ప్రపంచ దేశాలలో మానసిక ఆరోగ్యం ఒక సమస్యగా మారుతున్నది. ఒకప్పుడు అంటువ్యాధులు మనుషుల్ని బలితీసుకున్నాయి. ఇప్పుడు మానసిక మనోశారీరక రుగ్మతలు కృంగదీస్తున్నాయి. ఇందులో డిప్రెషన్ అంత్యంత ప్రమాదకారిగా మారుతున్నది. తాజా లెక్కల ప్రకారం ప్రపంచంలో 35 కోట్ల మంది డిప్రెషన్‌తోబాధపడుతన్నారు. ఏటా 10 కోట్లమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలకు పాల్పడేవారిలో అధిక శాతం డిప్రెషన్ బాధితులన్నది కాదనలేని సత్యం. 2020 నాటికి డిప్రెషన్ ప్రధాన ప్రాణాంతక రుగ్మత కానున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్నది. ప్రపంచంలో 12 శాతం మంది మానసిక రుగ్మతల్ని అనుభవిస్తున్నారు. అనేక శారీరక రుగ్మతలకు మానసిక ఒత్తిళ్ళు, ఇతర మనోజనిత సమస్యలే కారణమని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ 4 నుంచి 10వ తేదీ వరకు జరిగిన ప్రపంచ మానసిక వారోత్సవాలలో డిప్రెషన్, ఆత్మహత్యలను అరికట్టడంపై దృష్టి సారించారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించారు.
డిప్రెషన్‌ను ఢీకొట్టవచ్చు
మన సమాజంలో మనోవ్యాధి (డిప్రెషన్)కు మందులేదన్న నానుడి ఉంది. అంటే మందులు అవసరం లేదన్న భావన కొందరిలో ఉంటే, మందులు వేసినా ప్రయోజనం లేదన్న నిరాశావాదం మరికొందరు వ్యక్తీకరించేవారు. అయితే ఇప్పుడు డిప్రెషన్‌ను తగ్గించేందుకు చక్కని మందులు, కౌనె్సలింగ్ ప్రక్రియలు, చికిత్సా పద్ధతులు ప్రాచుర్యం పొందుతున్నాయి. ప్రాథమిక దశలో గుర్తిస్తే డిప్రెషన్‌ను అతి సులభంగా నయం చేయవచ్చు. దృక్పథం, వ్యక్తిత్వ లోపాలవల్ల కృంగుబాటుకు గురయ్యేవారిని కాగ్నెటివ్ బిహేవియర్ థెరపి ఇతర మార్గాల ద్వారా మామూలు మనుషుల్ని చేయవచ్చు. మెదడులో హార్మోన్ల అసమతుల్యతవల్ల తలెత్తే డిప్రెషన్‌కు మందులు వాడాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో దీర్ఘకాలం మందులు వాడవలసి వస్తుంది. మందుల వాడకంతోపాటు, కౌనె్సలింగ్, యోగ, ధ్యానం, అభిరుచులు, ఇతర సహాయకారి పద్ధతుల మద్దతుతో త్వరగా తగ్గించవచ్చు. డిప్రెషన్‌కుగల కారణాలు, లక్షణాలను బట్టి చికిత్సా పద్ధతులను ఎంచుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
ప్రతిరోజు మనకు ఎదురయ్యే మానసిక ఒత్తిడి, దిగులు, అశాంతిని డిప్రెషన్‌గా భావించరాదు. అయితే రెండు వారాల కంటే ఎక్కువ కాలం బాధపడుతుంటే మాత్రం డిప్రెషన్‌గా గుర్తించాలి. డిప్రెషన్ బాధితుల్లో సహజంగా ఆందోళన, నిద్రలేమి, ఆకలి వేయకపోవడం, అపరాధ భావం, ఆత్మదయ, ఆత్మనింద, ఆత్మన్యూనత, ఏకాగ్రత తగ్గడం, నిరాశ, నిస్పృహ, ఆత్మహత్యా భావన, ఇతర లక్షణాలు కనిపిస్తుంటాయి. వాటి తీవ్రతను బట్టి సాధారణ, ఒక మోస్తరు, తీవ్ర స్థాయి రుగ్మతగా వర్గీకరించి చికిత్స చేస్తారు. డిప్రెషన్‌కు పలు మానసిక, శారీరక, హార్మోన్ల సమస్యలు కారణం కావచ్చు. కొన్ని సందర్భాలలో జన్యుపర అంశాలు డిప్రెషన్‌కు మూలం కావచ్చు. కారణం ఏదైనప్పటికి మందులు, సైకోథరపి, కౌనె్సలింగ్, బిహేవియర్ థెరపి, ఇతర పద్ధతుల ద్వారా తగ్గించవచ్చు. దీనికోసం మానసిక వైద్యులు, మానసిక నిపుణులు, సామాజిక కార్యకర్తల సేవలు ఉపయుక్తంగా ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులు, స్నేహితుల తోడ్పాటు అవసరం ఉంటుంది. వ్యక్తిత్వ వికాసం, జీవన నైపుణ్యాలు, సమస్యలు పరిష్కరించుకునే శక్తి, ఒత్తిళ్ళ నిర్వహణ లాంటి అంశాలలో మెళకువలు నేర్పించడం కూడా చాలా అవసరం. యోగ, ధ్యానం, క్రీడలు, వ్యాయామాలు, సమతులాహారం, చక్కని అభిరుచులు డిప్రెషన్‌ను దూరం చేయడంలో సహాయకారిగా పనిచేస్తాయి. ఏ ఒక్కరు హఠాత్తుగా ఆత్మహత్యకు పాల్పడరు. చాలా రోజులనుంచి ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు. అప్పులు, అపజయాలు, ప్రేమ వైఫల్యం, ఇతర ఒత్తిళ్ళలో ఏదో ఒక అంశం వారిని దీర్ఘకాలం కృంగదీస్తుంటుంది. ఆత్మహత్యలకు పాల్పడేవారిలో ఒత్తిడి, డిప్రెషన్ లక్షణాలతోపాటు మరికొన్ని ప్రవర్తనలు స్పష్టంగా కనిపిస్తాయి. నిరాశావాదనలు, అపరాధభావం ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు. ఆత్మరాహిత్యం, చావు, పుట్టుకలు, కర్మఫలాలను గూర్చి చర్చిస్తుంటారు. ఆత్మహత్యా భావాలను నేరుగా లేదా నర్మగర్భంగా వ్యక్తీకరిస్తుంటారు. డైరీలు, పుస్తకాలలో రాసిపెట్టడం, ఆత్మహత్యకు ఉపయోగించే వస్తువుల సేకరణకు పాల్పడుతుంటారు. ఇలాంటివారిని ముందుగానే గుర్తించి కౌనె్సలింగ్, చికిత్సలు చేయిస్తే ప్రమాదం నుంచి గట్టెక్కించవచ్చు.
అయితే చాలామంది మానసిక వైద్యులు, నిపుణులను సంప్రదించడం అవమానంగా భావిస్తుంటారు. ఈ భావన పూర్తిగా తప్పు. జ్వరం, తలనొప్పి లాంటి సాధారణ ఆరోగ్యం సమస్యల కోసం డాక్టర్లను కలసినంత సహజంగా సైకియాట్రిస్టు, సైకాలజిస్టులను కలవడం అలవర్చుకోవాలి. బాల్యం నుంచి వ్యక్తిత్వ వికాసం, మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. మానసిక సమస్యలు, రుగ్మతల్ని మొగ్గలోనే తుంచేయడానికి ప్రయత్నించాలి. అప్పుడే ప్రపంచ ఆరోగ్య సంస్థ స్ఫూర్తి నెరవేరుతుంది. అలాగే సాధారణ వైద్యులు తమ దగ్గరికి వచ్చేవారిలో మనిషి సమస్యలను గుర్తించి, నిపుణుల వద్దకు పంపాలి. సమాజంలోని అందరు కలిసి డిప్రెషన్ భూతాన్ని ఢీకొట్టాలి. ఆత్మహత్యల్ని అరికట్టేందుకు కృషి చేయాలి.
ప్రపంచ దేశాలలో మానసిక ఆరోగ్యం ఒక సమస్యగా మారుతున్నది
english title:
stress
Date:
Wednesday, October 17, 2012