Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఓటరు నమోదుపై అవగాహన

$
0
0

నిజామాబాద్ టౌన్, అక్టోబర్ 17: ఓటు హక్కు ప్రాధాన్యత, ఓటరుగా పేర్లు నమోదు చేసుకోవడంపై వయోజనులకు విస్తృత కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించాలని కలెక్టర్ క్రిస్టీనా జడ్ చోంగ్తూ సూచించారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు ఓటరు జాబితాలో ఈ నెల 31లోగా పేర్లు నమోదు చేసుకోవాలని కలెక్టర్ అన్నారు. బుధవారం ఓటరు నమోదు కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు కళాశాలల విద్యార్థులు చేపట్టిన ర్యాలీని ప్రగతిభవన్ ఎదుట కలెక్టర్ జెండాఊపి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ, మంచి కార్యక్రమానికి విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో జిల్లాలోని ప్రతీ డివిజన్, మండల, గ్రామాలలో విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించి, ప్రజలందరికీ ఓటరు నమోదు కార్యక్రమంపై అవగాహన కల్పించాలని ఆమె పిలుపునిచ్చారు. కొత్తగా ఓటర్లు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు వీలుగా నియోజకవర్గస్థాయిలో డిగ్రీ, పిజి కళాశాలల విద్యార్థులకు, వృత్తివిద్య కోర్సుల కళాశాల విద్యార్థులకు పెద్దఎత్తున అవగాహన కల్పించి ఓటర్లుగా తమ పేరు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఫారం-6 ద్వారా కొత్తగా పేరు నమోదుకు, ఫారం-7లో అభ్యంతరాలు, ఫారం-8లో వివరాల మార్పులు, ఫారం-8ఎలో అదే నియోజకవర్గంలో ఒక పోలింగ్ స్టేషన్ నుండి మరోక పోలింగ్ స్టేషన్‌కు బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. విద్యార్థులు నిర్వహించిన ర్యాలీ జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా సాగి, ప్రగతిభవన్‌కు చేరుకుంది. ర్యాలీ సందర్భంగా విద్యార్థులు పెద్దపెట్టున ఓటరు నమోదు, దాని ప్రాముఖ్యతపై నినాదాలు చేశారు. అనంతరం ప్రగతిభవన్‌లో విద్యార్థులకు ఓటరు నమోదు కార్యక్రమంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఇందులో గెలుపొందిన వారికి కలెక్టర్ బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ జగదీశ్వరాచారి, ఆర్డీఓ హన్మంత్‌రెడ్డి, బిసి వెల్ఫేర్ అధికారి రాజయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఇడి రాజేశ్వర్, తహశీల్దార్ రాజేందర్, డిటి కాళిదాస్‌తో పాటు వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వరకట్న నిషేధ చట్టంపై అవగాహన సదస్సు

కలెక్టర్ క్రిస్టీనా

నిజామాబాద్ టౌన్, అక్టోబర్ 17: వరకట్న నిషేధచట్టం, మహిళా సాధికారితపై ఈ నెల 30న మండలాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ క్రిస్టీనా జడ్ చోంగ్తూ తెలిపారు. పిల్లలు, మహిళలపై అత్యాచారాలు, వరకట్న వేధింపులు, హత్యలు, మహిళా సాధికారిత తదితర అంశాలపై స్ర్తి, శిశు సంక్షేమ శాఖ, స్వచ్ఛంద సంస్థలు, ఇందిరా క్రాంతి పథంల ఆధ్వర్యంలో జిల్లాలోని 8 మండల కేంద్రాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సదస్సులు సంబంధిత మహిళా సమాఖ్య భవనాల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతాయని అన్నారు. అవగాహన సదస్సుల కార్యాచరణ రూపొందించామని, డిచ్‌పల్లి, సదాశివనగర్, భీమ్‌గల్, నందిపేట్, బోధన్, కామారెడ్డి, మద్నూర్ మండలాల్లో కార్యక్రమాలు ఉంటాయన్నారు. మహిళలు, పిల్లలకు సంబంధించిన పలు అంశాలతో పాటు వారికి అన్యాయం జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు, ఫిర్యాదులపై, గర్భిణులు, పిల్లలకు అందించాల్సిన పౌష్టికాహారం, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను సదస్సుల ద్వారా వివరించడం జరుగుతోందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

శిఖం భూములు ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు

జాయింట్ కలెక్టర్ హర్షవర్ధన్

పిట్లం, అక్టోబర్ 17: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ శిఖం భూములను ఆక్రమించుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ హర్షవర్ధన్ హెచ్చరించారు. బుధవారం ఆయన మండలంలోని పారడ్‌పల్లి గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. శిఖం భూముల రక్షణ కోసం త్వరలో ఫఎన్సింగ్ చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఉన్న భూ సమస్యను పరిష్కరించడానికే రెవెన్యూ శాఖ తరఫున ఈ సదస్సులను నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామాలలో తెల్లకాగితాలు, బాండు పేపర్లపై భూముల క్రయ, విక్రయాలు జరిపిన కేసులు సుమారు 20 వేల వరకు ఉన్నాయని జెసి తెలిపారు. అలాగే జిల్లాలో సుమారు 70 శాతం భూ సమస్యలు, తగాదాలు నడుస్తున్నాయని, ఇలాంటి వాటిని పరిశీలించడానికి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సదస్సులను నవంబర్ 29వరకు నిర్వహించనున్నామన్నారు. ఇందుకోసం తహశీల్దార్‌తో ఓ బృందం, డిప్యూటీ తహశీల్దార్‌తో మరో బృందం ఏర్పాటు చేసి రోజుకో గ్రామం చొప్పున సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అవకాశాన్ని బట్టి రెవెన్యూ రికార్డులను గ్రామాలకు తీసుకెళ్లి లబ్ధిదారులకు మేలు చేస్తామని తెలిపారు. గ్రామాల్లో ప్రభుత్వ మిలుగు భూములు ఉంటే పేదలకు ఇళ్ల స్థలాలు, శ్మశానవాటికలకు కేటాయిస్తామని పేర్కొన్నారు. గ్రామాలలో రెవెన్యూ శాఖ ఒక తీరు, వ్యవసాయ శాఖ మరోతీరుగా భూ విస్తీర్ణం ఉన్నట్లు రికార్డులు చూపడం ద్వారా ఎరువుల పంపిణీ సమయంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని జెసి తెలిపారు. ముఖ్యంగా రిజర్వుడు ఫారెస్ట్ భూములలో రైతులు వ్యవసాయం చేసుకుంటే అలాంటి భూములను రిజిస్ట్రేషన్ చేయబడదని అన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ గోవర్ధన్, విఆర్‌ఓ సంగందేశాయి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

మండుతున్న నిత్యావసరాలు

పండుగల వేళ ప్రజల అవస్థలు

కంఠేశ్వర్, అక్టోబర్ 17: కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు నానాటికీ విపరీతంగా పెరిగిపోతుండడంతో సామాన్య, పేద ప్రజానీకం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మరోవైపు సబ్సిడీ వంట గ్యాస్‌పై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో ప్రజల పరిస్థితి పుండు మీద కారం చల్లిన చందంగా మారింది. మార్కెట్‌లో ప్రతి వస్తువు ధర పెరిగిపోవడంతో ప్రజలు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయాలంటేనే జంకుతున్నారు. దసరా, బతుకమ్మ, బక్రీద్, దీపావళి పండుగల సీజన్ కావడంతో కూరగాయల ధరలను వ్యాపారులు రెట్టింపు చేశారు. రెండుమూడు వందల రూపాయలు ఖర్చు చేసినా కనీసం చేతి సంచి కూడా నిండడం లేదని సామాన్య ప్రజలు వాపోతున్నారు. జిల్లా కేంద్రానికి ఆనుకుని పరిసర గ్రామాల నుండి రైతులు సాగు చేసిన కూరగాయలను నిజామాబాద్‌కు తరలించుకుని విక్రయిస్తుంటారు. అయితే స్థానిక వ్యాపారులు వారు కూరగాయలు తెచ్చిన వెంటనే వాటిని గంపగుత్తగా కొనుగోలు చేసుకుని తమ దుకాణాల్లో నిలువ పెట్టుకుంటున్నారు. అమాంతంగా ధరలు పెంచి విక్రయాలు జరుపుతున్నారు. జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్, అహ్మదీబజార్, గంజ్ తదితర ప్రాంతాల్లో కూరగాయల విక్రయాలు ఉదయం నుండి రాత్రి వరకు కూడా కొనసాగుతాయి. అయితే మునుపెన్నడూ లేనివిధంగా ధరలు మండిపోతుండడంతో ఈ ఆర్థిక భారాన్ని భరించేందుకు నిరుపేద, సామాన్య కుటుంబాల వారు బడ్జెట్ సర్దుబాటు కోసం నానా అవస్థలు పడుతున్నారు. చిక్కుడు, క్యాలీఫ్లవర్, వంకాయ, గోరుచిక్కుడు, బీర, బెండకాయ ఇత్యాది కూరగాయల ధరలు కిలోకు 40 రూపాయలు పలుకుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కిలో 5 రూపాయలకు లభ్యమైన టమాటలు నెల రోజుల వ్యవధిలోనే మూడింతలు ఎక్కువ రేటుకు అమ్ముడవుతున్నాయి. రోజువారీ ఆహారంలో కూరగాయల వినియోగం తప్పనిసరి కావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వ్యాపారులు కోరిన మేరకు ధరలు చెల్లిస్తూ కొనుగోలు చేస్తున్నారు. నిజానికి కూరగాయలు పండించిన రైతులకు గిట్టుబాటు ధర లభించకపోగా, వినియోగదారులకు అందుబాటులో ధరలు లేకపోవడంతో అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్న చందంగా పరిస్థితి మారిందని ప్రజలు వాపోతున్నారు. పాలకులు అవలంభిస్తున్న విధానాల వల్లే ఇటు సామాన్య ప్రజలు, అటు రైతాంగం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని విశే్లషకులు పేర్కొంటున్నారు. ధాన్యానికి మార్కెట్‌లో క్వింటాలుకు 1100 రూపాయల మద్దతు ధర అందడం గగన కుసుమంగా మారింది. అదే సమయంలో సన్నరకం బియ్యాన్ని ఫైన్‌రైస్ పేరుతో కిలోకు 26 నుండి 35 రూపాయల చొప్పున వ్యాపారులు విక్రయిస్తున్నారు. దీంతో వివాహాది శుభకార్యాలు నిర్వహించాల్సిన సమయంలో తడిసి మోపెడవుతున్న ఖర్చును తల్చుకుని సాధారణ కుటుంబాల వారు గుండె చిక్కబట్టుకుంటున్నారు. పాలక ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ, విదేశాల నుండి సరుకులను దిగుమతి చేసుకోవడం మూలంగానే నిత్యావసర వస్తువుల ధరలు ప్రజలకు అందుబాటులో లేకుండాపోయాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోటు టోకు, రిటైల్ వ్యాపారులు అక్రమ నిల్వలను కొనసాగిస్తూ, కృత్రిమ కొరత సృష్టించి అధిక లాభాలు ఆర్జిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అయినా నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ప్రజలు విమర్శిస్తున్నారు. గత సంవత్సరం గోధుమలు, బియ్యం, వంటనూనెలు, పంచదార, పప్పు్ధన్యాల ధరలు 20 శాతం పెరుగగా, ప్రస్తుతం మరింత పెంచి మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ధరల నియంత్రణ చట్టం అమలు చేయడంతో పాటు అక్రమ నిల్వలను బయటకు తీసి, సంబంధిత వ్యక్తులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కొలిక్కి వచ్చిన చైన్‌స్నాచింగ్ కేసులు..!

ఢిల్లీ పోలీసులకు చిక్కిన దొంగలు..?

నిజామాబాద్ టౌన్, అక్టోబర్ 17: జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాలలో జరిగిన చైన్‌స్నాచింగ్ దొంగతనాలు కొలిక్కి వచ్చాయి. నలుగురు సభ్యులు గల ముఠాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన దొంగలను విచారించగా, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో చైన్‌స్నాచింగ్, ఇతరత్రా దొంగతనాలకు పాల్పడినట్లు వారు వెల్లడించినట్లు తెలిసింది. ఈ ముఠాలోని ఇద్దరు సభ్యులు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోరీలకు పాల్పడినట్లు వెల్లడి కాగా, వారిని మిర్యాలగూడ పోలీసులు విచారణ నిమిత్తం కోర్టు నుండి అదుపులోకి తీసుకున్నారు. ఇదే ముఠాలోని నలుగురు సభ్యులు నిజామాబాద్‌లోని ప్రగతినగర్‌లో గల ఆంధ్రాబ్యాంక్ ఖాతాదారుడి నుండి 4 లక్షల రూపాయల బ్యాగ్‌ను చాకచక్యంగా అపహరించినట్లు తెలిసింది. ఈ సంఘటన మే 29వ తేదీన చోటు చేసుకుంది. అదేవిధంగా నగరంలోని వినాయక్‌నగర్, శివాజీనగర్, ప్రగతినగర్‌లలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. ప్రస్తుతం ముఠాలోని సభ్యులు మిర్యాలగూడ పోలీసుల అదుపులోంచి విచారణ నిమిత్తం నగర పోలీసులు జిల్లా కేంద్రానికి తీసుకువచ్చినట్లు సమాచారం. ఈ ముఠాలోని నలుగురు సభ్యులు కూడా ఢిల్లీకి చెందిన వారుగా గుర్తించారు. దేశంలోని ఉత్తరప్రదేశ్, బీహార్, కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లలో పెద్దఎత్తున చోరీలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ముఠాకు చెందిన ఇద్దరిని మిర్యాలగూడ పోలీసుల నుండి అదుపులోకి తీసుకున్న నగర పోలీసులు, మరో ఇద్దరి కోసం ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఎట్టకేలకు వీరు ఢిల్లీలో పట్టుబడడంతో జిల్లా కేంద్రంలో జరిగిన నాలుగు చైన్‌స్నాచింగ్ కేసులు ఓ కొలిక్కి వచ్చినట్లేనని భావిస్తున్నారు.

వర్సిటీలో చల్లారని
నిరసన జ్వాలలు

కొనసాగుతున్న తరగతుల బహిష్కరణ

సయోధ్యకు చొరవ చూపని ఉన్నతాధికారులు

ఆంధ్రభూమి బ్యూరో
నిజామాబాద్, అక్టోబర్ 17: ఉన్నత విద్యాబోధనతో అలరారాల్సిన తెలంగాణ విశ్వవిద్యాలయంలో నిరసన జ్వాలలు చల్లారడం లేదు. గడిచిన పక్షం రోజులకు పైగా అనునిత్యం ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవి విద్యార్థులు, అధ్యాపకుల నడుమ బలపడాల్సిన గురుశిష్యుల సంబంధానికి మరింత చేటు కలిగిస్తున్నాయి. చిన్నపాటి వివాదం చిలికిచిలికి గాలివానలా మారడంతో వర్శిటీ విద్యార్థుల భవిష్యత్తుపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యార్థులు మూకుమ్మడిగా తరగతి గదులకు హాజరుకాకుండా, సెమిస్టర్ పరీక్షలను బహిష్కరించడం ఆందోళన కలిగించే పరిణామంగా మారింది. గత నెల 30వ తేదీన తెలంగాణ కోరుతూ జెఎసి ఆధ్వర్యంలో చేపట్టిన హైదరాబాద్ మార్చ్ కార్యక్రమం సందర్భంగా పోలీసులు లాఠీచార్జ్జి చేయడాన్ని నిరసిస్తూ ఆ మరుసటి రోజే తెలంగాణ వర్శిటీలో విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మహిళా అధ్యాపకురాలు మమతకు, విద్యార్థి సంఘం నేతకు మధ్య చోటుచేసుకున్న సంవాదం వివాదానికి దారితీసి, అది రావణకాష్టంలా రగులుతోంది. విద్యార్థి నేతను ఉద్దేశించి అధ్యాపకురాలు పరుష పదజాలంతో దూషించారని, సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘ నేతలు అంతకంతకూ ఆందోళనను తీవ్రతరం చేస్తున్నారు. మొదటగా ధర్నాలు నిర్వహించిన మీదట, తరగతులను బహిష్కరించడం, ఏకంగా సెమిస్టర్ పరీక్షలకు సైతం హాజరుకాకుండా నిరసన తెలుపుతున్నారు. ఈ వివాదానికి సంబంధించి ముగ్గురు అధికారులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ, సదరు మహిళా ప్రొఫెసర్‌ను బర్తరఫ్ చేయాల్సిందేనని విద్యార్థి నేతలు పట్టుబడుతున్నారు. వర్శిటీ అధికారులు పలుమార్లు విద్యార్థి సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపినప్పటికీ సమస్య కొలిక్కి రాలేకపోయింది. దీంతో తెలంగాణ యూనివర్శిటీలో గత రెండు వారాల నుండి తరగతుల బహిష్కరణ పర్వం యథాతథంగా కొనసాగుతూనే ఉంది. అనునిత్యం నిరసనలు కొనసాగుతుండడంతో వర్శిటీ ప్రతిష్ఠకు భంగం వాటిల్లే పరిస్థితి నెలకొంది. విద్యార్థి జెఎసి నేతలు కుల సంఘాలు విడిపోయి, ఇదివరకు చోటుచేసుకున్న పలు సంఘటనలను దృష్టిలో పెట్టుకుని వ్యక్తిగత విభేదాలతోనే ఈ చిన్నపాటి సమస్యపై రాద్ధాంతం సృష్టిస్తున్నారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. మరోవైపు విద్యార్థి సంఘాల డిమాండ్‌పై సమగ్ర విచారణ జరిపించి, తక్షణ చర్యలు చేపట్టడంలో వర్శిటీ అధికారులు విఫలమైనందు వల్లే సమస్య మరింత జఠిలంగా మారిందనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ముగ్గురు అధికారులతో కూడిన విచారణ కమిటీని నియమించిన అధికారులు, కమిటీ నివేదికను బహిర్గతం చేయకుండా, విద్యార్థి నేత పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన అధ్యాపకురాలిపై ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడాన్ని విద్యార్థి సంఘాల ప్రతినిధులు తప్పుబడుతున్నారు. వర్శిటీ వైస్ ఛాన్స్‌లర్ అక్బర్‌అలీఖాన్ వ్యవహార శైలిని వారు తీవ్రంగానే ఆక్షేపిస్తున్నారు. సమస్య ఉత్పన్నమైన సమయంలోనే విసి సమయోచితంగా వ్యవహరించి విద్యార్థి సంఘ బాధ్యులను సమాధానపర్చి ఉంటే, ఆందోళనలకు తావుండేది కాదని పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల వల్ల తెలంగాణ యూనివర్శిటీలో విద్యార్థులు, అధ్యాపకుల మధ్య నెలకొని ఉండాల్సిన సుహృద్భావ వాతావరణం దెబ్బతింటోంది. చిన్నపాటి వివాదం కాస్తా తారస్థాయికి చేరుకుని విభేదాలు తీవ్రరూపం దాల్చినప్పటికీ ఉన్నతాధికారులులెవరూ ఈ విషయంలో అధ్యాపకులు, విద్యార్థులకు మధ్య సయోధ్య కుదిర్చేందుకు చొరవ చూపిన దాఖలాలు కనిపించడం లేదు. దీంతో వర్శిటీలో నెలకొన్న ఈ సంక్షోభం ఎలాంటి మలుపులు తిరుగుతుందోనన్న ఆందోళన అన్ని వర్గాల వారిలో, ప్రత్యేకించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కలవరపాటుకు గురి చేస్తోంది.

ఎన్సీఎఫ్‌లో ఎండి నిర్బంధం

నిజామాబాద్ రూరల్, అక్టోబర్ 17: నిజామాబాద్ మండలం సారంగపూర్ కోఆపరేటివ్ సుగర్ ఫ్యాక్టరీలో మేనేజింగ్ డైరెక్టర్ మురళిధర్‌రావును, రెగ్యులేటర్ ఇన్స్‌పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డిను కార్మికులు బుధవారం కార్యాలయంలో నిర్బంధించారు. గత మూడు మాసాలుగా కర్మాగారంలో పనిచేసే 48 మంది పర్మినెంట్ కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదని వారు ఆరోపించారు. గతంలో ప్రభుత్వం ఫ్యాక్టరీకి 5.58 కోట్ల రూపాయలు విడుదల చేయగా, అందులో నుండి కార్మికుల వేతనాల కోసం 1.50 కోట్లు కేటాయించారన్నారు. అయితే ప్రస్తుతం కార్మికుల వేతనాల కోసం కేటాయించిన మొత్తం అయిపోవడంతో తమకు వేతనాలు చెల్లించడం లేదని కార్మికులు వాపోతున్నారు. ఎండిని నిర్బంధించిన విషయం తెలుసుకున్న రూరల్ ఎస్‌ఐ ముజీబుల్ రహ్మాన్ అక్కడకు చేరుకుని, కార్మికులతో చర్చించి ఎండిని విడుదల చేయించారు. ఎండి మురళీధర్‌రావు మాట్లాడుతూ, సంబంధిత శాఖ కమిషనర్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని కార్మికులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఫ్యాక్టరీ జెఎసి నాయకులు శ్రీనివాస్, శంకర్‌రెడ్డి, జ్ఞానశేఖర్‌తో పాటు కార్మికులు పాల్గొన్నారు.

మధ్యాహ్న భోజన ఏజెన్సీల నిర్వీర్యానికి కుట్ర

సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిద్ధిరాములు

కలెక్టరేట్ వద్ద ధర్నా

కంఠేశ్వర్, అక్టోబర్ 17: మధ్యాహ్న భోజన ఏజెన్సీల నిర్వీర్యానికి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిద్ధిరాములు ఆరోపించారు. అందులో భాగంగానే ఏజెన్సీలకు నెలల తరబడి బిల్లులు విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. సిద్ధిరాములు మాట్లాడుతూ, పథకం ప్రారంభించి 10 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ, ఏజెన్సీ సెంటర్లలో కనీస వౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నప్పటికీ, మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు స్లాబ్ రేట్లు పెంచకపోవడం వల్ల నిర్వాహకులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెలల తరబడి బిల్లులు విడుదల చేయకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్న పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మధ్యాహ్న భోజన ఏజెన్సీల నిర్వాహకులకు పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా స్లాబ్ రేట్లు పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో రెండుకోట్ల రూపాయలకు పైగా బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఏజెన్సీలకు సబ్సిడీ గ్యాస్ అందించడంతో పాటు స్టౌవ్‌లను సరఫరా చేయాలని కోరారు. అలాగే మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులను ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పౌష్టికాహారం కింద కోడిగుడ్లకు అయ్యే ఖర్చును సైతం ప్రభుత్వమే భరించాలని, పథకాన్ని స్వచ్ఛంద సేవా సంస్థలకు అప్పగించాలనే ప్రయత్నాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ ఆందోళన కార్యక్రమాలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ క్రిస్టీనాకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీల కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు భారతి, కార్యదర్శి చక్రపాణి, సిఐటియు నాయకులు రమేష్‌బాబు, గోవర్ధన్‌తో పాటు మధ్యాహ్న భోజన ఏజెన్సీల నిర్వాహకులు పాల్గొన్నారు.

టియు వైస్‌ఛాన్స్‌లర్ వ్యాఖ్యలపై
ఎబివిపి ఆగ్రహం

విసి దిష్టిబొమ్మ దగ్ధం

కంఠేశ్వర్, అక్టోబర్ 17: తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్ అక్బర్‌అలీఖాన్ విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలపై ఎబివిపి నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో వైస్‌ఛాన్స్‌లర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఎబివిపి జిల్లా కన్వీనర్ అంజాగౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం వల్ల అవినీతికి నిలయంగా మారిందన్నారు. యూనివర్సిటీ అభివృద్ధికి విడుదలైన నిధులను అక్రమంగా అధికారులు వాడుకుంటూ, సౌకర్యాల కల్పనలో అలసత్వం వహిస్తున్నారని విమర్శించారు. విద్యార్థులు పరీక్షలు రాయకుండా ఇంటివద్దనే గాజులు వేసుకుని కూర్చోవాలని వైస్‌ఛాన్స్‌లర్ దూషించడం శోచనీయమన్నారు. విద్యార్థులను అవమానపర్చే విధంగా వ్యాఖ్యలు చేసిన విసిని వెంటనే సస్పెండ్ చేయాలని, లేదంటే ఆందోళన కార్యక్రమాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎబివిపి నాయకులు వాసు, గంగారెడ్డి, రాకేష్, అక్షయ్, తివారీ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్ క్రిస్టీనా సూచన
english title: 
o

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>