హైదరాబాద్, అక్టోబర్ 15: జీవవైవిధ్యానికి కేంద్ర ప్రభుత్వం మొత్తం మీద 11వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తుస్తోందని అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎంఎఫ్ ఫరూఖీ వెల్లడించారు. జీవవైవిధ్య అంతర్జాతీయ సదస్సులో సోమవారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాజకీయ సంకల్పంతోనే పరిపూర్ణజీవ వైవిధ్యాన్ని సాధించగలమని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వాలు చాలా సానుకూలంగా వ్యవహరిస్తున్నాయని, వారికి నచ్చచెప్పేందుకు, అవసరాలు, అనివార్యతను తెలియజెప్పేందుకు అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నామని ఫరూఖీ అన్నారు. చాలా కీలక అంశాలపై హైదరాబాద్ అంతర్జాతీయ సదస్సులో విస్తృత చర్చ జరిగిందని, నగోయ ఒడంబడిక, సంప్రదాయ విజ్ఞాన పరిరక్షణ, వ్యూహాత్మక ప్రణాళిక అమలుతో పాటు నిధుల సేకరణ అంశం కూడా చాలా కీలకమైనదేనని అన్నారు. అయితే దీనిని అంకెల వ్యవహారంగా కాకుండా వివిధ దేశాలు ఎంత సానుకూలంగా స్పందించాయో చూస్తున్నామని, ఏ దేశం ఎంత ఇస్తుందనేది ప్రస్తుత అంశం కాదని ఫరూఖీ అన్నారు. ఐచి లక్ష్యాలను సాధించడంలో ఉన్న అవాంతరాలను గుర్తించడం, ఆ అవాంతరాలను అధిగమించడానికి దారి పటాన్ని రూపొందించడం అవశ్యమని ఫరూఖీ చెప్పారు. భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లు, వాటిని అధిగమించడంతో పాటు బృహత్తర ప్రణాళికను రూపొందించడం అనేది ముందున్న అతిపెద్ద సవాలని ఫరూఖీ చెప్పారు. భారత్ దాదాపు రెండు బిలియన్ డాలర్లు అంటే 11000 కోట్ల రూపాయలను జీవవైవిధ్యం లేదా దాని అనుబంధ అంశాలకు వెచ్చిస్తోందని, ఇది తక్కువ మొత్తం కాదని, అలాగని దీంతో అన్నీ చేయగలమని కూడా చెప్పడం లేదని అన్నారు. ప్రధానంగా నిధులు అన్నీ రక్షిత ప్రాంతాల పరిరక్షణకు ఎక్కువగా వెచ్చిస్తున్నాం, పులుల సంరక్షణ అంటే కేవలం పులలను మాత్రమే పరిరక్షించినట్టు కాదు, అందుకు అవసరమైన అరణ్యాలను కాపాడటం మొదలు పెట్టి ఎన్నో చర్యలను చేపట్టాల్సి వస్తోంది, అంటే పరోక్షంగా ఎన్నో ప్రయోజనాలు ఒనగూరుతాయి.
జీవవైవిధ్యం అంటే కనిష్టంగా ఫలానాది చేయాలని ఏమీ లేదని, అయితే స్థూలంగా మనం ఏం చేయాలనేదానిపై అవగాహన ఉంది కనుక చేస్తున్నామని, విస్తృత స్థాయిలో చూస్తే జీవవైవిధ్యం అనేది అనంతం కనుకు మనం చేయగలిగినంతా చేయాలని, మధ్యంతరంగా మనం చేయాల్సింది కూడా చేయాలని, చాలా నివేదికలు ప్రపంచంలో వివిధ దేశాలు చేస్తున్న కృషిని, మన లోపాలను ఎత్తిచూపుతున్నాయి కనుక, వాటిని దృష్టిలో ఉంచుకుని అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది అని ఫరూఖీ అన్నారు
ఐచి లక్ష్యాలను సాధించడానికి భారత్ ఆలోచిస్తోందని, ఈ వారం ప్రపంచ దేశాలు అన్నింటితో జీవవైవిధ్యాన్ని పరిరక్షిస్తామని, అందుకు సంపూర్ణంగా సహకరిస్తామని ప్రతిజ్ఞ తీసుకుంటామని వెల్లడించారు. ఆర్థిక తోడ్పాటు, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, లేదా సామర్ధ్యాల పెంపు కార్యక్రమం తదితదర అంశాల్లో అన్ని దేశాలూ ఈ రంగంలో సహకరించుకోవాలన్నదే తమ ఉద్దేశమని అన్నారు. సాధ్యమయ్యే రీతిలో సహకరించమని అన్ని దేశాలను కోరతామని, ఈ మేరకు వారి నుండి ప్రతిజ్ఞ తీసుకుంటామని ఫరూఖీ చెప్పారు.
కేంద్ర పర్యావరణ కార్యదర్శి ఫరూఖీ వెల్లడి
english title:
bio diversity
Date:
Tuesday, October 16, 2012