హైదరాబాద్, అక్టోబర్ 15: సింథటిక్ ఎరువులను (కృత్రిమ సూక్ష్మజీవులు) వినియోగించి అధిక దిగుబడులు సాధించడం ద్వారా మూడో హరిత విప్లవాన్ని తీసుకువచ్చేందుకు దేశంలోని బహుళ జాతి సంస్థలు జోరుగా ప్రయత్నిస్తున్నాయని, దీన్ని అడ్డుకోకపోతే భవిష్యత్‌లో సాగు భూములు దేనికీ పనికిరాకుండా పోతాయని అంతార్జతీయ సామాజక, పర్యావరణ శాస్తవ్రేత్తలు గట్టిగా వాదిస్తున్నారు. మంగళవారం అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సులో లాండ్ డే అనే అంశంపై విస్తత్రంగా చర్చలు జరిగాయి. వ్యవసాయ రంగంలో మూడవ హరిత విప్లవం ద్వారా కృత్రిమ సూక్ష్మజీవులతో ఎరువులను తయారు చేయడానికి బహుళ జాతి కంపెనీలు ఉత్సాహం చూపిస్తున్నాయని పర్యావరణ వేత్త వందన శివ అన్నారు. సింథటిక్ ఎరువులతో సాగుచేసిన పంటలతో పాటు ఆ భూములు కూడా ఎందుకూ పనికి రాకుండా పోతాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. జీవవవైధ్యం రైతులకు ఉపయోగకరంగా ఉండాలని ఆమె సూచించారు. పర్యావరణాన్ని పునరుజ్జీవింపజేసేందుకు వీలుగా ఆగ్రో ఫారెస్టు అమలుకు ప్రభుత్వాలు ఇతోధికంగా సబ్సిడీలు ఇవ్వాల్సి ఉంటుందని ఆమె గుర్తు చేశారు. చిన్న, సన్నకారు రైతులే జీవవైవిధ్యాన్ని సమర్ధవంతంగా అమలు చేయగలుగుతారని రమీ అబూ సలీమ్ అభిప్రాపడ్డారు. పెద్ద రైతులు బయోమెట్రిక్ ఎరువులు వాడడం, అలాగే భారీ యంత్రాలతో సాగు చేయడంతో జీవవైవిధ్యానికి ప్రతిబంధకంగా ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతికి వెల కట్టలేమని, దానిని రక్షించుకోవడమే తప్ప మరో మార్గం లేదన్నారు. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చి (ఇకార్) ద్వారా ఆగ్రో ఫారెస్టును ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని కేంద్ర పర్యావరణ శాఖ సంయుక్త కార్యదర్శి రాథోర్ తెలిపారు. రైతున్నకు బంధువుగా పిలిచే వానపాములను పెంచడానికి కృషి చేయాలన్నారు. మొదటి హరిత విప్లవం ద్వారా హైబ్రీడ్ విత్తనాలు వ్యవసాయానికి పరిచయం చేయడం జరిగిందన్నారు. అలాగే రెండవ హరిత విప్లవం ద్వారా బయోటెక్నాలజీ (బిటీ) విత్తనాలను రైతన్నకు చేరువ చేశారన్నారు. కృత్రిమ సూక్ష్మజీవులతో అధిక దిగుబడులు రాబట్టడం ద్వారా మూడో హరిత విప్లవాన్ని సాధించవచ్చని బహుళ జాతి సంస్థలు విస్తృతంగా ప్రచారం చేయడం దురదృష్టకరమని రాథోర్ ఆందోళన వ్యక్తం చేశారు.
జీవవైవిధ్య సదస్సులో సామాజిక, పర్యాటక శాస్తవ్రేత్తల విన్నపం
english title:
say no to third green revolution
Date:
Tuesday, October 16, 2012