నిర్మలాచారుడు, రాజనీతి కోవిదుడు, ధర్మశీలి, త్రిజగద్విఖ్యాత కీర్తి నిమి చక్రవర్తి జనించాడు. నిమి తనయుడు మిథి. ఇతడే ఈ మిథిలానగరాన్ని నిర్మించాడు. అతనికి జనకుడు, జనకుడికి ఉదావసుడు పుట్టారు.
ఉదావసు మహారాజుకి నందివర్థనుడు, నందివర్థనుడికి సుకేతుడు, అతనికి రాజర్షిగా ప్రశస్తి గాంచిన దేవరాతుడు పుత్రులుగా జన్మించారు.
దేవరాతుడి సుతుడు బృహద్రథుడు. బృహద్రథుడికి మహావిభుడు తనయుడు. అతడికి స్వధృతి, స్వధృతికి దృష్టకేతుడు, అతనికి హర్యశ్వుడు, అతనికి మరుడు కలిగారు. ఆ మరువుకి ప్రతీంధకుడు సుతుడు. అతనికి కీర్తిరథుడు, కీర్తిరథుడికి దేవమీఢుడు, అతడికి విబుధుడు, విబుధుడికి మహీధ్రుడు, మహీధ్రుడికి కీర్తిరాతుడు, వానికి మహారోముడు పుట్టాడు.
స్వర్ణరోముడతని తనూజుడు. వినుత గుణశీలుడు. హ్రస్వరోముడతని నందనుడు. అతడికి సౌజన్యధనులు, జనక కుశధ్వజులు సూనులు.
జనకుడు రాజ్యం పాలిస్తూ ఉండగా ఒకప్పుడు సాంకాశ్య ప్రభుడు సుధన్వుడు సైన్య సహితుడై దండు వెడలివచ్చి సీతా సమేతంగా శివుని చాపం అడగడానికి దూతని పంపాడు. ఆ దూతని వెడలగొట్టగా, మిథిలపైపడి హరధనువు, సీత కావాలి అని ఘోరమైన కలను పొడువగా జనకుడు సంగర స్థలిని వానిని కూల్చి తన తమ్ముడు కుశధ్వజుడిని సాంకాశ్య నగరానికి రాజ్యం పాలింప పంపాడు.
ఈ జనకుడు ఆదిగా ఈ వంశజులందరికీ భువిలో జనక నామం ప్రశస్తం. నిమి వంశంలో ప్రభవించిన నృపతులందరు యోగజ్ఞాన సంపన్నులు’’ నిమి ఆ వంశంవారిని కొనియాడాడు.
అనంతరం ఆ సీత గుణగణాలను పొగడి విఖ్యాత ప్రతాపుడిని, స్వచ్ఛ సంభాషణుని దశరథుని కనుగొని, ‘‘దశరథ భూమీశా! నిత్యాభిరాముడైన రాముడిని సీతతో వివాహం చేయించి అనంతకీర్తి ఆర్జించు’’ అని మధురాక్షరంగా సంభాషించాడు.
ఆ శతానందుడి మధురా భాషణములు విని దశరథుడు ఉత్సహించి వసిష్ఠ విశ్వామిత్ర మహర్షుల పొడగని కడు వేడ్కతో వారితో ‘‘చారుశీలుడు ఈ జనక భూజానికి లక్ష్మణుడికి ఊర్మిళను, సుగుణ గణ్యులు భరత శత్రుఘు్నలకు కుశధ్వజుడి పుత్రికలు మాండవీ శ్రుతకీర్తులను మీరు అడగండి’’ అని వాకొన్నాడు.
అంత వసిష్ఠ విశ్వామిత్ర సంయమీంద్రులు జనక మహారాజుకి దశరథుని మనోరథాన్ని తెలియచేయగా జనకుడు అంగీకారం తెలిపి దశరథుడికి ఆనందం కలిగించాడు.
మరునాడు శుభగ్రహాల దృష్టి కలగడంవల్ల ఉత్తర ఫల్గున నక్షత్రమందే లగ్న నిశ్చయం చేయించాడు. శుభవార్త తెలుపగానే పరిచారకులు పురాన్ని అంతిపురాన్ని అలంకరింప ఆనతిచ్చాడు.
వెంటనే పరిచారకులు గంధం కస్తూరి మిళితం చేసిన జలం చల్లి చీనిచీనాంబర వితానంతోను, నానా మణీ తోరణాలతోను, నానావర్ణ ధ్వజాలతోను ఫల భార రంభా స్తంభ కవిత ద్వారములతోను రమణీయ రంగవల్లీ శోభితమూ, మణిమయ స్వర్ణకుంభ కలిత సౌధ గోపురానీకమూ, అయిన మిథిలానగరము అంతా నైపుణ్యంతో అలంకరించారు. అంతఃపురాన్నీ మనోహరంగా అలంకరించారు.
శిల్పులు పచ్చలు పొదిగిన బంగరు స్తంభాలు నిల్పి, ఆ మీద నీలవర్ణపు బోదెలు, కురువిందాల దూలాలు, పొదుగు చేసి గోమేధికాల కొణిగెలు, స్వర్ణమయ మణిమయ కవాటాలు నాల్గు వాకిళ్ల యందు అమర్చి బంగరు రంగు చిత్తరువులు అందంగా తీర్చిదిద్దారు.
వివాహవేదికని కస్తూరితోఅలికి ముత్యాల కాంతుల మ్రుగ్గులు పెట్టి లక్ష్మీవిష్ణుల వివాహగాధ సజరాతి కెంపుల కుడ్యంమీద చిత్రింప ప్రజలకు కన్నుల పండువై విరాజిల్లింది.
- ఇంకాఉంది