Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

అచ్చతెలుగు అభిలషణీయమా?

$
0
0

‘‘కొందరకు తెనుగు గుణమగు, కొందరకున్ సంస్కృతంబు గుణమగు.. నేనందర మెప్పింతు కృతుల’’ అన్నారు వినయంగా పోతనామాత్యులు. ప్రౌఢి పరికింప సంస్కృత భాష, పలుకు నుడికారమున తెలుగు, ఎవరేమనుకుంటే నాకేమి అన్నాడు శ్రీనాథ కవి సార్వభౌముడు. ఎవరెలా అన్నా, ఏమన్నా రచనలో తెలుగు, సంస్కృతాల పాళ్ళమీద ఆనాడు అభిప్రాయ భేదాలుండేవని తెలుస్తున్నది. నేటికీ సంస్కృత పదాల వాడకం తగ్గాలనీ, సంస్కృత భాషాధిపత్యమే తెలుగు సాహిత్యాభివృద్ధికి అవరోధమనీ, సామాన్య ప్రజను సాహిత్యానికి దూరం చేస్తున్నదనీ వాదం విన్పిస్తున్నది. ఆంగ్ల భాషా వ్యామోహం కూడా తెలుగు భాష అంతరించిపోయే పరిస్థితిని కల్పిస్తోందని అంటున్నారు.
సంస్కృత భాష ప్రభావం నుంచి సంపూర్ణంగా బయటపడాలన్న ఉద్యమం వందేళ్లనాడే తమిళ నాట ప్రారంభమైంది. దురదృష్టవశాత్తూ ఆనాటి సమాజంలో- ముఖ్యంగా గ్రామాలలో సంస్కృత భాషాధ్యయనం అగ్రవర్ణాలకే పరిమితమైంది. చదువుపై ఎంత ఆసక్తి ఉన్నా కొన్ని వర్గాలకు అవకాశం నిరాకరింపబడేది. ప్రభుత్వం నడిపే సంస్కృత కళాశాలలో సైతం అధ్యాపకులు అందరకూ చదువు చెప్పడానికి అభ్యంతరం తెలియచేసిన కాలమది. అందుకే సంస్కృతం అగ్రవర్ణాల భాష అనీ, తమిళ భాషలో సంస్కృత పదాలను ఏరిపారెయ్యాలనీ ఉద్యమం ప్రారంభమైంది. తనిత్తమిళ్ ఇయక్కమ్ (ప్యూర్ తమిళ్ మూవ్‌మెంట్)ని ప్రారంభించిన వేదాచల స్వామి తన పేరుని మరైమలై అడిగళ్ అని మార్చుకున్నారు. కానీ సంస్కృత భాషతో సంబంధాన్ని పూర్తిగా తెంచుకోవడం వారికీ సాధ్యం కాలేదు.
సంస్కృత భాషను పూర్తిగా తిరస్కరించడానికి తమిళనాట ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఒక వీరాభిమాని పంకజాక్షి అన్న పేరును తామరైకణ్ణి అని మార్చుకున్నారు. తామర అన్నది తమిళ పదమా? అందరూ ఆకాశవాణి కేంద్రం అంటే తమిళులు వాణొలి నిలయం అంటారు. ఆకాశవాణిని వాణం+ఒలి అని మార్చారు కానీ నిలయం అన్న సంస్కృత పదం తప్పలేదు. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రులలో అణ్ణాదురై, పణ్ణీర్ శెల్వమ్ (ఆపద్ధర్మ ముఖ్యమంత్రి!)ని వదిలిస్తే మిగిలిన అందరివీ సంస్కృత నామాలే.
తెలుగు భాషకైనా ఇదే నియమం వర్తిస్తుంది. చాలాకాలంగా ఎన్నో సంస్కృత పదాలు తత్సమరూపంలోనో, తద్భవ రూపంలోనో తెలుగు భాషలో కలిసిపోయాయి. ఎన్నో అరబ్బీ, పర్షియన్ పదాలు హిందీలో కలిసిపోయాయి. స్వాతంత్య్రోద్యమ ప్రభావం వల్లనేమో ఆంగ్ల భాషా పదాలను వాడరాదన్న అభిప్రాయంతో ఆంగ్లేయులు ప్రవేశపెట్టిన వాటికెన్నిటికో దేశీయ శబ్దాలకై అందరూ ప్రయత్నించారు. న్యూస్‌పేపర్‌కి బదులుగా వాడే వార్తాపత్రిక అనే మాట ఎంత అసలైన తెలుగు పదం కాదో ఖబర్ కాగజ్ కూడా అంతే హిందీ మాట కాదు. లా కాలేజీని మనం న్యాయ కళాశాల అంటే తమిళులు చట్టకల్లూరి అంటున్నారు. పడిప్పు అనే తమిళ పదం పఠ్ అనే సంస్కృత క్రియా పదంలోనుంచి వచ్చింది కాదా?
ఏ భాషకైనా ఇదే సూత్రాన్ని అన్వయించవచ్చు. ఆంగ్లంలో ఈ క్రింది వాక్యాలని గమనించండి. అందులో అన్య దేశాలెన్నో లెక్క పెట్టండి.
The abbot told the tycoon to give the man in khaki, ten thousand per annum. The tycoon replied that he is not a bonafide employee but is just sitting on the sofa and prefers to loot than work and smoke cigars on a balcony or eat potato cips. Better have a robot to work.
ఇంధులో అబాట్, పెర్ లాటిన్ పదాలు. టైకూన్ జపనీస్, ఖాకీ హిందీ, బోనఫైడ్ లాటిన్, సోఫా అరబిక్, లూట్ హిందీ, సిగర్ స్పానిష్. బాల్కనీ ఇటాలియన్, పొటాటో పోర్చుగీస్, రోబోట్ జెకొస్లవేకియన్ పదాలు.
క్రీస్తుకి కొంచెం పూర్వం జూలియస్ సీజర్ ఇంగ్లండుని జయించేసరికి ఇంగ్లీషు వారి మతంలో మఠాలూ, మఠాధిపతులూ లేరు. తండ్రి అనే అర్థంలో ఉన్న లాటిన్ పదం ‘అబ్బా’నే అబాట్‌గా రోమన్ల మఠాధిపతికి వాడేవారు. ఆ పదమే ఇంగ్లీషులో చోటుచేసుకుంది. ఎన్నో లాటిన్ పదాలు రోమన్ దండయాత్ర తరువాత ఇంగ్లీషు వారు స్వీకరించారు. అదేవిధంగా నాలుగు వందల ఏళ్ళ ఫ్రెంచి ఏలుబడిలో ఫ్రెంచి పదాలూ అగీకరించారు. ఇతర భాషా పదాల స్వీకరణకూ, ఇతరుల ఆధిపత్యానికీ సంబంధం లేదు. ఆల్జీబ్రా, మాట్రెస్, సఫారీ అరబిక్ పదాలనూ, బనానా, జీబ్రా, చింపాంజీ వంటి ఆఫ్రికన్ పదాలనూ తమవిగా ఆంగ్లేయులు చేసుకున్నారు. గురు, పైజమా, యోగా, జగ్గర్ నాట్ (జగన్నాథ శబ్దానికి వికృతి) వంటి మన దేశ పదాలు తెలిసినవే కదా.
ఇతర భాషలలోని పదాలు స్వీకరించడానికీ, పాలిత పాలక వర్గాలు అవడానికీ సంబంధం లేదు. ఒక వస్తువును కానీ, విధానాన్ని కానీ ఇతరులనుంచి అంగీకరించినపుడు వారి పదాన్ని కూడా అంగీకరించడం అవసరవౌతుంది. భాషల మధ్య ఇచ్చిపుచ్చుకోవడం తప్పనిసరి. ఇది అన్యోన్యాశ్రయమే కానీ ఆధిపత్య చిహ్నం కాదు. ఆంగ్లంలో లాటిన్ పదాల శాతం ఇరవై తొమ్మిది. ఫ్రెంచి పదాల శాతం ఇరవై తొమ్మిది. ఇతర భాషా పదాలు పదహారు శాతం. అచ్చమైన ఆంగ్లం ఇరవై ఆరు శాతమే. లాటిన్, ఫ్రెంచి పదాలను రోమన్ల ఆక్రమణకో, ఫ్రెంచివారి ఏలుబడికో చిహ్నంగా ఆంగ్లేయులు భావించడంలేదు.
తెలుగువారైనా సంస్కృత భాషాధిపత్యం, ఆంగ్ల భాషావ్యామోహం అన్న చట్రాలలో భాషను బిగించే ప్రయత్నం చేస్తే భాష జీవభాషగా ఉండలేదు. తెలుగు పదాల తయారీ ప్రయత్నంలో కూడా ఆంగ్లేయుల పాలనను మర్చిపోకుండా పదాలను తయారుచేస్తున్నాము. బాక్ వాటర్స్‌ని పృష్ఠజలాలు అని పాఠ్యపుస్తకాలలో రాస్తున్నారు తప్ప ఉప్పుటేరు అన్న మాటను ఎందుకు ఉపయోగంలోకి తెచ్చే ప్రయత్నం చెయ్యడంలేదో తెలియదు. డ్రాఫ్టుకి ధర్మహుండీ అనరాదా?
ఆంగ్ల పదాలను అవసరం లేకున్నా విరివిగా వాడడం సరికాదు. తెలుగులో పదం లేనప్పుడు కష్టపడి సృష్టించి ప్రయోగించడంకన్నా ఇంగ్లీషు మాటను వాడడం మంచిది. తెలుగులో పదముండగా, అందునా సులువుగా అర్థమయ్యే మాట ఉండగా, ఇంగ్లీషు వాడకాన్ని తప్పకుండా ఖండించాలి. నీళ్లు మరిగించడానికి వాటర్ బాయిల్ చెయ్యమనడం ఆంగ్ల భాషా వ్యామోహానికి చిహ్నం (ఈ విషయంలో కూడా అన్ని రంగాలలో వలెనే మగువలే మగవారికన్నా ముందున్నారు!). రిక్షా అనడానికి త్రిచక్ర శకటమనడం సంస్కృత భాషాధిపత్యానికి పట్టం కట్టడం. తెలుగులో పదాలను కాపాడుకుంటూ, అవసరమైనప్పుడు అన్య దేశాలకు తెలుగు ఉచ్ఛారణను సమకూర్చి వాడుకోవడం అన్నివిధాలా అభిలషణీయం. ఎప్పుడో అగ్రవర్ణాలు ఆధిపత్యం చెలాయించారనో, ఆంగ్లేయులు పరిపాలించారనో గతాన్ని తవ్వుకుంటూ కూచోడంకన్నా భాషను అభివృద్ధి పథంలో నడిపించినప్పుడే అది అంతరించిపోకుండా ఉండగలదు.

‘‘కొందరకు తెనుగు గుణమగు, కొందరకున్ సంస్కృతంబు గుణమగు..
english title: 
acha
author: 
-పాలంకి సత్య, 9848088775

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>