నిజామాబాద్, అక్టోబర్ 15: గోదావరి నదిపై శ్రీరాంసాగర్ పరివాహక ప్రాంతంలో జిల్లా సరిహద్దున మహారాష్ట్ర సర్కార్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు వివాదం విషయమై సర్వోన్నత న్యాయస్థానం వెలువరించనున్న తీర్పుపైనే తెలంగాణ జిల్లాల మనుగడ ఆధారపడి ఉంది. ఇప్పటికే పలు దఫాలుగా ఇరు రాష్ట్రాల వాదనలు విన్న సుప్రీంకోర్టు మంగళవారం తుది తీర్పును వెలువరించే అవకాశాలు కనిపిస్తున్నాయ. దీనిని దృష్టిలో పెట్టుకుని మహారాష్ట్ర సర్కార్ బాబ్లీ పరిసరాలతో పాటు, సరిహద్దు ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించింది. ఆంధ్రా అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ తాగునీటి అవసరాల నెపంతో మహారాష్ట్ర ప్రభుత్వం సుమారు 200 కోట్ల రూపాయలతో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం రెండేళ్ల క్రితమే పూర్తయంది. అక్రమంగా నిర్మించిన ఈ ప్రాజెక్టును కూల్చివేయాల్సిందేనని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అయతే 200 కోట్ల రూపాయల నిధులు నిష్ప్రయోజనంగా మారతాయనే ఉద్దేశ్యంతో సర్వోన్నత న్యాయస్థానం ఇందుకు అంగీకరించే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు.
బాబ్లీ ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు, నిర్ణీత కాలంలోనే గేట్ల వినియోగం, నీటి విడుదలను పర్యవేక్షించేందుకు ఉమ్మడి కమిటీ వంటి ప్రతిపాదనల వల్ల ఒనగూరే ప్రయోజనమేదీ ఉండదని, దిగువన గల ఆంధ్రాకు బాబ్లీ వల్ల తీరని అన్యాయం జరుగుతుందని ప్రతిపక్షాలు సహా జల నిపుణులు సైతం ఆందోళన వెలిబుచ్చుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జల వనరుల సంఘం ఆదేశాలను తుంగలో తొక్కి, న్యాయస్థానాన్ని సైతం తప్పుదోవ పట్టిస్తూ ఆంధ్రా అభ్యంతరాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా పోలీసు పహారా నడుమ బాబ్లీ నిర్మాణాన్ని పూర్తి చేసి తన మొండి వైఖరిని చాటుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో బాబ్లీని కూల్చివేయకుండా న్యాయస్థానం ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని చూపితే, మహారాష్ట్ర దానికి కట్టుబడి ఉంటుందనే నమ్మకం ఏ కోశానా కలగడం లేదు. గడిచిన ఐదారేళ్లుగా బాబ్లీ పనులను నిలిపివేయించేందుకు మహారాష్టత్రో అనేక దఫాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. చివరకు కేంద్ర ప్రభుత్వం సైతం మహారాష్టక్రు ముకుతాడు వేయలేకపోయింది. ఈ నేపథ్యంలో బాబ్లీ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు మరో ప్రత్యామ్నయం ఏదీ కానరాక రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుపైనే భారం వేయడం మినహా మరో మార్గం లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు వెలువరించే తీర్పుపైనే తెలంగాణలోని ఆరు జిల్లాల ప్రజల మనుగడ ఆధారపడి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
తెలంగాణ జిల్లాల వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి నిలువ ప్రాంతంలోనే బాబ్లీ ప్రాజెక్టును నిర్మించినందు వల్ల, ఈ అంశాన్ని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకున్నట్లయితే బాబ్లీకి బిగించిన గేట్లను తొలగించాల్సిందిగా మహారాష్టన్రు ఆదేశించేలా మరింత సమర్ధవంతంగా తుది వాదనలను వినిపించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బాబ్లీ స్థలాన్ని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ముంపు ప్రాంతంగా పరిగణిస్తూ గత మూడు దశాబ్దాల క్రితమే ఆంధ్రప్రదేశ్ 6 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించింది. అంతేకాకుండా గోదావరి ట్రిబ్యునల్ ఒప్పందాలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండానే ఎగువ భాగాన మహారాష్ట్ర ప్రాజెక్టును నిర్మించిందని ఇప్పటికే వెల్లడైంది. ఈ అంశాలతో పాటు, ఇతర సాంకేతికపరమైన విషయాలు, గతంలో జరిగిన ఒప్పందాలను సుప్రీంకోర్టుకు ఈ నెల 16వ తేదీ నాటి విచారణ సందర్భంగానైనా పకడ్బందీగా నివేదిస్తే ఏదైనా ప్రయోజనం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాబ్లీ అక్రమ నిర్మాణం విషయమై ప్రతిపక్షాలు అవకాశం వచ్చిన ప్రతిసారి విమర్శనాస్త్రాలు సంధిస్తున్న దృష్ట్యా, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు తీవ్రంగానే కృషి చేసి తెలంగాణ ప్రాంత ప్రయోజనాల పట్ల తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
సరిహద్దులో భారీగా పోలీసు బలగాల మోహరింపు
english title:
supreme judgement today
Date:
Tuesday, October 16, 2012