Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

‘చైర్మన్’గారు ఇకలేరు

$
0
0

గుడివాడ, సెప్టెంబర్ 27: జిల్లా ప్రజలు గుండెల నిండా అభిమానంతో ‘చైర్మన్’గా పిలుచుకునే జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పిన్నమనేని కోటేశ్వరరావు సుదీర్ఘ ప్రస్థానం ముగిసింది. రాజకీయ దురంధరుడిగా, రాజకీయ కురువృద్ధుడిగా పేరున్న సీనియర్ పిన్నమనేని తన 83వ ఏట కన్నుమూశారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఎలాంటి రాజకీయ చరిత్ర లేకుండానే జిల్లా రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారాయన. ఇతరత్రా ఎన్ని అవకాశాలు వచ్చినా జిల్లా రాజకీయాలకే పరిమితమయ్యారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెల్చి నా మంత్రివర్గంలో స్థానం కోసం ప్రయత్నించలేదు. రాష్ట్ర రాజకీయాల్లోనూ తొలితరం నేతగా ప్రత్యక్షంగా, పరోక్షంగా తనదైన ముద్ర వేశారు.
జిల్లా ప్రత్యేకాంధ్ర ఉద్య మం జరుగుతున్నప్పుడు జెడ్పీ చైర్మన్‌గా తక్కువ వేతనాలున్న ఉపాధ్యాయులకు కొంత సహాయం చేసి ‘చైర్మన్’గా వినుతికెక్కిన ‘సీనియర్ పిన్నమనేని’ ఆదుకున్నారు. ఉపాధ్యాయులంటే ఈయనకు అపారమైన గౌరవం, అభిమానం. జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఆయన వేలాది మంది ఉపాధ్యాయులకు ‘ఆదుకునే దైవం’. ఎంతో రాజకీయ పరిణతి సాధించిన కృష్ణా జిల్లాలో 23ఏళ్లపాటు సుదీర్ఘంగా జెడ్పీ చైర్మన్‌గా పనిచేయడం మామూలు మాటలు కాదు. అందుకే పిన్నమనేని చైర్మన్ పదవి నుండి తప్పుకున్నా జనానికి మాత్రం ‘ఆయనే చైర్మన్’. అందుకే ఆయనను అభిమానంగా ‘చైర్మన్‌గారు’ అని పిలుచుకునేవారు. కృష్ణా జిల్లా రాజకీయాల్లో కాకాని వెంకటరత్నం తరువాత పిన్నమనేనే పెద్దదిక్కు. 1978లో రెడ్డికాంగ్రెస్ తరఫున ముదినేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికై విధానసభలోనూ జిల్లా గురించే మాట్లాడేవారు. కృష్ణా జిల్లా అంటే ఆయనకు అంతటి అపార గౌరవం. రహదారుల నిర్మాణం, రోడ్ల విస్తరణ, పాడి పరిశ్రమాభివృద్ధి, కాలువలు వెడల్పు చేయడం వంటి ఎన్నో పనులు చేపట్టి ప్రజల విశేష అభిమానాన్ని పొందారు. పంచాయతీరాజ్ సంస్థల్లో తీసుకురావాల్సిన సంస్కరణలపై ఏర్పాటైన కమిటీకి అధ్యక్షునిగా పిన్నమనేని వ్యవహరించిన తీరుకు స్వపక్షం నుండే కాకుండా విపక్షం నుండి ప్రశంసల జల్లులు కురిశాయి. అంతేకాకుండా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ జిల్లాకు నిధులు సమకూర్చడంలో ఈయన చేసిన కృషి మరువలేనిది.
1929 సెప్టెంబర్ 8న నందివాడ మండలం రుద్రపాక గ్రామంలో పిన్నమనేని వీరయ్య - పున్నమ్మ దంపతులకు ఏడో సంతానంగా కోటేశ్వరరావు జన్మించారు. నందివాడ మండల ప్రాథమిక పాఠశాలలో 6వ తరగతి వరకు చదివి, కంకిపాడు సమీపంలోని కుందేరు ఆశ్రమంలో ఏడాది పాటు సంస్కృతాన్ని అభ్యసించారు. 7వ తరగతి నుండి ఎస్సెస్సెల్సీ వరకు గుడివాడలోని జిల్లా బోర్డు ఉన్నత పాఠశాలలో చదివారు. మచిలీపట్నం హిందూ కళాశాలలో ఇంటర్, బిఎ డిగ్రీ పూర్తి చేశారు. వ్యవసాయం చేస్తూ నాటి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని వెంకటరత్నం ప్రోద్బలంతో రాజకీయాల్లోకి ప్రవేశించి రుద్రపాక గ్రామంలో వార్డు సభ్యునిగా, తర్వాత రుద్రపాక సర్పంచ్‌గా, మండవల్లి సమితి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1964లో మాగంటి అంకినీడు రాజీనామాతో ఖాళీ అయిన జిల్లాపరిషత్ చైర్మన్ పదవికి పోటీచేసి విజయం సాధించారు. 23 ఏళ్ళ పాటు జెడ్పీ చైర్మన్‌గా కొనసాగారు. జిల్లాలో చైర్మన్ అంటే పిన్నమనేని కోటేశ్వరరావు పేరే గుర్తుకొచ్చేది. 1983 నాటికి ఇందిర కాంగ్రెస్‌లో రెడ్డి కాంగ్రెస్ విలీనమైంది. 1983లో ఇందిర కాంగ్రెస్ తరఫున పోటీచేసి రెండోసారి కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. 1987లో మండల వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి మళ్ళీ జెడ్పీ చైర్మన్‌గా గెలుపొందారు. 1992 వరకు కొనసాగి ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన దూరమయ్యారు. అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ పటిష్ఠతకు కృషి చేస్తూ వచ్చారు.
పిన్నమనేని రాజకీయ ప్రవేశం చేసేనాటికి ముదినేపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌లో కాజ రామనాథం, బొప్పన హనుమంతరావు వర్గాలు ఉండేవి. జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికైన తర్వాత హనుమంతరావు వర్గానికి పిన్నమనేని నాయకత్వం వహించారు. జిల్లాలోని జమీందార్లు, రాజాలకు వ్యతిరేకంగా ఉంటూ రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రులుగా పనిచేసిన జలగం వెంగళరావు, కాసు బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, నేదురుమల్లి జనార్దనరెడ్డి, చెన్నారెడ్డి, డెప్యూటీ సీఎంగా పనిచేసిన ఎసి సుబ్బారెడ్డి, కోనేరు రంగారావు, తదితరులతో కోటేశ్వరరావుకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. కోస్తా జిల్లాల్లో ఏ చిన్న సమస్య వచ్చినా కాంగ్రెస్ హైకమాండ్ పిన్నమనేనికి పరిష్కార బాధ్యతలను అప్పగించేది. పార్టీ ట్రబుల్ షూటర్‌గా పిన్నమనేనిని పిలిచేవారు. చాలామంది ముఖ్యమంత్రులతో సన్నిహిత సంబంధాలున్నప్పటికీ జిల్లా రాజకీయాలకే ఆయన అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. మంత్రి పదవి అనేకసార్లు కోరివచ్చినా దాన్ని తిరస్కరించారని చెప్పుకునేవారు. దాదాపు 3 దశాబ్దాల పాటు వివిధ పదవుల్లో కొనసాగినా ఎన్నికల తర్వాత ఏ పార్టీ నేతలు వచ్చినా పార్టీ రహితంగానే వ్యవహరించేవారు. జిల్లాలో గ్రామీణాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. కొల్లేరు ప్రాంతంలో కనీసం నడకదారి కూడా లేని ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని రోడ్లు నిర్మించారు. ఎన్నో గ్రామాలకు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించారు. విద్యాభివృద్ధికి వందలాది పాఠశాలలను నెలకొల్పారు. గ్రామాల్లో రైతుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వందలాది పాల సేకరణ కేంద్రాలను నెలకొల్పి వేల మందికి ఉపాధి కల్పించారు. ఉపాధ్యాయులకు పిన్నమనేని అందించిన సేవలకుగాను ఆయనను ఉపాధ్యాయ బంధు అని పిలిచేవారు. ఎప్పుడు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినా, విస్తరించినా తన అనుయాయులకు పదవి దక్కేలా కృషి చేసేవారు. 1990లో కెడిసిసి బ్యాంక్ ఎన్నికల్లో తన అభ్యర్థి పిన్నమనేని చిట్టిబాబును నిలబెట్టి ఒంటిచేత్తో గెల్పించడంతో పాటు ఆప్కాబ్ చైర్మన్ పదవిని కూడా చేజిక్కించుకున్నారు. ఇటీవల జరిగిన కృష్ణాడెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ ఎన్నికల్లో కూడా తన కుటుంబానికి చెందిన పిన్నమనేని సుధీర్‌ను గెల్పించుకున్నారు. విజయవాడ సిద్ధార్థ అకాడమీ స్థాపనకు, గుడివాడలోని పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటుకు కృషి చేశారు. కెసిపి సుగర్స్ డైరెక్టర్‌గా ఉన్నారు. గతంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణాయక కమిటీకి రాష్ట్ర అధ్యక్షుడిగా, అఖిల భారత స్థాయిలో సభ్యుడిగా పనిచేశారు. నక్సలైట్ నేతలు కెజి సత్యమూర్తి, కొండపల్లి సీతారామయ్యలతో కూడా సీనియర్ పిన్నమనేనికి సన్నిహిత సంబంధాలు ఉండేవి.
1952లో కోలవెన్నుకు చెందిన సరోజినిదేవిని పిన్నమనేని వివాహమాడారు. వీరికి ఐదుగురు పిల్లలు. మూడో కుమారుడు పిన్నమనేని వెంకటేశ్వరరావు రాజకీయాల్లో తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. 1989, 1999 ఎన్నికల్లో ముదినేపల్లి ఎమ్మెల్యేగా వెంకటేశ్వరరావు గెలుపొందారు. 2004లో మూడోసారి ఎమ్మెల్యేగా గెల్చి మంత్రి పదవి చేపట్టారు. ఎంతో చురుగ్గా రాజకీయాల్లో పనిచేసిన సీనియర్ పిన్నమనేని 83వ ఏట అనారోగ్యం బారినపడ్డారు. వైద్యసేవలతో కోలుకున్నట్టు కన్పించినా కొద్దిరోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. మళ్ళీ కోలుకుని తిరిగి వస్తారని భావిస్తున్న తరుణంలో ఆయన మరణంతో జిల్లా ప్రజలంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. సీనియర్ పిన్నమనేని మరణంతో జిల్లా రాజకీయాల్లో ఒక శకం ముగిసినట్లయింది.

ప్రజల సందర్శనార్థం
రుద్రపాకలో పిన్నమనేని భౌతికకాయం
నందివాడ, సెప్టెంబర్ 27: అస్వస్థత కు గురై విజయవాడ హెల్ప్ ఆసుపత్రిలో నాలుగు రోజులుగా చికిత్స పొందుతూ గురువారం కన్నుమూసిన జెడ్పీ మాజీ చైర్మన్ పిన్నమనేని కోటేశ్వరరావు భౌతికకాయాన్ని ఆయన స్వగ్రామమైన నందివాడ మండలం రుద్రపాకలో ప్రజలు, నాయకుల సందర్శనార్థం ఉంచారు. ఆయన 1928సెప్టెంబర్ 8వ తేదీన పిన్నమనేని వీరయ్యచౌదరి, పున్నమ్మ దంపతులకు జన్మించారు. కోటేశ్వరరావుకు ఐదుగురు సంతానం కాగా నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్దకుమారుడు వీరయ్యచౌదరి రైస్ మిల్లు నిర్వాహకులుగా ఉన్నారు. రెండవ కుమారుడు వెంకటేశ్వరరావు రాజకీయాల్లో ఉంటూ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పాలనలో ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ, ఆర్‌డబ్ల్యూ శాఖ మంత్రులుగా ఆయన పదవులు నిర్వహించారు. మూడవ కుమారుడు సురేష్ నల్గొండ వద్ద ఉన్న పాలిస్టర్ మిల్లు నిర్వాహకులుగా ఉన్నారు. నాలుగో కుమారుడు మల్లికార్జునబాబు హైదరాబాద్‌లో వైద్యవృత్తి నిర్వహిస్తున్నారు. అల్లుడు ఢిల్లీలో ఇన్‌కంటాక్స్ చీఫ్ కాగా, కుమార్తె అమ్మాజీ అక్కడే ఉంటున్నారు. జిల్లాపరిషత్ చైర్మన్‌గా ఆయన 23సంవత్సరాలు పనిచేశారు. దీంతో ఇప్పటికీ ఆయనను చైర్మన్ గానే అందరూ పిలుస్తారు. ఆయనకు స్థానిక స్వపరిపాలన మీద మంచి పట్టుంది. జిల్లాలో ప్రతి గ్రామంలో ఆయనకు అనుచరగణం ఉన్నారు. అన్ని రాజకీయ నాయకుల్లో పెద్దాయనగా ఆయన గుర్తింపు పొందారు. ఎన్‌టిఆర్ టిడిపి స్థాపించినపుడు పార్టీలోకి రమ్మని పిన్నమనేనిని పిలిచినా వెళ్లకుండా కాంగ్రెస్‌లోనే కొనసాగారు. సుమారు 30నుండి 40వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించి, వారికి ఉపాధి కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఉపాధ్యాయులు అందరూ కల్సి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మచిలీపట్నంలో పిన్నమనేని పేరు మీద టీచర్స్ గిల్డ్‌హోమ్ నిర్మించారు. పిసిసి ఆధ్వర్యంలో ఆయన పలు కమిటీలకు నేతృత్వం వహించారు. సమితి అధ్యక్షుడి నుండి ఎమ్మెల్యే వరకూ అనేక పదవులు నిర్వహించి రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీలో మంచి గుర్తింపు పొందారు. ఆయన భౌతికకాయాన్ని ఎంపి రాయపాటి సాంబశివరావు, ఎంపి కొనకళ్ల నారాయణరావు, మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యేలు దేవినేని ఉమామహేశ్వరరావు, తంగిరాల ప్రభాకరరావు, ఆప్‌కాబ్ చైర్మన్ వసంత నాగేశ్వరరావు, తాంతియాకుమారి తదితరులు సందర్శించి నివాళులర్పించారు. ప్రజలు, నాయకుల సందర్శన అనంతరం శుక్రవారం రుద్రపాకలో పిన్నమనేని భౌతికకాయానికి అంత్యక్రియలు జరుగుతాయని బంధువులు తెలిపారు.

సిఎం కిరణ్‌కు వీడ్కోలు
గన్నవరం, సెప్టెంబర్ 27: ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి గన్నవరం విమానాశ్రయంలో గురువారం ప్రజాప్రతినిధులు, అధికారులు వీడ్కోలు పలికారు. కృష్ణాజిల్లాలో మూడురోజులపాటు ఇందిరమ్మ బాట కార్యక్రమాల్లో పాల్గొన్న సిఎం విజయవాడ నుండి రోడ్డు మార్గం గుండా 5.25 గంటలకు విమానాశ్రయంకు చేరుకున్నారు. కాన్వాయి నేరుగా గేటు నుండి రన్‌వే వైపు తీసుకువెళ్లి టెర్మినల్ భవనం వద్ద కాంగ్రెస్ నాయకులను కలుసుకుని అక్కడి నుండి నేరుగా ఎయిర్ ఇండియా విమానం వద్దకు చేరుకున్నారు. రాష్ట్ర మంత్రులు పితాని సత్యనారాయణ, కొలుసు పార్థసారథి, ప్రభుత్వ చీప్ విప్ పేర్ని నాని, విజయవాడ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, ఎమ్మెల్యేలు డివై దాసు, మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు, డిసిసి ఇన్‌చార్జి అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు, కాంగ్రెస్ నాయకులు కొలనుకొండ శివాజీ, వేల్పుల పరమేశ్వరరావు, తాంతియాకుమారి, తదితరులు కృష్ణాజిల్లా కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం. జ్యోతి, జాయింట్ కలెక్టర్ ఉషాకుమారి, సిపి మధుసూధన్‌రెడ్డి, జిల్లా ఎస్‌పి జయలక్ష్మి, ఈస్ట్‌జోన్ ఎసిపి రాఘవరావు వీడ్కోలు పలికారు.

అలరించిన చిన్నారుల కోలాటం
కూచిపూడి, సెప్టెంబర్ 27: విద్యార్థుల కోలాట భజన మొవ్వ గ్రామస్థులను అలరించింది. గ్రామంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రోత్సవాల ముగింపు సందర్భంగా గురువారం పమిడిముక్కల మండలం వీరంకిలాకులకు చెందిన సంతాన సాయిబాబా బాల మురళీ భక్త కోలాటం ఆధ్వర్యంలో సాయిశ్రీ పబ్లిక్ స్కూల్ విద్యార్థినీ విద్యార్థులు ఆడిన కోలాట భజన విశేషంగా ఆకర్షించింది. ఆకుల రవికుమార్, టి సౌజన్య, టి భవానీ ఈ కార్యక్రమానికి వనె్న తెచ్చారు. గురువు ముచ్చు వెంకటేశ్వరరావు, వీరంకి బసవ శంకరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి మండవ బాలాత్రిపుర సుందరి, తాతినేని శ్రీరామకుమారి తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులతో సరదా.. సరదాగా కిరణ్
హనుమాన్ జంక్షన్, సెప్టెంబర్ 27: బాపులపాడు మండలం వేలేరు గ్రామంలో బుధవారం అర్ధరాత్రి ముఖ్యమంత్రి పర్యటన విద్యార్థులకు సంతృప్తినిచ్చింది. సాయంత్రం 6.30గంటలకు ముఖ్యమంత్రి పర్యటన ఉండడంతో వేలేరు నవోదయ విద్యాలయ విద్యార్థులు, స్థానికంగా వున్న విద్యార్థులను సభకు తీసుకువచ్చారు. బుధవారం రాత్రి 11.55గంటలకు వచ్చిన సిఎం వేదికపైకి రాగానే విద్యార్థులను పలకరించారు. చాలా సమయం అయ్యింది, నిద్ర వస్తుందా అని ప్రశ్నించారు. ఇంతలో సభ ఎదురుగా వున్న జవహర్ నవోదయ విద్యార్థులతో పాట పాడండి అంటూ సైగలు చేశారు. సిఎం చెప్పిన తర్వాత తమకు అడ్డేంఎంటి అనుకున్నారో ఏమోతెలియదుగాని ఉత్సాహంగా చిందులు వేశారు. తొలుత డప్పువాయిద్యం, కోలాట ప్రదర్శన, పాటల గానం ఇలా గంటసేపు తమ గ్రాతంతోపాటు నృత్యప్రదర్శనతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. సమయం మించిపోవడంతో సభపై వున్న మంత్రులు, ఎమ్మెల్యేలు చాలు, అపండి అని విద్యార్థులకు తమవ్యక్తిగత భద్రత సిబ్బంది ద్వారా తెలియజేశారు. విద్యార్థులు ప్రదర్శన చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి వారిని నిశితంగా గమనిస్తూ, చప్పట్లు కొడుతూ ఉల్లాసంగా గడిపారు. సభ అనంతరం విద్యార్థులతో మీప్రదర్శన బాగుంది, మీకు క్రికెట్ కిట్ కావాలా అని ప్రశ్నించడంతో, విద్యార్థులు కావాలని సిఎంకు చెప్పారు. దీంతో ముందు చదువు తర్వాత అటలు అంటూ విద్యార్థులకు గుడ్‌నైట్ చెప్పి ముందుకుసాగారు.

కృష్ణాడెల్టాకు నీటి ఎద్దడిరానివ్వం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, సెప్టెంబర్ 27: కృష్ణాడెల్టాకు సాగునీటి సరఫరాలో ఎటువంటి అపోహలు పడవద్దని జలాశయాల్లో ఉన్న నీటిని ప్రణాళికాబద్ధంగా వినియోగించి అన్ని ప్రాంతాలకు సాగునీటిని అందించటం జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఒక్క ఎకరం కూడా ఎండకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇందిరమ్మబాటలో మూడోరోజైన గురువారం నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొని హైదరాబాద్‌కు తిరిగి వెళ్లేముందు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, వివిధశాఖల ఉన్నతాధికారులతో వివిధశాఖల పనితీరును ముఖ్యమంత్రి సమీక్షించారు. తొలుతగా ఇరిగేషన్ ప్రాజెక్టులు, డెల్టా ఆధునికీకరణ పనులు సమీక్షించారు. ఈ ఏడాది మేజర్ ఇరిగేషన్ కట్టడాలను చేపట్టడం జరిగిందని, ఇసుక సమస్యవలన నూరుశాతం లక్ష్యానికి చేరుకోలేకపోయారని అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిచేస్తేనే చాలదు. వాటి ద్వారా రైతుకు సాగునీరు అందించగలిగినప్పుడే లక్ష్యం నెరవేరుతుందన్నారు. భవిష్యత్‌లో ఇసుక సమస్య లేకుండా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. జిల్లాలో రెండు రీచ్‌లు నడుస్తున్నాయని, మరో ఏడు రీచ్‌లు రెండువారాల్లో ప్రారంభించడానికి తగినచర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని సమీక్షిస్తూ మండలాలవారీగా ప్రత్యేక అధికారులచే సమీక్ష నిర్వహించాలంటూ కలెక్టర్‌ను ఆదేశించారు. చెక్కు, మెజర్‌మెంట్, చెల్లింపులకు వారంలో ఒకరోజు నిర్ణయించి ఆ ప్రకారం అమలుపరచాలన్నారు. ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తూ జిల్లాలో సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి ఎన్ని రోజుల్లో ఆస్పత్రులకు మందులు అందుతున్నాయని ప్రశ్నించగా ఒక్కరోజులో అందజేయగలుగుతున్నామని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బాబూలాల్ చెప్పారు. విజయవాడలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి 70కోట్లు కేటాయిస్తున్నానంటూ సిఎం చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వ విడుదల చేసే నష్టపరిహారం రైతు అప్పు ఎకౌంట్‌కు కాకుండా రైతుకే చెందేలా ఇప్పటికే ఆదేశాలు జారీచేశామన్నారు. అయితే ఈ జిల్లాలో అలా జరగడం లేదని మంత్రి సారథి, పలువురు శాసనసభ్యులు ప్రస్తావించగా అలా జరగకుండా చూడాలని కలెక్టర్‌ను సిఎం ఆదేశించారు. వ్యవసాయానికి ఏడుగంటలు విద్యుత్ సరఫరా చేయాలంటూ వినియోగంలో సమతుల్యత సాధిస్తే పదిశాతం ఆదా చేయగలిగే స్థితికి చేరుకోగలుగుతామని ముఖ్యమంత్రి చెప్పారు. బందరులో ఓడరేవు నిర్మించి తీరుతామన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ పేదలకు జి+3 గృహ నిర్మాణానికి ఒక ప్రాజెక్టు రూపొందించాలని కోరగా విద్యార్థుల్లో మానవతా విలువలు పెంచి వారు శాంతిబాటలో పయనించేలా సిలబస్ ఏర్పాటుచేయాలని ఎమ్మెల్సీ చిగురుపాటి వరప్రసాద్ కోరారు. హైవేలో 60కిలోమీటర్లకు ఒక టోల్‌గేట్ ఏర్పాటుచేయాల్సి ఉండగా 35కిలోమీటర్లకే టోల్‌గేటును ఏర్పాటు చేస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని శ్రీరాం రాజగోపాల్ కోరారు. తమ తమ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ఇసుకను ప్రజలు వాడుకోటానికి అనుమతివ్వాలని తంగిరాల ప్రభాకరరావు కోరారు. విటిపిఎస్ నుంచి ఒక ఎత్తిపోతల పథకం మంజూరు చేయాలని దేవినేని ఉమ కోరగా కృష్ణాడెల్టాకు 20టిఎంసిల సాగునీరు విడుదల చేయాలని బందరు ఎంపి కొనకళ్ల నారాయణ కోరారు. ప్రస్తుతం 2టిఎంసిల నీరు విడుదల చేయాలని జోగి రమేష్ కోరారు. 2011-12 సంవత్సరానికి సంబంధించిన పంట నష్టపరిహారం ఇంకా మంజూరు కాలేదని డివై దాస్ అన్నారు. ముందుగా కలెక్టర్ డా. బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి ఎజెండా అంశాలను, అభివృద్ధి వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి మంత్రి తోట నరసింహం, మంత్రులు కె. పార్థసారథి, పితాని సత్యనారాయణ, ఎంపి లగడపాటి రాజగోపాల్, ప్రభుత్వ విప్ పేర్ని వెంకటరామయ్య, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్, యలమంచిలి రవి, ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజేంద్రపాల్, సాంఘిక సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమాండ్ పీటర్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సింగ్‌నగర్‌లో రద్దయిన సిఎం ఇందిరమ్మ బాట
అజిత్‌సింగ్‌నగర్, సెప్టెంబర్ 27: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్ రెడ్డి జిల్లాలో నిర్వహించిన ఇందిరమ్మ బాటలో భాగంగా గురువారం సింగ్‌నగర్‌లో నిర్వహించనున్న పర్యటన అర్ధాంతరంగా రద్దవడంతో నిర్వాహుకులతోపాటు లబ్ధిదారులు కూడా తీవ్ర నిరాశకుగురైనారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై విస్తృత ప్రచారంతోపాటు అర్హులైన లబ్ధిదారులకు ఆయా పథకాల ద్వారా లబ్ధి చేకూర్చేందుకు అంతా సిద్ధం చేసిన అధికార యంత్రాంగం చివరికి సిఎం కార్యక్రమానికి రావడం లేదన్న సమాచారం తెలుసుకుని హతాశులైనారు. రాజకీయ సమీకరణలు మారుతున్న ప్రస్తుత తరుణంలో ముఖ్యమంత్రి పర్యటనను ఆసరాగా చేసుకుని రాజకీయ లబ్ధి పొందాలని చూసిన స్థానిక రాజకీయ నాయకులకు కూడా నిరాశ తప్పలేదు. సిఎం రాక సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ వేలాది రూపాయల వ్యయంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ ఎత్తున ఫ్లెక్సీ బ్యానర్లను ఏర్పాట్లు చేసి తమ హవాను చాటుకున్నారు. ఇంత చేసినా సిఎం రాకపోయే సరికి తమ ఖర్చు అంతా బూడిదలో పోసిన పన్నీరేనంటూ నిరాశ నిస్పృహలతో వెనుదిరిగిపోవడం జరిగింది. పార్టీ నాయకుల సంగతి ఎలా ఉన్నా సభకు అగ్రతాంబూలమైన మహిళలకు నిరాశ తప్పలేదు. మహిళల స్వయం సహాయక సంఘాల వారితోపాటు ఇతర సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఆర్థిక రుణాల పంపిణీ కార్యక్రమంతోపాటు ముఖ్యమంత్రితో మహిళల ముఖాముఖి కార్యక్రమాన్ని కూడా ఈ సభలోనే ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నగరవ్యాప్తంగానే కాకుండా నగర రూరల్ గ్రామాల నుంచి కూడా గ్రూపు సంఘాలను నడిపించే సిబ్బంది కూడా భారీ ఎత్తున సభకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి భధ్రత ధృష్ణా నిర్ణీత సమయం కన్నా ముందుగానే మహిళలను తరలించుకుని వచ్చిన వీరికి కూడు, నీళ్ళు లేకుండానే గంటల తరబడి సభాస్థలిలో వేసిన కుర్చీలకే పరిమితం చేయడం గమనార్హం. ముఖ్యమంత్రిరాక సమాచారంపై కనీస అవగాహన లేకుండానే మహిళలను పెద్దఎత్తున తీసుకువచ్చి కుర్చీలకు అంకితం చేయడం పట్ల వారు పెద్దఎత్తున అసహనం వ్యక్తం చేశారు. సిఎం చేతులు మీదుగా రుణం పొందడమే కాకుండా వచ్చిన రుణంతో ఆర్థిక అవసరాలు తీర్చుకుందామని ఎంతో ఆశగా గంటల తరబడి ఎదురుచూసిన మహిళలకు సిఎం పర్యటన రద్దయిందంటూ వచ్చిన సమాచారం ఆశనిపాతమైంది. సిఎం సభపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మహిళలు చివరికి సభ రద్దవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కుర్చీలను చెల్లా చెదురుచేసి నిరసనగా సభావేదిక వద్ద కొద్ది సేపు ధర్నా నిర్వహించడంతో ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సభకు మొదటినుంచి చివరి వరకూ మహిళా గ్రూపు సభ్యులతోపాటు పార్టీ నాయకులు కొంత మంది తప్ప మిగిలిన ప్రజానీకం లేరనే చెప్పాలి. సిఎం సభకు జన సమీకరణ చేయడంలో ఇటు అధికార వర్గంతోపాటు పార్టీ నాయకులు కూడా విఫలమైనారనే చెప్పాలి నిజంగా ముఖ్యమంత్రి వస్తే జన సమీకరణపై అసహనం వ్యక్తం చేసేవారంటూ కొంతమంది అధికార బృందంతోపాటు పార్టీ నేతలే చెప్పుకున్నారు. సభా ప్రాంగణంలో వేసిన అతికొద్ది కుర్చీల్లో మూడో వంతు కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. ఒక్కొక్క కుర్చీలో రెండేసి కుర్చీలు వేసి మరీ కవర్ చేసినా తెచ్చిన కుర్చీలు కూడా చాలా మిగిలిపోయాయి. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి, ఈ స్టేడియానికి వచ్చిన సందర్భంలో స్టేడియం పరిసరాలతోపాటు ఈప్రాంతాల రహదారులు కూడా కిక్కిరిపోయిన సందర్భాలు జ్ఞప్తికి తెచ్చుకోనివారు లేరంటే అతిశయోక్తిగా ఉంటుంది. సిఎం రాక సందర్భంగా ఈప్రాంత సమస్యలతోపాటు ఇతర ప్రజాసమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్దామని భావించిన సిపిఎం నాయకులను సిఎం రాకముందే ముందస్తుగా వారిని అదుపులోకి తీసుకున్న సంఘటన మినహా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకపోవడంతో శాంతిభద్రతలను పర్యవేక్షించే పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలావుండగా సభావేదికపై ప్రదర్శించిన బుర్రకథ కథానిక మంచిగానే ఉన్నా ఒకపక్క గంటల తరబడి వేచి ఉండటం, మరోపక్క ఎంత సేపు వేచిచూసినా సిఎం రాకపోవడం అనే విషయంపై ఈ ప్రదర్శన వచ్చిన కొద్దిపాటి సభికులను చికాకు పుట్టించిందని విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం అమలుచేసే సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి ఏర్పాటు చేసిన ఈ బుర్రకథతో కాలక్షేపం చేయించినా ఫలితం లేకపోయింది. ముందుగా అనుకున్న విధంగా సభ జరగకపోవడంతో సభా నిర్వహణ కోసం వెచ్చించిన వేలాది రూపాయలు ప్రజా ధనంతోపాటు అధికారుల, నాయకుల శ్రమ వృథా అయినట్లయింది.

మున్సిపల్ కమిషనర్‌కు అరెస్టు వారెంట్
విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 27: కోర్టుకు హాజరుకానందున మున్సిపల్ కమిషనర్‌కు నాన్‌బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ అయింది. వివరాల్లోకి వెళితే నగరంలోని ఛిన్నాభిన్నమైన రహదారుల వల్ల ప్రజలు నానా యాతన పడుతున్నారని గతంలో శ్రీనివాసులు, ఎం ఆదినారాయణ అనే ఇద్దరు న్యాయవాదులు మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ముఖ్యంగా వన్‌టౌన్ ప్రాంతంలో 2006 నుంచి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిమిత్తం కాంట్రాక్టుకు ఇవ్వగా సదరు ఇష్టానుసారంగా తవ్వినందున గోతులమయం అయ్యాయని, ట్రాఫిక్ సజావుగా లేకపోవడంతో వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అదేవిధంగా తవ్విన గోతులు పూడ్చనందున వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని బెజవాడ బార్ అసోసియేషన్ పబ్లిక్ గ్రీవెన్స్ కమిటీ హోదాలోవారు దాఖలు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. భవానీపురం ఐరన్ యార్డు, టెన్నల్, ప్రైజర్‌పేట, ఓవర్ బ్రిడ్జి, ఎర్రకట్ట, గొల్లపూడి నుంచి సితార వెళ్ళే రోడ్డు తదితర మార్గాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. ఈ కేసులో మున్సిపల్ కమిషనర్, ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, ఉడా వైస్ చైర్మన్‌ను పార్టీలుగా చేర్చారు. కాగా సదరు అధికారులు గురువారం కోర్టుకు హాజరుకానందున మున్సిపల్ కమిషనర్, ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌లకు వారెంట్ జారీ చేసిన న్యాయమూర్తి కేసు విచారణ అక్టోబర్ 15కి వాయిదా వేశారు.
* కోర్టుకు హాజరైన పాలఫ్యాక్టరీ ఎండి
ఇదిలావుండగా విజయ డెయిరీ పాలఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ టి బాబూరావు మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు గురువారం హాజరయ్యారు. విజయపాలలో కల్తీ చోటు చేసుకుందని, దీని వల్ల ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లుతోందని సింగ్‌నగర్‌కు చెందిన న్యాయవాది ఇటీవల కోర్టులో కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. రైతుల నుంచి 50వేల లీటర్ల పాలు సేకరించి రెండు లక్షల లీటర్ల విక్రయాలు జరుపుతున్నారని, దీని వల్ల కల్తీ ఏర్పడుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కోర్టు ఆదేశాల మేరకు మేనేజింగ్ డైరెక్టర్ టి బాబూరావు, నగర పాలక సంస్థ తరఫున అధికారులు కోర్టుకు వచ్చి న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. అయితే కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ గైర్హాజరైనట్లు తెలిసింది. న్యాయమూర్తి అక్టోబర్ 29కి కేసు వాయిదా వేశారు.

భారతీయ కళలను ఆదరించాలి
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 27: భారతీయ సంప్రదాయాలు మర్చిపోయి పాశ్చాత్య సంప్రదాయాలను అలవర్చుకుంటున్నారని, భారత సంస్కృతిని విస్మరించటం అంటే మాతృమూర్తిని తిరస్కరించటంతో సమానమని ఆదరణ స్వచ్ఛంద సేవాసంస్థ చైర్మన్ కోసూరి వెంకటేష్ అన్నారు. మండలంలోని గుంటుపల్లి గ్రామం రైల్వే రోడ్డులోని వినాయక నవరాత్రుల సందర్భంగా గురువారం సాయినగర్ గణెశ్ ఉత్సవాల్లో చిన్నారులు భరత నాట్యం నిర్వహించారు.

ఫుట్‌బాల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో
ఫైనల్స్‌కు చేరుకున్న కృష్ణా జట్టు
విజయవాడ (స్పోర్ట్స్), సెప్టెంబర్ 27: కృష్ణా జిల్లా ఫుట్‌బాల్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని ఇందిరాగాంధీ నగర పాలక సంస్థ స్టేడియంలో జరుగుతున్న ప్రథమ రాష్టస్థ్రాయి అంతర్ జిల్లాల ఫుట్‌బాల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ పోటీలలో కృష్ణాజిల్లా జట్టు ఫైనల్స్‌కు చేరింది. సుమారు 19జిల్లాలకు చెందిన జట్టులు పాల్గొన్న ఈ పోటీలలో క్రీడాకారులు విజయం కోసం హోరాహోరిగా తలబడుతున్నారు. గురువారం జరిగిన పోటీలను ఫుట్‌బాల్ టెన్నిస్ కృష్ణాజిల్లా అధ్యక్షుడు కంభగళ్ళ రాజు లాంఛనంగా ప్రారంభించారు. ఈ పోటీల్లో పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్స్‌లో కృష్ణాజిల్లాకు చెందిన మణిబాబు 11-9, 11-1 స్కోరుతో నెల్లూరు క్రీడాకారుడు వెంకటేష్‌పై గెలుపొంది ఫైనల్స్‌కు చేరుకున్నాడు. అదేవిధంగా మెదక్ క్రీడాకారుడు ఎస్‌ఎ తాఖీర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. పురుషుల డబుల్స్‌లో కృష్ణా క్రీడాకారులు మణిబాబు, రజాక్‌లు, కర్నూలుకు చెందిన అశోక్, రమేష్‌లు ఫైనల్స్‌కు చేరుకున్నారు. ట్రిపుల్స్ విభాగంలో తూర్పు గోదావరి, కర్నూలు జట్లు ఫైనల్స్ చేరుకున్నారు. మహిళల విభాగంలో ట్రిపుల్స్ విభాగంలో నెల్లూరు గుంటూరు జిల్లా జట్లు ఫైనల్స్‌కు చేరుకున్నాయి. సింగిల్స్‌లో నెల్లూరుకు చెందిన ప్రవల్లిక ఫైనల్స్‌కు చేరుకుంది. బుధవారం ప్రారంభమైన ఈ పోటీలు శుక్రవారంతో ముగియనున్నాయి. ముగింపు కార్యక్రమంలో విజేతలైన క్రీడాకారులకు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్ మీదుగా బహుమతి ప్రదానం జరుగుతుందని కృష్ణా జిల్లా ఫుట్‌బాల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు కంబగళ్ళ రాజు పేర్కొన్నారు.

* జిల్లావాసులకు అభిమానపాత్రుడు సీనియర్ పిన్నమనేని * జిల్లా రాజకీయాల్ని శాసించిన నేత * రాజకీయ కురువృద్ధుడి కన్నుమూతపై నేతల దిగ్భ్రాంతి
english title: 
ch

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>