Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

నామినేటెడ్ పదవుల కోసం ఆశావహుల పైరవీలు!

$
0
0

ఒంగోలు, అక్టోబర్ 17: నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న వారిలో ఎక్కువశాతం మంది రాష్ట్ర రాజధానికి పరుగులు తీశారు. జిల్లాలోని మెజార్టీ శాసనసభ్యులందరూ హైదరాబాదులో ఉండటంతో వారిని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇందిరమ్మబాట సందర్భంగా జిల్లాకు విచ్చేసిన ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ చేపడతామని పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. దీంతో పదవులు ఆశిస్తున్న వారందరూ ఆయా నియోజకవర్గాల శాసనసభ్యుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పదవులు ఆశిస్తున్న ఎక్కువశాతం మంది నేతలు జిల్లాను వదిలి రాజధానిలో తిష్టవేశారు. రాష్టస్థ్రాయి పదవులు ఆశిస్తున్నవారు ముఖ్యమంత్రిని, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలను ప్రసన్నం చేసుకుంటుండగా జిల్లాస్థాయిలో పదవులను ఆశిస్తున్నవారు మాత్రం శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి చుట్టూ తిరుగుతున్నారు. ఈపాటికే జిల్లాకు చెందిన కొన్ని నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ పూర్తయింది. అయితే అధికారికంగా జాబితాను ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియకు సంబంధించి ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీలను ముఖ్యమంత్రి కలిసినట్లు సమాచారం. వారి ఆదేశాల ప్రకారం త్వరలోనే జాబితాను ముఖ్యమంత్రి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. మరో 18 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొంతమంది నామినేటెడ్ పనులకోసం పరుగులు తీస్తున్నారు. గ్రామస్థాయి నాయకుడికి ఐదు లక్షల నుండి పది లక్షల రూపాయల వరకు పనులు నేతలు కట్టబెడుతున్నారు. ఆ పనులు తీసుకున్న నాయకులు వేరేవారికి అప్పగిస్తూ లక్ష రూపాయలకు పదిశాతం చొప్పున పదివేల రూపాయలు తీసుకుని చేతులు దులుపుకుంటున్నారు. ఒక్కొక్క చోటామోటా నాయకుడికి ఆయాచితంగా 50వేల నుండి లక్ష రూపాయల వరకు వస్తున్నాయి. దీంతో ఆ పనుల కోసం కొంతమంది ఎగబడుతున్నారు. మండల స్థాయి నాయకుడు అయితే 50 లక్షల రూపాయలకు పైగానే పనులను మంజూరు చేస్తున్నారు. దీంతో గ్రామస్థాయి నుండి మండల స్థాయి నాయకుల వరకు పనులమీద దృష్టిపెడుతూ జేబులను నింపుకుంటున్నట్లు సమాచారం. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు కూడా ఆవైపుగా దృష్టి సారిస్తున్నారు. కొంతమందికి నామినేటెడ్ పదవుల తాయిలాలు, మరొకపక్క లక్షల రూపాయలు విలువచేసే పనులను అప్పగిస్తూ వారిని ప్రసన్నం చేసుకునే పనిలో నేతలు తలమునకలై ఉన్నారు. రాష్ట్రంలో మారిన రాజకీయాల నేపథ్యంలో ప్రధానంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం, కాంగ్రెస్‌పార్టీల మధ్య పోటీ నెలకొననుంది. జిల్లాలోని ఎక్కువ శాతం మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. దీంతో ఉన్న కొద్దిమంది కార్యకర్తలు, నాయకులను తమవైపు తిప్పుకునే పనిలో నేతలు ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించి ఆ తరువాత ఎన్నికల సమయంలో ప్లేటు ఫిరాయించే పనిలో నేతలు ఉన్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంమీద జిల్లాలోని నేతలకు నామినేటెడ్ పదవులతోపాటు ప్రభుత్వపరంగా అభివృద్ధి పనులను మంజూరు చేస్తున్నారు.

అన్ని రహదారులు
ఇడుపులపాయ వైపే!
జిల్లా నుండి తరలిన వేలాదిమంది
వైఎస్‌ఆర్‌సిపి శ్రేణులు
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, అక్టోబర్ 17: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం కడప జిల్లా ఇడుపులపాయ నుండి బయలుదేరనున్న నేపథ్యంలో ఆమెకు సంఘీభావం తెలిపేందుకు జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్ళారు. జిల్లాలోని కొంతమంది నాయకులు, కార్యకర్తలు బుధవారం రాత్రికి బయలుదేరి వెళ్ళగా మరికొంతమంది ముఖ్యనాయకులు గురువారం వేకువజాము నుండి బయలుదేరి వెళ్ళనున్నారు. కడపకు దగ్గరలోని గిద్దలూరు, యర్రగొండపాలెం, మార్కాపురం నియోజకవర్గాల నుండి భారీగా కార్యకర్తలు, నాయకులు తరలివెళ్ళారు. జిల్లా నుండి కడపకు వెళ్ళే మార్గాలన్నీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో నిండిపోయింది. అద్దంకి నుండి మాజీ శాసనసభ్యుడు బాచిన చెంచుగరటయ్య 30 వాహనాలకు పైగానే ఇడుపులపాయకు పెట్టినట్లు సమాచారం. అదేవిధంగా గిద్దలూరు నాయకులు కూడా భారీగా వాహనాల్లో తరలివెళ్ళారు. ఇడుపులపాయకు తరలివెళ్ళిన వారిలో జిల్లాపార్టీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, నాయకులు బత్తుల బ్రహ్మానందారెడ్డి, కెవి రమణారెడ్డి, కెవి వెంకటేశ్వర్లు, వేమూరి బుజ్జి, ఎన్ తిరుమలరావు ఆయా నియోజకవర్గాలకు చెందిన నాయకులు ఉన్నారు. ఇదిలావుండగా ఇటీవల జరిగిన ఒంగోలు నియోజకవర్గ ఉపఎన్నికల్లో పోటీచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఆ పార్టీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వైఎస్ విజయమ్మ, షర్మిలలు ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఆ ఎన్నికల ప్రచారంలో షర్మిల ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి హైదరాబాదు నుండి నేరుగా ఇడుపులపాయకు చేరుకోనున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఇదిలాఉండగా జగన్‌కు బెయిల్ రావాలని కోరుతూ జిల్లావ్యాప్తంగా పూజా కార్యక్రమాలను నేతలు, కార్యకర్తలు నిర్వహించారు. ఈక్రమంలో ఇతర పార్టీల నుండి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చాలామంది వలసలు వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. మొత్తంమీద జిల్లా నుండి వేలాది మంది ఇడుపులపాయకు బయలుదేరి వెళ్ళారు.
మరో ప్రజాప్రస్థానం
చారిత్రాత్మక ఘట్టం:నూకసాని
ఇడుపులపాయ నుండి షర్మిల చేపట్టనున్న మరో ప్రజాప్రస్థానం చారిత్రాత్మక ఘట్టమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ ఆంధ్రభూమి ప్రతినిధితో హైదరాబాదు నుండి ఫోన్‌ద్వారా తెలిపారు. రాష్ట్రంలో మొదటిసారిగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేపట్టారని ఆయన పేర్కొన్నారు. వైఎస్ అమలుచేసిన సంక్షేమ పథకాలను తాము అధికారంలోకి వస్తే అమలుచేస్తామని షర్మిల ప్రజలకు వివరించనున్నారని ఆయన తెలిపారు. షర్మిల చేపట్టిన పాదయాత్రకు జిల్లానుండి ప్రజలు, కార్యకర్తలు, నాయకులు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

తాగునీటి కోసం మహిళల రాస్తారోకో
స్తంభించిన ట్రాఫిక్
ఒంగోలు అర్బన్, అక్టోబర్ 17: నగరంలోని కర్నూలురోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా స్థానిక బ్రహ్మంగారి మఠం పక్క వీధుల్లో గత 15 రోజుల నుండి మంచినీరు రాకపోవడంతో కోపోద్రిక్తులైన మహిళలు బుధవారం ఖాళీ బిందెలతో ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున ట్రాఫిక్ స్తంభించి పోయింది. ఇటీవల ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మూడు రోజుల పర్యటనకు ముందు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి తాత్కాలికంగా పైప్‌లైన్ వేసి మంచినీరు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికి ఆ హామీ అమలు కాలేదు. కార్పొరేషన్ అధికారులు కూడా పట్టీపట్టనట్లుగా వ్యవహరించడంతో మహిళలు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చి రాస్తారోకోకి దిగారు. ఐద్వా నగర కమిటీ ఆధ్వర్యంలో మహిళలు ఖాళీ బిందెలతో రాస్తారోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి మున్సిపల్ అధికారులకు సమాచారం అందించడంతో అధికారులు వచ్చి మూడు రోజుల్లో మంచినీరు సరఫరాచేసే విధంగా చర్యలు తీసుకుంటామని, ఈలోగా ట్యాంకర్లతో మంచినీటిని సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది. ఈ కార్యక్రమంలో ఐద్వా నేతలు కంకణాల రమాదేవి, ఆళ్ళ సీతామాహాలక్ష్మి, పి చిలకమ్మ, పి శారద, ఉన్నం వెంకటేశ్వరరావు, జెమిని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర జయప్రదం చేయాలి
వైఎస్‌ఆర్‌సిపి నేతల పిలుపు
ఒంగోలు అర్బన్, అక్టోబర్ 17: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు ఆయన సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను జయప్రదం చేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ జిల్లా అధ్యక్షుడు వేమూరి సూర్యనారాయణ (బుజ్జి) పిలుపునిచ్చారు. బుధవారం జిల్లాపార్టీ కార్యాలయంలో మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వేమూరి మాట్లాడుతూ కోట్లాది మంది అభిమానులు గర్వపడే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. నిరాశా నిస్ప్రృహలతో ప్రజలు ఉన్నారన్నారు. షర్మిల చేపట్టిన పాదయాత్ర ప్రజల్లో విప్లవానికి మరో నాంది పలుకుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ దుష్ట పరిపాలనను అంతమొందించేందుకు ప్రతిఒక్కరు ముందుకు రావాలన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు డిపాజిట్లు గల్లంతవడం ఖాయమన్నారు. పాదయాత్రలో జన ప్రభంజనం చూసి ఆ రెండు పార్టీల నేతలకు గుండెలు పగలడం ఖాయమన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టడం ఖాయమన్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగకపోవడంతో అధికారుల పాలన వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు సక్రమంగా అమలుజరగాలన్న, రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా ఉండాలన్నా ఈ రాష్ట్రానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. వైఎస్ జగన్‌ను రెండు పార్టీలు కుమ్మక్కై అక్రమంగా అరెస్టు చేయించి జైల్లో పెట్టాయన్నారు. ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు మాజీ శాసనసభ్యుడు దారా సాంబయ్య, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల సుధాకర్‌బాబు, ట్రేడ్ యూనియన్ జిల్లా కన్వీనర్ కెవి ప్రసాద్, ఒంగోలు నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, నాయకులు కత్తినేని రామకృష్ణారెడ్డి, దుగ్గిరెడ్డి ఆంజనేయరెడ్డి, పి గోవర్ధనరెడ్డి, వైవి రామిరెడ్డి, తోటపల్లి సోమశేఖర్, గంటా రామానాయుడు, బొప్పరాజు ఏడుకొండలు, ముదవర్తి బాబూరావు ఆవుల జాలయ్య, డిఎస్ క్రాంతి కుమార్, మారెడ్డి అంజిరెడ్డి, పల్లకి సత్యనారాయణరెడ్డి, పి కృష్ణారెడ్డి, కఠారి ప్రసాద్, మహిళా నాయకులు కావూరి సుశీల, బడుగు ఇందిర తదితరులు పాల్గొన్నారు.

అప్రకటిత విద్యుత్ కోతలకు రైతుల నిరసన
* భీష్మించిన రైతులపై లాఠీచార్జీ
కురిచేడు, అక్టోబర్ 17: వ్యవసాయ రంగానికి సక్రమంగా విద్యుత్ సరఫరా చేయకపోవడమేకాకుండా అప్రకటిత కోతలకు నిరసనగా మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు బుధవారం మధ్యాహ్నం కురిచేడు బస్టాండ్ సెంటర్‌లో రాస్తారోకోయత్నం చేశారు. ఆవులమంద, నాయుడుపాలెం, కల్లూరుగ్రామాలకు చెందిన 100మంది రైతులు రాస్తారోకోకు దిగారు. ఈ ఆందోళనకు ముందస్తుగా అనుమతి తీసుకోనందున బైఠాయించడానికి వీలులేదని ఎస్సై ఎస్ సుబ్బారావు రైతులను వెళ్ళిపోవాల్సిందిగా సూచించారు. తాము కొంతసేపు తమ నిరసనను ప్రకటించి వెళ్ళిపోతామని రైతులు ఎస్సైకి విన్నవించారు. ముందుగా అనుమతి తీసుకోనందున అంగీకరించబోమని వెళ్ళిపోవాల్సిందిగా ఎస్సై చెప్పారు. వీరిమధ్యలో తోపులాటలు జరిగాయి. దీంతో ఆగ్రహించిన రైతులు పోలీసులు డౌన్..డౌన్.. అంటూ నినాదాలు చేశారు. ఎంతకీ రైతులు ఆందోళన విరమించకపోవడంతో వారిపై ఎస్సై సుబ్బారావు, సిబ్బంది లాఠీచార్జీ చేశారు. కొంతమంది రైతులను పోలీసుస్టేషన్‌కు తరలించారు. కొందరు రైతులు విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద ధర్నా చేసేందుకు వెళ్ళారు. అక్కడ కురిచేడు, నమశ్శివాయపురం, వెంగాయపాలెం గ్రామాలకు చెందిన రైతులు కూడా తోడయ్యారు. సబ్‌స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం రైతులను అదుపులోకి తీసుకున్న పోలీస్టేషన్ వద్దకు చేరుకున్నారు. దర్శి సిఐ శ్రీరామ్ రైతులను సముదాయించారు. విద్యుత్ సరఫరా గురించి రైతులు చేస్తున్న ఆందోళనను ఫోన్ ద్వారా సిఐ విద్యుత్‌శాఖ అధికారులను సంప్రదించారు. ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న కిలారి కొండయ్యతో విద్యుత్‌శాఖ అధికారులను మాట్లాడించారు. వారంలో నాలుగు రోజులు రాత్రి, మూడురోజులు పగటిపూట వ్యవసాయరంగానికి విద్యుత్ సరఫరా చేస్తామని ఆ శాఖ అధికారులు ఇచ్చిన హామీతో రైతులు ఊరట చెందారు. అనంతరం సిఐ శ్రీరామ్ మాట్లాడుతూ ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని తెలిపారు. పోలీసుల అదుపులో ఉన్న రైతుల నుంచి బైండోవర్ తీసుకొని వదిలివేశారు. ఈ ఆందోళనకు ముందు రైతులు తహశీల్దార్ వెంకటేశ్వర్లును కలిసి విద్యుత్ సరఫరాపై నిరసన తెలుపుతూ వినతిపత్రం సమర్పించారు.

ఆక్రమణలు తొలగిస్తాం - ఆర్‌డిఓ
శింగరాయకొండ, అక్టోబర్ 17: శింగరాయకొండ ఆర్టీసీ బస్టాండ్ చుట్టూ ప్రయాణికులకు ఇబ్బందిగా మారే ఆక్రమణలను తొలగిస్తామని కందుకూరు ఆర్‌డిఓ టి.బాపిరెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం ఆయన శింగరాయకొండలో రెవిన్యూ పరంగా పెండింగ్‌లో ఉన్న స్థలాలను పరిశీలించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారి, ఆర్టీసీ బస్టాండ్‌కు చుట్టుపక్కల ఆక్రమణల విషయమై తహశీల్దార్ వందనంతో చర్చించారు. బస్టాండ్ చుట్టుపక్కల స్థలం ఆక్రమణకు గురైందని రెవెన్యూ అధికారులు వెళ్తే ఆక్రమణ దారులు సర్వే నెంబర్ మార్చి కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారని తహశీల్దార్ వందనం ఆర్‌డిఓకు తెలిపారు. వెంటనే పరిశీలించి ఆక్రమణ దారుల నుంచి అక్రమ కట్టడాలను తొలగిస్తామని ఆయన తెలిపారు. రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల మంజూరుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆర్‌డిఓ తహశీల్దార్‌కు సూచించారు. తన కార్యాలయానికి వచ్చిన రికార్డులను వెంటనే ఒకరోజులోనే పూర్తి చేస్తామని రైతులను ఇబ్బంది పెట్టవద్దని ఆయన సూచించారు. గ్రామ రెవెన్యూ అధికారులతో భూముల కంప్యూటరీకరణ ఎంతవరకు పూర్తి అయిందని వెంటనే వాటిని పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో ఆర్‌ఐ వెంకటలక్ష్మి, విఆర్వో అనిల్, సర్వేయర్ బాలాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

ఎస్‌ఎస్ ట్యాంకులను పరిశీలించిన కమిషనర్
ఒంగోలు, అక్టోబర్ 17: నగరంలోని రెండు ఎస్‌ఎస్ ట్యాంకులను ఒంగోలు కార్పొరేషన్ కమిషనర్ ఎస్ రవీంద్రబాబు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మొదటి ఎస్‌ఎస్ ట్యాంకు చుట్టూ జరుగుతున్న పెన్షింగ్ పనులను పరిశీలించారు. ఫెన్షింగ్ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. అనంతరం ఎస్‌ఎస్ ట్యాంకులకు చేరిన తాగునీటిని కమిషనర్ పరిశీలించారు. అనంతరం హౌసింగ్ బోర్డు కాలనీలోని పైప్‌లైన్లను పరిశీలించారు. పైప్‌లైన్‌ల నిర్మాణాలను త్వరితగతిన చేపట్టి ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని కమిషనర్ కాంట్రాక్టర్లను ఆదేశించారు.

వృద్ధులను ప్రభుత్వం ఆదుకోవాలి
ఎంఆర్‌పిఎస్ నేత మందా కృష్ణమాదిగ డిమాండ్
ఒంగోలు, అక్టోబర్ 17: వృద్ధులకు, వితంతువులకు పింఛన్ పెంచి ప్రభుత్వం ఆదుకోవాలని ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. వృద్ధులకు పింఛన్ పెంచాలని డిమాండ్ చేస్తూ మందా కృష్ణమాదిగ చేపట్టిన యుద్ధ్భేరి యాత్ర బుధవారం ఒంగోలుకు చేరింది. ఈ సందర్భంగా స్థానిక జిల్లా కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ రాష్ట్రంలో 80 లక్షల మంది వృద్ధులు, 30 లక్షల మంది వితంవులు ఉన్నారని తెలిపారు. కేవవలం వృద్ధులకు 40 శాతం మందికే పింఛన్‌లు ఇస్తూ మిగిలిన వారికి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నట్లు విమర్శించారు. 60 ఏళ్ళు దాటిన వింతవులు 30 లక్షల మంది రాష్ట్రంలో ఉన్నప్పటికి అందులో 20 లక్షల మందికి మాత్రమే పెన్షన్‌లను అందజేస్తున్నారని వివరించారు. వృద్ధులకు 200 నుండి 1000 రూపాయలకు పెన్షన్‌ను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. వృద్ధులకు కొడుకుగా తాను ఉండి వారిని ఆదుకొనేందుకు ఉద్యమాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలియజేశారు. తాను గతంలో చేసిన ఉద్యమం ఫలితంగానే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా చిన్నపిల్లల గుండె ఆపరేషన్‌లను చేయాలని ఉద్యమం నడపటం వల్ల చాలామంది చిన్న పిల్లలకు ప్రభుత్వం గుండె ఆపరేషన్‌లు చేసి కాపాడిందన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు సరైన పాత్ర పోషించడంలేదని, అందువలనే ప్రజల పక్షాన తాము పోరాటం చేస్తూ ప్రతిపక్షాలను నిలదీయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. వృద్ధులకు, వికలాంగులకు న్యాయం జరగని పక్షంలో నవంబర్ 27న హైదరాబాదులో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన హెచ్చరించారు. ఈ సభలో ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఉసురుపాటి బ్రహ్మయ్య, నాయకులు, ఫ్రాంక్లిన్ తదితర నాయకులతోపాటు ఒంగోలు నగరంలోని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

రాజధానికి పరుగులు
english title: 
g

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles