శ్రీకాకుళం, అక్టోబర్ 17: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన కార్యక్రమాలను ప్రజలకు అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడం సరికాదని కేంద్ర గిరిజన వ్యవహారాలు, పంచాయతీరాజ్ శాఖామంత్రి వి.కిషోర్‌చంద్రదేవ్ మండిపడ్డారు. జిల్లా విజిలెన్స్ అండ్ మోనటరింగ్ కమిటీ సమావేశం స్థానిక జిల్లా పరిషత్ సమావేశమందిరంలో బుధవారం జరిగింది. ఈసమావేశంలో కేంద్రమంత్రి కిషోర్ అధికారులకు క్లాస్ తీసుకున్నారు. కేంద్రమంత్రి హాజరై పంచాయతీరాజ్ అధికారులు ప్రతిపాదనల నివేదనపై మండిపడ్డారు. పి.ఎం.జె.ఎస్.వై నిధులతో నిర్మించిన రోడ్లు ప్రతిపాదనలు జిల్లా నుంచి పలాస నియోజకవర్గంలో ఒకరోడ్డుకు మాత్రమే నివేదించడానికి గల కారణాలు ఏంటని ఎస్.ఇ చిరంజీవిని ఎం.పి కిల్లి కృపారాణి, ఎమ్మెల్సీ సభ్యులు పీరుకట్ల విశ్వప్రసాద్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడు నిలదీశారు. దీనిపై కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ పంచాయతీరాజ్ అధికారులు దౌర్భాగ్యపరిస్థితిలో ఉండడం విచారకరమన్నారు. విశాఖపట్నం జిల్లాలో 275, విజయనగరంలో 33 పిఎంజెఎస్‌వై రోడ్లుకు అక్కడ అధికారులు ప్రతిపాదనలు నివేదించగా శ్రీకాకుళం జిల్లాలో ఒకే ఒక రోడ్డుతో సరిపెట్టుకోవడానికి గల ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ జోక్యం చేసుకుని భవిష్యత్‌లో ఇలాంటి పొరపాట్లు దొర్లకుండా చూస్తామని చెప్పారు. పంచాయతీరాజ్ ఎస్.ఇ చిరంజీవిని సంజాయిషీ ఇవ్వాలని కేంద్ర మంత్రి ఆదేశించారు. మరికొంతమంది సభ్యులు ఉపాధి హామీ బిల్లులు చెల్లింపులో జాప్యం జరుగుతోందని సమీక్ష దృష్టికి తీసుకువచ్చారు. దీనికి ఆయన తీవ్రంగా స్పందిస్తూ త్వరితగతిన బిల్లులు చెల్లించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు కూడా ఆన్‌లైన్ పేరిట బిల్లులు చెల్లింపులో తాత్సారం చేస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకురాగా ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించాలని సూచించారు. సమీకృత కార్యాచరణ ప్రణాళిక పథకం కింద మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మంజూరు చేసిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పథకం కింద జిల్లాలో 7,200 కోట్ల రూపాయలు మంజూరు చేయనున్నామన్నారు. స్ర్తిశక్త్భివనాల నిర్మాణం గూర్చి సభ్యులు ప్రస్తావించగా ఉపాధిహామీలో 60 40 నిష్పత్తిలో మెటీరియల్, నగదు కాంపోనెంట్‌గా చేపట్టాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉపాధి హామీ చెల్లింపుల్లో సమస్యలుంటే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఐఎవిలో మూడు గిరిజన యువత శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. 500కు పైగా సౌరశక్తిదీపాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. గిరిజన ప్రాంతంలో పిటిజిలకు దాదాపుగా అదే పరిస్థితులోని కుటుంబాలకు ఎఎవై కార్డులను మంజూరు చేస్తామన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో అధికంగా రసాయనిక పరిశ్రమలు ఉండడంతో భూగర్భజలాలు తాగునీటికి పనికిరాకుండా ఉన్నాయని, నీటిపథకాలు మంజూరుకు ప్రతిపాదనలు సమర్పించినా ఇప్పటివరకు లభించలేదని ఎమ్మెల్యే నీలకంఠంనాయుడు పేర్కొన్నారు. టెక్కలి ప్రతిపాదితమైన 24 కోట్ల తాగునీటి పథకం పురుషోత్తపురం కాలనీలోని చెరువు గ్రామీణ నీటిసరఫరా విభాగానికి అప్పజెప్పకపోవడం వల్ల ఎం.పి కృపారాణి సభ దృష్టికి తీసుకువెళ్లారు. హౌసింగ్, పిఆర్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు కోరగా సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆరుకోట్లతో చేపట్టిన ఉద్దానం ప్రాజెక్టుకు కాంట్రాక్టర్ కోటి రూపాయల పనులు చేపట్టినప్పటికీ బిల్లులు మంజూరు చేయలేదని పలాస ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు తోట నందకుమార్, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సునీల్‌రాజ్‌కుమార్, జిల్లా పరిషత్ సిఇఒ కైలాసగిరీష్, డ్వామా పి.డి కల్యాణచక్రవర్తి, డిఎఫ్‌ఒ విజయకుమార్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్.ఇ విద్యాసాగర్, గిరిజన సంక్షేమ శాఖ ఇ.ఇ ఎం.ఆర్.జి.నాయుడు, డిఆర్‌డిఏ పి.డి రజనీకాంతరావు తదితరులు పాల్గొన్నారు.
అంగన్‌వాడీ సరకులు దారిమళ్లింపు
ఆమదాలవలస, అక్టోబర్ 17: స్థానిక ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో ఉన్న ఎల్.ఎన్.పేట మండలం అంగన్‌వాడీ సరుకుల పంపిణీలో గత మూడేళ్లుగా సాగిన అవినీతి అక్రమాలు, సరుకుల గోల్‌మాల్‌పై అక్కడి కార్యకర్తలు చేసిన ఫిర్యాదు మేరకు బుధవారం దర్యాప్తు నిర్వహించారు. అనంతరం ప్రాజెక్టు అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆయా మండలంలో శ్యామలాపురం, ఎల్.ఎన్.పేట సెక్టార్ల పరిధిలో 61 అంగన్వాడీ కేంద్రాలకు ప్రతీనెలా 3.25 లక్షల విలువ గల పౌష్టికాహారం, ఇతర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే వీటిలో కేవలం 2.75 లక్షల విలువ గల సరుకలు మాత్రమే ఆయా కేంద్రాలకు పంపిణీ జరిగినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. ప్రతీనెలా సుమారు 1.50 లక్షల విలువైన సరుకులు గత మూడున్నర ఏళ్లుగా పక్కతోవ పడుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. అదే విధంగా మండలానికి సరఫరా చేసిన సరుకులకు సంబంధించిన ఫుడ్‌కంట్రోల్ రిజిష్టర్‌ను, ప్రధాన రికార్డులను పరిశీలించి వీటిలో అనేక దిద్దుబాట్లు ఉన్నాయని, కేవలం కాకిలెక్కలతో ఇక్కడి సూపర్‌వైజర్ యోగిశ్వరి ప్రభుత్వ మోసగించినట్లు పి.డి శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలో మొత్తం 61 కేంద్రాలకు గాను ఏడు నెలలు నుండి ఆరేళ్లలోపు పిల్లలు 1560 మంది ఉన్నట్లు, గర్భిణీలు 186 మంది, బాలింతలు 259 మందికి సరిపడా సరుకులను ప్రభుత్వం ప్రతీనెలా సరఫరా చేస్తోందన్నారు. ఇందులో భాగంగా నెలవారీ 4,050 క్వింటాళ్లు బియ్యం, 2,800 కిలోల పప్పులు, 189 లీటర్లు నూనెలు, మూడువేల క్వింటాళ్లు గోధుమరవ్వలు సరఫరా చేస్తున్నామని, వీటిలో 60 శాతం మాత్రమే ఆయా కేంద్రాలకు అందుతున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. దర్యాప్తులో బయటపడిన అవినీతి అక్రమాలను విశాఖపట్నం ఆర్డీ అనసూయదేవికి నివేదిక అందిస్తామని పిడి స్పష్టం చేశారు. ఈ దర్యాప్తులో పిడితోపాటు సిబ్బంది తదితరులున్నారు.
సూపర్‌వైజర్ యోగీశ్వరి వివరణ
మండలంలో అంగన్‌వాడీ సరుకులు గోల్‌మాల్ జరిగినట్లు వచ్చిన ఫిర్యాదులు, ఆరోపణల్లో వాస్తవం లేదని ఎల్.ఎన్.పేట సూపర్‌వైజర్ యోగీశ్వరి స్పష్టం చేశారు. పిఒ ఇచ్చిన స్టాకు మాత్రమే తాను కేంద్రాలకు సరఫరా చేశానని పేర్కొన్నారు.
వంశధార కార్యాలయంలో ఎసిబి సోదాలు
నరసన్నపేట, అక్టోబర్ 17: స్థానిక వంశధార కార్యాలయంలో బుధవారం ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. ఎసిబి సి.ఐ ఇమాన్యువల్‌రాజు మాట్లాడుతూ అనేక దఫాలుగా కార్యాలయంలో షట్టర్ల కుంభకోణం సంబంధించి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ దిశగా మరో మూడురోజుల పాటు స్థానిక వంశధార కార్యాలయంలో దర్యాప్తు నిర్వహిస్తామని, సమస్య కొలిక్కివచ్చేలా నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. అయితే షట్టర్ల కుంభకోణం కేసుకు సంబంధించి ఇటీవలి 13 మంది ఎ.ఇ.లపై చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. అలాగే స్థానిక కార్యాలయంలో కోట్లాది రూపాయలు విలువ చేసే షట్టర్లు నిల్వ ఉన్నాయని, ఇవి తుప్పుపట్టే స్థితికి చేరుకున్నాయన్నారు. సస్పెండ్ అయిన ఇంజనీరింగ్ అధికారులు వీటి వివరాలను సంబంధిత కార్యాలయానికి అప్పగించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని వివరించారు.
కలెక్టర్‌ను కలిసిన దళిత పోరాట కమిటీ
శ్రీకాకుళం(రూరల్), అక్టోబర్ 17: జిల్లాలో లక్ష్మీపేట దళిత పోరాట సంఘీభావ కమిటీ బుధవారం జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్‌ను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి వచ్చిన వెంటనే భూమి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవని పేర్కొన్నారు. బాధితులకు వారానికొకసారి కలుస్తున్నామని చెప్పినా జిల్లా పరిధిలో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో బొజ్జతారకం, ఎస్.ఝాన్సీ, దుడ్డు ప్రభాకర్, మిస్క కృష్ణయ్య, బోరసింగి రాము, ప్రభాకర్, తాండ్ర అరుణ, గంగులు, గణపతి, రవి తదితరులు ఉన్నారు.
అగ్రికెమ్ కార్మికుల ధర్నా
శ్రీకాకుళం(రూరల్), అక్టోబర్ 17: జిల్లాలో ఎచ్చెర్ల మండలం అరిణాం అక్కివలస సమీపంలో ఉన్న నాగార్జున అగ్రికెమ్ కార్మికులు బతుకుతెరువుకు హామీ ఇచ్చి కార్మికులందరికీ పూర్తిస్థాయి వేతనాలు చెల్లించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్రికెమ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు పి.తేజేశ్వరరావు మాట్లాడుతూ పూర్తిస్థాయిలో వేతనాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. జూన్ 30న పరిశ్రమలో ప్రమాదం జరిగిన అనంతరం యాజమాన్యం దీనిని సాకుగా చూపి కార్మికుల వేతనాల్లో 15 శాతం నుంచి 25 శాతం వరకు కోతవిధించడంతో కార్మిక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పద్దెనిమిది సంవత్సరాలుగా కార్మికుల శ్రమతో కోట్లాది రూపాయల లాభాన్ని ఆర్జించిన యాజమాన్యం కష్టకాలంలో కార్మికులను ఇబ్బందులకు గురిచేయడం దురదృష్టకరమన్నారు. కార్మికుల జీవనం ప్రశ్నార్ధకంగా మారిందని, ఇప్పటికైనా వారికి బతుకు గ్యారంటీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.శ్రీనివాస్, వై.లక్ష్మణరావు, సిహెచ్ సత్యనారాయణ, చంద్రశేఖర్, మాధవరావు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎజెసి ఆర్.ఎస్.రాజ్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు.
కాంగ్రెస్, వైకాపా మధ్య రహస్య ఒప్పందం
కోటబొమ్మాళి, అక్టోబర్ 17: ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ, ఇటీవల పుట్టుకొచ్చిన వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఒకే కుటుంబంగా మారి రహస్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని మాజీ కేంద్రమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శించారు. బుధవారం ఆయన స్థానిక తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడుతూ 2014లో రాహుల్ గాంధీ ప్రధాని కావడానికి వైకాపాను కాంగ్రెస్ దత్తత తీసుకుందని, దీనితో వైకాపా ఎంపి సీట్లు వినియోగించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా జైలు ఉన్న జగన్‌ను విడుదల చేయించుకోవడానికి వైకాపా, కాంగ్రెస్‌లు బేరసారాలు ఇప్పటినుండే మొదలు పెట్టారన్నారు. తేదేపా నాయకుడు చంద్రబాబుపై వైకాపా అధ్యక్షురాలు విజయలక్ష్మి కోర్టులు ఆశ్రయించడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో చంద్రబాబుపై వై ఎస్ ఆర్ ఎన్నో కమిటీలు వేసినా చంద్రబాబు తన నిజాయితీని ఆనాడే నిరూపించుకున్నారని పేర్కొన్నారు. ఎఫ్ డి ఐలపై అన్ని పార్టీలు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తుంటే వైకాపా నాయకులు మాత్రం ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఓటర్లు మహా విజ్ఞులని రాజకీయ లబ్ధి కోసం ఏ పార్టీలు ఎన్ని చేసినా వారు గమనిస్తారని అన్నారు. ఒక వైపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాల సమస్యలకు తెచ్చి పెడుతున్నారని అన్నారు. నిత్యావసరాలు, గ్యాస్, విద్యుత్ సమస్యలు వలన నేడు ప్రజలు ఎన్నో విధాల సమస్యలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం సమస్యలను పరిష్కరించలేక పోవడంపై ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బోయిన గోవిందరాజులు, రమేష్, అప్పలరాజు రెడ్డి, సత్యనారయణ పాల్గొన్నారు.
ముగిసిన ఐసెట్ కౌనె్సలింగ్
ఎచ్చెర్ల, అక్టోబర్ 17: స్థానిక ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో గత కొన్నిరోజులుగా నిర్వహిస్తోన్న ఐసెట్ కౌనె్సలింగ్ బుధవారంతో ముగిసింది. చివరిరోజు 32 మంది సర్ట్ఫికేట్లను పరిశీలించినట్లు కౌనె్సలింగ్ ఇన్‌చార్జి మేజర్ కె.శివకుమార్ తెలిపారు. ఈ ఏడాది 395 మంది ఐసెట్ కౌనె్సలింగ్‌కు హాజరయ్యారు. ఒసి, బిసి 373 మంది కాగా ఎస్సీ, ఎస్టీలు 22 మంది ఎంబిఏ, ఎంసిఏ కోర్సుల ప్రవేశానికి గాను సర్ట్ఫికేట్ల పరిశీలనకు హాజరై వెబ్‌ఆప్షనుకు సిద్ధమయ్యారు. గత ఏడాది ఐసెట్ కౌనె్సలింగ్‌కు 508 మంది హాజరుకాగా ఈ ఏడాది 395 మంది హాజరుకావడం విశేషం.
వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్
* ఎ.డి ప్రసాదరావు
ఎచ్చెర్ల, అక్టోబర్ 17: రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వ్యవసాయ సాగుకు అనువుగా ఏడుగంటల విద్యుత్ సరఫరాను అందించేందుకు చర్యలు చేపట్టామని ఎ.డి కె.ప్రసాదరావు తెలిపారు. మండల కేంద్రంలో ఉన్న విద్యుత్ సబ్‌స్టేషన్ ఆవరణలో విద్యుత్ సలహా మండలి సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వినియోగదారులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక రంగానికి, గృహవినియోగదారులకు కోతలు విధించి వ్యవసాయరంగానికి మెరుగైన విద్యుత్‌ను అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. థర్మల్ విద్యుత్ ఆధారంగా సరఫరా ఇవ్వడం వల్ల ఓవర్‌హాయిలింగ్ కారణాల దృష్ట్యా ఉత్పత్తి తగ్గిందని, దీనిని వినియోగదారులు గమనించాలన్నారు. సమస్యలు పరిష్కారానికే విద్యుత్ సలహామండలి సమావేశాలు సబ్‌స్టేషన్ల వారీగా నిర్వహిస్తున్నామని, దీనిని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లోవోల్టేజి, ట్రాన్స్‌ఫార్మర్లమార్పిడి, విద్యుత్ స్తంభాలు శిథిలావస్థకు చేరినట్లయితే ప్రత్యామ్నాయం, కేసరాలు, వైర్లు వంటి సమస్యలు అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో ఎ.ఇ బెండి రవికుమార్, సిబ్బంది, వినియోగదారులు పాల్గొన్నారు.
అగ్రస్థానంలో ఎపిజివిబి సేవలు
బ్యాంకు చైర్మన్ కె.లక్ష్మణరావు
పొందూరు, అక్టోబర్ 17: రాష్ట్రంలోని అన్ని గ్రామీణ బ్యాంకులు అందిస్తున్న సేవల్లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు అగ్రగామిగా నిలిచిందని ఆ బ్యాంకు చైర్మన్ కె.లక్ష్మణరావు వెల్లడించారు. ఆయన బుధవారం వాండ్రంగి వికాస్ గ్రామీణ బ్యాంకు శాఖను ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా విలేఖరులతో మాట్లాడారు. గత ఏడాది తమ బ్యాంకు 120 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించిందని, గత నెలాంతానికి 67 కోట్ల రూపాయలు లాభాలబాటలో నిలిచిందన్నారు. తమ బ్యాంకు పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, వరంగల్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పంట రుణాలుగా 2,300 కోట్ల రూపాయలు ఖరీఫ్ సీజన్‌లో అందించగా, రబీ సీజన్‌లో 700 కోట్ల రూపాయలను అందించనున్నట్లు చెప్పారు. తమ బ్యాంకు 515 బ్రాంచీల్లో 2,646 మంది ఉద్యోగులు ఉన్నారు. 6,300 కోట్ల రూపాయలు అడ్వాన్స్‌లు ఉండగా స్వయంశక్తిసంఘాలకు 1920 కోట్లు, గృహనిర్మాణ రుణాలకు 255 కోట్ల రూపాయలు, విద్యారంగ రుణాలుగా 75కోట్లను అందించామన్నారు. జిల్లాలో వాండ్రంగి బ్యాంకు శాఖ కార్యక్రమాలు ఆశాజనకంగా ఉన్నాయని చెప్పారు. కొత్తగా పొగిరి, పలాస, శ్రీకూర్మంలలో తమ బ్యాంకు శాఖలను త్వరలో ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. కౌలురైతులకు పంటరుణాలు ఇవ్వాలని ఇన్‌చార్జి తహశీల్దార్ గోవిందరావు కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు.
ఇంటర్ ఫలితాలు మెరుగుపరచండి
* ఆర్.జె.డి తిరుమలాచార్యులు
ఎచ్చెర్ల, అక్టోబర్ 17: కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఫలితాలను మెరుగుపరచాలని ఆర్‌జెడి ఎన్.వి.తిరుమలాచార్యులు సూచించారు. జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకులకు ఫలితాల సాధనకై ఒకరోజు ఒరియంటేషన్ ప్రొగ్రామ్ వెంకటేశ్వర పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం సిలబస్ మార్పులపై మరింత అవగాహన పెంచుకుని విద్యార్థులకు బోధించాలన్నారు. ఎంసెట్ ర్యాంకులు సాధనలో కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ప్రతిభ కనబరిచేలా ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. ఓరియంటేషన్ ప్రొగ్రామ్‌ను అధ్యాపకులంతా సద్వినియోగం చేసుకుని విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిఇఒ పి.బ్రహ్మానందం, ఆర్.ఐ.ఒ అన్నమ్మ, ప్రధానోపాధ్యాయులు ఐ.శంకర్రావు, ఈశ్వరరావు, రాంబాబు, శ్రీనివాసరావు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.
‘్థర్మల్’రద్దు చేయడమే లక్ష్యం
సంతబొమ్మాళి, అక్టోబర్ 17 : తామరపాడు ఈస్ట్‌కోస్టు ఎనర్జీ థర్మల్ పవర్‌ప్లాంట్ రద్దు చేయాలంటూ అసెంబ్లీలో ప్రస్తావిస్తానని టెక్కలి ఎమ్మెల్యే కొర్ల భారతి అన్నారు. బుధవారం వడ్డితాండ్రలో నిర్వహిస్తున్న నిరాహార దీక్ష శిబిరం వద్దకు వచ్చి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా అమె విలేఖరులతో మాట్లాడుతూ తానెప్పుడూ ప్యాకేజీలు కోరలేదని ఎవరో తప్పుడు ప్రచారం చేస్తున్నారని పవర్‌ప్లాంట్ రద్దుచేయడమే తమ లక్ష్యం అన్నారు. పొరాట కమిటి నాయకులు అనంత హన్నురావు, కారుణ్య ఖెత్రో కోళ్ల భాస్కరావులు మాట్లాడుతూ కాకరాపల్లి లో మత్స్యకారులు తరతరాలు వేటాడుతూ జీవిస్తున్నారని అటువంటి తంపరలు థర్మల్‌ప్లాంట్ నిర్మించి పొట్టలు కొడుతున్నారని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్, కోత మధుసూదనరావు, పిలకా రవికుమార్ రెడ్డి, ఎన్ని మన్మధరావు ఉన్నారు.
ప్రైవేటు స్కూళ్ల పనితీరుపై ఫిర్యాదు
జలుమూరు, అక్టోబర్ 17: మండలంలో పలు ప్రైవేట్ హైస్కూళ్లు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా సెలవుదినాల్లో కూడా పనిచేస్తున్నందున ఆ పాఠశాలల పనితీరుపై జిల్లా విద్యాశాఖాదికారికి ఫిర్యాదు చేయనున్నట్లు ఎం.ఇ.ఒ సింహాచలం తెలిపారు. గ్రామస్థాయిలో ప్రైవేట్ పాఠశాలల పనితీరుపై వచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం మండలం చల్లవానిపేట, తిమడాం గ్రామాలను ఆయన సందర్శించి పాఠశాలల పనితీరును పరిశీలించారు. పాఠశాలలకు సెలవుదినాలు ఇచ్చినట్లు ఆయా యాజమాన్యం రాతపూర్వకంగా అందించింది. బకాయి ఉన్న ఒకట్రెండు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వారు వివరణ ఇచ్చారు.