Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

విషాద సంద్రం

$
0
0

విశాఖపట్నం, అక్టోబర్ 17: రుషికొండ తీరం విషాదంతో నిండిపోయింది. స్థానిక గీతం కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఒకేసారి సముద్రంలో మునిగిపోయారని తెలిసి, నగరం నివ్వెరపోయింది. యూనివర్శిటీ యాజమాన్యం ఉలిక్కిపడింది. తోటి విద్యార్థులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎక్కడెక్కడో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు ఉరుకులు, పరుగులతో విశాఖకు చేరుకుంటున్నారు. సముద్రంలో మునిగిన వారు ప్రాణాలతో తిరిగి వస్తారన్న కొండంత ఆశతో వారి బంధువులు ఉన్నారు.
రుషికొండ తీరాన సముద్ర స్నానాలకు వెళ్లద్దన్న హెచ్చరికల బోర్డులు ఉన్నా, ఎవ్వరూ పట్టించుకోరు. ఇక్కడే ఉన్న మెరైన్ టవర్‌లో నిత్యం పోలీసులు ఉన్నా, సముద్రంలోకి ఎవ్వరినీ పోనీయకుండా ఆపలేకపోతున్నారు. విద్యార్థులు క్లాస్‌లు లేని సమయంలోను, క్లాసులు అయిపోయాక రుషికొండ బీచ్‌కు వెళ్లి, గజ ఈతగాళ్ళు, పోలీసుల కళ్ళు కప్పి సముద్రంలోకి దిగి అనవసరంగా ప్రాణాలు కోల్పోతున్నారు.
దేశంలోని వివిధ బీచ్‌లకు, విశాఖ బీచ్‌కు తేడా ఉంది. ఆయా బీచ్‌ల్లోని అలల వేగం, ప్రయాణం, సముద్రంలోని అండర్ కరెంట్ తదితర అంశాలతో పోల్చి చూస్తే, విశాఖ తీరం భిన్నంగా ఉంటుంది. కొద్దిపాటి దూరంలోనే అగాధాలు ఉన్నాయి. ఇవేవీ జనానికి కనిపించవు. విశాఖ హార్బర్ నుంచి రుషికొండ బీచ్ వరకూ 2010 సంవత్సరంలో 28 మంది మరణించారు. 2011లో 24 మంది మరణించారు. 2012లో ఇప్పటి వరకూ 14 మంది మరణించగా, బుధవారం ఆరుగురు గల్లంతయ్యారు. అంటే ఈ ప్రాంతంలో మరణాల సంఖ్య ఎంత దారుణంగా ఉందో, సముద్రం ఎంతటి ప్రమాదమైనదో అర్థం చేసుకోవచ్చు.
విశాఖ తీరంలోని ప్రమాద ప్రాంతాలను గుర్తించి, పర్యాటకుల తాకిడి అధికంగా ఉన్న రోజుల్లో అక్కడ పోలీసు నిఘా పెంచాలి. అలాగే సేఫ్ జోన్‌లను కూడా గుర్తించి పర్యాటకులకు, నగర వాసులకు అవగాహన కల్పించాలి.
గల్లంతైన వారి వివరాలు
బుధవారం నాటి ప్రమాదంలో గల్లంతైన వారి వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్‌కు చెందిన ఇ.అనురాగ్‌రెడ్డి, గీతం యూనివర్శిటీలో మొదటి సంవత్సరం ఇసిఇ చదువుతున్నాడు. అనురాగ్‌రెడ్డి తండ్రి ఇ.రమేష్‌రెడ్డి ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌గా కరీంనగర్‌లో పనిచేస్తున్నారు. కరీంనగర్‌లోని భగత్‌నగర్‌లో ఈయన నివాసం ఉంటున్నారు. అలాగే పి.సింధుజ ఇదే యూనివర్శిటీలో మొదటి సంవత్సరం సిఎస్‌ఇ చదువుతోంది. ఈమె తండ్రి పి.వెంకటేశ్వరరావు హైదరాబాద్ దిల్‌షుక్‌నగరలోని భవానీ నగర్‌లో ఉంటున్నారు. భూపతి సుశీల్‌బాబు గీతం యూనివర్శిటీలోని సిఎస్‌ఇ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇతని తండ్రి బి.సూరిబాబు వరంగల్ జిల్లా హనుమకొండలోని కిషన్‌పురాలో నివాసం ఉంటున్నారు. అలాగే గుజ్జల ప్రీతి రెడ్డి మొదటి సంవత్సరం సిఎస్‌ఇ చదువుతోంది. ఈమె తండ్రి జి.మాధవరెడ్డి వరంగల్ జిల్లా నర్సంపేట మహేశ్వరంలో ఉంటున్నారు. రామినేని అనుష మొదటి సంవత్సరం సిఎస్‌ఇ చదువుతోంది. ఈమె తండ్రి ఆర్.సైదారావు నల్గొండ జిల్లా, కోదాడలోని నయనగర్ కాలనీలో ఉంటున్నారు. పెరుమళ్ల సాయినితిన్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. నితిన్ తండ్రి సత్యసాయిబాబా హైదరాబాద్‌లోని మహేశ్వరినగర్‌లోని హబ్సిగుడలో నివసిస్తున్నారు.

రాహుల్ మృత్యుంజయుడు
* కాపాడిన ముగ్గురు స్విమ్మర్లు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, అక్టోబర్ 17: ఈ యువకుడు నిజంగా మృత్యుంజయుడే. మృత్యువు అంచుల వరకూ వెళ్లి, ప్రాణాలతో తిరిగి వచ్చాడు. గీతం యూనివర్శిటీకి చెందిన ఏడుగురు విద్యార్థులు రుషికొండ బీచ్‌కు వెళ్లి, సముద్రంలోకి దిగి ఆరుగురు గల్లంతైన విషయం తెలిసిందే. అందులో చిట్టచివరన సముద్రంలోకి వెళ్లిన రాహుల్ బాబు సముద్రంలోకి మునిగిపోతూ, చేతులు పైకి ఎత్తి కాపాడమని అరుస్తున్నాడు. రుషికొండ బీచ్ వద్ద ఉన్న ముగ్గురు గజ ఈతగాళ్ళు జి.రాజేష్, జి.ఎల్లాజి, డి.పూరి పరుగున వెళ్లి, రాహుల్‌ను కాపాడారు. సముద్రపు నీటిని తాగేసిన రాహుల్ అపస్మారక స్థితికి చేరిపోతుండడంతో ఈ ముగ్గురు యువకులు అతనికి ప్రాథమిక చికిత్స చేసి, యూనివర్శిటీ హాస్టల్‌కు తరలించారు. స్పృహ వచ్చిన తరువాత రాహుల్ తన తోటి మిత్రుల కోసం వాకబు చేయడం మొదలుపెట్టాడు. వారంతా సురక్షితంగా వేరే చోట ఉన్నారని చుట్టుపక్కల వారు చెప్పుకుంటూ వచ్చారు.

విద్యా కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష
విశాఖపట్నం (జగదాంబ), అక్టోబర్ 17: జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ ఎయిడెడ్ కార్యక్రమాలు ప్రవేశపెట్టాలని జిల్లా కలెక్టర్ వి.శేషాద్రి విద్యాశాఖాధికారులను ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతంలో పునాది కార్యక్రమం విజయవంతం అమలుపరుస్తున్న నేపథ్యంలో మైదాన ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని అమలుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజీవ్ విద్యామిషన్, విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సమావేశమై జిల్లాలో అమలు చేస్తున్న విద్యా కార్యక్రమాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో డ్రాపవుట్లు లేకుండా చూడాలని, టీచర్లు లేని చోట విద్యా వలంటీర్లను నియమించాలని అధికారులను ఆదేశించారు, శిక్షణ మాడ్యూల్స్‌ను రూపొందించి విద్యావలంటీర్లకు అవసరమైన శిక్షణ తరగతులను నిర్వహించాలని, డిసెంబర్ నెలలోగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అన్నారు. పాఠ్యపుస్తకాలు, యూనిఫారంలు పంపిణీ ప్రగతిపై సమీక్షించారు. వికలాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అన్నారు. వికలాంగుల విద్యాభివృద్ధిపై అమలు చేస్తున్న హోమ్‌బేస్డ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. వీరందరికీ కూడా వికలాంగ పెన్షన్లు మంజూరు చేయాలని అధికారులను ఆయన కోరారు. రాజీవ్ విద్యామిషన్ పథకం కింద చేపట్టిన భవన నిర్మాణ కార్యక్రమాలు ప్రగతిని కూడా కలెక్టర్ సమీక్షించారు. వచ్చే విద్యా సంవత్సరానికి కస్తూరిభా గాంధీ బాలికల విద్యాకేంద్ర భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలని, మోడల్ పాఠశాలలను ప్రారంభించాలని అన్నారు.
జిల్లా విద్యాశాఖాధికారి కె.కృష్ణవేణి, ఉపవైద్య శాఖాధికారులను రేణుక, మధుసూధనరావు, లింగేశ్వరరెడ్డి, రాజీవ్ విద్యామిషన్ పిఒ వెంకటేశ్వరరావు, సాంఘీక సంక్షేమశాఖ సంయుక్త సంచాలకులు డి.శ్రీనివాస్, వయోజన విద్యాశాఖ ఉపసంచాలకులు తదితరులు పాల్గొన్నారు.

బౌలింగ్‌లో చెలరేగిన దిండా
విశాఖపట్నం (స్పోర్ట్స్), అక్టోబర్ 17 : దులీప్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్ చివరి రోజున ఈస్ట్‌జోన్ బౌలర్ అశోక్ దిండా తన విశ్వరూపాన్ని ప్రదర్శించి సౌత్‌జోన్ బ్యాట్స్‌మన్‌ను బెంబేలెత్తించాడు. ఈ మ్యాచ్ రెండవ ఇన్నింగ్స్‌లో దిండా తర కెరీర్‌లోనే అద్భుతమైన బౌలింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించి 26 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. ఎసిఎ-విడిసిఎ స్టేడియంలో బుధవారం జరిగిన ఈ మ్యాచులో విజయానికి 239 పరుగుల లక్ష్యంతో లంచ్ విరామం తరువాత బ్యాటింగ్‌కు దిగిన సౌత్‌జోన్ జట్టు బ్యాటింగ్ దూకుడును చూడాలని అందరూ ఆశించారు. అయితే అనూహ్యంగా అశోక్ దిండా బంతితో విరుచుకుపడడంతో సౌత్‌జోన్ జట్టు కకావికలమయింది. సౌత్‌జోన్ జట్టు స్కోరు 2 పరుగుల వద్ద ఓపెనర్ అభినవ ముకుంద్ (2), ఆర్ ప్రసన్న (0)లను బౌల్డ్ చేయడంతో వికెట్ల పతనం ప్రారంభమయింది. ఆ తరువాత స్టార్ బ్యాట్స్‌మెన్ ఊతప్ప (5), మనీష్ పాండే (8), అమిత్‌వర్మ (7), వినయ్‌కుమార్ (0)లను దిండా వరుసగా అవుట్ చేయడంతో సౌత్‌జోన్ జట్టు 19 ఓవర్లలోనే 40 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది. ఈస్ట్‌జోన్ బౌలింగ్‌లో తీసుకున్న ఎనిమిది వికెట్లతో ఏడు వికెట్లు దిండా పడగొట్టినవే కావడం విశేషం. కె.పి. అప్పన్న (24), సి. ఎం. గౌతమ్ (18) రక్షణాత్మకంగా ఆడడంతో సౌత్‌జోన్ జట్టు ఓటమి నుండి తప్పించుకుని చావు తప్పి కన్ను లొట్టబోయినట్లయింది.
దిండా బౌలింగ్ అద్భుతం
అసాధారణమైన బౌలింగ్‌తో దిండా మ్యాచ్‌ను ఈస్ట్‌జోన్‌కు అనుకూలంగా మలిచాడని సౌత్‌జోన్ కోచ్ మాధవన్ అన్నారు. మ్యాచ్ చివరి రోజున అత్యుత్తమ బౌలింగ్ తీరును ప్రదర్శించడం ఆకట్టుకుందని పొగడ్తలతో ముంచెత్తాడు.
స్ట్రెయిట్ బౌలింగ్‌కే ప్రాధాన్యమిచ్చా
చావో రేవో తేల్చుకోవలసిన దశలో సౌత్‌జోన్ ఆటగాళ్ళు దూకుడు ప్రదర్శిస్తారని ముందే ఊహించి వికెట్ల మీదుగా వెళ్ళేలా స్ట్రెయిట్ బౌలింగ్ చేశానని, అది ఫలితాన్నిచ్చిందని దిండా అన్నాడు. సామంత్‌రే, బసంత్ మహతి బ్యాటింగ్‌లో రాణించడం మ్యాచ్ గెలవడానికి కారణమయిందని చెప్పాడు.

మావోయిస్టుల చెరలో ఇద్దరు
సీలేరు, అక్టోబర్ 17: ఆంధ్రా - ఒడి శా సరిహద్దుల్లో ముగ్గురిని మావోయిస్టులు బుధవారం తెల్లవారుజామున అ పహరించుకుపోయారు. వీరిలో ఒకరిని విడిచిపెట్టారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. సరిహద్దు లో మల్కన్‌గిరి జిల్లా కలిమెల బ్లాక్ గూ డాగుడా గ్రామానికి చెందిన కాలేజ్ విద్యార్థి రమేష్ కల్వాతోపాటు లచ్చుపడియన్,పుంజాసింగ్‌లను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన వారిలో కాలేజీ విద్యార్థి రమేష్ కల్వాను మావోయిస్టులు విడిచిపెట్టారు. మరో ఇద్దరిని విడిచిపెట్టకపోవడంతో గ్రామం లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ విషయమై వివరణ కోరగా పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నారనే నెపంతోనే వీరిని కిడ్నాప్ చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు ఒడి శా పోలీసులు తెలిపారు.

ప్రభుత్వ విధానాలు మార్చుకోవాలి
మాజీ ఎం.పి. పప్పల చలపతిరావు
యలమంచిలి, అక్టోబర్ 17: కంపెనీల ఏర్పాటులో ప్రభుత్వ విధానాలు మార్చుకోవాలని పార్లమెంటు మాజీ సభ్యుడు పప్పల చలపతిరావు అన్నారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటుతో రైతులు చుట్టుపక్కల పంటపొలాలు తీవ్రంగా దెబ్బతింటాయన్నారు. అటువంటి ఇబ్బందులు కలిగే విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటును ఆహ్వానిస్తూ రైతులను సహకరించమనడం ఎమ్మెల్యే కన్నబాబు అవగాహన రాహిత్యానికి నిదర్శనమని ఆయన విచారం వ్యక్తం చేశారు. విద్యుత్ ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తారని, అటువంటివి రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేలకు వినియోగంపై మాట్లాడే అవకాశం, అధికారం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఎన్‌టిపిసిలో కూడా 500 మెగావాట్ల విద్యుత్‌లో 60శాతం కేంద్రానికి, 40శాతం రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. రాంబిల్లి మండలంలోని ఎల్చూరు వద్ద ఏర్పాటు చేస్తున్న విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు అభిజిత్ కంపెనీ యాజమాన్యం ఆధ్వర్యంలో ప్రయత్నాలు సాగుతున్నాయని అన్నారు. అయితే ఈ ప్రైవేటు కంపెనీ లాభాల కోసం చూస్తుందే తప్ప ఈ ప్రాంత ప్రజలను పట్టించుకోదని ఆందోళన చేశారు. అటువంటి కంపెనీలకు ఎమ్మెల్యే వత్తాసు పలుకుతూ అధికారం అప్పగించిన ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా సదస్సుల్లో మాట్లాడడం స్వార్ధపూరితమైనదిగా చలపతిరావు అభివర్ణించారు. ఎస్‌ఇజడ్‌లో ఉద్యోగాలు వస్తాయని పచ్చటి పంట పొలాలను రైతుల నుంచి బలవంతంగా తీసుకోవడం ప్రభుత్వం ఇకనైనా మానుకోవాలని చలపతిరావు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సుందరపు విజయ్‌కుమార్, గనగళ్ళ వివేక్ మాట్లాడుతూ తాము పరిశ్రమల స్థాపనకు వ్యతిరేకులం కామని, అయితే తీవ్ర కాలుష్యాన్ని వెదజల్లే కైజన్ పవర్ ప్లాంట్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ ఏర్పాటు చేయనీయబోమన్నారు. దేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యపరిచి అడ్డుకొంటామని వీరు హెచ్చరించారు.

నలుగురు మిలీషియా సభ్యుల లొంగుబాటు
పెదబయలు, అక్టోబర్ 17: మావోయిస్ట్ మిలీషియా సభ్యులు నలుగురు బుధవారం తమ ఎదుట లొంగిపోయినట్టు పాడేరు ఎ.ఎస్.పి. ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. పెదబయలు పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఇంజరి పంచాయతీ లిచ్చాబు గ్రామానికి చెందిన అరడ కృష్ణారావు, అలమ బొజ్జిదొర, అలమ చంటిబాబు, జామిగుడ పంచాయతీ తారాబుకి చెందిన వడ్డెల అప్పన్న దొర తమ ఎదుట లొంగిపోయినట్టు చెప్పారు. వీరు మావోయిస్ట్‌లకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించేవారని, మావోల కరపత్రాల పంపిణీ, ఆహార పదార్ధాల సరఫరా, జనసమీకరణ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని ఆయన చెప్పారు. వీరు స్వచ్ఛందంగా తమ ఎదుట లొంగిపోయినందున ఎటువంటి కేసులు లేకుండా హామీతో విడిచిపెట్టనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాడేరు పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గఫూర్, ఎస్.ఐ.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

కలెక్టరేట్ ముట్టడి
* హాస్టళ్ళను తెరవాలంటూ డిమాండ్
విశాఖపట్నం, అక్టోబర్ 17: మూసివేసిన ఎస్టీ హాస్టళ్ళను వెంటనే తెరవాలని, గ్యాస్ రాయితీని ఇవ్వాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ గ్రేటర్ విశాఖ నగరశాఖ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులు నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడి స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. పలు సమస్యల పరిష్కారం కోరుతూ భారీ ప్రదర్శనగా కలెక్టరేట్‌కు చేరుకున్న విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గేటు వద్దనే బైఠాయించారు. లోపలకు వెళ్ళే ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట నెలకొంది. దీంతో విద్యార్థులను అదుపులోకి తీసుకుని వ్యాన్‌ల్లోకి ఎక్కించారు. వీరందర్ని అరెస్టులు చేసి తరువాత విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శి బి.జగన్ మాట్లాడుతూ విద్యార్థుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యధోరణిని అవలంబిస్తోందన్నారు. ప్రస్తుతం ఇస్తు న్న మెస్‌చార్జీలను పెం చాలని, మూసివేసిన ఎస్టీ హాస్టళ్ళను తెరవాల్సిందిగా డిమాండ్ చేశారు. తొలుత జగ దాంబ జంక్షన్ నుంచి ప్రదర్శనగా బయలుదేరి కలెక్టరేట్‌కు చేరుకున్నారు.

గోమంగిలో పిఒ పల్లెనిద్ర
పాడేరు(రూరల్) అక్టోబర్ 17: మావోల అడ్డాగా పేరొందిన ప్రాంతాలలో ఒకటైన పెదబయలు మండలం, గోమంగి గ్రామంలో ఐ.టి.డి.ఎ.ప్రాజెక్టు అధికారి శ్రీకాంత్ పల్లెనిద్రలో పాల్గొనేందుకు బుధవారం చేరుకున్నారు. అత్యంత మారుమూల ప్రాంతంతోపాటు మావోల ప్రాబల్యం అధికంగా ఉంటుందనే ప్రచారం బలంగా ఉన్న గోమంగిలో ఉన్నత స్ధాయి అధికారి పల్లె నిద్ర చేపట్టడం విశేషం. పగటి సమయంలోనే పర్యటించేందుకు సామాన్యుల నుండి అధికారుల వరకు వెనుకాడుతున్న ఈ ప్రాంతంలో ప్రాజెక్టు అధికారి పల్లె నిద్రకు నిర్ణయించుకోవడం సాహసోపేత నిర్ణయంగానే పేర్కొనవచ్చు. ప్రజల సమస్యల పరిష్కారంలో అన్నింటా తానే ముందుండి మన్యాన్ని నడిపించే శ్రీకాంత్ పలు సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికే సందర్శించి గిరిజనుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపడంతో ఆయనకు గిరిజనుల సేవపై గల చిత్తశుద్ధి ఇటువంటి సాహసోపేత నిర్ణయానికి కారణంగా పలువురు అభిప్రాయపడుతున్నారు.

అన్‌రాక్ కార్మికులు, నిర్వాసితుల సమస్యలపై
అయ్యన్న పాదయాత్ర ప్రారంభం
మాకవరపాలెం, అక్టోబర్ 17: అన్‌రాక్ కార్మికులు, నిర్వాసితుల సమస్యలపై జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు మండలంలోని కామేశ్వరమ్మ ఆలయం నుంచి బుధవారం పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్రకు జిల్లాలోని పార్టీ శ్రేణులు , కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు. ఈసందర్భంగా సమావేశంలో అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ అన్‌రాక్ ఫ్యాక్టరీ ఏర్పాటు వలన ఈ ప్రాంతంలో నీటి జలాలు పూర్తిగా అడుగంటిపోతాయన్నారు. దీనివలన ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆయన ఆరోపించారు. అన్‌రాక్ కార్మికులు, నిర్వాసితులు సమస్యలపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించలేదన్నారు. ఈ ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీ, విద్యుత్ ప్లాంట్, అల్యూమిన కర్మాగారం ప్రారంభమైతే ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు. నిర్వాసితులకు చెల్లించాల్సిన నష్టపరిహారం, రిఫైనరీలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలను చెల్లించాలంటూ పలుసార్లు యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్ళినా వాటిపై స్పందించలేదన్నారు. అన్‌రాక్ ఫ్యాక్టరీ నిర్మాణంపై హైకోర్టులో కేసు వేసేందుకు ఇప్పటికే రికార్డులు సిద్ధం చేశామన్నారు. ఈసమస్యలు పరిష్కరించే వరకు అఖిలపక్షాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామన్నారు. కార్మికులు, నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేసే వరకు తాడోపేడో తేల్చుకునేందుకే పాదయాత్ర ప్రారంభించామని, ఇక్కడి నుంచి విశాఖపట్నం వరకు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సి.పి. ఐ. జిల్లా కార్యదర్శి జె.వి. సత్యనారాయణమూర్తి, చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.రాజు, మాడుగుల ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రుత్తల శేషుకుమార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

బాక్సైట్‌పై మళ్లీ ఉద్యమం
* 27న జికెవీధిలో బహిరంగ సభ
* తర్వాత దశలవారీ ఆందోళన
పాడేరు, అక్టోబర్ 17: విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తుండడంతో మళ్లీ ఆందోళనలకు సన్నద్ధవౌతున్నట్టు సి.పి.ఎం. పాడేరు డివిజ న్ కార్యదర్శి ఎం.సూర్యనారాయణ, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స చెప్పారు. బుధవారం వారు విలేఖరులతో మాట్లాడుతూ బాక్సైట్ తవ్వకాల ఒప్పందాలను రద్దు చేయించడంలో కేంద్ర, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. బాక్సైట్ అనుమతులను రద్దు చేయాలని కేంద్ర గిరిజన సం క్షేమ శాఖ మంత్రి కిశోర్‌చంద్రదేవ్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోలేదని వారు అన్నారు. బాక్సైట్ ఒప్పందాలను రద్దు చేయాలనే ఉద్ధేశ్యమే కిశోర్ చంద్రదేవ్‌కు ఉంటే నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ఒప్పందాలను రద్దు చేయించవచ్చునని వారు పే ర్కొన్నారు. కిశోర్ ఇటువంటి చర్యలు ఏమీ తీసుకోకుండా గిరిజనులను మోసపుచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. పాడేరు ప్రాంతంలో ఇటీవల పర్యటించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాంరమేష్ బాక్సైట్ తవ్వకాలు జరగనివ్వమంటూ ఉత్తిత్తి ప్రకటనలు చేయడం సరికాదని వారు అన్నారు. గతంలో బాక్సైట్ తవ్వకాలకు జైరాం రమేష్ అనుమతులు మంజూరు చేసిన విషయాన్ని మరిచిపోయి, ప్రస్తుతం బాక్సైట్ తవ్వకాలు జరగనివ్వబోమని ప్రకటించడం గిరిజనులను దగా చేయడమేనని వారు విమర్శించారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బాలరాజు సైతం బాక్సైట్‌పై స్పష్టమైన వైఖరిని ప్రకటించకుండా నాన్చుడి ధోరణి అవలంబిస్తున్నారని వారన్నారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాలను చేపట్టేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేస్తుందని వారు చెప్పారు. బాక్సైట్ గనులను తరలించేందుకు నాలుగు లైన్ల రహదారులను, మాకవరపాలెం వద్ద అల్యూమినియం కర్మాగారాన్ని నిర్మిస్తున్నారని, నక్కపల్లి వద్ద అన్‌రాక్ పోర్టుకు ఇప్పటికే ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని వారు పేర్కొన్నారు. ఎ.పి.ఎం.డి.సి. మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్‌కుమార్ మీనా బాక్సైట్‌కు అనుకూలంగా వ్యవహరిస్తూ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఈ పరిస్థితులలో మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చకాచకా జరిగిపోతున్నట్టు అర్థవౌతుందని వారు అన్నారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వపరంగా జరుగుతున్న ఏర్పాట్లను దృష్టిలో పెట్టుకుని ఆదివాసులను మరోసారి మేల్కొలిపేందుకు ఉద్యమబాట పడుతున్నట్టు వారు పేర్కొన్నారు. ఈ నెల 27వ తేదీన గూడెంకొత్తవీధి మండలం జెర్రెలలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు. జెర్రల ప్రాంతంలోని బాక్సైట్ ప్రభావిత ప్రాంతాలకు చెందిన అనేక గ్రామాల గిరిజనులు ఈ సభకు హాజరయ్యేవిధంగా తాము ఏర్పాట్లు చేసినట్టు వారు చెప్పారు. అనంతరం దశలవారీగా మన్యంలో ఉద్యమ కార్యక్రమాలను ప్రారంభించేందుకు కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు వారు తెలిపారు. బాక్సైట్ ముప్పు నుంచి తమను తాము రక్షించుకునేందుకు గిరిజనులు ఉద్యమాలకు సిద్ధం కావాలని సూర్యనారాయణ, అప్పలనర్స పిలుపునిచ్చారు.

ఆంత్రాక్స్ లక్షణాలతో కెజిహెచ్‌లో ఇద్దరికి చికిత్స
అరకులోయ, అక్టోబర్ 17: మం డలం పెదలబుడు పంచాయతీ కరసాలిగుడ గ్రామానికి చెందిన కె.త్రినాథ్ (40) ఆంత్రాక్స్ లక్షణాలతో విశాఖపట్నం కింగ్‌జార్జి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతనితో పాటు కొ త్తబల్లుగుడ పంచాయతీ కొర్రాగుడకు చెందిన సోబాయి అంజన్న అనే ఏడా ది బాలుడికి కూడా ఆంత్రాక్స్ లక్షణా లు ఉండడంతో కింగ్‌జార్జి ఆసుపత్రికి తరలించారు. త్రినాథ్ కుమారుడు ఆదిమూర్తి మంగళవారం అర్థరాత్రి మృతి చెందాడు. చికిత్స పొందుతున్న ఇద్దరిలో త్రినాథ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. అయితే త్రినాధ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ కుమారుడు ఆది మూర్తి మృతి చెందడంతో ఆసుపత్రి నుంచి స్వగ్రామానికి కుమారుడు మృతదేహాన్ని తీసుకువచ్చి బుధవారం అంత్యక్రియలు చేశారు.

‘ఉపాధి’ ప్రజావేదికలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
* ఒకరికి తీవ్రగాయం
మాకవరపాలెం, అక్టోబర్ 17: మండలంలో చేపట్టిన ఉపాధి హామీ పనులపై బుధవారం నిర్వహించిన ప్రజావేదికలో రెండు వర్గాల మధ్య జరిగిన కొట్లాటలో ఒక వ్యక్తికి తీవ్ర గాయమైంది. గత ఏడాది మండలంలో చేపట్టిన ఉపాధి పనులపై గత వారం రోజులుగా గ్రామాల్లో సామాజిక తనిఖీలు నిర్వహించారు. దీనిపై బుధవారం మండల పరిషత్ కార్యాలయం వద్ద ప్రజావేదిక నిర్వహించారు. దీనికి జిల్లా స్థాయి ఉపాధి శాఖాధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధి కూలీలు హాజరయ్యారు. ఉదయం పది గంటలకు ప్రజావేదిక సమావేశం ప్రారంభించారు. సమావేశంలో బూరుగుపాలెంలో చనిపోయిన వారి పేర్లతో ఉపాధి నిధులు కాజేసారంటూ గ్రామ మాజీ వైస్ సర్పంచ్ వబ్బలరెడ్డి రమణ ఆరోపించారు. దీనిపై అదే గ్రామానికి చెందిన మాజీ ఎం.పి.టి.సి. రుత్తల సత్యనారాయణ జోక్యం చేసుకుని గ్రామంలో ఉపాధి హామీ నిధులు ఎవరూ స్వాహా చేయలేదని చెప్పడంతో వారిరువురు మధ్య వాగ్వివాదం జరిగి చిలికిచిలికి గాలివానలా మారి కొట్లాటకు దారి తీసింది. ఈ కొట్లాటలో అదే గ్రామానికి చెందిన రుత్తల తాతీలుకు తలపై తీవ్ర గాయమైంది. దీంతో ప్రజావేదికలో ఇరువర్గాలకు చెందిన వారు కర్రలు, కుర్చీలతో కొట్టుకోవడంతో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. తాతీలు తలకు తీవ్రగాయమై రక్తస్త్రావం కావడంతో అతన్ని స్థానిక పి.హెచ్.సి.కి తరలించి ప్రధమ చికిత్స చేసి నర్సీపట్నం తరలించారు. ప్రజావేదిక వద్ద పోలీసులు ఉంటే కొట్లాట జరిగి ఉండేది కాదని ఎం.పి.డి. ఓ. అన్నారు. పోలీసులకు రెండు రోజుల కింద ఈ విషయాన్ని తెలియజేశామన్నారు. ఈ కొట్లాటపై ఇరువర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

* విద్యార్థుల గల్లంతుతో ఉలిక్కిపడ్డ నగరం * వద్దన్నా ఈతకు వెళుతున్న జనం * తల్లిదండ్రులకు గర్భ శోకం
english title: 
g

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>