హైదరాబాద్, జూన్ 15: అంతర్జాతీయ లక్ష్యాలను సాధించేందుకు ముందు స్థానిక ప్రభుత్వాలు జీవవైవిధ్య పరిరక్షణ దిశగా పనిచేసేందుకు ప్రపంచ దేశాలు బాసటగా నిలవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం పిలుపునిచ్చారు. జీవవైవిధ్య అంతర్జాతీయ సదస్సు -కాప్ 11లో నివాసానికి నగరాలు పేరిట నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ జీవవైవిధ్యానికి సంబంధించిన అన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం చాలా ముందుందని అన్నారు. 2006లోనే జీవవైవిధ్య బోర్డును ఏర్పాటుచేశామని, ఆ రంగానికి సంబంధించి సలహాలనూ , సూచనలనూ బోర్డు అందజేస్తోందని, రాష్ట్రంలో 590 జీవవైవిధ్య కమిటీలను నియమించామని, అలాగే తిరుమల సహా నాలుగు ప్రాంతాలను జీవవారసత్వ ప్రదేశాలుగా ప్రకటించామని చెప్పారు. భారత ఉపఖండంలో ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మక ప్రాంతంగా ఉందని, తూర్పుకనుమలు, కృష్ణాగోదావరి తీర ప్రాంతం, అభయారణ్యాలు, రక్షిత ప్రాంతాలు వల్ల జీవవైవిధ్యం సంరక్షణ జరుగుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అనేక జాతీయ, అంతర్జాతీయ జీవవైవిధ్య రంగ సంస్థలు అనేకం ఉన్నాయని, వాటిలో అనునిత్యం ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు. సిబిడి ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ బ్రౌలియో ఫెరీరా డిసౌజా డియాజ్, మున్సిపల్ శాఖ మంత్రి మహీధర్ రెడ్డి, కేంద్ర అటవీ శాఖ కార్యదర్శి ఛటర్జీ, హైదరాబాద్ నగర మేయర్ మహ్మద్ మాజిద్ హుస్సేన్, జూండలప్ నగరం మేయర్ ట్రాయ్ షికార్డు తదితరులు ఈ సదస్సులో మాట్లాడారు.
ఈ సందర్భంగా మాజిద్ హుస్సేన్ మాట్లాడుతూ పట్టణ సుందరీకరణకు ఎన్నో చర్యలు చేపట్టామని అన్నారు. 50 అంతర్జాతీయ నగరాలతో సహా 500 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. 1.5 చదరపు కిలోమీటర్ల పొడవున అతిపెద్ద పార్కు నగరం నడిబొడ్డున రక్షిత ప్రాంతంగా ఉందని, ఇలాంటి పార్కు ప్రపంచంలో చాలా దేశాల్లో లేదని అన్నారు. నగరంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టామని దానిని వీలున్నంత త్వరగా పూర్తి చేస్తామని వెల్లడించారు.
నగరాల్లో కాలుష్య వాహనాలపై తీవ్ర చర్యలు
రానున్న రోజుల్లో 54 మహానగరాల్లో కాలుష్య కారక వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, సాధారణ పెట్రోలు, డీజిల్ స్థానే సిఎన్‌జికి మారాల్సి ఉంటుందని ఛటర్జీ చెప్పారు. పరిశుభ్రమైన ఇంధనాన్ని అన్ని వాహనాల్లో వాడటం వల్ల వాయు కాలుష్యాన్ని పూర్తిగా నివారించగలుగుతామని ఆయన వ్యాఖ్యానించారు. పరిశుభ్ర ఇంధనంలో సల్ఫర్, ఇతర కాలుష్య కారకాల ప్రసక్తే తలెత్తదని అన్నారు. వాహన పన్నులో కొంత భాగం నగరాల స్థానిక ప్రభుత్వాలకు ఇస్తే బాగుంటుందని, అయితే ఇందుకు చట్టాలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చూసుకుంటే 24 శాతం మేర హరిత తోరణం ఉందని, అన్ని నగరాల్లో కనీసంగా 24 శాతం మేర హరిత తోరణం ఉండాలని వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హైదరాబాద్ బయోడైవర్సిటీ ఇండెక్స్, ట్రీస్ ఆఫ్ హైదరాబాద్ పేరిట రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. (చిత్రం) జీవవైవిధ్య అంతర్జాతీయ సదస్సు -కాప్ 11లో ‘నివాసానికి నగరాలు’ పేరిట బుధవారం నిర్వహించిన మేయర్ల సమావేశానికి హాజరై జూండలప్ మేయర్ ట్రాయ్ షికార్డుతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి
రాష్ట్రంలో 590 జీవవైవిధ్య కమిటీలు.. 54 నగరాల్లో కాలుష్య రహిత పెట్రోల్, డీజిల్ వాడకం : కిరణ్‌కుమార్
english title:
cities for dwelling
Date:
Tuesday, October 16, 2012