హైదరాబాద్, అక్టోబర్ 15: పోలవరం టెండర్లను త్వరలోనే ఖరారు చేస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పి.సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ సాంకేతికంగా నెలకొన్న ఇబ్బందులపై అధికారులు అధ్యయనం చేస్తున్నారని, త్వరలోనే టెండర్లను ఖరారు చేస్తారని చెప్పారు. గతంలో సోమా సంస్థకు పోలవరం టెండర్లు ఖరారు చేయగా, ఇప్పుడు కొత్తగా ట్రాన్స్‌ట్రాయ్ సంస్థ ఎల్-1గా వెలుగులోకి రావడంపై విలేఖరులు అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందిస్తూ అన్ని కోణాల్లో అధికారులు సమీక్షిస్తున్నారని చెప్పారు. కాగా, పులిచింతల ప్రాజెక్టు సమస్యలు కూడా తొలగిపోయాయన్నారు. ఈ పనుల్లో జాప్యం నెలకొనడంతో ఆ ప్రాజెక్టు కాంట్రాక్టర్‌కు రద్దు నోటీసు ఇచ్చామని, అయితే ఆ సంస్థ ప్రతినిధి కృష్ణయ్య తాను సకాలంలో పనులు పూర్తి చేస్తానంటూ హామీనిచ్చారని మంత్రి వివరించారు. ఆయన ఇచ్చిన హామీని తాను నమ్ముతున్నట్లు మంత్రి చెప్పారు. మొత్తంమీద ఈ పనులు వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తవుతాయన్నారు. ఇక ఆంధ్రా ప్రోజెక్టులు వేగవంతంగా జరుగుతున్నాయని, తెలంగాణ ప్రాజెక్టుల్లో జాప్యం నెలకొందని కొంతమంది చేస్తున్న విమర్శలు సరికాదని మంత్రి స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల్లో ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేసేందుకే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో ఒప్పందం లేకుండానే పనులు జరుగుతున్నాయన్న ప్రచారం కూడా అర్ధరహితమని స్పష్టం చేశారు. అనుమానం ఉన్న వారిని ఒప్పంద పత్రాలను చూపించేందుకు సిద్ధమని ప్రకటించారు.
మంత్రి సుదర్శన్‌రెడ్డి వెల్లడి
english title:
polavaram
Date:
Tuesday, October 16, 2012