విజయనగరం, సెప్టెంబర్ 27: అర్హులైన వారంతా ఓటర్లుగా నమోదు కావాలని అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లాకలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య స్పష్టం చేశారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న కళాశాలల ప్రిన్సిపల్స్‌తో గురువారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతను ఓటర్లుగా చేర్పించే బాధ్యతను ఉపాధ్యాయులు తీసుకోవాలన్నారు. ప్రతి కళాశాలలోను ఓటర్ల నమోదు నిమిత్తం ఒక ప్రత్యేకాధికారిని నియమించుకుని ఓటర్ల నమోదును విజయవంతం చేయాలని సూచించారు. 18 సంవత్సరాలు నిండిన యువకుల్లో 80 శాతం కళాశాలల్లో చదువుతున్నారని, వీరిని ఓటర్లుగా నమోదు చేయించాలన్నారు. గత సంవత్సరం నుంచి కళాశాలల వారీగా ఓటర్ల నమోదు ప్రక్రియను చేపట్టామని ఈసందర్భంగా ఆయన స్పష్టం చేశారు. కళాశాలల్లో ఓటరు నమోదుకు సంబంధించి ఏర్పాటు చేసిన సమావేశాలు, ఓటర్ల నమోదు వివరాలను జిల్లా రెవెన్యూ అధికారికి నివేదిక అందించాలని ఆదేశించారు. గతేడాది 15వేల మంది మాత్రమే అర్హులైన యువత ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారని, ఈసంవత్సరం 30 వేల మంది యువతను ఓటర్లుగా నమోదు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. ఓటరు నమోదు, ఓటు హక్కుపై యువతకు పూర్తి అవగాహన కల్పించాలని, ఇందుకు సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అక్టోబర్ 1 నుంచి 31 వరకూ ఓటర్ల నమోదు ప్రక్రియను పెద్ద ఎత్తున చేపట్టిన దృష్ట్యా 18 సంవ(త్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదయ్యేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంపై అక్టోబర్ నెలలో కళాశాలల వారీగా నాలుగు సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. సమావేశం వివరాలను ముందుగా తనకు తెలియజేస్తే సమయానుకూలంగా తాను కూడా హాజరయ్యేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ఓటర్ల నమోదుపై మండల తహశీల్దార్లతో సమావేశమై సిడిల ద్వారా ప్రచారం చేయాలని సూచించారు. ఓటరు నమోదు ఫారాలను విద్యార్ధులతో పూర్తి చేయించి డ్రాప్ బాక్స్‌ల్లో వేయించాలని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 1988 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, వీటికి బూత్ స్థాయి అధికారుల నియామకం పూర్తయిందని, వీరంతా ఇంటింటికీ వెళ్ళి ఓటర్ల సమాచారం తెలుసుకుంటారని తెలిపారు. జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని కళాశాలల్లో సమావేశాలు ఏర్పాటు చేసి యువతను చైతన్య పరచాలని సూచించారు. కార్యక్రమంలో డిఆర్వో హేమసుందర వెంకటరావు, పార్వతీపురం ఆర్డీఓ వెంకటరావు, పలు కళాశాలల ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు.
సహకరించండి : రాజకీయ పార్టీలకు వినతి
జిల్లాలో అక్టోబర్ 1 నుంచి చేపట్టనున్న ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమానికి రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య కోరారు. తన ఛాంబర్‌లో ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జనవరి 5న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని తెలిపారు. అక్టోబర్‌లో జాబితాలకు సంబంధించి సవరణలు, తొలగింపులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
‘బాధ్యతతో ఓటర్ల నమోదు ప్రక్రియ’
బొండపల్లి, సెప్టెంబర్ 27: ఓటరు నమోదు కార్యక్రమాన్ని బిఎల్‌ఓలు బాధ్యతా యుతంగా చేపట్టాలని ఓటరు నమోదు రాష్ట్ర పరిశీలకుడు శశిభూషణ్ కుమార్ స్పష్టం చేశారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో గురువారం బిఎల్‌ఓలకు ఓటరు నమోదుపై శిక్షణను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పరిశీలించిన ఆయన బిఎల్‌ఓలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఫుట్‌పాత్‌లు, శరణాలయాల్లో ఉన్నవారిని కూడా ఓటరుగా నమోదు చేసేప్పుడు నిబంధనలు పాటించాలన్నారు. జిల్లాలోని బొండపల్లి మండలంలో నమోదు కార్యక్రమం సక్రమంగా జరుగుతోందని సంబంధిత అధికారులను కొనియాడారు. ఆర్డీఓ రాజకుమారి మాట్లాడుతూ శతశాతం ఓటరు నమోదును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టు(మిగతా 2వ పేజీలో)
కున్నామన్నారు. అక్టోబర్ 1 నుంచి 31 వరకూ ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా బిఎల్‌ఓలకు పలు అంశాలపై అవగాహన కల్పించి, పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో తహశీల్దారు కె.చిన్నారావు, డి.టి కె.వి.రమణరాజు, ఎన్నికల తహశీల్దారు జె.లక్ష్మణరావుతదితరులు పాల్గొన్నారు.
‘పంచాయతీల ప్రగతికి చర్యలు తీసుకోవాలి’
పార్వతీపురం, సెప్టెంబర్ 27: గ్రామపంచాయతీల్లో పాలన పరమైన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎ యం ఆర్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి సంస్థ శిక్షణ కోర్సు డైరక్టర్ సాంబమూర్తిరాజు కోరారు. గురువారం పార్వతీపురం ఆర్డీవో కార్యాలయంలో రెండవ రోజు గ్రామపంచాయతీ పాలనపై ప్రత్యేకాధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీల ప్రగతికి ప్రత్యేకాధికారులు ప్రభుత్వ కార్యక్రమాలు సక్రమంగా అమలు జరిగేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామపంచాయతీలో పనులు నిర్వహణ సామర్థ్యం మరింతగా పెంపొందించుకోవాలన్నారు. అదేవిధంగా గ్రామపంచాయతీ చట్టాలపై పూర్తిస్థాయి అవగాహన ఏర్పరచుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో పార్వతీపురం డివిజనల్ పంచాయతీ అధికారి బి.కోటేశ్వరరావు మాట్లాడుతూ పంచాయతీల్లో ఇంటిపన్నుల మందింపు విషయంలో తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీ పరమైన అభివృద్ధి కార్యక్రమాల్లో తమదైన శైలితో పాలన సాగించాలన్నారు. అక్రమలేవట్లపట్ల ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం ఎడీవో వెంకటరమణ మాట్లాడుతూ వికేంద్రీకృత భాగస్వామిక సమీకృత ప్రణాళిక అమలు విధానంపై ప్రత్యేకాధికారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం డివిజన్‌లోని పలు మండలాలకు చెందిన పంచాయతీ ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.
‘్భగత్‌సింగ్ మార్గంలో యువత నడవాలి’
విజయనగరం (కంటోనె్మంట్), సెప్టెంబర్ 27: దేశ స్వాతంత్య్రం కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టిన భగత్‌సింగ్‌ను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి ఎ.జగన్మోహన్ కోరారు. భగత్‌సింగ్ 105వ జయంతిని పురస్కరించుకుని గురువారం పలు విద్యాసంస్థలో జయంతి వేడుకలను ఎస్.ఎఫ్.ఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భగా జగన్ మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్య వాదులకు వ్యతిరేకంగా భగత్ సింగ్ అతిచిన్న వయస్సులోనే పోరాడన్నారు. మహనీయుల స్ఫూర్తికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి విదేశీ పెట్టుబడుదారులను దేశంలోకి ఆహ్వానిస్తోందని అన్నారు. ఆ మహానీయుల ఆశయాలను తుంగలో తొక్కుతూ దేశ ఆర్థిక సంపదను విదేశీయులకు దారాదత్త చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. అదేవిధంగా విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ఈ ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. స్వదేశీ విద్యారంగంలోకి విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తూ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆవేధన వ్యక్తం చేశారు.
ఎస్.ఎఫ్.ఐ డివిజన్ కార్యదర్శి గణేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయా విద్యాసంస్థల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యాగణపతికి యాగపూర్ణ్ణాహుతి
పార్వతీపురం, సెప్టెంబర్ 27: స్థానిక సూర్యపీఠంలో గత తొమ్మిది రోజులుగా గణేశ నవరాత్ర సందర్భంగా శ్రీ విద్యాగణపతి యాగదీక్షా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సూర్యపీఠం నిర్వాహకులు అశేషశేముషీనిధి బ్రహ్మశ్రీ వేమకోటి నరహరి శాస్ర్తీ ఆధ్వర్యంలో జ్ఞాన గణపతి అవతారములను ప్రతిష్ఠంచి పూజాధికాలు, అభిషేకాలు జరిగాయి. ఇందులో భాగంగా గురువారం దీక్షాంత పూర్ణాహుతి నరహరిశాస్ర్తీ, లతిత దంపతులు నిర్వహించారు. ఈకార్యక్రమానికి పట్టణ పరిసర ప్రాంతభక్తులు పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో పాలకోవ లడ్డూలను సహస్ర నామార్చనతో స్వామికి భక్తులు వితరణ చేశారు. మనిషి జీవించినంతకాలం సమాజం నుండి ఎంతో జ్ఞానాన్ని సముపార్జిస్తూ ఉంటాడని, నిత్య సత్యానే్వషణ, విశే్లషణాత్మక అధ్యయనం, లౌకిక, తదితర విద్యలను అభ్యసిస్తూ పరిశోధిస్తూ మానవ మేథస్సు అపార అనుభవాన్ని పొందే క్రమంలో నేటికీ ఉన్నదని శాస్ర్తీ అన్నారు. మనమంతా నిత్యవిద్యార్థులమని బుషి సాంప్రదాయాలను అనుసరిస్తూ తరించడానికి పర్యావరణాన్ని కాపాడుతూ ప్రకృతి పరిరక్షణ కూడా దేవతారాధేనని గణపతి స్వామి అవతార సందేశమని, విశ్వశాంతి, లోక కల్యాణం వర్ధిల్లాలని అందరూ కోరుకోవాలని ఆయన అన్నారు. రుత్వికులు జాడ సూర్యనారాయణ శర్మ, పులఖండం శ్రీనివాసశర్మలు ఈకార్యక్రమానికి వైదిక సహకారం అందించారు.
రేపు ఎన్‌సిఎస్ ఫ్యాక్టరీ వద్ద ధర్నా
బొబ్బిలి, సెప్టెంబర్ 27: లచ్చయ్యపేట ఎన్‌సిఎస్ సుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం చెరకు రైతులకు బిల్లులు చెల్లించడంలో విఫలం అయ్యిందని రైతు సంఘం నాయకులు రెడ్డి వేణు, వి చిన్నంనాయుడు, జి సింహాచలం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సిటు కార్యాలయంలో గురువారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ బిల్లులు చెరకు రైతులకు సకాలంలో చెల్లించనందున శనివారం ధర్నా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. బొబ్బిలి, రామభద్రపురం, బాడంగి, తెర్లాంలతోపాటు ఇతర మండలాలకు సంబంధించి కోట్లాది రూపాయలు రైతులకు చెల్లించాల్సి ఉన్నా ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. రైతులకు రాయితీగా ప్రకటించిన 5 కోట్లు కలిపి దాదాపు 11.7 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. గతంలో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తే జూన్ నెలాఖరు నాటికి చెల్లిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు పట్టించుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం 10 గంటలకు భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. అన్ని ఫ్యాక్టరీలలో చెరకు టన్నుకు 2,300 రూపాయలు చెల్లిస్తే ఇక్కడ మాత్రం 2 వేల రూపాయలు చెల్లించి రైతులను నష్టపరుస్తున్నారన్నారు. మద్దతు ధర టన్నుకు 3వేల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి తక్షణమే బిల్లులు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.
పగిలిన పైపులైను.. కమిషనర్ సీరియస్
బొబ్బిలి, సెప్టెంబర్ 27: వివిధ పనుల కోసం భారీ వాహనాలతో సామగ్రి సరఫరా చేయడం వల్ల మంచినీటి పైపులు మరమ్మతులకు గురవుతున్నాయని మున్సిపల్ కమిషనర్ ఎ చంద్రిక స్పష్టం చేశారు. ఈ మేరకు రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులకు గురువారం భారీ వాహనంతో రాయిని తీసుకువెళ్లారు. దీంతో అటువైపు ఉన్న మంచినీటి పైపు బద్దలై లీకయ్యింది. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ హుటాహుటిన పగిలిన పైపును పరిశీలించారు. సంబంధిత కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీచేయాలని అధికారులకు ఆదేశించారు. భారీ వాహనాలు వివిధ మెటీరియల్స్‌తో వెళ్లడం వల్ల పైపులు తరుచూ మరమ్మతులకు గురవుతున్నాయన్నారు. దీంతో ప్రజలకు మంచినీటిని అందించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సంబంధిత కాంట్రాక్టర్ మరమ్మతులకు గురైన పైపులను బాగు చేయని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈమెతోపాటు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
‘దేశాభివృద్ధికి పర్యాటకం దోహదం’
విజయనగరం (కంటోనె్మంట్), సెప్టెంబర్ 27: పర్యాటక ప్రాంతాల అభివృద్ధి దేశ ఆర్థిక పరిపుష్టికి దోహదపడుతుందని రోటరీ క్లబ్ పూర్గ గవర్నర్ ఆర్.కె జైన్ పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని యునైటెడ్ హోటల్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీనిఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చారిత్రక ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు. పర్యాటకరంగ పరంగా విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాలు ఇప్పటికే కొంతమేర అభివృద్ధి దిశగా కృషి జరుగుతున్నప్పటకి పూర్తి స్థాయిలో తాటిపూడి, చారిత్రిక ప్రాంతాలైన బొబ్బిలి, విజయనగరాలను అభివృద్ధి చేసినట్లయితే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశాలు ఏర్పడతాయన్నారు. కోటవద్ద ప్రారంభమైన ర్యాలీ మూడులాంతర్లు, గంటస్థంభం, గురజాడ గృహం మీదుగా తిరిగి కోటకు చేరుకుంది. చారిత్రక ప్రాధాన్యత ఉన్న విజయనగరం, బొబ్బిలి, ప్రకృతి అందాలకు నిలయమైన తాటిపూడి ప్రాంతాలను అభివృద్ధి చేయాలని నినాదాలు చేశారు. క్లబ్ అధ్యక్షుడు కె.రవి, రాజశేఖర్, మండారవి, మాటూరు మురళీకృష్ణ, పి.వి నరసింహరాజు, చెన్నా రాజా తదితరులు పాల్గొన్నారు.
బస్సు పాసుల కోసం విద్యార్థులకు పాట్లు
పార్వతీపురం, సెప్టెంబర్ 27: ఆర్టీసీ బస్సుపాసులు కోసం విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.గురువారం బస్సు పాసులు కోసం పెద్ద ఎత్తున ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద క్యూకట్టారు. పాసుల కోసం ఒకే ఒక కౌంటర్ ఉండడంతో బాలికలు, బాలురు పెద్ద సంఖ్యలో పాసులు కోసం తరలిరావడంతో రద్దీ ఎక్కువగా ఏర్పడింది. అయితే బుధవారం కూడా విద్యార్థులు బస్సుపాసులు కోసం వచ్చినప్పటికీ కంప్యూటర్ పనిచేయకపోవడంతో పాసులు జారీకి కొంత ఇబ్బందులు తలెత్తినట్టు చెబుతున్నారు. గురువారం ఈరద్దీ తీవ్రంగా ఉండడం వల్ల గంటల కొలదిపాసుల కోసం విద్యార్థులు నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గురువారం కూడా పాసులు పొందలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
‘హెచ్‌ఐవి రోగులు ఆత్మస్థైర్యంతో ఉండాలి’
గజపతినగరం, సెప్టంబర్ 27: హెచ్‌ఐవి వ్యాధిగ్రస్తులు తమకున్న వ్యాధిని మరిచిపోయి మానసికంగా ధైర్యంగా ఉండాలని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మీసాల ప్రసన్నలక్ష్మి కోరారు. గురువారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో విజయనెట్‌వర్క్ ఆఫ్ పాజిటివ్ పీపుల్ సొసైటీ సేవాసంస్థ ఆధ్వర్యంలో వ్యాధిగ్రస్తులు పొందాల్సిన ప్రయోజనాలు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్సీ, బిసి కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి అవకాశాల కోసం రుణాలను అందిస్తున్నారని చెప్పారు. అలాగే చికిత్సల కోసం సమీపంలోని వైద్య కేంద్రాల్లో వైద్యం పొందాలని సూచించారు. ఈ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం పింఛన్ ఇవ్వడంతోపాటు ఎన్‌ఎఫ్‌బిఎస్ పథకంలో ఆర్థిక సహాయం, 35 కిలోల ఉచిత బియ్యం అందిస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యాధిగ్రస్తుల పట్ల చిన్నచూపుచూడ్డం తగదన్నారు. ప్రభుత్వ అందించే అన్ని రకాల సేవలను రోగులు వినియోగించుకోవాలని సంస్థ అధ్యక్షుడు చౌదరి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఈ వ్యాధిగ్రస్తుల కోసం సంస్థ కృషి చేస్తూ అవసరమైన సేవలను అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌ఎన్‌సి సిహెచ్‌ఓ ఎస్ లక్ష్మణరావు, ఎన్నికల ఉపతహాశీల్దార్ కె.లక్ష్మణరావు, ప్రాజెక్ట్ ఆర్గనైజర్ పద్మావతి, ఐసిటిసి కౌన్సిలర్ రామారావు, లుకాబాయ్ పాల్గొన్నారు.
‘డ్యూటీ చార్టులు వేయకుంటే ఆందోళన’
విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 27: విజయనగరం డిపోలో కండక్టర్లు, డ్రైవర్ల నూతన డ్యూటీ చార్టులు వేయకపోతే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జోనల్ అధ్యక్షుడు పెదమజ్జి సత్యనారాయణ హెచ్చరించారు. డ్యూటీచార్టులు వేయనందుకు నిరసనగా యూనియన్ డిపో అధ్యక్షుడు జె.ఎస్.టి.ఎస్.రావు నిరధిక నిరాహారదీక్ష చేపట్టారు. ఈ దీక్షాశిబిరాన్ని ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వి.కృష్ణంరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రం మొత్త మీద ఏ డిపోలో లేనివిధంగా విజయనగరం డిపోఅధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కండక్టర్లు, డ్రైవర్లకు డ్యూటీచార్టులు వేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్యూటీచార్టులు వేయకపోవడం వల్ల ఏరూట్‌లో ఏరోజు వెళ్లాలో తెలియని అయోమయ పరిస్థితులు నెలకున్నాయన్నారు. యూనియన్ రీజనల్‌కార్యదర్శి పెంట భానుమూర్తి మాట్లాడుతూ విజయనగరం డిపోలో నూతన డ్యూటీచార్టులకు సంబంధించి కండక్టర్లు, డ్రైవర్ల ప్రక్రియ పూర్తయినప్పటికీ అమలు చేయడంలో డిపోఅధికారులు తీవ్ర నిర్లక్ష్యవైఖరిని అవలంభిస్తున్నారని ఆరోపించారు. డ్యూటీచార్టుల విషయమై నిర్థిష్టమైన వైఖరి అవలంభించనందున కార్మికుల్లో తీవ్ర ఆందోళన నెలకుంద్నారు. అయితే డ్యూటీచార్టులు అమలు చేయనందునకు నిరసనగా మెజార్జీ యూనియన్‌గా, స్థానిక గుర్తింపుసంఘంగా యూనియన్ డిపో అధ్యక్షుడు జె.ఎస్.టి.ఎస్.రావునిరవధిక నిరాహారదీక్ష చేపట్టడంతోపాటు సహాయ నిరాకరణ కూడా చేపడతామని ఉన్నతాధికారులకు తెలియజేశామన్నారు. యూనియన్ రీజనల్ జాయింట్ సెక్రటరీ కె.శ్రీనివాసరావు, డిపో కార్యదర్శి టి.ఎస్.ఎన్.రాజు పాల్గొన్నారు.
వర్షాలకు నేలకొరిగిన
విద్యుత్ స్తంభాలు
విజయనగరం (తోటపాలెం), సెప్టెంబర్ 27: గత మూడు రోజులుగా కురిసిన వర్షాల వలన మండలంలోని పలు గ్రామాలల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. కొన్నిచోట్ల వైర్లుపై చెట్టు కొమ్మలు ఇరిగిపడి మంటలు ఎగసిపడ్డాయి. దీంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఆయా గ్రామాల లైన్ మేన్‌లు తెలుసుకుని ప్రమాదం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం తెలుసుకున్న విద్యుత్ అధికారులు స్పందించి అన్ని గ్రామాలల్లో సంచరించి విరిగిపోయిన, వైర్లు తెగిపోయిన వాటిని గుర్తించారు. 11 కె వైర్లు స్తంభాలు ఆరు, ఎల్ టి లైను స్తంభాలు ఎనిమిది స్తంభాలు మండల విద్యుత్‌శాఖ అధికారులు అందించిన సమాచారం ప్రకారం కోరుకొండ గ్రామంలో 6 స్తంభాలు దుప్పాడ 4, జొన్నవలస 2, పినవేమలి 2 విరిగిపోయినట్లు విద్యుత్ ఎ.ఇ నారాయణ రావు తెలిపారు. దీంతో మండల పరిధిలో విద్యుత్ శాఖకు సుమారు లక్ష రూపాయల వరకూ నష్టం వాటిల్లినట్టు అంచనావేశామన్నారు. కోరు కొండ గ్రామంలో విద్యుత్ స్తంభాల పనులు పూర్తి అయ్యాయని దుప్పాడ జొన్నవలస గ్రామాలల్లో పనులు చేస్తున్నామని తెలిపారు.
‘నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా’
విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 27: గుర్రం జాషువా నవయుగ కవి చక్రవర్తి అని ప్రముఖ సాహితీవేత్త ఎన్.దామోదరరావుఅన్నారు. తెలుగు భాషోధ్యమ సమాఖ్య, గేట్ ఆధ్వర్యంలో గురువారం కణపాకలో నిర్వహించిన గుర్రం జాషువా జయంతి ఉత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దామోదరరావుమాట్లాడుతూ జాషువా రచనల్లో పారిజాత పరిమళాలు, సుగంధాలు చిందిస్తాయన్నారు. కేవలం మూడురోజుల జీతంతో ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించిన జాషువాకు 1951లో కనకాభిషేకం జరిగిందన్నారు. జాషువాకు ఆంధ్రవిశ్వవిద్యాలయం కళాప్రపూర్ణను ఇచ్చిందన్నారు.
భారత ప్రభుత్వం పద్మభూషణ్‌తో గౌరవించిందన్నారు. కార్యక్రమానికి అధ్యక్షుడు వహించిన రాజు మాట్లాడుతూ జాషువా మధురకవిగా మంచి గుర్తింపు పొందారన్నారు. జాషువాకు కవిత్వం సరస్వతీ అనుగ్రహం వల్ల లభించిందన్నారు.
ఫిరదౌసి. గబ్బిలం వంటి గొప్ప రచనలు గావించారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుభాషోద్యమ సమాఖ్య కార్యదర్శి ఎస్.వి.ఎన్.గురుప్రసాద్, లైఫ్‌ట్రీస్ అధ్యక్షుడు పుష్పనాధం, చైతన్య యువజన సేవా సంఘం అధ్యక్షుడు మజ్జి కాంతారావుతదితరులు పాల్గొన్నారు.
జాతీయస్థాయి కబడ్డీ జట్టుకి రామలక్ష్మి
గజపతినగరం, సెప్టెంబర్ 27: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ ఇంటర్ చదువుతున్న విద్యార్థి పల్లి వెంకటలక్ష్మి జాతీయ స్థాయి కబడ్డీ జట్టులో స్థానం సంపాదించినట్లు కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ వి.కె.వి కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు విద్యార్థిని అభినందించారు. అక్టోబర్ 6 నుంచి కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్‌లో జరగనున్న జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటున్నట్లు చెప్పారు. చిత్తూరు జిల్లాలో ఈ నెల 21-24 వరకు జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటలక్ష్మిని వ్యాయామ ఉపాధ్యాయుడు కె.తవుడు, అధ్యాపకులు అభినందించారు.
వాహన చోదకులు
నిబంధనలు పాటించాలి
సీతానగరం, సెప్టెంబర్ 27: వాహన చోదకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సీతానగరం ఎస్‌ఐ జిఎ వెంకటరమణ సూచించారు. ఈ మేరకు గురువారం మండల పరిధిలోని జోగింపేట గ్రామం వద్ద సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదాల నివారణకే వాహనాలను తనిఖీ చేస్తున్నామని, వాహన చోదకులు నిబంధనలకు లోబడి వాహనాలను నడపాలన్నారు. మద్యం సేవించి వాహనాలను నడపొద్దని, లైసెన్స్ లేకుండా వాహనాలను నడిపిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామ పరిసరాల ప్రాంతాలు, పాఠశాలలు, ఆసుపత్రులు తదితర చోట్ల వాహనాలను వేగం తగ్గించి నడపాలని సూచించారు.