Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

విజయవాడ మెట్రోరైల్‌కు ప్రతిపాదనే రాలేదు: కేంద్రం

$
0
0

న్యూఢిల్లీ: విజయవాడలో మెట్రోరైల్ నిర్మాణంకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన అందలేదని పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి హర్దీప్‌సింగ్ పూరి వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి గురువారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన మెట్రోరైల్ విధానానికి అనుగుణంగా విజయవాడలో మెట్రోరైల్ నిర్మాణానికి తిరిగి ప్రతిపాదన పంపించవలసిందిగా సెప్టెంబర్ 2017లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. అయితే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన తమకు అందలేదని చెప్పారు. పట్టణ రవాణా అనేది పట్టణాభివృద్ధి ప్రణాళికలో అంతర్భాగం.. అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వ్యవహారం.. పట్టణ రవాణ వ్యవస్థకు అవసరమైన వౌలిక వసతులు కల్పించే బాధ్యత కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుందని మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అత్యధిక ప్రాథమిక పాఠశాలలు విద్యా హక్కు చట్టానికి (ఆర్టీఈ) లోబడే నడుస్తున్నాయని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ సత్యపాల్ సింగ్ తెలిపారు. రాష్ట్రంలో 25శాతం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయని విజయ సాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు జవాబుగా కేంద్ర మంత్రి ఈ విషయం చెప్పారు.


మోదీకి నల్లజెండాలతో నిరసన తెలుపుతాం

$
0
0

రాజమహేంద్రవరం: ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీలో అడుగు పెట్టే హోదా లేదని పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన తర్వాతే ప్రధాని మోదీ రాష్ట్రంలోకి అడుగుపెట్టాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని, లేదంటే జనవరి 6న గుంటూరు ప్రధాని మోదీ గుంటూరు పర్యటన సందర్భంగా రాష్టవ్య్రాప్తంగా నల్ల జెండాలతో నిరసన తెలుపుతామన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని కొండగుంటూరు వద్ద గురువారం రఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడారు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్ ఐదేళ్లు ప్రత్యేక హోదా అంటే కాదు పదేళ్ళు అని బీజేపీ ముందుకొచ్చిందన్నారు. ఇపుడు ఆ విషయం మర్చిపోయి వ్యవహరిస్తోందన్నారు. అప్పటి నుంచి ప్రత్యేక హోదా అమలై వుంటే ఇప్పటికి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీరిపోయేదన్నారు. ప్రత్యేక హోదా పదేళ్లు ఇస్తామని
విశాఖ, తిరుపతి, నెల్లూరు సభల్లో ప్రధాని చెప్పారని, హోదాతో పరిశ్రమలు వచ్చి, రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు ప్రత్యేక హోదా అమలు చేయకపోతే ప్రజలు, నిరుద్యోగుల ఆగ్రహం చవిచూడాల్సివస్తుందని హెచ్చరించారు. ‘ప్రత్యేక హోదా ఆంధ్రు హక్కు’ అని ఈ సందర్భంగా విద్యార్ధులతో రఘువీరారెడ్డి నినాదాలు చేయించారు. కడప ఉక్కు కర్మాగారం, దుగ్గరాజపట్నం ఓడరేవు, రాజధాని నిర్మాణానికి నిధులు, పోలవరానికి పూర్తి నిధులు, రైల్వే జోన్, రాయలసీమ, ఉత్తరకోస్తాకు ప్రత్యేక నిధులు, ప్రత్యేక హోదా ఇచ్చి ప్రధాని రాష్ట్రంలో అడుగు పెట్టాలన్నారు. హామీలు, హోదా అమలు పర్చకుండా ఇప్పటికే ద్రోహం చేశారని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు, చివరికి వేంకటేశ్వరస్వామికి కూడా పంగనామాలు పెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. హోదా, హామీలు అమలుపర్చకుంటే జాతి క్షమించదన్నారు. ప్రధాని సభను అడ్డుకునే కుసంస్కారం తమకు లేదని, కానీ రాష్ట్ర వ్యాప్తంగా మోదీ హఠావ్.. ఏపీ బచావ్ అనే నినాదంతో నల్లజెండాలతో నిరసన తెలియజేస్తామని రఘువీరారెడ్డి తెలిపారు.

రేణిగుంటలో సిలికాన్ సిటీ

$
0
0

రేణిగుంట/ఏర్పేడు, డిసెంబర్ 20: ఆధ్యాత్మిక నగరమైన తిరుపతికి సమీపంలో ఉన్న రేణిగుంట ఎయిర్‌పోర్ట్ వద్ద వెయ్యి ఎకరాల్లో కొత్తగా సిలికాన్ సిటీ నిర్మించనున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం ఏర్పేడు మండలంలోని వికృతమాల గ్రామపరిధిలో రూ.2,200 కోట్లతో నిర్మించనున్న ప్రముఖ టీవీ ప్యానెల్ తయారీ సంస్థ టీసీఎల్ ఇండస్ట్రియల్ పార్క్‌కు ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, తిరుపతిని హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్స్ హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. గతంలో సైబరాబాద్‌ను ఎంత అభివృద్ధి చేశానో అదే తరహాలో రేణిగుంట విమానాశ్రయం వద్ద వెయ్యి ఎకరాల్లో సిలికాన్ సిటీ అభివృద్ధి చేస్తామన్నారు. గతంలో తిరుపతిలో డిక్సన్, సెల్‌కాన్ తదితర కంపెనీలను ఏర్పాటు చేశామని త్వరలో రిలయన్స్ రాబోతోందని, ప్రస్తుతం 159 ఎకరాల్లో రూపొందుతున్న టీసీఎల్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ప్రపంచంలోనే మూడవ అతిపెద్దదైన టీవీ ప్యానల్ సంస్థ అని అన్నారు. ఈ ఇండస్ట్రియల్ పార్కును ఏడాదికి పూర్తి చేయాలన్నది వారి లక్ష్యం కాగా 9 నెలల్లో పూర్తి చేయాలని తాను కోరానని, అయతే 8 నెలల్లోనే పూర్తి చేస్తామని వారు చెప్పడం తనకు ఎంతో సంతోషానిచ్చిందన్నారు. ఇది వారి పట్టుదల, అంకితభావం, వేగానికి నిదర్శనమన్నారు. ఈ ప్రాజెక్టు రాకతో 6వేల మందికి ఉపాధి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. ఈసీఎల్ ఇంటిగ్రేటెడ్ మ్యానుపాక్చరింగ్ ప్రాజెక్టును తిరుపతిలో ఏర్పాటు చేయడంతో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధిలో అత్యంత ముఖ్యమైనదన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తున్నామని, అందుకే ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రానికి అవార్డు దక్కిందన్నారు. గతంలో సాప్ట్‌వేర్ రంగం అభివృద్ధికి తాను ఎంతో కృషి చేశానని అదే రీతిలో ప్రస్తుతం హార్డ్‌వేర్ రంగాన్ని బలోపేతం చేస్తామన్నారు. 2029లోపు దేశంలోనే నెంబవర్‌వన్ రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలోనే బెస్ట్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. 2020నాటికి 15శాతం వృద్ధి రేటు ఉండేలా పనిచేస్తామన్నారు. ఐటీ, హార్డ్‌వేర్, సైబర్ సెక్యూరిటీ, ఇండస్ట్రియల్, టెక్నాలజీ, గ్లోబల్ పాలసీలు వంటివి రూపొందించామన్నారు. ఆర్ట్ఫిషియల్, క్లౌడ్, ఆనిమేన్ వంటివి మరింత అభివృద్ధి చెందేందుకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 59 ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల ద్వారా లక్షమందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని అందులో ఒక్క చిత్తూరు జిల్లాదే సింహభాగమన్నారు. ప్రముఖ ఇండస్ట్రీయల్ ఫార్క్ అయిన షెన్‌జెన్‌కు దీటుగా తిరుపతిని అభివృద్ధి చేస్తామన్నారు. తిరుపతి, నెల్లూరు, చెన్నైలను సిలికాన్ కారిడార్‌గా రూపొందిస్తున్నామన్నారు. ఈ మూడు నగరాలు, మూడు ఎయిర్‌ప్టోలు, 3 ఓడ రేవులు, తిరుపతిచిత్తూరు ఆరులైన్ల రోడ్డు, తిరుపతిమదనపల్లి మధ్య నాలుగు లైన్ల రోడ్డు, రేణిగుంటకడప జాతీయ రహదారి అందుబాటులో ఉండడంతో సిలికాన్ కారిడార్‌గా అభివృద్ధి చెందడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ రాకతో ఆ జిల్లా రూపురేఖలు మారి అభివృద్ధి పథంలో ముందుకు వెళుతున్నదని, అదే రీతిలో
ఎలక్ట్రానిక్స్, ఐటి ఇతర పరిశ్రమల రాకతో చిత్తూరు జిల్లా రూపురేఖలు మారి ప్రపంచ పటంలో ప్రముఖంగా ఖ్యాతి చెందుతుందన్నారు. నిరుద్యోగ యువతకు వృత్తి నైపుణ్యశిక్షణ కల్పించి, ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నామన్నారు. దేశంలోనే తిరుపతి 2వ సేఫెస్ట్ నగరం, 4వ నివాసయోగమైన నగరంగా, 6వ పరిశ్రమైన నగరంగా, 7 యూనివర్శిటీలు, ప్రజల ఆరోగ్య రక్షణకై అనేక ప్రముఖ ఆసుపత్రులు ఉండడంతో ఒక హెల్త్‌హబ్‌గా కూడా తిరుపతి పేరు తెచ్చుకున్నదన్నారు. మూడునెలల క్రితం ఎం ఓ యు చేసుకున్న టీ సీ ఎల్ కంపెనీ ఈ డిసెంబర్‌లో శంకుస్థాపన చేసుకునే స్థాయికి వచ్చిందంటే మంత్రి నారా లోకేష్, ఐ టీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విజయానంద్ కృషి ఎంతో ఉందన్నారు. అదే విధంగా ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు చిత్తశుద్ధితో, స్పీడ్‌తో కృషి చేసిన టీ సీ ఎల్ కంపెనీ సి ఈవోను అభినందించారు.
రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖల మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్రలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తూ నాలుగున్నర సంవత్సరాల్లోనే అత్యధిక పరిశ్రమలను ఏర్పాటు చేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందన్నారు. దేశవ్యాప్తంగా చూస్తే మొబైల్‌ఫోన్‌ల తయారీలో 30శాతం మన రాష్ట్రానిదేనన్నారు. దాదాపు 18వేల మంది మహిళలు ఈ రంగంలో పనిచేస్తున్నారని తెలిపారు. 1200మందికి పైగా సర్వీస్ ఇంజనీర్లు, 250కు పైగా సర్వీస్ సెంటర్‌లతో భారతదేశ వ్యాప్తంగా విస్తృతంగా నెట్‌వర్క్‌తో టీసీఎల్ సాటిలేని రీతిలో సేవలు అందిస్తున్నదన్నారు. పారిశ్రామిక, తదితర రంగాల్లో 1.2లక్షల మందికి ఉద్యోగాలను రాయలసీమ రీజియన్‌లో కల్పించాలన్నారు. ముఖ్యమంత్రి యువనేస్తం పథకం ద్వారా నిరుద్యోగులకు వృత్తి నైపుణ్యతా శిక్షణను అందిస్తున్నామని తెలిపారు.
టీసీఎల్ చైర్మన్ అండ్ సి ఈ వో థామ్సన్ లీ మాట్లాడుతూ గ్లోబల్ టీవీ మార్కెట్‌లో జపాన్, కొరియాలతో టీసీఎల్ పోటీ పడుతున్నదన్నారు. టీసీఎల్ వ్యూహాత్మక మార్కెట్ ఇండియా, సెమి కండక్టర్ వ్యాపారంలో మా పెట్టుబడులు ప్రతిష్టాత్మకమైన మైలురాయిగా అంతర్జాతీయ ప్రణాళికలతో నిలుస్తాయన్నారు. భారతదేశంలో తమ సంస్థ ఉత్పత్తులు సరఫరా చైనా ఇంటిగ్రేషన్ సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు బలోపేతం చేయడంతోపాటుగా మా స్థానిక వినయోగదారులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. నాణ్యమైన ఉత్పత్తులను అత్యుత్తమ విలువతో అందిస్తామన్నారు. ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ అందించిన సహకారం వల్లే ఈ కంపెనీని అనతికాలంలోనే ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ విజయానంద్ మాట్లాడుతూ ఈ పారిశ్రామిక పార్కు ప్యానెల్ మాడ్యూల్ ఫ్యాక్టరీగా ఉండనుందన్నారు. ఇది సి శాట్ ఫ్యానల్ మాడ్యూల్ ఫ్యాక్టరీ టీవీలు, మొబైల్‌ఫోన్‌లకు స్క్రీన్‌లను ఉత్పత్తి చేయనుందన్నారు. దీంతో 8మిలియన్‌ల 22అంగుళాల స్మాల్ సైజ్ మొబైల్ స్క్రీన్‌లను తయారు చేయనున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, ఎంపీ గల్లా జయదేవ్, జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, జాయింట్ కలెక్టర్ గిరీషా, సబ్ కలెక్టర్ మహేష్‌కుమార్, ఎం ఎల్ సీలు గౌనివారి శ్రీనివాసులు, రాజసింహులు, జడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి, ఎమ్మెల్యేలు సుగుణమ్మ, సత్యప్రభ, తలారి ఆదిత్య, శంకర్‌యాదవ్, చిత్తూరు నగరపాలక సంస్థ మేయర్ కఠారి హేమలత, టీ సీ ఎల్ కార్పోరేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కిమ్ ఊ షిక్, సి శాట్ సిఈవో కెవిన్‌వాంగ్, పరిశ్రమల శాఖ జీ ఎం అనిల్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..టీసీఎల్ శంకుస్థాపనకు సందర్భంగా పైలాన్ ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు లోకేష్, అమర్‌నాథ్‌రెడ్డి, సంస్థ ప్రతినిధులు

చక్కెర ఫ్యాక్టరీలకు తీపికబురు

$
0
0

అమరావతి, డిసెంబర్ 20: రాష్ట్రంలో చక్కెర పరిశ్రమకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సహకార, ప్రైవేటు రంగాల్లో పరిశ్రమలకు రాయితీలు, రుణ పరపతి కల్పించడంతో పాటు వివిధరకాల పన్నుల నుంచి మినాహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం సచివాలయంలో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్టవ్య్రాప్తంగా చెరకు ఫ్యాక్టరీల నుంచి రూ 272.33 కోట్ల విలువైన చెరకు కొనుగోలు పన్నులు మాఫీ చేయడంతో పాటు ఉద్యోగుల జీతబత్యాలు చెల్లించాలని నిర్ణయించింది. ప్రస్తుతం పనిచేస్తున్న ఐదు సహకార చక్కెర కర్మాగారాలకు వర్కింగ్ క్యాపిటల్ కింద రూ 169 కోట్ల రుణానికి ప్రభుత్వం గ్యారంటీగా ఉంటుందని వెల్లడించింది. పున ప్రారంభానికి సిద్ధంగా ఉన్న అనకాపల్లి సుగర్ ఫ్యాక్టరీకి చెరకు కొనుగోలుకు
రూ. 5 కోట్లు తక్షణమే విడుదల చేయటంతో పాటు ప్రైవేటు సుగర్ ఫ్యాక్టరీలకు కూడా వెన్నుదన్నుగా నిలవాలని ప్రభుత్వం నిశ్చయించింది. రాష్ట్రంలో ఉన్న కోఆపరేటివ్ సుగర్ ఫ్యాక్టరీల పనితీరు, ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి గిరిజాశంకర్ మంత్రివర్గ ఉప సంఘానికి వివరించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కోఆపరేటివ్ సుగర్ ఫ్యాక్టరీలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి యనమల తెలిపారు. నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ బ్యాంక్ (ఎన్‌సీడీసీ) నుంచి రూ. 169 కోట్ల రుణం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ రుణం మొత్తాన్ని చోడవరం, తాండవ, ఏటికొప్పాక, భీమసింగి సుగర్ ఫ్యాక్టరీల రైతుల బకాయిలు, ఉద్యోగదుల జీతాలను చెల్లించాలని తీర్మానించారు. అనకాపల్లి సుగర్ ఫ్యాక్టరీ రైతుల బకాయిలు, ఉద్యోగుల జీతాలు చెల్లించటానికి రూ. 30 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. అదేవిధంగా ఈ ఏడాది చెరకు కొనుగోళ్ల నిమిత్తం రూ. 5 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించింది.
రూ 272.33 కోట్ల చెరకు కొనుగోలు పన్నుల రద్దు
నష్టాల్లో ఉన్న సహకార చక్కెర కర్మాగారాలపై మరింత భారం పడకుండా రూ 272.33 కోట్ల విలువైన చెరకు కొనుగోలు పన్ను రద్దుకు మంత్రి వర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది. ఇందులో ప్రభుత్వ రంగ సంస్థలకు రూ 202.63 కోట్ల మేర వెసులుబాటు కలగనుంది. 2001 ముందున్న అన్ని సహకార చక్కెర కర్మాగారాల చెరకు కొనుగోలు పన్ను రూ 148.36 కోట్లు, ప్రస్తుతం పనిచేస్తున్న సహకార చక్కెర కర్మాగారాలకు చెరకు కొనుగోలు పన్ను రూ 54.27 కోట్లు మొత్తం 202.63 కోట్లు రద్దు కానుంది. సహకార కర్మాగారాలతో పాటు ప్రైవేటు పరిశ్రమలపైనా మంత్రివర్గ ఉప సంఘం కరుణ చూపింది. ప్రైవేటు కర్మాగారాలు ప్రభుత్వానికి రూ 69.70 కోట్ల మేర చెరకు కొనుగోలు పన్నులు చెల్లించాల్సి ఉంది. దీన్ని వన్‌టైం సెటిల్‌మెంట్ కింద రూ 20 కోట్లు చెల్లిస్తే, మిగిలిన మొత్తాన్ని మాఫీ చేసేందుకు ఆమోదం తెలిపింది.
మూతపడిన ఫ్యాక్టరీల్లో సిబ్బంది జీతాలకు రూ. 20 కోట్లు
రాష్టవ్య్రాప్తంగా మూతపడిన సహకార చక్కెర కర్మాగారాల్లో సిబ్బంది జీతబత్యాలకు రూ. 20 కోట్లు విడుదల చేయాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. కడప, చిత్తూరు, రేణిగుంట, కొవ్వూరు, జంపని సహకార చక్కెర కర్మాగారాల ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని తీర్మానించింది. ఎస్‌సీడీసీ నుంచి తీసుకున్న రుణం మొత్తం నుంచి రూ. 20 కోట్లు మూతపడిన కర్మాగారాల జీతాలకు కేటాయించనున్నారు. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేస్తామని గుంటూరు జిల్లాలోని జంపని సహకార చక్కెర కర్మాగారం ఉద్యోగులు చేసుకున్న వినతిని మంత్రివర్గ ఉపసంఘం ఆమోదించింది. సమావేశంలో మంత్రి నక్కా ఆనంద్‌బాబు, అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్, సుగర్‌కేన్ కమిషనర్ ఎల్ మురళి, సహకార చక్కెర కర్మాగారాల ఎండీలు పాల్గొన్నారు.
చిత్రం..ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం

రాశిఫలం 12/21/2018

$
0
0
తిథి: 
చతుర్దశి రా.1.38, కలియుగం - 5120 శాలివాహన శకం - 1940
నక్షత్రం: 
రోహిణి రా.1.26
వర్జ్యం: 
సా.5.37 నుండి 7.10 వరకు
దుర్ముహూర్తం: 
ఉ.8.24 నుండి 9.12 వరకు మరలా మ.12.24 నుండి 01.12 వరకు
రాహు కాలం: 
ఉ.10.30 నుండి 12.00 వరకు
మేషం: 
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్పభోజనంవల్ల అనారోగ్యాన్ని పొందుతారు. వీలైనంతవరకు అసత్యానికి దూరంగా నుండుట మంచిది.
వృషభం: 
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరమేర్పడకుండా మెలగాలి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికివెళ్లరాదు.
మిథునం: 
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు పనికిరాదు.
కర్కాటకం: 
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) బంధు, మిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. కుటుంబ సౌఖ్యముంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
సింహం: 
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుదురు. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. ఋణబాధలు తొలగును. ఆరోగ్యం మెరుగవుతుంది.
కన్య: 
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) మంచి అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది.. పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు. నూతన వస్తు, వస్త్ర ఆభరణాలను పొందుతారు.
తుల: 
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకుంటారు. ఆకస్మిక ధననష్టం పట్ల అప్రమత్తంగా నుండుట అవసరం
వృశ్చికం: 
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి వుంటుంది. ధననష్టం కలిగే అవకాశాలుంటాయి. ఏ విషయంలోను స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు.
ధనుస్సు: 
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుంటాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొనుటకు కృషి చేస్తారు.
మకరం: 
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా నుంటారు. అభివృద్ధి ఉంటుంది.
కుంభం: 
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.
మీనం: 
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) విదేశయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది.
Date: 
Friday, December 21, 2018
author: 
గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి

మరింత సమాచారం ఇవ్వండి

$
0
0

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనకు సంబంధించిన మరింత సమాచారం కోరినట్లు తెలిసింది. రాష్ట్రపతి అదన సమాచారం కోరటం వల్లే హైకోర్టు విభజనకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేయటంలో ఆలస్యమవుతోందని అంటున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆమోదం తెలిపిన అనంతరం న్యాయ శాఖ ఉమ్మడి హైకోర్టు విభజనకు సంబంధించిన ఫైలును రాష్ట్రపతి ఆమోదానికి పంపించారు. అయితే రామ్‌నాథ్ కోవింద్ హైకోర్టు విభజన ఫైలును పరిశీలించిన అనంతరం మరింత సమాచారం కోరినట్లు తెలిసింది. రాష్ట్రపతి అడిగిన సమాచారం కోసం హైకోర్టు విభజన ఫైలు మరోసారి కేంద్ర న్యాయ శాఖ, అక్కడినుంచి ప్రధాన మంత్రి కార్యాలయం, పీఎంఓ నుండి మరోసారి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ కార్యాలయానికి వెళ్లింది. రంజన్ గొగోయ్ కార్యాలయం నుండి వచ్చిన అనంతరం ఈ ఫైలు మళ్లీ రాష్టప్రతికి వెళుతుందని కేంద్ర న్యాయ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రపతిఆమోద ముద్ర పడగానే ఉమ్మడి హైకోర్టు విభజనకు సంబందించిన గెజిట్ నోటిఫికేషన్ జారీ అవుతుంది. ముందు నిర్ణయించిన ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు జనవరి ఒకటో తేదీ నుంచి విడివిడిగా పని చేస్తుందని న్యాయ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రపతి రెండు మూడు రోజుల్లో హైకోర్టు విభజనకు సంబందించిన ఫైలుపై సంతకం చేస్తారని కేంద్ర న్యాయ శాఖ భావిస్తోంది. 2019 జనవరి ఒకటో తేదీనుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు హైకోర్టులు పని చేస్తారని న్యాయ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఇదిలావుండగా టీఆర్‌ఎస్ లోక్‌సభా పక్షం నాయకుడు జితేందర్ రెడ్డి, సీనియర్ ఎంపీ బి.వినోద్ కుమార్, ఎంపీపిలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, నగేష్, కవిత, లింగయ్య యాదవ్ గురువారం పార్లమెంటు ఆవరణలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కలిసి ఉమ్మడి హైకోర్టు విభజన గురించి చర్చించారు. 2019 జనవరి నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు హైకోర్టులు పని చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టు విభజనకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను వీలున్నంత త్వరగా జారీచేయాలని విజ్ఞప్తి చేశారు. కొత్త సంవత్సరం నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు హైకోర్టులు పని చేసేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.. ఇందుకు సంబంధించిన గెజిట్ నోటిపికేషన్ త్వరలోనే వస్తుందని ఆయన హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్ ఎంపీలు అరుణ్ జైట్లీని కలిసి వెనుకబడిన జిల్లాల అభివృద్ది నిధులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి అరుణ్ జైట్లీ స్పందిస్తూ వీలున్నంత త్వరగా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. రైల్వే మంత్రి పీయూష్ గోయెల్‌ను కూడా కలిసి తెలంగాణకు సంబంధించిన రైల్వే ప్రాజెక్టుల కేటాయింపు, నిధుల విడుదల గురించి చర్చించారు.
చిత్రం..రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

రూ. 27కోట్ల ప్రభుత్వ నిధులు బొక్కేశారు!

$
0
0

కర్నూలు, డిసెంబర్ 20: వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన డిపాజిట్ సొమ్ము రూ.27 కోట్లుస్వాహా చేసిన చెన్నైకు చెందిన యంకే.ఆదిల్‌ఖాన్‌ను కర్నూలు సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సాయంతో 2015లో హౌసింగ్, పొల్యూషన్ బోర్డుకు చెందిన డిపాజిట్లు సొంత ఖాతాల్లోకి మళ్లించిన ఆదిల్‌ఖాన్‌ను అరెస్టుచేసి కడప సెంట్రల్ జైలుకు తరలించినట్లు కర్నూలు రీజనల్ ఆఫీసు సీఐడీ డీఎస్పీలు భాస్కర్‌రెడ్డి, రఘువీరారెడ్డి గురువారం తెలిపారు. 2015లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొంతమంది ఒక గ్యాంగ్‌గా ఏర్పడి ఏపీ హౌసింగ్‌శాఖ, పొల్యూషన్ బోర్డుతోపాటు ఇతర శాఖలకు చెందిన ఉద్యోగులతో మిలాఖత్ అయి ఆయాశాఖల డిపాజిట్లను హైదరాబాద్‌లోని మెహదీపట్నంలో ఉన్న స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ బ్రాంచ్‌కు బదిలీ చేయించారు. వీటికి సంబంధించిన ఎఫ్‌డీ స్లిప్‌లకు నకిలీవి తయారుచేసి వాటిని బ్యాంక్ మేనేజర్‌కు ఆతని ద్వారా సంబంధిత శాఖలకు చేరవేశారు. 10 రోజుల తరువాత డిపార్టుమెంట్ అధికారులు రాసినట్లుగా ఒక నకిలీ లెటర్ తయారుచేసి సంతకాలు ఫోర్జరీ చేసి తమ వద్ద ఉన్న అసలు ఎఫ్‌డీఆర్‌లను జత చేసి ఆ మొత్తాలను కడప జిల్లా రాజంపేట, తిరుపతిలోని నకిలీ సంస్థలకు బదిలీ చేయించారు. అక్కడి నుంచి మరికొన్ని
నకిలీ సంస్థలు, సొంత ఖాతాలకు బదలాయించుకున్నారు. ఈ విధంగా ఏపీ హౌసింగ్‌శాఖకు చెందిన దాదాపు రూ.20 కోట్లు, ఏపీ కాలుష్య మండలికి చెందిన దాదాపు రూ.7 కోట్లు, ఇతర శాఖలకు చెందిన మరికొంత డబ్బు మళ్లించుకున్నారు. దీనిపై ఏపీ హౌసింగ్, ఏపీ పొల్యుషన్ బోర్డు అధికారులు రాజంపేట, తిరుపతి పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేశారు. 2015 డిసెంబర్‌లో మొత్తం 4 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను విచారణ నిమిత్తం కర్నూలు సీఐడీకి బదిలీ చేశారు. ఈ కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఐడీ అధికారులు సుదీర్ఘ దర్యాప్తు అనంతరం దీనికి సూత్రధారి చెన్నైకి చెందిన యంకె ఆదిల్‌ఖాన్ అని నిర్ధారణకు వచ్చారు. ఆదిల్‌ఖాన్ కదలికపై నిఘా ఉంచి ఈనెల 18వ తేదీ చెన్నైలోని అతని నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి పెన్‌డ్రైవ్, మిగితా సామగ్రిని చేసుకున్నారు. ఆదిల్‌ఖాన్‌ను న్యాయస్థానంలో హాజరుపరచగా కడప కోర్టుకు రిమాండ్‌కు తరలించారు. ఆదిల్‌ఖాన్‌ను తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తామని, ఈ ముఠాలోని మిగతావారిని సైతం అరెస్టు చేస్తామని సీఐడీ అధికారులు తెలిపారు.
చిత్రం..నిందితుడు ఆదిల్‌ఖాన్

ఆయిల్ కుంభకోణం హోంశాఖదే బాధ్యత

$
0
0

అమలాపురం, డిసెంబర్ 20: అమలాపురం డివిజన్‌లో జరిగిన ఆయిల్ కుంభకోణానికి సంబంధించి హోంశాఖ బాధ్యత వహించాలని మానవహక్కుల వేదిక జాతీయ కన్వీనర్ కొంకి రాజామణి డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ఎస్‌కేబీఆర్ కళాశాల వద్ద మానవ హక్కుల వేధిక,దళిత బహుజన మహిళా శక్తి ఆధ్వర్యంలో ప్రజా సంఘ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ కన్వీనర్ కొంకి రాజామణి పాల్గొని మాట్లాడుతూ అమలాపురంలో జరిగిన ఆయిల్ కుంబకోణంలో కోట్లాది రూపాయలు దోచుకున్న ఆయిల్ మాఫియాలో సంబంధం ఉన్న పోలీస్ అధికారులను బర్తరఫ్ చేయకుండా బదిలీలు చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. పోలీసులు ఎవరూ చట్టాలకు అతీతులు కాదని, తప్పు చేస్తే పోలీసులు కూడా శిక్షార్హులే నన్నారు. పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడితే 1861 సెక్షన్ 29 ప్రకారం వారి శిక్షార్హులని రాజామణి అన్నారు. ఆయిల్ కుంభకోణంలో కోట్లాది రూపాయలు అవినీతికి పాల్పడిన పోలీసులు పట్ల హోంశాఖ బాధ్యత వహించి వారిని బదలీకాకుండా ఉద్యోగం నుండి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు.

పోలీసుల చర్యల్లో పారదర్శకత, జవాబుదారితనం ఉన్నప్పుడే సమాజంలో వారందరికీ పోలీస్ శాఖపై గౌరవం ఏర్పడుతుందన్నారు. అమలాపురంలో 2012 అంబేర్ విగ్రహాలు ధ్వంసం దగ్గర నుండి ఆయిల్ కుంభకోణం వరకు ఎక్కడా పోలీసులపై విశ్వాసనీయత లేదని ఆమె ఎద్దేవాచేసారు. ఆయిల్ కుంభకోణంలో పోలీసులపై చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర హోంశాఖ పూర్తిగా విఫలమైందని రాజామణి విమర్శించారు. ఈ కార్యక్రమంలో ముత్యాల శ్రీనివాసరావు, లంక కమళ, ఏ రమాదేవి, రవ్వ దేవి, చీకురుమెల్లి నాగవేణి, ఎం శ్రీనివాసరావు, మర్రి సంధ్యాజ్యోతి, కలిగిత రవీంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.


నా గోడు వినండి...!

$
0
0

రాజమహేంద్రవరం, డిసెంబర్ 20: వళ్లంతా తూట్లు పడి, నిత్యం నరకం అనుభవిస్తూ, వేలాది ప్రజలకు నరకం చూపిస్తున్న నేను బొమ్మూరు నుండి నేతాజీనగర్‌కు వెళ్లే రహదారిని. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమో, కక్షపూరితమో గత కొనే్నళ్లుగా నా పరిస్థితి ఇలాగే ఉండిపోయింది. కక్షపూరితమని ఎందుకంటున్నానంటే 2015లో వచ్చిన గోదావరి మహా పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లోని అన్ని రహదారులు, డ్రెయిన్లు, కల్వర్టులు తదితరాలన్నీ అభివృద్ధిచేశారు. చివరకు బాగావున్న రోడ్లు, డ్రెయిన్లను సైతం తవ్వేసి, పునర్నిర్మించారు. ఇంతచేసినా నాపై మాత్రం నేత్రాశ్రీలకు దయకలగలేదు. గుప్పెడు మట్టివేసి కూడా గుంటలను పూడ్చలేకపోయారు.
నేతాజీనగర్‌తో పాటు పలు వీధులకు చేరుకోవడానికి నేనే ప్రధాన ఆధారం. బొమ్మూరులోని కీలకమైన సెయింట్ ఆన్స్ పాఠశాలకు చేరుకోవడానికీ నేనే ప్రధాన మార్గం. నాపై నిత్యం వందలాది ఆటోలు, బైక్‌లు, విద్యాసంస్థల బస్సులు ప్రయాణిస్తుంటాయి. నాపై ఉన్న గుంతల్లో పడి పాఠశాల ఆటోలు ప్రమాదకరంగా ఒరిగిపోతున్నపుడు ఆందులోని చిన్నారులు భయంతో వణికిపోతున్నపుడు నా హృదయం ద్రవించిపోతుంది. కొద్ది నెలల క్రితం బాలాజీపేట జంక్షన్‌లో డ్రెయిన్‌పై కల్వర్టు నిర్మాణం సందర్భంగా ఆ మార్గం మూతపడటంతో రాజమహేంద్రవరం నగరానికి చేరుకోవడానికి నేనే ప్రధాన ఆధారమయ్యాను. నిత్యం వందల సంఖ్యలో వాహనాలు ప్రయాణించడంతో నాపై అడుగడుగునా ఒక గుంత పడింది. ఒక రోజు వర్షం పడిందంటే గుంతలన్నీ చెరువులుగా మారి, కనీసం 15 రోజులు రహదారి అంతా బురదగానే ఉంటుంది.
ఈ ఏడాది జూన్ 6వ తేదీన రహదారి నిర్మాణానికి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి శంకుస్థాపనచేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నిధులు రూ.30 లక్షల వ్యయంతో రోడ్డు నిర్మాణానికి శిలాఫలకం ఆవిష్కరించారు. దీనితో ఎంతో పొంగిపోయాను. ఇన్నాళ్లకి నా బాధ తీరుతుందని సంతృప్తిచెందాను. కానీ ఒకటి కాదు రెండు కాదు ఆరు నెలలు గడిచిపోయినా, రహదారి నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. శంకుస్థాపన జరిగిన కొద్ది రోజులకు గుంతల్లో కొద్దిగా క్వారీ డస్టుతో పూడ్చారు. అంతే మళ్లీ నా వంక చూసిన నాథుడే లేడు. కొద్ది రోజులకే క్వారీ డస్టు ఎగిరిపోయి, మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది. రోజులు గడిచేకొద్దీ రోడ్డు నిర్మాణం అంటే క్వారీ డస్టు వేయడమేనా అనే సందేహం కూడా కలుగుతోంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికార్లు స్పందించి, నాకు మోక్షం కలిగిస్తారని కోరుకుంటున్నాను
24 నుంచి నన్నయలో యువనేస్తం శిక్షణ

రాజమహేంద్రవరం, డిసెంబర్ 20: ముఖ్యమంత్రి యువనేస్తం కార్యక్రమానికి సంబంధించి రెండోబ్యాచ్ అభ్యర్ధులకు ఈ నెల 24వ తేదీ నుంచి ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ఉచిత శిక్షణ అందించడం జరుగుతుందని రిజిస్ట్రార్ ఆచార్య ఎస్ టేకి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఉద్యోగార్హత సాధించే నైపుణ్యాలను పెంచే లైఫ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్‌పై మెరుగుదల శిక్షణ, కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రజంటేషన్ స్కిల్స్ వంటి పలు అంశాలపై శిక్షణ అందిస్తారన్నారు. ఈ శిక్షణ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం పనె్నండున్నర గంటల వరకు ఒక బ్యాచ్, ఒంటి గంటన్నర నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మరో బ్యాచ్ చొప్పున జరుగుతుందన్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత పరీక్షలు నిర్వహించి ఏపీ ఎస్‌ఎస్‌డీసీ ద్వారా ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులైన యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించి తద్వారా మెరుగైన ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అర్హులైన అభ్యర్ధులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
27న ఎంబీఏ, ఎంసీఏ, ఎంపీఈడీ పరీక్షలు

రాజమహేంద్రవరం, డిసెంబర్ 20: పెథాయ్ తుపాను కారణంగా ఈ నెల 17వ తేదీన నిలిపి వేసిన ఎంబీఏ, ఎంసీఏ, ఎంపీఈడీ పరీక్షలను ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్నట్టు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎస్ లింగారెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం వివరాలు తెలియజేశారు. తుపాను కారణంగా నిలిపివేసిన ఉభయగోదావరి జిల్లాల్లో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న ఎంబీఏ, ఎంసీఏ, ఎంపీఈడీ పరీక్షలకు సంబంధించి 27వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. విద్యార్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చన్నారు.

కాపులను తొమ్మిదో షెడ్డూల్డ్ ప్రకారం బీసీల్లో చేర్చేందుకు హామీ

$
0
0

కడియం, డిసెంబర్ 20: బీసీలకు ఇబ్బంది లేకుండా కాపులను తొమ్మిదవ షెడ్డూల్డ్ ప్రకారం బీసీల్లో చేర్చేందుకు ఏఐసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. గురువారం కడియం దోసాలమ్మ కాలనీలో మాజీ మంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహనరావు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్లంరాజు, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌కు అనుకూల పవనాలు వీస్తున్నాయని, రానున్న రోజుల్లో కాపులను బీసీల్లో చేర్చి వారికి కాంగ్రెస్ మంచి భవిష్యత్తును అందించనుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నాయకత్వంలో జక్కంపూడి, రఘువీరారెడ్డి, పళ్లంరాజు తదితరులమంతా ఎంతో చురుకుగా ఉండేవారమన్నారు. జక్కంపూడి ఎన్నో ప్రజా ఉద్యమాల్లో పాల్గొనేవారన్నారు. 2014 ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వేసిన అభివృద్ధి శిలాఫలకాలపై అప్పటి నాయకుడు జక్కంపూడి మొక్కలు నాటుతూ వినూత్నరీతిలో నిరసన తెలిపారని, అటువంటి నిరసన కార్యక్రమాల్లో తాను కూడా పాల్గొన్నానని కిరణ్ కుమార్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వం వహిస్తే జిల్లాలో జక్కంపూడి పార్టీని ముందుండి నడిపించేవారన్నారు. అటువంటి జన యోథుని విగ్రహాన్ని ఏర్పాటుచేసిన పల్ల వెంకన్న నర్సరీ యాజమాన్యాన్ని కాంగ్రెస్ నేతలు అభినందించారు. కార్యక్రమంలో అఖిల పక్ష నాయకులు కందుల దుర్గేష్, రౌతు సూర్యప్రకాశరావు, ఎన్ రాజా, జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్ పాల్గొన్నారు.

పేదల సంక్షేమం టీడీపీతోనే సాధ్యం
*ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప
సామర్లకోట, డిసెంబర్ 20: పేద ప్రజల సంక్షేమం,గ్రామాలాభివృద్ధి ఒక్క తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యం కాగలదని, రానున్న రోజుల్లో అభివృద్ధికి ప్రజలు సహకరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పిలుపునిచ్చారు. సామర్లకోట మండలం నవర, పి వేమవరం గ్రామాల్లో గురువారం నిర్వహించిన గ్రామ దర్శిని, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి రాజప్ప ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి రాజప్ప మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు,బ్రహ్మణ కార్పొరేషన్‌ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు రుణాలు మంజూరు చేస్తుందన్నారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ మాఫీ క్రింద రూ.10వేలు నగదును వారి అకౌంటులలో జమచేశామన్నారు త్వరలో వారికి రుణాలు ఇస్తామని, అలాగే శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి సుమారు 50 వేలమంది మహిళలకు పని కల్పించనున్నట్లు చెప్పారు. ప్రతీ ఒక్కరు సొంత ఇల్లు కలిగి ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం హౌసింగ్ ద్వారా ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. రైతులు సంక్షేమానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు రైతు రుణమాఫీ, పశువులకు సైతం పశువైద్యశాలల ఏర్పాట్లు, కౌలు రైతులకు రుణాలు ఇవ్వడం జరిగిందన్నారు. అన్ని గ్రామాల్లో పూర్తి స్థాయిలో సీసీ రోడ్లు, డ్రెయిన్‌లు, మంచినీటి పథకాలు, అంగన్‌వాడీ భవనాలు, సామాజిక భవనాలను, రైతులకు సబ్సిడీలపై ట్రాక్టర్లు మంజూరు చేసినట్లు చెప్పారు. నవరలో హైస్కూల్ భవనానికి రక్షణగోడ ఏర్పాటు, క్రీడా మైదానం అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి చెప్పారు. రూ. కోటీ 20 లక్షల వ్యయంతో పి వేమవరం రోడ్డును ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధికి ప్రజలు సహకారం అందించాలని మంత్రి రాజప్ప విజ్ఞప్తి చేశారు. తొలుత నవర గ్రామంలో రూ.22 లక్షలతో నిర్మిస్తున్న పశువైద్య శాల భవనం నిర్మాణం పనులకు శంకుస్థాపనలు మంత్రి రాజప్ప చేపట్టారు. పి వేమవరంలో రూ.12 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన పంచాయతీ భవనం, రూ.6 లక్షలతో నిర్మించిన చెత్త నుండి సంపద తయారీ కేంద్రంను మంత్రి రాజప్ప ప్రారంభించారు. అనంతరం మంత్రి రాజప్ప చేతులమీదగా గ్రామాల్లో డబుల్ డస్ట్‌బిన్, క్రిస్మస్ చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట ఇన్‌ఛార్జి ఎంపీపీ ఆకునూరి సత్యనారాయణ (సత్తిబాబు), సంపర ఏఎంసీ ఛైర్మన్ కర్రి వెంకట్రాజు, వైస్‌ఛైర్మన్ వెన్నా పద్మానాభం, ఎంపీటీసీ ఆర్ చిట్టిబాబు, సామర్లకోట ఏఎంసీ వైస్‌ఛైర్మన్ అడబాల శ్రీహరిరావు(చిట్టిబాబు), టీడీపీ వాణిజ్య విభాగం జిల్లా కార్యదర్శి గుమ్మళ్ల రామకృష్ణ, మండల టీడీపీ అద్యక్షుడు తోటకూర శ్రీనివాసు, ఇన్‌ఛార్జి ఎంపీడీవో సిహెచ్ జగ్గారావు, ఎంఈవో వై శివరామకృష్ణయ్య, పశుసంవర్ధకశాఖ ఏడీ డాక్టర్ తాతయ్య, వైద్యులు డాక్టర్ శ్యామ్, డాక్టర్ వై గంగాభవానీ, పి వేమవరం గ్రామ ప్రత్యేకాధికారి ఇంటి వెంకట్రావు, హెడ్మాష్టర్ సిహెచ్ సత్యవతి, అప్పారావు, శ్రీను, మాజీ సర్పంచ్‌లు, ప్రజలు పాల్గొన్నారు.

గుట్కా గోదాములపై విజిలెన్స్ దాడులు

$
0
0

రాజమహేంద్రవరం, డిసెంబర్ 20: నిషేధిత గుట్కాను రూపుమాపేందుకు విజిలెన్స్ జిల్లాలో పెద్ద ఎత్తున దాడులు చేపట్టింది. గురువారం వివిధ ప్రాంతాల్లో దాడులు చేసి గోదాముల్లో నిల్వ చేసిన గుట్కా నిల్వలను భారీ ఎత్తున పట్టుకున్నారు. నిషేధిత గుట్కాపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ రెడ్డి గంగాధరరావు జిల్లాలో గుట్కా వల్ల అనర్ధాలను తెలియజేసేందుకు వైద్యాధికారులతో అవగాహన కల్పిస్తున్నారు. గుట్కా నిల్వలను దాడి చేసి పట్టుకోవడమే కాకుండా అసలు గుట్కా అలవాటునే మానిపించేందుకు విజిలెన్స్ ఎస్పీ రెడ్డి గంగాధరరావు వైద్యులతో కలిసి జిల్లాలో వినూత్న కార్యక్రమం చేపట్టడం విశేషత సంతరించుకుంది. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం దృష్ట్యా నిషేధించిన గుట్కాపై విజిలెన్స్ అధికారులు రాజమహేంద్రవరం, తుని, పెద్దాపురం ప్రాంతాల్లో దాడులు చేసి సుమారు 39 లక్షల విలువైన గుట్కా, గుట్కా తయారీకి సామాగ్రిని సీజ్ చేసి బాధ్యులైన వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో గుట్కాను అమ్మడం గానీ, తయారు చేయడం గానీ ఎవరైనా చేసినట్టయితే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రెడ్డి గంగాధరరావు ఈ సందర్భంగా తెలిపారు. జిల్లాలోని నిషేధిత గుట్కాను తయారు చేసిన, విక్రయించినా, నిల్వ చేసిన వారి వివరాలను విజిలెన్స్ అధికారులకు సమాచారాన్ని ఇచ్చినట్టయితే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల ఫిర్యాదులను విజిలెన్స్ ఎస్పీ నెంబర్ 8008203261కు గానీ, 0883 2566662కు గానీ తెలియజేయాల్సిందిగా కోరారు.
అడిషనల్ డిఎం అండ్ హెచ్‌ఓ డాక్టర్ పి కోమలి మాట్లాడుతూ గుట్కాను తినడం వల్ల అధిక సంఖ్యలో పురుషులు కేన్సర్ భారీన పడి చనిపోతున్నారని, అందువల్ల ప్రభుత్వం నిషేధించిందన్నారు. మత్తు పదార్ధమైన గుట్కా, పాన్, జర్ధాలకు బానిసైన పురుషులు వివిధ రకాల కేన్సర్‌లకు గురవుతున్నారని, అందువల్ల ప్రజలు వాటికి దూరంగా ఉండాలన్నారు.

తారస్థాయికి కేబుల్ వార్

$
0
0

నిజామాబాద్, డిసెంబర్ 20: జిల్లాలో కేబుల్ ఆపరేటర్ల మధ్య వ్యాపారపరంగా నెలకొన్న ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటికే స్థానికంగా కేబుళ్లను నిర్వహిస్తున్న ఆపరేటర్లు పరస్పర దాడులు, కేబుల్ వైర్ల కత్తిరింపుల ద్వారా పైచేయిని చాటుకునే ప్రయత్నాలు కొనసాగించగా, ప్రస్తుతం ఏకంగా గోడౌన్లకు నిప్పంటించి కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లేలా వ్యవహరించడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. సుభాష్‌నగర్‌లోని ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌కు సమీపంలో గల జీటీపీఎల్ కేబుల్ సంస్థకు చెందిన గోడౌన్‌కు గుర్తు తెలియని ముగ్గురు దుండగులు బుధవారం అర్ధరాత్రి సమయంలో నిప్పంటించారు. రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చిన ఆగంతకులు వెంటిలేటర్ గుండా కిరోసిన్ చల్లి నిప్పంటించడంతో, గోడౌన్‌లో నిల్వ ఉంచిన వేలాది సెట్‌అప్ బాక్సులు, కేబుల్ వైర్లు, ఇతర సామాగ్రి మొత్తం దగ్ధమైంది.
ఈ సంఘటనలో సుమారు 3.35కోట్ల రూపాయల ఆస్తినష్టం వాటిల్లిందని కేబుల్ సంస్థ వ్యాపారి చామకూర రాజేందర్‌రెడ్డి త్రీటౌన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అర్ధరాత్రి సమయంలో గోడౌన్ నుండి మంటలు రావడాన్ని గమనించిన గోదాం ఇన్‌చార్జి అయోధ్య గణేష్‌రెడ్డి వెంటనే తన యజమాని రాజేందర్‌రెడ్డికి ఫోన్ చేయగా, ఆయన హుటాహుటిన చేరుకుని ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. అగ్నిమాపక శకటాలు మంటలను ఆర్పివేయగా, అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది.
ఈ గోడౌన్‌కు ఆనుకుని ఉన్న రామాలయం, సుభాష్‌జిమ్‌తో పాటు గోడౌన్‌లోని సీ.సీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా, ముగ్గురు వ్యక్తులు రెండు ద్విచక్ర వాహనాలపై గోడౌన్ వద్దకు చేరుకుని వెంటిలేటర్ గుండా కిరోసిన్‌ను చల్లి నిప్పంటించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. కాగా, తమ కేబుల్ ఛానెల్ సంస్థ దినదినం అభివృద్ధి చెందుతుండడాన్ని చూసి జీర్ణించుకోలేక పోటీ సంస్థ అయిన భారతీ ఛానెల్, విశ్వ డిజిటల్ ఛానెల్స్‌కు చెందిన గాదె కృష్ణ, ఏలేటి శ్రీనివాస్‌రెడ్డి, సిర్ప రాజు, బీ.రాజేంద్రప్రసాద్ అలియాస్ ఆకాష్‌లు కక్షపూరితంగా తమ అనుచరులతో ఈ దారుణాన్ని జరిపించి ఉంటారని జీటీపీఎల్ యజమాని రాజేందర్‌రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అనుమానాలు వెలిబుచ్చారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని, తనకు న్యాయం చేయాలని కోరారు.
ఈ మేరకు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని త్రీటౌన్ పోలీసులు తెలిపారు.
చిత్రం..గోడౌన్‌కు నిప్పంటించడంతో దగ్ధమైన సెట్‌ఆఫ్ బాక్సులు

ఇక రైల్వే స్టేషన్లలో ఓపెన్ ఎయిర్ థియేటర్లు

$
0
0

మహబూబ్‌నగర్‌టౌన్, డిసెంబర్ 20: రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు వినోదాన్ని అందించేందుకు ఒపెన్ ఎయిర్ థియేటర్లను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్‌యాదవ్ అన్నారు. గురువారం మహబూబ్‌నగర్ పట్టణంలోని రైల్వేస్టేషన్‌లో సిబ్బందికి క్వాటర్స్ ఒపెన్ ఎయిర్ థియేటర్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రైల్వే దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్‌యాదవ్ మాట్లాడుతూ స్టేషన్లలలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా చూసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యంగా దక్షిణమధ్య రైల్వే పరిధిలోని అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల, దేవరకద్ర స్టేషన్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా స్టేషన్లలో ప్రయాణికులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. మహబూబ్‌నగర్ నుండి హైదరాబాద్ వరకు జరుగుతున్న డబ్లింగ్ పనులను వేగవంతం చేశామని మహిళల భద్రత కోసం పెద్దపీట వేయడం జఠిగిందని అన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ మహబూబ్‌నగర్ పట్టణంలోని మోతినగర్, దొడ్డలోనిపల్లి, రాజేంద్రనగర్ రైల్వేస్టేషన్‌కు రోడ్డు సౌకర్యం కల్పించడం జరుగుతుందని ప్రస్తుతం రైల్వే డబుల్‌లైన్ వేయించనందున రైల్వే అండర్‌బ్రిడ్జి నిర్మాణం కూడా చేపడుతున్నామని తెలిపారు.

చిత్రం..మహబూబ్‌నగర్ రైల్వేస్టేషన్‌లో ఓపెన్ ఎయిర్ థియేటర్‌ను ప్రారంభిస్తున్న
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్

సౌర విద్యుత్‌ను ప్రోత్సహించాలి

$
0
0

హైదరాబాద్: జంటనగరాల్లో సౌర విద్యుత్‌ను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి జీహెఎంసీ అధికారులు పనిచేయాల్సి ఉందని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సూచించారు. గురువారం విశే్వశ్వరయ్య భవనంలో సాంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అథిదిగా పాల్గొన్నారు.
ప్రస్తుతం విద్యుత్ బిల్లులు భారం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు. హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల ఉన్న మున్సిపాల్టీల్లో కూడా సౌర విద్యుత్ వాడకాన్ని పెంచాలని ఆయన సూచించారు. సౌర విద్యుత్ ప్యానళ్లను ప్రభుత్వ కార్యాలయాలపై ఏర్పాటు చేయడానికి జీహెచ్‌ఎంసీ అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. రైతులు కూడా చిన్న సౌర విద్యుత్ మోటార్లను వినియోగించుకోవాలన్నారు. ప్రస్తుతం రాజ్‌భవనంలో 100 శాతం సౌర విద్యుత్‌ను ఉపయోగించుకుంటున్నదని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం సౌర విద్యుత్ కోసం రాయితీలను ప్రకటించడాన్ని ఆయన అభినంధించారు. సౌర విద్యుత్ వాడకాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యుత్ శాఖ అధికారులకు అవార్డులను గవర్నర్ ప్రకటించారు.

చిత్రం..సౌర విద్యుత్ వినియోగించిన వారికి అవార్డులను అందజేస్తున్న ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్

త్వరితగతిన వీసీల నియామకం

$
0
0

విజయవాడ, డిసెంబర్ 20: రాష్ట్రంలోని వివిధ వర్సిటీలకు సంబంధించి వైస్‌చాన్సలర్లను త్వరితగతిన నియమించాలని అధికారులను రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన గురువారం పాఠశాల విద్య, ఉన్నతవిద్యా శాఖాధికారులతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీసీల ఎంపిక కోసం ఇప్పటికే సెర్చి కమిటీలను నియమించామని తెలిపారు. అర్హులైన వారిని ఎంపిక చేసి వీలైనంత త్వరగా నియమించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఒంగోలులో స్థాపించనున్న వర్సిటీలో తరగతులు ప్రారంభించేందుకు వీలుగా పనులు చేపట్టాలన్నారు. డీఎస్సీ నిర్వహణ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆన్‌లైన్ పరీక్షలను కూడా సక్రమంగా నిర్వహించేందుకు కంప్యూటర్ కేంద్రాల ఎంపిక, ఇతర సాంకేతిక అంశాలను పరిశీలించాలని సూచించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్, ఉన్నత విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దమయంతి, తదితరులు పాల్గొన్నారు.


వచ్చే ఏడాది నుంచి పాఠశాలల్లో ‘హేపీనెస్’

$
0
0

విజయనగరం, డిసెంబర్ 20: వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ‘హేపీనెస్’ కార్యక్రమాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం నడుం బిగించింది. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. భూటాన్‌లో అమలు చేస్తున్న ఈ విధానాన్ని ఇటీవల డిల్లీలో కూడా ప్రవేశపెట్టారు. మన రాష్ట్రంలో కూడా ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్ధులకు చదువుపై ఆసక్తి పెంపొందించాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం అనుసరిస్తున్న బోధనా విధానంలో కొన్ని లోపాలు ఉండటం వల్ల బోధన పద్ధతుల్లో కూడా మార్పులు చేయడానికి ప్రభుత్వం నడుం బిగించింది. విద్యార్థులకు పాఠ్యాంశాల పట్ల ఎలాంటి విసుగు లేకుండా ఉండే విధంగా బోధనా పద్ధతుల్లో మార్పులు తీసుకురానున్నారు. విద్యార్ధులపై వత్తిడి తగ్గించడం, పాఠ్యాంశాల పట్ల ఆసక్తి పెంపొందించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఆ విధంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకోల్పేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారులను కమిషనర్ ఆదేశించినట్టు సమాచారం. అలాగే ఉపాధ్యాయుల బోధనా పద్ధతుల్లో కూడా మార్పులు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పాఠశాలల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకోల్పడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల వైపు విద్యార్ధులను ఆకర్షించే విధంగా చర్యలు చేపట్టనున్నారు. ఏది ఏమైనప్పటికీ వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో నూతన పద్ధతుల్లో బోధనలకు శ్రీకారం చుట్టనున్నారు.

2022నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు

$
0
0

తిరుపతి, డిసెంబర్ 20: రాష్ట్రంలో పేదవారికి సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం కృషి చేస్తోందని, అందులో భాగంగానే ఎన్‌టీఆర్ గృహ నిర్మాణ పథకాన్ని ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా తిరుపతి రూరల్ మండలం పాడిపేట వద్ద బి ఎన్ యు పి హౌసింగ్ కార్యక్రమంలో భాగంగా నిర్మించిన 3216 గృహాలకు సంబంధించిన పైలాన్‌ను ఆవ్కిరించారు. అనంతరం ఏపీ టిడ్‌కో ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఆవాజ్ యోజన ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ పథకంలో భాగంగా పుత్తూరు గ్రామంలో 148.62కోట్లతో నిర్మిస్తున్న 2560 ఇళ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి మనిషికి సొంతిల్లు నిర్మించుకోవాలని ఆశ ఉంటుందన్నారు. అది కలగా మిగిలిపోకూడదని ఎన్ టీ ఆర్ గృహ నిర్మాణ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఈ నాలుగున్నర సంవత్సరాల్లో 84.27కోట్ల రూపాయలతో 30లక్షల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. తిరుపతి రూరల్ పాడిపేట ప్రాంతంలో జె ఎన్ ఎన్ యు ఆర్ ఎం పథకం కింద 2009లో 3360 నివాస గృహాలు మంజూరు కాగా, 2011లో వివిధ కారణాల వద్ద ఆగిపోవడంతో వివిధ దశల్లో నిలిచిపోయిన ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు 2015 డిసెంబర్‌లో టెండర్లు పిలిచి 2016జూన్‌లో పునఃప్రారంభించామన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ ద్వారా ఈ గృహాలను పూర్తి చేసేందుకు 100కోట్ల రూపాయల హడ్కో రుణం తీసుకున్నామన్నారు. మొత్తం ఇండ్లను 18నెలల్లో పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం 3216గృహాలను లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. రాష్ట్ర విభజన తర్వాత సమస్యలు ఎన్ని ఉన్నా నా మీద నమ్మకంతో ఓటువేసి గెలిపించినందుకు మీ రుణం తీర్చుకోవడానికి నిరంతరం పనిచేస్తున్నారన్నారు. శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల చెంత ఏర్పడిన ఈ గృహనిర్మాణానికి శేషాద్రిగా నామకరణం చేయనున్నామని తెలిపారు. సుందరమైన ఇండ్లతో పాటు మంచి నీటి సదుపాయం, పారిశుద్ద్య నిర్వహణ అన్ని వౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఆరోగ్యకరమైన సుందరమైన వాతావరణంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. 2022నాటికి ప్రతి ఒక్కరికి ఇండ్లు కట్టించే బాధ్యత, మహిళల పేరుమీద ఆ ఇళ్లు ఇండేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. భూమస్యలు లేని సమాజం కోసం డాటెడ్ ల్యాండ్స్, డీకేటీ భూములు చాలా సంవత్సరాలుగా లబ్ధిదారులు చేతులోల ఉన్న భూములకు ఆ భూమిపై హక్కులు కల్పించే ఉద్దేశ్యంతో సీ జె ఎఫ్ ఎస్ భూములకు పట్టాలు ఇచ్చి వారికి ఆ భూమిపై హక్కును కల్పించడంతో పాటు సర్వహక్కులు కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు, తిరుపతి డివిజన్‌కు సంబంధించి 4930మందికి పట్టాలను అందజేశారు. ప్రతి మనిషికి ఆధార్ ఉన్నట్లే భూమికి కూడా భూధార్ నెంబర్‌ను కేటాయిస్తామన్నారు. ఎటువంటి అవీనీతికి తావు లేకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును పరిశీలిస్తున్నామన్నారు. మీ పెద్ద కొడుకుగా ప్రతినెలా వెయ్యి రూపాయలు పెన్షన్ అందిస్తున్నానన్నారు. రాష్ట్రం మొత్తం ఏ తారీఖున ఎన్ని పెన్షన్‌లు అందజేసినా మానిటరింగ్ చేస్తామన్నారు. చంద్రన్న కానుక, సంక్రాంతి, క్రిస్‌మస్, రంజాన్‌తోఫా, చంద్రన్న బీమా, నిరుద్యోగభృతి, ఎస్సీ, ఎస్టీలకు 100యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, అన్నా క్యాంటీన్ ద్వారా నాణ్యమైన భోజనాన్ని ఐదు రూపాయలకే అందిస్తున్నామన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో పేదవారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. పిల్లలను విద్యావంతులను చేసేందుకు రెసిడెన్షియల్ స్కూల్స్‌ను అమలు చేస్తూ నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. ఎన్టీయార్ వైద్య సేవల కింద పేదలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూ ఉద్యోగ, వివిధ పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, ఎంపీ శివప్రసాద్, జడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి, ఎంఎల్‌సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఒత్తిడి లేని చదువు అవసరం

$
0
0

రాజమహేంద్రవరం, డిసెంబర్ 20: విద్యార్థులపై ఒత్తిడి లేని విధంగా విద్యావిధానం ఉండాలని, తల్లిదండ్రులు, పాణశాలలు ఈ విధమైన స్వేచ్ఛా వాతావరణం కల్పించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటూ ఇష్టమైన చదువును ఎంపిక చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం కొండగుంటూరు వద్ద రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూలు ప్రారంభోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. పదేళ్ల క్రితం భారతదేశం అధిక జనాభా వల్ల ఇబ్బందులు పడేదని, ఇపుడు చదువుకున్న యువత వల్ల మానవ వనరులు పెరిగాయన్నారు. దేశంలో 54 శాతం మంది 34 ఏళ్లలోపు వయసు వారుండటంతూ యువభారతం ఉరకలేస్తోందన్నారు. ప్రతీ విద్యార్ధి స్పష్టమైన లక్ష్యంతో తల్లిదండ్రులను ఒప్పించి మరీ తమకిష్టమైన చదువును ఎంచుకోవాలన్నారు. విద్య మాత్రమే నిజమైన ఆస్తి అని విద్యార్థులు తెలుసుకోవాలన్నారు. ప్రపంచంలో పెద్ద పెద్ద రంగాల్లో కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నవారంతా భారతీయులేనన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ళ తాను, మాజీ కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు చదువుకున్న ఢిల్లీ పబ్లిక్ స్కూలు విద్యార్థేనని కిరణ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు.ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు తెగిపోతున్నాయని, నేరాలు, ఘోరాలు అధికంగా కన్పిస్తున్నాయని కిరణకుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. సమాజంలో విలువలు పెంపొందించడంలో పాఠశాలలు కీలక భూమిక పోషిస్తాయన్నారు. మార్కులు తక్కువ వచ్చాయని ఆత్మహత్యలు చేసుకునే సున్నిత మనస్తత్వాన్ని విడనాడాలన్నారు. జయాపజయాలు సహజమని, విద్యార్ధులు ఓటమికి కుంగిపోకూడదన్నారు. ఎవరూ పుట్టుకతోనే మేధావులు కాదని గుర్తుంచుకోవాలన్నారు. ఆడ, మగ పిల్లలకు సమాన అవకాశాలు కల్పించాలన్నారు. చదువుతో క్రీడలకు కూడా ప్రాధాన్యమివ్వాలని, క్రీడల వల్ల పోటీతత్వం పెరుగుతుందన్నారు. సాధ్యమైనంత వరకు క్రీడల్లో పాల్గొనాలని విద్యార్థులకు కిరణ్‌కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.

చిత్రం..మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి స్వాగతం పలుకుతున్న కాంగ్రెస్ నేతలు

టీఆర్‌ఎస్‌లో విలీనం చేయండి

$
0
0

హైదరాబాద్: తమను టీఆర్‌ఎస్ పక్షంలో విలీనం చేయాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీ సభ్యులు శాసనమండలి సభాపతిని కలిసి వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ తరపున ఎన్నికైన ఎమ్మెల్సీలు ప్రభాకర్‌రావు, దామోదర్ రెడ్డి, సంతోష్ కుమార్, ఆకుల లలిత శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్‌ను కలిసి లేఖను అందించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ టీడీపీతో ఎన్నికల పొత్తు వల్ల కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోయిందని, కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రజలు ఆమోదించారని, ప్రజల పక్షం ఉండేందుకు టీఆర్‌ఎస్‌లో విలీనం చేయమని అడిగామని చెప్పారు.

పల్నాడులో నాటుబాంబుల కలకలం

$
0
0

గుంటూరు: గుంటూరు జిల్లా రెంటచింతల మండలం మంచుకల్లులో నాటుబాంబులు దొరికాయి. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు స్వగ్రామమైన మంచుకల్లులో రెండు రోజుల్లో జాతర జరుగునున్నది. ఈ జాతరకు యరపతినేని హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించగా యరపతినేని సొదరుడు వరుసైన నరసింహారావు కారు అడుగుభాగాన ఈ నాటుబాంబులను అమర్చారు. పోలీసులు నాటుబాంబులను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Viewing all 69482 articles
Browse latest View live