలిపారు. కళింగపట్నంలో ఉన్న బోటును సైతం ఇక్కడకు తీసుకువచ్చామని, అక్కడి ఎస్‌ఐ కనకరాజు, భావనపాడు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తారని, స్థానిక పోలీసులు సహకరిస్తారని చెప్పారు. మరో మూడు బోట్లు 19 మంది సిబ్బంది ఇక్కడ ఉంటారని కళింగపట్నం నుంచి డొంకూరు వరకు సముద్రతీరంలో పెట్రోలింగ్ నిర్వహిస్తారన్నారు. శ్రీలంక, బంగ్లాదేశ్‌ల్లో ఉగ్రవాదులు ప్రవేశించి, దేశానికి ముప్పుతేవడంతో రాష్ట్ర మెరైన్ ఐజి శ్రీనివాసరెడ్డి ఈ చర్యలు చేపట్టారన్నారని పేర్కొన్నారు. ఇటీవల అంతర్వేదిలో జరిగిన బోటు ప్రమాదంలో నలుగురు జాలర్లు గల్లంతు కాగా, వారిని తాము రక్షించామని డిఎస్పీ రామకృష్ణప్రసాద్ వివరించారు.
మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళిన సమయంలో మెరైన్ పోలీసులకు వారి పేర్లు, ఎంత మంది వేటకు వెళ్తారో తెలియజేస్తే రిజిస్ట్రర్‌లో నమోదు చేస్తామని తెలిపారు. వారి సెల్‌నెంబర్లు ఇవ్వొచ్చన్నారు. లేనిపక్షంలో తామే వైర్‌లెస్‌సెట్‌లు ఇస్తామని ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తెలియజేయాలని మత్స్యకారులకు సూచనలు చేశారు. మెరైన్ పోలీసులకు ఛానల్ 3 ద్వారా సమాచారం తెలియజేస్తే మా కోస్టుగార్డులకు ఛానల్ 12 ద్వారా అప్రమత్తం చేస్తామన్నారు. అంతకుముందు రామకృష్ణప్రసాద్ మెరైన్ బోటు ఇంజన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టెంట్లు వేయాలని బోటు మేనేజర్‌కు ఆదేశించారు. అనంతరం సిబ్బందికి సూచనలు ఇచ్చారు. స్థానికులను హోంగార్డులగా నియమించి ఉపాధి కల్పించాలని మత్స్యకార సంఘం నాయకులు పోతయ్య, చిన్నయ్య, చిన్నబాబు, రాజేష్‌లు కోరారు. వీరితోపాటు నౌపడ ఎస్‌ఐ దుర్గాప్రసాద్, సిబ్బంది, మత్స్యకారులు పాల్గొన్నారు.

బాక్సైట్ ఒప్పందాలు రద్దు చేసే
అధికారం కిశోర్‌కు ఎక్కడిది?
* గిరిజన సంఘం ఆక్షేపణ
పాడేరు, సెప్టెంబర్ 27: విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసే అధికారం కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రికి లేదని గిరిజన సంఘం స్పష్టం చేసింది. గిరిజన సంఘం ప్రతినిధులు పి.అప్పలనర్స, పాలికి లక్కు గురువారం విలేఖరులతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ గిరిజనులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తూ మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. బాక్సైట్ తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం విదేశీ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను రాష్ట్ర పరిధిలో మాత్రమే రద్దు చేయాల్సి ఉందని, కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖకు దీనిని రద్దు చేసే అధికారం రాజ్యాంగంలో కల్పించలేదని వారన్నారు. రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ మూడో అధికరణ కింద కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ నోడల్ ఏజెన్సీ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం ఉందే తప్ప ఒప్పందాలను రద్దు చేయమని ఆదేశించే హక్కు లేదని వారు చెప్పారు. రాష్ట్ర శాసనసభ, గిరిజన సలహా మండలి తీర్మానం, గవర్నర్ మాత్రమే బాక్సైట్ తవ్వకాల ఒప్పందాలను రద్దు చేయగలరని, కేంద్రమంత్రి ఇందుకు ప్రయత్నించకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా అసత్య ప్రకటనలు చేస్తున్నారని వారు ఆక్షేపించారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాల ఒప్పందాలను తన విశేష అధికారాలను వినియోగించి రద్దు చేయాలని గవర్నర్‌కు లేఖ రాసిన కిశోర్ పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా దీనిని ఇంతవరకు ఎందుకు రద్దు చేయించలేదని వారు ప్రశ్నించారు.
మన్యంలో బాక్సైట్ తవ్వకాల ఒప్పందాలను తన విశేష అధికారాలను వినియోగించి రద్దు చేస్తున్నట్టు కిశోర్ ప్రకటన రాజకీయ డ్రామాగా వారు వ్యాఖ్యానించారు. 2014లో జరగనున్న సాధారణ ఎన్నికలు, త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తన రాజకీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకే ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని వారు ఆరోపించారు. ఏజెన్సీలో బాక్సైట్ ప్రభావిత ప్రాంతంలోని ఆరు బ్లాక్‌ల పరిధిలో 13 వేల మంది గిరిజనులకు అటవీ హక్కుల చట్టం ప్రకారం అటవీ భూములను పంపిణీ చేయాల్సి ఉన్నా ఇంతవరకు దీనిని పట్టించుకోలేదని వారు చెప్పారు. అటవీ హక్కుల చట్టం పార్లమెంటరీ కమిటీలో కీలక సభ్యునిగా ఉన్న కిశోర్ తన నియోజకవర్గంలోనే ఈ చట్టం అమలుకాకుండా ఉన్నా పట్టించుకోలేదని వారు తప్పుపట్టారు. గిరిజనులకు ప్రయోజనం చేకూర్చే అంశాలలో దృష్టి సారించలేని కిశోర్ తనకు లేని అధికారాలను సంక్రమించుకుని ఆదివాసులను మరోసారి మోసం చేయాలని చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని అప్పలనర్స, లక్కు పేర్కొన్నారు.

యలమంచిలి ఎమ్మెల్యే సవాల్‌కు సిద్ధమే: బొడ్డేడ
యలమంచిలి, సెప్టెంబర్ 27: ఎమ్మెల్యే సూర్య నారాయణ రాజు (కన్నబాబు) సవాల్‌ను స్వీకరిస్తున్నానని, బహిరంగ వేదికకు సిద్ధమేనని, దీనికి తేదీని కన్నబాబే ప్రకటించాలని కశింకోట ఆర్‌ఇసిఎస్ ఛైర్మన్ బొడ్డేడ ప్రసాదు ప్రతి సవాల్ చేశారు. గురువారం ఆయన స్థానిక వైఎస్సార్ సిపి కార్యాలయంలో స్థానిక నాయకుడు బోదెపుగోవింద్‌తో కలసి విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. కన్నబాబు రాజు గతంలో చేసిన ఏ సవాల్‌ను, మాటను నిలబెట్టుకొలేదని, ఈసారి కూ డానమ్మకం లేదని, అయినా సవాల్‌ను గౌరవిస్తున్నానని, కన్నబాబు వ్యవహారాన్ని రికార్డులతో నిరూపిస్తానని చెప్పారు. ఆరోపణలు నిరూపించలేకపోతే తాను ఆర్‌ఇసిఎస్ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకొంటానని ప్రసాదు ప్రకటించారు. కన్నబాబుపై వచ్చిన ఆరోపణలు నిజమని ధ్రువీకరించిన తరువాతనే ఎసిబి కోర్టు కేసులు నమోదు చేసిందని ప్రసాదు పేర్కొన్నారు. నియోజకవర్గం ప్రజలు ఇటువంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు బాధపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల బాధిత రైతులకు కన్నబాబు గొప్పతనం తెలుసునని ఎద్దేవా చేశారు. 2004లో కన్నబాబు ఎన్నికల రిటర్నింగ్ అఫిడవిట్‌లో ఎంత ఆస్థి చూపారో ఎవరికి తెలియనిది కాదన్నరు. సబ్బవరం మండలంలో తన పూర్వీకులకు ఉన్నది కూడా తెలుసునన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడతారనే ముందుగా కన్నబాబు ఎమ్మెల్యే పదవిని స్పీకర్ రద్దు చేయాలని కోరామని ప్రసాదు అన్నారు.ఈ కార్యక్రమంలో రాంబిల్లికి చెందిన చంటిరాజు, మునగపాక మండలానికి చెందిన మళ్ల బుల్లిబాబు, ఆడారి గణపతి, ఆదియ్యనాయుడు, యలమంచిలికి చెందిన గొర్లె నర్సింహమూర్తి, వియ్యపుగోపి, యల్లపు మహేశ్ పాల్గొన్నారు.

దూసుకువచ్చిన లారీ.. తప్పిన ప్రాణాపాయం
సబ్బవరం, సెప్టెంబర్ 27: సబ్బవరం-పెందుర్తి రోడ్డుపై గోపాలనగర్ సమీపంలో గురువారం సుమారు 25 టన్నుల ఇనుప తీగల బరువుతో వస్తున్న లారీ అదుపుతప్పి రోడ్డుమధ్యనున్న డివైడర్లపై నుంచి దూసుకువచ్చి మోటారు సైకిల్‌ను ఢీ కొన్న ప్రమాదంలోతృటిలో భారీ ప్రాణాపాయం తప్పింది. కోలకతా వైపు నుంచి అనకాపల్లి వైపు ఇనుప రాడ్లతో వెళుతున్న లారీ స్ధానిక మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా వచ్చేసరికి హఠాత్‌గా రోడ్డుకు ఎడమవైపున ప్రయాణిస్తున్న లారీ రోడ్డుమధ్యలోని డివైడర్లపై నుంచి దూసుకువచ్చి కుడివైపున రోడ్డుపై మోటారు సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోటారు సైకిలిస్టు గొంప చిన్నారావుకు తృటిలో ప్రమాదం తప్పటం, పెద్దవాహనాలు రాకపోవటంతో జనం తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. ఈ దృశ్యం చూసిన లారీడ్రైవర్ పరారయ్యాడు. ఈ సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ డి.వెంకటరమణ వచ్చి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. లారీని రోడ్డుమధ్య నుంచి తొలగించారు. మోటారు సైకిలిస్టు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.

కూలి సొమ్ము స్వాహాపై గిరిజనుల ఆందోళన
డుంబ్రిగుడ, సెప్టెంబర్ 27: ఉపాధి హామీ పథకం కింద సిల్వర్ ఓక్ పనులు చేపట్టిన తమకు కూలి సొమ్మును చెల్లించకుండా అధికారులు స్వాహా చేశారని దోమంగి గ్రామ గిరిజనులు ఆరోపించారు. గురువారం వారు విలేఖరులతో మాట్లాడుతూ 2011లో వారం రోజుల పాటు 80 మంది సిల్వర్ ఒక్ పనులు చేపట్టామని, ఇందుకు సంబంధించిన 44,760 రూపాయలు బిల్లులు చెల్లించా ల్సి ఉన్నా సంవత్సరం గడిచినా ఇప్పటికీ చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చే శారు. కాఫీ పనులు చేపట్టిన రైతులకు కూడా బిల్లులు చెల్లించలేదని వారు చెప్పారు. ఒకోక్కరికి 19,488 రూపాయ లు చెల్లించాల్సి ఉండగా కేవలం 269 రూపాయలు మాత్రమే చెల్లించి మిగిలిన సొమ్మును ఇప్పటికీ చెల్లించలేదని వారు చెప్పారు. ఈ పనులకు గత సంవత్సరంలోనే పేస్లిప్‌లు ఇచ్చినప్పటికీ బిల్లులు చెల్లించలేదని వారన్నారు. ఈ విషయమై అధికారులను సంప్రదిస్తే స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా కాలం తప్పించుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందిం చి తమకు రావల్సిన కాఫీ, సిల్వర్ ఓక్ బిల్లులను చెల్లించాలని గిరిజనులు కోరుతున్నారు. ఈ విషయంపై మండల కాఫీ శాఖ అధికారి బాలంనాయుడుని వివరణ కోరగా సిల్వర్ ఓక్, కాఫీ నిధులతో తమకు సంబంధం లేదని, పను లు చేయించడమే మా బాధ్యతని చె ప్పారు. బిల్లులు చెల్లించే బాధ్యత వి.ఒ. సభ్యులదేనని ఆయన తెలిపారు.

ఆశ్రమ పాఠశాలల్లో మెనూ అమలుకు రాస్తారోకో
పాడేరు, సెప్టెంబర్ 27: విశాఖ ఏజెన్సీలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో మెనూ సక్రమంగా అమలు చేయాలని కోరుతూ ఎ.ఐ.ఎస్.ఎఫ్. కార్యకర్తలు స్థానిక ఆర్టీసీ. కాంప్లెక్స్ ఎదుట గురువారం రాస్తారోకో నిర్వహించారు. ఆశ్రమాల్లో మెనూ అమలు లో వార్డెన్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశా రు. ఈ సందర్భంగా ఎ.ఐ.ఎస్.ఎఫ్. జిల్లా కార్యదర్శి కూడా రాధాకృష్ణ మాట్లాడుతూ ఏజెన్సీలోని అన్ని ఆశ్రమాల్లో మెనూ సక్రమంగా అమలు చే యకుండా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆశ్రమాల్లో విద్యార్థులకు గుడ్లు ప్రతిరోజు పెట్టాల్సి ఉండగా వారానికి ఒకసారి మాత్రమే పెడుతున్నారని, ఆహార పదార్థాలలో నాణ్యత లోపిస్తుందని ఆయన చెప్పారు. ఆశ్రమ పాఠశాలల్లో మంచినీటి సదుపాయం లేకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి నీటిని సేకరించుకోవలసి వస్తోందన్నారు. దీంతో ఆశ్రమాల్లో నిర్మించిన మరుగుదొడ్లు నిరుపయోగంగా మారినట్టు పేర్కొన్నారు. ఈ విషయమై అధికారులు చర్యలు తీసుకుని ఆశ్రమాల్లో మెనూ సక్రమంగా అమలు చేయించాలని, మంచినీటి సదుపాయాన్ని కల్పించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలను పెంచాలని రాధాక్రిష్ణ కోరారు. అనంతరం ఐ.టి.డి.ఎ. అధికారులకు వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎ.ఐ.ఎస్.ఎఫ్. నాయకులు పి.రాజు, వంతాల లక్ష్మి, బాలక్రిష్ణ, టి.రాంబాబు, పలాసి మహేష్, పలువురు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

నాటుసారా నిర్మూలనకు కృషి
అరకులోయ, సెప్టెంబర్ 27: అందరి సహకారంతో నాటుసారా నిర్మూలనకు కృషి చేస్తున్నట్టు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ స్థానిక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పి.పాపారావు చెప్పారు. స్థానిక ఎక్సైజ్ స్టేషన్‌లో గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ భారత్ నిర్మాణ్ వలంటీర్లు, యువజన సంఘాలు, స్వ యం సహాయక సంఘాల సహకారం తో నాటుసారా తయారీ, విక్రయాలను నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ మండలాల్లో నాటుసారా నిర్మూలనకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. సారా తయారీ విక్రయాలను అదుపు చేసేందుకు సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేశామని ఆయన అన్నారు. రానున్న కాలంలో నాటుసారా బట్టీలు, విక్రయ కేంద్రాలు, వ్యాపారుల ఇళ్లపై విస్తృతంగా దాడులు నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. సారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం, అమ్మోనియా అమ్మకాలను వెంటనే నిలిపివేయాలని పలు ప్రాంతాల వ్యాపారులను హెచ్చరించామని ఆయన చెప్పా రు.
భవిష్యత్తులో నాటుసారా తయారీకి ఉపయోగపడే సరుకులను విక్రయిస్తే దుకాణాలపై కూడా దాడులు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. మండల రెవెన్యూ కార్యాలయాల నుం చి తమకు అవసరమైన సమాచారాన్ని సేకరించి ప్రణాళికాబద్ధంగా సారా నిర్మూలనకు చర్యలు చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. వారపు సంతలు, ప్రధాన కూడళ్లు, గ్రామాలలో గట్టి నిఘా ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. దసరా పండుగను దృష్టిలో పెట్టుకుని సారా నిర్మూలనకు తమవంతు కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా తాను బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇంతవరకు దాదాపు రెండు నెలల వ్యవధిలో 60 కేసులు నమోదు చేసి, 24 వేల లీటర్ల బెల్లం పులుపును ధ్వంసం చేసి 730 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. నాటుసారాను అక్రమంగా రవాణా చేసేవారు, విక్రయాలకు పాల్పడిన 28 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని ఆయన చెప్పారు. స్టేషన్‌లో సిబ్బంది కొరత పట్టిపీడిస్తుందని, సరిపడ సిబ్బంది లేకపోవడంతో తమకు పనిభారం పెరిగిందన్నారు. ఒకవైపు దాడులు నిర్వహించి మరోవైపు నిందితులను కోర్టుకు హాజరు పరచడం, రికార్డులు తయారు చేయడం వంటి పనులతో సతమతవౌతున్నట్టు పాపారావు చెప్పారు.

మంత్రి గంటా సుడిగాలి పర్యటన అడుగడుగునా సమస్యల ఏకరవు తాగునీటి సమస్యపై గగ్గోలు పెట్టిన మహిళలు సత్వరమే సమస్యలు పరిష్కరించాలని మంత్రి ఆదేశం
english title: 
m

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles