మారుతున్న కాలానికి అనుగుణంగా క్రీడా రంగం కూడా కొత్త రూపాన్ని సంతరించుకుంటున్నది. మారేది లేదంటూ నిబంధనల చట్రంలోనే ఉండిపోయన చాలా క్రీడల్లో క్రమంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయ. అభిమానుల అంచనాలకు అనుగుణంగా, వారి కోరికల మేరకు దాదాపు అన్ని క్రీడలూ కొత్త పంథాను అనుసరిస్తున్నాయ. టెన్నిస్ నుంచి హాకీ వరకూ, షూటింగ్ నుంచి రెజ్లింగ్ వరకూ ప్రతి క్రీడలోనూ ఈ మార్పుల అవసరం స్పష్టంగా కనిపిస్తున్నది. జాతీయ క్రీడా సమాఖ్యలు, కేంద్ర, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ వాస్తవాన్ని గ్రహించి, నిబంధనలను మార్చుకుంటున్నాయ. కొత్త తనానికి, కొత్త తరానికీ ఆహ్వానం పలుకుతున్నాయ.
=======
క్రీడారంగం రూటు మారుతోంది. నిన్నమొన్నటి వరకూ ఎంతో కట్టుదిట్టమైనవిగా కనిపించిన నిబంధనలు ఇప్పుడు నాసిరకంగానూ, ఆచరణ సాధ్యం కానివిగానూ మారుతున్నాయి. క్రికెట్, హాకీ, టెన్నిస్, ఫుట్‌బాల్ వంటి ఎన్నో క్రీడల్లో చాలాకాలం క్రితమే కళాత్మకమైన ఆట స్థానంలోనే పవర్ ప్లే రంగ ప్రవేశం చేసింది. దీనితో నిబంధనలు కూడా మారుతూ వస్తున్నాయి. సిక్స్-ఎ-సైడ్ ఫుట్‌బాల్, హాకీ మ్యాచ్‌లు, వనే్డ ఇంటర్నేషనల్స్, టి-20 వంటి క్రికెట్ ఫార్మెట్స్ పుట్టుకొచ్చాయి. లండన్ ఒలింపిక్స్‌లో ఎదురైన అనుభవాలు, నేర్చుకున్న పాఠాలు అన్ని క్రీడా సమాఖ్యలను పునరాలోచనలో పడేశాయి. క్రికెట్, ఫుట్‌బాల్ రంగాలు మార్పులను ఆహ్వానించాయి. అక్కున చేర్చుకున్నాయి. కొత్తకొత్త ప్రయోగాలతో సరికొత్త ఒరవడి సృష్టిస్తున్నాయి. లండన్ ఒలింపిక్స్ వేదికగా హాకీలోనూ మార్పులకు తెరలేచింది.
ఇలావుంటే, సుమారు అర్ధ శతాబ్దంగా ఎలాంటి మార్పులకు నోచుకోని షూటింగ్ కూడా కొత్తదనాన్ని కోరుతోంది. ప్రిలిమినరీ రౌండ్స్‌లో సంపాదించిన పాయింట్ల ఆధారంగానే ఫైనల్స్‌లో పోటీపడే వారికి పాయింట్లను కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. అంటే, ఫైనల్స్‌లో షూటర్లంతా ‘సున్నా’ పాయింట్ల నుంచి పోటీని ప్రారంభించరు. ఫార్ములా వన్ రేసుల్లో ప్రిలిమినరీ రౌండ్స్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా పోల్ పొజిషన్‌ను కేటాయిస్తారు. దీనిని అనుసరించి రేసర్లంతా ఒకేసారి గీత నుంచి కాకుండా తమకు కేటాయించిన పొజిషన్ నుంచే రేస్‌ను ప్రారంభిస్తారు. మెరుపు వేగంతో వాహనాలు దూసుకెళతాయి కాబట్టి అందరూ ఒకేసారి రేస్‌ను ప్రారంభించడం సాధ్యంకాదు. ఒకవేళ అలాంటి ప్రయోగం చేసినా ప్రమాదాలకు లెక్కే ఉండదు. అయితే, ఫార్ములా వన్‌లో పోల్ పొజిషన్ మాదిరిగానే షూటింగ్‌లో పాయింట్లను ‘క్యారీ ఫార్వర్డ్’ చేయడంలో అర్థం లేదు. కానీ, అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) మాత్రం ఇదే విధానాన్ని సుమారు యాభై సంవత్సరాలుగా అనుసరిస్తునే ఉంది. అంతేకాదు, ఐఎస్‌ఎస్‌ఎఫ్ చివరిసారి 1986లో కొన్ని నిబంధనలను సవరించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అంతర్జాతీయ క్రీడా రంగం అనేకానేక మార్పులకు లోనైంది. అన్ని క్రీడలూ కొత్త రూపాన్ని సంతరించుకున్నాయి. అందుకే ఐఎస్‌ఎస్‌ఎఫ్ కూడా భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ప్రిలిమినరీ రౌండ్స్‌లో సాధించిన పాయింట్లను ఫైనల్స్‌కు బదలాయించడాన్ని నిషేధించనుంది. దీనితోపాటు పలు మార్పులను సూచిస్తూ భారీ నివేదికను కూడా సిద్ధం చేసింది. ఒక రకంగా చెప్పాలంటే అంతర్జాతీయ షూటింగ్ పోటీల రూపురేఖలను ఒక్కసారిగా మార్చే రీతిలో ఎన్నో కొత్త విధానాలను ప్రతిపాదించారు. ఈమార్పులను ఇప్పటికే సెక్షన్ కమిటీ, టెక్నికల్ కమిటీ ఆమోదించాయి. వచ్చేనెల జరిగే పాలక మండలి ఆమోదం కూడా లభిస్తే, త్వరలోనే కొత్త తరహా షూటింగ్ పోటీలను చూసే అవకాశం అభిమానులకు లభిస్తుంది.
హాకీలోనూ...
అంతర్జాతీయ హాకీలోనూ విప్లవాత్మక మార్పులకు లండన్ ఒలింపిక్స్ వేదికైంది. క్రికెట్ తరహాలో హాకీలోనూ ఫీల్డ్ అంపైర్ నిర్ణయాలపై తలెత్తిన అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి థర్డ్ అంపైర్ జోక్యాన్ని కోరే అవకాశాన్ని ఒలింపిక్స్‌లో ప్రవేశపెట్టారు. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) ఇటీవల కాలంలో తీసుకున్న అత్యంత కీలకమైన నిర్ణయమిది. నిజానికి 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లోనే ‘రిఫరల్’ విధానాన్ని అమలు చేయాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే, హడావుడి నిర్ణయాలు తీసుకోలేమంటూ లండన్ ఒలింపిక్స్ వరకూ ఎఫ్‌ఐహెచ్ దీనిని వాయిదా వేసింది. ఎక్‌స్ట్రా టైమ్‌తో సహా మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక్కో జట్టు ఒక్కోసారి అంపైర్ నిర్ణయాలపై థర్డ్ అంపైర్ జోక్యాన్ని కోరవచ్చు. అయితే, ఈ ప్రతిపాదన తప్పనిసరిగా ఫీల్డ్ అంపైర్ నుంచే రావాల్సి ఉంటుంది. అంటే, మ్యాచ్ ఆడుతున్న జట్లు నేరుగా థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని కోరే అవకాశం ఉండదు. గోల్ లేదా ఆఫ్‌సైడ్ వంటి అంశాలపై తనకు కూడా అనుమానం వచ్చినప్పుడు, జట్ల కోరిక మేరకు అతను థర్డ్ అంపైర్‌కు సదరు సంఘటనను నివేదిస్తాడు. పెనాల్టీ షూటౌట్‌లను ప్రశ్నించే అధికారం జట్లకు లేదు. అయితే, ఈ విషయంలో ఫీల్డ్ అంపైర్‌దే తుది నిర్ణయం. అవసరాన్ని బట్టి అతను థర్డ్ అంపైర్ సాయం తీసుకోవచ్చు. ఈ విషయంలో అత్యంత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తారు. కాగా, క్రికెట్ మ్యాచ్‌లకు సేవలు అందిస్తున్న ‘హాక్-ఐ’ సంస్థ ఒలింపిక్స్‌లో హాకీ మ్యాచ్‌లకూ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చింది. ఇలావుంటే, లండన్ ఒలింపిక్స్‌లో పురుషులు, మహిళల విభాగాల్లో హాకీ మ్యాచ్‌లను ఒకే మైదానంలో నిర్వహించడం కూడా కొత్త మార్పే. కృత్రిమ మైదానాన్ని కూడా ఆకుపచ్చని రంగు కాకుండా నీలం రంగులోకి మార్చడం మరో విశేషం. ఈతరహా ఆస్ట్రోటర్ఫ్‌ను ఉపయోగించడం ఇదే మొదటిసారి. ఈ మార్పుల ఫలితంగా లండన్ ఒలింపిక్స్‌తో అంతర్జాతీయ హాకీలో మార్పులకు ఎఫ్‌ఐహెచ్ శ్రీకారం చుట్టింది. భవిష్యత్తులో మరిన్ని మార్పులకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నది.
మారుతున్న కాలానికి అనుగుణంగా క్రీడా రంగం కూడా
english title:
route maaruthondi
Date:
Wednesday, October 17, 2012