హైదరాబాద్, అక్టోబర్ 15: చేనేత సంఘాలు చెల్లించాల్సిన రూ. 191 బకాయిల చెల్లింపునకు ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. చేనేత కార్మికుల సమస్యలపై మంగళవారం ముఖ్యమంత్రి సంబంధిత అధికారులు, చేనేతశాఖ మంత్రి ప్రసాద్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద్ భాస్కర్, ప్రభుత్వ విప్ అనిల్ తదితరులతో కలిసి సమీక్షించారు. అనంతరం చేనేతశాఖ మంత్రి ప్రసాద్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 20న చేనేత పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై జూబ్లీహాల్‌లో వర్క్‌షాప్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. చేనేత పరిశ్రమను, కార్మికులను ఆదుకోవడానికి రూ. 200 కోట్లతో నిధితో ప్రత్యేకంగా బ్యాంకు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని ఆయన తెలిపారు. మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చినట్టుగానే చేనేత కార్మికులను ఆదుకోవడానికి రూ. 34 వేల చొప్పున వ్యక్తిగత రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోందని ఆయన తెలిపారు. అలాగే చేనేత సంఘాలకు రెండు లక్షల రూపాయల వరకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించినట్టు మంత్రి పేర్కొన్నారు. చేనేత కార్మికుల ఆత్మహత్యలను నివారించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని, ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ఈ నెల 20న జూబ్లీహాల్‌లో జరిగే ఉన్నతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని మంత్రి తెలిపారు. చేనేత కార్మికులను ఆదుకోవడానికి వారి ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఆప్కో, సాంఘీక సంక్షేమశాఖ, బిసి, ఎస్‌టి సంక్షేమశాఖ , రాజీవ్ విద్యామిషన్ సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు ఆయన పేర్కొన్నారు. చేనేత రంగానికి 2004-05లో రూ. 55.69 కోట్లు ఉన్న బడ్జెట్‌ను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2012-13లో రూ. 212 కోట్లకు పెంచినట్టు మంత్రి వివరించారు.
సమ సమాజ స్థాపనకు కాంగ్రెస్‌లో చేరండి
పిసిసి చీఫ్ బొత్స పిలుపు
హైదరాబాద్, అక్టోబర్ 15: సమ సమాజ స్థాపన కోసం తటస్థులు కాంగ్రెస్‌లో చేరాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. 1999 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇదే విధంగా పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున తటస్థులు ఆ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. సిబిఐ మాజీ డైరెక్టర్ జి. విజయ రామారావు, లెక్చరర్‌గా ఉన్న కొండ్ర పుష్పలీల ఇంకా అనేక మంది అధికారులు, అనధికారులు, విద్యా వేత్తలు చంద్రబాబు పిలుపునకు స్పందించి ఆ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో కొంత మంది తటస్థులకు బాబు టిక్కెట్లు ఇవ్వడంతో విజయం సాధించారు. అందులో విజయ రామారావు, పుష్పలీలకు ఏకంగా మంత్రివర్గంలోనే స్థానం లభించింది. కాగా, ఇప్పుడు పిసిసి చీఫ్ బొత్స కూడా అటువంటి ప్రయోగానే్న చేస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, సామాజిక న్యాయం కాంగ్రెస్ ప్రభుత్వాల వల్లే సాధ్యం కాబట్టి తమ పార్టీలో చేరాలని ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ తటస్టులను కోరారు. ఈ నెల 18వ తేదీన ఉదయం 11 గంటలకు గాంధీ భవన్‌లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పార్టీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, మాజీ ముఖ్యమంత్రులు, పిసిసి మాజీ అధ్యక్షులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన చెప్పారు.