Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

హాంకాంగ్‌లో షేర్ల సూచీ

$
0
0

హాంకాంగ్‌లోని హాంకాంగ్ బ్యాంక్ వద్ద కనిపిస్తున్న షేర్ల సూచీ. ఈ ఏడాది చివరి రోజైన సోమవారం హాంకాంగ్ షేర్ మార్కెట్ 1.3 శాతం లాభపడింది. అందులో భారత్ వాటా 0.3 శాతం కావడం విశేషం. భారీగా నష్టపోయన దేశాల్లో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉంది.


రాశిఫలం 01/01/2019

$
0
0
తిథి: 
బహుళ ఏకాదశి రా. తె. 3.29, కలియుగం - 5120 శాలివాహన శకం - 1940
నక్షత్రం: 
స్వాతి ప.11.47
వర్జ్యం: 
సా. 5.23 నుండి 6.59 వరకు
దుర్ముహూర్తం: 
ఉ.8.24 నుండి 9.12 వరకు తిరిగి రా.10.48 నుండి 11.36 వరకు
రాహు కాలం: 
మ.3.00 నుండి 4.30 వరకు విశేషాలు: సర్వేషాం ఏకాదశి
మేషం: 
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) కోపాన్ని అదుపులో ఉంచుకొనుట మంచిది. మానసికాందోళనను తొలగించుకొనేందుకు దైవధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు. వృథా ప్రయాణాలు. ధన వ్యయం తప్పదు.
వృషభం: 
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం గూర్చి శ్రద్ధ వహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండటం మంచిది. ఆత్మీయుల సహాయ సహకారాలకై సమయం వెచ్చించాల్సి వస్తుంది.
మిథునం: 
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు మిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. రహస్య శతృబాధలుండే అవకాశం ఉంది.
కర్కాటకం: 
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలున్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపార రంగాల్లో ధననష్టమేర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ సహకారాలకై వేచి ఉంటారు. దైవదర్శనం లభిస్తుంది.
సింహం: 
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) కుటుంబంలో సుఖ సంతోషాలుంటాయి. ధన ధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.
కన్య: 
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) నూతన వస్తు వస్త్ర వాహన ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభ యోగముంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్య కార్యక్రమం పూర్తవుతుంది.
తుల: 
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) ఆకస్మిక ధనలాభముంటుంది. నూతన వస్తు ఆభరణాలను పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయుటకు వెనుకాడరు. రుణ బాధలు తొలగిపోతాయి. శత్రుబాధలుండవు.
వృశ్చికం: 
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కుటుంబ కలహాలు దూరమవుతాయి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండుట మంచిది. అందరితో స్నేహంగా ఉండుటకు ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి.
ధనుస్సు: 
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) నూతన కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభముంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది, ఆనందంగా కాలక్షేపం చేస్తారు.
మకరం: 
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసికాందోళనతో కాలం గడుపుతారు. స్ర్తిలు చేసే వ్యవహారాల్లో సమస్యలెదురవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశముంటుంది. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా నుండుట మంచిది. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు.
కుంభం: 
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) అద్భుతమైన అవకాశాలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికందుతుంది. నూతన వస్తు ఆభరణాలు సేకరిస్తారు.
మీనం: 
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధన లాభంతో ఆనందిస్తారు. బంధు మిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తిశ్రద్ధ లధికవౌతాయి.
Date: 
Tuesday, January 1, 2019
author: 
గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి

ప్రాజెక్టులు పూర్తయితే 35 లక్షల మందికి ఉపాధి

$
0
0

విజయవాడ, డిసెంబర్ 31: సంపద సృష్టించేందుకు, తలసరి ఆదాయాన్ని పెంచేందుకు పరిశ్రమ, సేవా రంగాల విస్తృతికి తాను నాలుగున్నర ఏళ్లుగా రాత్రి పగలు అహర్నిశలు పాటుపడుతున్నానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు లేనప్పటికీ ఓడరేవులు, ఉక్కు ఫ్యాక్టరీ, కొత్తగా విమానాశ్రయాల నిర్మాణంతో పాటు భారీ పరిశ్రమల స్థాపన కోసం తాను నిరంతరం పాటుబడుతున్నానన్నారు. తాను తలపెట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తయితే రాష్ట్రంలో కనీసం 35లక్షల మందికిపైగా ఉపాధి లభిస్తుందని చెప్పారు. సోమవారం ప్రజావేదిక నుంచి పరిశ్రమల ద్వారా ఉపాధి, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో గత నాలుగున్నరేళ్లుగా జరిగిన అభివృద్ధిపై శే్వతపత్రం-9 విడుదల చేశారు. ఈ సందర్భంగా ముందుగా 2014 జూన్ నాటికి రాష్ట్రంలో పరిశ్రమల దయనీయ స్థితిని వివరించారు. జాతీయ సగటు కంటే ఉత్పత్తి రంగం వృద్ధిరేటు పదేళ్లకు తక్కువగా ఉమ్మడి రాష్ట్ర రెవెన్యూలో 48.19శాతం కాగా, హైదరాబాద్‌లోని ఐటీ, ఐటీఈఎస్ రంగం నుంచీ ప్రస్తుతం అదీ కోల్పోయామని చెప్పారు. విద్యుత్ కొరత, పరిశ్రమల మూత, ప్రోత్సాహకాలు 2010-11 నుంచి పెండింగ్,
ఫోక్స్‌వాగన్ ప్రోటాన్ వంటి సంస్థలు వెనక్కి వెళ్లటం, పెట్టుబడులకు లక్ష్యమైన ఏపీ బ్రాండ్ ఇమేజ్‌కు విభజన శరాఘాతంగా మారిందన్నారు. ఇక కేంద్రం ఉద్దేశ్యపూర్వకంగా విభజన చట్ట హామీలను కాలరాసిందన్నారు. ప్రత్యేక హోదా లేదు, ఆర్థిక ప్రోత్సాహకాలు లేవన్నారు. విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు కేంద్రం నుంచి గ్రాంటు లేక రుణం ద్వారా చేపడితే ఢిల్లీ - ముంబై పారిశ్రామిక కారిడార్‌కు మాత్రం కేంద్రం పెట్టుబడి పెట్టిందన్నారు. గ్రీన్‌ఫిల్డ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ కార్యరూపం దాల్చలేదన్నారు. అయినప్పటికీ తనపై విశ్వాసంతో దేశ విదేశాల నుంచి వేల కోట్లలో పెట్టుబడులు వస్తున్నాయన్నారు. అలాగే పర్యాటకుల రాకను పెంచగలిగామన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు పరిశ్రమల శాఖకు రూ. 7,968కోట్లు ఆదాయం పెంచామన్నారు. సింగిల్ డెస్క్ పోర్టల్, పబ్లిక్ సర్వీస్ డెలివరీ గ్యారంటరీ చట్టం - వాణిజ్య సంస్కరణల అమలు, ఇఓబీడీ కోసం కమిటీలు తమ ప్రత్యేకత అని చెప్పారు. 2009-14 మధ్యకాలంలో పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం సగటున ఏటా రూ. 312కోట్లు మాత్రమే విడుదల కాగా ప్రస్తుతం నాలుగు రెట్లు పెంచామన్నారు. పెట్టుబడులను ఆకర్షించడానికి తాను తిరగని దేశం లేదన్నారు. విశాఖలో వరుసగా మూడుసార్లు భాగస్వామ్య సదస్సులను నిర్వహించగా 1437 ఎంఓయూలు రూ. 13.35లక్షల కోట్లు పెట్టుబడులు రానున్నాయని, వీటివల్ల 24.6 లక్షల మందికి ఉపాధి లభించబోతోందన్నారు. ఎంఎస్‌ఎంఈ రంగ అభివృద్ధికి అంకితమైన విధానాలు - మూతబడిన పరిశ్రమలకు చేయూత, 175 నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కుల స్థాపనకు నిర్ణయం వీటిలో 1318 ఎకరాల్లో రూ. 271 కోట్ల ఖర్చుతో 31 పార్కులు ఏర్పాటు జరుగుతున్నట్లు తెలిపారు. 24గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరాతో మొత్తం 1845 యూనిట్లకు 14,213 ఎకరాల భూమి కేటాయింపు, వైజాగ్ - చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా విశాఖ -శ్రీకాళహస్తి, మచిలీపట్నం, దొనకొండలలో రూ.4,170 కోట్లతో పనులు, చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో కృష్ణపట్నం, ఓర్వకల్లు, హిందూపురంలో మూడు పారిశ్రామిక నోడ్లు ఏర్పాటు కానున్నాయని తెలిపారు. ముందుగా 16వేల ఎకరాల్లో కృష్ణపట్నం నోడ్, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మెగాఫుడ్ పార్కులు, విజయనగరం, కడప, చిత్తూరు జిల్లాల్లో సమీకృత ఫుడ్ పార్కులు, తిరుపతిలో రెండు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి క్లస్టర్లు, కడపలో 6553 ఎకరాల్లో మెగా పారిశ్రామిక పార్కులు, విశాఖలో ఫిన్‌టెక వ్యాలీ, తిరుపతిలో వ్యర్థాల ట్రీట్‌మెంట్‌కు ప్లాంట్ నిర్ణయం, పర్యాటకంగా లెట్స్ వైజాగ్, కోససీమ రుతుపవనాలు, ఏపీలో పండుగలు, భారీ ఫెస్టివల్స్, ఆంధ్ర వంటకాల ప్రమోషన్, నాలుగు పర్యాటక హౌజ్‌లు, 2019 జూన్ నాటికి జక్కంపూడి ఆర్థిక నగరం తొలిదశ పూర్తవుతాయన్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా 8.66 లక్షల మంది యువతకు శిక్షణ, 1.78 లక్షల మందికి ఉద్యోగాలు, సీఎం యువనేస్తం పేరిట నిరుద్యోగ యువతకు నెలకు వెయ్యి రూపాయలు, ఇప్పటికే 3.3 లక్షల మందికి రూ. 81 కోట్లు చెల్లింపు, ఇలా ఎంతో ముందుకు సాగుతున్నామన్నారు. జనవరి 9న రామయపట్నం పోర్టు పనులకు శ్రీకారం, మంగళవారం కర్నూలుకు విమానం ట్రైల్న్,్ర కుప్పంలో త్వరలో విమానాశ్రయం నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయన్నారు. రామయపట్నంలో ఓడరేవు నిర్మాణానికి కేంద్రం మొండిచెయ్యి చూపిందని చంద్రబాబు వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమ శాఖ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీలు విజయానంద్, ఆరోక్యరాజ్, తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..శే్వతపత్రం-9 విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తదితరులు

నిరుద్యోగులకు శుభవార్త!

$
0
0

విజయవాడ (సిటీ): నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టనున్న తరుణంలో రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీపి కబురందించింది. ఇప్పటికే పలు నోటిఫికేషన్లను పలు దఫాలుగా విడుదల చేస్తూ వస్తున్న ఏపీపీఎస్సీ నిరుద్యోగులకు మరో శుభవార్త అందించింది. రాష్టవ్య్రాప్తంగా పలు ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేసేందుకు ఒకేసారి 7 నోటిఫికేషన్లను
సోమవారం విడుదల చేసింది. పలు ప్రభుత్వ విభాగాల్లో మొత్తం 1326 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు. ఆయా ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ ఏడు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇందులో గ్రూప్-1లో 169, గ్రూప్-2లో 446 ఉద్యోగాలతోపాటు మొత్తం 1326 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. గ్రూప్-1 పోస్టులకు జనవరి 7నుండి 28వరకు, గ్రూప్-2 పోస్టులకు జనవరి 10నుండి 31వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఏపీపీఎస్సీ స్వీకరించనుంది. మే 5న గ్రూప్-2 ప్రాథమిక పరీక్షను ఏపీపీఎస్సీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. జూలై 18, 19 తేదీల్లో మెయిన్ పరీక్షను ఏపీపీఎస్సీ నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లోని నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు-292, ఎగ్జిక్యూటివ్ పోస్టులు-154, సాధారణ పరిపాలన శాఖలో ఏఎస్‌వో పోస్టులు 150, సీనియర్ అకౌంటెంట్లు 20, ఎక్సైజ్ శాఖలో ఎస్సై పోస్టులు 50, పంచాయతీరాజ్ శాఖలో ఎక్స్‌టెన్షన్ అధికారులు 40, డిప్యూటీ తహశీల్దార్లు 16, ఖజానా శాఖలో సీనియర్ అకౌంటెంట్లు 13, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 405 లెక్చరర్ పోస్టుల భర్తీకి, మత్స్యశాఖలోని 43 ఫిషరీస్ డెవలప్‌మెంట్ అధికారి పోస్టులకు జనవరి 17 నుండి ఫిబ్రవరి 8 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఏపీపీఎస్సీ స్వీకరించనుంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 305 లెక్చరర్ పోస్టులకు ఫిబ్రవరి 5 నుండి 26 వరకు, ఫిషరీస్ సబ్ సర్వీస్‌లో 10 అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ పోస్టులకు జనవరి 18 నుండి ఫిబ్రవరి 8 వరకు, ఇన్ఫర్మేషన్ సర్వీస్‌లో 5 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ పోస్టులకు జనవరి 22 నుండి ఫిబ్రవరి 12 వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులను పంపాలని ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌లో తెలిపింది.

ముగిసిన అధ్యాయం!

$
0
0

హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు అధ్యాయం సోమవారం సాయంత్రంతో ముగిసింది. మంగళవారం నుండి తెలంగాణ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వేర్వేరుగా పనిచేయనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ న్యాయవాదులు సిబ్బందికి తెలంగాణ న్యాయవాదులు, సిబ్బంది ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. మంగళవారం నుండి
అమరావతిలో ఏపీ హైకోర్టు పనిచేయనుంది. ఇందుకోసం హైదరాబాద్ నుండి అమరావతికి 900 మంది ఉద్యోగులు తరలివెళ్లారు. వీరికోసం టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేకించి గరుడ వాహనాలను ఏర్పాటు చేసింది. అమరావతి పరిధిలో నిర్మిస్తున్న హైకోర్టు భవనం పూర్తయ్యే వరకూ హైదరాబాద్ నుండి హైకోర్టు తరలింపు నిర్ణయాన్ని వాయిదా వేయాలన్న ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగొయ్ బెంచ్ తిరస్కరించింది. హైకోర్టు భవనాలు, న్యాయమూర్తుల నివాస సముదాయాలు, ఇతర వౌలిక వసతులు పూర్తయ్యే వరకూ హైకోర్టు విభజనను వాయిదా వేయాలని కూడా న్యాయవాదుల సంఘం కోరింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు జనవరి 2న సాధారణ విచారణ చేపడతామని పేర్కొంది. అయితే ఏపీ హైకోర్టు న్యాయవాదులు దాఖలుచేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కేవియట్‌ను దాఖలు చేశారు. హైకోర్టు విభజన అవసరమేనంటూ తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.
న్యాయవాదుల ఆందోళన
కొద్ది రోజులు తమకు గడువు కావాలని కొంతమంది ఆంధ్రా న్యాయవాదులు, రాయలసీమ న్యాయవాదులు సైతం డిమాండ్ చేస్తూ హైకోర్టు విభజనను నిరసిస్తూ వారంతా ఆందోళనకు దిగారు. రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని కోరుతూ హైకోర్టు వద్ద రాయలసీమకు చెందిన న్యాయవాదులు డిమాండ్ చేశారు. రాష్ట్రపతి నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హైకోర్టు విభజనకు కొంత సమయం కావాలని కోరుతూ ఏపీ న్యాయవాదులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించడంతో విభజనకు లైన్ క్లియరైనట్టయింది. దీంతో ఏపీకి చెందిన న్యాయవాదులు, న్యాయసిబ్బంది అమరావతికి తరలివెళ్లక తప్పలేదు.
ఇదిలా ఉండగా సహచర ఉద్యోగులు తరలివెళ్లడంతో హైకోర్టు వద్ద ఉద్విగ్న పరిస్థితి ఏర్పడింది. కొందరు న్యాయమూర్తులు తమ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కన్నీటి పర్యాంతమయ్యారు. ఏపీకి తరలివెళ్తున్న న్యాయవాదులకు తెలంగాణ సిబ్బంది ఆత్మీయ వీడ్కోలు పలికారు. విజయవాడ ఇందిరాగాంధీ స్డేడియంలో మంగళవారం నాడు ఏపీ న్యాయమూర్తులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కాగా ఏపీ ప్రభుత్వం హైకోర్టు న్యాయమూర్తులకు తాత్కాలికంగా ఒక హోటల్‌లో బస ఏర్పాట్లు చేసింది.

చిత్రాలు.. హైకోర్టును వీడి తరలిపోతున్న ఏపీ న్యాయవాదులు, సిబ్బందికి వీడ్కోలు చెబుతున్న తెలంగాణ న్యాయవాదులు

అతివేగం.. నలుగుర్ని చిదిమేసింది!

$
0
0

గుంటూరు, డిసెంబర్ 31: గుంటూరు నగరానికి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగానికి నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. గుంటూరు-చిలకలూరిపేట జాతీయ రహదారిపై గుంటూరు రూరల్ లాలుపురం వద్ద సోమవారం 170 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన కారు మలుపువద్ద అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొని, అంతే వేగంతో ముందుగా వెళుతున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయ్యింది. కారు ఢీకొట్టిన వేగానికి లారీ సైతం బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో నగరానికి సమీపంలోని ఆర్‌వీఆర్ అండ్ జేసీ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో
ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్సకోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఏడుగురు విద్యార్థులు ఒకే కారులో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు విజయవాడ వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదంలో గుంటూరు విద్యానగర్‌కు చెందిన ధనుష్, పెదకూరపాడు మండలం కంభంపాడుకు చెందిన సాయిరామ్, శావల్యాపురానికి చెందిన కోటేశ్వరరావు, గఫూర్ అనే మరో విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన శివాజీ, కౌషిక్ గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో, హీరేంద్ర నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరంతా 19, 20 సంవత్సరాల్లోపు వయస్సువారే. కారు ఢీకొన్న ధాటికి లారీ బోల్తాపడటంతో డ్రైవర్, క్లీనర్ సైతం తీవ్రగాయాల పాలయ్యారు. సంఘటనా స్థలాన్ని జిల్లా అర్బన్ ఎస్పీ సీహెచ్ విజయారావు సందర్శించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం జీజీహెచ్‌కు తరలించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిత్రం..ప్రమాద తీవ్రతకు నుజ్జునుజ్జయిన కారు

ధర తగ్గిన ఎల్‌పీజీ

$
0
0

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: గృహ వినియోగ వంట గ్యాస్ (ఎల్‌పీజీ) ధరలు సోమవారం తగ్గుముఖం పట్టాయి. సబ్సిడీ సిలిండర్ మీద 5.91 రూపాయలు తగ్గిస్తున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. మార్కెట్లో ఇంధన ధరలు తగ్గిన క్రమంలో వరుసగా నెల రోజుల వ్యవధిలో ఈ గ్యాస్ ధర తగ్గడం ఇది రెండోసారి. కాగా తగ్గిన ధరలతో దేశ రాజధానిలో ఆదివారం అర్ధరాత్రి నుంచి 14.2 కిలోల బరువుండే సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ ధర 494.99 రూపాయలకు చేరింది. ఇప్పటి వరకు ఈ ధర 500.90 రూపాయలుగా ఉండేదని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) తెలిపింది. ఈనెల 1న సబ్సిడీ వంట గ్యాస్ ధర సిలిండర్‌పై 6.52 తగ్గిన సంగతి తెలిసిందే. అంతకు ముందు జూన్ నుంచి వరుసగా ఆరు నెలల పాటు సాగిన ధరల పెరుగుదల అనంతరం ఇలా ధరలు తగ్గుముఖం పట్టడం పట్ల వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక నాన్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌పై సైతం 120.50 రూపాయలు తగ్గిస్తున్నట్టు ఐఓసీ తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడం, అమెరికన్ డాలర్‌తో రూపాయి విలువ బలపడడం వంటివి
వంట గ్యాస్ ధరల తగ్గేందుకు దోహదం చేసిందని తెలిపింది. అంటే సబ్సిడీ రహిత వంట గ్యాస్ ధర ఇక దేశ రాజధానిలో సిలిండర్‌పై రూ.689గా ఉంటుంది. డిసెంబర్ 1న ఈ గ్యాస్ ధరను సైతం సిలిండర్‌పై 133 రూపాయలు తగ్గించడం జరిగింది. ప్రతి వినియోగదారునికి యేడాదికి పనె్నండు సిలిండర్లు సబ్సిడీపై ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన సబ్సిడీ సొమ్ము నేరుగా బ్యాంకుల్లో జమవుతోంది.

ఇక పంటల కాలనీలు

$
0
0

హైదరాబాద్, డిసెంబర్ 31: రాష్ట్రాన్ని ఖచ్చితంగా పంటల కాలనీలుగా విభజించాలని, రైతులు పండించే ప్రతి పంటకూ డిమాండ్ లభించేలా చూడాలని, రాష్ట్రంలో నెలకొల్పనున్న ఆహార శుద్ధి పరిశ్రమల (్ఫడ్ ప్రాసెసింగ్ యూనిట్ల) ద్వారా ప్రభుత్వ పరంగా నమ్మకమైన, కల్తీరహిత బ్రాండెడ్ ఉత్పత్తులు జరగాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు సంబంధిత శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. రైతులు నియంత్రణా విధానంలోనే పంటలు పండించాలని ఆయన అన్నారు. సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహార శుద్ధి పరిశ్రమల తీరుతెన్నులపై, భవిష్యత్తులో అవలంబించాల్సిన విధానాలపై, మహిళా సంఘాలను ఈ పరిశ్రమల్లో భాగస్వాములను చేయడంపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణా రావు, సీఎంవో అధికారుల నర్సింగ్ రావు, భూపాల్‌రెడ్డి, స్మితాసబర్వాల్, డీజీపీ వీ.మహేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు అనురాగ్ శర్మ, మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఎమ్మెల్సీలు రాజేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, ఆనంద్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారధి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ వ్యవసాయ, ఉద్యానవన శాఖలపై కోట్లాది మంది ఆధారపడి ఉన్నారని చెప్పారు. వారి ఆశయాలకు అనుగుణంగా ఆ శాఖలు పనిచేయాలని, దేశం మొత్తంలోనే ఉత్తమమైన వ్యవసాయ, ఉద్యానవన, ఆహార శుద్ధి, ఎగుమతులలో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన ఉండాలని అన్నారు. రైతులను ఆదుకునే విషయంలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని ఆయన తెలిపారు. ఆహార, వ్యవసాయ రంగానికి సంబంధించి సరైన గణాంకాలు లేనందున సమస్యలు వస్తున్నాయని, వీటిని అధిగమించాల్సిన
అవశ్యకత ఉందని ఆయన చెప్పారు. రైతులంతా ఒకే రకమైన పంటలు వేయడం వల్ల జరిగే లాభనష్టాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని, రైతులను సంఘటిత పరచడం ద్వారానే గొప్ప ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖలు, సంబంధిత ఇతర శాఖలు సమన్వయంతో పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయని ఆయన తెలిపారు. దీని కోసం ఏమి చేయాలో ఆలోచించాలని అన్నారు. దీని ద్వారా రైతుల్లో అశాంతి పూర్తిగా తొలగి పోతుందన్నారు. దీనికి మొదటి అడుగుగా రైతు సమన్వయ సమితుల ఏర్పాటు జరిగిందని, వాళ్ళకు క్రమపద్ధతిలో శిక్షణ ఇవ్వాలని అన్నారు. వ్యవసాయ విస్తరణాధికారులను నియమించడం జరిగిందని, భూమి లెక్కలు కూడా తేల్చడం జరిగినందున వ్యవసాయ అనుకూల భూమి ఎంత ఉందో తేలిందని ఆయన చెప్పారు.
ఏ పంటలు వస్తే లాభం కలుగుతుందో వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించి, నమ్మకం కలిగించాలని ఆయన సూచించారు. ముల్కనూరు గ్రామం అనుభవాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. వ్యవసాయ ఆర్థిక శాస్తవ్రేత అశోక్ గులాటీని ఇటీవల ఢిల్లీలో తాను కలిసినప్పుడు ఈ విషయాలపై వర్క్ షాప్ నిర్వహించాల్సిందిగా ఆహ్వానించానని, త్వరలోనే మన రాష్ట్రానికి వస్తారని కేసీఆర్ తెలిపారు.
చిత్రం..లాభసాటి వ్యవసాయంపై ఉన్నతాధికారులతో జరిపిన
సమీక్షా సమావేశంలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు


బుడగ జంగాలపై తుది నివేదిక

$
0
0

విజయవాడ, డిసెంబర్ 31: బుడగ జంగాలకు రాష్ట్రంలోని వివిధ విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్‌లపై సిఫారసులను కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ తన నివేదికను సోమవారం అందజేసింది. విశాంత్ర ఐఏఎస్ జేసీ శర్మ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిషన్ తుది నివేదికను ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఈ నివేదిక రూపొందించారు.

ఆర్ అండ్ ఆర్ కొర్రీల నుంచి గట్టెక్కినట్టే..!

$
0
0

రాజమహేంద్రవరం, డిసెంబర్ 31: బహుళార్ధ సాధక పోలవరం ప్రాజెక్టు లక్ష్యం సంవత్సరంలోకి అడుగు పెట్టింది. కొత్త సంవత్సరంలో కొత్త డీపీఆర్‌తో పోలవరం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. భూసేకరణలో సీడబ్ల్యూసీ గండం నుంచి బయటపడి ఇపుడు పునరావాసం ఎందుకు పెరిగిందనే పరీక్షను ఎదుర్కొంటున్న పోలవరం ప్రాజెక్టు లక్ష్యాన్ని సాధించే ఏడాదిలోకి చేరింది. ఈ ఏడాది చివరికి గ్రావిటీపై నీరు ఇస్తామని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికీ భూసేకరణ కొర్రీలపై సందేహాలను నివృత్తి చేసుకున్న సీడబ్ల్యూసీ ఇక ఆర్ అండ్ ఆర్ సందేహాలను తీర్చుకుని ఎట్టకేలకు ఆమోదానికి రంగం సిద్ధమైనట్టు తెలిసింది. కొత్త డీపీఆర్‌ను రూ.57వేల కోట్లకు దాదాపు సీడబ్ల్యూసీ నుంచి ఆమోదం లభించినట్టు చర్చించుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టు నిమిత్తం మొత్తం 1,66,213 ఎకరాల భూమి అవసరంగా గుర్తించారు.
ఇందులో ఇప్పటి వరకు 1,10,355 ఎకరాల భూమిని సేకరించారు. భూసేకరణ నిమిత్తం ఇప్పటి వరకు సుమారు రూ.5045 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా 55,858 ఎకరాలు సేకరించాల్సి వుంది. ఇందుకు సుమారుగా రూ.6561 కోట్లు అవసరంగా అంచనా వేశారు. ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాల సంఖ్య 44,574 నుంచి 1,05,601కి పెరగడంపై సీడబ్ల్యూసీ సందేహం వ్యక్తం చేసింది. అయితే ప్రాజెక్టు ఎఫ్‌ఆర్‌ఎల్‌పై క్షేత్ర స్థాయిలో సర్వే చేసిన తర్వాత ముంపు గ్రామాల సంఖ్య 371కి పెరిగింది. పాత డీపీఆర్‌లో ముంపు గ్రామాల సంఖ్య 276 మాత్రమే ఉంది. ఎందుకంటే అప్పటికీ క్షేత్ర స్థాయిలో సర్వే పూర్తి కాకపోవడం కారణమని నిర్ధారణకు వచ్చారు. ముంపునకు గురయ్యే గ్రామాలను సామాజిక ఆర్థిక సర్వేలో ఆధార్ నెంబర్, రేషన్ కార్డు నెంబర్‌తో సహా గుర్తించారు. నిర్వాసిత కుటుంబాల వివరాలను ఆధార్‌కార్డుతో అనుసంధానం చేసి చెల్లింపులన్నీ నేరుగా ఖాతాల్లో వేస్తున్నామని సీడబ్ల్యూసీకి అధికారులు వివరించడంతో సీడబ్ల్యూసీ అంతవరకు వేసిన కొర్రీ నుంచి బయట పడింది. రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బంది ఉమ్మడి సర్వే చేసి నిర్ధేశిత ప్రొఫార్మాలో నిర్వాసితుల వివరాలను రికార్డులకెక్కించిన వివరాలను కూడా సీడబ్ల్యూసీకి పెద్ద పెద్ద పుస్తకాలను బస్తాల కొద్దీ సమర్పించారు. నిర్వాసితుల వివరాలను గెజిట్‌లో ప్రకటించడంతో వివరాలన్నీ బహిర్గతమేనని గెజిట్ వివరాలను కూడా సీడబ్ల్యూసీకి సమర్పించినట్టు తెలిసింది. ఈ గెజిట్ ప్రకారం నిర్వాసితుల ఊర్లూ, పేర్లూ ఎపుడైనా తనిఖీ చేసుకోవచ్చని సీడబ్ల్యూసీకి నివేదించారు. దీనికి తోడు పునరావాస అంచనా పెరగడానికి మరో ప్రధాన కారణంగా కొత్త ఆర్ అండ్ ఆర్ చట్టంలో కుటుంబం నిర్వచనం మారిందని, గతంలో భార్యా, భర్త, పెళ్లికాని పిల్లలను ఒక కుటుంబంగా అంచనా వేశారని వివరించినట్టు తెలిసింది. పద్దెనిమిదేళ్ళు పైబడిన పిల్లలను వేర్వేరు కుటుంబాలుగా నిర్ధేశించారు. ఇటువంటి కారణాల వల్ల ఆర్ అండ్ ఆర్ పెరిగిందని సీడబ్ల్యూసీకి ఆధారాలతో సహా నివేదిక సమర్పించడంతో ఎట్టకేలకు కొత్త డీపీఆర్‌కు మార్గం సుగమం అయ్యిందని తెలుస్తోంది.

పోలవరం పూర్తిచేసి చరిత్ర సృష్టిస్తాం

$
0
0

విజయవాడ: గత విజయాలను సమీక్షించి, నవ సంకల్పంతో భవిష్యత్తును నిర్మించుకునేందుకు వచ్చిన శుభ సమయమే కొత్త సంవత్సరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించారు.
నూతన సంవత్సరంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి, నవ్యాంధ్ర చరిత్ర గతిని శాసించే కాలమని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు, దేశ, విదేశాల్లోని తెలుగువారికి ముఖ్యమంత్రి 2019 సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నాలుగున్నరేళ్ల పరిపాలనలో సాధించిన అభివృద్ధి, 5కోట్ల మంది ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఫలితాలను వివరిస్తూ జనవరి 2 నుంచి 6వ విడత జన్మభూమి - మా ఊరు కార్యక్రమం ద్వారా మీ ముందుకు వస్తున్నామని తెలిపారు. తమను ఆశీర్వదించాలని సోమవారం ఆయన ఒక ప్రకటనలో కోరారు. పాలనా విజయాలను వివరించే 9 శే్వతపత్రాలను ఇప్పటికే విడుదల చేశామని, మంగళవారం మరో శే్వతపత్రం విడుదల చేస్తామన్నారు. తనపై ఎంతో విశ్వాసంతో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, కలలు నెరవేర్చుకునే వేదికగా నూతన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతోందన్నారు. ర్యాఫ్ట్ తరహా ఫౌండేషన్‌తో కొత్త సచివాలయానికి 5 శిఖర భవనాల నిర్మాణం ప్రారంభమైందని గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టు 63.57 శాతం పూర్తయిందని, కేంద్రం కక్షతో నిధులు నిలిపివేసినా, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పనులు ఆగకుండా చూస్తున్నామన్నారు. 1600 కోట్ల రూపాయలతో పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించి కృష్ణాడెల్టాను ఎడారి కాకుండా కాపాడామని, 40వేల కోట్ల రూపాయల విలువైన పంట దిగుబడి వచ్చిందని తెలిపారు. మరోవైపు రాయలసీమకు కృష్ణా జలాలు ఇచ్చి మూడేళ్లుగా చెరువులు నింపి కరవు ఛాయలు లేకుండా చేశామన్నారు. అనంతపురానికి కియా కార్ల పరిశ్రమ తెచ్చినా, తిరుపతిని మొబైల్ ఫోన్ కంపెనీలకు కేంద్రంగా మార్చామన్నా తమ దార్శనికత, ఉద్యోగుల కృషి, ప్రజల సహకారంతోనే సాధ్యమైందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
60 ఏళ్ల శ్రమ, కష్టంతో సృష్టించిన సంపదను హైదరాబాద్‌లో ధారపోశామని, ఆదయాన్నిచ్చే రాజధానిని వదులుకుని, రాజధాని లేకుండా అప్పులు, కట్టుబట్టలతో వచ్చామన్నారు. అయినా నిరాశతో కుంగిపోకుండా నిర్మాణ దీక్షా సంకల్పం తీసుకుని కసిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. 16వేల కోట్ల ద్రవ్యలోటుతో కొత్త ఆంధ్రప్రదేశ్ ప్రయాణం ప్రారంభమైందని, అప్పట్లో రోజుకు 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉందన్నారు. వచ్చిన కొంతకాలానికే పరిస్థితిని సమూలంగా మార్చేశామని, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్‌తో కష్టపడి పనిచేసి రెండంకెల వృద్ధిరేటు సాధించామన్నారు. ఈ ఏడాది తొలి ఆరు మాసాల్లో 15.5 శాతం వృద్ధిరేటు నమోదైందన్నారు. కేంద్రం సహకారం లేకున్నా 24వేల కోట్ల రూపాయల మేర రుణమాఫీ చేశామని, సంక్షేమానికి 80వేల కోట్ల రూపాయలకు పైగా వెచ్చించామని గుర్తుచేశారు. సామాజిక భద్రత కింద 50.5 లక్షల మందికి పింఛను ఇస్తున్నామని, వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టామని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రాన్ని నెంబర్-1గా తీర్చిదిద్దామని వివరించారు. రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేస్తూ రాష్ట్రాల హక్కులను హరిస్తే గుణపాఠం తప్పదని ఐదు రాష్ట్రాల ఎన్నికలు నిరూపించాయని చంద్రబాబు అన్నారు. తిరుపతిలో వెంకన్న సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా, రాజధాని నిధుల హామీలను అధికారంలోకి రాగానే మోదీ తుంగలో తొక్కారని ఆరోపించారు. ఏపీ ప్రజలను వంచించారని, అందువల్లనే తాము ఏన్డీఏ నుంచి బయటకు వచ్చి ధర్మపోరాటం చేస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో దుష్టశక్తులను ఓడిస్తామని రాష్ట్ర ప్రజలు సంకల్పం చేసుకొని రాష్ట్భ్రావృద్ధిని కొనసాగించేందుకు మళ్లీ తమకు అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర పురోభివృద్ధి, బిడ్డల భవిష్యత్తు, రాజధాని అమరావతి నిర్మాణం శరవేగంగా కొనసాగించాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, పోలవరం పూర్తికావాలన్నా రాజకీయ సుస్థిరత ఎంతో అవసరమన్నారు. సమర్థ నాయకత్వాన్ని నిలబెట్టుకునేందుకు రాష్ట్ర ప్రజలకు మరో అవకాశం వచ్చిందని, 2019లో జరిగే ఎన్నికల్లో మరోసారి మద్దతు పలికి ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

మళ్లీ నేడు పుట్టింటికి హైకోర్టు!

$
0
0

విజయవాడ, డిసెంబర్ 31: నాడు ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భావంతో రాజధాని కర్నూలు కేంద్రంగా ఏర్పడగా హైకోర్టు గుంటూరులో ఏర్పాటై కొంతకాలం పనిచేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావంతో హైకోర్టు హైదరాబాద్‌కు తరలివెళ్లింది. తర్వాత హైకోర్టు బెంచ్ కోసం రాష్ట్రంలో అనేకానేక ఉద్యమాలు జరిగాయి. రాష్ట్ర విభజన వల్ల లాభమో నష్టమో తెలియదుకాని తిరిగి హైకోర్టు గుంటూరు జిల్లాలో పునఃప్రారంభం కాబోతోంది. అమరావతిలో భవన నిర్మాణాలు పూర్తికి కాస్తంత జాప్యం జరుగుతున్న నేపథ్యంలో రాష్టప్రతి జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం 2019, జనవరి 1న తాత్కాలికంగా విజయవాడలో ప్రారంభం కాబోతోంది. ముందుగా న్యాయమూర్తులు నగరంలోని మున్సిపల్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో హైకోర్టు, ప్రభుత్వ అతిథిగృహంలో పరిపాలన విభాగం పనిచేయనున్నాయి. న్యాయమూర్తులు, సిబ్బందికి తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఉద్దండులైన న్యాయవాదులకు వేదికగా ఉన్న గుంటూరు ప్రాంతానికి తిరిగి రావటం, పైగా రాయలసీమ, ఉత్తరాంధ్రకు కేంద్రంగా ఉండడం, అన్ని ప్రాంతాల వారిని కూడా ఉత్సాహపరుస్తోంది. ఉమ్మడి హైకోర్టులో ప్రస్తుతం 3లక్షల కేసులు పైగా పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 70శాతం కేసులు ఆంధ్ర ప్రాంతానికి చెందినవే. జిల్లా, మున్సిఫ్ కోర్టుల్లో కుప్పలుతెప్పలుగా కేసులు నెంబర్ కాకుండా కాలం గడుపుతున్నాయి. తాజాగా హైకోర్టు నెంబరింగ్ విషయమై మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ నెంబరింగ్‌లో సంబంధిత గుమస్తాలు మీనమేషాలు లెక్కిస్తున్నారనే విమర్శలున్నాయి. అసలు నెంబరింగ్‌కే మాసాలు గడుస్తుంటే విచారణ మాటేమిటి? సంవత్సరాలు గడవాలా? అంటూ కక్షిదారులు పెదవి విరుస్తున్నారు. ఇన్‌స్టెంట్ ఫుడ్‌కు అలవాటుపడ్డ ప్రజానీకం అంతే వేగంతో న్యాయఫలాలు అందాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఒకటో తేదీ నుంచి నాలుగో తేదీ వరకు కోర్టు పనిచేస్తుంటే 5 నుంచి 20 వరకు సెలవులు. ప్రస్తుతానికి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సి ప్రవీణ్ కుమార్, మరో 15మంది న్యాయమూర్తులు నియమితులయ్యారు. అయితే పెండింగ్ కేసుల సంఖ్యను బట్టి ఈ సంఖ్య రెట్టింపు కావాల్సి ఉంది. సత్వర న్యాయం కోసం వేచిచూస్తున్న ప్రజానీకానికి న్యాయవ్యవస్థ సత్వర ఫలాలు అందించే దిశగా మరిన్ని వౌలిక మార్పులకు శ్రీకారం చుట్టాల్సి ఉంది.

ఓటర్ ఐడీతో మొబైల్ నెంబర్ అనుసంధానం

$
0
0

విజయవాడ, డిసెంబర్ 31: ఓటర్ ఐడీ (ఎలక్టోరల్ ఫొటో ఐడెంటిటీ కార్డు)తో ఓటరు మొబైల్ నెంబర్‌ను అనుసంధానం చేసే ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆర్పీ సిసోడియా వెల్లడించారు.
దేశంలో ఇలా అనుసంధానం చేస్తున్న తొలి రాష్ట్రం తమదేనన్నారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం ఉదయం కొత్తగా ఓటర్లుగా చేరిన 10మందిని ఆయన సన్మానించారు. వారికి ట్యాబ్‌లు అందజేశారు. 2019 ఎన్నికల కమిషన్ క్యాలెండర్‌ను విడుదల చేశారు. ఈసందర్భంగా సిసోడియా మాట్లాడుతూ రాష్ట్రంలో 3.7 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. దాదాపు అందరు ఓటర్లకు సెల్‌ఫోన్లు ఉండే అవకాశం ఉందన్నారు. వీటిని అనుసంధానం చేయడం ద్వారా ఓటర్లకు ఎన్నికల సంఘం నేరుగా ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సమాచారం పంపించేందుకు అవకాశం ఉంటుందన్నారు.
వెబ్‌సైట్‌లో ఓటర్ ఐడీ, సెల్ నెంబర్ అనుసంధానం చేసే ప్రక్రియ త్వరలో అందుబాటులోకి వస్తుందన్నారు. ఓటర్లు కూడా మెసేజ్‌లు పంపి తమకు కావాల్సిన సమచారం తెలుసుకోవచ్చన్నారు. ఆధునిక సాంకేతికత సహాయంతో పోలింగ్ స్టేషన్‌ను, ఓటరు అక్కడకు వెళ్లే మార్గం వివరాలు కూడా పంపుతామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం బాగానే ఉందని, పట్టణ ప్రాంతాల్లో తక్కువగా ఉంటోందన్నారు. దీన్ని పెంచేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొత్తగా చేరిన ఓటర్లను సన్మానిస్తున్నట్లు తెలిపారు. జనవరి 11న ఓటర్ల జాబితా విడుదల చేస్తామని, అందులో తమ పేరు ఉందో, లేదో చూసుకుని లేనివారు నమోదు చేసుకోవాలని సూచించారు.
నామినేషన్ల చివరిరోజు వరకూ ఓటరుగా నమోదు చేసుకోవచ్చన్నారు. ఓటర్ల జాబితా తయారీని నలుగురు ఐఏఎస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. 85 సంవత్సరాలు దాటిన వారి వివరాలతో ప్రత్యేక జాబితా తయారు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాల నాయకులు 58లక్షల బోగస్ ఓట్లు ఉన్నట్లు ఫిర్యాదు చేశారని, రెండు, మూడుచోట్ల నమోదైన 27లక్షల మంది పేర్లను తొలగించామన్నారు. తప్పులతో నమోదైన మరో 3.5 లక్షల పేర్లను కూడా తొలగించామని సిసోడియా వివరించారు.

సరికొత్త లక్ష్యాలతో కొత్త సంవత్సరం శుభప్రదమూ, జయప్రదమూ కావాలి

$
0
0

విజయవాడ (సిటీ), డిసెంబర్ 31: సరికొత్త లక్ష్యాలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న దేశ, విదేశాల్లోని తెలుగు వారందరికీ రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు వారందరికీ నూతన సంవత్సరం శుభప్రదమూ, జయప్రదమూ కావాలని ఆకాంక్షించారు. తెలుగు వారంతా ఈ ఏడాది సుఖసంతోషాలతో గడపాలన్నారు. వ్యవసాయం, సంక్షేమం, ఉద్యోగ, ఉపాధి, పారిశ్రామిక రంగాల్లో గణనీయమైన వృద్ధి జరగాలన్నారు. గ్రామీణ ప్రాంత స్వరూపం మార్చడంలో 2018 ఎంతో కీలకంగా మారిందని పేర్కొన్నారు. 2019 నవ్యాంధ్రప్రదేశ్ ప్రజలకు మరింత సౌకర్యవంతమైన సంవత్సరంగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందన్నారు. సరికొత్త ఆశలు, ఆశయాలతో నూతన సంవత్సరం ప్రారంభం కావాలన్నారు. గత ఏడాది చూసిన అభివృద్ధికి వినూత్నమైన ఆలోచనలు జోడించడంతో అద్భుతమైన ఫలితాలు ప్రజలను పలకరించబోతున్నాయన్నారు. ప్రపంచ ఐటీ రంగానికి నవ్యాంధ్రను దిక్సూచిలా మార్చడమే అంతిమ లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని విజయపథంలో నడిపిస్తున్న ప్రభుత్వానికి ప్రజలంతా అండగా నిలవాలన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అపశ్రుతులు చోటుచేసుకోకుండా యువత జాగ్రత్తలు పాటించాలని కోరారు.
మరో చరిత్ర ఖాయం: చినరాజప్ప
దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా సుఖశాంతులు, సౌభాగ్యంతో వర్థిల్లాలనే ఆకాంక్షను ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప వ్యక్తం చేశారు. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా ఆయన తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కాలగర్భంలో కలిసిపోతున్న సంవత్సరంలో నవ్యాంధ్రప్రదేశ్ సాధించిన ప్రగతితో దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలిచిందని తన సందేశంలో తెలిపారు. నూతన సంవత్సరంలో కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవడమే కాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మరోసారి చరిత్ర సృష్టించడం ఖాయమన్న ధీమా వ్యక్తం చేశారు. 2019లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగు లోగిళ్లన్నీ వెలుగులతో, సంక్షేమ రంగంలోనూ ముందంజలో ఉంటాయని ఆకాంక్షించారు. గడచిన ఏడాదిలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగ్గా ఉందని, నూతన సంవత్సరంలో కూడా రాష్ట్రాన్ని నేర రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దగలమనే ధీమాను వ్యక్తం చేశారు.
తెలుగువారు సుఖసంతోషాలతో గడపాలి
* జీవితాల్లో గొప్ప మార్పు రావాలి * వైసీపీ అధినేత జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు
విజయవాడ (సిటీ), డిసెంబర్ 31: తెలుగు రాష్ట్రాల ప్రజలందరి జీవితాల్లో నూతన సంవత్సరం సుఖసంతోషాలు నింపాలని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆకాంక్షించారు. రెండు రాష్ట్రాల ప్రజలకు ఆయన సోమవారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం 2019 తెలుగువారికి ఆనందాల సంవత్సరం కావాలన్నారు. ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలన్నారు. సంపద, సమృద్ధి కలగాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాల్లో మంచి మార్పులకు దారితీయాలని కోరుకున్నారు. నూతన సంవత్సరంలో సుపరిపాలన అందుతుందని, విలువలు లేని అవకాశవాదుల నుండి రాష్ట్రానికి విముక్తి కలుగుతుందన్నారు. రాజకీయాల్లో, పరిపాలనలో కొత్త ధోరణికి నూతన సంవత్సరం శ్రీకారం చుడుతుందని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు ప్రతిఒక్కరి హృదయాన్ని స్పృశించేలా ఉంటాయని జగన్ పేర్కొన్నారు.
నూతన నిర్ణయాలతో ముందగుడు: పవన్ కళ్యాణ్
కొత్త ఆశలకు ఉపరిపోస్తూ 2019 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో తెలుగు వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ తెలిపారు. గడచిన ఏడాది అనుభవాలను ప్రేరణగా తీసుకొని నూతన నిర్ణయాలతో ముందగుడు వేయాలన్నారు. కొత్త సంవత్సరంలో సామాన్యుడే రాజై వెలగాలని, మానవీయ పాలనకు, నవచరితకు ఇది శ్రీకారం కావాలన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు తన తరపున, జనసైనికుల తరపున పవన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
విరివనాల్లో ఆకట్టుకున్న నూతన సంవత్సర ఆకృతులు
కడియం: తూర్పుగోదావరి జిల్లా కడియం విరివనాల్లో నవ వసంత ఆకృతులు వెలిశాయి. కడియం పల్ల వెంకన్న, కడియపులంక సత్యదేవా నర్సరీల్లో నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ప్రతియేటా జనవరి 1వ తేదీన సందేశాత్మకైన ఆకృతులను తీర్చిదిద్దుతారు. పల్ల వెంకన్న నర్సరీలో దేశ ఐక్యతను చాటుతూ ప్రత్యేకంగా దేశ, విదేశీ మొక్కలతో అద్భుతమైన మొక్కల కూర్పును తయారు చేశారు. అలాగే సత్యదేవా నర్సరీలో బెంగుళూరు గులాబీలతో 2019 గణిత సంఖ్యను తీర్చిదిద్దారు. నర్సరీలకు వచ్చే సందర్శకులు వీటిని ఆసక్తిగా తిలకించడంతోబాటు సెల్ఫీలు, దిగేందుకు ఉత్సాహ పడుతున్నారు.
చిత్రం..తూర్పుగోదావరి జిల్లా కడియంలోని సత్యదేవా నర్సరీలో బెంగుళూరు గులాబీ పూలతో
నూతన సంవత్సర వేడుకలను చాటుతున్న దృశ్యం

కుంభమేళాకు రండి

$
0
0

విజయవాడ, డిసెంబర్ 31: ప్రయాగలో జనవరి 15నుంచి జరిగే కుంభమేళా ఉత్సవంలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తరపున ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సతీష్ మహానా, ఉండవల్లిలోని సీఎం నివాసంలో సోమవారం కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. వారణాసిలో జనవరి 21నుంచి 3రోజులు జరిగే ప్రవాస భారతి దినోత్సవానికి కూడా హాజరుకావాలని కోరారు. ఈసందర్భంగా మహానా మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో మీరే తనకు స్ఫూర్తి అంటూ ప్రశంసించారు. ప్రజలకు సేవ చేయాలన్న తపనతో విశ్రమించని నేత చంద్రబాబు అన్నారు. గతంలో హైదరాబాద్‌లో చేసిన అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకుని యూపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పథకాలు అమలు చేశానని ఆయన వివరించారు.
చిత్రం..సీఎం చంద్రబాబును కుంభమేళాకు ఆహ్వానిస్తున్న యూపీ మంత్రి


యువ ఐఏఎస్‌లకు సీఎస్ దిశానిర్దేశం

$
0
0

విజయవాడ, డిసెంబర్ 31: ఏపీకి కేటాయించగా శిక్షణ పొందుతున్న యువ ఐఏఎస్ అధికారులు వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పుణేఠాతో సోమవారం భేటీ అయ్యారు. వారికి తన అనుభవాలను వివరించి, భవిష్యత్తులో ఉత్తమ అధికారులుగా పేరు తెచ్చుకునేందుకు వివిధ అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. కొత్త రాష్ట్రంలో పనిచేసే అవకాశం కలుగడం అదృష్టంగా భావించి, కష్టపడి పనిచేసి రాష్రానికి మంచిపేరు తేవాలని సూచించారు. ఈ సమయంలో ఇక్కడ పనిచేయడం తమ సర్వీసులో ఒక చెరగని ముద్రగా ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే సమయంలో అక్కడి వారితో నేరుగా మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. కొత్త రాష్ట్రంలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడంలో తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.
చిత్రం..యువ ఐఏఎస్ అధికారులతో మాట్లాడుతున్న సీఎస్ పునేఠా

వ్యాయామ అభ్యర్థులకు భౌతిక సామర్థ్య పరీక్షలు

$
0
0

విజయవాడ, డిసెంబర్ 31: డీఎస్సీ- 2018 స్కూల్ అసిస్టెంట్లు (వ్యాయామ), పీఈటీలకు జనవరి 4 నుంచి భౌతిక సామర్థ్య పరీక్షలు నిర్వహించనున్నారు. 337 స్కూల్ అసిస్టెంట్లకు, 12552 పీఈటీలు ఆప్షన్లు వెబ్‌సైట్‌లో నమోదు చేశారు. వీరికి జనవరి 13వరకూ ఆచార్య నాగార్జున వర్సిటీలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఒక్కో సెషన్‌లో 700 మంది చొప్పున 1400 మందికి రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. వెబ్ ఆప్షన్లు నమోదు చేయనివారికి ఉమ్మడిగా 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్‌లను కేటాయించామని పాఠశాల విద్యాశాఖ కమిషన్ సంధ్యారాణి తెలిపారు.

ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు

$
0
0

పాఠకులు, చందాదారులు, ఏజెంట్లు, ప్రకటనకర్తలు, శ్రేయోభిలాషులకు ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు.
- చీఫ్ ఎడిటర్
*
ఏటికేడాది ఆశల ఏరువాక
సాగుచుండును జనులంత సంతసించ
గతముపై నొకయంకెను కలుపుకొనుచు
రెండువేల పందొమ్మిది రానెవచ్చె!

పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుతాం

$
0
0

హైదరాబాద్, డిసెంబర్ 31: రాబోయే పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చూపుతామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా తెలిపారు. శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినంత మాత్రాన కాంగ్రెస్ పని అయిపోయిందని అనుకుంటే పొరపాటేనని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓటమికిగల కారణాలపై విశే్లషణ, పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికలకు పార్టీని సమాయత్త పర్చడానికి సోమవారం హైదరాబాద్‌కు వచ్చిన కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు, వచ్చే పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికలకు పార్టీని సమాయత్తం పరిచే అంశంపై చర్చించినట్టు కుంతియా తెలిపారు. శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అక్రమాలు చేసి గెలిచిందన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం 4 తర్వాత భారీగా పోలింగ్ జరగడం వెనుకనున్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. పోలింగ్ జరిగిన ఓట్లకు, కౌంటింగ్‌లో లెక్కించిన ఓట్లకు మధ్య తేడాలున్నాయన్నారు. ఎన్నికల్లో జరిగిన అధికార దుర్వినియోగంపై ప్రధాన ఎన్నికల కమీషనర్‌కు, రాష్టప్రతికి ఫిర్యాదు చేయనున్నట్టు కుంతియా తెలిపారు. ఎన్నికలు జరిగి ఇరవై రోజులు గడిచినా ఇప్పటికీ ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించకపోవడం దారుణమని విమర్శించారు. ప్రధాని మోదీకి మేలు చూకూర్చడానికే సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరిట పర్యటనలు జరపుతున్నారని ఆరోపించారు. తనపై సీబీఐతో కేసులు పెట్టిస్తారోమోనన్న భయంతోనే మోదీకి కేసీఆర్ బీ-టీమ్‌గా మారారని కుంతియా ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన సత్తా చూపిస్తుందన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, థర్మపురి, ఇబ్రహీంపట్నం, కోదాడ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారన్నారు. ఓడిపోయిన అభ్యర్థులు డిమాండ్ చేసినా వీవీ పాట్ స్లిప్‌లను లెక్కించలేదని విమర్శించారు. తక్కువ మార్జిన్‌తో ఓడిపోయిన స్థానాలపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించామన్నారు. నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలు ఇన్‌చార్జిలుగా ఉంటారన్నారు.

దేశం పట్ల బాధ్యత లేని కాంగ్రెస్

$
0
0

హైదరాబాద్, డిసెంబర్ 31: కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ దేశం పట్ల బాధ్యత ఫీల్ కాలేదని , పంచభూతాల్లో ఆ పార్టీ అవినీతికి పాల్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అంటే కరప్షన్, కమిషన్, కలెక్షన్ అనేపేరు గడించిందని, సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్, రాహుల్‌గాంధీ నేతృత్వంలో కుంభకోణాల మయమైందని విమర్శించారు. సోమవారం సాయంత్రం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ నీరు, నిప్పు, గాలి, నేల, పాతాళం దేనినీ వదలకుండా పంచభూతాలలో కుంభకోణాలు చేశారని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీకి దేశ రక్షణ, ప్రజల రక్షణ పట్ల ఏ మాత్రం బాధ్యత లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి దేశం ఏమైనా, ప్రజలు ఏమైనా పర్వాలేదని, వాళ్ల డిఎన్‌ఏలోనే దోపిడీ ఉందని, ఇటీవల అగస్టా వెస్ట్ ల్యాండ్ స్కామ్ నిందితుడ్ని భారత ప్రభుత్వం దేశానికి తీసుకువచ్చిందని, ఆయన వచ్చిన నాటి నుండి కాంగ్రెస్ పార్టీ, సోనియా, రాహుల్ ఇతర నేతలు బెంబేలెత్తిపోతున్నారని వణికిపోతున్నారని విమర్శించారు. దొంగ దోంగ అని దోంగే అరచినట్టు రాహుల్‌గాంధీ ప్రవర్తిస్తున్నారని, వాళ్ల దోపిడీ బయటపడుతోందని అన్నారు. వాళ్లు ఊచలు లెక్కించే రోజు దగ్గర్లోనే ఉందని, అగస్టా వెస్ట్‌లాండ్ వీవీఐపీ హెలికాప్టర్లు కొనుగోలులో అక్రమాలు చోటు చేసుకున్నాయని మొదట ఇటలీ కోర్టు తెలిపిందని, ఇటలీలోని ఆ ప్రభుత్వం ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కొంత మందిని అరెస్టు చేసిందని అన్నారు. ఇటలీ కోర్టులో పలుమార్లు సోనియాగాంధీ పేరు ప్రస్తావనకు వచ్చిందని, అగస్టా వెస్ట్ లాండ్ కుంభకోణం నిందితుడు క్రిస్టియన్ మిషల్ కూడా మిసెస్ గాంధీ పేరు ప్రస్తావించారని డిసెంబర్ 29న ఈడీ, పాటియాలా కోర్టుకు తెలిపిందని అన్నారు. గత 30-32 సంవత్సరాలుగా దేశంలో జరిగిన కుంభకోణాల్లో అండర్సన్‌ను గానీ, ఖత్రోచీని గానీ, ఇపుడు క్రిస్టియన్ మిషల్‌ను గానీ తీసుకుంటే వారందరికీ గాంధీ కుటుంబంతో ఏదో ఒక రూపంలో సంబంధం ఉందని అన్నానరు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ దీనికి సమాధానం చెప్పాలని లక్ష్మణ్ నిలదీశారు. ఈ కుంభకోణం నుండి సోనియా, రాహుల్ కుటుంబం తప్పించుకోలేదని, దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దోపిడీని నిశితంగా గమనిస్తున్నారని అన్నారు. మోదీ నేతృత్వంలోని దోపిడీ దారులకు శిక్ష తప్పదని వ్యాఖ్యానించారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, ప్రధానకార్యదర్శి చింతా సాంబమూర్తి, రాష్ట్ర కార్యదర్శి ఎస్ కుమార్, అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్ ప్రకాష్‌రెడ్డి, మీడియా కమిటీ కన్వీనర్ సుధాకర్ శర్మ, మాజీ డిప్యుటీ మేయర్ సుభాష్ చందర్, బాక్రీ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Viewing all 69482 articles
Browse latest View live