జగదాంబ మహామాయ మహిషాసురాది అనేమంది రాక్షసులను వధించి దేవతల చేత స్తుతికి కారణమయ్యింది. ఆ జగన్మాత వ్రతాన్ని ఆచరించి శరణు కోరినట్లయితే అన్ని కోరికలు సిద్ధిస్తాయని దేవీభాగవతం చెబుతోంది. దీనిని దుర్గాదేవి వ్రతం అంటారు. ఈ వ్రతాన్ని ఆశ్వీయుజు శుద్ధ పాడమి మొదలుకుని నవమి వరకు తొమ్మిది రోజులు చేస్తారు.
మొదటి రోజు దుర్గాదేవి విగ్రహాన్ని యధాశక్తిగా బంగారం, వెండి లేదా మట్టితో చేసి పూజామందిరంలో ఉంచాలి. విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి షోడశోపచారాలతో, సహస్ర నామాలతో, అష్టోత్తర శతనామాలతో కుంకుమార్చన చేసి నైవేద్యం పెట్టాలి. అనంతరం ప్రసాదం స్వీకరించాలి. అమ్మవారి కథలు తెలుసుకుని అక్షతలు తలపై వేసుకుని తిరిగి రాత్రివేళ అమ్మవారికి పూజ చేయాలి.
మాయాజూదంలో ఓడిపోయిన ధర్మరాజు, సోదరులతోనూ, ద్రౌపదితోనూ కలసి పనె్నండు సంవత్సరాలు అరణ్యవాసం పూర్తిచేశాడు. ఇక ఒక్క సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి. ఆ కాలంలో పాండవులలో ఏ ఒక్కరినైనా కౌరవులు గుర్తిస్తే మళ్లీ అరణ్యవాసం, అజ్ఞతవాసాలు చేయాలి. ఆ కారణంగా అజ్ఞాతవాసం విరాట నగరంలో విరాట మహారాజు కొలువులో నెరవేర్చుకుందామని నిర్ణయించుకుని ధర్మరాజు దుర్గాదేవిని స్తుతించాడు. అతడు అమ్మవారి అనుజ్ఞ మేరకు దేవీ వ్రతాన్ని ఆచరించాడు. తిరిగి రాజ్యాన్ని చేపట్టాడు. సకల ఐశ్వర్యాలతో తులతూగాడు.
శరన్నవరాత్రులలోని మొదటి రోజు అంటే ఆశ్వీయుజ శుద్ధ పాడమి రోజు కలశస్థాపన చేసి శరన్నవరాత్ర దీక్ష వహించాలి. ఆ రోజు స్ర్తిలు స్తనవృద్ధి గౌరీ వ్రతాన్ని పాటిస్తారు. తమ బిడ్డలసౌభాగ్యాభివృద్ధికిగాను గౌరీదేవికి ఈ వ్రతాన్ని చేస్తారు.
సప్తమినాడు సరస్వతి పూజ చేస్తారు. విద్యాభ్యాసాన్ని కల్పించమని విద్యార్థులు, పిల్లలు ఈ పూజ చేస్తారు. విద్యావంతులు కావాలనుకునే విద్యార్థులు పుస్తకాలను దేవీ మందిరంలో ఉంచి ఈ పూజ చేస్తారు. తమ పిల్లల పేర్ల మీద తల్లిదండ్రులు కూడా ఈ పూజ చేస్తారు.
తొమ్మిది రోజులూ దీక్ష పాటించలేనివారు సప్తమి, అష్టమి, నవమి తిథులలో దీక్ష పాటిస్తారు. దీనిని ‘త్రిరాత్ర వ్రతదీక్ష’ అని పిలుస్తారు.
అష్టమి అంటే దుర్గాష్టమిని మహాష్టమి అని కూడా అంటారు. ఆ రోజంతా అష్టమి తిథి ఉంటే దుర్గాష్టమి. అలా కాకుండా అష్టమి వెళ్లి ఆనాడే నవమి తిథివస్తే దానిని మహాష్టమి అంటారు. ఈ దుర్గాష్టమి రోజున అమ్మవారిని సహస్ర నామాలతో, కుంకుమార్చనలతోనూ అర్చిస్తే, సత్ సంతాన భాగ్యం కలుగుతుంది. ఈ దుర్గాష్టమి రోజు లలితా సహస్ర నామం పఠించేవారికి ఎలాంటి భయాలు దరిచేరవు. నవరాత్రి దీక్షలో మహానవమి మఖ్యమైనవి. మంత్రసిద్ధి జరిగే ఈ రోజుని ‘సిద్దిదా’ అని పిలుస్తారు. నవమి రోజున మహార్నవమిఅంటూ పూజ చేస్తారు. పూర్వకాలంలో జైత్రయాత్రలకు వెళ్ళే రాజులు, చక్రవర్తులు నవమి రోజున ఆయుధ పూజలు చేసేవారు. అలా చేయడంవల్ల వారికి విజయం సంప్రాప్తించేది. కాలక్రమంలో అదే ఆచారం నేటికీ కొనసాగుతోంది. ఆ రోజు వాహనాలు, యంత్రాలున్నవారు సహస్రనామ పూజగానీ, అష్టోత్తర శతనామ పూజ కానీ చేయడం శ్రేయస్కరం కాగలదు.
దశమి రోజున శమీ పూజ చేస్తారు. దీనిని అపరాజిత పూజ అని కూడా పిల్వడం జరుగుతోంది. ‘శమి’ అంటే జమ్మి. ఈ రోజున జమ్మి చెట్టును పూజిస్తారు. పాండవులు అజ్ఞాత వాసానికి వెళుతూ తమ ఆయుధాలను జమ్మి చెట్టు తొర్రలో దాచారుట. ఉత్తర గోగ్రహణ సమయంలో అర్జునుడు తన గాండీవాన్ని జమ్మి చెట్టుమీద నుంచే తెచ్చుకున్నాడట. తమ కోర్కెలు నెరవేరాలని కోరుకునేవారు తమ గోత్ర నామాలతో శమీపూజ చేయించుకోవడం శ్రేయస్కరం. శమీ పాపాలను నశింపజేస్తుంది. శత్రువులను సంహరిస్తుంది. అంటే శత్రుపీడ లేకుండా చేస్తుంది.
మంచిమాట
english title:
manchimata
Date:
Saturday, October 20, 2012