హైదరాబాద్, అక్టోబర్ 15: అర్ధ వార్షికంలో రాష్ట్ర ఖజానాకు ఆదాయం తగ్గుముఖం పట్టడంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నిర్ణయించిన లక్ష్యాల మేరకు ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. తొలి ఆరు నెలల కాలంలో వచ్చిన ఆదాయాన్ని పరిశీలిస్తే గత ఏడాది కన్నా 25 శాతం వరకు మెరుగైన ఆదాయం ఉన్నప్పటికీ ఈ ఏడాది లక్ష్యాలతో పోల్చి చూస్తే ఐదు శాతం వరకు తరుగు కనిపించింది. రాష్ట్ర ఆదాయంలో కీలక పాత్ర పోషించే వాణిజ్య పన్నులు, ఎక్సయిజ్ శాఖ ఆదాయంలో తరుగుదల ఉండడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అయితే గనుల శాఖ ఆదాయం మాత్రం లక్ష్యం కంటే ఎక్కువగా ఉండడం విశేషం. ఆదాయం తగ్గడానికి గల కారణాలను అనే్వషించాలని, ఆ దశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ పథకాలకు నిధుల అవసరం ఎంతో ఉన్నందున ఆదాయం తగ్గకుండా చూడాలని ఆయన అధికారులకు సూచించారు. అనవసర ఖర్చులు తగ్గించుకునేందుకు కూడా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏ పథకం ఆగిపోకుండా చూడాలని ఆయన ఆదేశించారు.
అప్రమత్తం కావాలన్న ముఖ్యమంత్రి
english title:
income reduced
Date:
Tuesday, October 16, 2012