నందిగామ, అక్టోబర్ 10: టిడిపి అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న పాదయాత్రకు ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తోందని జిల్లా పార్టీ అధ్యక్షుడు మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ చంద్రబాబుకు ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక సిబిఐ కేసులో ఇరికించేందుకు వైఎస్‌ఆర్ సిపి అసత్య కథనాలు, ఆరోపణలు చేస్తోందన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి చైతన్యపరిచేందుకు పార్టీ నేతలు ఈ నెలాఖరు నుండి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు, ఇంటింటి ప్రచారం నిర్వహించబోతున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు చిరుమామిళ్ల శ్రీనివాసరావు, ఎస్‌సి సెల్ జిల్లా అధ్యక్షుడు కనె్నకంటి జీవరత్నం, నాయకులు అయ్యదేవర కన్నబాబు, కొండూరు వెంకట్రావు, వడ్డెల్లి సాంబశివరావు, పులవర్తి నర్శింహరావు, ఓర్సు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
రాజకీయాల్లో ధృవతార ‘పిన్నమనేని’:బాడిగ
మచిలీపట్నం టౌన్, అక్టోబర్ 10: జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పిన్నమనేని కోటేశ్వరరావు రాజకీయాల్లో ధ్రువతార అని బందరు పార్లమెంట్ మాజీ సభ్యులు బాడిగ రామకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాప్రతినిధిగా విద్యా రంగానికి, పరిశ్రమల అభివృద్ధి పెద్దపీట వేశారన్నారు. డ్రైఃనేజీ వ్యవస్థ క్రమబద్దీకరణకు విశేష కృషి సల్పారన్నారు. జిల్లా అభివృద్ధికి అహర్నిశలు శ్రమించిన పిన్నమనేని మృతి జిల్లాకు తీరని లోటన్నారు. అంకిత భావం, చిత్తశుద్ధి కలిగిన మొదటి తరం నేతల్లో పిన్నమనేని ఆఖరి వారన్నారు.
వైఎస్‌ఆర్ సిపి ఆధ్వర్యంలో రాస్తారోకో
మోపిదేవి, అక్టోబర్ 10: మండల పరిధిలోని పెదప్రోలు శివారు కాసానగరం గ్రామం వద్ద జాతీయ రహదారి మలుపు వద్ద వైఎస్‌ఆర్ సిపి ఆధ్వర్యంలో బుధవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ అవనిగడ్డ నియోజకవర్గం నాయకులు గుడివాక శివరావు, మండల కన్వీనర్ అర్జా నరేంద్ర కుమార్ నాయకత్వంలో రాస్తారోకో నిర్వహించారు. మలుపువద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, జంగిల్ క్లీరెన్స్ నిర్వహించాలని, రోడ్డు డివైడర్లు ఏర్పాటు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పఠాన్ కరిముల్లాఖాన్, స్థానిక నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
వ్యక్తి అనుమానాస్పద మృతి
తిరువూరు, అక్టోబర్ 10: తిరువూరు ఆర్‌టిసి బస్టాండ్ వెనుక వీధిలోని ఒక ఇంట్లో షేక్ ఇబ్రహీం (47) అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండగా బుధవారం కనుగొన్నారు. ఎస్‌ఐ వెంకటేశ్వరరావు కథనం ప్రకారం... రాజుపేటకు చెందిన ఇతను లక్ష్మి అనే మహిళ ఇంట్లో మృతిచెంది ఉన్నాడు. ఇతను మరణించి మూడు రోజులై ఉండవచ్చని చెప్పారు. మృతునికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు. సిఐ ఎస్‌వివిఎస్ మూర్తి ఘటన స్థలాన్ని పరిశీలించారు.
క్రిస్టియన్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం
గూడూరు, అక్టోబర్ 10: అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశాన్ని బుధవారం మండల పరిధిలోని జక్కంచర్ల గ్రామంలో నిర్వహించారు. మండల అధ్యక్షులు, పాష్టర్ రాజేశ్వరరావు గారి చర్చిలో నిర్వహించిన ఈ సమావేశంలో అన్ని మండలాల అధ్యక్షులు, ఉపాధ్యాక్షులు, కమిటీ నాయకులు పాల్గొన్నారు. క్రైస్తవులు పొందాల్సిన రాయితీలు, చర్చి నిర్మాణం, క్రిస్టియన్ మైనార్టీ ద్వారా సబ్సిడీ రుణాలు, సామూహిక వివాహాలు తదితర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
విశాఖపట్నం....
ప్రధానిని కలిసిన స్టీల్ బృందం
* పరిస్థితిని వివరించిన పురంధ్రీశ్వరి
* నేడు మళ్లీ సమ్మె నోటీసు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, అక్టోబర్ 10: స్టీల్ ప్లాంట్‌లో షేర్ల విక్రయాన్ని నిరసిస్తూ, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు చెందిన వివిధ యూనియన్ నాయకులు గత రెండు రోజులుగా ఢిల్లీలోని పలువురు మంత్రులు, అధికారులను కలిశారు. బుధవారం కేంద్ర మంత్రి పురంధ్రీశ్వరి నేతృత్వంలో ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిసి, స్టీల్ ప్లాంట్ పరిస్థితిని వివరించారు. అత్యధిక లాభాలతో నడుస్తున్న ఈకంపెనీలో షేర్లను విక్రయించడం అంత మంచిది కాదని చెప్పారు. ఒకప్పుడు బాగా నడిచిన హిందుస్థాన్ జింక్‌లో కూడా షేర్లు విక్రయించడం వలన ఇప్పుడు అది పూర్తిగా ప్రైవేటుపరం అయిపోయిందని వారు ప్రధానికి వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ షేర్ల విక్రయం విషయంలో ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. ఇదిలా ఉండగా ఈనెల 12, 13 తేదీల్లో ప్లాంట్ సమ్మెకు యూనియన్‌లు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే షేర్ల విక్రయం తాత్కాలికంగా వాయిదా పడిన నేపథ్యంలో సమ్మెను కూడా వాయిదా వేసుకున్నట్టు గుర్తింపు యూనియన్ నాయకుడు ఆదినారాయణ తెలియచేశారు. మళ్లీ షేర్ల విక్రయానికి ప్రభుత్వం ఎప్పుడు తేదీని ప్రకటిస్తుందో, దానికి ముందు రెండు రోజులు స్టీల్ ప్లాంట్ సమ్మె చేస్తామని ఆయన తెలియచేశారు. దీనికి సంబంధించి సమ్మె నోటీసును గురువారం స్టీల్ యాజమాన్యానికి అందచేయనున్నట్టు ఆదినారాయణ ‘ఆంధ్రభూమి’కి తెలియచేశారు.
మంచినీటి ఎద్దడి నివారణకు చర్యలు
* కలెక్టర్ శేషాద్రి
పాడేరు(రూరల్), అక్టోబర్ 10: గిరిజన గ్రామాలలో నెలకొన్న మంచినీటి ఎద్దడిని నివారించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వి.శేషాద్రి చెప్పారు. మండలం ఎర్రగుప్ప, చింతగొంది, దాలింపుట్టు, ఉబ్బిడిపుట్టు గ్రామాల్లో ఆయన బుధవారం పర్యటించి గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలసుకున్నారు. ఈ సందర్భంగా అన్ని గ్రామాల గిరిజనులు తాగునీటి కోసం తాము పడుతున్న కష్టాలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన ఆయన గ్రామాల్లో నీటి సదుపాయానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని, ఇందుకు అవసరమైన అంచనాలను రూపొందించాలని ఆర్.డబ్ల్యు.ఎస్. అధికారులను ఆయన ఆదేశించారు. ఎర్రగుప్ప గ్రామంలో గిరిజనులు పండిస్తున్న కాఫీని ఆయన పరిశీలించి దీనివలన కలుగుతున్న ఆర్థిక ప్రయోజనాలు, హెక్టారు కాఫీకి లభిస్తున్న ఆదాయం, కాఫీ విక్రయ సదుపాయాల అంశాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. తమకు కాఫీ పల్పింగ్ యూనిట్లు మంజూరు చేయాలని రైతులు కోరడంతో పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కలెక్టర్ పర్యటించిన గ్రామాలలో పాఠశాలల పనితీరు, ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బంది విధుల నిర్వహణ, ప్రభుత్వ పథకాలు అమలు జరుగుతున్న తీరు అంశాలను గిరిజనులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక కేంద్రీకృత ఆశ్రమ పాఠశాలను ఆయన తనిఖీ చేసి వంటసాలను పరిశీలించారు. విద్యార్థులకు అప్పుడే పెడుతున్న భోజనాలను కలెక్టర్ శేషాద్రి నిశితంగా పరిశీలించి మెనూ అమలు జరుగుతున్న తీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి కె.శ్రీకాంత్ ప్రభాకర్, ఆర్.డి.ఒ. ఎం.గణపతిరావు, గిరిజన సంక్షేమ శాఖ డి.డి. బి.మల్లిఖార్జునరెడ్డి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఏజెన్సీ డి.ఇ.ఒ. సస్పెన్షన్
పాడేరు, అక్టోబర్ 10: విద్యా వ్యవస్థపై సరైన అవగాహన లేకుండా నిర్లక్ష్యంగా విధులను నిర్వహిస్తున్న ఏజెన్సీ డి.ఇ.ఒ. అహ్మాద్ ఆలీఖాన్‌ను కలెక్టర్ వి.శేషాద్రి సస్పెండ్ చేశారు. స్థానిక ఐ.టి.డి.ఎ. కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో బుధవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో ఏజెన్సీలో విద్యా వ్యవస్థపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఏజెన్సీలో మధ్యలోనే బడి మానివేసిన విద్యార్థులు ఎంతమంది ఉన్నారంటూ ఏజెన్సీ డి.ఇ.ఒ.ను ప్రశ్నించడంతో దాదాపు ఐదు వేల మంది డ్రాపౌట్ విద్యార్థులు ఉన్నట్టు వివరించారు. అయితే డ్రాపౌట్ విద్యార్థులను ఏం చేశారంటూ మళ్లీ కలెక్టర్ ప్రశ్నించడంతో వీరిని శాటిలైట్ పాఠశాలల్లో చేర్పించామని చెప్పారు. శాటిలైట్ పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యావలంటీర్లకు వేతనాలు చెల్లించారా? లేదా? ఎప్పటి నుంచి వీరికి వేతనాలు ఇవ్వాలి అనే అంశాలను డి.ఇ.ఒ.ను అడగడంతో జూన్, జూలై, ఆగస్టు నెలల వేతనాలు వీరికి చెల్లించాల్సి ఉందని సమాధానం చెప్పడంతో కలెక్టర్ ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీలో శాటిలైట్ పాఠశాలలు ప్రారంభించి నెలరోజులే అవుతుండగా, ఇందులో పనిచేసే వలంటీర్లకు జూన్ నెల నుంచి వేతనాలు చెల్లించడమేమిటని ఆయనను నిలదీశారు. అప్పటికి కూడా ఏజెన్సీ డి.ఇ.ఒ. తన తప్పిదాన్ని గమనించకుండా జూన్ నుంచి శాటిలైట్ పాఠశాలల వలంటీర్లకు వేతనాలు చెల్లించాలని కలెక్టర్‌తో చెప్పడంతో శేషాద్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థపై కనీస అవగాహన కూడా లేకుండా ఏవిధంగా పనిచేస్తున్నారని, ఏం మాట్లాడుతున్నావు, ఏం వింటున్నావంటూ ఆయనపై మండిపడ్డారు. సమావేశ మందిరం నుంచి బయటకు వెళ్లిపోవల్సిందిగా ఆలీ ఆహ్మద్‌ఖాన్‌ను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో సమావేశ మందిరం నుంచి బయటకు వెళ్లిన ఏజెన్సీ డి.ఇ.ఒ.ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి శ్రీకాంత్ ప్రభాకర్‌ను ఆదేశించారు. ఏజెన్సీ డి.ఇ.ఒ. సస్పెన్షన్‌కు దారితీసిన పరిస్థితులు సమావేశంలో ఉన్న మిగిలిన అధికారులను కంగుతినిపించింది.
ఒప్పందాల అమలుకు
పర్యాటక కార్మికుల సమ్మె
అరకులోయ, అక్టోబర్ 10: ఏజెన్సీలో పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న ఐదు యూనిట్లలో పనిచేస్తున్న సుమారు 350 మంది కార్మికులు బుధవారం నుంచి నిరవదిక సమ్మెను చేపట్టారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను పర్యాటక శాఖ అధికారులు అమలు చేయకపోవడంతో వారు విధులను బహిష్కరించి సమ్మెబాట పట్టారు. ఈమేరకు పర్యాటక అభివృద్ధి సంస్థ అతిధి గృహాల ముఖద్వారాల వద్ద దీక్ష శిబిరాన్ని ఏర్పాటుచేసి సమ్మెలో పాల్గొన్నారు. తైడా జంగిల్ బెల్, బొర్రా గుహలు, అనంతగిరి, అరకులోయ యూనిట్ల సిబ్బంది సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెను చేపడుతున్నారు. పర్యాటక అభివృద్ధి సంస్థ కోట్లాది రూపాయలు ఆర్జిస్తూ కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతుందని వారు వాపోయారు. తమ సమస్యలు పరిష్కరించడానికి 2010వ సంవత్సరంలో చేసిన ఒప్పందాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఒప్పందాన్ని అమలు చేయకపోవడం వలనే సమ్మె చేపట్టాలని తీర్మానించినట్టు వారు పే ర్కొన్నారు. పర్యాటక, కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, బొ ర్రాగుహల కార్మికులకు ప్రమాద అలవె న్స్ చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పదవీ విరమణ చేసిన వారిని విధులలోకి తీసుకోరాదని, రూల్ ఆఫ్ రి జర్వేషన్ అమలు చేస్తూ అర్హులైన గిరిజనులకు పదోన్నతి కల్పించాలని, పర్యాటక యూనిట్ల సేవలను ప్రైవేట్‌పరం చేయరాదని, మృతి చెందిన కార్మికుల కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, మెన్‌పవర్ సొసైటీని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప ర్యాటక గిరిజన ఉద్యోగ, కాంట్రాక్టు కార్మికుల సమ్మెతో ప్రసిద్ధ సందర్శిత ప్రాంతాలు మూతపడ్డాయి. బొర్రా గు హలు సమ్మెతో మూతపడడంతో వందలాది మంది పర్యాటకులు నిరాశతో వెనుదిరిగారు. అరకులోయ సందర్శనకు వచ్చి పర్యాటక అతిధి గృహాలలో బస చేసే యాత్రికులను ఆందోళనకారులు అడ్డుకుంటున్నారు. దీంతో వేలీ, హరిత, మయూరి, పున్నమి తదితర రిసార్ట్స్‌లలో పర్యాటకులు లేక వెలవెలబోతున్నాయి. కార్యక్రమంలో పర్యాటక కాంట్రాక్టు, మెన్‌పవర్, దినస రి వేతన కార్మికుల సంఘం నాయకులు గంగరాజు, అంజలిరావు, బి.బి.జాన్, ధర్మ, సిటు నాయకుడు వి.ఉమామహేశ్వరరావు, పొద్దు బాలదేవ్ పాల్గొన్నారు.
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో
12 మందు పాతరలు స్వాధీనం
సీలేరు, అక్టోబర్ 10: ఆంధ్రా- ఒడిశా సరిహద్దు అంతర్‌రాష్ట్ర రహదారిలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర్ల డంప్‌ను విశాఖ జిల్లా సీలేరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీజి శ్రీనివాస్ బుధవారం సీలేరు పోలీస్ స్టేషన్‌లో విలేఖరులకు తెలిపిన వివరాల మేరకు.. సరిహద్దుల్లోని గూడెంకొత్తవీధి మండలం దుప్పిలవాడ పంచాయతీ పరిధిలో పిల్లిగెడ్డ, కాట్రగెడ్డ మధ్యగల అటవీ ప్రాంతంలో ప్రధాన రహదారిపై మావోయిస్టులు మందుపాతర్లు అమర్చినట్లు సీలేరు పోలీసులకు ముందస్తు సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీలేరు ఎస్సై కె శ్రీనివాస్, సిఆర్‌పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ రాజన్న పోలీసు బలగాలతో ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించి రహదారి సమీప పొదల్లో మావోయిస్టులు అమర్చిన 12 మందుపాతర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 12 స్టీల్ క్యారియర్లలో అమర్చిన ఈ మందుపాతరలు ఒక్కొక్కటి కిలో నుండి రెండు కిలోల వరకు ఉంటుంది. ఈ ప్రాంతంలో తిరిగే పోలీసు బలగాలను తుదముట్టించేందుకు వీటిని అమర్చారని, వీటిని పోలీస్ సిబ్బంది గుర్తించి వెలికి తీశారని ఎస్పీ తెలిపారు. అటవీ ప్రాంతంలో దొరికిన మందుపాతర్లపై సీలేరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసామన్నారు. మందుపాతర్లు అమర్చేందుకు సహకరించిన వారిని విడిచిపెట్టేది లేదన్నారు.