Clik here to view.

సంకల్పబలం ఉంటే ఎలాంటి సమస్యనైనా అధిగమించవచ్చని ఆస్ట్రేలియా ‘స్విమ్మింగ్ లెజెండ్’ ఇయాన్ థోర్ప్ నిరూపించాడు. ఐదు ఒలింపిక్ స్వర్ణ పతకాలను తన ఖాతాలో చేర్చుకున్న థోర్ప్ చాలాకాలం విపరీతమైన మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడ్డాడు. అభిమానులు తనపై ఉంచిన నమ్మకానికి తగినట్టు రాణించాలన్న తపన అతనిపై తీవ్ర ప్రభావం చూపింది. మరోవైపు తనపై వచ్చిన విమర్శలు అతనికి నిద్ర లేకుండా చేశాయి. థోర్ప్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎన్నో కథనాలు పుట్టుకొచ్చాయి. ఆ వార్తల్లో నిజం లేదని థోర్ప్ పదేపదే చెప్పుకోవాల్సి వచ్చింది. కానీ, అబద్దానికి ఉన్న వేగం నిజానికి ఉండదు. అసాధారణ స్విమ్మర్‌గా పేరుప్రఖ్యాతులు ఆర్జించి, సెలబ్రిటీ హోదాను సంపాదించిన అతనిపై ఆసీస్ మీడియా వరుస కథనాలను ప్రచురించి సొమ్ము చేసుకుంది. పబ్లిసిటీ కోసం అభూత కల్పనలతో ఊదరగొట్టింది. దీని పర్యవసానం థోర్ప్‌ను మానసికంగా కుంగతీసింది. ఒత్తిడిని తట్టుకోలేకపోయిన థోర్ప్ ఒకానొక దశలో పిచ్చివాడిగా మారే ప్రమాదంలో పడ్డాడు. అయితే, అంతులేని ఆత్మవిశ్వాసమే అతనిని మనిషిగా నిలబెట్టింది. తనపై వచ్చిన ప్రతి ఆరోపణకూ అతను విస్పష్టమైన సమాధానాలే చెప్పాడు. తాజాగా ‘దిస్ ఈజ్ మీ: ది ఆటోబయోగ్రఫీ’ పేరుతో ఆత్మకథను రాశాడు. అందులో తన జీవితానికి సంబంధించిన అన్ని కోణాలను బహిరంగ పరిచాడు. చివరికి ఒత్తిడికిలోనై, ఆత్మనూన్యతతో బాధపడిన కాలాన్ని గురించి కూడా థోర్ప్ వివరించాడు. ఆత్మహత్య చేసుకోవాలని చాలాకాలం అనుకున్నట్టు అందులో తెలిపాడు. పిరికితనంతో చనిపోతే వాస్తవాలు ఎప్పటికీ ప్రపంచానికి తెలియవన్న అభిప్రాయంతో ఆ ప్రయత్నాలను విరమించుకున్నానని థోర్ప్ పేర్కొన్నాడు. స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యుల సహకారంతో తాను ఒత్తిడిని అధిగమించగలిగానని, ఇప్పుడు ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగల ధైర్యం తనకు ఉందని ‘ఆత్మకథ’లో వివరించాడు. ‘్థర్పెడో’ అని అభిమానులు పిలుచుకునే థోర్ప్ 2006లో అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. 1998-2004 మధ్యకాలంలో అతను ఎనిమిది స్వర్ణాలు సహా మొత్తం తొమ్మిది ఒలింపిక్ పతకాలను కైవసం చేసుకున్నాడు. 11 ప్రపంచ టైటిళ్లను సాధించాడు. 13 లాంగ్ కోర్స్ స్విమ్మింగ్ ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు. కెరీర్‌లో అసాధారణ విజయాలను సాధించిన థోర్ప్ నిజ జీవితంలోనూ అదే స్థాయిలో సమస్యలను అధిగమించి ధీరోదాత్తుడిగా నిలబడ్డాడు. అతను తన ఆత్మకథలో పేర్కొన్న చాలా అంశాలు కేవలం అతనికి మాత్రమే పరిమితమైనవి కావు. కొంచం అటూ ఇటుగా క్రీడా రంగంలో అందరి పరిస్థితి అలాంటిదే.