భారత వైమానిక దళానికి చెందిన జెట్ ప్లేన్‌ను ఎక్కే అవకాశం రావడమే అద్భుతం. ఇక దానిని నడిపించే చాన్స్ వస్తే ఎవరైనా ఊరుకుంటారా? ఎగిరి గంతేస్తారు. అరుదైన ఆ అనుభూతిని సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతారు. కానీ, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెండూల్కర్ అయాచితంగా లభించిన అవకాశాన్ని చేజార్చుకున్నారు. ఇప్పట్లో వారికి ఆ అవకాశం రాదని వైమానిక దళం తేల్చిచెప్పింది. వివరాల్లోకి వెళితే, సచిన్‌ను వైమానిక దళం గౌరవ గ్రూప్ కెప్టెన్‌గా నియమించింది. భారత సైన్యం ధోనీకి గౌరవ లెఫ్టినెంట్ కల్నల్‌గా పదవులను కట్టబెట్టి గౌరవించింది. అదే సమయంలో ఎస్‌యు-30 ఎంకె1 జెట్‌ను నడిపించే అవకాశం కల్పిస్తామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని వైమానిక దళం వారిని కోరింది. కానీ, ఇద్దరు క్రికెటర్లు ‘బిజీ షెడ్యూల్’ అంటూ ఈ ప్రతిపాదనను తోసిపుచ్చారు. అంతేగాక తమను గౌరవించిన వైమానిక దళం, సైన్యం నిర్వహించే ఏ కార్యక్రమానికీ హాజరుకాలేదు. లండన్ ఒలింపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్‌కు ఇటీవల హైదరాబాద్ దుండిగల్ ట్రైనింగ్ సెంటర్‌లో జెట్ విమానాన్ని నడిపే అవకాశం రావడంతో, సచిన్, ధోనీలకు గతంలో ఇచ్చిన ఆఫర్ మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే, ఇప్పట్లో వారికి జెట్ విమానాన్ని నడిపించే అవకాశాన్ని ‘బిజీ షెడ్యూల్’ కారణంగా ఇవ్వలేకపోతున్నామని వైమానిక దళ అధికారులు తేల్చిచెప్పారు. ఎప్పుడు అవకాశం లభిస్తుందో చెప్పలేమని స్పష్టం చేశారు. అస్తశ్రస్త్రాల వినియోగంలో ఆరితేరిన భారత వైమానిక దళం ధోనీ, సచిన్‌ల ‘బిజీ షెడ్యూల్’ అస్త్రాన్ని వారిపైకే గురిపెట్టింది.
భారత వైమానిక దళానికి చెందిన జెట్ ప్లేన్‌ను ఎక్కే అవకాశం
english title:
avakasham
Date:
Wednesday, October 17, 2012