ఆ మధ్య దూరదర్శన్‌లో వార్తలు చూస్తుంటే ఒక రాజకీయ పార్టీ ఇరకాటంలో పడ్డ సంగతి గురించి వార్త వస్తోంది. స్క్రోలింగ్‌లో ‘ఆడకత్తెరలో పార్టీ’ అని వస్తోంది. అక్షరదోషం అని సరిపెట్టుకున్నాను. ‘ఆడకత్తెర అంటే ఏమిటి నాన్నా’? అని ప్రశ్నించాడు మా చిన్నబ్బాయి. ‘ప్రతిదాన్నీ ప్రశ్నించడం నేర్చుకోవాలి’ అని నేను వాడికి బోధించిన ఫలితం అది. ‘ఆడకత్తెర’ కాదురా అది ‘అడకత్తెర’. దీనే్న ‘అడకత్తు’ అని కూడా అంటారు. అడ అంటే మనం తాంబూలంలో వేసుకునే వక్క. దీనికే పోక, పోఢము, వీతి, సిగినాలు, చికినము, చికిని, పూగము అనే రకరకాల పేర్లున్నాయి. కానీ వీటిలో చాలావరకు వాడుకలో లేవు. అడకత్తెర అంటే ‘పోకచెక్కలను ముక్కలు చేసేది’ అని అర్థం.దీన్ని ఇంగ్లీషులో nut cracker అంటారు అన్నాను వాడి ఇంగ్లీషు మీడియం చదువు గుర్తొచ్చి. ‘అడకత్తెరలో పడ్డ పోక చెక్క’ ఎటూ కదల్లేదు. కచ్చితంగా ముక్కలు కావలసిందే! ఎటూ నిర్ణయం తీసుకోలేక సంకట పరిస్థితిలో ఉన్నవారి గురించి చెప్పే సందర్భంలో ఈ మాట వాడుతూ వుంటారు. నువ్వు చూసిన వార్తకు అర్థం అదే!’’ అని వివరించాను. కాసేపు ఆలోచిస్తే తెలుగు భాషలో ఇలాంటి ప్రయోగాలు చాలా ఉన్నాయని తోచింది. భాషాకోవిదులనూ, రచనా వ్యాసంగంలో ఉన్నవారినీ మినహాయిస్తే నేటి తరానికి ఇటువంటి పదాలు అర్థం కావడంలేదు. వివిధ సందర్భాలలో భాషలో ఏర్పడిన పదబంధాలు వాడుకలో కొనసాగుతున్నాయి. వాటి అర్థాలు మరుగున పడిపోతున్నాయి. వాటిలో కొన్నింటినైనా వివరించడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం.
ప్రసార మాధ్యమాలలో చాలా తరచుగా వినవచ్చే మాట ‘ఆదిలోనే హంసపాదు’. ఏదైనా పనిని ప్రారంభించినపుడు వెంటనే విఘాతం కలిగితే ఈ మాటను ప్రయోగిస్తారు. అసలు దీన్ని ‘ఆదిలోనే హంసపాదం’ అనాలి. దేన్నైనా రాసే సందర్భంలో వాక్యం మధ్యలో ఒక అక్షరాన్నో పదాన్నో మర్చిపోయామనుకోండి. దాన్ని రాయవలసిన చోటకింద "x'’ గుర్తుపెట్టి పైన ఆ పదాన్నో అక్షరాన్నో రాస్తూ ఉంటాం. ఈ గుర్తునే ‘హంసపాదం’ అనేవారు. ఇలాగే ఇంగ్లీషులో కూడా ఉంది. దాన్ని కేరెట్(caret)) అంటారు. దాని చిహ్నం హంస జాతికి చెందిన పక్షుల పాదాలు ఈ ఆకారంలో ఉంటాయనే భావంతో మనవాళ్ళు దీన్ని హంసపాదంతో పోల్చారేమో! సి.పి.బ్రౌన్ కేరెట్‌కి హంసపాది, హంసపాదము అనే రెండు తెలుగు పదాలను సూచించాడు. ఇది పరిణామక్రమంలో "x' గుర్తుగా మారింది. పూర్వం ఈ మాట పత్రికలలోనో, రాసే సందర్భాలలోనో ప్రయోగించేవారు. కాలక్రమేణా ప్రారంభించిన ఏ పనికి ఆటంకం ఎదురైనా దీన్ని వాడటం అలవాటుగా మారింది.
చాలా కాలం కిందటి మాట. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శివరామ కారంత ప్రముఖ కన్నడ రచయిత. ఆయన బ్రహ్మచారి. ఆయన మరణించిన సందర్భంగా ఓ తెలుగు దినపత్రిక సంతాప వార్తను ప్రచురించింది. ఆయన జీవిత విశేషాలు గురించి వివరిస్తూ ‘ఆయన ఘోటక బ్రహ్మచారి’ అని రాశారు. బహుశా ఈ మాటను పత్రికలవారు ప్రశంసగా భావించి ‘నియమ బద్ధుడైన బ్రహ్మచారి’ అనే అర్థంలో ప్రయోగించి ఉంటారు. కానీ అది అవమానకరమైన మాట అని వారికి తోచలేదు. ఘోటకం అంటే మగ గుర్రం. దాని బ్రహ్మచర్యం ఆడ గుర్రం కనిపించేంతవరకే ఉంటుంది. ఆడగుర్రం కనిపించిన వెంటనే మగ గుర్రంలో కామ వికారాలన్నీ మొదలవుతాయి. ఆ లక్షణాలు భౌతికంగా కనిపిస్తాయి కూడా. అందుకే బ్రహ్మచారినని చెప్పుకుంటూ స్ర్తి కనిపించిన వెంటనే హావభావాలు మార్చుకుని లైంగిక వాంఛా లక్షణాలతో ప్రవర్తించేవారి గురించి ఈ మాట వాడేవారట. కాబట్టి ఘోటక బ్రహ్మచారి అనే మాట గౌరవాన్ని కాదు అవహేళననే తెలియజేస్తుంది. సి.పి.బ్రౌన్ కూడా ‘ఘోటక బ్రహ్మచారి’ అనే మాటకి ‘బలవంతపు బ్రహ్మచర్యం’ అనే అర్థం వచ్చే chastity perforce అనే ఇంగ్లీషు మాటను సూచించాడు.
పత్రికలలో ఫలానా వ్యక్తిది ‘ఒంటెద్దు పోకడ’ అనే ప్రయోగం కనిపిస్తోంది. ఒంటరి ఎద్దు తన ఇచ్ఛానుసారం నడుస్తుందని భావించి అలా ప్రవర్తించేవారి గురించి ఈమాటను ప్రయోగించి ఉండవచ్చు. కానీ ఇది ‘ఒంటెత్తు పోకడ’ ఒంటరి, స్వార్థపరుడు అని దీనికి అర్థాలున్నాయి. సి.పి.బ్రౌన్ ‘అహంకారి’ తెలుగు పదాన్నీ head strong అని ఇంగ్లీషు ఫదాన్నీ ఇచ్చాడు దీనికి.
వేసవికాలం వచ్చిందంటే మనకు బాగా వినవచ్చే మాట ‘చలివేంద్రం’. దీనికి చలివిందల, చలివెందర, చలివేంద్ర, చలివేందల అనే పర్యాయ పదాలున్నాయి కానీ అనేవీ వాడుకలో కనిపించవు. మండు వేసవిలో దాహార్తులైన బాటసారులకోసం రోడ్డు పక్క చిన్న పందిరి వేసి పెద్ద పెద్ద బానలతో మంచి నీరు పెడుతుంటారు. ఇదే మనకి తెలిసిన చలివేంద్రం. పూర్వం ప్రయాణీకులకు పాలను కానీ, పాల విరుడుగు తేటను కానీ సరఫరా చేసే విశ్రాంతి స్థలాన్ని (A halting place for travellers where they are supplied gratis with milk and whey) ఛలివేంద్రం అనేవారని బ్రౌన్ నిఘంటువు తెలియజేస్తోంది. ఇదిలా ఉంటే శబ్ద రత్నాకరంలో ‘చలిపందిరి’ అనే మాట ఇచ్చి దాహానికి నీళ్ళు పోసే చోటు అనే అర్థం ఇచ్చారు.
ఎవరికైనా బాధ్యతలూ, చీకూ చింతా లేవని చెప్పడానికి ‘అతనికి ఏ బాదర బందీ లేదు’ అంటూ ఉంటారు. దీని అసలు రూపం బారాబందీ అని సురవరం ప్రతాపరెడ్డిగారన్నారు. మన పూర్వీకులు ఆరు చోట్ల బొందులను ముడివేసిన అంగీలను తొడుక్కునేవారట. అవే బారా బందీలు. అది అపభ్రంశమై బాదరబందీ అయింది. బాదర అనే పదానికి తాడు అనే అర్థం ఉంది. బహుశా ఏ బొందులూ కట్టుకోవలసిన శ్రమ లేని అంగీ వాడుకలోకి వచ్చాక ఈ మాట అలవాటై చీకూ చింతా లేని పరిస్థితికి కూడా దీన్ని వాడటం అలవాటుగా మారి ఉండొచ్చని ఊహించాల్సి వస్తోంది. కానీ బారాబందీలో బారా అంటే మాటకి హిందీలో పనె్నండు అనే అర్థం ఉంది. ఆ కోణంలో ఆలోచిస్తే ‘బాదరబందీ’ అనే మాటకు పూర్వాపరాలు తెలియాలంటే మరింత పరిశోధన అవసరం అనిపిస్తోంది.
బాధ్యత లేకుండా స్వేచ్ఛగా విశృంఖలంగా తిరిగేవారిని ‘పైలాపచ్చీసు’గా తిరుగుతున్నాడని అంటారు. ‘పచ్చీసు’ అనేది తెలంగాణా ప్రాంతంలో కనిపించే ‘పాచికల ఆట’ అని తెలుస్తోంది. వైదిక బ్రాహ్మణేతరులు పాచికలకు బదులు ఆరు కాని ఏడు కాని గవ్వలు ఉపయోగించి 25 గళ్ళు గీసుకుని ఈ ఆట ఆడేవారని చరిత్ర పరిశోధకుల అభిప్రాయం. పైలా పచ్చీసు అంటే ‘పందెపు పావు మొదటి గెలుపు’ అని నిఘంటువులు సూచిస్తున్నాయి.
గవ్వట అనే మాట వచ్చింది కాబట్టి ఈ సందర్భంలోనే గవ్వల గురించి చెప్పుకోవటం సందర్భోచితంగా ఉంటుందేమో! ఎవరి దగ్గరైనా డబ్బులు అసలు లేవు అని చెప్పడానికి ‘చేతిలో చిల్లిగవ్వ లేదు’ అంటూ ఉంటారు. ‘‘..గుడ్డి గవ్వకు కొరగాడు...’’ అని ఓ శతక కవి కూడా ప్రయోగించాడు. అంటే పూర్వం గవ్వలు ద్రవ్యంగా చలామణీ అయ్యేవని తెలుస్తోంది. గవ్వ ‘ఆఫ్రికా దక్షిణ ఆసియా దేశాలలో ద్రవ్యంగా ఒకప్పుడు వాడుకలో ఉండేది’ అని తెలుగు అకాడమీ వారి నిఘంటువు సూచిస్తోంది. సి.పి.బ్రౌన్ కూడా గవ్వ అంటే "A cowry or small shell used as money' అని అర్థం చెప్పాడు. ఇంతకీ గవ్వకి ద్రవ్యంలో ఉండే విలువ ఎంతో తెలుసా! రూపాయి మారిస్తే 768 గవ్వలు వచ్చేవట.
హిందువుల్లో వరాలు, వరహాలు అనే పేర్లు వినబడుతూ ఉంటాయి. పూర్వం దసరా పండుగ వస్తే బడిపిల్లలు ‘‘అయ్యవారికి చాలు ఐదు వరహాలు, పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు...’’ అని పాడేవారు. ఈనాటి వారిలో చాలామందికి ‘వరహా’ అంటే తెలియదు. ఇది ఒక నాణెం పేరు. విజయనగర రాజుల కాలంలో కొన్ని లోహాల నాణాలను పోతపోసిన తర్వాత వాటిపై ‘వరాహం’ చిత్రాన్ని ముద్రించేవారు. దానే్న వరహా అనిపిలిచేవారు. ఆనాడు చలామణీలో ఉన్న నాణాలలో అన్నిటికంటే పెద్దది వరహా. రామదాసు కీర్తనల్లో ‘‘సీతమ్మకు చేయిస్తే చింతాకు పతకము... ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు...’’ అని వరహా పదం కనిపిస్తోంది. మహమ్మదీయులు వరహాన్ని అసహ్యించుకుంటారు. రామదాసు మహమ్మదీయుల పాలనలో ఉన్న సామంతుడే కదా! మరి వరాహం ముద్ర ఉన్న వరహాని ద్రవ్యంగా వారెలా ఉపయోగించారో పరిశోధనలో తెలియాలి.
ఎదుటివారికి ప్రతిఫలంగా ఏదైనా ముట్టచెబుతాము అనే అర్థంలో ‘తృణమో పణమో సమర్పించుకుంటాం’ అంటూ ఉంటారు. ‘తృణము’ అంటే ఏ తృణధాన్యమో కావచ్చు అని అర్థం చెప్పుకోవచ్చు. మరి పణము మాటేమిటి? ‘పణము’ అంటే రాగి నాణెం పేరు. హిందీలో కూడా ‘పణ్’ అంటే ‘రాగినాణెం’ అనే అర్థం ఉంది.
అర్థం తెలియక వాడుతున్నారో, అలవాటును మానుకోలేక వాడుతున్నారో తెలియదు గానీ కొన్ని సంప్రదాయ కుటుంబాల్లో చిన్నపిల్లల్ని ‘దొంగబడవా’ అని ముద్దుగా తిడుతూ ఉంటారు. పాపం వారికి తెలియదు బడవా అంటే ‘ముండలను తార్చేవాడు’, ‘లుచ్ఛా’ అనే అర్థాలున్నాయని. ఇంగ్లీషులో దీనికి సమానమైన మాట pimps అని నిఘంటువులు సూచిస్తున్నాయి.
తిరునాళ్ళకు వెళ్ళొచ్చిన మా చిన్నబ్బాయి ‘నేను రంగుల రాట్నం ఎక్కానోచ్’ అన్నాడు నా ఏకాంతాన్ని భంగం చేస్తూ. అది రంగులరాట్నం కాదు నాన్నా ‘రంకుల రాట్నం’ అన్నాను. ‘‘్ఛ! రంకులరాట్నం ఏమిటీ అసహ్యంగా. అది రంగుల రాట్నమే. ఏదో పాత సినిమాలో ‘‘కలిమి మిగలదు లేమి నిలవదు.. అనే పాటలో ఇంతేరా ఈ జీవితం, తిరిగే రంగుల రాట్నమూ.. అన్నాడు ఘంటశాల’’ అంది నా శ్రీమతి తన సినిమా పరిజ్ఞానాన్నంతా ప్రదర్శిస్తూ. వివరించక తప్పలేదు నాకు. రంకు అంటే తిరుగుట అని అర్థం. దీన్ని ప్రాతిపదికగా చేసుకుని విచ్చలవిడిగా ప్రవర్తించేవారిని సంబోధించే (ఉదా: రంకులాడి ) నిందార్థక పదాలు ఏర్పడ్డాయి. కాబట్టి తిరుగుతూ ఉండే రాట్నం కాబట్టి ‘రంకులరాట్నమే’ సరైన పదం. నిఘంటువులు దీనే్న తెలియజేస్తున్నాయి. ఇంగ్లీషులో దీన్ని merry - go- round, round about, caro usel అనే ఫేర్లతో పిలుస్తారు.
జన వ్యవహారంలో ‘రంగుల రాట్నం’ వంటి పదాలు స్థిరపడిపోయాయి. వాటిని మాన్పించి ‘రంకుల రాట్నం’ వంటి పదాలను అలవాటు చేయలేం. కేవలం మనం వాడుతున్న మాటల మూలాలను తెలుసుకోవడానికే ఇలాంటి చర్చలు పనికొస్తాయి. భాషాపరంగా ఆడకత్తెర వంటి తప్పిదాలకు పాల్పడకుండా పత్రికలు, ఇతర ప్రసార సాధనాల వారు తగినంత శ్రద్ధ వహించాలి.
ఆ మధ్య దూరదర్శన్‌లో వార్తలు చూస్తుంటే
english title:
tene
Date:
Saturday, October 13, 2012