న్యూఢిల్లీ, జూన్ 3: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డిని బర్తరఫ్ చేయటం పట్ల రాష్ట్ర కాంగ్రెస్, ముఖ్యంగా రాష్ట్ర మంత్రులు, నాయకులు తీవ్ర ఆందోళన, నిరసనలు వ్యక్తం చేస్తున్నారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్‌తో చెప్పినట్లు తెలిసింది. బొత్సా సత్యనారాయణ సోమవారం ఢిల్లీకి వచ్చిన అనంతరం సాయంత్రం ఆజాద్‌తోపాటు లోక్‌సభ నాయకుడు, హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండేను విడివిడిగా కలుసుకుని రాష్ట్ర రాజకీయాల గురించి వివరించినట్లు తెలిసింది. రవీంద్రారెడ్డిని బర్తరఫ్ చేసేందుకు ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డికి అనుమతి ఇవ్వటం వలన రాజకీయంగా తీరని నష్టం కలిగిందని ఆయన ఇద్దరు సీనియర్ నాయకులకు స్పష్టం చేశారని అంటున్నారు. రవీంద్రా రెడ్డి మంత్రి పదవికి ఇదివరకే చేసిన రాజీనామాను ఆమోదిస్తే సరిపోయేదనీ, దీనికి బదులు అతన్ని బర్తరఫ్ చేసేందుకు అనుమతి ఇవ్వటం వలన రాష్ట్ర మంత్రులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారని ఆయన వివరించినట్లు చెబుతున్నారు. రవీంద్రా రెడ్డిని బర్తరఫ్ చేయటం ద్వారా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు పంపించినట్లు అయ్యిందని కూడా ఆయన చెప్పారని అంటున్నారు. ఇదిలా ఉంటే రవీంద్రారెడ్డిని బర్తరఫ్ చేసేందుకు అనుమతి ఇవ్వటంపై అధినాయకత్వానికి తమ నిరసనతో కూడా అభిప్రాయాన్ని చెప్పేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె జానారెడ్డి ఢిల్లీకి వచ్చారు. ఆజాద్‌తోపాటు కాంగ్రెస్ అధినాయకత్వానికి చెందిన మరికొందరు సీనియర్ నాయకులను ఆయన కలుసుకుని తమ అభిప్రాయాలను వివరించనున్నారు. రవీంద్రా రెడ్డిని బర్తరఫ్ చేయటం వలన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం సంభవించిందని ఆయన అధినాయకులకు చెప్పనున్నారు.
రాజకీయంగా తీరని నష్టం
‘అణు’వంతైనా తగ్గలేదు
లండన్, జూన్ 3: భారత్, పాకిస్తాన్, చైనా దేశాలు ఇబ్బడిముబ్బడిగా ఆయుధ సంపత్తిని విస్తరించుకుంటున్నాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఓ పక్క శాంతిమంత్రం జపిస్తూనే మూడు దేశాలు అణ్వాయుధాలు సమకూర్చుకోవడంలో పోటీ పడుతున్నాయని స్టాక్‌హోమ్‌కు చెందిన అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ (ఎస్‌ఐపిఆర్‌ఐ) తన సర్వేలో తెలిపింది. ఆసియా ఖండంలో శాంతి స్థాపనకు ఈ విపరీత ధోరణి విఘాతం కల్పిస్తుందని తెలిపింది. 2012లో భారత్ 10 అణ్వాయుధాలు సమకూర్చుకుంది. ఇప్పటికే భారత్ వద్ద 90 నుంచి 110 వరకూ ఉన్నట్టు సర్వేలో వెల్లడైంది. పాకిస్తాన్ విషయానికొస్తే పది అణ్వాయుధాలను విస్తరించుకుంది. పాక్ వద్ద వంద నుంచి 120 వరకూ అణ్వాయుధ సంపత్తి ఉన్నట్టు తెలిపింది. చైనా సైతం ఆయుధ సంపత్తి సమకూర్చుకోవడంలో ముందుందని సంస్థ పేర్కొంది. భారత్, పాకిస్తాన్ దేశాలు క్షిపణి సరఫరా సామర్థ్యాన్ని బాగా విస్తరిస్తున్నాయని, ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పోటాపోటీగా ఆయుధాగారాలను విస్తరించుకుంటూ పోతున్నాయని తెలిపింది. ఎవరికి వారు అణ్వాయుధాలు పెంచుకుంటూ వెళ్లడం వల్ల ఆసియా ఖండంలో శాంతి ప్రశ్నార్థకంగా మారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పొరుగుదేశాలతో ఘర్షణ వాతావరణం, సరిహద్దుల్లో ఉద్రిక్తత, తీవ్రవాదానికి సహకారం అందించడం వంటి వాటి నుంచి పూర్తిగా బయటపడాలన్నారు. సామూహిక ఆయుధ సంపత్తిని తగ్గించుకునే దిశగా అమెరికా, రష్యా చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలు ఇచ్చాయని సర్వే స్పష్టం చేసింది. అణ్వాయుధాల అనే్వషణ, విస్తరణ విషయాల్లో ఒకప్పటి సూపర్ పవర్ దేశాలైన అమెరికా, రష్యా విధించుకున్న నిషేధం పనిచేసిందని వివరించింది. 2012లో రష్యా 10వేల నుంచి 8,500కు, యుఎస్ 8వేల నుంచి 7,700కు అణ్వాయుధాలను తగ్గించుకున్నట్టు వెల్లడించింది. ఫ్రాన్స్, బ్రిటన్, ఇజ్రాయెల్ దేశాలు ఆయుధాలను తగ్గించుకున్నట్టు పేర్కొంది. అణ్వాయుధాల విస్తరణకు సంబంధించి యుఎస్, రష్యాలతో పోల్చుకుంటే చైనాలో పారదర్శకత తక్కువగానే ఉందని ఆరోపించింది. అణ్వాయుధ దేశాలుగా పేర్కొనే చైనా, ఫ్రాన్స్, రష్యా, యుకె, యుఎస్‌లలో చైనాలోనే విస్తరణ నిరాటకంగా సాగుతోందని సర్వే తెలిపింది. ఆయుధ ఎగుమతుల్లో ఐదో పెద్ద దేశమైన బ్రిటన్‌ను ఈ ఏడాదిలోగా చైనా అధిగమించే అవకాశాలున్నాయని పేర్కొంది. ఆయుధ ఎగుమతుల్లో యుఎస్, రష్యా, జర్మనీ, ఫ్రాన్స్ సరసన బ్రిటన్ ఉంది. త్వరలో బ్రిటన్ స్థానాన్ని చైనా ఆక్రమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
మాజీ మంత్రి అయితే భద్రత కల్పించాలా?
న్యూఢిల్లీ, జూన్ 3: మాజీ మంత్రులకు ప్రభుత్వం ఎందుకు భద్రత కల్పిస్తోందో అర్థం కావడం లేదని సుప్రీం కోర్టు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. పోలీసు భద్రత కల్పించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాజీ మంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడు రామ్‌వీర్ ఉపాధ్యాయ్ చేసుకున్న విజ్ఞప్తిపై సుప్రీం కోర్టు ఆయనను ప్రశ్నించింది. ‘మాజీ మంత్రి అయినంత మాత్రాన మీకు ప్రభుత్వం ‘వై’ కేటగిరీ భద్రత కల్పించాలా? ఇలా ఎందుకు చేయాలో మాకు అర్థం కావడం లేదు’ అని జస్టిస్ జ్ఞాన్ సుధా మిశ్రా, జస్టిస్ మదన్ బి.లోకూర్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఉత్తరప్రదేశ్‌లో ఇంతకుముందు మాయావతి ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన రామ్‌వీర్ ఉపాధ్యాయ్‌కు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన సమాజ్‌వాదీ ప్రభుత్వం భద్రతను ఉపసంహరించింది. దీంతో ప్రభుత్వం తనకు పోలీసు భద్రత కల్పించాలని కోరుతూ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ విజ్ఞప్తిని పరిశీలించిన సుప్రీం కోర్టు ఎటువంటి ఉత్తర్వునూ జారీ చేయలేదు. రామ్‌వీర్ ఉపాధ్యాయ్ తన విజ్ఞప్తిపై ప్రస్తుతం ఈ కేసు పెండింగ్‌లో ఉన్న అలహాబాద్ హైకోర్టులోనే అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు సూచించింది. అయితే ఈ కేసుపై తాము విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది. రామ్‌వీర్ ఉపాధ్యాయ్ ప్రాణాలకు ఎటువంటి ముప్పు ఉందో వివరించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాది ఈ నెల 5వ తేదీన తమ ఎదుట హాజరుకావాలని సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
కర్నాటకలో బిజెపి పాలన అవినీతిమయం
బెంగళూరు, జూన్ 3: కర్నాటకలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ఐదేళ్లుగా బిజెపి సాగించిన పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. బిజెపి హయాంలో ప్రజాధనం భారీగా దుర్వినియోగమైందని, వివిధ కుంభకోణాలు, అవినీతి కేసులతో రాష్ట్ర ప్రతిష్ట దారుణంగా దిగజారిందని కాంగ్రెస్ ప్రభుత్వం నిప్పులు చెరిగింది. రాష్ట్ర అసెంబ్లీ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ హెచ్.ఆర్.్భరద్వాజ్ చేసిన ప్రసంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విమర్శలు చేసింది. ‘కర్నాటకలో గత ఐదేళ్లుగా వెలుగుచూసిన అనేక కుంభకోణాలు, అవినీతి కేసులతో రాష్ట్రం పరువు ప్రతిష్టలు దారుణంగా దెబ్బతిన్నాయి. భారీ మొత్తంలో ప్రజాధనం దుర్వినియోగమైంది. అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఫలితంగా రాజకీయ పార్టీలపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది. ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహం ప్రజాస్వామ్య సాంప్రదాయాలకే హానికరమని రుజువైంది’ అని భరద్వాజ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు నీతిమంతమైన, జవాబుదారీతనంతో కూడిన పరిపాలన అందించి వారిలో తిరిగి విశ్వాసాన్ని పెంపొందించాలని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన స్పష్టం చేశారు.
భరద్వాజ్ వ్యాఖ్యలపై మాజీ ముఖ్యమంత్రి, శాసనసభలో ప్రస్తుతం బిజెపి పక్షనేతగా వ్యవహరిస్తున్న జగదీష్ షెట్టార్ తీవ్రస్థాయిలో ప్రతిస్పందించారు. రాష్ట్రంలో ఇంతకుముందు ఉన్న బిజెపి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ గవర్నర్ కొత్త సాంప్రదాయానికి తెర లేపారని, బిజెపి పాలనలో భారీగా అవినీతి చోటుచేసుకుందని చెప్పిన గవర్నర్ అందుకు ప్రత్యేకంగా ఒక్క ఉదంతాన్ని కూడా తన ప్రసంగంలో ప్రస్తావించలేదని షెట్టార్ ధ్వజమెత్తారు. కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో పాలన సాగిస్తున్న యుపిఎ సంకీర్ణ ప్రభుత్వం 2జి స్పెక్ట్రమ్ తదితర అనేక కుంభకోణాల్లో పీకల్లోతున కూరుకుపోయిందని, కనుక అవినీతి గురించి మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్ పార్టీకి ఎంతమాత్రం లేదని జగదీష్ షెట్టార్ పేర్కొన్నారు.
90వ పడిలో కరుణానిధి
90వ పడిలో పడిన డిఎంకె అధినేత కరుణానిధికి శుభాకాంక్షలు తెలుపుతూ నవ్వులు చిందిస్తున్న కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా.
ప్రసంగానికి పరిమితులా?

చెన్నై, జూన్ 4: అంతర్గత భద్రతపై చర్చించడానికి ఈ నెల 5న న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల సమావేశంలో తన ప్రసంగాన్ని పది నిమిషాల్లో ముగించాలంటూ షరతు పెట్టడాన్ని అవమానంగా భావించిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆ సమావేశానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. అయితే తనకు బదులుగా ఒక రాష్టమ్రంత్రిని, సీనియర్ అధికారులను పంపించాలని ఆమె నిర్ణయించారు. ‘పది నిమిషాల్లో ప్రసంగాన్ని ముగించాలంటూ షరతులు పెట్టే సమావేశానికి హాజరుకావడంకన్నా ప్రసంగ పాఠాన్ని టేబుల్‌పై ఉంచడం మంచిది. నా తరఫున సమావేశానికి రాష్ట్ర పురపాలక, గ్రామీణాభివృద్ధి న్యాయ శాఖల మంత్రి కెపి మునిస్వామిని, హోం కార్యదర్శి, డిజిపిలను పంపిస్తున్నాను’ అని జయలలిత సోమవారం ప్రధాని మన్మోహన్ సింగ్‌కు రాసిన లేఖలో స్పష్టం చేసారు. అయితే సమావేశం అజెండాలోని అన్ని అంశాలను ఎంతో చిత్తశుద్ధితో పరిశీలించానని, ఈ అంశాలన్నిటిపైనా తమిళనాడు ప్రభుత్వ అభిప్రాయాలను తన ప్రసంగ పాఠంలో తెలియజేయడం జరుగుతుందని జయలలిత ఆ లేఖలో తెలియజేసారు. జయలలిత లేఖలోని ముఖ్య అంశాలను మంగళవారం పత్రికలకు విడుదల చేసారు. ఈ మేరకు సమావేశంలో జయలలిత ప్రసంగాన్ని మునుస్వామి చదివి వినిపిస్తారు. ఈ సమావేశానికి ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షత వహిస్తారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఏర్పాటు చేసే ఇలాంటి సమావేశాలు మొక్కుబడి వ్యవహారంగా ఉండడం, అజెండాలోని అన్ని అంశాలపై ముఖ్యమంత్రులు తమ అభిప్రాయాలను తెలియజేయడానికి అవకాశం ఇవ్వకపోవడం అనేది తనకు అనుభవమేనని ఆమె ఆ లేఖలో అన్నారు. అలాగే ఈ సమావేశంలో కూడా 12 అంశాల సుదీర్ఘ అజెండా ఉందని, ఆ అంశాల పేర్లను చదవడానికే పది నిమిషాలు చాలదని, అలాంటిది ముఖ్యమంత్రులు ప్రసంగించడానికి పది నిమిషాలు కేటాయించడం ఏమిటని జయలలిత తన లేఖలో ప్రశ్నించారు.
బెల్టు షాపులు తొలగించాల్సిందే
హైదరాబాద్, జూన్ 4: మద్యం బెల్టు దుకాణాలను సమూలంగా తొలగించి ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించాలని మద్య నియంత్రణ ఉద్యమ సదస్సు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తద్వారా మద్యం విక్రయాలపై నియంత్రణ చేపట్టే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని కోరింది. దాదాపు రెండు లక్షల బెల్టు షాపుల ద్వారా రాష్ట్రంలో మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని, సమాజంలో ఉన్న అన్ని సమస్యలకన్నా మద్యం అతి పెద్ద సమస్యగా తయారైందని సదస్సులో పాల్గొన్న పలు పార్టీల ప్రజా ప్రతినిధులు, ప్రజాసంఘాల ప్రతినిధులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నాడిక్కడ రవీంధ్రభారతిలో మద్య నియంత్రణ సదస్సు జరిగింది. ఈ సదస్సులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎన్. తులసిరెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి, తెరాస నేత నాయిని నర్సింహారెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు కఠారి శ్రీనివాసరావు, తెలుగు దేశం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శోభా హైమావతి, న్యూడెమోక్రసి నేత దివాకర్‌రావుతదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు. మద్యం విక్రయాల నియంత్రణపై ప్రభుత్వం పట్టు కోల్పోయిందని, ఆదాయ వనరుగా భావించి మద్యం విక్రయాలను విచ్చలవిడి చేశారని ధ్వజమెత్తారు. మద్యపాన నిషేధం అమలు సాధ్యం కాదంటున్న ప్రభుత్వం కనీసం నియంత్రణ విధాన్నైనా సక్రమంగా అనుసరించాలని వారు డిమాండ్ చేశారు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం అసలు ఆదాయ వనరుగా చూడరాదని కోరింది. ఈ సదస్సును కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి కె. పద్మనాభయ్య ప్రారంభించగా, రాష్ట్ర మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు అధ్యక్షత వహించారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ తాము అధికారంలోకి వస్తే తొలి సంతకం రుణ మాఫీ, రెండో సంతకం బెల్టు దుకాణాల తొలగింపు ఫైళ్లపై సంతకాలు చేస్తానని అన్నారు. బెల్టుషాపుల తొలగింపుపై సిఎం చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం వ్యతిరేకంగా వ్యవహరిస్తే అందుకు మద్య నియంత్రణ కమిటీ చేసే కార్యక్రమాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి మాట్లాడుతూ 2004 ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న మేరకు క్రమేణా మద్య నియంత్రణను ప్రభుత్వం చేపట్టిందని గుర్తు చేశారు. రిటైల్ దుకాణాల సంఖ్యను తగ్గిస్తూ వచ్చామని చెప్పారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో మద్యం దుకాణాలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ మద్యం వ్యాపారంతో సంబంధం ఉన్న నేతలెవరికి రానున్న ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వవద్దని, మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించాలని అన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్న మద్యం మాఫియాను నిర్మూలించేందుకు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేకపోవడం వల్లే ప్రభుత్వం బెల్టు షాపుల ద్వారా మద్యం విక్రయిస్తోందని అన్నారు.
నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ మద్యం వ్యాపారంతో సంబంధం ఉన్న ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు వేసేందుకు చట్టం తేవాలని అన్నారు. ఈ కార్యక్రమానికి మద్య నియంత్రణ కమిటీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి తొలుత స్వాగతోపన్యాసం చేశారు. ఐద్వా నాయకురాలు మల్లు స్వరాజ్య లక్ష్మి, మహిళాభ్యుదయ సమితి అధ్యక్షురాలు టి. అరుణ తదితరులు మద్య నియంత్రణను ప్రభుత్వం చేపట్టాలని ధ్వజమెత్తారు.
మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం రవీంధ్రభారతిలో జరిగిన సదస్సులో ప్రసంగిస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు,
కాంగ్రెస్ అధికార ప్రతినిధి తులసిరెడ్డి. వేదికపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డితో బాబు మాటామంతీ.
బకాయిలు చెల్లించండి

న్యూఢిల్లీ, జూన్ 4: ప్రముఖులు ప్రయాణించడం కోసం సుమారు 3,500 కోట్ల రూపాయల విలువైన హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం రద్దయ్యే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఈ ఒప్పందానికి సంబంధించి నిలిపివేసిన సుమారు 2,400 కోట్ల రూపాయలను చెల్లించాలని అగస్టావెస్ట్‌లాండ్ సంస్థ కేంద్రాన్ని కోరింది. అంతేకాకుండా ఈ చెల్లింపులను నిలిపివేయడం ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని కూడా పేర్కొంది. రక్షణ మంత్రిత్వ శాఖతో కాంట్రాక్ట్‌కు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తమకు చెల్లించాల్సిన పేమెంట్లను విడుదల చేయాలని రక్షణ, ఆర్థిక, విదేశాంగ మంత్రిత్వ శాఖలకు రాసిన ఒక లేఖలో ఈ ఆంగ్లో-ఇటాలియన్ సంస్థ కోరింది. హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించి కుదుర్చుకున్న సుమారు 3,600 కోట్ల రూపాయల ఒప్పందానికి సంబంధించి 30 శాతం సొమ్మును భారత్ ఈ సంస్థకు చెల్లించింది. అయితే ఈ ఒప్పందం తమకు అనుకూలంగా వచ్చేలా చూడడం కోసం 362 కోట్ల రూపాయల ముడుపులు చెల్లించారన్న ఆరోపణపై ఇటలీ దర్యాప్తు అధికారులు ఈ హెలికాప్టర్ల తయారీదారులయిన ఫిన్‌మెకానికా, అగస్టా సంస్థల మాజీ సిఈఓలను అరెస్టు చేయడంతో మిగతా చెల్లింపులను నిలిపివేసింది. అయితే భారత్, ఇటలీ చట్టాల ప్రకారం, నేరం రుజువయ్యే దాకా ఏ వ్యక్తి, లేదా సంస్థను దోషిగా పేర్కొనడానికి వీల్లేదని, ఈ కేసుకు సంబంధించి దర్యాప్తులు రెండు దేశాల్లోను ఇంకా జరుగుతున్నాయని ఆ సంస్థ పేర్కొనింది. అంతేకాదు, ఏకపక్షంగా ఒప్పందాన్ని రద్దు చేయడానికి లేదా, చెల్లించాల్సిన పేమెంట్లను నిలిపివేయడానికి కానీ కాంట్రాక్ట్ లేదా దానికి సంబంధించి కుదుర్చుకున్న ఒడంబడిక కానీ రక్షణ శాఖకు ఎలాంటి అధికారాలను ఇవ్వలేదని కూడా ఆ సంస్థ పేర్కొంటూ, అలాంటి చర్యలు ఒప్పందాన్ని ఉల్లంఘించడం కిందికే వస్తుందని ఆ సంస్థ రక్షణ శాఖకు రాసిన లేఖలో తెలియజేసింది. అగస్టావెస్ట్‌లాండ్ మేనేజింగ్ డైరెక్టర్ జెఫ్ హూన్ ఈ లేఖ రాసారు.
ఈ ముడుపుల కుంభకోణానికి సంబంధించి సిబిఐ ఒక కేసును నమోదు చేసి వైమానిక దళ మాజీ ప్రధానాధికారి ఎస్‌పి త్యాగి, ఆయన సమీప బంధువులు ముగ్గురిని ప్రశ్నించిన విషయం తెలిసిందే.
పేమెంట్లకు సంబంధించి రక్షణ అధికారులతో సమావేశం కోసం తాము గత ఫిబ్రవరినుంచీ ప్రయత్నిస్తున్నామని, అయినా ఇప్పటివరకు ఆ శాఖనుంచి ఎలాంటి సమాధానం రాలేదని అగస్టా వెస్ట్‌లాండ్ సంస్థ ఆ లేఖలో పేర్కొంది. డెలివరీ చేసిన హెలికాప్టర్లకు సంబందించి అగస్టా వెస్ట్‌లాండ్ తన హామీలన్నిటినీ నెరవేర్చిందని, అయినప్పటికీ పేమెంట్లు అందలేదని ఆ సంస్థ పేర్కొనింది.
12 హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించి 3,600 కోట్ల రూపాయలకు కుదుర్చుకున్న ఈ ఒప్పందం కింద తొలి విడతగా మూడు హెలికాప్టర్లు గత నెల పాలమ్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నాయి. మరో మూడు హెలికాప్టర్లు వచ్చే నెలలో రావలసి ఉంది. మిగతా ఆరు హెలికాప్టర్లను ఈ ఏడాదిలోనే డెలివరీ చేయాల్సి ఉంది. ఒప్పందం ప్రకారం నాలుగు విడతలుగా అందే విమానాలకు సంబంధించిన చెల్లింపులను ఆయా హెలికాప్టర్లు అందిన తర్వాత మన దేశం చెల్లించాలి. అయితే ఈ దశలో కూడా మన దేశం మొత్తం సొమ్మును వెనక్కి రాబట్టగలదని కుంభకోణం తర్వాత రక్షణ మంత్రి ఆంటోనీ చెప్పడం గమనార్హం.
బన్సల్‌ను ప్రశ్నించిన సిబిఐ
న్యూఢిల్లీ, జూన్ 4: రైల్వే బోర్డులో అవినీతి కుంభకోణం దృష్ట్యా రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేసిన పవన్‌కుమార్ బన్సల్‌ను సిబిఐ మంగళవారం ప్రశ్నించింది. బన్సల్ దర్యాప్తు అధికారులకు సహకరిస్తున్నారని, లంచాల కుంభకోణంతో తనకెలాంటి సంబంధం లేదని చెప్పారని సిబిఐ వర్గాలు తెలిపాయి. ఇతరుల ప్రకటనల గురించి కూడా ఆయనను ప్రశ్వించడం జరుగుతోందని, ఆయనను ప్రశ్నించడం పూర్తి చేయడానికి సిబిఐకి మరి కొన్ని గంటలు అవసరమని ఆ వర్గాలు తెలిపాయి. రైల్వే బోర్డులో మహేశ్ కుమార్ అనే వ్యక్తిని కీలకమైన పదవిలో నియమించేలా చూడడం కోసం 90 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా బన్సల్ మేనల్లుడు విజయ్ సింగ్లాను అరెస్టు చేయడం తెలిసిందే. పది కోట్ల రూపాయలకు ఒప్పందం కుదిరిందని, చండీగఢ్‌లో సింగ్లా వద్ద పట్టుబడిన సొమ్ము తొలి విడత చెల్లింపు మాత్రమేనని సిబిఐ అంటోంది. సింగ్లా మహేశ్ కుమార్‌ను ఢిల్లీలోని తన మామ అధికార నివాసంలో కలిసాడని కూడా సిబిఐ అంటోంది. బన్సల్ కూడా కుమార్‌ను ముంబయిలో గత ఏప్రిల్‌లో కలిసారని, రైల్వే బోర్డులో నియమించడం జరుగుతుందని అతనికి హామీ ఇచ్చారని కూడా సిబిఐ అంటోంది. అంతేకాదు, కుమార్, బన్సల్ మేనల్లుడి మధ్య ఈ ఏడాది జరిగిన వెయ్యికి పైగా ఫోన్ సంభాషణలను రహస్యంగా రికార్డు చేసామని కూడా సిబిఐ చెప్తోంది.
విచారణ ముగిసింది.. చర్య మిగిలింది
హైదరాబాద్, జూన్ 4: రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా విప్‌ను ధిక్కరించిన 18 మంది ఎమ్మెల్యేలపై విచారణ మంగళవారం ముగిసింది. స్పీకర్ నాదెండ్ల మనోహర్ తీర్పును రిజర్వ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు మొత్తం 18 మంది ఎమ్మెల్యేలు విప్‌ను దిక్కరించారు. వీరిలో ఈరోజు టిడిపి ఎమ్మెల్యేలు సముద్రాల వేణుగోపాలాచారి, హరీశ్వర్‌రెడ్డి స్పీకర్ వద్ద విచారణకు హాజరై తమ వాదన వినిపించారు. తమకు విప్ అందలేదని వారు స్పీకర్‌కు తెలపగా, టిడిపి విప్ దూళిపాళ్ళ నరేంద్ర విప్‌ను అందజేసినట్టు తెలిపారు. వాదనలు విన్న స్పీకర్ తన తీర్పును రిజర్వ్ చేశారు. టిడిపి ఎమ్మెల్యేలు 9 మంది, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 9 మంది విప్‌ను దిక్కరించారు. వీరిపై చర్య తీసుకోవాలని స్పీకర్‌ను కోరుతూ కాంగ్రెస్, టిడిపి విడివిడిగా స్పీకర్‌కు ఫిర్యాదు చేశాయి. తాము విప్‌ను దిక్కరించామని, వెంటనే చర్య తీసుకుని ఉప ఎన్నికలు జరిగేట్టు చూడాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరిన టిడిపి,కాంగ్రెస్ ధిక్కార ఎమ్మెల్యేలు స్పీకర్‌కు లిఖితపూర్వకంగా తెలిపారు. టిడిపి ఎమ్మెల్యేలు కొందరు తమకు విప్ అందలేదని తెలిపారు. సాధారణ ఎన్నికల గడువు సమీపిస్తున్నందున అనర్హత వేటు వేసినా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కనిపించడం లేదు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు మొదటి నుంచి తమపై అనర్హత వేటు త్వరగా వేయాలని, ఉప ఎన్నికలు జరిగేట్టు చూడాలని కోరుతున్నారు.
గంగులపై ఫిర్యాదు
తాజాగా మరో ఎమ్మెల్యేపై టిడిపి స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. కరీంనగర్ టిడిపి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పార్టీకి రాజీనామా చేసి టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఆయనపై అనర్హత వేటువేయాలని విప్ దూళిపాల నరేంద్ర స్పీకర్‌కు మంగళవారం ఫిర్యాదు చేశారు. విప్‌ను దిక్కరించిన 18 మంది ఎమ్మెల్యేలతో పాటు గంగుల కమలాకర్ పై కూడా ఒకే సారి నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఫిర్యాదుపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు నోటీసు జారీ చేశారు.
పంచాయతీ తర్వాతే రచ్చబండ
అప్పుడే కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇళ్లు మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 4: పంచాయతీ ఎన్నికల తర్వాతనే మూడవ విడత రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్టు వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలుపై వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో మంత్రివర్గ ఉప సంఘం సమావేశమైంది. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, జె గీతారెడ్డి, ఎన్ రఘువీరారెడ్డి, వట్టి వసంతకుమార్, పితాని సత్యనారాయణ, శైలజానాథ్ తదితరులు పాల్గొని చర్చించిన అంశాలను కన్నా లక్ష్మీనారాయణ మీడియాకు వివరించారు. రచ్చబండ మొదటి, రెండో విడతల్లో వచ్చిన దరఖాస్తులతో పాటు ఈ ఏడాది మే 31 వరకు అందిన ఆర్జీలను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు మంత్రి తెలిపారు. అలాగే ఇందిరమ్మ కళలకు సంబంధించి మండలిలో అనుమతి పొందిన పనులను మూడవ విడత రచ్చబండలో శంకుస్థాపనలు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించినట్టు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి వివిధ జిల్లాల్లో జరిపిన పర్యటనలు, ఇందిరమ్మ బాటలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలపై వివిధ పనులకు సంబంధించి వచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఆయా పనులకు టెండర్లు ఖరారు చేయాలనీ, వాటికి కూడా మూడవ విడత రచ్చబండలో చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. డిసెంబర్‌లో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన మేరకు తెలుగుబాట పేరుతో రాష్టవ్య్రాప్తంగా జిల్లాల్లో ప్రతీ నెల ఒ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్టు ఆయన వివరించారు. ఈ నెల 7న దీనిపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నట్టు మంత్రి కన్నా తెలిపారు. పెన్షన్లు, ఇళ్ళు, రేషన్ కార్డుల కోసం గత మే 31 నాటికి అందిన దరఖాస్తులను పరిశీలించి, మూడవ దశ రచ్చబండలో పంపిణి చేయాలని నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు.
2013-14 రుణ ప్రణాళిక
రూ.1,33,074 కోట్లు
సేద్యానికి 67,224 కోట్లు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 4: రాష్ట్ర రుణ ప్రణాళికను 2013-14 సంవత్సరానికి 1,33,074 కోట్ల రూపాయలతో రూపొందించారు. 181వ రాష్టస్థ్రాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బిసి) సమావేశం సందర్భంగా ఈ రుణప్రణాళికను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తాజ్ కృష్ణా హోటల్‌లో మంగళవారం ఆవిష్కరించారు. వ్యవసాయ రంగానికి 67,224 కోట్లు, ఇతర ప్రాధాన్యతారంగాలకు 32,670 కోట్ల రూపాయలు రుణంగా ఇవ్వాలని నిర్ణయించారు. ప్రాధాన్యతేతర రంగాలకు 33,180 కోట్ల రూపాయలు రుణంగా ఇవ్వాలని రాష్టస్థ్రాయి బ్యాంకర్ల సమితి నిర్ణయించింది. వ్యవసాయ రంగానికి గత ఏడాది కన్నా 14,252 కోట్ల రూపాయలు ఎక్కువ రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మట్లాడుతూ, వామపక్ష తీవ్రవాద ప్రాబల్యం ఉన్న జిల్లాల్లో స్వయం సహాయ గ్రూపులకు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా రుణాలు ఇవ్వాలని ఆదేశించారు. కౌలు రైతులకు కూడా లక్ష రూపాయల వరకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. కౌలురైతులకు రుణాలు ఇవ్వడంలో ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లాస్థాయి బ్యాంకర్ల సమావేశాల్లో కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. సేద్యంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలకు అవసరమైన రుణాలు సమకూర్చ గలిగితేనే రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధించగలరని పేర్కొన్నారు. రైతులకు సౌరవిద్యుత్ మోటార్లను ఇవ్వాలని నిర్ణయించామని, ఒక్కో మోటార్‌కు 5.50 లక్షల వరకు ఖర్చవుతుందని, ఇందులో 50 శాతం ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుందని, మిగతా నిధుల్లో 80 శాతం వరకు బ్యాంకులు రుణంగా ఇస్తే, మిగతా మొత్తాన్ని రైతులు భరిస్తారని తెలిపారు.
యాంత్రిక సేద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, ఈ విషయంలో బ్యాంకర్లు కూడా సహకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కోరారు. రైతులందరిపేర్లతో అకౌంట్లు ప్రారంభించాలని సూచించారు.
స్వయం సహాయ గ్రూపులకు ఇస్తున్న రుణాలను వసూలుతో పాటు, పాత బకాయిలను వసూలు చేసేందుకు తాము సహకారం అందిస్తామని స్ర్తిశిశు సంక్షేమ శాఖ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. వికలాంగులకు రుణాలు ఇచ్చే సమయంలో స్టాంపుడ్యూటీ వసూలు చేయవద్దని ఆమె కోరారు.
‘మీసేవ’ పహణీలు సరిగా లేవు
మీసేవలో ఇచ్చే పహణీలు, అడంగల్‌లన్నీ పూర్తిగా సరైనవి కావని, 10 శాతం వరకు తప్పులు దొర్లుతున్నాయని, అందువల్ల బ్యాంకర్లు జాగ్రత్తగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి హెచ్చరించారు. కౌలురైతులతో పాటు అటవీభూములు, దేవాలయ భూములు సాగు చేసే రైతులకు కూడా రుణసదుపాయం కల్పించాలని కోరారు.
ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా కింద రైతులకు లభించే నిధులను రుణాల కింద జమచేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మాణిక్య వరప్రసాదరావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతి తదితరులు మాట్లాడారు.
చేపమందుపై లోకాయుక్త తీర్పు వాయిదా
హైదరాబాద్, జూన్ 4: మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది బత్తిన సోదరులు ఆస్త్మా, ఉబ్బసం తదితర రోగులకు పంపిణీ చేస్తున్న చేపమందుకి సంబంధించిన వివాదంపై వచ్చిన పిటిషన్‌ను విచారించిన లోకాయుక్త తీర్పును బుధవారానికి వాయిదా వేసింది. అంతకు ముందు మంగళవారం లోకాయుక్త ఎదుట నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ, నగర పాలక సంస్ధ కమిషనర్ కృష్ణబాబు, ఎగ్జిబిషన్ మైదానం సొసైటీ కార్యదర్శి సుఖేష్ రెడ్డి హాజరయ్యారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మాత్రమే తాము చేప ప్రసాదం పంపిణీకి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసు కమిషననర్ అనురాగ్ శర్మ లోకాయుక్తకు తెలిపారు. నగర పాలక సంస్ధ కమిషనర్ కృష్ణబాబు మాట్లాడుతూ ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఒక అంశంపై గుమిగూడినప్పుడు నగర పాలక సంస్ధ అవసరమైన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని, ఇది కర్తవ్యంలో భాగంగా చేస్తున్నామని వివరణ ఇచ్చారు. అంతకుముందు బాలల హక్కుల సంఘం అధ్యక్షులు అచ్యుతరావు వారం రోజుల క్రితం లోకాయుక్తకు పిటిషన్ ఇచ్చారు.
మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు
ఈ నెల 15, 17 తేదీల్లో నోటిఫికేషన్?
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 4: పంచాయతీ ఎన్నికలకు త్వరలోనే నగారా మోగబోతుంది. రాష్టవ్య్రాప్తంగా మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ ఎన్నికలకు సంబంధించిన షేడ్యూల్ ఈ నెల 15, 17వ తేదీల్లో విడుదల చేయనున్నట్టు సమాచారం. జనాభా ప్రాతిపదిక ఖరారు చేసిన రిజర్వేషన్ల ప్రకారం సర్పంచ్, వార్డు మెంబరు పదవులను త్వరలో ప్రకటించనున్నట్టు ఎన్నికల కమిషన్ వర్గాల సమాచారం.
నిరుద్యోగులకు హెచ్‌ఆర్ కన్సల్టెన్సీ టోకరా
రూ. 80 లక్షలు కుచ్చుటోపీ ఇద్దరు ఘరానా నేరగాళ్ల అరెస్టు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 4: నిరుద్యోగులకు విదేశాల్లో హోటల్ పరిశ్రమలో ఆకర్షణీయమైన వేతనంతో ఉపాధి ఇప్పిస్తామని చెప్పి 80 లక్షల రూపాయల వరకు వసూళ్లు చేసి కుచ్చుటోపీ పెట్టిన ఇద్దరు ఘరానా మోసగాళ్లను రాజధాని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. డిటెక్టివ్ విభాగం డిసిపి ఎల్‌కెవి రంగారావు కథనం ప్రకారం కూచిపూడి డేనియల్ ప్రవీణ్ పీటర్స్, సావేద్కర్ ప్రమోద్ అనే ఇద్దరు నిందితులు బంజారాహిల్స్‌లో రోడ్డు నెంబర్ 10లో మానవ వనరుల కనె్సల్టెన్సీ సర్వీసెస్ (హెచ్‌ఆర్)ను తెరిచి నిరుద్యోగులను వలలో వేసుకునేవారు. వీరి మాటలు నమ్మి 70 నుంచి 80 మంది నిరుద్యోగులు పది వేల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు సొమ్ము చెల్లించారు. కూచిపూడి డేనియర్ ఎంబిఏ లా గ్రాడ్యూయేట్. విదేశాల్లో కొంత కాలం ఉద్యోగం చేశాడు. కెనెడా, క్యూబా, సైప్రస్ హాంకాంగ్, మలేషియా, జార్జియాలో హోటల్ పరిశ్రమలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఇద్దరు నిందితులు పత్రికల్లో ప్రకటనలు గుప్పించారు.
ముందుగా ఈ నెల కొంత మంది బాధితులు నగర క్రైమ్ బ్రాంచికి వచ్చి కూచిపూడి, సావేద్కర్ నిందితుల మోసాలపై ఫిర్యాదు చేశారు. తమకు వీసా ఇప్పించలేదని, ఉద్యోగం రాలేదని, సొమ్ము చెల్లించి తిరుగుతున్నామని ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదుపై పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అరెస్టు చేశారు. ఇటీవల ఈ నిందితులు కొంత మందికి వీసాలు, ఎయిర్ టిక్కెట్లు ఇచ్చారు. అవన్నీ నకిలీవని తేలింది. నకిలీ ఏజెంట్లు, కనె్సల్టెన్సీల బారిన పడి మాయమాటలు నమ్మి మోసపోరాదని డిసిపి ఎల్‌కెవి రంగారావు కోరారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌పై జైలుకు పంపించారు.
ఆర్టీసి టిక్కెట్ల స్కాం ప్రధాన నిందితుడి అరెస్టు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 4: ఆర్టీసి ఆన్‌లైన్ టిక్కెట్ల విక్రయం కేసులో వెలుగుచూసిన అవకతవకల వ్యవహారంలో రాజధాని పోలీసులు కీలక నిందితుడు ఒకరిని అరెస్టు చేశారు. నిందితుడు ట్రావెల్ ఏజెంట్‌గా పనిచేశాడని, నిందితుడి పేరు హనుమంతరావు అని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఈ కేసులో నిందితుడి నుంచి 20 వేల రూపాయల నగదు, సిమ్ కార్డులు, రెండు కంప్యూటర్లను సిసిఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు ఉన్నారని, ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఆన్‌లైన్ టిక్కెట్ల స్కాం విజయనగరం జిల్లా చీపురుపల్లితో పాటు రాష్ట్రంలోని పలు కేంద్రాలకు విస్తరించిన విషయం విదితమే. నిందితులను పట్టుకునేందుకు ఆర్టీసి, పోలీసు శాఖ ఉమ్మడిగా పనిచేస్తున్నాయి.
నేడు ఎమ్సెట్
ఫలితాలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 4: ఎమ్సెట్-2013 ఫలితాలను 5వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు మాసాబ్‌ట్యాంకులోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఆడిటోరియంలో విడుదల చేస్తున్నట్టు కన్వీనర్ డాక్టర్ ఎన్ వి రమణారావు చెప్పారు. ఫలితాలను ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ విడుదల చేస్తారని ఆయన వివరించారు. ఫలితాలను వెబ్‌సైట్‌లలోనూ, ఎస్‌ఎంఎస్, ఐవిఆర్‌ఎస్ ద్వారా విద్యార్ధులు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఎస్‌ఎంఎస్ ద్వారా ఎమ్సెట్ హాల్‌టిక్కెట్ నెంబర్ టైప్ చేసి 53346కు పంపించాలని, లేదా 53345కు పంపించాలని సూచించారు. ఐవిఆర్‌ఎస్ ద్వారా బిఎస్‌ఎన్‌ఎల్ ఫోన్ నుండి 1255225కు, ఎయిర్‌టెల్ నుండి 550770కు, మిగిలిన ఆపరేటర్లు అయితే 5664477కు ఫోన్ చేయాలని సూచించారు. వాస్తవానికి ఎమ్సెట్ ఫలితాలను జూన్ 2వ తేదీన ప్రకటించాల్సి ఉండగా, జూన్ 5వ తేదీకి ఫలితాల విడుదల తేదీని వాయిదా వేశారు. 2వ తేదీన జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఉండటంతో విద్యార్ధులపై ఎలాంటి ఒత్తిడి ఉండరాదనే భావనతో ఎమ్సెట్ ఫలితాలను వాయిదా వేశామని కన్వీనర్ వెంకటరమణారావు చెప్పారు. ఎమ్సెట్ ఫలితాలను ప్రకటిస్తే దాని వల్ల విద్యార్ధులు ఉద్వేగానికి గురవుతారని, ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకునే ఫలితాల విడుదల తేదీని మార్చామని అన్నారు. 5వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు ఫలితాలను విడుదల చేస్తామని ఆయన చెప్పారు. ఇంటర్మీడియట్ పేపర్ల రీకౌంటింగ్ , రీ వెరిఫికేషన్ ప్రక్రియ తర్వాత ఇంటర్మీడియట్ బోర్డు ఇచ్చిన మార్కుల జాబితానే తాము పరిగణనలోకి తీసుకున్నామని, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ తర్వాత ఏమైనా మార్పులు ఉంటే వాటిని తర్వాత తదనుగుణంగా మార్చడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ ఏర్పాటు తథ్యం: జానా
న్యూఢిల్లీ, జూన్ 4: కాంగ్రెస్ అధినాయకత్వం 2014లోపే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందన్న విశ్వాసం తనకుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె జానారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే ప్రక్రియలో భాగంగా అతి త్వరలోనే తెలంగాణ నాయకులు మరోసారి ఢిల్లీకి వచ్చి అధినాయకత్వంతో సమావేశమవుతారని మంగళవారం ఇక్కడ చెప్పారు. వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్యతో కలిసి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులామ్ నబీ అజాద్‌తో జానా సమావేశమయ్యారు. పంచాయతీ రాజ్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించటానికి అజాద్‌తో సమావేశమైనట్లు ఆయన తెలిపారు. జూన్ 11లోపు రిజర్వేషన్లను ఖరారు చేసి ఎన్నికల సంఘానికి అందచేస్తామని జానా వెల్లడించారు. జూలై మొదటి వారంలో ఎన్నికలను పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. కాగా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను ఆజాద్‌కు వివరించినట్లు ఆయన తెలిపారు. వరంగల్ ఎంపీ రాజయ్య మాట్లాడుతూ తాను కాంగ్రెస్‌ను విడిచిపెట్టే ప్రసక్తిలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధినాయకత్వం తెలంగాణ ఇవ్వదని తానేప్పుడు చెప్పలేదని ఆయన అన్నారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇచ్చి తీరుతుందన్న నమ్మకాన్ని రాజయ్య వ్యక్తం చేశారు.
దేవాలయాల్లో టిక్కెట్ల వ్యవస్థ వద్దు

సింహాచలం, జూన్ 4: భక్తుల హరినామ స్మరణతో మారుమోగాల్సిన సింహాచల పుణ్యక్షేత్రం పరిసరాలు మంగళవారం స్వామీజీలు, పీఠాధిపతుల నినాదాలతో ప్రతిధ్వనించాయి. దేవాలయాల్లో టిక్కెట్ల వ్యవస్థనే రద్దు చేయాలని స్వామీజీలు నినదించారు. సింహాచలం దేవాలయంలో పెంచిన ఆర్జిత సేవల టిక్కెట్ల ధరలు, గోశాలల్లో గోవుల మరణాలను నిరసిస్తూ పలువురు స్వామీజీలు, పీఠాధిపతులు సింహాచల క్షేత్రం రాజగోపురం ఎదుట ఆందోళన నిర్వహించారు. సింహగిరి మాడవీధుల్లో బైఠాయించి పాలకులు, అధికారులకు వ్యతిరేకంగా నినదించారు. పెంచిన టిక్కెట్ల రేట్లు తక్షణమే తగ్గించాలని, గోవుల పరిరక్షణ బాధ్యతను దేవస్థానాలే చేపట్టాలని నినాదాలు చేశారు. స్వామీజీలు తమ శిష్యపరివారంతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు.
విశ్వ ధర్మ పరిరక్షణ వేదిక అధ్యక్షుడు, శ్రీకోటిలంగ మహాశైవ క్షేత్ర పీఠాధిపతి బ్రహ్మచారి శివస్వామి విలేఖర్లతో మాట్లాడుతూ హిందూ దేవాలయాల్లో టిక్కెట్టు వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గోమరణాల నేపథ్యంలో సింహాచలం వచ్చినప్పుడు రాజగోపురం మెట్ల మార్గంలో మద్యం సేవించిన ఒక వ్యక్తి తూలుతూ మెట్లు దిగుతున్నాడని ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తే, అతను కాంట్రాక్టు ఉద్యోగి అంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేశారన్నారు. పాలకులు వ్యవహర్తిన్న తీరు పట్ల నిరసన వ్యక్తం చేసిన ఆయన ఈ పరిణామాన్ని హిందూ ధర్మంపై ఒక పథకం ప్రకారం జరుగుతున్న దాడిగా పేర్కొన్నారు. దేవస్థానాలకు పూర్వీకులు ఇచ్చిన ఆస్తుల ద్వారా వచ్చిన ఆదాయంతోనే దేవాలయాల నిర్వహణ జరగాలని స్వామీజీ పేర్కొన్నారు. ఉత్సవాల పేరుతో కోట్లాది రపాయల అవినీతికి పాల్పడుతున్న దేవాదాయ శాఖ అధికారులు మూగజీవాలను పరిరక్షించే గోశాలలు నిర్వహించలేరా అని ప్రశ్నించారు. భక్తుల ద్వారా వచ్చిన ఆదాయంతో దేవస్థానాల అధికారులు విలాసవంతమైన జీవితాలు అనుభవిస్తున్నారని విమర్శించారు. దేవస్థానాల్లో అడుగుపెట్టిన దగ్గర నుండి టిక్కెట్ల పేరుతో దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతానంద స్వామి (ప్రకాశం జిల్లా), యోగానంద స్వామి (ఒంగోలు), విశ్వధర్మ పరిరక్షణ వేదిక కార్యదర్శి భక్త చైతన్యానంద సరస్వతి (విజయవాడ), రుద్రయ్య, అప్పస్వామి, ఆత్మానంద స్వామి (విజయవాడ), శివకల్యాణానంద భారతి (గుంటూరు), గంభీరానంద స్వామి (కర్నూలు), జ్ఞానేశ్వరానంద స్వామి, జ్ఞానేశ్వరీ మాత (రవ్వలకొండ), రంగనాధానంద స్వామి (కర్నూలు), రాజయ్య స్వామి (మెదక్) పాల్గొన్నారు. కాగా సింహాచలం దేవస్థానం ఇఓ రామచంద్రమోహన్ హామీతో దీక్ష విరమించారు.
సింహాచలం గాలిగోపురం ఎదుట నినాదాలు చేస్తున్న స్వామీజీలు
కన్యాకుమారిలో శ్రీవారి ఆలయం

తిరుపతి, జూన్ 4: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కన్యాకుమారిలో 4.50 ఎకరాల విస్తీర్ణంలో 22.50 కోట్ల రూపాయల అంచనావ్యయంతో చేపట్టనున్న శ్రీవారి దివ్యక్షేత్ర నిర్మాణానికి మంగళవారం భూమి పూజ జరిగింది. స్వామివారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా ఇటీవల ఉత్తర భారత దేశంలో కూడా టిటిడి ఆలయ నిర్మాణం చేపట్టిన విషయం పాఠకులకు తెలిసిందే. ఇందులో భాగంగానే కన్యాకుమారిలో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కన్యాకుమారిలోని వివేకానందపురంలో గల వివేకానంద కేంద్ర ప్రాంగణంలో భూమి పూజ చేశారు. గోపూజ, యంత్ర స్థాపన, వాస్తుపూజ, శాంతిసూక్త హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. భారతీయ హిందూ సనాతన, ధర్మాన్ని ప్రపంచ వ్యాప్తం చేసిన స్వామి వివేకానంద ఈ ప్రాంగణంలోనే ధ్యానం చేసినట్లు చరిత్ర చెపుతోంది. ప్రముఖ తమిళ కవి తిరువళ్లూవర్ కూడా ఇక్కడే అనేక ఆధ్యాత్మిక రచనలు చేశారు. వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు పద్మావతమ్మ ఆలయం, స్వామి పుష్కరిణి, యాగశాల, పోటు, అన్న ప్రసాద భవనం, గో సంరక్షణ శాల, వేద పాఠశాలలను నిర్మించనున్నారు. భూమి పూజ అనంతరం టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఇఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం కలిసి ఆలయ పనులు చేపడుతున్న ప్రాంతానికి శంకుస్థాపన చేశారు. బాపిరాజు మాట్లాడుతూ కళలకు, ఆధ్యాత్మికతకు నెలవైన కన్యాకుమారి దివ్యక్షేత్రంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రీవారి ఆలయం నిర్మించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాంతంలో వచ్చే ఏడాది నాటికి ఈ ఆలయ నిర్మాణం కూడా పూర్తి కానున్నదన్నారు. ఈ ప్రాంతం మరింతగా ప్రముఖ యాత్రా స్థలంగా అభివృద్ధి చెందనుందన్నారు. చారిత్రక ప్రాంతమైన కురుక్షేత్రంలో కూడా శ్రీవారి ఆలయాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ఇఒ ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కన్యాకుమారిలాంటి మరో చారిత్రక ప్రదేశంలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం జరగడం ఒక శుభపరిణామమన్నారు.
కన్యాకుమారిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి
భూమిపూజ చేస్తున్న టిటిడి చైర్మన్ బాపిరాజు, ఇఓ సుబ్రహ్మణ్యం
అధికార భాష అమలుకు నల్లగొండ పాఠాలు
నల్లగొండ, జూన్ 4: మాతృభాష తెలుగును పరిపాలన భాషగా అమలు చేయడంలో రాష్ట్రానికే ఆదర్శనీయంగా ఉన్న నల్లగొండ జిల్లా ఇతర జిల్లాల అధికార యంత్రాంగానికి అధికార భాష అమలుపై పాఠాలు నేర్పే అరుదైన ఘట్టానికి వేదిక కానుంది. తెలుగును అధికార భాషగా అమలు చేయడంలో నల్లగొండ జిల్లా సాధించిన ప్రగతి నేపథ్యంలో ఈ జిల్లా నమూనాగా ఇతర జిల్లాలకు అధికార భాష అమలుపై మార్గదర్శకం చేసేందుకు అధికార భాష సంఘం ఈ నెల 7న నల్లగొండలో అధికార భాషగా తెలుగు అమలుపై రాష్ట్ర స్థాయి శిక్షణ, అవగాహన సదస్సును నిర్వహిస్తుండడం విశేషం. ఈ శిక్షణా తరగతులకు అన్ని జిల్లాల అదనపు జాయింట్ కలెక్టర్లు, డిఆర్‌వోలు, సిఇవోలు, జిల్లా పరిషత్, డిఆర్‌డిఏ, డ్వామా, పౌరసరఫరా తదితర శాఖల అధికారులు హాజరుకానున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె.మహంతి ఆదేశాలు సైతం జారీ చేశారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ చొరవతో జరుగుతున్న ఈ శిక్షణా తరగతుల నిర్వాహణకు జిల్లా కలెక్టర్ ఎన్. ముక్తేశ్వర్‌రావు ఆదేశాలతో తెలుగు అమలు పర్యవేక్షణాధికారి అంజయ్య అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. ఈ శిక్షణా తరగతుల్లో అధికారిక ఉత్తర, ప్రత్యుత్తరాలు, దస్త్రాలు, ఉత్తర్వులను, తీర్పులను ఏ విధంగా జిల్లా యంత్రాంగం అధికార భాష తెలుగులో సాగిస్తున్నారన్న దానిపై ఇతర జిల్లా యంత్రాంగానికి అవగాహన కల్పించనున్నారు. అధికార భాష అమలులో భాగంగా జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలు వినియోగిస్తున్న తెలుగు పదకోశాలను సదస్సులో ఇతర జిల్లాల అధికారులకు వివరించి వాటి ప్రతులను అందించనున్నారు. పాలనా భాషగా తెలుగును అమలు చేయడంలో ఎదురవుతున్న ఆటంకాలను ఏ విధంగా అధిగమించి ముందుకు సాగుతున్న తీరును ఈ సదస్సులో వివరించనున్నారు. అలాగే కంప్యూటర్ ద్వారా తెలుగులో సాగించే అధికారిక ఉత్తర, ప్రత్యుత్తరాలకు సంబంధించి సైతం జిల్లా యంత్రాంగం అమలు చేస్తున్న ప్రక్రియను ఇతర జిల్లా అధికారులకు జిల్లా యంత్రాంగం ద్వారా అవగాహన కల్పించనున్నారు. కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల, పంచాయతీ కార్యాలయాల్లో అధికార భాషగా తెలుగు అమలుకు జిల్లా కలెక్టర్ ఎన్. ముక్తేశ్వర్‌రావు తీసుకున్న చొరవ నేడు రాష్ట్ర స్థాయిలో జిల్లాను గురు స్థానంలో నిలబెట్టడం జిల్లా ప్రజలకు, అధికారులకు దక్కిన విశిష్ట గౌరవంగా చెప్పవచ్చు.
అవగాహన సదస్సుకు పాలన
వినియోగ పదకోశాలను సిద్ధం చేస్తున్న తెలుగు పర్యవేక్షణాధికారి అంజయ్య
పట్టు కోసం వ్యూహం
కడప, జూన్ 4: మంత్రి వర్గం నుంచి డిఎల్ రవీంద్రారెడ్డిని బర్త్ఫ్ చేసిన తరువాత కడప జిల్లాతోపాటు ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అప్రమత్తమయ్యారు. కడప వైఎస్సార్ జిల్లాలో డిఎల్‌ను ఏకాకిని చేయడంలో ఫలితం సాధించినట్లు కనిపిస్తున్నప్పటికీ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కొందరు ఆయనకు అనుకూలంగా మాట్లాడుతుండడంతో ముఖ్యమంత్రి కనీసం కడప జిల్లాపై ఆ ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విదేశాల్లో ఉన్న రవీంద్రారెడ్డి సొంత జిల్లాకు వచ్చేలోపే పరిస్థితులను చక్కదిద్దుకుని జిల్లాపై మరింత పట్టుసాధించాలని సిఎం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులోభాగంగానే మునిసిపల్ శాఖామంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి మంగళవారం ప్రొద్దుటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చినప్పటికీ పనిలోపనిగా ముఖ్యమంత్రి అప్పగించిన పని చక్కబెట్టడానికే ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. పార్టీని నమ్ముకుని పని చేసిన పలువురు సీనియర్ నేతలు పదవులు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో డిఎల్ బర్త్ఫ్ తరువాత జిల్లాలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎప్పటికప్పుడు జిల్లాలో పరిస్థితులను తెలుసుకుంటున్నారు. అసంతృప్తివాదులతో జిల్లా ఇన్‌చార్జి మంత్రి మహీధర్‌రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే జిల్లాకు చెందిన ప్రజాప్రతినిథులు సీనియర్ నేతలతో కలసి కమలాపురం ఎమ్మెల్యే జి వీరశివారెడ్డి డిఎల్‌కు వ్యతిరేకంగా ప్రకటనలు ఇస్తూ ముఖ్యమంత్రి చర్యలను సమర్థిస్తూ ఆయనకు బాసటగా నిలిపే ప్రయత్నం చేశారు. డిఎల్ వర్గీయుల్లో ఎలాంటి ఆందోళన, నిరుత్సాహం కనిపించకపోవడం ఆయన వ్యతిరేక వర్గాన్ని విస్మయానికి గురి చేస్తోంది. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేంద్ర మంత్రులు జైపాల్‌రెడ్డి, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, మంత్రి జానారెడ్డి తదితరులు సిఎం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించడంతోపాటు డిఎల్‌కు బాసటగా నిలబడడంతో డిఎల్ వర్గీయులు పార్టీ అధిష్ఠానం తమ నాయకుడి పట్ల సానుకూలంగానే ఉందనే ధీమాతో ఉన్నారు. ఇదిలావుండగా గత కొంతకాలంగా అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న జిల్లాలోని బద్వేలు మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత డాక్టర్ శివరామకృష్ణారావు డిఎల్ బర్త్ఫ్‌ప్రై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇటీవల సిఎం జిల్లా పర్యటనలో కూడా ఆయన పట్టీపట్టనట్లుగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి మహీధర్‌రెడ్డి సోమవారం ఆయనతో మంతనాలు జరపడం ప్రాముఖ్యత సంతరించుకుంది. కడప జిల్లా పర్యటనను పురస్కరించుకొని మంత్రి మానుగుంట పోరుమామిళ్లకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జిల్లాకు నామినేటెడ్ పదవి దక్కుతుందని ప్రకటించారు. అయితే పదవి ఎవరికి అనేది తేల్చి చెప్పలేదు. అనంతరం ఆయన కడప మీదుగా ప్రొద్దుటూరుకు చేరుకొని మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ డీఎల్‌ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయడాన్ని సమర్థించడంతోపాటు సిఎంకు అనుకూలంగా మాట్లాడారు. జిల్లాకు చెందిన మంత్రి అహ్మదుల్లా, ఎమ్మెల్యే వీరశివారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తదితరులు హాజరయ్యారు. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయనేది సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది.
హైవేపై మద్యం
దుకాణాలకు తాళాలు?
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, జూన్ 4: జాతీయ రహదారులపై మద్యం దుకాణాల లైసెన్స్‌లు రెన్యువల్ చేయరాదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు నేడో, రేపో ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు సమాచారం. ఈ నెల 30 తర్వాత హైవేపై ఒక్క మద్యం దుకాణం ఉండకూడదన్న ఉత్తర్వులు జారీ చేయనున్నారు. దీంతో రాష్టవ్య్రాప్తంగా జాతీయ రహదారులపై మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. హైవేపై మద్యం దుకాణాలకు లైసెన్స్ రెన్యూవల్ చేయవద్దంటూ మంగళవారం ప్రాథమికంగా ఎక్సయిజ్ అధికారులకు సమాచారం వచ్చింది. అయితే లైసెన్స్‌డ్ దుకాణాలకు మాత్రమే తాళాలు వేస్తామంటున్న అధికారులు ఇబ్బడి ముబ్బడిగా ఏర్పాటైన బెల్టు దుకాణాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియటం లేదు. బెల్టుషాపుల విషయంలో అధికారులు ఏమీ చెప్పలేకపోతున్నారు. ప్రతీ 50 కిలోమీటర్లకు నాలుగు ఎక్సయిజ్ టాస్క్ఫోర్సు బృందాలు దాబాలన్నింటినీ తనిఖీ చేస్తూనే ఉంటాయని తెలుస్తోంది. 2012 జూన్‌లో జరిగిన వేలం పాటల్లో హైవే మద్యం దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు ఇప్పుడు ఏం చేయాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు. రెండేళ్లు వ్యాపారం చేసుకోవచ్చునంటూ అబ్కారీశాఖ ముందుగా ప్రకటించడంతోనే లక్షలాది రూపాయలు లైసెన్సు ఫీజులు ప్రభుత్వానికి చెల్లించేందుకు సిద్ధపడ్డామని, మొదటి ఏడాదిలో లాభనష్టాలు సరికాకపోయినా, నష్టాలతో నడుపుతూ రెండో ఏడాది ఆ నష్టాలను పూరించుకోవచ్చునన్న ఆలోచనతోనే ఎంఆర్‌పి అమలు చేశామని కొంతమంది మద్యం వ్యాపారులు బహిరంగంగా అధికారులను నిలదీస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వ ఉత్తర్వులు విడుదలైతే శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం నుంచి పైడిబీమవరం వరకూ 172 కిలోమీటర్ల మేర 16వ నెంబరు జాతీయ రహదారి పక్కన గల 27 మద్యం దుకాణాలకు తాళాలు వేయాల్సిందే!
మల్లన్న హుండీ
లెక్కింపులో చేతివాటం
శ్రీశైలం, జూన్ 4: కర్నూలు జిల్లా శ్రీశైలం మల్లన్న సన్నిధిలో మంగళవారం నిర్వహించిన హుండీ లెక్కింపు సందర్భంగా దేవస్థానంలో స్వీపర్‌గా పని చేస్తున్న ఏసుదాసు అనే ఉద్యోగి చేతివాటం ప్రదర్శించి సిసి కెమేరాకు దొరికిపోయాడు. దీనికి సంబంధించిన వివరాలిలావున్నాయి. మంగళవారం శ్రీశైలం దేవస్థాన కల్యాణ మండపంలో భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవస్థానాల్లోని హుండీల లెక్కింపు చేపట్టారు. ఈ సందర్భంగా ఏసుదాసు అనే స్వీపర్ హస్తలాఘవంతో మూడు వెయ్యి రూపాయల నోట్లు, రెండు ఐదు వందల నోట్లు తస్కరించాడు. వాటిని మడిచి నోటి నాలుక కింద దాచేశాడు. ఆలయ సిబ్బంది సిసి కెమేరాల ఫుటేజీలో ఈ విషయాన్ని కనుగొన్నారు. వెంటనే ఇవో చంద్రశేఖర్ ఆజాద్‌కు తెలిపారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒన్‌టూన్ ఎస్సై ఆధ్వర్యంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలావుండగా 31 రోజులకు సంబంధించిన జరిగిన లెక్కింపులో 1. 23 కోట్ల రూపాయల నగదు ఆదాయం లభించింది.
ముదురుతున్న
రైవాడ వివాదం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూన్ 4: విశాఖ జిల్లాలో తాగునీరు, సాగునీరుకు వివాదం ముదురుతోంది. రైవాడ జలాశయం నుంచి విశాఖ ప్రజల తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేస్తూ వస్తున్నారు. అయితే 2004 సంవత్సరంలో ఈ నీటిని కేవలం రైవాడ ఆయకట్టుకు మాత్రమే వినియోగించాలని, విశాఖ ప్రజల తాగునీటి అవసరాల కోసం గోదావరి జలాలను మాత్రమే ఉపాయోగించుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ జిఓను ఇప్పటి వరకూ అమల్లోకి తీసుకురాలేదు. టిడిపి ఈ విషయమై ఉద్యమించడానికి సిద్ధపడుతోంది. విశాఖ జిల్లాలో రైవాడ జలాశయం కింద పాత ఆయకట్టు 15,337 ఎకరాలు ఉండగా, కొత్త ఆయకట్టు సుమారు ఆరు వేల ఎకరాల వరకూ ఉంది. ఏటా రబీకి ఈ జలాశయం నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తుంటారు. గత ఏడాది పరిస్థితి అనుకూలించకపోవడంతో ఇక్కడ రైతులు జలాశయంలో నీటిని వాడుకోకుండా పొదుపు చేశారు. ఇదే జలాశయం నుంచి 27 ఎంజిడి నీటిని విశాఖ ప్రజల తాగునీటి అవసరాల కోసం విడుదల చేస్తున్నారు. దీనివలన రైవాడ రిజర్వాయర్ ఆయకట్టు కింద ఉన్న రైతులు ఇబ్బందిపడుతున్నారని, అందువలన రైవాడ నీటిని కేవలం సాగుకు మాత్రమే వినియోగించాలంటూ 2002లో అప్పటి కాంగ్రెస్ నేత కొణతాల రామకృష్ణ భారీ ఉద్యమం చేశారు. అప్పట్లో మంత్రిగా ఉన్న అయ్యన్నపాత్రుడు రైవాడ నీటిని సాగు కోసం వినియోగించేలా, ప్రజల తాగునీటి కోసం గోదావరి జలాలను రప్పించేందుకు ప్రభుత్వం నుంచి సుమారు 250 కోట్ల రూపాయలు విడుదల చేశారు. స్టీల్ ప్లాంట్ కూడా కొంత మొత్తాన్ని వెచ్చింది గోదావరి జలాలను విశాఖకు తీసుకువచ్చారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, కొణతాల రామకృష్ణ మంత్రి అయ్యారు. ఆయన పలుకుబడి ఉపయోగించి, రైవాడ నీటిని సాగునీటికి, గోదావరి జలాలను విశాఖ ప్రజల తాగునీటి అవసరాలకు ఉపయోగించేలా జిఓ కూడా తీసుకువచ్చారు. అప్పటి నుంచి ఈ జిఓను అమలు చేయడం లేదు.
విస్తరించిన రుతుపవనాలు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూన్ 4: నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించిన 24 గంటల్లోనే తెలంగాణ, దక్షిణ కోస్తా జిల్లాల్లో విస్తరించాయి. దీని ప్రభావం వలన ఈ ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల్లో ఈ రుతుపవనాలు ఉత్తర కోస్తాను తాకుతాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం మంగళవారం రాత్రి తెలియచేసింది. ఇదిలా ఉండగా ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ కోస్తా మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ భూతల ద్రోణి కొనసాగుతోంది. కాగా, రాష్ట్రంలోని ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.
గోదావరి జిల్లాల్లో...
ఏలూరు: ఉభయగోదావరి జిల్లాలను రుతుపవనాలు పలకరించాయి. ఊహించినదానికంటే ముందుగా రాష్ట్రాన్ని తాకిన రుతుపవనాలు మంగళవారం గోదావరి జిల్లాలను భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాల రూపంలో పలకరించాయి. మంగళవారం మధ్యాహ్నం వరకు 39 నుండి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదై అల్లాడిన ప్రజలు సాయంత్రానికి భారీ వర్షంతో సేదదీరారు. రాజమండ్రి, కడియపులంక, రామచంద్రపురం, కొవ్వూరు, భీమవరం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడటం, ఫ్లెక్సీలు, హోర్డింగులు ధ్వంసం కావడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి.
మావోలకు రిమాండ్
కొత్తగూడెం, జూన్ 4: ఖమ్మం జిల్లా పాల్వంచలో సోమవారం సినీపక్కీలో పట్టుబడ్డ ముగ్గురిలో ఇద్దరిని పోలీసులు మంగళవారం రిమాండ్‌కు తరలించారు. కొత్తగూడెం ఓఎస్‌డి కార్యాలయంలో ఓఎస్‌డి టి శ్రీనివాసరావు మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ పట్టుబడ్డ వారిలో ఇద్దరు మావోయిస్టులుగా నిర్థారణ అయిందని తెలిపారు. వారిలో ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న చంద్రన్న భార్య మోతీబాయి అలియాస్ రాధక్క ఉరఫ్ మాధవి కాగా మరొకరు సుఖ్‌దేవ్‌దళంలో సభ్యునిగా పనిచేస్తున్న అంకాల పృథ్వీగా తెలిపారు. మూడవ వ్యక్తి అంకాల ధర్మరాజుకు మావోయిస్టులతో ఎలాంటి సంబంధంలేదని కారుడ్రైవర్ మాత్రమేనని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాధవి 1985లో మావోయిస్టుపార్టీ పట్ల ఆకర్షించబడి గత 28సంవత్సరాలుగా పార్టీలో వివిధ స్థాయిల్లో పనిచేసిందని తెలిపారు. సిర్పూర్ దళంలో సభ్యురాలిగా, చెన్నూరు దళకమాండర్‌గా, ఇంద్రవెల్లి దళంలో సభ్యురాలిగా పనిచేస్తూ 1993లో చంద్రన్నను వివాహం చేసుకుందని తెలిపారు. తదనంతరం మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల సరిహద్దులోని దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీకి మారి సౌత్, వెస్ట్ బస్తర్ డివిజన్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తోందని తెలిపారు. 10 హత్యలు, 20 దహనాలు, 15 పోలీసులతో ఎదురుకాల్పుల ఘటనలలో ఈమె పాల్గొంది. పృథ్వీ చిన్నాన్న 1998లో వైజాగ్ ఎన్‌కౌంటర్‌లో మరణించాడని, పెద్దవాడయ్యాక పృథ్వీ 2011లో యూనివర్సిటీ ఆఫ్ హైద్రాబాద్‌లో పిజి చదువుతుండగా ఉదయభాను అనే పిజి స్టూడెంట్‌తో పరిచయం ఏర్పడి ఆయన ఆదేశం మేరకు ఖమ్మం జిల్లాకు చెందిన మోరె రవితో కలిసి సుఖ్‌దేవ్ దళంలో చేరి దళంలో సభ్యునిగా పనిచేస్తున్నట్లు చెప్పారు. పార్టీ పనిమీద మాధవితో కలిసి కారులో విజయవాడ వెళ్తూ పాల్వంచ వద్ద తనిఖీలో చిక్కాడని తెలిపారు. కారులో నక్సల్స్ సాహిత్యంతో పాటు 75 వేల రూపాయల నగదు లభ్యమైనట్లు వివరించారు.
ఆలయ భద్రతపై దృష్టి
* అనంతపురం రేంజి డిఐజి బాలకృష్ణ
తిరుపతి, జూన్ 4: తిరుమల శ్రీవారి ఆలయ భద్రతకు సంబంధించి టిటిడిలోని అన్ని విభాగాలను భాగస్వాములను చేస్తూ ఒక కమాండింగ్ విధానాన్ని తీసుకొస్తామని అనంతపురం రేంజ్ డిఐజి బాలకృష్ణ అన్నారు. మంగళవారం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆయన తిరుపతి అర్బన్ ఎస్పీ కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గతంకన్నా తిరుమల శ్రీవారి ఆలయ భద్రత ఎంతో మెరుగ్గా ఉందన్నారు. తిరుమల ఔటర్ కారిడార్, ఇన్నర్ కారిడార్‌లను ఏర్పాటు ఎంతో ఉపయోగంగా ఉందన్నారు. ఈకారిడార్‌ల కారణంగా అసాంఘిక శక్తులు తిరుమలలోకి ప్రవేశించే అవకాశమే లేదన్నారు. పోలీసులు, టిటిడి సెక్యూరిటీ మధ్య సమన్వయం చేయనున్నట్లు తెలిపారు.
సామాన్య భక్తులకు
డ్రస్‌కోడ్ వద్దు: యనమల
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, జూలై 4: ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి గంటల తరబడి క్యూల్లో నిల్చుని ఉన్న సామాన్య భక్తులకు కూడా టిటిడి డ్రెస్‌కోడ్ విధించడం సబబు కాదని వారికి మినహాయింపు ఇవ్వాలని టిడిపి ఎమ్మెల్సీ, పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. శ్రీవారి దర్శనార్ధం మంగళవారం తిరుమలకు వచ్చిన ఆయన ఆలయ ఎదుట తనను కలిసిన విలేఖరులతో మాట్లాడారు. డ్రెస్ కోడ్ పెట్టడం మంచిదే అయినా అది ఆర్జిత సేవల్లో పాల్గొనే గృహాస్థులకు పరిమితం చెయ్యాలన్నారు. అంతే తప్ప ఉచిత క్యూలైన్లలో వెళ్లే సామాన్య భక్తులకు నిబంధలను పెట్టరాదన్నారు. తమిళనాడు రాష్ట్రంలో కూడా కొన్ని ఆలయాల్లో చొక్కా తీయ్యాలని చెపుతారే తప్ప పూర్తిగా డ్రెస్‌నే మార్చుకోవాలని చెప్పరన్నారు. విజయసాయిరెడ్డి తన మనువడికి ఆలయంలో అన్నప్రాసన చేయడంపై విమర్శలు వచ్చినా టిటిడి స్పందించకపోవడం సరికాదన్నారు. ఆగమాలు, శాస్త్రాలు ఆలయంలో ఎవరైనా అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు.
నమ్మకద్రోహులు వెళ్లిపోయారు
* వివేక్, కెకెపై ఎమ్మెల్యే ఆనం నిప్పులు
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, జూన్ 4: వార్డు కౌన్సిలరుగా కూడా గెలిసే సత్తాలేని వ్యక్తులను కూడా కాంగ్రెస్ పార్టీ అక్కున చేర్చుకుని అందలం ఎక్కించిందని, అయితే ఆ విశ్వాసం లేని వారు పార్టీని వీడటంతో పార్టీకి పట్టిన శని వదిలిందని నెల్లూరు కాంగ్రెస్ శాసన సభ్యుడు ఆనం వివేకానందరెడ్డి అన్నారు. మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న ఆయన తనను కలిసిన విలేఖరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని వదిలి టిఆర్‌ఎస్‌లో చేరిన కెకె, మంద, వివేక్‌ల పేర్లు చెప్పకుండా వారిపై విమర్శలతో విరుచుకుపడ్డారు. పంచాయతీ వార్డు ఎన్నికల్లో కూడా గెలవలేని ఒక వ్యక్తికి ఎమ్మెల్సీ, ఎంపి, పిసిసి అధ్యక్ష పదవిని, ఇతర రాష్ట్రాల ఇన్‌చార్జిల పదవులను కూడా కాంగ్రెస్ అధిష్ఠానం అప్పగించి గౌరవించిందన్నారు. అంతేకాకుండా ఆయన కుమారుడు హత్యకేసుకు సంబంధించి కాంగ్రెస్‌పార్టీ ఆ ఎంపిని ఆదుకున్నదన్నారు. అలాంటి వారు విశ్వాసం లేకుండా తమ స్వార్ధ ప్రయోజనాలకోసం పార్టీని వీడి అధిష్ఠానాన్ని దూషించడం వారి నీచరాజకీయాలకు అద్దం పడుతోందన్నారు.
నెల రోజుల్లో తెలంగాణపై
సానుకూల ప్రకటన: దుద్దిళ్ల
ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, జూన్ 4: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం నెల రోజుల్లోగా సానుకూల ప్రకటన చేయబోతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ్ధర్ బాబు మంగళవారం కరీంనగర్‌లో వెల్లడించారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన సందర్భంగా తనను కలిసిన విలేఖరులతో మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, నెల రోజుల్లోగా ఈ అంశం తేల్చేస్తామంటూ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ చేసిన ప్రకటన వాస్తవమేనని, ఈ ప్రక్రియ వేగవంతమైందని అన్నారు. రాజకీయంగా లబ్ధిపొందడం కోసమే టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కెటిఆర్ అనవసర విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కూడా వారికంటే ఎక్కువ విమర్శలు చేయగలమని, పెట్టుబడిదారులతో ఆ పార్టీ నాయకులకున్న సంబంధాలు, ఒప్పందాలు ఏమిటో తమకు తెలుసని అన్నారు. తన గెలుపోటములు టిఆర్‌ఎస్ పార్టీనో మరో పార్టీనో నిర్ణయించలేదని, ప్రజలే అంతిమ నిర్ణేతలని ఆయన అన్నారు.
రక్షణ రంగంలో మరింత సహకారం

మెల్‌బోర్న్, జూన్ 5: సముద్ర జలాల్లో చైనా బలప్రదర్శనల నేపథ్యంలో, ఆసియా పసిఫిక్, హిందూ మహాసముద్ర ప్రాంతంలో అభివృద్ధి దృష్ట్యా ఇరు దేశాల రక్షణ ఒప్పందాలను మరింత పటిష్టం చేసుకోవాలని భారత్-ఆస్ట్రేలియాలు నిర్ణయించాయి. చారిత్రాత్మక పర్యటన చేస్తున్న భారత రక్షణ శాఖ మంత్రి ఎకె ఆంటోనీ బుధవారం ఆస్ట్రేలియా రక్షణ శాఖ మంత్రి స్టిఫెన్ స్మిత్‌ను కాన్‌బెర్రాలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా సముద్ర జలాల భద్రతతోపాటు రక్షణ ఒప్పందాలు, వ్యూహాత్మక భద్రతా ప్రయోజనాలపై విస్తృతస్థాయి చర్చలు జరిపారు. ఇరువురు నేతలు ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతపై ఆందోళనలు, అభిప్రాయలను పంచుకున్నారని, ఇరు దేశాల రక్షణ శాఖల మధ్య పరస్పర సహకారం పెంపొందించుకోవాలని నిర్ణయించారని ఆంటోని, స్మిత్ చర్చల అనంతరం ఆస్ట్రేలియా రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఓ అధికారిక ప్రకటన తెలియజేసింది. కాగా, ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న తొలి భారతీయ రక్షణ మంత్రిగా చరిత్ర సృష్టించిన ఆంటోనీ మంగళవారం పెర్త్‌లో ఆ దేశ రక్షణ మంత్రి స్మిత్‌ను కొంతసేపు కలుసుకోగా, అనంతరం చర్చల నిమిత్తం ఇరువురు కాన్‌బెర్రాకు చేరుకున్నారు. ఇదిలావుంటే తూర్పు, దక్షిణ చైనా సముద్రాల్లో జపాన్ తదితర పొరుగు దేశాలతో నెలకొన్న సముద్ర జలాల వివాదం నేపథ్యంలో ఇటీవలికాలంలో చైనా బలప్రదర్శనకు దిగుతుండటంపైనా భారత్, ఆస్ట్రేలియాలు దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే ఇరు దేశాల నావికాదళాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ప్రస్తుత ద్వైపాక్షిక నావికా సంబంధాలను కొనసాగించాలని నిర్ణయించాయి. అలాగే 2015లో జరిగే ఇరుదేశాల ద్వైపాక్షిక తీరప్రాంత విన్యాసాల కోసం కలిసి పనిచేయాలనుకున్నాయి. కాగా, ఆసియా పసిఫిక్, హిందూ మహా సముద్ర ప్రాంతాల అభివృద్ధికి స్వేచ్ఛా వాణిజ్యం, సముద్ర జలాల రవాణా భద్రత కీలకమని ఈ సందర్భంగా ఇరు దేశాలు గుర్తించాయి.
కాన్‌బెర్రాలో బుధవారం జరిగిన సమావేశంలో భారత రక్షణ మంత్రి ఆంటోనీ,
ఆస్ట్రేలియా ప్రధాని జూలియా గిల్లార్డ్, ఆ దేశ రక్షణ మంత్రి స్టీఫెన్ స్మిత్
సవాళ్లను సమష్టిగా ఎదుర్కొందాం

ఇస్లామాబాద్, జూన్ 5: దేశం ఎదుర్కొంటున్న ఎన్నో సవాళ్లను సమష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరముందని పాకిస్తాన్‌లోని రాజకీయ పార్టీలకు కొత్త ప్రధాని నవాజ్ షరీఫ్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాజకీయ, ఆర్థిక సంక్షోభాలు దేశాన్ని పట్టిపీడిస్తున్నాయని, వీటన్నింటినీ అధిగమించి ప్రగతి బాటలో ప్రయనించేందుకు అందరి సహకారం అవసరమని ఆయన పేర్కొన్నారు. దేశం ముందున్న ఎన్నో సమస్యలను కేవలం ఒక్క రాజకీయ పార్టీ పరిష్కరించడం అసాధ్యమని, అందరూ కలిసికట్టుగా ఒకే గొడుగు కింద పనిచేస్తే తప్ప వాటిని అధిగమించడం కష్టమని పేర్కొన్నారు. పాకిస్తాన్ ప్రధానిగా భారీ మెజారిటీతో మూడోసారి పిఎంఎల్-ఎన్ అధినేత నవాజ్ షరీఫ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జాతీయ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి అన్ని రాజకీయ పార్టీలతో తాను సంప్రదిస్తానని, ముఖాముఖి చర్చలు, అభిప్రాయాలను పంచుకోవడంద్వారా వాటిని అధిగమించవచ్చునని తెలిపారు. సమస్యలనుంచి దేశాన్ని బయటపడేందుకు సమష్టిగా ఉమ్మడి ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. కీలక సమస్యల తక్షణ పరిష్కారానికి తాను, తన పార్టీ సీనియర్ నాయకులు కార్యాచరణ ప్రణాళికను రూపొందించామని, ఆ ప్రణాళికను, ప్రభుత్వం తీసుకొనబోయే చర్యలను త్వరలో ప్రజలకు వివరిస్తామని ఆయన వెల్లడించారు. ఈ క్రమంలో అద్భుతాలేవో జరుగుతాయని ప్రజలు ఆశించవద్దని ఆయన హెచ్చరించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, స్వర్గాన్ని మీముందు ఆవిష్కరిస్తానని ఆశపడవద్దని సూచించారు. నేను విశ్రాంతి కూర్చోనని, అలాగే ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా విశ్రాంతి తీసుకోనివ్వనని షరీఫ్ స్పష్టం చేశారు. అయితే, విదేశాంగ విధానాలు, భారత్‌తో సంబంధాలు వంటి అంశాలు షరీఫ్ ప్రసంగంలో చోటుచేసుకోలేదు. కానీ, పాక్ గిరిజన ప్రాంతాల్లో అమెరికా చేపడుతున్న డ్రోన్ దాడులను తక్షణం నిలిపివేయాలని అన్నారు.
భారీ మెజారిటీతో ఎన్నిక
పాకిస్తాన్ ప్రధానిగా నవాజ్ షరీఫ్ మూడోసారి భారీ మెజారిటీతో ఎన్నికై రికార్డు సృష్టించారు. 342మంది సభ్యులున్న జాతీయ అసెంబ్లీలో 244 ఓట్ల మెజారిటీని సాధించి షరీఫ్ విజయకేతనం ఎగురవేశారు. గురువారం ప్రధాని ఎన్నిక నామమాత్రంగా జరిగింది. ప్రధాని పదవికి పోటీపడిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందిన మఖ్దూమ్ అమీన్ ఫాహిమ్‌కు 42 ఓట్లు వచ్చాయి. ఇమ్రాన్‌ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రిక్-ఎ-ఇన్సాఫ్ తరపున పోటీచేసిన జావెద్ హాష్మికి 31 ఓట్లు వచ్చాయి. ఎన్నికల అనంతరం ఫలితాలను స్పీకర్ అయాజ్ సాదిక్ ప్రకటించారు. పదమూడేళ్ల విరామం తర్వాత పిఎంఎల్-ఎన్ అధినేత నవాజ్ షరీఫ్ ప్రధానమంత్రి హోదాలో జాతీయ అసెంబ్లీలో అడుగుపెట్టడం విశేషం.
ప్రాంతీయ పార్టీలదే హవా

కోల్‌కతా, జూన్ 5: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జోస్యం చెప్పారు. అయితే కేంద్రంలో కాంగ్రెస్, బిజెపియేతర కూటమికి తృణమూల్ నాయకత్వం వహిస్తుందా? అన్న ప్రశ్నను ఆమె తోసిపుచ్చారు. బుధవారం ఇక్కడ ఆమె విలేఖరులతో మాట్లాడారు. ‘వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు సత్తా చాటుతాయని నాకు అనిపిస్తోంది. ఒకవేళ అలా జరిగితే చాలా సంతోషం’ అని ఈ సందర్భంగా ఆమె అన్నారు. దీంతో లోక్‌సభ ఎన్నికల తర్వాత ఒకవేళ జాతీయ స్థాయిలో వచ్చే కాంగ్రెస్, బిజెపియేతర కూటమికి మీరు నాయకత్వం వహించేందుకు సిద్ధమా? అని విలేఖరులు ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ‘నేను ఏ పదవినీ ఆశించడం లేదు. ఓ కార్యకర్తగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాను. నాయకత్వం వహించేందుకు ఎవరు ముందుకొచ్చినా నాకు అభ్యంతరం లేదు’ అని చెప్పారు. ‘నేను అధికారం కోసం పోరాటం చేయను. ప్రజల ప్రయోజనాల కోసం మాత్రమే పోరాడుతాను. ప్రజా ప్రయోజనార్థమే మేము యుపిఎ-2 ప్రభుత్వం నుంచి బయటకు వచ్చాం’ అని గుర్తుచేశారు. కాగా, బొగ్గు, ఎరువులు, ఇతర వస్తువుల ధరల పెంపుపై మన్మోహన్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు.
ధరల పెంపు ప్రజలపై ప్రభావం చూపుతోందన్న ఆమె ఆ ప్రభావం కారణంగానే తాజా ఉప ఎన్నికలలో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం ఎదురైందన్నారు.
‘మాజీ’లకు ఆ హక్కు లేదు
‘వై,’ ‘జడ్’ సెక్యూరిటీపై సుప్రీం కోర్టు స్పష్టీకరణ
న్యూఢిల్లీ, జూన్ 5: కేవలం మాజీ మంత్రి అయినంత మాత్రాన తనకు వై లేదా జడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించాలని కోరే హక్కు ఏ వ్యక్తికీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన బిఎస్పీ నాయకుడొకరు దాఖలు చేసుకున్న అభ్యర్థనను విచారణకు స్వీకరించడానికి నిరాకరించిన సందర్భంగా సుప్రీంకోర్టు ఈ విషయం స్పష్టం చేసింది. ‘వాస్తవానికి నిబంధనల ప్రకారం మీరు భద్రత కల్పించడానికి అర్హులు కాని పక్షంలో మీకు భద్రత కల్పించబడదు. ప్రభుత్వ ఖర్చుతో మీకు రక్షణ కల్పించడానికి వీల్లేదు’ అని న్యాయమూర్తులు జ్ఞానసుధా మిశ్రా, మదన్ బి లోకుర్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. మాయావతి ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన రామ్‌వీర్ ఉపాధ్యాయ్‌కు ఉన్న వై కేటగిరీ సెక్యూరిటీని సమాజ్‌వాది పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుదించింది. అయితే తనకు వై సెక్యూరిటీని పునరుద్ధరించమని ఆదేశించాలని కోరుతూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. అలహాబాద్ హైకోర్టు తన పిటిషన్‌పై ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయకుండా తీర్పును రిజర్వ్ ఉంచడాన్ని సవాలు చేస్తూ ఈ బిఎస్పీ నాయకుడు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసారు. ఈ పిటిషన్ విచారణ జరపడానికి అర్హమైంది కాదని బెంచ్ పేర్కొంటూ, హైకోర్టు నిర్ణయం వెలువడకముందే పిటిషనర్ సుప్రీం కోర్టును ఆశ్రయించడం సరికాదని కూడా పేర్కొంది. ఒకవేళ తన ప్రాణానికి ఏదయినా ముప్పు ఉందని పిటిషనర్ భావిస్తున్నట్లయితే ఆయన తన సొంత ఖర్చుతో ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలని కూడా బెంచ్ స్పష్టం చేసింది. అయితే మధ్యంతర సెక్యూరిటీ కోసం పిటిషనర్ హైకోర్టు డివిజన్ బెంచ్‌ని ఆశ్రయించవచ్చని, హైకోర్టు ప్రాణానికి ముప్పు అంశాన్ని పరిశీలించే కమిటీ నివేదిక ఆధారంగా ఆయన అభ్యర్థనను పరిశీలించవచ్చని బెంచ్ స్పష్టం చేసింది. అయితే ప్రాణానికి ముప్పు అంటే ఏమిటో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు చెందిన అధికారులు, ఇంటెలిజన్స్ బ్యూరో లేదా సంబంధిత అధికారులు నిర్ణయిస్తారని స్పష్టం చేసింది. ప్రాథమికంగా వై లేదా జడ్ కేటగిరీ భద్రత కల్పించడం కోసం బిఎస్పీ నేత చేసిన వాదనలతో తాము సంతృప్తి చెందడం లేదని కూడా న్యాయమూర్తులు స్పష్టం చేసారు. ‘మా అనుభవంలో ప్రాణానికి ఎంత తీవ్రమైన ముప్పు ఉన్నప్పటికీ సామాన్య ప్రజలకు వై లేదా జడ్ సెక్యూరిటీని కల్పించడం ఎక్కడా చూడలేదు’ అని కూడా న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. మాజీ ఎంపి లేదా ఎమ్మెల్యేగా ఉంటూ కూడా మీరు జీవితం పొడవునా భద్రత ఉండాలని కోరడం వింతగా ఉందని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
సమైక్య సూత్రానికే విరుద్ధం
ఎన్‌సిటిసిని వ్యతిరేకించిన గుజరాత్, బీహార్, త్రిపుర, చత్త్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు
న్యూఢిల్లీ, జూన్ 5: నేషనల్ కౌంటర్ టెర్రరిజమ్ సెంటర్ (ఎన్‌సిటిసి)ను ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై యుపియేతర రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు మరోసారి తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదన రాజ్యాంగం ప్రవచిస్తున్న సమైక్య సూత్రాలకే విరుద్ధమైనదని దేశ అంతర్గత భద్రతపై బుధవారం న్యూఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సదస్సులో వారు స్పష్టం చేశారు. దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో నక్సలిజం కూడా ఒకటని ప్రతిపక్ష పార్టీలకు చెందిన చాలా మంది ముఖ్యమంత్రులు పేర్కొన్నారు.
ఎన్‌సిటిసి ఏర్పాటు విషయమై ఇంతకుముందు కొన్ని రాష్ట్రాలు వ్యక్తం చేసిన ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని భావించానని, అయితే ఈ ఆందోళనలకు ప్రభుత్వం తన కొత్త ముసాయిదాలో కూడా ఎలాంటి పరిష్కారాలు చూపలేదని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఎన్‌సిటిసి స్వరూపం, దాని పనితీరు రాజ్యాంగం ప్రవచిస్తున్న సమైక్య సూత్రాలకే విరుద్ధంగా ఉందని, ఈ ముసాయిదాపై తమకు తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయని ఆయన చెప్పారు.
ఎన్‌సిటిసి స్వరూపం, అధికారాలు, దాని పనితీరుపై గత ఏడాది తాను తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశానని, వీటిలో చాలావాటికి కొత్త ముసాయిదాలో కూడా పరిష్కారం చూపలేదని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేర్కొన్నారు.
సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు కేంద్ర, రాష్ట్రాల మధ్య సమర్థవంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్న వాదనను అభినందిస్తున్నానని, అయితే ఎన్‌సిటిసి ఏర్పాటు విషయంలో కేంద్ర హోం శాఖ అనుసరిస్తున్న తీరును మాత్రం వ్యతిరేకిస్తున్నానని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ అన్నారు.
అయితే దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో నక్సలిజం కూడా ఒకటని ఈ సమావేశంలో చాలా మంది ముఖ్యమంత్రులు అంగీకరించారు. దేశాన్ని పీడిస్తున్న వామపక్ష తీవ్రవాద సమస్యను తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని తామంతా అంగీకరిస్తున్నామని, ఇటీవల చోటుచేసుకున్న ఘటనలతో ఈ సమస్య మరింత ప్రముఖంగా తెరమీదకు వచ్చిందని నితీష్ కుమార్ పేర్కొన్నారు.
దేశ అంతర్గత భద్రతకు నక్సలిజం పెనుముప్పుగా పరిణమించిందని చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ అన్నారు. ఇది కేవలం చత్తీస్‌గఢ్ మాత్రమే ఎదుర్కొంటున్న సమస్య కాదని, అనేక రాష్ట్రాలు ఈ సమస్యతో అల్లాడుతున్నాయని, ఈ సమస్యను పరిష్కరించేందుకు దేశ వ్యాప్తంగా ఒకే విధమైన బలమైన విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు.
‘వైకాపాతో ఆజాద్ కుమ్మక్కు’
హైదరాబాద్, జూన్ 5: కేంద్ర మంత్రి, తమ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ గులాంనబీ ఆజాద్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కైయ్యారని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్సీ యాదవ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ అంశాన్ని ఈ నెలలో తేల్చేస్తామని చెప్పిన ఆజాద్ మర్నాడే మాట మార్చి చాలా సమయం పడుతుందని, ఏకాభిప్రాయం రావాలని అన్నారని ఆయన బుధవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఆజాద్‌పై వెంటనే చర్య తీసుకోవాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. సీమాంధ్ర నాయకులతో ఆజాద్ కుమ్మక్కై మాట్లాడుతున్నారని, ఇలాగైతే పార్టీ మారే విషయాన్ని ఆలోచిస్తామని హెచ్చరించారు.
కళంకిత మంత్రులను తప్పించాలి: శంకర్ రావు
ఈ నెల 10 నుంచి రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభంకానున్నందున, ఈ లోగానే కళంకిత మంత్రులను తప్పించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే శంకర్‌రావు కిరణ్‌ని డిమాండ్ చేశారు. కిరణ్ ఎర్రచందనం కుంభకోణంపై సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయనున్నట్లు తెలిపారు.
17 వరకు విజయసాయిరెడ్డి రిమాండ్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 5: జగన్ అక్రమాస్తుల కేసుల్లో నిందితుడుగా ఉన్న ఆడిటర్ విజయసాయిరెడ్డికి ఈ నెల 17వ తేదీ వరకు సిబిఐ కోర్టు రిమాండ్‌కు ఆదేశించింది. బుధవారం సిబిఐ కోర్టులో ఆయన లొంగిపోగా, ప్రత్యేక ఖైదీగా గుర్తించాలన్న ఆయన అభ్యర్థనను కోర్టు గురువారానికి వాయిదా వేసింది. మరోవైపు జగన్‌కు చెందిన మరో కేసులో మాజీ మంత్రి మోపిదేవికి బెయిల్ ఇవ్వొద్దని సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. వాన్‌పిక్ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతున్నందున ఈ దశలో బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావితం చేసే ప్రమాదం ఉందని కోర్టుకు సిబిఐ తెలిపింది. కాగా, బెయిల్ కుంభకోణం సంబంధించి గాలి జనార్దన్‌రెడ్డిని బుధవారం ఎసిబి కోర్టులో పోలీసులు హజరుపరిచారు. విచారణ అనంతరం తిరిగి చంచల్‌గూడకు తరలించారు.
స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి: బాబు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 5: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మెజార్టీ స్థానాలు గెలుచుకునే విధంగా కృషి చేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఆదిలాబాద్, సిద్ధిపేట, పెద్దపల్లి, నిజామాబాద్, కరీంనగర్ తదితర పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్‌చార్జీలతో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ నేతలు కష్టపడాలన్నారు. కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో యువ త, మహిళలు, బిసిలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామన్నారు.
రూ.5 లక్షల విరాళం
ఎంఆర్‌ఓపియస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండి ఎం రామకృష్ణప్రసాద్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్‌కు ఐదు లక్షల రూపాయల విరాళం ఇచ్చారు. ఈ చెక్‌ను హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా అందచేశారు.
పిడుగుపడి భార్యాభర్తలు మృతి
మహబూబ్‌నగర్, జూన్ 5: మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం బుద్దారం గ్రామపంచాయితీ పరిధిలోని కారంతండా సమీపంలో బుధవారం రాత్రి పది గంటల సమయంలో పిడుగుపడి భార్యా,్భర్తలు మృతి చెందారు. వ్యవసాయ పొలం దగ్గర నిద్రిస్తున్న సమయంలో రాత్రి భారీ ఈదురుగాలులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తూ పిడుగుపడింది. దాంతో గుడిసెలో నిద్రిస్తున్న భార్యాభర్తలు వడ్డె చంద్రయ్య, వడ్డె లక్ష్మమ్మ మృతి చెందా రు. గుడిసెపై పిడుగుపడటంతో గుడిసే పూర్తిగా దగ్ధ్దమయింది. 20 మేకలు కూడా పిడుగుపాటుకు చనిపోయాయ.
జగన్ విమర్శకులపై సిఎం ప్రతీకార చర్యలా!: టిడిపి
హైదరాబాద్, జూన్ 5: సిఎం కిరణ్‌కుమార్ రెడ్డి వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడేవారిపై చర్యలు తీసుకుంటూ ఆ పార్టీతో కుమ్మక్కయ్యారని టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విమర్శించారు. బుధవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ గతంలో శంకర్రావు, ఇటీవల ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రరెడ్డిని ముఖ్యమంత్రి మంత్రివర్గం నుంచి తొలగించడం దారుణమన్నారు.
ఓపెన్ వర్శిటీలో చెట్ల పెంపకం
హైదరాబాద్, జూన్ 5: అంబేద్కర్ ఓపెన్ వర్శిటీలో చెట్ల పెంపకానికి పెద్దపీట వేస్తామని వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి ప్రకాశ్ చెప్పారు. బుధవారం అంబేద్కర్ ఓపెన్ వర్శిటీలో పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
17నుంచి ఎమ్సెట్ కౌనె్సలింగ్
హైదరాబాద్, జూన్ 5: ఎమ్సెట్ ఫలితాలను ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ బుధవారం సాయంత్రం జెఎన్‌టియు ఫైన్ ఆర్ట్సు యూనివర్శిటీలో విడుదల చేశారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ జయప్రకాశ్‌రావు, ఎమ్సెట్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ రామేశ్వరరావు, కన్వీనర్ డాక్టర్ ఎన్ వి రమణారావుల సమక్షంలో ఉప ముఖ్యమంత్రి ఫలితాలను విడుదల చేశారు.
ఇంజనీరింగ్‌లో 2,91,083 మంది, మెడిసిన్ స్ట్రీంలో 1,05,070 మంది కలిపి మొత్తం 3,96,153 మంది అభ్యర్ధులు పరీక్షకు రిజిస్టర్ చేసుకున్నారని, 33 రీజనల్ కేంద్రాల్లో మే 10వ తేదీన ఎమ్సెట్ నిర్వహించగా ఇంజనీరింగ్‌లో 2,01,308 మంది, మెడిసిన్‌లో 80,778 మంది క్వాలిఫై అయ్యారని అన్నారు. కాగా. ఈ నెల 17వ తేదీ నుండి కౌనె్సలింగ్ ప్రారంభిస్తామని జూన్ 31 వరకూ కౌనె్సలింగ్ తొలి దశ జరుగుతుందని, ఆగస్టు 1వ తేదీ నుండి తరగతులు ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ చెప్పారు. రెండో దశ కౌనె్సలింగ్ జూలైలో నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. జూలై నాటికి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు వస్తాయని, ఆ మార్కులను సైతం చేర్చి రెండో దశ కౌనె్సలింగ్ నిర్వహిస్తామని ఆయన వివరించారు.
మేనేజిమెంట్ కోటా ఆన్‌లైన్‌లోనే
యాజమాన్య కోటాకు ఈ సారి అభ్యర్ధులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుందని, ముందుగా యాజమాన్యాలు నేరుగా ఆ సీట్లను భర్తీ చేసే వీలు లేదని ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకించి నోటిఫికేషన్ జారీ చేస్తామని వెల్లడించారు. జీవో 66,67లను సవరిస్తామని, ఇందుకు సంబంధించిన ఎమెండ్‌మెంట్ కూడా త్వరలోనే జారీ అవుతుందని అన్నారు.
భారీగా సిబ్బంది
ఎమ్సెట్ నిర్వహణ పెద్ద ప్రహసనమని, దాదాపు 19,800 మంది ఇన్విజిలేటర్లు, 8560 మంది అబ్జర్వర్లు, 50 మంది స్పెషల్ అబ్జర్వర్లు పరీక్షల నిర్వహణకు వినియోగించామని పేర్కొన్నారు. తిరుపతి కేంద్రంగా ఎమ్సెట్ పరీక్షలో అక్రమాలకు పాల్పడే ప్రయత్నం చేసినట్టు తేలడంతో 9 మంది ఫలితాలను నిలిపివేశామని, మరో ఇద్దరు బార్‌కోడ్‌లు మార్చే ప్రయత్నం చేశారనే ఆరోపణలతో వారి ఫలితాలను కూడా నిలిపివేశామని కన్వీనర్ రమణారావు చెప్పారు.
47 ప్రశ్నలపై 152 అభ్యంతరాలు
ఎమ్సెట్ పరీక్షలో మొత్తం 47 ప్రశ్నలకు సంబంధించిన జవాబులపై 152 అభ్యంతరాలు వచ్చాయని కన్వీనర్ తెలిపారు. 11 మంది సబ్జెక్టు నిపుణులతో కూడిన కమిటీ గత నెల 11వ తేదీన కూర్చుని తొలి కీని రూపొందించిందని, తొలి కీని 12వ తేదీన విడుదల చేశామని, దానిపై అభ్యంతరాలను గత నెల 18వ తేదీ వరకూ స్వీకరించామని అన్నారు. ఇందులో గణితంలోని 14 ప్రశ్నలపై 48, ఇంజనీరింగ్ స్ట్రీంలోని ఫిజిక్స్ 4 ప్రశ్నలపై నాలుగు, కెమిస్ట్రీ 6 ప్రశ్నలపై 7, మెడిసిన్ స్ట్రీంలో బోటనీ 6 ప్రశ్నలపై 60, జువాలజీ రెండింటిపై రెండు, ఫిజిక్స్ ఏడింటిపై తొమ్మిది, కెమిస్ట్రీ 8 ప్రశ్నలపై 22 అభ్యంతరాలు వచ్చాయని అన్నారు.
25 శాతం వెయిటేజీ
ఇంటర్మీడియట్ మార్కులకు గతంలో మాదిరే 25 శాతం వెయిటేజీ ఈసారి కల్పించామని, ఎమ్సెట్ కు 75 శాతం వెయిటేజితో ర్యాంకులను ఖరారు చేశామని కన్వీనర్ తెలిపారు.