హైదరాబాద్, అక్టోబర్ 15: నాలుగు వందల ఏళ్లలో హైదరాబాద్ నగరంలో పోగొట్టుకున్న దానిని మనం తిరిగి పునర్మించడం అంటే ఇది మాయాబజార్ సినిమా కాదని, అయితే వీలున్నంత వరకూ నగర అభివృద్ధికి, పర్యావరణ నిబంధనల మేరకు నగరాన్ని తీర్చిదిద్దేందుకు తాము గట్టి కృషి చేస్తున్నామని కమిషనర్ ఎం. టి. కృష్ణబాబు చెప్పారు. అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సులో జీవనానికి నగరాలు పేరిట జరిగిన చర్చాగోష్టలో పాల్గొన్న కృష్ణబాబు అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ హైదరాబాద్ నగరం ఇండెక్స్ పాయింట్లు కనీసం 50 దాటేలా చూసేందుకు గట్టి కృషి చేస్తున్నట్టు హైదరాబాద్ నగర కమిషనర్ ఎం. టి. కృష్ణబాబు చెప్పారు. తాజాగా అంతర్జాతీయ స్థాయిలో 92 పాయింట్ల స్కేల్‌లో హైదరాబాద్ నగరానికి 32 పాయింట్లు వచ్చాయని చెప్పారు. రాత్రికి రాత్రి హైదరాబాద్‌లో అరణ్యాలను పుట్టించలేమని, అయితే ఉన్నంత స్థలంలో కనీసం మొక్కలను పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడం తద్వారా మన పాయింట్ల పట్టికను మెరుగు పరుచుకోవచ్చని అన్నారు. 176 చెరువులను జాతీయ సరస్సుల పరిరక్షణ పథకం కింద పరిరక్షణ, మురుగునీటి కాల్వల మలుపు, సుందరీకరణ పేరిట చర్యలు చేపడుతున్నామని వివరించారు.
పట్టణపరిమితి పెరిగినపుడు జీవవైవిధ్యం సహజంగానే దెబ్బతింటుందని, పచ్చదనం, జీవరాశులు కూడా దెబ్బతింటాయని, దీనిని ఆపలేకపోయినా ఉన్నదాంట్లో అభివృద్ధితో పాటు జీవవైవిధ్యాన్ని ఎలా సాధించాలనేదే సదస్సు ముఖ్య ఉద్ధేశ్యమని పేర్కొన్నారు. కనీసం మూడు శాతం పట్టణ ప్రాంతాల్లో 60 శాతం ప్రజలు జీవిస్తున్నారని, వీరు 70 శాతం జీడీపిని అందిస్తున్నారని కృష్ణబాబు చెప్పారు. పట్టణ ప్రాంతాల పెరుగుదలను ఆపలేమని, జీవవైవిధ్యం నష్టపోకుండా రెండింటినీ కలుపుకుంటూ అందర్నీ ఎలా చైతన్య పరచగలమనేది ఆలోచిస్తున్నామని అన్నారు. 210 మంది విదేశీ ప్రతినిధులతో పాటు 500 మంది వచ్చారని, 50 దేశాల నుండి మేయర్లు, విదేశీ ప్రతినిధులు ఈ సదస్సుకు వచ్చారని, పట్టణాల బేస్‌లైన్ గణాంకాలను విడుదల చేశామని, దాని వల్ల అందరికీ చాలా స్పష్టత వస్తుందని, తద్వారా స్థానిక ప్రజల వత్తిడి కూడా ఆయా ప్రభుత్వాలపై పడుతుందని తద్వారా జీవవైవిధ్యం అమలు వేగవంతం అవుతుందని అన్నారు.
అంతర్జాతీయ అవగాహన ఉన్న 23 అంశాల్లో ఒక్కో దానికి 4 పాయింట్లు చొప్పున మొత్తం 92 పాయింట్లు నిర్ణయించారని, అందులో మనం 36 పాయింట్లు సాధించామని కృష్ణబాబు అన్నారు. కొన్ని అంశాల్లో హైదరాబాద్‌కు తక్కువ పాయింట్లు వచ్చాయని పేర్కొన్నారు. కొత్త రిజర్వు ఫారెస్టులను రాజధానిలో నిర్మించలేమని కనుక కొత్త వృక్షాలు నిర్మించడం ద్వారా మనం జీవావరణాన్ని పెంచవచ్చని కృష్ణబాబు పేర్కొన్నారు. స్నేక్ పార్కు, పాకుడు జంతువుల పార్కును కూడా ఏర్పాటు చేసుకునే వీలుందని, రానున్న మూడు నుండి ఐదేళ్ల లోపు రాజధాని అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తున్నామని అన్నారు. నగరంలో సరస్సులు, చెరువుల అభివృద్ధికి కృషి జరుగుతోందని, మూసీ నది అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని చెబుతూ 1400 కోట్లతో వాటర్ బోర్డు జిహెచ్‌ఎంసి ఖర్చు చేయబోతోందని, 176 చెరువులకు 500 కోట్లను వెచ్చిస్తామని, పార్కుల అభివృద్ధికి కూడా ప్రణాళికలున్నాయని ఆయన చెప్పారు.
1400 కోట్లతో మూసీ ప్రక్షాళన.. 176 చెరువుల అభివృద్ధికి 500 కోట్లు : కృష్ణబాబు
english title:
hyderabad development
Date:
Tuesday, October 16, 2012