నూజివీడు, అక్టోబర్ 17: జిల్లాలో ఎక్కడా లేనంతగా నూజివీడు నియోజకవర్గంలో సుమారు 25వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతానికి గురయ్యాయని, దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ అధికారుల నిర్లిప్తతేనని నూజివీడు శాసనసభ్యులు చిన్నం రామకోటయ్య ధ్వజమెత్తారు. ఆక్రమణలకు గురైన భూముల విలువ కనీసం 3వేల కోట్ల రూపాయలకుపైగా ఉంటుందని చెప్పారు. బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ... నూజివీడు నియోజకవర్గంలో భూమిలేని పేదలకు 10వేల ఎకరాలు ప్రభుత్వం పంపిణీ చేసిందని చెప్పారు. దీనిలో కనీసం 7500 ఎకరాల భూములు ఆక్రమణలకు గురయ్యాయని, భూస్వాముల కబంధ హస్తాలలో ఉన్నాయన్నారు. ఆగిరిపల్లి మండలంలో అసైన్డ్ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేసిన సంఘటనేనని దీనికి నిదర్శనమని చెప్పారు. ఆర్డీవో స్థాయి అధికారి వెళితే తప్ప ఆక్రమణలకు గురైన భూములు వెలుగులోకి రాలేదని, అంటే గ్రామస్థాయి నుండి మండల స్థాయి వరకు ఉన్న రెవెన్యూ యంత్రాంగం ఏంచేస్తోందని రామకోటయ్య ప్రశ్నించారు. అధికారులు మామూళ్ళ మత్తులో మునిగిపోవటంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసిన అసైన్డ్ భూములను విక్రయిస్తుంటే సంబంధిత అధికారులు అనుమతులు మం జూరు చేయటం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములను పరిరక్షించటంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. అధికారులకు చిత్తశుద్ధి లోపించటంతో ప్రభుత్వ లక్ష్యానికే తూట్లు పొడుస్తున్నారని, ఇటువంటి అధికారులపై ప్రభుత్వం వెంటనే చ ర్యలు తీసుకోవాలని కోరారు. భూ ముల అన్యాక్రాంతానికి నూజివీడు నియోజకవర్గం అడ్డాగా మారిందని చెప్పారు. నియోజకవర్గంలో కనీసం 25వేల ఎకరాల ప్రభుత్వ భూముల పరిస్థితి ఇదేవిధంగా ఉందని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం పేదలకు చేయూత ఇచ్చేందుకు ప్రభుత్వ భూములను పంపిణీ చేసిందన్నారు. అయితే వాస్తవ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందన్నారు. నూజివీడు నియోజకవర్గంలో ప్రభు త్వం పేదలకు మంజూరు చేసిన అసైన్డ్ భూములు 8వేల ఎకరాలు, దేవాలయ భూములు 3,500 ఎకరాలు, అటవీ భూములు 11వేల ఎకరాలు, చెరువులు 3వేల ఎకరాలు ఆక్రమణలకు గుర య్యాయని ఆయన వివరించారు. వీటిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
రైతులు ఆర్థికంగా బలపడాలి
* పశు వైద్య శిబిరంలో ప్రభుత్వ విప్ పేర్ని నాని
మచిలీపట్నం టౌన్, అక్టోబర్ 17: కేవలం వ్యవసాయ రంగం మీదే కాకుండా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలపై కూడా రైతులు ఆధారపడి ఆర్థికంగా బలపడాలని ప్రభుత్వ విప్ పేర్ని వెంకట్రామయ్య (నాని) కోరారు. బందరు మండలం చిన్నాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన పశు వైద్య శిబిరాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా పేర్ని మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయానికి పెట్టుబడులు పెరిగిపోయి ఆదాయం తగ్గుతోందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు వ్యవసాయ రంగంతోపాటు దానికి అనుబంధమైన పాడి పరిశ్రమ, పౌల్ట్రీ వంటి వాటిని ఉపయోగించుకుని ఆర్థికంగా బలపడాలన్నారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు మధుసూదనరావు, మార్కెట్ యార్డు చైర్మన్ మోకా భాస్కరరావు, పిఎసిఎస్ అధ్యక్షులు నాగేశ్వరరావు, మాజీ ఎంపిపి తోట శ్రీదేవి, మాజీ సర్పంచ్ జన్ను చరిత, కాంగ్రెస్ నాయకులు తోట శ్రీనివాసరావు, జన్ను రాఘవ, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తం
* సిపిఎం నేత ఉమామహేశ్వరరావు విమర్శ
అవనిగడ్డ, అక్టోబర్ 17: రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా మారిందని సిపిఎం జిల్లా కార్యదర్శి పి ఉమామహేశ్వరరావు విమర్శించారు. బుధవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, ఇందిరమ్మబాట ప్రజలను మోసం చేసేందుకేనని ధ్వజమెత్తారు. విద్యుత్ సంక్షోభం నివారించే దిశగా చర్యలు లేవన్నారు. ఇదే విధానం కొనసాగితే ప్రజలు ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. విలేఖర్ల సమావేశంలో పార్టీ నాయకులు నారాయణ, చన్నప్ప, ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారంలో అధికారులు విఫలం
* టిడిపి నేత కొల్లు రవీంద్ర విమర్శ
మచిలీపట్నం టౌన్, అక్టోబర్ 17: గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో ప్రత్యేక అధికారులు విఫలమవుతున్నారని తెలుగుదేశం పార్టీ బందరు నియోజకవర్గ ఇన్‌చార్జి కొల్లు రవీంద్ర విమర్శించారు. బందరు మండలం అరిసేపల్లి, బుద్ధాలపాలెం గ్రామాల్లో టిడిపి గ్రామ కమిటీ సమావేశాలను బుధవారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక అధికారులు గ్రామాల్లో కానరావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక అధికారుల పాలనతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కుంటుపడుతోందన్నారు. సమావేశంలో టిడిపి మండల అధ్యక్షులు గోపు సత్యనారాయణ, నాయకులు కుంచే దుర్గాప్రసాద్, తలారి సోమశేఖర్, వేణుబాబు, తదితరులు పాల్గొన్నారు.
‘ఎ ఉమన్ ఇన్ బ్రాహ్మణిజం’ చిత్ర నిర్మాత క్షమాపణ చెప్పాలి
* బ్రాహ్మణ సేవాసమితి నేత కోదండపాణి డిమాండ్
గుడివాడ, అక్టోబర్ 17: ఎ ఉమన్ ఇన్ బ్రాహ్మణిజం అనే అశ్లీల చిత్రాన్ని నిర్మించిన చిత్ర నిర్మాత గంగాధర్ బ్రాహ్మణులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని బ్రాహ్మణ సేవాసమితి పట్టణ అధ్యక్షుడు భాగవతుల కోదండపాణి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ... ఈ చిత్రాన్ని గుడిపాటి చలం నవల ఆధారంగా తీశానని చెప్పడం విచారకరమన్నారు. బ్రాహ్మణ మహిళలను కించపరుస్తూ సినిమాలు తీయడం మహిళాలోకాన్ని కించపర్చడమేనని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ సినిమా విడుదలను ఆపాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. సినిమా విడుదల చేస్తే థియేటర్ల ఎదుట బ్రాహ్మణ వర్గీయులంతా ఆమరణ దీక్షలు చేపట్టి ప్రదర్శనలను అడ్డుకుంటారన్నారు. గవర్నర్, ముఖ్యమంత్రి ఈ సినిమా విషయమై జోక్యం చేసుకోవాలని కోరారు. కులాన్ని కించపరుస్తూ తీసిన సినిమాకు అనుమతిచ్చిన సెన్సార్ బోర్డు సభ్యులను కూడా సస్పెండ్ చేయాలని కోదండపాణి డిమాండ్ చేశారు.
‘బ్రాహ్మణిజం’ సినిమాను నిలుపుదల చేయాలి
మచిలీపట్నం (కల్చరల్), అక్టోబర్ 17: ‘బ్రాహ్మణిజం’ సినిమాను నిలుపుదల చేయాలని బ్రాహ్మణ సేవాసంఘం అధ్యక్షులు డా. బి ధన్వంతరి ఆచార్య డిమాండ్ చేశారు. సంఘ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో బ్రాహ్మణిజం సినిమా ప్రకటనలో మహిళల అర్ధనగ్న చిత్రాలను చూపడం దారుణమన్నారు. బ్రాహ్మణ మహిళల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ప్రకటనలు ఉన్నాయని, ప్రకటనలతో పాటు సినిమాను కూడా నిలుపుదల చేయాలన్నారు. సంస్థ కార్యదర్శి వింజమూరి శివరాం, కోశాధికారి ఎల్‌ఎస్ శాస్ర్తీ, వేమూరి రామకృష్ణ, ఎంవిఎస్ రామచంద్రమూర్తి, జి రాజరాజేశ్వరి, యువజన విభాగం కార్యదర్శి ఫణికుమార్, తదితరులు పాల్గొన్నారు.
అదుపుతప్పి రొయ్యల లారీ బోల్తా
* డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలు
కూచిపూడి, అక్టోబర్ 17: మొవ్వ శివారు ఆర్ అండ్ బి రహదారిపై బుధవారం తెల్లవారుఝామున అదుపుతప్పిన రొయ్యల లారీ బోల్తాపడింది. దీంతో సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. గుంటూరు జిల్లా పందిళ్ళపల్లి నుండి భీమవరానికి రొయ్యల లోడుతో ఈ లారీ అవనిగడ్డ వైపు నుండి కూచిపూడి వైపు వస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ షేక్ మత్తయ్య, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. లోడ్‌ను వేరే లారీలో ఎక్కించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
నిధుల కుంభకోణంపై సిబిఐ విచారణ జరపాలి
* టిడిపి మైనార్టీ సెల్ నేతల డిమాండ్
మచిలీపట్నం టౌన్, అక్టోబర్ 17: మైనార్టీ కార్పొరేషన్ నిధుల కుంభకోణంపై పూర్తిస్థాయి విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక జగన్నాధపురంలోని ఎన్టీఆర్ భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షులు యండి ఇలియాస్ పాషా, కార్యదర్శి హసీమ్ బేగ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 13శాతం ఉన్న మైనార్టీల కోసం మైనార్టీ సంక్షేమ బడ్జెట్‌కు కనీసం ఒక శాతం కూడా కేటాయించక కేవలం 489కోట్లు కేటాయించడం కాంగ్రెస్ పక్షపాత బుద్ధికి నిదర్శనమని విమర్శించారు. మైనార్టీలకు కేటాయించే నిధులు పక్కదారి పడుతున్నా సంబంధిత మంత్రులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల వెలుగుచూసిన మైనార్టీ కార్పొరేషన్ నిధుల కుంభకోణంపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే అర్హులైన మైనార్టీలకు ఉపకార వేతనాలను సకాలంలో విడుదల చేయాలన్నారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. మైనార్టీ నాయకులు షేక్ వౌలాలి, యండి బాషు, అమీర్ తదితరులు పాల్గొన్నారు.
సబ్సిడీ గ్యాస్ ఇవ్వాలని
కుకింగ్ ఏజెన్సీ నిర్వాహకుల ధర్నా
కలిదిండి, అక్టోబర్ 17: సబ్సిడీ ధరకు గ్యాస్ సిలెండర్లను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఎంఆర్‌సి భవనం వద్ద కుకింగ్ ఏజెన్సీ నిర్వాహకులు ధర్నా చేశారు. సబ్సిడీ ఎత్తివేయడం వల్ల ఏజెన్సీలపై ఆర్థిక భారం పడుతోందన్నారు. వెంటనే సబ్సిడీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంఇఓ నరసయ్యకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె సుబ్బారావు, లాజర్, కుకింగ్ ఏజెన్సీ నిర్వాహకులు మల్లేశ్వరి, సరోజిని, మంగతాయారు, అలివేలు మంగతాయారు, వాణి తదితరులు పాల్గొన్నారు.
మైమరపించిన దేవీ అలంకారాలు
మచిలీపట్నం (కల్చరల్), అక్టోబర్ 17: దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజైన బుధవారం దేవీ అలంకారాలు భక్తులను మైమరపించాయి. స్థానిక కన్యకాపరమేశ్వరి ఆలయంలో పార్వతీదేవిని గాయత్రిదేవిగా, కన్యకాపరమేశ్వరి అమ్మవారిని ధాన్యలక్ష్మిగా అలంకరించారు. ఆజాద్ రోడ్డులోని గీతామందిరంలో వాసవీ మాతను గాయత్రిదేవిగా, లలితాదేవిని సంతానలక్ష్మిగా నయనానందకరంగా అలంకరించారు. రాబర్టుసన్‌పేటలో విజయదుర్గాదేవి, త్రిశక్తి పీఠంలో మహాలక్ష్మి అమ్మవార్లను అన్నపూర్ణాదేవిగా, సర్కిల్‌పేట మల్లేశ్వరస్వామి ఆలయంలో భ్రమరాంబదేవిని బాలాత్రిపుర సుందరిగా, బుట్టాయిపేట దత్తాశ్రమంలో అమ్మవారిని మీనాక్షిదేవిగా అలంకరించారు. భక్తులు పెద్దఎత్తున అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.
బంటుమిల్లిలో...
బంటుమిల్లి : దేవీ నవరాత్రుల్లో భాగంగా రెండోరోజు బంటుమిల్లి శివాలయంలో పార్వతీదేవి అన్నపూర్ణా దేవిగా, కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారు గాయత్రిదేవిగా, రామాలయంలో గజలక్ష్మిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
కూచిపూడిలో...
కూచిపూడి : దసరా శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజైన బుధవారం స్థానిక శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ బాలాత్రిపుర సుందరిదేవి గాయత్రీమాతగా భక్తులకు దర్శనమిచ్చారు. మొవ్వ శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ఆదిలక్ష్మిదేవి ధాన్యలక్ష్మిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. కూచిపూడి కోదండరామాలయం, పెదపూడి, పెదముత్తేవి, కాజ, కోసూరు తదితర గ్రామాల్లో జగన్మాత వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. కె ఉమాశంకర్, పసుమర్తి వెంకటేశ్వర్లు, గోవిందు వెంకట రామారావు, మహంకాళి వెంకటరమణ, చిట్టూరి నాగభూషణం, మందా వీరవెంకట శ్రీనివాసరావు, పసుమర్తి వెంకటరమణ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త పసుమర్తి కేశవప్రసాద్ పర్యవేక్షణలో అర్చకులు పెనుమూడి సోదరులు కొండూరు శ్రీకృష్ణయ్య, జంధ్యాల పాండురంగ శర్మ, దీవి వంశీమోహన్, ముత్తీవి సీతారామదాసు భక్తులకు తీర్థప్రసాద వినియోగం చేశారు. చింతలపాటి పూర్ణచంద్రరావు దేవీభాగవత పురాణాన్ని ప్రవచించారు.
అవనిగడ్డలో...
అవనిగడ్డ : స్థానిక శ్రీ రాజశేఖరస్వామి వారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని వనదుర్గాదేవి అలంకారంతో రాజరాజేశ్వరి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ధర్మకర్తల మండలి అధ్యక్షులు అర్జా అర్జునరావు, ఎం మురళీకృష్ణ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా తాడిగడప వెంకటేశ్వర సిద్ధాంతి విశేష పూజలు నిర్వహించగా అర్చకులు రాజశేఖరశర్మ అమ్మవారికి అలంకారం చేశారు. పులిగడ్డలో వనదుర్గాదేవిగా శ్రీ కనకదుర్గ అమ్మవారు దర్శనమివ్వగా మండలి బాబూప్రసాద్ దంపతులు దుర్గా శాంతిహోమం నిర్వహించారు.
చల్లపల్లిలో...
చల్లపల్లి : శ్రీ దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజైన బుధవారం శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు గాయత్రిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి శ్రీసూక్త సహిత గాయత్రి హోమ నిర్వహణ అనంతరం తమ్మన ప్రసాద్ దంపతులచే ఆలయ అర్చకులు మామిళ్ళపల్లి శివరామకృష్ణ శర్మ, బాల సురేష్ విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక అన్నపూర్ణా సమేత శ్రీచక్రస్నిత కాశీవిశే్వశ్వరస్వామి, గ్రామదేవత సంపటాలమ్మ ఆలయాలతోపాటు రామానగరంలో భవానీ భక్తులు ఏర్పాటు చేసిన చలువ పందిరిలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు.
యాంత్రిక వ్యవసాయం ద్వారా లాభాలు పొందాలి
కూచిపూడి, అక్టోబర్ 17: మొవ్వ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బుధవారం వ్యవసాయ యాంత్రీకరణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 29వరకు మండలంలో ఎంపిక చేసిన గ్రామాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎఓ ఎం చక్రవర్తి తెలిపారు. కూలీల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేస్తున్న వ్యవసాయ యంత్రాలను వినియోగించుకుని తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించాలని ఎఓ రైతులకు సూచించారు. అవగాహన సదస్సుపై ముందస్తు సమాచారం లేకపోవటం, ప్రచారం నిర్వహించకపోవటంతో రైతులు స్వల్ప సంఖ్యలో హాజరయ్యారు. ఈసందర్భంగా ఎఓ మాట్లాడుతూ పెద్దపెద్ద యంత్రాలను ఎస్‌ఎంఎంఆర్‌ఐ ద్వారా రైతులకు అద్దెకు ఇచ్చే విధానాన్ని కొన్ని గ్రూపులు చేపట్టాలని సూచించారు. ఎఇఓ గోవాడ సునీల్, ఆదర్శ రైతులు పాల్గొన్నారు.
స్వాతంత్య్రానంతరం ప్రజలను
దోచేస్తున్న విదేశీ కంపెనీలు
గాంధీనగర్, అక్టోబర్ 17: భారతదేశంలో స్వాతంత్య్రానంతరం కూడా విదేశీ పెట్టుబడులను చిల్లర వ్యాపార రంగంలోకి ఆహ్వానించడమేగాక పూర్తిగా వాల్‌మార్ట్ వంటి అతి పెద్ద కంపెనీలకు పూర్తి స్వేచ్ఛాతత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఇతర పార్టీలతో కుమ్మక్కై భారతీయులను విదేశీ మత్తులో పడేసిందని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం సాయంత్రం స్థానిక ఎఎస్ రామారావు హాలులో బిజెపి నగర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన చిల్లర వ్యాపారరంగంలో విదేశీ పెట్టుబడుల పెంపుదలను వ్యతిరేకిస్తూ స్థానిక వ్యాపారస్తులు నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో కంటే 2010 సంవత్సరం నుంచి భారతీయ వ్యాపార రంగంలో విదేశీ పెట్టుబడులు మరియు విదేశీ కంపెనీల జోరు విపరీతంగా పెరిగిపోయిందన్నారు. దీనివలన మన దేశ ప్రజల ఆదాయానికి గండిపడిపోవటమే గాక సేవా రంగంలో కూడా విదేశీ రంగ పెట్టుబడులు, వివిధ దేశాలకు చెందిన బహుళజాతి సంస్థలు నేరుగా గాని లేదా కొన్ని కార్పొరేట్ ప్రభుత్వ రంగ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుద్చుకుకోవడం జరిగిందన్నారు. తద్వారా పెద్ద ఎత్తున ఆర్థిక రంగ సంస్థలు, విదేశీ బ్యాంకులు, బీమా సంస్థలు వేలాదిగా వచ్చి చేరడమేగాక మనదేశ కంపెనీలకు క్రమక్రమంగా గండిపడిపోతుందన్నారు. దీని వలన రైతులు, మధ్య తరగతి కుంటుబాలు తమకున్న కొద్దిపాటి భూములను విక్రయించుకుని తద్వారా లాభాలు గడిస్తున్నాయన్నారు. అంతేకాదు క్రమక్రమంగా రియల్ ఎస్టేట్ రంగంలో మాఫియా గ్యాంగులు చోటు చేసుకోవడం మనం గమనించడం జరుగుతుందని హెచ్చరించారు. విజయవాడ నగరంలో పేద ప్రజలు రైతుబజార్లు తదితర రంగాల్లో పండ్లు, కూరగాయలు కొనక వాల్‌మార్ట్ ద్వారా రూపాయి, రెండు రూపాయలు ఎక్కువ మొత్తాలకు కొనుగోలు చేసే పరిస్థితికి ఈ చిల్లర వ్యాపార రంగం దిగజారిపోతుందన్నారు. గ్యాస్, డీజిల్, ఆహారధ్యానాలు, విత్తనాలు వంటి సాధారణ వస్తువుల విషయంలో విదేశీ బహుళజాతి సంస్థలు క్రమంగా చోటుచేసుకుంటాయన్నారు. 2004-05 సంవత్సరాల్లో వేలాది సంఖ్యలో ఉన్న ఆకర్షణీయతను చూపుతున్న పచారి దుకాణాలు, చిల్లర వ్యాపారస్థులు, వారి కుటుంబాలు విదేశీయులతో చేతులు కలిపి మనదేశ వ్యాపారరంగాన్ని వీధిన పడేయక తప్పదని కిషన్‌రెడ్డి హెచ్చరించారు. సామాన్య మానవుడు కేవలం రెండు పుటలా కడుపునిండా నాలుగు మెతుకులు తినే రోజులు కంటికి కనిపించక మాయమవుతాయని అన్నారు. 2 జి స్పెక్ట్రమ్, కామన్‌వెల్త్, రూ. 308 కోట్ల బొగ్గు కుంభకోణం కంపెనీల విషయంలో మనదేశ ప్రధాని మన్మోహన్‌సింగ్ తోటి యుపిఎ పార్టీల భాగస్వాములైన మమతా బెనర్జీ, డిఎంకె పార్టీ, కమ్యూనిస్టు పార్టీ, జార్ఖండ్ ముక్తిమోర్చాలతో మాట్లాడతాననడం అంతా కల అన్నారు. ఆడిటర్ జనరల్‌తో కోట్లాది రూపాయల కుంభకోణాన్ని బ్రిటన్, యూరప్, జర్మనీ వంటి కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి. ఆ విధంగా వ్యతిరేకిస్తూ జరిగిన దేశ వ్యాప్త చిల్లర వ్యాపారస్థులందరూ జరిపిన స్వచ్ఛంద బంద్‌లో బిజెపి వంటి పార్టీలు పాల్గొంటున్నాయని అన్నారు. దేశ ప్రజల ఆత్మగౌరవాన్ని మనుగడను దెబ్బతీసే ప్రయత్నం చేసే బహుళజాతి కంపెనీలను అడ్డుకట్ట వేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఉప్పలపాటి శ్రీనివాసరాజు, మర్చంట్స్ అసోసియేషర్ అధ్యక్షుడు హరినాథ్‌బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ కుమారస్వామి, వి శ్రీమన్నారాయణ, వెంకటకృష్ణ, ఎఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అమ్మవారిని దర్శించుకున్న
జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి తోట
ఇంద్రకీలాద్రి, అక్టోబర్ 17: స్టాంప్‌లు,స్టేషనరీ శాఖ, కృష్ణా జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి తోట నరసింహులు బుధవారం సాయంత్రం ఇంద్రకీలాద్రి పై కొలువై ఉన్న శ్రీకనకదుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించుకున్నారు. ఈసందర్భంగా అమ్మవారి రాజగోపురం వద్ద శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం రీజనల్ జాయింట్ కమీషనర్ యం రఘునాథ్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ఆస్ధానచార్యుడు విష్ణు బొట్ల శివప్రసాద్, వైదిక కమిటీ సభ్యుడు లింగంబొట్ల దుర్గా ప్రసాద్ మంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.వేదపండితులు మంత్రోచ్ఛారణ చేస్తుండగా మంత్రి అమ్మవారి అంతరంలోనికి వెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అమ్మవారి రాయబార మండపంలో మంత్రి వేదపండితులు అమ్మవారివేద అశీస్సులను అందచేయగా ఆర్‌జెసి యం రఘునాథ్, ఫెస్టివల్ అధికారి విష్ణు ప్రసాద్ అమ్మవారి ప్రసాదాలు, చిత్రపటం, తదితర వాటిని అందచేశారు. ఈసందర్భంగా మంత్రి వెంట స్ధానిక శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు,తదితరులు ఉన్నారు. ఈసందర్భంగా దసరామహోత్సవాల ఫెస్టివల్ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి చేశారు. శ్రీ కనకదుర్గమ్మను బుధవారం వేరువేరు సమయాల్లో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రటరీ సత్యమూర్తి, బిజెషి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ప్రముఖ సినీనటుడు కృష్ణంరాజు, పోలీస్ కమిషనర్ మధుసూదన్‌రెడ్డి దంపతులు, శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, వారితోపాటు వివిధ న్యాయస్ధానాలకు చెందిన న్యాయమూర్తులు, జడ్జిలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ఉన్నతాధికారులు దర్శించుకున్నారు.
శ్రీ గాయత్రీదేవి అలంకారంతో దుర్గమ్మ
ఇంద్రకీలాద్రి, అక్టోబర్ 17: నీల,దవళ వర్ణాలతోప్రకాశిస్తూ పంచముఖాలతో శ్రీ గాయత్రీదేవి అలంకారంతోఉన్న శ్రీకనకదుర్గమ్మను దసరామహోత్సవాల్లో రెండవ రోజైన బుధవారం నాడు దర్శించుకోవటానికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఆశ్వయుజ శుద్ధ విదియ నాడు ఇంద్రీలాద్రి అధిష్ఠాన దేవత ఈదివ్యమైన రూపంతోభక్తకోటికి దర్శనం మిచ్చింది. వేకువజామున 3గంటలనుండే ఆలయాధికారులు అమ్మవారిని దర్శించుకోవటానికి భక్తులకు అనుమతించారు. దీంతో అధిక సంఖ్యలో భక్తులు వేకువ జామునే అమ్మవారిని దర్శించుకోవటానికి రావటం విశేషం. ఉదయం 6గంటలనుండి 12 గంటల వరకు అమ్మవారి సన్నిధిలో భక్తుల రద్దీ విపరీతంగా కనిపించింది. 1 గంట నుంచి భక్తుల సంఖ్య కొద్దిగా తగ్గుముఖం పట్టింది. దసరా మహోత్సవాల సందర్భంగా భవానీ దీక్షలు స్వీకరించిన భవానీలు, అయ్యప్పలు అధిక సంఖ్యలో అమ్మవారి సన్నిధికి తరలివచ్చారు. అమ్మవారి భవానీదీక్ష మండపంలో ప్రత్యేక ఉభయదాతల పూజల్లో బుధవారం రెండు బ్యాచ్‌ల్లో సుమారు 300 మంది భక్తులు ప్రత్యేక ఉభయదాతలుగా పాల్గొన్నారు. ఉభయదాతలను 12-30 తర్వాత అమ్మవారి దర్శనానికి అనుమతించారు. ఉభయ దాతల పూజల్లో ప్రముఖ నాయకులు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్లారు. ఉదయం 10-30 గంటల నుంచే పాతబస్తీ అర్జునవీధిలోని శ్రీ వడ్లమన్నాటి శృంగేరి శంకరమఠంలో దేవస్థానం అధికారులు 5 వేల మందికి భోజన వసతి కల్పించారు. మధ్యాహ్నం 4 గంటల నుంచి భక్తుల రద్దీ పెరిగింది. బుధవారం రాత్రి 8 గంటల సమయానికి 40వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. సుమారు లక్ష పైగా లడ్డూలు భక్తులు కొనుగోలు చేశారు. ప్రత్యేక ఉభయదాతల పూజల్లో పాల్గొన్న వారికి దేవస్థానం అధికారులు అమ్మవారి ప్రసాదాలు, శేషవస్త్రాలు, భోజన టిక్కెట్లు అందచేశారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకం
పనులను వేగవంతం చేయాలి
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, అక్టోబర్ 17: గ్రామీణ ఉపాథి హామీ పథకం కింద జిల్లాలో చేపట్టిన పనులు వేగవంతంగావించి నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలని జిల్లా కలెక్టర్ డా బుద్ధ ప్రకాష్ ఎం జ్యోతి అధికారులను ఆదేశించారు. బుధవారం ఎస్‌ఆర్‌ఇజిఎస్ పథకం అమలుపై పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ సుబ్రహ్మణ్యం హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామీణుల అవసరాలకు అనుగుణంగా పనులు గుర్తించాలని, గ్రామ సభలు సక్రమంగా నిర్వహించి గుర్తించిన పనులను ప్రతిపాదించాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులకు చెల్లింపులు గ్రామ పంచాయతీల ద్వారా జరగాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. చేపట్టిన పనుల విషయాల్లో ఎలక్ట్రానిక్ మస్టర్ రోల్స్ ద్వారా హాజరు పట్టికలు తయారు చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతనిచ్చి అమలు చేస్తున్న ఈ కార్యక్రమం నిబంధనల మేరకు మరింత సమర్థవంతంగా అమలు చేయాలని, ఎండిఓలతో కలెక్టర్లు సమీక్షా సమావేశాలు నిర్వహించి పథకం అమలు సమీక్షించాలన్నారు. పథకం అమలులో ప్లానింగ్ ఎక్సర్‌సైజ్ ఎంతో ముఖ్యమని, దీనిపై కలెక్టర్లు రివ్యూ చేయాలన్నారు. పూరె్తైన పనులకు చెల్లింపులు విషయంలో క్వాలిటీ కంట్రోల్, సోషల్ ఆడిట్, ఆదాయపన్ను అంశాలకు సంబంధించి మినహాయింపులు అమలుకు ఆన్‌లైన్‌లో సాంకేతిక సమస్యలు పరిష్కరించాలని, వివిధ జిల్లాల అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రిన్సిపల్ సెక్రటరీని కోరారు. కలెక్టర్ జిల్లాలో గ్రామీణ ఉపాధి పథకం అమలును వీడియో కాన్ఫరెన్స్‌లో వివరించారు. అనంతరం కలెక్టర్ అధికారుల నుద్దేశించి మాట్లాడుతూ గ్రామ పంచాయతీల ద్వారా జరుగుతున్న పనులకు సంబంధించి చెల్లింపులు మూడు రోజుల్లోగా చేయాలన్నారు. డ్వామా పిడి హనుమానాయక్, పంచాయతీ ఎస్‌ఇ జయరాజ్, డిపిఓ ఇన్‌చార్జి ఎస్‌ఎస్ రాజా, ఉపాధి హామీ పథకం ఎపిడిఓలు సంబంధిత అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
విజయవాడ (క్రైం), అక్టోబర్ 17: అనుమానాస్పద స్థితిలో కూరగాయల విక్రేత మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం... సత్యనారాయణపురం ఊర్వశి థియేటర్ సమీపంలోని రాజగోపాలచారి కూరగాయల మార్కెట్‌లో కూరగాయలు విక్రయించుకునే ఎస్‌కె ఖాజా (40) మంగళవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. అరటిపండు తిని పడుకున్నాడు. కొద్దిసేపటికి వాంతులు కావడంతో అతన్ని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. భార్య కరీమా ఫిర్యాదు మేరకు సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నగరంలో వివేకానంద రథయాత్ర
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, అక్టోబర్ 17: అమెరికాలోని చికాగో నగర సర్వమత మహాసభల్లో తన ప్రసంగాల ద్వారా భారతజాతి ఔన్నత్యాన్ని, సనాతన ధర్మ విశిష్టతను ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా హైదరాబాద్ రామకృష్ణ మఠం చేపట్టిన వివేకానంద రథయాత్ర నగరంలో రెండోరోజైన బుధవారం పలు ప్రాంతాల్లో కోలాహలంగా సాగింది. సిద్ధార్థ ఆడిటోరియం నుంచి మొగల్రాజపురం, చుట్టుగుంట, పడవల రేవు, బిఆర్‌టిఎస్ రోడ్డు, కేదారేశ్వరపేట, సత్యనారాయణపురం, డోర్నకల్ రోడ్డు మీదుగా రాత్రి స్వరాజ్యమైదానం చేరింది. ఈ సందర్భంగా వివేకానంద శంఖారావం ఫోటో ఎగ్జిబిషన్, వివేకానంద సాహిత్య ప్రదర్శన ఏర్పాటైంది. ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు.