నెల్లూరు, జూన్ 17: తీర్థయాత్రల నిమిత్తం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తర కాశికి వెళ్లిన వారిలో నెల్లూరువాసులంతా సురక్షితంగా ఉన్నారని అధికార వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఉత్తరకాశిలోని వివిధ పుణ్యక్షేత్రాల్ని సందర్శించడంతో సహా సరస్వతి నది పుష్కరాల్లో భాగంగా పవిత్ర స్నానమాచరించేందుకు స్థానికులు తరలివెళ్లారు. గంగోత్రి నుంచి యమునోత్రి మీదుగా వెళ్లే సందర్భంలో చోటుచేసుకున్న అకాల వర్ష బీభత్సంతో ఉత్తరకాశి అటవీ ప్రాంతంలో నెల్లూరు జిల్లాకు చెందిన 118 మంది చిక్కుకుపోయారు. జిల్లాలోని నెల్లూరు నగరంతో సహా కోవూరు, బుచ్చి మండలాలకు చెందిన 78 మంది రైళ్లలో రెండు విడతలుగా (54మంది+ 24మంది) బయలుదేరి వెళ్లారు. వీరికి సంబంధించిన సమాచారం మాత్రమే అధికార్ల వద్దకు చేరుతుంది. అలాగే ముత్తుకూరు మండలానికి చెందిన ఇంకో నలభై మంది ప్రైవేట్ బస్సులో వెళ్లగా, వీరి సమాచారం అధికార్ల వద్ద లేదు. సెల్‌ఫోన్ల ద్వారా సమాచారం తెలుసుకుంటే వీరు కూడా సురక్షితంగానే ఉన్నామని చెపుతున్నారు. మొత్తం 118 మంది సురక్షితంగానే ఉండటంతో స్థానికంగా ఉన్న వారి బంధుమిత్రులు ఊపిరి పీల్చుకుంటున్నారు. రాత్రివేళల్లో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఒకింత భయాందోళనకు గురవుతున్న సంగతిని కూడా వివరిస్తున్నారు. కొండ చరియలు విరిగిపడి వివిధ రహదార్లు ధ్వంసం కావడంతో నాలుగురోజుల తరువాతగాని తిరుగు ప్రయాణానికి పరిస్థితులు అనుకూలించే అవకాశాల్లేవని అక్కడ నుంచి అందుతున్న సమాచారం. వాస్తవంగా అయితే మంగళవారం తిరుగు ప్రయాణం ప్రారంభించాల్సి ఉంది. తిరుగు ప్రయాణానికి అవసరమైన ఖర్చులు తామే భరిస్తామంటూ రావూస్ ట్రావెల్స్ ప్రతినిధులు వెల్లడిస్తున్నారు.
బాధితులను ఆదుకుంటాం: కలెక్టర్
నెల్లూరు అర్బన్: నెల్లూరు, కోవూరు, బుచ్చిరెడ్డిపాళెం ప్రాంతాల నుండి కాశీ తీర్ధయాత్రలకు వెళ్లి వరదల కారణంగా, కొండ చరియలు విరిగిపడటంతో చిక్కుకున్న బాధితులకు సహాయం చేసి సొంత ప్రాంతానికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. సోమవారం ఆయన తన చాంబర్‌లో విలేఖర్లతో మాట్లాడుతూ రావు ట్రావెల్స్ బస్సులో 78 మంది ప్రయాణీకులు కాశీకని వెళ్లి, మార్గమధ్యంలో కొండ చరియలు విరిగిపడిన కారణంగా డూండా ప్రాంతంలో కొంత మంది, ఉత్తర కశీలోని హరిఓం స్కూలులో కొంత మంది సురక్షితంగా ఉన్నప్పటికీ, వారు సొంత ప్రాంతాలకు తిరిగి రాకపోవటంతో, వారి బంధువులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. అక్కడ వున్న సుబ్బారావు నుండి వివరాల తెలుసుకుంటున్నామని, అక్కడ ఉన్న వారికి భోజన, వసతి సదుపాయాలు బాగా ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. బాధితుల బంధువులు ఉత్తర కాశీలోవున్న వారి వివరాలు తెలుసుకునేందుకు రావు ట్రావెల్స్ యజమాని సుధాకర్‌కు ఫోను 9849090100కుగాని, కలెక్టర్ ఆఫీసు నెంబర్ 0861 2331477, 2331261కుగాని, ఉత్తర కాశీ హరిఓంలోని 09849790133కు ఫోను చేస్తే సమాచారం తెలుసుకోవచ్చన్నారు. 78 మంది ప్రయాణీకులకు 18వ తేదీ మంగళవారంతో రిజర్వేషన్ సౌకర్యం అయిపోవటంతో, వారిని సొంత ప్రాంతాలకు తరలించేందుకు ఆర్థిక మంత్రి, చీఫ్ సెక్రటరీతో మాట్లాడామని తెలిపారు. ఎట్టకేలకు వారిని ఎలాగైనా నెల్లూరుకు తీసుకువస్తామని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు. ఈకార్యక్రమంలో డిఆర్‌ఓ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బుచ్చి యాత్రికులు క్షేమం
బుచ్చిరెడ్డిపాళెం: తీర్ధయాత్రలను పురస్కరించుకొని ఉత్తర కాశీకి వెళ్ళిన యాత్రికులు క్షేమంగా ఉన్నట్టు వారి కుటుంబ సభ్యులకు ఫోను ద్వారా సమాచారం అందింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తర కాశీని దర్శించటానికి బుచ్చిరెడ్డిపాళెం నుండి 17 మంది, జొన్నవాడ నుండి ముగ్గురు, కొడవలూరు మండలం నికిలింపేటకు చెందిన హజరత్తయ్య ఆధ్వర్యంలో బయలుదేరిన వీరి యాత్ర ప్రకృతి విపత్తివల్ల అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం దానితోపాటు గంగా యమున నదిలు ఉధృతంగా ప్రవహించటం వల్ల తామంతా సరస్వతి విద్యాపీఠంలో తలదాచుకుంటున్నట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వీరంతా ఉత్తరకాశీయాత్రకు బయలుదేరిన తర్వాత హరిద్వార్, రుషికేష్ చూసి హరిద్వార్‌లోని ఒక హోటల్‌లో బస చేసారు. అనంతరం షార్‌హాం యాత్ర కేథరీనాధ్, బద్రీనాద్, గంగోత్రి వెళ్లానుకున్నారు. ఈక్రమంలో రెండు రోజుల పర్యటన అనంతరం హరిద్వార్ హోటల్‌లో కొంత లగేజీ ఉంచి కేదరీనాద్ బయలుదేరారు. కాని అక్కడికి వెళ్ళాలంటే గుర్రపు బండ్లలో వెళ్ళాల్సి ఉంది. గుర్రాల యజమానులు బంద్ నిర్వహిస్తుండటంతో 13 కిలోమీటర్ల ప్రయాణాన్ని నడిచివెళ్ళటం కష్టమే అయినా వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. బంద్ అనంతరం ఒకటిన్నర రోజు తర్వాత గుర్రపు బండ్లపై ప్రయాణమయ్యారు. మార్గం మధ్యలో షెహరీ జిల్లా నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న డూండా గ్రామానికి చేరుకునేటప్పుటికి భారీగా వర్షం, మంచుకొండలు విరిగి రోడ్డుపై పడటంతో రాకపోకలు పూర్తిగా స్థంభించిపోయాయి. ఆగ్రామంలో వసతులు అరుదుగా ఉన్నట్టు యాత్రికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడే వున్న సరస్వతి విద్యాపీఠంలో తలదాచుకుంటున్నట్టు తెలిపారు. కాని రెండు రోజుల తర్వాత ఎడతెరిపిలేని వర్షాల కారణంగా ఆహార వస్తువులు అయిపోయాయి. వీరిలో ఎక్కువ మంది షుగర్, బిపి వ్యాధులతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వర్షం తగ్గితేకాని రాకపోకలు పునరుద్ధరించే పరిస్థితి లేదని వారు తెలిపారు. అప్పటి వరకు విద్యాపీఠంలోనే తలదాచుకునే పరిస్థితి ఉందని వారు బంధువులకు తెలిపారు. అక్కడ చిక్కుకున్న వారిలో నెల్లూరు జివిఆర్ కళాశాల విశ్రాంతి ప్రిన్సిపాల్, బుచ్చిరెడ్డిపాళెం వాసి బాలుసుబ్బారావు దంపతులు, అచ్చమ్మ దంపతులు, వారి కుమార్తె సుబ్బమ్మ, కె ఆనందరావు, శారదమ్మ దంపతులు, అమరసేన దంపతులు, మల్లికార్జునరావు, లక్ష్మి దంపతులు, చింతాల ధనమ్మ, చింతాల వెంకటశేషమ్మ, చింతాల వౌనిక, సర్వేయర్ శ్రీనివాసరావు దంపతులు, సత్యంస్వామి, వంగర భాస్కరరావు తదితరులు ఉన్నారు.
వీడని ట్రాఫిక్ అంతరాయం
నెరవేరని సలహా కమిటీ సమాలోచనలు
నెల్లూరు, జూన్ 17: నగరంలో ప్రధాన రహదార్లన్నీ ట్రాఫిక్ అంతరాయంతో సతమతమవుతున్నాయి. ఎక్కడికక్కడ పరిష్కార దిశగా తీసుకుంటున్న చర్యలు సమస్యను సమగ్రరూపంలో కొలిక్కి వచ్చేలా అక్కరకు రావడం లేదు. ఇటీవలకాలంలో నెల్లూరు నగరానికి దక్షిణదిశ సరిహద్దుగా భావించే అయ్యప్పగుడి కూడలి నుంచి బ్రహ్మానందపురం (బొల్లినేని ఆసుపత్రి వరకు రోడ్ల విస్తరణ చేపట్టారు. అక్కడ అటు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఇటు స్టార్ హోటల్ నేపథ్యంలో ఆక్రమణల క్రమబద్దీకరణ అటకెక్కి అక్కడ నుంచి ఆర్టీసి, మద్రాస్ బస్టాండ్ మీదుగా రావాల్సిన రోడ్ల విస్తరణ వ్యవహారం కాస్తా అటకెక్కింది. అలాగే గత ఏడాది ట్రాఫిక్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో తీర్మానించుకున్న ట్రాఫిక్ ఐలాండ్‌ల కుదింపువ్యవహారం మరుగున పడినట్లే భావిస్తున్నారు. మూడు మాసాలకో పర్యాయం జరగాల్సిన ఈ కమిటీ సమావేశాన్ని గత ఏడాదికాలంలో నిర్వహించడానికి కూడా విరామం ప్రకటించినట్లు ప్రచారం. జిల్లా ఎస్పీ, జాయింట్ కలెక్టర్, రవాణాశాఖ ఉప కమిషనర్, నగర పాలక సంస్థ కమిషనర్ వంటి ఉన్నతాధికారులు సభ్యులుగా ఉన్న ట్రాఫిక్ సలహా మండలి సమావేశంలో చర్చించి తీసుకున్న నిర్ణయాలు కార్యాచరణకు నోచుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత జెసి, రవాణాశాఖ డిసి, నగర పాలక కమిషనర్లు వచ్చిన తరువాత ఈ సమావేశమైతే జరగనే లేదు. రవాణా డిసి, నగర కమిషనర్ వచ్చి ఒకటి రెండు మాసాలు కూడా జరగకపోగా జెసిగా బి లక్ష్మీకాంతం నియమితులై చాన్నాళ్లే అయింది. ఇదిలాఉంటే ఇటీవల నగరంలోని మద్రాస్ బస్టాండ్ వద్ద నడిరోడ్డుపై ఆకుకూరలు, కూరగాయలు అమ్ముకునే చిన్న, సన్నకారు విక్రేతల కోసం కోనేరు స్థలాన్ని పూడ్చి మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో షెడ్లు నిర్మించారు. వాటిని రాష్ట్ర మంత్రి ఆనం ప్రారంభించారు కూడా. అయితే ఇంతవరకు ఆ ప్రాంగణంలోకి విక్రేతలు అడుగిడలేదు. యధాప్రకారం మార్జిన్‌లో నిలబడి నడిరోడ్డు వరకు ట్రాఫిక్ అవాంతరం సాగించే క్రమంలోనే ఈ చిల్లర విక్రేతలు కొనసాగుతున్నారు. ఏదేమైనా నగరంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణ ప్రశ్నార్ధకంగా మారుతుందనే చెప్పాలి. ట్రాఫిక్ అంతరాయాలపై సరైన చర్యలు లేకపోవడంతో నగరవాసులు నరకయాతన పడుతున్నా రాజకీయ చిక్కుముళ్ల కారణంగానే సమస్యలు పరిష్కృతం కావడం లేదు. వివిధ కూడళ్లలో కొలువుదీరిన మహనీయుల విగ్రహాల చుట్టూ ఉన్న ఐలాండ్‌ల వైశాల్యాన్ని తగ్గించేలా ఉన్నతాధికారులు ట్రాఫిక్ సలహా కమిటీ తీర్మానం చేసినా ఆచరణకు అతీగతి కరవే. ఈ అంశంలో అధికారపార్టీ నేతల రాజకీయ విన్యాసాలు ట్రాఫిక్ సమస్యకు గుదిబండగా పరిణమిస్తున్నాయి. ఐలాండ్‌ల్ని నిర్మించే ముందు అనుమతించిన క్రమంలో అస్పష్టత, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు సాగడం వలనే ఇప్పటి సమస్యలకు ప్రధాన కారణమని చెప్పాలి. గతంలో మున్సిపాలిటీ, ప్రస్తుత నగర పాలక సంస్థలు విగ్రహాల ప్రతిష్టాపన, వాటి చుట్టూ ఐలాండ్‌ల నిర్మాణానికి అనుమతిచ్చే సందర్భంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ట్రాఫిక్ ఇక్కట్లుండవనే చెప్పాలి. మహనీయులపై ఉన్న అభిమానాన్ని తప్పుపెట్టలేకున్నా ట్రాఫిక్‌కు అంతరాయం సృష్టించేలా కూడళ్లలో ఐలాండ్‌లతో రోడ్లను కబళిస్తున్న వైనం క్షంతవ్యం కాబోదనే భావించాలి. మహనీయుల విగ్రహాలతో ఏర్పాటైన ఐలాండ్లలో మొక్కలు, నీళ్లు వెదజల్లే ఫౌంటేన్లు ఏర్పాటుచేశారు. వీటిని నిర్వహిస్తున్న వైనం అంతంత మాత్రంగానే ఉంటుండగా చాలా చోట్ల ఏర్పాటైన ఐలాండ్‌లు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుండటం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని ఆర్టీసి బస్టాండ్ కూడలి, రామలింగాపురం ముత్తుకూరు వంతెన కూడలి, దర్గామిట్ట కరెంట్ ఆఫీస్ సెంటర్, మినీ బైపాస్‌రోడ్డులో బాలాజీనగర్‌కు వెళ్లే కూడలి, తదితర ప్రాంతాల్లో ఈ అంశం చాలా సమస్యాత్మకమవుతోంది. ఈ కూడళ్లలో ఉండే ఐలాండ్‌లను క్రమబద్దీకరించేందుకు పోలీస్‌శాఖ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నా నగర పాలక సంస్థ కమిషనర్ విముఖత చూపుతున్నారట. ప్రధానంగా అధికార రాజకీయ పార్టీ నుంచి అభ్యంతరాల పరంపరతోనే నగర పాలక కమిషనర్ విముఖత చూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. రద్దీ సమయాల్లో వాహనాల రాకపోకలపరంగానేగాక పాదచారులు కాలినడకన వెళ్లేందుకు కూడా సమస్యలు తలెత్తుతున్నందున ఏమైనా ఐలాండ్‌ల కుదింపుతోనే వివిధ ప్రాంతాల్లో నిత్యం తలెత్తుతున్న ట్రాఫిక్ జామ్ సమస్య కొలిక్కి వస్తుందనేది సర్వత్రా వినిపిస్తున్న అభిప్రాయం.
‘రైతులకు సరైన
సలహాలు ఇవ్వండి’
సైదాపురం, జూన్ 17: మండలంలోని రైతులకు ఆయా గ్రామాల్లోని ఆదర్శ రైతులు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని ఎడిఎ ఉషారాణి కోరారు. స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో సోమవారం జరిగిన ఆదర్శ రైతుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. మండలంలోని కొన్ని గ్రామాల్లో వేరుశనగ, వరిపైరు వేసివున్నారని, వారికి అవసరమైన సలహాలు ఇవ్వాలన్నారు. ఆదర్శ రైతులందరూ తప్పనిసరిగా బ్యాంకు అకౌంట్లు కలిగి ఉండాలని, ఆదర్శరైతులకు వ్యవసాయ శాఖ డైరీలను ఆమె అందచేశారు. ఈ సమావేశంలో ఎవో రామారావు, ఎఇఓ వెంకటేశ్వరరావు, ఆదర్శరైతులు పాల్గొన్నారు.
‘వెన్నుపోటు సంస్కృతి మేకపాటిదే’
కలిగిరి, జూన్ 17: ఒకేమాట ఒకేపార్టీకి కట్టుబడి పనిచేసిన మమ్మలను వెన్నుపోటుదారులని అనడం మంచిదికాదని అలాంటి సంస్కృతి మేకపాటి సోదరులదేనని రాజన్నదళం నేతలు మాలేపాటి వెంకట సుబ్బయ్య, కర్తం శ్రీనివాసులురెడ్డిలు అన్నారు. సోమవారం కలిగిరి ఆర్‌అండ్‌బి అతిధి గృహంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో రాజన్నదళం నేతలు మాట్లాడుతూ ఎన్నికల్లో కార్యకర్తలకు ఇవ్వాల్సిన డబ్బులపై ఆధారాలు చూపిస్తామని నగదు చెల్లింపు చేస్తారా అని ప్రశ్నించారు.
అలాగే 2004 ఎన్నికల్లో పార్వతమ్మ విజయానికికృషిచేసామని 2009,2012 ఎన్నికల్లో మేకపాటి సోదరుల విజయానికి కృషి చేశామన్నారు. 2012 ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకొన్నట్లు అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని వాటిని నిరూపించాలన్నారు.
మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి డిసిసిబి ఎన్నికల్లో సుమంత్‌రెడ్డి నుంచి 30లక్షల రూపాయిలు తీసుకొన్న విషయంగురించి అలాగే విజయమ్మ ముఖ్యమంత్రి అయితే కుటుంబ పాలన వస్తుందని చెప్పడం, కుడమలదినె్నపాడు సొసైటీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్ధికి మద్దతు ఇవ్వడంపై కాణిపాకంలో ప్రమాణం చేయడానికి సిద్ధం కావాలని మేముకూడా ప్రమాణానికి సిద్ధంగా వున్నామని సవాల్ విసిరారు.
అలాగే రాజన్నదళం నేతలు ప్రతి పంచాయితీల్లో ఎన్నికల బరిలో నిలుస్తారని త్వరలోనే నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల సమయంలో నగదును ఆదారాలు చూపిస్తే పాలూరి మాల్యాద్రిరెడ్డి డబ్బులు ఇస్తామని ప్రకటన చేయడంపై ఆధారాలు చూపించడానికి మేం సిద్ధమేనని, మీరు డబ్బులు ఇస్తారా అని అన్నారు. 2011 ఎం ఎల్‌సి ఎన్నికల్లో రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డికి వ్యతిరేకంగా పార్టీకి వ్యతిరేకంగా మేకపాటి పనిచేసారన్నారు. అలాగే 2007 ఎం ఎల్‌సి ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధి అయిన పివి శేషారెడ్డిని కాదని బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డికి మద్దతు ఇచ్చారని తెలిపారు. మేము మొదటి నుంచి రాజశేఖర్‌రెడ్డి అభిమానులమని వై ఎస్ ఆర్‌సిపి విజయానికి కృషిచేసిన వారమేనని గుర్తు చేసారు.
ఈకార్యక్రమంలో మాలేపాటి వెంకట సుబ్బయ్య, మెట్టుకూరు అమరజీవిరెడ్డి, కర్తం శ్రీనివాసులురెడ్డి, మేదరమెట్ల వెంకటేశ్వర్లు, నర్రవుల అంకిరెడ్డి, గోవిందయ్య, కృష్ణారెడ్డి, ఇర్మియా, శ్రీరాములు, ఎడ్లపల్లి వెంకటాద్రి నాయుడు, మాల్యాద్రి, చివిలి రవీంద్రనాయుడు పాల్గొన్నారు.
తొలిసారి తెలుగులో తీర్పులు ఇచ్చిన
న్యాయస్థానం
కావలి, జూన్ 17: పట్టణంలోని ప్రధాన కనిష్ట పౌర న్యాయమూర్తివారి న్యాయస్థానం సోమవారం తొలిసారిగా వివిధ కేసులకు సంబంధించి తెలుగులో తీర్పులను వెలువరించింది. న్యాయమూర్తి రాజావెంకటాద్రి 7కేసులకు సంబంధించి ఒకేరోజు తీర్పులను వెలువరించారు.
రహదారుల నిర్మాణానికి 2,200 కోట్ల్ల నిధులు
పెళ్లకూరు, జూన్ 17: కేంద్ర ప్రభుత్వం రహదారుల నిర్మాణాలకు గాను రాష్ట్రానికి పిఎంజిఎస్‌వై పధకం 2200 కోట్ల నిధులను మంజూరు చేసిందని తిరుపతి ఎంపి చింతా మోహన్ వెల్లడించారు. మండల పరిధిలోని చిల్లకూరు, జీలపాటూరు, అక్కగారి పేట, దిగువ చావాలి, శిరసనంబేడు, కప్పగుంట కండ్రిగ గ్రామాల్లో సోమవారం ఎంపి చింతా పలు అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల సమక్షంలో ఒక్కో శాఖ పనితీరుపై విశే్లషణ జరిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు. ఉపాధి హామీ పధకం కింద కూలీలకు రోజుకు 224 రూపాయలు ఇవ్వాల్సివుండగా ఇక్కడి అధికారులు తక్కువ కూలీలు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇలాంటి అధికారుల వలన కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. గత ఐదేళ్లలో సోనియా గాంధీ 12 కార్యక్రమాలపై 7 లక్షల కోట్ల నిధులను ఇచ్చిందన్నారు. వచ్చే నెలల నుండి ఆహార భధ్రత చట్టం కింద ప్రతి కుటుంబానికి 100 రూపాయలకు 35 కిలోల బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. దీంతో 70 కోట్ల మంది నిరుపేదలకు ఇది వరంగా మారుతున్నట్టు తెలిపారు. ఉపాధి పధకం ద్వారా ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి 30 కోట్ల కుటుంబాలకు ఉపాధి కల్పించినట్టు తెలిపారు. అమ్మహస్తం, అమృతహస్తం పధకాలను ప్రజలు సద్వినియోగం చేసుకొనాలన్నారు. అంతకు ముందు ఎంపి చింతాకు చిల్లకూరు గ్రామం వద్ద స్థానిక కాంగ్రెస్ నాయకులు, నాయుడుపేట ఎఎంసి చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎండివో సరళ, తహశీల్దార్ ఏడుకొండలు, మండల ప్రత్యేకాధికారి నరసోజీరావు, సిఐ రామారావు, ఎస్సై రామకృష్ణ, ఇతర అన్ని శాఖల అధికారులతో పాటు కాంగ్రెస్ నాయకులు బైనా మల్లిఖార్జున రెడ్డి, కె రామలింగారెడ్డి, పి అనిల్‌కుమార్ రెడ్డి పగడాల సుబ్రహ్మణ్యం రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.
గూడూరు డివిజన్‌లో 365 పంచాయతీలు
గూడూరు, జూన్ 17: గూడూరు డివిజన్‌లోని మూడు అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలోని గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజక వర్గాల పరిధిలోని 365 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని గూడూరు డివిజనల్ పంచాయతీ అధికారి వివిఎం లక్ష్మణరావు తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ప్రస్తుతం ఈ పంచాయతీ ఎన్నికల్లో నాయుడుపేట, సూళ్లూరు పేట పంచాయతీలు అయినందున వాటికి ఎన్నికలు నిర్వహించరని, డక్కిలి మండలంలోని డి వడ్డిపల్లి కొత్తగా పంచాయతీ అయినందున ఈ సారి డివిజన్‌లో 365 పంచాయతీలకు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన తెలిపారు. గత పంచాయతీ ఎన్నికలు 2006 ఆగస్టు 8న నిర్వహించడం జరిగిందని, వీరి పదవీ కాలం 2011 ఆగస్టు, 23కి ముగియడంతో అప్పటి నుండి అన్ని పంచాయతీలు ప్రత్యేకాధికారుల పాలనలో జరుగుతున్నాయన్నారు. గత పంచాయతీ ఎన్నికల్లో 68 పంచాయతీల సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికైనందున ప్రభుత్వం పంచాయతీకి 5 లక్షల రూపాయల చొప్పున ప్రోత్సాహకాలు అందించడం జరిగిందన్నారు. ప్రస్తుతం 117 పంచాయతీలు ఎస్‌సిలకు, 44 ఎస్టీలకు, 90 బిసిలకు కేటాయించినట్టు, 1034 వార్డులు ఎస్సీలకు, 391 ఎస్టీలకు, 394 వార్డులు బిసిలకు కేటాయించారన్నారు.
‘పేదల సమస్యలు గాలికొదిలేసిన ప్రభుత్వం’
నెల్లూరు రూరల్, జూన్ 17: పేదలు పడుతున్న కష్టాలను గాలికి వదిలేసి కాంగ్రెస్ ప్రభుత్వం ధనవంతులకు వెన్నుదన్నుకా నిలుస్తుందని సిపిఎం పార్టీ నాయకుడు, మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు ఆరోపించారు. సోమవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట ఇంటి స్థలాల కోసం ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఫేజ్-1,2,3 స్కీమ్ కింద పేదలకు ఇంటి స్థలాలు, ఇళ్లు నిర్మించి ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిందని, అయితే ఇప్పటి వరకు అలాంటి చర్యలకు పూనుకోలేదని, పేద ప్రజల పట్ల అత్యంత క్రూరంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహిరిస్తుందని ఆరోపించారు. రోడ్లు విస్తురించటంలో భాగంగా కాలువ పక్కన, రోడ్డుపక్కన ఉన్నవారిని ఉన్నపళంగా వారి గుడిసెలను తొలగించటం చూస్తుంటే కాంగ్రెస్‌కు పేదల పట్ల ఎంతటి జాలి ఉందో తెలుస్తుందన్నారు. గుడిసెల తొలగించిన కుటుంబాలకు ప్రత్యామ్నాయం చూపకుండా ఆకుటుంబాలను రోడ్డుపాల్జేయటం కాంగ్రెస్‌కే చెల్లించిందన్నారు. అలాగే హరనాధపురం వారిని కొత్తూరుకు తరలించారని, అక్కడ వౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
ఇళ్ల స్థలాలు, సాగు భూములు పంపిణీ చేయాలంటూ ధర్నా
గూడూరు, జూన్ 17: గూడూరు పట్టణంలోని ఇళ్లులేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు, గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు సాగు భూములు కేటాయించాలంటూ భారత కమ్యూనిస్టు పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం గూడూరు మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహశీల్దార్ మైత్రేయకువినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపియం నాయకులుమాట్లాడుతూ గూడూరు పట్టణంలోని పేదలు అనేక సంవత్సరాలుగా ఇళ్ల స్థలాలు లేక అద్దె ఇళ్లలో నివసిస్తూ అద్దెలు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎగువ వీరారెడ్డి, దిగువ వీరారెడ్డి పల్లి, అశోక్‌నగర్ తదితర ప్రాంతాల్లోని ఆటో కార్మికులు, ఆటోమోబైల్ కార్మికులు, భవన నిర్మాణ రంగ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, పారిశ్రామిక కార్మికులు స్వంత ఇళ్లు లేక అద్దె ఇళ్లల్లో నివసించ లేక నానా అవస్థలు పడుతున్నారని, వీరు అద్దెలు కట్టలేక పిల్లలను చదువుకు పంపలేక పోతున్నారన్నారు. అనారోగ్యం భారిన పడుతున్నారన్నారు. వీరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ఇందిరమ్మ గృహాలు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గూడూరు మండలం కాండ్ర, విందూరు తదితర ప్రాంతాల్లోని వ్యవసాయ కార్మికులు ఉన్నారని, రోజూ సరైన పనిలేక పస్తులతో కాలం వెళ్లదీస్తున్నారని, వీరికి సరైన భూ వసతి లేక వీరి జీవనం దుర్భరంగా మారిందన్నారు. వీరికి ప్రభుత్వం వ్యవసాయోగ్యమైన భూమిని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
గూడూరు పట్టణంలోని ఇళ్ల స్థలాలను సర్వే చేయించి అర్హులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి గట్టి ఇళ్లను నిర్మించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సర్వే చేయించి వ్యవసాయ కూలీలకు తదితర పేద, బడుగు, బలహీన వర్గాల వారి సాగుకు భూమిని మంజూరు చేయాలని టౌన్ కార్యదర్శి ఎ కేశవులు, జోగి శివకుమార్, పలువురు పట్టణ, గ్రామీణ ప్రాంత రైతులు, కార్మికులు పాల్గొన్నారు.
నెల్లూరీయులు సురక్షితం
మృత్యుశకటం..
మార్కాపురం, జూన్ 17: పెద్దారవీడు మండలం గొబ్బూరు - తోకపల్లి మధ్య సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోరరోడ్డుప్రమాదంలో మార్కాపురం మున్సిపల్ కమిషనర్ ఎం రవీంద్రారెడ్డితోపాటు బస్సులో ప్రయాణిస్తున్న మరో ఆరుగురు మృతి చెందగా 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి గిద్దలూరు వెళ్తున్న రాజాట్రావెల్స్‌కు చెందిన బస్సు గొబ్బూరు సమీపంలో మరమ్మతులకు గురై నిలిచి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈప్రమాదం జరిగింది. కుటుంబసభ్యులు హైదరాబాద్‌లో ఉండగా శనివారం సాయంత్రం వెళ్ళి సోమవారం విధి నిర్వహణకు వస్తుండగా బస్సులో ముందుభాగంలో కూర్చొని ఉన్న మార్కాపురం మున్సిపల్ కమిషనర్ ఎం రవీంద్రారెడ్డి (40) ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. అర్ధవీడు మండలం నాగులవరం గ్రామానికి చెందిన కూరుమాని వెంకటసుబ్బమ్మ (50), కనిగిరి ఇందిరాకాలనీకి చెందిన సానికొమ్ము బ్రహ్మారెడ్డి (60), కొమరోలు మండలం భీమినేనిపల్లికి చెందిన ఆరపాటి సత్యవతి (50), పోరుమామిళ్ళ మండలం రాజాసాహెబ్‌పేటకు చెందిన సింగా తిరుపతమ్మ (70)లు మృతి చెందారు. కాగా కొమరోలు మండలం మిట్టమీదిపల్లి గ్రామానికి చెందిన వర్రా రవణమ్మ (30) ప్రథమ చికిత్స చేసి గుంటూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. అలాగే బేస్తవారపేటకు చెందిన చుంచు చెంచులక్ష్మి (48) గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. విషయం తెలుసుకున్న మార్కాపురం డివైఎస్పీ జి రామాంజనేయులు, సిఐ కెవి రాఘవేంద్ర, పెద్దారవీడు ఎస్సై దాసరి ప్రసాద్‌లు హుటావుటీన సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. వైపాలెం సిఐ పాపారావు, త్రిపురాంతకం, కంభం, పెద్దారవీడు, మార్కాపురం రూరల్ ఎస్సైలు శ్రీనివాసరావు, రామకోటయ్య, దాసరి ప్రసాద్, రాములునాయక్‌లు ఏరియా వైద్యశాలకు చేరుకొని క్షతగాత్రులకు వైద్యచికిత్సలు చేయించారు.
అతివేగం, నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం
అతివేగంతోపాటు నిర్లక్ష్యమే ఆరుగురి ప్రాణాలను తీయడంతోపాటు పలువురిని క్షతగాత్రులను చేసిందని బస్సులో ప్రయాణిస్తూ గాయాలపాలైన పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి 10గంటల సమయంలో బస్సు ఎక్కామని, మరో రెండుగంటల్లో గిద్దలూరు, కొమరోలు, బేస్తవారపేట ప్రాంతాల్లోని గ్రామాలకు చేరుకుంటామని అనుకుంటున్న సమయంలో క్షణకాలంలో జరిగిన ఈప్రమాదంలో తాము గాయపడగా తమ బంధువులు మృతి చెందడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రధానంగా అతివేగంగా వస్తూ ఎదురుగా నిలిచి ఉన్న వాహనాన్ని డ్రైవర్ దగ్గరకు వచ్చేంత వరకు గుర్తించకపోవడంతో కండెక్టర్‌వైపు పూర్తిగా బస్సు నుజ్జునుజ్జై ఆ సీట్లలో కూర్చున్న ప్రయాణికులు ఆరుగురు మృతి చెందగా 9మంది వరకు గాయాలయ్యాయి. ఇందులో ఐదుగురు పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కొందరిని కర్నూల్, మరికొందరిని గుంటూరుకు తరలించారు. గాయపడిన వారిలో బేస్తవారపేటకు చెందిన చుంచు చెంచులక్ష్మీ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ప్రథమ చికిత్స చేసి గుంటూరుకు తరలించారు. అదేకుటుంబానికి చెందిన చుంచు సత్యవతి, రెండేళ్ళ బాలుడు ఖేతేంద్రనాథ్‌లను పోలీసులు సంఘటన స్థలం నుంచే కర్నూల్ వైద్యశాలకు తరలించారు. కాగా వర్రా వీరనారాయణ, వర్రా రవణమ్మలను గుంటూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో రవణమ్మ మృతి చెందడంతో మృతదేహంతోపాటు భర్త వీరనారాయణను కూడా ఏరియా వైద్యశాలకు తీసుకువచ్చారు. కాగా కొమరోలుకు చెందిన మల్లికార్జున్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పీరమ్మ, పెద్దారవీడు మండలం రామచంద్రకోటకు చెందిన దర్శనం వెంకటయ్య, కూరాకుల గిరిబాబు, మరికొంతమందికి స్థానిక వైద్యశాలలో చికిత్సలు చేస్తున్నారు.
అందరివాడు కమిషనర్ రవీంద్రారెడ్డి
* సమస్యలు వినడం.. అందరినీ అమ్మా అని పిలవడం ఆయన మర్యాద
మార్కాపురం, జూన్ 17: బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యల పరిష్కారంతోపాటు పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన కమిషనర్ ఎం రవీంద్రారెడ్డి సోమవారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదంలో మృతి చెందాడని తెలుసుకున్న పట్టణ ప్రజలు ఒక్కసారిగా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రస్తుతం పట్టణంలో తీవ్రనీటి ఎద్దడి ఉన్న దృష్ట్యా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయిస్తూ ప్రతినిత్యం పట్టణంలో ఏదొక ప్రాంతంలో పర్యటిస్తూ ప్రజలను కలుసుకుంటూ ఉండే రవీంద్రారెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో ఉన్న తన చిన్నకూతురు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లి వస్తూ ప్రమాదంలో మృతి చెందాడు. ఎవరు ఏ సమస్యపై వెళ్ళిన నవ్వుతూ పలుకరిస్తూ సమస్యను తెలుసుకుని పరిష్కరించేందుకు తనవంతు కృషి చేయడం రవీంద్రారెడ్డికి ప్రజల్లో ఉన్న గుర్తింపుకు కారణం. అందరిని అమ్మా అంటూ పలుకరించడం ఆయన నైజం. ఈయన గ్రూప్-1 ఆఫీసర్‌గా ఎన్నికై మొట్టమొదటగా నెల్లూరుజిల్లా గూడూరు మున్సిపల్ కమిషనర్‌గా విధుల్లో చేరారు. కొద్దికాలం పనిచేసి అనంతరం అనంతపురం జిల్లా ధర్మవరం మున్సిపల్ కమిషనర్‌గా మూడేళ్ళపాటు విధులు నిర్వర్తించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో మెప్మా విభాగంలో కొద్దికాలం పనిచేసి గత రెండేళ్ళ కిందట మార్కాపురం మున్సిపల్ కమిషనర్‌గా వచ్చారు. అప్పటి నుంచి విధులు నిర్వర్తిస్తూ అటు ఉద్యోగుల్లోను, ఇటు ప్రజల్లోను ఒకరిగా ఉంటూ మంచి పేరు సంపాదించారు. కాగా ఈయన సతీమణి ఉపాధ్యాయవృత్తిలో ఉండగా ఈయనకు ఇరువురు కుమార్తెలు.
* 20 నిమిషాలైతే గమ్యం చేరేవారు
సోమవారం తెల్లవారుజామున బస్సు ప్రమాదంలో మృతి చెందిన మార్కాపురం మున్సిపల్ కమిషనర్ రవీంద్రారెడ్డి ప్రమాదం జరగకుండా ఉంటే మరో 20 నిమిషాల్లో మార్కాపురం చేరుకునేవారు. ఆదివారం రాత్రి 10గంటల సమయంలో మార్కాపురం వచ్చేందుకు రాజా ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు బస్సులో బయలుదేరారు. పెద్దారవీడు మండలం కుంట వద్దకు వచ్చి తన కారుడ్రైవర్‌కు ఫోన్ చేసి తాను మరో అరగంటలో మార్కాపురం వస్తానని, కారుతీసుకొని బస్టాండ్‌కు రావాలని ఆదేశించారు. అయితే కారుతీసుకొని బస్టాండ్‌కు వచ్చిన డ్రైవర్ 5గంటల నుంచి మున్సిపల్ కమిషనర్ కోసం ఎదురుచూసి ఎంతసేపటికి బస్సు రాకపోవడంతో ఫోన్ చేశాడు. రింగ్ అవుతున్నప్పటికీ ఫోన్ ఎత్తకపోవడంతో వస్తాడని ఎదురుచూస్తూ మరోసారి ఫోన్ చేయగా తోటిప్రయాణికులు ఫోన్ ఎత్తి కమిషనర్ ప్రమాదంలో మృతి చెందాడని చెప్పడంతో డ్రైవర్ నిర్ఘాంతపోయాడు.
కొంపముంచుతున్న
విదేశీ శనగలు
గోదాముల్లో మగ్గుతున్న దేశీయ శనగలు
దిక్కుతోచని రైతులు
నేటి నుండి తహశీల్దార్ల కార్యాలయాల ముట్టడి
ఒంగోలు, జూన్ 17:విదేశీ శనగల దిగుమతితో దేశీయ శనగలు గోదాముల్లో పేరుకుపోతున్నాయి. దీంతో జిల్లాలోని శనగ రైతులు లబోదిబోమంటున్నారు. విదేశీ శనగల దిగుమతులు మూలంగా దేశీయ శనగలకు రేట్లు లేకపోవటమే కాకుండా వ్యాపారులు శీతలగిడ్డంగుల్లో ఉన్నవాటిని కొనుగోలు చేయని పరిస్ధితి జిల్లాలో నెలకొంది. ఆస్ట్రేలియా, కెనడా దేశాల నుండి సుమారు రెండు లక్షల టన్నుల శనగలు ఇటీవల దిగుమతి అయ్యాయి. ఆ శనగలు చెన్నై, కాండ్ల ఓడరేవుల్లో ఉన్నట్లు రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు నాగబోయిన రంగారావు ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. జిల్లావ్యాప్తంగా రెండు లక్షల ఎకరాల్లో సాధారణంగా ఒంగోలు రూరల్, పర్చూరు, కొండెపి, కారంచేడు, ఇంకొల్లు, యద్దనపూడి, చినగంజాం, నాగులుప్పలపాడు, టంగుటూరు, కొండెపి, జరుగుమల్లి, జె పంగులూరు, కొరిశపాడు మండలాల్లో శనగ పంటను రైతులు సాగుచేస్తారు. ప్రస్తుతం జిల్లాలో రైతుల వద్ద సుమారు 25 లక్షల క్వింటాళ్ల శనగలు గోదాముల్లో పేరుకుపోయాయి. కనీసం ఇతర జిల్లాల నుండి వ్యాపారులు వచ్చి కొనుగోలు చేయని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు ఈసంవత్సరం అక్టోబర్‌లో శనగ పంటను సాగు చేసేందుకు వెనకంజ వేసే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం తమ భూములను చదును చేసుకుంటే అక్టోబర్ నెలలో పంట వేసుకునేందుకు వీలుంటుంది. అదేవిధంగా శనగలకు రేట్లు లేకపోవటంతో భూములను కౌలుకు తీసుకునేందుకు కూడా కౌలుదారులు వెనకంజ వేస్తున్నారు. గతంలో ఎకరాను 12వేల నుండి 15వేల రూపాయల వరకు కౌలుదారులు కౌలుకు తీసుకునేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో భూముల రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కాక్-2, బోల్డ్క్రం శనగలు క్వింటా 2780 రూపాయలకు, ఎర్రశనగలు 3,100 రూపాయలకు మాత్రమే అరకొరగా కొనుగోలు చేస్తున్నారు. విదేశీ శనగలను కూడా 3500 రూపాయల లోపు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. కాని విదేశీ మోజులో దేశీయ శనగలను పెద్దగా కొనుగోలు చేయని పరిస్థితి నెలకొంది. ఇదిలాఉండగా శనగ రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం అఖిలపక్షం సంఘం ఆధ్వర్యంలో మండల కార్యాలయాల ఎదుట ఆందోళన కార్యక్రమం చేపట్టనున్నట్లు రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగబోయిన రంగారావు, దుగ్గినేని గోపీనాథ్ తెలిపారు. ఈసంవత్సరం ఒక్క వ్యాపారి కూడా ఒక్క లారీ శనగలను కూడా కొనుగోలు చేయలేదని వారు పేర్కొన్నారు. జిల్లాలో శనగ రైతుల గురించి ఏ ఒక్క ప్రజాప్రతినిధి పట్టించుకోలేదని వారు ఆరోపించారు. ప్రభుత్వ రంగం సంస్ధలైన నాఫెడ్, మార్కెఫెడ్‌ల ద్వారా బోల్డ్ శనగలను క్వింటా ఏడువేలకు, కాక్-2 శనగలను ఆరువేల రూపాయలకు, ఎర్రశనగలు ఐదువేల రూపాయల మద్దతు ధర నిర్ణయించి కొనుగోలు చేయాలని వారు కోరారు.
ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలం
టిడిపి నేత శిద్దా ధ్వజం
దర్శి, జూన్ 17:రోజు రోజుకు పెరుగుతున్న ధరలను అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి శిద్దా రాఘవరావు విమర్శించారు. సోమవారం పల్లెపల్లెకు టిడిపి యాత్రలో భాగంగా మండలంలోని తానం చింతల పోతవరం, శేషంవారిపాలెం , కట్టుబడివారిపాలెం, రాజంపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన సభలలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నారన్నారు. కొనబొతే కొరివి అమ్మబోతే అడవి అన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వ పాలన తయారైయిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రైతులకు విత్తనాలు పంపిణీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని విమర్శించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్నా రైతులకు కావల్సిన విత్తనాలను సరఫరా చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. రాష్ట్రంలో పరిపాలన గాడిలో పడాలంటే చంద్రబాబు నాయకత్వం అవసరమని మహిళలు, రైతులు కోరుకుంటున్నారన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే రైతుల రుణమాఫీపై తొలి సంతకం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని, రైతులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని టిడిపికి అండగా నిలవాలన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి యన్‌టిఆర్ సుజల పథకం ద్వారా అందించేందుకు చంద్రబాబు నాయుడు ప్రణాళిక రూపొందించారన్నారు. మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు మాట్లాడుతూ వైయస్‌ఆర్‌సిపి కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందన్నారు. గతంలో పుట్టిన పార్టీలన్నీ కాలగర్భంలో కలిసి పోయాయని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కాలగర్భంలో కలిసిపోనుందని పేర్కొన్నారు. సురక్షితమైన పాలన అందించాలంటే ఒక్క చంద్రబాబుకే సాధ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు బల్లగిరి శీనయ్య, మాజీ సొసైటీ అధ్యక్షులు తంగా తిరుపతిరావు, ఆర్ మోషా, జోసఫ్ , శోభారాణి, అంజమ్మ, ఉల్లి రాములు, పి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు.
శతడిసి బూజుపట్టిన పౌష్టికాహారం
* అంగన్‌వాడీ కేంద్రాలకు తరలించేందుకు సిద్ధం
* అడ్డుకున్న గ్రామస్థులు
తర్లుపాడు, జూన్ 17: చిన్నారులకు అందించే పౌష్ఠికాహారం ఇటీవల కురిసిన వర్షాలకు తడిసి బూజుపట్టగా సోమవారం ఉదయం అంగన్‌వాడీ కేంద్రాలకు తరలించేందుకు కాంట్రాక్టర్ సిద్ధమయ్యాడు. విషయాన్ని గమనించిన స్థానికులు పాడైపోయిన పౌష్టికాహారాన్ని ఎక్కడికి తరలిస్తున్నారంటూ అడ్డుకోవడంతో ఏమి చెప్పాలో తెలియని పరిస్థితుల్లో కాంట్రాక్టర్ తడపడ్డాడు. పిల్లలు పౌష్టికంగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసిన ఈ పౌష్టికాహారాన్ని ఎంతో జాగ్రత్తగా భద్రపరచాల్సిన అధికారులు అండర్‌గ్రౌండ్‌లో నిల్వ ఉంచడంతో ఇటీవల కురిసిన వర్షాలకు నీరు లేక తడిసి బూజుపట్టింది. ఎలాగైనా ఈ పౌష్ఠికాహారాన్ని తమ నుంచి తరలించేందుకు అధికారులు సిద్ధమై కాంట్రాక్టర్‌కు బాధ్యతలు అప్పగించారు. ఇదే అదునుగా భావించిన కాంట్రాక్టర్ సోమవారం తరలించేందుకు ప్రయత్నించగా గ్రామస్థులు పట్టుకోవడంతో ముందుగా సమాధానం చెప్పేందుకు తడపడిన కాంట్రాక్టర్ చివరకు కురిచేడు సెక్టారుకు తరలిస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. సరుకు పంపిణీని చేయాలంటే నిబంధనల ప్రకారం రూట్ ఆఫీసర్ ఉండాలి. అలా లేకుండా తరలించేందుకు ప్రయత్నించడంతో అసలు ఈ పౌష్ఠికాహారం అంగన్‌వాడీ కేంద్రాలకా..? నల్లబజారుకా..? తరలించేది అన్న అనుమానం రావడంతో జిల్లా జాయింట్‌కలెక్టర్ యాకూబ్‌నాయక్‌కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న జెసి పౌష్ఠికాహారాన్ని స్థానిక రెవెన్యూ సిబ్బందికి అప్పగించాలని ఆదేశిస్తూ జిల్లా పిడిని సంఘటన స్థలానికి వెళ్ళి విచారణ జరపాలని ఆదేశించారు. దీనితో సోమవారం సాయంత్రం పిడి విద్యావతి తర్లుపాడు చేరుకొని విచారణ ప్రారంభించారు. ఈవిషయంపై విలేఖరులు ఆమెను వివరణ కోరగా తడిసి బూజుపట్టిన మాట వాస్తవమేనని, ఈ పౌష్టికాహారం విద్యార్థులకు పంపిణీ చేస్తే ఇబ్బందులు వస్తాయని చెబుతూ విచారణ జరిపి వాస్తవ నివేదికను జిల్లా జాయింట్‌కలెక్టర్‌కు అందచేయడం జరుగుతుందని, బాధ్యులైన వారిపై చర్యలు తప్పవని తెలిపారు. ఈమె వెంట సిడిపిఓ పి శారదమ్మ, తహశీల్దార్ విద్యాసాగరుడు, ఆర్‌ఐ మల్లికార్జున్ తదితరులు ఉన్నారు.
కార్పొరేట్ విద్యాసంస్థల్లో డిప్యూటీ డిఇఓ తనిఖీ
కందుకూరు, జూన్ 17: పట్టణ పరిధిలోని ప్రముఖ కార్పొరేట్ విద్యాసంస్థలైన భాష్యం, శ్రీచైతన్య, నారాయణ పాఠశాలలపై డిప్యూటీ డిఇఓ చాంద్‌బేగం సోమవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. తొలుత చైతన్య టెక్నోస్కూల్ ఆవరణానికి చేరుకుని టెక్నో అనే పదాన్ని తొలగించాలని యాజమాన్యానికి ఆదేశించారు. పాఠశాలకు సంబంధించిన అన్ని అనుమతి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అదేవిధంగా విద్యార్థుల నుండి వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను ఈనెల 27వ తేదిలోపు పాఠశాల ఆవరణలో బహిరంగంగా నోటీసు బోర్డులో ఉంచాలని ఆదేశించారు. తదుపరి నారాయణ పాఠశాలకు చేరుకుని పాఠశాల అనుమతి పత్రాలను అందజేయాలన్ని యాజమాన్యానికి సూచించారు. అయితే యాజమాన్యం అనుమతి పత్రాలు ఒంగోలు విద్యాసంస్థల ప్రధాన కార్యాలయంలో ఉన్నాయని ఫ్యాక్స్ ద్వారా తెప్పిస్తామని పది నిమిషాల తదుపరి అనుమతి పత్రాల నకలు డిప్యూటీ డిఇఓకు అందజేశారు. అగ్నిమాపక అధికారులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని చూపించాలని డిప్యూటీ డిఇఓ ప్రశ్నించగా సాయంత్రంలోపు అందజేస్తామని యాజమాన్యం సర్దిచెప్పుకుంది. అనంతరం భాష్యం పాఠశాలను తనిఖీ చేశారు. డిప్యూటీ డిఇఓ పాఠశాలకు చేరుకున్న సందర్భంలోనే యాజమాన్యం వివిధ తరగతులకు చెందిన పుస్తకాలను సంచులలో చేర్చి విక్రయిస్తున్నారు. పుస్తకాలు విక్రయించడం గమనించిన డిప్యూటీ డిఇఓ అక్కడికి చేరుకుని పుస్తకాలు ఎంతకు విక్రయిస్తున్నారు అని యాజమాన్యాన్ని ప్రశ్నించగా వౌనం వహించారు. ఈక్రమంలో ఆప్రాంతంలో తల్లిదండ్రులు నర్సరీ పాఠ్యపుస్తకాలు 2,050రూపాయలకు విక్రయించినట్లు డిప్యూటీ డిఇఓకు తెలిపారు. సంపూర్ణ సమాచారం కోసం ఒక్కొక్క తరగతి గదికి వెళ్లి విద్యార్థులను పాఠ్యపుస్తకాలు విక్రయించిన ధరల వివరాలు తెలుసుకుని యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి పాఠ్యపుస్తకాలు పాఠశాల ఆవరణలో విక్రయిస్తే కేసులు నమోదు చేయిస్తానని హెచ్చరించారు. పాఠశాలలో మరుగుదొడ్లలో నీటి సౌకర్యం లేదని ఈవిధంగా వ్యవహరిస్తారా అని మందలించారు. పాఠశాల అనుమతిపత్రాలు ప్రధాన కార్యాలయంలో ఉంచకూడదని, పాఠశాలలోనే ఉంచాలని ఆదేశించారు.
సాయిగణేష్ పాఠశాల మూసివేత
పట్టణ పరిధిలోని టిఆర్‌ఆర్ కళాశాల సమీపంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న శ్రీసాయిగణేష్ పాఠశాలను డిప్యూటీ డిఇఓ చాంద్‌బేగం ఆధ్వర్యంలో ఎంఇఓ బండి గోవిందయ్య మూసివేశారు. అనుమతులు లభించే వరకు పాఠశాలను తెరవరాదని, తెరిస్తే జరిమానా, క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయని పాఠశాల యాజమాన్యానికి హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఎంఇఓ బండి గోవిందయ్య, సిఆర్‌పిలు రవికుమార్, శ్రీనివాసరావు, రమణారెడ్డి, ప్రతిభ, కిరణ్ పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలను ఆదుకుంటాం
* లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కలెక్టర్
మార్కాపురం టౌన్, జూన్ 17: ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను అన్నిరకాలుగా ఆదుకుంటామని జిల్లా కలెక్టర్ విజయకుమార్ భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు సోమవారం మార్కాపురం వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడారు. బాధ్యత కలిగిన ఉద్యోగిగా ఉంటూ అందరితో కలిసిమెలిసి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే వ్యక్తిగా ఉద్యోగానికి వనె్న తెచ్చిన అధికారి మార్కాపురం మున్సిపల్ కమిషనర్ రవీంద్రారెడ్డి అని, ఆయన మృతి చెందడం బాధకరమని అన్నారు. ప్రమాదంలో మృతి చెందిన ప్రతిఒక్కరికి ప్రభుత్వపరంగా అందే ప్రయోజనాలను సమకూరుస్తామని, మృతుల కుటుంబాలకు లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతేకాక వాహనదారుల నుంచి కూడా అదనపు పరిహారం చెల్లించేందుకు కృషి చేస్తామని అన్నారు. ప్రైవేటు వాహనాల యాజమాన్యం ప్రయాణికుల పట్ల అభద్రతతో వ్యవహరిస్తుందని, ఒక రిజిస్టర్ ఒకే నెంబర్‌తో సదరు వాహన యజమాని మూడు బస్సులను నడపుతున్నాడని, ఒక్క వాహనానికి ఇద్దరు డ్రైవర్లు మాత్రమే నెలంతా పని చేస్తారని, ప్రమాదాలకు గల ప్రధాన కారణాలను విలేఖరులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనితో స్పందించిన కలెక్టర్ ఆర్‌టిఓతో చర్చించి ప్రైవేటు వాహనాలపై చర్యలు తీసుకుంటామని, ట్రావెల్స్‌పై నిఘా ఉంచి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.
‘వడ్డెరలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి’
ఒంగోలు అర్బన్, జూన్ 17 : జిల్లాలోని నిరుపేదలైన వడ్డెరలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని శ్రమజీవుల వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు తన్నీరు శేషగిరిరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుపేదలైన వడ్డెరులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ సోమవారం గ్రీవెన్స్‌సెల్‌లో బాధితులతో కలిసి వినతిపత్రాలు సమర్పించామన్నారు. నిరుపేదలైన వడ్డెరుల బతుకుదెరువు కోసం కులవృత్తికి సంబంధించిన పనిముట్లను పంపిణీ చేయాలని కోరారు. వారందరికీ విరివిగా రుణాలు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు. ఇప్పటికే ఈ విషయాలపై ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డితో చర్చించడం జరిగిందని, ఆయన కూడా సానుకూలంగా స్పందించారన్నారు.జిల్లాలోని మువ్వావారిపాలెం, మర్రిపాలెం, వడ్డెరులకు రుణాలు మంజూరు చేయాలని కోరారు. త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు జిల్లాలోని అన్నీ మండలాల్లో నివాసం ఉంటున్న వడ్డెరులకు విరివిగా రుణాలు మంజూరు చేయాలని కోరారు. సోమవారం గ్రీవెన్స్‌సెల్‌లో చీమకుర్తి మండలం నుండి 25 మంది వడ్డెరులు తమకు వ్యాపార నిమిత్తం రుణాలు మంజూరు చేయాలని వినతి పత్రాలు సమర్పించారు. అదేవిధంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయాలని కోరారు. వడ్డెర వృద్ధులకు పెన్షన్లు ఇవ్వాలని, కంటి శుక్లాల ఆపరేషన్లు ఉచితంగా చేయించాలని కోరారు.
ఆంధ్రా-ఒడిశా సరిహద్దు చెక్‌పోస్టుపై ఎసిబి దాడి
శ్రీకాకుళం/ఇచ్ఛాపురం, జూన్ 17: ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఇచ్ఛాపురం(పురుషోత్తపురం) వద్ద గల చెక్‌పోస్టుపై ఆదివారం రాత్రి అవినీతి నిరోధక శాఖాధికారులు దాడి చేసి కేవలం ఆరు గంటల్లోనే రెండు లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఎసిబి డి.ఎస్.పి. రఘువీరా తెలిపిన వివరాల మేరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 43 మంది ఎసిబి అధికారులు ఆదివారం రాత్రి రెండుగంటల సమయంలో ఐదుగురు సి.ఐ.లు, ఎనిమిది మంది గజిటెడ్ అధికారులు, 15 మంది టాస్క్ఫోర్సు సిబ్బందితో పాటు మరో 15 మంది సిబ్బంది ఆర్టీసి బస్సులో చెక్‌గేటు వద్దకు చేరుకున్నారు. ఐదు గ్రూపులుగా విడిపోయిన వీరు నాలుగువైపుల నుండి కట్టడి చేశారు. అక్కడున్న వారు బయటకు వెళ్లేందుకు వీలులేకుండా 15 మంది దళారులను పట్టుకున్నారు. చెక్‌గేటులోకి వెళ్లిన సి.ఐ.లు వాహనాల డ్రైవర్లకు అనుమానం రాకుండా తనిఖీల్లో పత్రాలతోపాటు వారు ఇస్తున్న డబ్బులను తీసుకున్నారు. ఈ విధంగా రాత్రి రెండు గంటల నుండి ఉదయం ఎనిమిది గంటల వరకు చేసిన తనిఖీల్లో ఒక్కో లారీకి 700 నుండి వెయ్యిరూపాయలు చొప్పున మొత్తం 1.10 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు 15 మంది బ్రోకర్లలో ఒకరి వద్ద నుండి 70 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ తెలిపారు. ఎసిబి అధికారులకు చిక్కిన 15 మంది దళారుల వద్ద నుండి వ్యక్తిగత వాంగ్మూలం తీసుకొని ఎప్పుడు పిలిస్తే అప్పుడు హాజరు కావాలని చెప్పి వారిని విడిచిపెట్టారు. అనంతరం ఎసిబి డిఎస్పీ మాట్లాడుతూ చెక్‌గేటుపై అనేక ఫిర్యాదులు రావడంతో ఆకస్మిక తనిఖీ చేశామన్నారు. ఎవరికి అనుమానం రాకుండా తమ సిబ్బందికి సైతం తెలియకుండా తనిఖీ కేంద్రం వద్దకు చేరుకున్నామని తెలిపారు. కేవలం రాత్రి రెండు నుండి ఆరు గంటల్లో రెండు లక్షలు వసూలైందని, అదే 12 గంటలు తనిఖీ చేసినట్లయితే ఏడు లక్షలకు పైగా వసూలవుతుందని వెల్లడించారు. లంచం ఇస్తున్న వారుంటే తీసుకున్నవారుండటం కొనసాగుతుందని, ప్రజల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ తనిఖీల్లో జాప్యం జరిగి రోడ్డుపై ట్రాఫిక్ పెరిగిపోయిందని చెప్పారు. చెక్‌పోస్టు ఎ.ఒ కేశవరావు రాత్రిపూట విధులకు హాజరుకారని, పగలే ఉంటారని ఆయన తెలిపారు. తమ నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని చెప్పారు.
చెక్‌పోస్టుపై కొరవడిన నిఘా!
చెక్‌పోస్టుపై నిఘా కొరవడడంతో అవినీతికి అంతే లేదు. నిఘా కెమెరాలు పనిచేయకపోవడం, ఎసిబి వార్షిక తనిఖీలు గత రెండేళ్లుగా జరుగకపోవడంతో అవినీతికి అంతులేకుండాపోయింది. ఆదివారం జరిగిన దాడిలో అవినీతి బట్టబయలైంది.
భారీ స్థాయిలో ఎసిబి దాడి
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అవినీతి నిరోధక శాఖాధికారులు ఒకేసారి 43 మంది దాడి చేసి దళారులు తప్పించుకునేందుకు వీలు లేకుండా నాలుగువైపుల నుంచి ముట్టడించారు. బస్సులో వచ్చే ఎసిబి డిఎస్పీ తమ సి.ఐ.లకు సైతం తెలియజేయకుండా డ్రైవర్లు, బ్రోకర్ల వలె లుంగీలతో దాడిలో పాల్గొన్నారు. ఇతరులకు అనుమానం లేకుండా దాడి చేశారు. పరుగులు తీసే దళారులు సైతం సిబ్బంది పట్టుకోగలిగారు. 15 మంది దళారులను చెక్‌పోస్టులో పట్టుకోవడం ఇదే ప్రథమం. తనిఖీ అనంతరం ఎసిబి డిఎస్పీ స్వయంగా చెక్‌గేటులో ఉన్న కౌంటర్లను, గదులను, బయట పరిసరాలను వీడియో తీశారు. ఈతనిఖీలో ఎసిబి సి.ఐ.లు రాఘవరావు, అజయ్, రమణమూర్తి, లక్ష్మూజీ, రమేష్‌లు, ఇతరసిబ్బంది పాల్గొన్నారు.
ప్రజాసంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం
కంచిలి, జూన్ 17: ప్రజాసంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని కేంద్ర ఐటి సహాయ మంత్రి కిల్లి కృపారాణి అన్నారు. సోమవారం రాహుల్‌సంకల్పయాత్రలో భాగంగా కంచిలి మండలంలో పర్యటించిన కేంద్రమంత్రి ముందుగా శాసనంకు చేరుకొని ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం గోకర్ణపురం, నారాయణపురం మీదుగా బూరగాంకు చేరుకొని పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. అనంతరం పుక్కళ్లపుట్టుగ, సన్నాయిపుట్టుగ, తలతంపర గ్రామాల్లో పర్యటించినప్పుడు అక్కడ ప్రధానంగా బెంతు ఒరియాలు తమ కులదృవపత్రాలను మంజూరు చేయాలని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకురాగా, ఈ విషయంపై స్పందించిన మంత్రి ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో మాట్లాడి ఎస్సీ కులాల్లో చేర్చేందుకు కృషి చేస్తానన్నారు. మండపల్లికి చేరుకున్న మంత్రిని పర్యావరణ నాయకులు 1107 జీవోను రద్దు చేయాలని ఆందోళనకు దిగారు. ఈ విషయమై మంత్రి మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రితో మాట్లాడడం జరిగిందని, మరల ముఖ్యమంత్రితో చర్చించి త్వరలో 1107 జీవో రద్దుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మండపల్లిలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి బంజీరు, సత్తివరం, చిన్నకొజ్జిరి, పెద్దకొజ్జిరి గ్రామ పంచాయతీల్లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బసవపుట్టుగలో నూతనంగా నిర్మించిన స్కూల్ భవనాన్ని ప్రారంభించారు. జాడుపుడిలో జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ ప్రతి పేదవాడిని కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుందని, రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు కొరత లేకుండా అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, పేదవారికి పక్కా ఇళ్లు కూడ నిర్మించేందుకు కృషి చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్‌గాంధీ ఆశయాలకు అనుగుణంగా మనమంతా నడుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సోంపేట మాజీ జడ్‌పిటిసి దాస్, నవీన్‌కుమార్‌అగర్వాల్(బబ్లూ), ఇప్పిలి కృష్ణారావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొల్లి ఈశ్వరరావు, చినబాబు, పిలక చినబాబు, రజనీకాంత్‌దొళాయి తదితరులు పాల్గొన్నారు.
రైతులకు అన్ని విధాలా సహకరిస్తాం
* జిల్లా కలెక్టర్
శ్రీకాకుళం, జూన్ 17: జిల్లాలో పూర్తిస్థాయిలో విత్తనాలు, ఎరువులు అందించి రైతులకు అన్ని విధాలా సహకరిస్తామని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సెట్‌కాన్ఫరెన్సులో వివిధ శాఖల పనితీరుపై ఆయ న సమీక్షించారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు 50 వేల క్వింటాల విత్తనాలు సరఫరా లక్ష్యంగా నిర్ధేశించామని, ఇప్పటివరకు 41 వేల క్వింటాల విత్తనాలు జిల్లాలో సరఫరా అయ్యాయని తెలిపా రు. రెండువేల క్వింటాల విత్తనాలను నిల్వగా ఉంచగా మరో ఏడువేల క్వింటాలు మార్క్‌ఫెడ్ ద్వారా రప్పిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో 17,700 మెట్రిక్ టన్నుల ఎరువులను సరఫరా చేసేందుకు లక్ష్యంగా నిర్ధేశించామని పేర్కొన్నారు. జిల్లాలో అన్ని గ్రామాలకు విత్తనాలు, ఎరువులను సరఫరా చేసేందుకు మండలాల వారీగా వాహనాలను సిద్ధం చేసుకోవాలన్నారు. గత ఏడాదికంటే ఎక్కువ శాతం విత్తనాలను పంపిణీ చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్యం- ఆరోగ్యంపై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సీతంపేట ఏజన్సీలో మలేరియా వ్యాధి ప్రబలకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 17 నుండి 23 వరకు పారిశుద్ధ్య వారోత్సవాలను నిర్వహించాలని తెలిపారు. ఈ సెట్‌కాన్ఫరెన్సులో డిఆర్వో నూర్‌భాషాఖాసీం, జిల్లా పరిషత్ సిఇఒ కైలాసగిరీశ్వర్, వ్యవసాయ శాఖ జె.డి మురళీకృష్ణారావు, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, డిఇఒ అరుణకుమారి, డ్వామా పి.డి కల్యాణచక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
‘గెలుపే లక్ష్యంగా పనిచేయండి’
శ్రీకాకుళం, జూన్ 17: పంచాయతీ ఎన్నికల్లో పట్టుసాధించి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సూచించినట్టు తెలిసింది. సోమవారం రాత్రి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహంపై సమావేశం నిర్వహించారు. జిల్లాకు చెందిన మంత్రులు, శాసనసభ్యులు, ముఖ్యనేతలను కలుపుకొని అన్ని పంచాయతీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించేలా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో సత్ఫలితాలు అందిస్తున్నాయా, లేదా అన్న విషయాన్ని కూడా ఈ ఎన్నికలు రుజువు చేస్తాయన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. నియోజకవర్గాల వారీగా క్యాడర్‌తో సమావేశాలు నిర్వహించి అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు విజయపథంలో పయనించేలా ముందస్తు ప్రణాళిక అమలుచేయాలని స్పష్టంచేసారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమపథకాలను పార్టీ శ్రేణుల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లి పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించాలన్నారు. సమన్వయంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పూర్తిస్థా యి విజయాలు సొంతం చేసుకున్నట్లయితే మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలు వంటి స్థానిక సంస్థలు కాంగ్రెస్ ఖాతాలో జమ అవుతాయన్న విషయాలన్ని దృష్టిలో ఉంచుకుని ఎంతో ప్రతిష్టాత్మకంగా పనిచేయాలన్నారు. ఈ ఎన్నికలు 2014 శాసనసభ, పార్లమెంట్‌కు జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు నాంది కావాలన్న లక్ష్యంతో శాసనసభ్యులంతా శ్రమించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.ఈ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఏరేసు ప్రతాప్‌రెడ్డి, మంత్రులు శతృచర్ల విజయరామరాజు, కోండ్రు మురళీమోహన్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, శాసనసభ్యులు బొడ్డేపల్లి సత్యవతి, మీసాల నీలకంఠంనాయుడు, కొర్ల భారతి, జుత్తు జగన్నాయకులు, నిమ్మక సుగ్రీవులు హాజరయ్యారు.
చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కరించాలి
శ్రీకాకుళం , జూన్ 17: జిల్లా ఆమదాలవలస మండలం దూసి కాన్‌కాస్ట్ పరిశ్రమ కార్మికుల చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దుప్పల గోవిందరావు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ వద్ద కాన్‌కాస్ట్, నీలం జూట్ మిల్లు కార్మికులతో సంయుక్తంగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనియన్ నాయకులకు యాజమాన్య ప్రతినిధులకు మద్య గతంలో నిర్వహించిన ఒప్పందం ప్రకారం చార్టర్ ఆఫ్ డిమాండ్ అమలు మార్చి నెలతో ముగిసి మూడు నెలలు కావస్తున్నా అమలు కాకపోవడం అన్యాయమన్నారు. వెంటనే జిల్లా యంత్రాంగం చొరవ చూపి చార్టర్ ఆప్ డిమాండ్స్‌ను అమలు చేసి కార్మికుల హక్కులను కాపాడాలని కోరారు.
* అక్రమ లాకౌట్ ఎత్తివేయాలి
రూరల్ మండలం మునసబుపేట వద్ద ఉన్న నీలం జూట్ మిల్లు అక్రమ లాకౌట్ ఎత్తివేయాలని సిటు నాయకులు డిమాండ్ చేశారు. అక్రమ లాకౌట్ కారణంగా సుమారు వెయ్యిమంది కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 24 ఏళ్లుగా కార్మికులకు కనీసవేతనం అమలు చేయకుండా యాజమాన్యం శ్రమదోపిడీకి పాల్పడటంతో కార్మికులు పోరాటమార్గం పట్టారని, దీనికి యాజమాన్యం లాకౌట్ ప్రకటించడం అన్యాయమన్నారు.
కార్మిక చట్టాలు అమలుచేయడంలో జిల్లా యంత్రాంగం విఫలమైందని విమర్శించారు. ఇప్పటికైనా యంత్రాంగం చొరవచూపి కార్మిక హక్కులను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో ఎం.సూర్యనారాయణ, ఎన్.సూరిబాబు, ఎన్.ఆదినారాయణ, తంగి సూర్యనారాయణ, డి.రాములు, ఎస్.సుందరరావు, డి.సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.
అర్చకస్వాములకు విజయపత్రాలు
శ్రీకాకుళం, జూన్ 17: ఆగమపరీక్షల్లో ఉత్తీర్ణులైన అర్చక స్వాములకు దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఇన్‌చార్జి సహాయ కమిషనర్ శ్యామలాదేవి విజయపత్రాలు అందించారు. ఫిబ్రవరి మూడవ తేదీన అరసవల్లి కేంద్రంగా నిర్వహించిన రాత, వౌఖిక పరీక్షలు జరిగాయి. 422 మంది పురోహితులు హాజరు కాగా 131 మంది పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. ఇదిలా ఉండగా ప్రవేశ 91, వర 123, ప్రవరలో 77 మంది ఉత్తీర్ణులైన స్వాములకు ధృవపత్రాలు అందుకున్నారు. హాల్‌టిక్కెట్ నకలు కార్యాలయానికి సమర్పించిన వారికే సర్ట్ఫికేట్లు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె అర్చకులకు పలు సూచనలిచ్చి అభినందించారు.
రైలు ఢీకొని ఒకరి మృతి
* 40 గొర్రెలు మృతి
నరసన్నపేట, జూన్ 17: మండలంలో కంబకాయ గ్రామ శివార్లలో జరిగిన రైలు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా 40 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. సోమవారం మధ్యాహ్నం ఇచ్ఛాపురం నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ ఢీకొన్న ఘటనలో మండలం లకిమేర గ్రామానికి చెందిన బి.సూర్యనారాయణ(55) మృతిచెందగా అతనికి చెందిన 40 గొర్రెలు మృతిచెందాయి. రైల్వే హెచ్.సి కృష్ణారావు మాట్లాడుతూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం నిమిత్తం సూర్యనారాయణ మృతదేహాన్ని నరసన్నపేట ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. మృతునికి భార్య లచ్చమ్మ, ఇద్దరు కుమారులున్నారు. తెల్లవారుఝామున లకిమేర గ్రామం నుండి 300 గొర్రెలను మేత నిమిత్తం సూర్యనారాయణ బయటకు తీసుకువెళ్లాడని బంధువులు తెలిపారు. పశువైద్యాధికారి ఎల్.లక్ష్మణరావు గొర్రెలకు పోస్టుమార్టం నిర్వహించారు.
ఉత్తమ అధ్యాపకులుగా ఎదగాలి
ఎచ్చెర్ల, జూన్ 17: మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠ్యాంశాలను విద్యార్థులకు బోధించడంలో మెళకువలు పాటించి ఉత్తమ అధ్యాపకులుగా ఎదగాలని అంబేద్కర్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ హెచ్.లజపతిరాయ్ స్పష్టంచేశారు. ఇక్కడ సేవలందిస్తున్న టీచింగ్ అసోసియేట్స్‌కు రెండురోజుల పాటు నిర్వహించిన వౌఖిక పరీక్షల్లో భాగంగా సోమవారం వీటిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిహెచ్‌డిలు, డాక్టరేట్‌లు ముఖ్యం కాదని, సమస్యను ఛేదించేలా అధ్యాపకులు ముందుకు సాగాలన్నారు. పునశ్చరణ తరగతులతోనే తాజా పరిజ్ఞానం పెంపొందుతుందన్నారు. ఈ పరిజ్ఞానంతోనే విద్యార్థులకు పాఠాలు బోధించిన నాడు సత్ఫలితాలు సాధించవచ్చునన్నారు. పరిశోధనాత్మక పుస్తకాలు రచించేటప్పుడు పిహెచ్‌డి అభ్యర్థులే రచయితలుగా తయారు కావాలన్నారు. స్వతంత్రంగా ఆర్టికల్స్ రూపొందించి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఎన్ని సెమినార్లకు హాజరైనా ఐదు మార్కులే లభిస్తాయని, పబ్లికేషన్‌పై దృష్టిసారిస్తే అధికమార్కులు సాధించవచ్చునన్నారు.
ఇంటర్నల్‌కు 20, ఎక్స్‌టర్నల్‌కు 80 మార్కులు పి.జి స్టూడెంట్లకు లభించేలా పాఠాలు బోధించాలన్నారు. నెట్, పిహెచ్‌డి అర్హతలే ముఖ్యం కాదని, విశే్లషణాత్మక బోధన సాగించాలని సూచించారు. మరో రెండు, మూడురోజుల్లో బోధనా సిబ్బంది కోసం నోటిఫికేషన్ జారీ చేస్తామని , వీటిలో ప్రతిభ కనబర్చి నియామకాలు పొందాలన్నారు. జర్నల్స్, మ్యాగజైన్స్‌లో ఉన్న అంశాలను విద్యార్థులకు బోధన చేసేటప్పుడు కొత్తదనాన్ని అందించాలన్నారు. ఈయనతోపాటు సిడిసి డీన్ తులసీరావు, ప్రిన్సిపాల్ ఎం.చంద్రయ్యలు ఉన్నారు. విభాగాల వారీగా టీచింగ్ అసోసియేట్స్‌కు వౌఖిక పరీక్షలు నిర్వహించారు.
పట్టణంలో మంచినీటి వసతి కల్పించండి
* గ్రీవెన్స్‌లో కమిషనర్‌ను ఆదేశించిన కలెక్టర్
శ్రీకాకుళం , జూన్ 17: పట్టణంలో తాగునీటి సమస్య లేకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ పి.రామలింగేశ్వర్‌ను జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన ఫిర్యాదుల విభాగంలో కలెక్టర్ సౌరభ్‌గౌర్, జాయింట్ కలెక్టర్ పోలా భాస్కర్‌లు అర్జీలు స్వీకరించారు. పట్టణంలోని దమ్మలవీధి దిగువ ప్రాంతంలో నివసిస్తున్న ఎస్సీ రిక్షా కార్మికులకు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారని, పరిష్కరించాలని కోరగా కలెక్టర్ పై విధంగా స్పందించారు. బూర్జ మండలం కొల్లివలస గ్రామానికి చెందిన టి.రమణమ్మ అనే వికలాంగురాలుకు మూడు చక్రాల సైకిళ్లను డిఆర్‌డిఎ ద్వారా అందజేశారు. వంశధార ప్రోజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన సుమారు 30 మంది నిర్వాశిసుతలో 13 మంది తాత్కాలిక ఉద్యోగాలు చేస్తున్నారని, వారికి 12 నెలలుగా జీతభత్యాలు అందక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హిరమండలానికి చెదిన ఎం.్భస్కరరావు తెలిపారు. పొందూరు మండలం కనిమెట్ట గ్రామానికి చెందిన మహిళలు తమకు జాతీయ ఉపాధిహామీ పనుల కల్పన నిలుపుదల చేయుట వలన ఉపాధికి తాము ఇబ్బంది పడుతున్నామని, పునరుద్ధరించాలని కోరారు. మున్సిపాల్టీలో గత 20 ఏళ్లుగా 25 మంది ఆయాలుగా పనిచేస్తున్నప్పటికీ వారికి కనీస వేతనం అమలుచేయడం లేదని అది అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సభ్యులు కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో ఎజెసి రాజ్‌కుమార్, డుమా పిడి కళ్యాణ్‌చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
జాతీయ రహదారి పక్కన ఉన్న బెల్ట్‌షాపులు ఎత్తివేయాలి
* దేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బాబ్జి
శ్రీకాకుళం, జూన్ 17: జిల్లాలో జాతీయ రహదారి వెంబడి ఉన్న బెల్టుషాపులు ఎత్తేయాలని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు బెల్టుషాపులను నివారించాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి (బాబ్జి) అన్నారు. సోమవారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇటీవల బెల్టుషాపులు ఎత్తేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. కొత్త మద్యం షాపుల ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాన్ని విరమించుకోవాలని హితవు పలికారు. జాతీయ రహదారి వెంబడి మద్యం షాపులను ఎత్తేయాలని న్యాయాస్థానాలు చెబుతున్నా, మద్యం షాపులు తగ్గాల్సింది పోయి బెల్టుషాపులు పెంచుకుపోతున్నారని ఆరోపించారు. దీంతో విచ్చలవిడి అమ్మకాలు జరిగి ప్రమాదాలకు కారణమవుతున్నాయని తెలిపారు. ఎచ్చెర్ల మండలం అల్లినగరంలో గత మూడు మాసాలుగా తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొన్న విషయాన్ని అధికారుల దృష్టికి అనేక పర్యాయాలు తీసుకువెళ్లినా ఇంతవరకు చర్యలు కానరావడం లేదని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన తామే అనేక పర్యాయాలు వినతులు అందజేసినా అధికారులు స్పందించనపుడు ఇక సామాన్యుడి గతేంటని ప్రశ్నించారు. సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, పార్టీ నాయకులు బగాది శేషు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో సిపిఎం సర్వే
శ్రీకాకుళం , జూన్ 17: పట్టణంలోని పలు పాఠశాలల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నప్పటికీ, నిర్వహణ కొరవడి అధ్వాన్నంగా ఉన్నాయని, పిల్లలకు ఇంత వరకూ పాఠ్యపుస్తకాలు అందక చదువులు కుంటుపడుతున్నాయని, ఆటస్థలం వంటి వౌలిక సదుపాయాలు లేవని సర్వే సందర్భంగా కనుగొన్నట్లు వారు వెల్లడించారు. ఈ సందర్బంగా సిపియం పట్టణ కార్యదర్శి పంచాది పాపారావు మాట్లాడుతూ హడ్కోకాలనీలోని బలగ మున్సిపల్ హైస్కూల్‌లో 547 మంది విద్యార్ధులు ఉన్నారన్నారు. ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న వారికి నేటికీ పాఠ్యపుస్తకాలు అందక చదువులు కుంటుపడుతున్నాయని, సర్కారు బడుల పరిస్థితి ఈ విధంగా ఉందని నిరుత్సాహం వ్యక్తం చేశారు. స్కూల్‌లో మరుగుదొడ్లు ఉన్నప్పటికీ నిర్వహణ కొరవడటంతో దుర్గంధం వ్యాప్తిచెంది విద్యార్ధులు రోగాల బారిన పడే అవకాశముందన్నారు. వంటగది అసంపూర్ణంగా ఉండటంతో పిల్లల ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆటస్థలం ఉన్నప్పటికీ చిన్నపాటి చినుకుపడితే చిత్తడిగా మారి, కనీసం పాఠశాలలో ప్రవేశించడానికి వీల్లేని విధంగా రహదారి ఉందని తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచి, విద్యార్ధుల చదువులకు ఆటంకం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎప్‌ఐ జిల్లా కార్యదర్శి వై.చలపతిరావు, డి.మనోహర పట్నాయక్, ఆర్.చిన్నమ్మడు, సిపియం నాయకులు పి.ప్రభావతి, ఎస్.సూరమ్మ, వై.లలిత తదితరులు పాల్గొన్నారు.
ఇంకుడు గుంతలుంటేనే మంచినీరు
విశాఖపట్నం, జూన్ 17: నానాటికీ దిగజారుతున్న భూగర్భ జలాల స్థాయిని పరిరక్షించుకునే చర్యలకు జివిఎంసి శ్రీకారం చుట్టింది. నగర పరిధిలో బహుళ అంతస్తుల భవనాల్లో ఇంకుడు గుంతలను తప్పనిసరి చేస్తూ జివిఎంసి ఆంక్షలు విధించింది. కొత్తగా బహుల అంతస్తుల భవనాలకు ఆక్యుపెన్సీ సర్ట్ఫికెట్ ఇవ్వాలంటే ఇంకుడు గుంతలను విధిగా ఏర్పాటు చేయాల్సి ఉంటుందని జివిఎంసి కమిషనర్ ఎంవి సత్యనారాయణ తెలిపారు. తన ఛాంబర్‌లో సోమవారం కలిసిన విలేఖరులతో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న బహుళ అంతస్తుల భవనాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. లేనిపక్షంలో వీరికి మంచినీటి సరఫరాను నిలిపివేయనున్నట్టు తెలిపారు. నగర పరిధిలో సుమారు 2000 వరకూ బహుళ అంతస్తుల భవనాలున్నాయని, వీటిలో ఏఒక్కదానికీ ఇంకుడు గుంతలు లేవని తెలిపారు.
జగదాంబ జంక్షన్‌కు కొత్త అందాలు
విశాఖ పేరు చెబితేనే గుర్తుకువచ్చే జగదాంబ జంక్షన్‌కు మహర్ధశ పట్టనుంది. జంక్షన్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు, పైనడక వంతెనల నిర్మాణం వంటివి చేపట్టనున్నట్టు కమిషనర్ వెల్లడించారు. అలాగే కలెక్టరేట్ జంక్షన్, సరస్వతి పార్కు, డైమండ్ పార్కులను పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించనున్నట్టు తెలిపారు. ఇందుకోసం 50 లక్షల రూపాయలను ఖర్చు చేయనున్నట్టు తెలిపారు.
నగరంలోని ఫుట్‌పాత్‌లపై చెట్లను సంరక్షించే బాధ్యతను దుకాణ యజమానులకు అప్పగించనున్నట్టు తెలిపారు. నగర పరిధిలోని సుమారు 16.5 కిమీ మేర ఫుట్‌పాత్‌లు ఉన్నాయని, కిలోమీటరుకు 200 చొప్పున 3200 మొక్కలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఫుట్‌పాత్‌లు కాంక్రీటుతో కప్పివేయడం వల్ల మొక్కలకు నీరు అందదని, దీన్ని దృష్టిలో ఉంచుకుని మొక్కకు ఇరువైపులా రెండు అడుగుల మేర కాంక్రీట్‌ను తొలగించి వాటిని సంరక్షించడం ద్వారా ఫుట్‌పాత్‌ల వెంబడి పచ్చదనాన్ని పెంపొందించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లలో చేపట్టిన నిర్మాణాలను తొలగించేందుకు కార్యాచరణ చేపట్టనున్నట్టు తెలిపారు. నగర పరిధిలో సుమారు 4000 వరకూ వాణిజ్య సముదాయాలున్నాయని, వీటిలో 1500 భవన సముదాయాల్లో ప్రైవేటు విద్యాసంస్థలు పాఠశాలలు నడుపుతున్నాయని తెలిపారు. ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల భవనాల్లో పాఠశాలలు నడుపుతున్న వారికి నోటీసులు ఇవ్వడంతో పాటు సెల్లార్ నిర్మాణాలను కూల్చివేసేందుకు జివిఎంసి పట్టణ ప్రణాళిక విభాగం కార్యచరణ చేపట్టిందన్నారు. అలాగే కొన్ని బహుళ అంతస్తుల భవనాల్లో నడుస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులకు సైతం నోటీసులు జారీ చేసినట్టు ఆయన తెలిపారు.
నగరంలో రెవెన్యూ అధికారుల బదిలీల విషయాన్ని ప్రస్తావిస్తూ ఆదాయాన్ని పెంచి పనితీరు నిరూపించుకున్న వారికి బదిలీల్లో ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. అత్యధికంగా బహుళ అంతస్తులు, వాణిజ్య సముదాయాలు ఉన్న ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు నిబంధనల మేరకు ఆస్తిపన్ను మధింపు ప్రక్రియను చేపడతారని తెలిపారు.
రేపు ఎడిసి జానకి బాధ్యతల స్వీకరణ
* కొత్త ఛాంబర్ ఏర్పాటు
విశాఖపట్నం, జూన్ 17: మహావిశాఖ నగరపాలక సంస్థలో అదనపు కమిషనర్‌గా ఐఎఎస్ అధికారి జానకి ఈనెల 19న బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం రూరల్ విభాగం నుంచి ఆమె పట్టణాభివృద్ధి విభాగానికి వస్తున్నారు. ఐఎఎస్ అధికారికి ప్రాధాన్యత మేరకు కొత్త ఛాంబర్‌ను కేటాయించేందుకు జివిఎంసి సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఎడిసి (జనరల్)గా బాధ్యతలు నిర్వహిస్తున్న కె రమేష్ ఛాంబర్‌నే ఆమెకు కేటాయించనున్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న ఐఎఎస్ అధికారికి ఏబాధ్యతలు కేటాయిస్తారని కమిషనర్ ఎంవి సత్యనారాయణను విలేఖరులు ప్రశ్నించగా కీలక బాధ్యతలే అప్పగించనున్నట్టు తెలిపారు.
చైనాలో ఆచూకీ లేని విశాఖ యువకుడు
* ఆరు మాసాలుగా లేని సమాచారం
* ఆందోళనలో తల్లిదండ్రులు
* కలెక్టర్, కమిషనర్‌కు ఫిర్యాదు
విశాఖపట్నం, జూన్ 17: చైనాలో ఉద్యోగం చేసేందుకు వెళ్లిన విశాఖ నగరగానికి చెందిన 26 ఏళ్ళ యువకుడి ఆచూకీ తెలియటం లేదు. ఆరు మాసాలుగా ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు సోమవారం జిల్లా కలెక్టర్ వి శేషాద్రిని ఆశ్రయించారు. ఇప్పటికే నగర పోలీసు కమిషనర్ శివధర్‌రెడ్డికి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. విశాఖ అల్లిపురం వెంకటేశ్వరమెట్టలో నివశిస్తున్న కన్నూరి రామారావు కుమారుడు వెంకటేశ్ ప్రైవేటు టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తూ, 2011 ఏప్రిల్ 21వ తేదీన హోటల్ మేనేజ్‌మెంట్ ఉద్యోగం నిమిత్తం చైనాకు వెళ్ళాడు. ఏడాదిన్నర పాటు ఉద్యోగం చేసిన తరువాత గత ఏడాది అక్టోబర్‌లో విశాఖలో తిరిగి వచ్చాడు. మళ్లీ చైనా వెళ్ళే ప్రయత్నంలో నవంబర్‌లో వీసాకు దరఖాస్తు చేసుకోవడంతో డిసెంబర్‌లో రావటంతో వెంటనే బయలుదేరివెళ్ళాడు. అక్కడ నుంచి ఈ ఏడాది జనవరి 5 తేదీ వరకు తల్లిదండ్రులు, సోదరిలతో ఫోన్‌లో మాట్లాడుతుండేవాడు. జనవరి 5 నుంచి ఫోన్ రాలేదు. ఇక్కడ నుంచి మాట్లాడేందుకు కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. కనీసం ఈ నెల 13వ తేదీన పుట్టినరోజునైనా వెంకటేష్ నుంచి ఫోన్ వస్తుందని భావించిన కుటుంబ సభ్యులకు నిరాశే ఎదురైంది. అప్పటి నుంచి అనేక రకాలుగా ప్రయత్నిస్తున్న కుటుంబ సభ్యులు నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఎంతకీ ఫలితంలేకపోవడంతో చివరకు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ వి శేషాద్రిని కలిసిన వెంకటేష్ తల్లి గంగమ్మ, సోదరి కనకమహాలక్ష్మి తమ గోడును వినిపించుకున్నారు. తన కుమారుని ఆచూకీ తెలిస్తే చాలని, ఉద్యోగం చేసుకుంటున్నాడనే సమాచారం తెలపాల్సిందిగా ఆమె కలెక్టర్‌ను వేడుకుంది. ఒకే మగ దిక్కు అయిన తన కుమారుడి ఆదాయంతోనే కుటుంబపోషణ ఉండేదని, ఎన్నో ఆశలు పెట్టుకున్న తామందరి పరిస్థితి దయనీయంగా మారిందని ఆమె కన్నీటి పర్యంతమైంది.
దేశంలో సైబర్ నేరాల్లో
రెండో స్థానంలో విశాఖ
* నగరంలో బీహారీలకు ప్రత్యేక శిక్షణ
* మొదటి స్థానంలో బెంగళూరు
* హైదరాబాద్‌లో గణనీయంగా తగ్గిన నేరాలు
* నేషనల్ బ్యూరో ఆఫ్ క్రైం రికార్డ్స్ నివేదిక
విశాఖపట్నం, జూన్ 17: దేశంలో సైబర్ నేరాలు ఓపక్క తగ్గుముఖం పడుతుంటే, విశాఖలో వీటి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నేషనల్ బ్యూరో ఆఫ్ క్రైం రికార్డ్స్ సంస్థ తాజాగా వెల్లడించిన నివేదికలో సైబర్ నేరాల్లో బెంగళూరు నగరం మొదటి స్థానంలో నిలువగా, రెండో స్థానంలో విశాఖ నగరం నిలిచింది. సైబర్ నేరాలు అత్యధికంగా జరిగే రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా, బెంగళూరు రెండో స్థానంలో, ఆంధ్ర ప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. ఒకప్పుడు సైబర్ నేరాలు ముంబై, బెంగళూరులతోపాటు హైదరాబాద్‌లో కూడా ఎక్కువగా జరిగేవి. కానీ ఇప్పుడు హైదరాబాద్‌లో సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా తగ్గడం గమనార్హం. సైబర్ నేరాలు, వాటి తీరుతెన్నులు, ఇందుకు పాల్పడుతున్న వారి వివరాలను ఎన్‌బిసిఆర్ తెలియచేసిన వివరాలు అత్యంత ఆశ్ఛర్యకరంగా ఉన్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సైబర్ నేరాలు ముఖ్యంగా వ్యక్తులు, ఆస్తులు, ప్రభుత్వాలపై జరుగుతుంటాయి. పిల్లలను, యువకులను సెక్స్ వైపు దృష్టి మళ్లించడం, పెద్దవారికి బెదిరింపు మెసేజ్‌లు పంపించడం, వారిని మానసికంగా హింసించడం, ఎటువంటి అడ్రస్ లేకుండా మహిళలకు మెసేజ్‌ల ద్వారా వేధించడం వంటివి జరుగుతున్నాయి. అలాగే ఆస్తులకు డాక్యుమెంట్లను అక్రమంగా చేజిక్కించుకోవడం, పెద్ద మొత్తంలో డబ్బు ఎర చూపుతూ మెసేజ్‌లు పంపి, వారి నుంచి లక్షల రూపాయల్లో డబ్బులు చేజిక్కించుకోవడం వంటివి జరుగుతున్నాయి. అలాగే కొంతమంది సినిమాలు డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఆకర్షిస్తునే, మనం ఆ పనిలో ఉండగా, మన కంప్యూటర్స్‌లోని ఫైల్స్ అక్రమంగా చేజిక్కించుకోవడం చేస్తున్నారు. ఆ తరువాత మన ఈ మెయిల్ అడ్రస్‌తో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. దేశ ద్రోహ నేరాలకు పాల్పడే వారు ఇటువంటి ఈమెయిల్స్ ద్వారానే మెసేజ్‌లు పంపుతున్నారు. అలాగే ప్రభుత్వ సమాచారం ఉన్న వెబ్‌సైట్‌లను హ్యాక్ చేయడం చేస్తున్నారు. ఇటువంటి సైబర్ నేరాల్లో పాల్గొనేవారిలో 18 నుంచి 30 సంవత్సరాలు మధ్య ఉన్న వారే ఎక్కువ మంది ఉండడం గమనార్హం. కొంతమంది హాబీగా చేస్తుంటే, మరికొంతమంది పనికట్టుకుని ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నట్టు ఎన్‌బిసిఆర్ పేర్కొంది.
2011తో పోల్చుకుంటే, 2012లో సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా ఉంది. 2012లో దేశం మొత్తంమీద 1486 సైబర్ నేరాలు నమోదైనాయి. ఇందులో 908 మంది 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్కులే కావడం గమనార్హం. వీటిలో మహారాష్టల్రో 561 కేసులు నమోదైనాయి. గత ఏడాదితో పోల్చి చూస్తే 42.7 శాతం సైబర్ నేరాలు పెరిగాయి. కర్ణాటకలో 437, ఆంధ్ర ప్రదేశ్‌లో 454 కేసులు నమోదైనాయి. ఇందులో 125 మంది నడి వయస్కుల వారే కావడం గమనార్హం. అదే నగరాల వారీగా చూసుకుంటే, కర్ణాటకలో నమోదైన నేరాల్లో అత్యధికంగా బెంగళూరులోనే ఉన్నాయి. ఆ తరువాత విశాఖ నగరంలో 2011లో 107 కేసులు నమోదైతే, 2012లో 153 కేసులు నమోదైనాయి. అంటే ఈ క్రైం రేట్ 43 శాతం పెరిగింది. వీటిలో 89 కేసులు లైంగిక వేధింపులే కావడం గమనార్హం. ఈ ఏడాది దేశంలోని వివిధ నగరాల్లో నమోదైన సైబర్ నేరాల సంఖ్య ఈ విధంగా ఉంది. ఢిల్లీలో73, చెన్నైలో 15, హైదరాబాద్‌లో 2011లో 67 కేసులు నమోదు కాగా, 2012లో 42 కేసులు మాత్రమే నమోదైనాయి. హైదరాబాద్‌లో కేసు నమోదు ప్రతికూలంగా ఉందని రికార్డులు వెల్లడిస్తున్నాయి. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడలో కూడా 2012లో ఏడు కేసులు నమోదైనాయి.
విశాఖ కేంద్రంగా ఎథికల్ హ్యాకింగ్‌లో శిక్షణ
విశాఖ కేంద్రంలో పైన పేర్కొన్న వివిధ సైబర్ నేరాల్లో (ఎథికల్ హ్యాకింగ్)లో శిక్షణ ఇస్తున్నారు. నగరంలో ఐదు కేంద్రాల్లో ఈ శిక్షణ జరుగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. బీహార్‌కు చెందిన పలువురు యువకులు వచ్చి ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నట్టు తెలిసింది. పోలీసులు ఇటువంటి శిక్షణా సంస్థలపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది.
23న ముఖ్యమంత్రి రాక
* పలు ప్రారంభోత్సవాలు
* మోడల్ స్కూల్‌కు మోక్షం
* అనకాపల్లి ఆర్డీవో కార్యాలయం ప్రారంభం
విశాఖపట్నం, జూన్ 17: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 23వ తేదీన ఇక్కడకు వస్తున్నారు. విశాఖ పర్యటనలో భాగంగా ఆ రోజు ఉదయం ఇక్కడకు చేరుకునే ముఖ్యమంత్రి నేరుగా కశింకోటకు వెళ్తారని తెలిసింది. అక్కడి మోడల్ స్కూల్‌ను ఆయన ప్రారంభిస్తారు. ఆ తరువాత అనకాపల్లిలో కొత్తగా మంజూరైన ఆర్డీవో కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఆ తరువాత ‘ఇందిరమ్మ పచ్చతోరణం’ కార్యక్రమాన్ని సిఎం లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిసింది. అధికారికంగా నిర్వహించే ఈ మూడు కార్యక్రమాలతోపాటు విశాఖ నగరంలో జరిగే మరికొన్ని కార్యక్రమాలను ఆయన చేతులమీదుగా ప్రారంభించవచ్చని రెవెన్యూ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా విద్యా పక్షోత్సవాల్లో భాగంగా సిఎం పాల్గొనే అవకాశాలున్నాయి. అలాగే నగరంలో అదేరోజు నిర్వహించే ఒలింపిక్ రన్‌ను ఆయన ప్రారంభిస్తారు. ఒకేరోజు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్న దృష్ట్యా సంబంధితాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఒకరోజు పర్యటనలో భాగంగా ప్రభుత్వ అతిథిగృహం వద్ద పటిష్ట భధ్రతను ఏర్పాటు చేస్తున్నారు.
గెలుపే లక్ష్యంగా పనిచేయండి
ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి పిలుపు
విశాఖపట్నం, జూన్ 17: రానున్న స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలకు సూచించారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులతో జరిగిన సమావేశంలో కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేల మధ్య ఏమైనా విభేదాలుంటే వెంటనే సరిచేసుకోవాలని, అలాగే మంత్రులతో ఉన్న పొరపొచ్చాలను కూడా సర్దుబాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాగే పార్టీకి పనికొచ్చే వారిని గుర్తించి తటస్థులుగా ఉండే వారిని పార్టీలోకి చేర్చుకోవాలని, పార్టీలోని వారికి మరింత ఉత్సాహం కల్పించాలని ఆయన సూచించారు. స్థానిక సంస్థలు, మున్సిపాల్టీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవశం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, పి.బాలరాజు, ఎంపీ పురందీశ్వరితో సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నియోజక వర్గాల పార్టీ ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.
గ్రామాల విలీనం లేనట్టే
విశాఖపట్నం, జూన్ 17: జివిఎంసిలో అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీలతో పాటు మరో పది గ్రామాలను విలీనం చేయాలన్న ప్రతిపాదనకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. వీటి విలీనం పట్ల మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావులు తొందర పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేలు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో విలీనంపై అభ్యంతరాలు తెదలియజేయాలంటూ నోటిఫికేషన్ జారీ అయింది. దీనికి జూన్ 9 తేదీ గడువు విధించిన ప్రభుత్వం వేలాది వినతులను స్వీకరించింది. విలీనానికి అనుకూలంగా ఎక్కువ ధరఖాస్తులందాయి. భీమిలి నియోజక వర్గంలోని పది గ్రామాల విలీనాన్ని పంచాయితీరాజ్ శాఖ మంత్రి చాలా కాలంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే ఎన్నికలు జరిగే పంచాయతీల జాబితాలు కూడా పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసింది. అందులో జివిఎంసిలో విలీనం కావాల్సిన పంచాయతీలు కూడా ఉన్నాయి. అయితే సోమవారం జరిగిన కేబినెట్ సమీక్ష సమావేశంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలకు ముందు మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో గ్రామ పంచాయతీలను విలీనం చేయరాదని తీర్మానించింది. ఇప్పటికే జివిఎంసిలో భీమిలి మున్సిపాలిటీ విలీనం ఇదమిద్ధంగా మారిన పరిస్థితుల్లో పంచాయతీల విలీనంపై నిషేధాన్ని విధిస్తూ కేబినేట్ తీర్మానించడం గమనార్హం. ఈ పరిస్థతుల్లో అనకాపల్లి, భీమిలి మున్సిపారిటీలను మాత్రమే విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తవౌతున్నాయి.
పిల్ కౌట్టివేత
భీమిలి మున్సిపారిటీని జీవిఎంసిలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ భీమిలికి చెందిన ఓ వ్యక్తి కోర్టులో దాఖలు చేసిన పిల్‌ని కొట్టి వేసినట్లు జివిఎంసి కమిషనర్ తెలిపారు. జివిఎంసిలో విలీనం చేయడం వల్ల భీమిలి చరిత్ర మరుగు పడుతుందని వేసిన పిటిషన్‌పై కోర్టు స్పందిస్తూ విలీనానికి చరిత్రకు సంబంధం లేదని కోర్టు పేర్కొన్నట్టు కమిషనర్ తెలియజేశారు.
పూజారి దంపతుల ఆత్మహత్య
నర్సీపట్నం, జూన్ 17: గాజువాక మహాగణపతి ఆలయం అర్చకుడు భార్యతో సహా ఏలేరు కాలువలో పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు అందించిన వివరాలివి. అర్చకుడు అమలాపురం సత్యసుబ్రహ్మణ్యం(55), భార్య పద్మావతి(50)లు సోమవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో మాకవరపుపాలెం సమీపంలోని కొండల అగ్రహం గ్రామం వద్ద ఏలేరు కాలువలో పడి ఆత్మహత్య చేసుకున్నారు. చినగంట్యాడ ఎర్రగెడ్డ కాలనీలో నివాసం ఉండేవారు. వీరి కుమారులు ఇద్దరూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం గాజువాకకు చెందిన సాంబశివరావు, సత్యసుబ్రహ్మణ్యం స్నేహితులు. సాంబశివరావువద్ద సుబ్రహ్మణ్యం గతంలో 13 లక్షల 50 వేల రూ.లు అప్పుగా తీసుకున్నాడు. అప్పును తీర్చమని చాలా కాలంగా సాంబశివరావు అడుగుతున్నారు. ఈ విషయమై గాజువాక పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అప్పు తీర్చలేకపోయిన సుబ్రహ్మణ్యం హైదరాబాద్ వెళ్ళిపోయాడు. కొద్ది రోజుల కింద తిరిగివచ్చిన సత్యసుబ్రహ్మణ్యం భార్యతో కలిసి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఏలేరు కాలువ గట్టు మీద ఉన్న సంచిలో పురుగు మందు డబ్బా, ఎలుకల మందు, డ్రింక్ బాటిల్ ఉన్నాయి. పురుగుల మందు, ఎలుకల మందు డ్రింక్‌లో కలిపి తాగిన తర్వాత కాలువలో దూకివుంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇన్‌చార్జి ఎస్‌ఐ అశోక్‌కుమార్ దర్యాప్తు చేస్తున్నారు.
అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి
* మంత్రి బాలరాజు
కొయ్యూరు, జూన్ 17: పాడేరు నియోజకవర్గ ప్రతినిధిగానే కాకుండా రాష్ట్ర మంత్రిగా తనకు అన్ని ప్రాంతాల అభివృద్ధి ముఖ్యమేనని గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పసుపులేటి బాలరాజు పేర్కొన్నారు. ఆదివారం మండల పర్యటనకు వచ్చిన మంత్రిని సమీప తూర్పగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలానికి చెందిన తె.దే.పా.నియోజకవర్గ కో ఆర్డినేటర్ శివరామచంద్రరాజుతో పాటు వదరనాపల్లి మాజీ సర్పంచ్ పెద్దిరాజు, ఎం.పి.టి.సి. చినతల్లి, దూసరపాము మాజీ సర్పంచ్ దుర్గా ప్రసాద్‌లతోపాటు పలువురు నేతలు, ప్రజలు కలిసి తమ సమస్యలు విన్నవించారు. దీనిపై స్పందించిన మంత్రి ఒక్క పాడేరు నియోజకవర్గానికే కాకుండా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి పర్చడం తన బాధ్యత అన్నారు. విశాఖ - తూర్పుగోదావరి జిల్లాలను కలిపే రహదారికి బొర్రంపేట నుండి వరదనాపల్లికి ఐదు కిలో మీటర్ల మేర నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే అక్కడ ఉన్న అటవీ సంబంధ సమస్యలపై పరిష్కార దిశగా సంబంధిత అదికారులను ఆదేశించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికై నిరంతరం శ్రమిస్తోందన్నారు. గత పాలకుల ఆశ్రద్ధ వల్లే ఈ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయని, కాంగ్రెస్ పాలనలో అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరిగిందన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో పలు రాజకీయ పార్టీల నాయకులు చెప్పే మాయమాటలు నమ్మి గతలంలో వలె మోసపోకుండా అభివృద్ధికి పట్టడం కట్టాలని ఈసందర్భంగా మంత్రి కోరారు. ఈసందర్భంగా మంత్రికి జిల్లా పరిధి పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలు విన్నవించి పరిష్కరించాలని కోరారు.
మన్యం బంద్ విజయవంతం
పాడేరు, జూన్ 17: విశాఖ ఏజెన్సీలోని కాఫీ ప్రాజెక్టులో చోటుచేసుకున్న అవినీతి అక్రమాలకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సి.పి.ఎం., గిరిజన సంఘం ఇచ్చిన మన్యం బంద్ పిలుపు మన్యంలో సోమవారం విజయవంతమయ్యింది. సి.పి.ఎం., గిరిజన సంఘం తలపెట్టిన మన్యం బంద్‌కు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా ఆందోళనకారులు ఉదయం ఐదు గంటలకే రోడ్లపైకి చేరి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో ఏజెన్సీ అంతటా సోమవారం ఎటువంటి వాహనాలు తిరగక రవాణా పూర్తిగా స్థంబించింది. బంద్‌ను పురస్కరించుకుని పాడేరు ఆర్.టి.సి. డిపోకు చెందిన బస్సులను నిలిపివేశారు. ఆర్టీసీ బస్సులతోపాటు ఇతర అన్ని రకాల ప్రయివేట్ వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. వివిధ రకాల పరీక్షలకు విశాఖపట్నం వెళ్లాల్సిన విద్యార్థుల సౌకర్యార్థ పాడేరు నుంచి విశాఖకు రెండు బస్సు సర్వీసులను ఆందోళనకారులు అనుమతించారు. బంద్ సందర్భంగా పాడేరు పట్టణంలోని అన్ని రకాల దుకాణాలను వ్యాపారులు స్వచ్చంధంగా మూసివేసి బంద్ పాటించారు. పాడేరులోని బ్యాంకులు, పెట్రోలు బంకులు మూతపడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు నామమాత్రంగా పనిచేసాయి. స్థానిక ఆర్.టి.సి. కాంప్లెక్స్ ఎదుట ప్రధాన రహదారిపై ఆందోళనకారులు బైఠాయించి కాఫీ నిధులను స్వాహా చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పలు నినాదాలు చేశారు. ఇదిలాఉండగా ఏజెన్సీలోని హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరి, పెదబయలు, ముంచంగిపుట్టు, జి.మాడుగుల తదితర మండలాల్లో బంద్ సంపూర్ణంగా జరిగినట్టు సమాచారం అందింది. పెదబయలులో సోమవారం జరగాల్సిన వారపు సంత బంద్ కారణంగా రద్దయ్యింది. మన్యం బంద్‌ను పురస్కరించుకుని ఎక్కడా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు. స్థానిక డి.ఎస్.పి. ఆదినారాయణ, సి.ఐ. సి.హెచ్.గఫూర్ ఆధ్వర్యంలో పాడేరు పట్టణంలో ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించి శాంతి భద్రతలను పర్యవేక్షించారు. పాడేరులో జరిగిన బంద్ కార్యక్రమంలో సి.పి.ఎం. జిల్లా కార్యదర్శి కె.లోకనాధం, పాడేరు డివిజన్ కార్యదర్శి ఎం.సూర్యనారాయణ, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు కిల్లో సురేంద్ర, సి.పి.ఎం. నాయకులు ఆర్.రవిశంకర్, ఎస్.పుణ్యారావు, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు వంజంగి కాంతమ్మ, పి.పాండురంగస్వామి పాల్గొన్నారు.
మృత్యువులోను వీడని స్నేహబంధం
చోడవరం, జూన్ 17: వారిద్దరూ ప్రాణస్నేహితులు చివరకు మృత్యువు కూడా స్నేహితులిద్దరినీ రోజు గడవకముందే ఒకే తరహాలో కబళించిన సంఘటన పట్టణంలో తీవ్ర విషాదాన్ని నింపింది. స్నేహితుని అంతిమ యాత్రలో పాల్గొన్న మిత్రబృందం ఊహించని రీతిలో తమ కళ్లెదుటే మరో స్నేహితుడు రోడ్డుప్రమాదానికి గురై మృతి చెందడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఎవరి శాపం తగిలిందో ఇలాంటి పరిస్థితులు సంభవించాయంటూ ఘోషిస్తున్నారు. పట్టణంలోని కోటవీధికి చెందిన దాడి రామకృష్ణ(30) బజాజ్‌మోటార్ కంపెనీలో పనిచేస్తున్నాడు. నౌడువీధికి చెందిన గుడివాడ సూర్యప్రకాష్ విశాఖలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ స్నేహితులిద్దరూ ప్రతీరోజు కలుసుకుని ముచ్చటించుకుంటేనే గాని ఇళ్లకు వెళ్లేవారు కాదు. ఆదివారం రాత్రి దాడి రామకృష్ణ తమ కంపెనీ పనిమీద విశాఖ వెళ్లి తిరిగి వస్తుండగా సబ్బవరం మండలం గొటివాడ జంక్షన్ వద్ద ఆగివున్న లారీని ఢీకొట్టి మృత్యువాత పడ్డాడు. ఈ మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. ఈసంఘటన తెలుసుకున్న స్నేహితుడు గుడివాడ సూర్యప్రకాష్ అర్ధరాత్రి పూటే ఆసుపత్రికి వెళ్లి స్నేహితుని మృతదేహాన్ని చూసి బోరున విలపిస్తూ భార్యబిడ్డలతో ఉన్న రామకృష్ణను కాకుండా తాను మరణించి ఉంటే బాగుండేదని వాపోయాడు. తధాస్తు దేవతలు ఉన్నారో లేరో తెలియదు గాని సోమవారం ఉదయం రామకృష్ణ మృతదేహాన్ని చోడవరం తీసుకువచ్చి అంతిమ సంస్కారాలు గావించేందుకు శ్మశానానికి తరలిస్తుండగా ఈ శవయాత్రలో పాల్గొన్న సూర్యప్రకాకాష్ మంచినీళ్లు తాగేందుకు రోడ్డుదాటుతుండగా శిరిజాం గ్రామానికి చెందిన రౌతు జానకీరామ్ మోటార్ సైకిల్‌పై వస్తూ సూర్యప్రకాష్‌ను బలంగా ఢీకొట్టాడు. దీంతో రోడ్డుప్రమాదానికి గురైన సూర్యప్రకాష్ తీవ్రంగా గాయపడటంతో ప్రభుత్వాసుపత్రికి తరలించినప్పటికీ మృతిచెందాడు. ఇతనికి భార్య కిరణ్ తప్ప వెరెవరూ లేరు. భార్య కూడా గత కొంతకాలంగా విశాఖలోని తమ కన్నవారి ఇంటిలోనే ఉంటుంది. అయితే తమ మిత్రులిద్దరూ ఒకేరీతిలో రోజు గడవకుండానే మృత్యువాత పడటం జీర్ణించుకోలేని స్నేహితులు బోరున విలపిస్తూ ఎవరి శాపం తగిలిందో కాని తమకు ఇలాంటి పరిస్థితి సంభవించిందని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 24గంటల్లోపే పట్టణానికి చెందిన స్నేహితులిద్దరూ రోడ్డుప్రమాదానికి గురై మృతిచెందడం పట్టణంలో తీవ్ర విషాదచాయలు నింపింది.
వివాహిత అనుమానాస్పద మృతి
సబ్బవరం, జూన్ 17: మండలంలోని నారపాడు పంచాయతీ పరిధిలోని అమ్ములపాలెంలో వివాహిత తుమ్మపాల శాంతి (23) సోమవారం ఉదంయ అనుమానాస్పద స్ధితిలో మృతి చెందింది. ఆదివారం రాత్రి అనకాపల్లి మండలం శంకరంలోని తన తండ్రితో సెల్‌ఫోన్‌లో మాట్లాడిన శాంతి సోమవారం ఉదయం 8 గంటలకు కిరోసిన్ పోసుకుని నిప్పంటిచుకుని మృతి చెందిందనే వార్త ఆమె తల్లిదండ్రులను కలిచివేసింది. సంఘటనా స్ధలంలో శాంతి మృతదేహాన్ని చూసిన తల్లితండ్రులు తల్లిదండ్రులు కరణం వెంకటరమణ, రాధ తల్లడిల్లిపోయి తమ కుటుంబ బంధువైన కరణం ధర్మశ్రీ కి సమాచారం అందించారు. తమబిడ్డను చంపేసిన తర్వాతనే కిరోసిన్ పోసుకున్నట్లు అత్తింటివారు చెబుతున్నారన్నారు. కనీసం తమకు బయటి వ్యక్తులు ఫోన్ సమాచారం అందించే వరకు శాంతి భర్త కబురుపెట్టలేదన్నారు.తమ కుమార్తెశాంతికి ఏడాదిన్నర క్రితం 3లక్షల వరకట్నం,2తులాల బంగారం,బైక్,తదితర లాంఛనాలతో ఘనంగా పెళ్లిచేసి కాపురానికి పంపించామని వారు రోదిస్తూ తెలిపారు. సబ్బవరంలోరెడీమేడ్ గార్మెంట్స్ నడుపుకుంటున్న తమ అల్లుడు శివ ఆదివారం రాత్రి తన కుమార్తెతోఫోన్ మాట్లాడించినప్పుడు ఆమె అసహనంగా మాట్లాడి ముక్తసరిగా ఫోన్ పెట్టిందన్నారు.తమ బిడ్డ మృతి పై తమకు అనుమానాలున్నాయని, ఇరుగుపొరుగువారిని సైతం విచారించి తమకు న్యాయం చేయాలని మృతురాలి తండ్రి స్ధానిక ఎస్‌ఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్గొన్నారు. ఈమేరకు అనుమానాస్పద మృతి సెక్షన్ ఐపిసి 174కింద కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నామని ఎస్‌ఐ జి.గోవిందరావుతెలిపారు. అనకాపల్లిడిఎస్‌పి విఎస్‌ఆర్ మూర్తి పర్యవేక్షణలో,సబ్బవరం తహశీల్దార్ ఎం.నాగభూషణరావుసమక్షంలో సోమవారం అమ్ములపాలెంలో శాంతి మృత దేహానికి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టంకోసం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. డిసిసి అధ్యక్షుడు కరణం ధర్మశ్రీకి స్వయంగా మృతురాలి తండ్రి కరణం వెంకటరమణ పినతండ్రి అయినందున ఆయన పరామర్శించటంతోపాటు పోలీసులు,అధికారులతోమాట్లాడారు.
విజయమ్మ వెంట మంత్రి గంటా అనుచరులు
పట్టించుకోలేదని అలక
కశింకోట, జూన్ 17: వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ వెంట జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరులు ఆదివారం విజయనగరం బయలుదేరి వెళ్లారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలను మంత్రి గంటాశ్రీనివాసరావుగాని, నియోజకవర్గ ఇన్‌చార్జ్ ప్రత్యూష భాస్కరరావుగాని అసలు పట్టించుకోకపోవడంతో వేరే పార్టీలోకి వెళ్లేందుకు కార్యకర్తలు సిద్దమవుతున్నారు. ముఖ్యంగా కశింకోటతోపాటు మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో విజయమ్మ పర్యటనకు గొబ్బూరుపాలెం, నరసాపురం గ్రామాలకు చెందిన కొంతమంది గంటా అనుచరులు సొంత ఖర్చులతో వాహనాలను ఏర్పాటు చేసుకుని మరి విజయనగరం వెళ్లారు. ఇటీవల మండల కాంగ్రెస్‌పార్టీ కమిటి ఏర్పాటులో కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత లేకుండా గతంలో ఉన్న ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలకే సముచిత స్థానం కల్పించారని సీనియర్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు గంటాపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా అసంతృప్తి కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీ వారినే ప్రత్యుష భాస్కరరావు పట్టించుకుంటున్నారని తమకు ఏ విధమైన సహకారం అందజేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం రెవెన్యూ,పంచాయతీ, పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న సమస్యలను సైతం మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం మండల, జిల్లాస్థాయిలో ఉన్న నాయకులను తప్ప సామాన్యకార్యకర్తలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మాజీ ఎంపిపి, విశాఖ డెయిరీ డైరక్టర్ మలసాల ధనమ్మ, రమణారావులు అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. వీరితోపాటు ఉగ్గిని రమణమూర్తి, పిఎసిఎస్ మాజీ డైరక్టర్ సూరిశెట్టి ఆదిబాబు, తగరంపూడి గణపతి, కత్తిర శ్రీ్ధర్ కాంగ్రెస్‌పార్టీకి దూరంగా ఉంటున్నారు. మండల కమిటిలో కాంగ్రెస్‌పార్టీ నాయకులు వేగి రామకోటేశ్వరరావుకు మినహా మిగిలిన వారంతా ప్రజారాజ్యంపార్టీకి చెందిన వారేనని సీనియర్ కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు. కొంతమంది కాంగ్రెస్‌పార్టీకి చెందిన కార్యకర్తలు అనకాపల్లి మార్కెట్‌కమిటి చైర్మన్ మలసాల కిషోర్‌ను కలుస్తున్నట్లు తెలిసింది. ఆ పార్టీకి చెందిన మరికొంతమంది సీనియర్ నాయకులు మాజీ మంత్రి దాడి వీరభద్రరావును కలిసి స్థానిక ఎన్నికల్లో అవకాశం కల్పించాలని కోరుతున్నట్లు తెలిసింది. ఇదిఇలా ఉండగా మంత్రి గంటాశ్రీనివాసరావు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వేరే ప్రాంతానికి వెళ్లిపోటీచేస్తారని, ఇప్పటినుండే స్థానిక నాయకులతో టచ్‌లో ఉండటం మంచిదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మంత్రి గంటాశ్రీనివాసరావు నియోజకవర్గంలో పార్టీకేడర్ బీటలు వారుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.
రాజధానిలో ఎయు అధికారులు బిజీబిజీ
* వర్శిటీ ఆర్థిక, విద్యా పరిస్థితులపై చర్చ
విశాఖపట్నం, జూన్ 17: ఆంధ్రా యూనివర్శిటీ అధికారులు సోమవారం హైదరాబాద్‌లో బిజీ బిజీగా గడిపారు. వర్శిటీలో పేరుకుపోతున్న అనేక సమస్యలపై వీరు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఆంధ్రా యూనవర్శిటీని గట్టెక్కించేందుకు ప్రభుత్వ నిధులు రాబట్టేందుకు వైస్ చాన్స్‌లర్ రాజు గట్టి కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఎయు అధికారులు ఫైనాన్స్ సెక్రటరీని కలిసి పరిస్థితిని వివరించారు. ఇక మంగళవారం ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్ర, ఆర్థిక శాఖ కార్యదర్శి వై రామకృష్ణ, కాలేజియేట్ విద్యా కమిషనర్ కె సునీతను విసి రాజు కలవనున్నారు. ఈ నెలాఖరుకు రెక్టార్ ప్రసాదరావు, సిడిసి డీన్ భరతలక్ష్మి పదవీ విరమణ చేయనున్నారు. ఈ స్థానాలను ఎవరితో భర్తీ చేయాలన్న అంశాన్ని కూడా విసి సంబంధిత అధికారులతో చర్చించనున్నారు. అలాగే కొత్త విద్యా సంవత్సరం ఆరంభం కానుంది. అయితే, ఈ ఏడాది ఎయులో చాలా మంది ప్రొఫెసర్లు పదవీ విరమణ చేయనున్నారు. వీరి స్థానంలో టిచింగ్ అసోసియేట్స్‌ను నియమించాలా? లేక పదవీ విరమణ చేసిన వారినే ఆయా స్థానాల్లో కొనసాగించాలా? అన్న అంశంపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి.
ఫోర్జరీ సంతకాల్లో సిబ్బంది హస్తం?
* ‘పాస్‌పోర్టు’పై కొనసాగుతున్న సిబిఐ దాడులు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూన్ 17: పాస్‌పోర్టు సేవా కేంద్రంపై సిబిఐ దాడులు కొనసాగుతున్నాయి. స్లాట్ బుకింగ్ కోసం పాస్‌పోర్టు అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసిన విషయం బయటకు పొక్కడంతో సిబిఐ అధికారులు రంగంలోకి దిగి గత మూడు రోజులుగా దాడులు జరుపుతున్న సంగతి తెలిసిందే. అసలు ఈ ఫోర్జరీ సంతకాల వెనుక ఎవరి హస్తం ఉంది? తెర వెనుక ఎవరెవరు ఉన్నారన్న సమాచారాన్ని రాబట్టేందుకు సిబిఐ అధికారులు ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వారు పాస్‌పోర్టు స్లాట్ బుకింగ్ విశాఖలోనే చేయించుకోవాలి. పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు తరలి వస్తుండడంతో స్లాట్ బుకింగ్ చాలా మందికి దొరకడం లేదు. దీన్ని దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. పాస్‌పోర్టు సేవా కేంద్రంలో, పాస్‌పోర్టు కార్యాలయంలో సిబ్బందితో వీరికి లాలూచీలు ఉన్నట్టు తెలుస్తోంది. స్లాట్ బుకింగ్‌కు అసిస్టెంట్ పాస్‌పోర్టు ఆఫీసర్ సంతకం చేయాల్సి ఉంటుంది. అటువంటి సంతకానే్న ఫోర్జరీ చేయగలిగారంటే, ఈ నేరగాళ్లకు సిబ్బంది సహకారం కచ్చితంగా ఉండి తీరాలి. ఇప్పటికే 10 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న సిబిఐ, దీని వెనుక ఉన్న పెద్ద మనుషుల వివరాలను సేకరిస్తోంది. నేడో, రేపో వారిని బయటపెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో పాస్‌పోర్టు కార్యాలయ సిబ్బందికి చమటలు పడుతున్నాయి. ఒకవేళ సిబిఐ ఈ కేసు చేధించగలిగితే, చాలా మంది నేరగాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పాస్‌పోర్టు కార్యాలయం వద్ద ఏజెంట్ల బెదడ కూడా వదలి అవకాశం ఉంది.
పేదలకు అండగా ఇందిరమ్మ పచ్చతోరణం
* 1600 లబ్ధిదారులకు ‘చెట్టుపట్టా’ల పంపిణీ
విశాఖపట్నం, జూన్ 17: పేదల నేరుగా ఉపాధి కల్పించే సదుద్దేశ్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఇందిరమ్మ పచ్చతోరణం’ పథకం కింద పేద కుటుంబాలకు ‘చెట్టుపట్టా’ను కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ వి.శేషాద్రి తెలిపారు.
ప్రజలకు జవాబుదారీతనం కోసమే డయల్ 100
విజయనగరం, జూన్ 17: రాష్ట్రంలో సైబర్ నేరాల నిరోధానికి త్వరలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయనున్నట్టు కోస్టల్ జోన్ ఐజి ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. సోమవారం ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం వన్‌టౌన్‌లో ఏర్పాటు చేసిన డయల్ 31002 కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుందన్నారు. ఒక ఏడాది పాటు జరిగిన దొంగతనాల కంటే ఒక సైబర్ నేరం విలువ అధికంగా ఉందన్నారు. అందువల్ల సిబ్బందికి ఇంటర్నెట్, ఇతర అంశాలపై ప్రత్యేక శిక్షణనివ్వడంతోపాటు అధునాతన పద్దతుల్లో వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు.
నార్త్ కోస్టల్ జోన్ పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మావోల సంచారం లేనప్పటికీ విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలో అలజడి చేస్తున్నారని ఐజి ద్వారకాతిరుమలరావు చెప్పారు. ఇటీవల చత్తీస్‌ఘడ్‌లో జరిగిన సంఘటనలో మావోలు తెలుగులో మాట్లాడిన విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావించగా వారు మన రాష్టమ్రైన, ఇతర రాష్ట్రాలకు చెందినవారైనా కావచ్చని అనుమానం వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన సూచనలను అధికారులకు తెలియజేశామన్నారు. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలన్నదే పోలీసుల లక్ష్యమని ఐజి ద్వారకా తిరుమలరావు అన్నారు. అందుకోసమే డయల్ 100ను దేశంలో ప్రప్రధమంగా రాష్ట్రంలో డిజిపి దినేష్‌రెడ్డి ప్రారంభించారని చెప్పారు. డయల్ 100కు ఫోన్ చేయగానే హైదరాబాద్ డిజిపి కార్యాలయంలో ఉన్న డయల్ కమాండ్ కంట్రోల్ యూనిట్‌కు చేరుకొని అక్కడ నుంచి డివిజనల్ ఆఫీసు ద్వారా నేరుగా సంబంధిత పోలీసు స్టేషన్‌కు సమాచారం చేరుతుందన్నారు. వెంటనే కొద్ది నిమిషాల వ్యవధిలోనే బాధితుని వద్దకు సంబంధిత పోలీసులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుందని వివరించారు. డిఐజి పి.ఉమాపతి, జిల్లా ఎస్పీ కార్తికేయ పాల్గొన్నారు.
పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ
ఆటో వర్కర్ల సంఘం రాస్తారోకో
విజయనగరం , జూన్ 17: పెట్రోల్ ధరల పెంపుదలను నిరసిస్తూ విజయదుర్గా ఆటోవర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రెడ్డి నారాయణరావు మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పెట్రోల్,డీజిల్ ధరలను పెంచడం వల్ల అన్నివర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వీటి పెంపుదలతో అటోడ్రైవర్లు పెరిగిన భారాన్ని ప్రయాణికులపై వేయలేక, వారు భరించలేక అవస్థలకు గురవుతున్నారన్నారు. పెరిగిన పెట్రోల్ ధరలకు తగ్గించేవరకూ పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు అనేక ఇక్కట్లు పడుతున్నారన్నారు. కేంద్రంలో యుపిఎ ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్ల ప్రజలు నరకయాతనలు పడుతున్నారన్నారు. రెండేళ్లకాలంలో 30సార్లు పెట్రోల్ ధరలు పెంచి ప్రజలపై పెనుభారం మోపిందన్నారు. త్వరలో డీజిల్ వంటగ్యాస్ ధరల నియంత్రణపై కేంద్రం తమ బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు నీలాపుఅప్పలరాజురెడ్డి, ఎం.సన్యాసిరావుతదితరులు పాల్గొన్నారు.
‘అర్హత ఉన్న గ్రామాలను
షెడ్యూల్డ్ జాబితాలో చేర్చాలి’
కురుపాం, జూన్ 17: జిల్లాలోని నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న గ్రామాలన్నింటినీ షెడ్యూల్డ్ ఏరియాలో కలపాలని డిమాండ్ చేస్తు గిరిజన సంఘం ఆధ్వర్యంలో కేంద్రమంత్రి కిశోర్‌చంద్రదేవ్ ఇంటి ముందు నిరసన తెలిపారు. సోమవారం సంఘం ప్రతినిధి పి.రంజిత్‌కుమార్ ఆధ్వర్యంలో గిరిజనులు ఈ నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా రంజిత్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో వందలాది గ్రామాలు నాన్ షెడ్యూల్డ్‌లో ఉండటం వలన ఏజెన్సీ ప్రాంతాల్లో లభించే సదుపాయాలను పొందలేకపోతున్నారన్నారు. కొండలపై ఉన్న గ్రామాలు కూడా నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో ఉండటం వలన అక్కడ గిరిజనులు ప్రభుత్వ పథకాలను సక్రమంగా అందుకోలేకపోతున్నారన్నారు. ఈ విషయమై గతంలో కేంద్రమంత్రి కిశోర్‌చంద్రదేవ్‌కు వినతిపత్రం అందించామని, అయినా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో నిరసన తెలియజేశామన్నారు. ఇప్పటికైన కేంద్రమంత్రి, అధికారులు స్పందించి నాన్ షెడ్యూల్డ్ గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాలో కలపాలన్నారు.
‘నగదు బదిలీ వద్దు’
విజయనగరం, జూన్ 17 : పేదలకు పెనుభారమైన నగదు బదిలీ పధకం వద్దంటూ,రేషన్ డిపోల ద్వారానే సరుకులు అందజేయాలని డిమాండ్ చేస్తూ విజయనగరం 30వ వార్డుకు చెందిన పలువురు మహిళలు కలక్టరేట్ ఆవరణలో సోమవారం ఆందోళన నిర్వహించారు. ఆవార్డు మాజీ కౌన్సిలర్ కె.వరలక్ష్మి ఆధ్వర్యంలో మహిళలు కలక్టరేట్‌కు తరలివచ్చి తమ నిరసన గళం వినిపించారు. 30వ వార్డు పరిధిలో నాలుగు డిపోను ఉన్నాయని వాటిలో 2000 మందికి పైబడి రేషన్ కార్డు దారులు ఉన్నారన్నారు. నగదు బదిలీ పధకం కోసం బ్యాంకు ఖాతా తెరిచేందుకు 500 రూపాయలుతో ప్రారంభించడం తప్పనిసరి అని సంబంధిత అధికారులు నిబంధన విధిస్తున్నారని ఇదిపేదలైన వారికి పెనుభారంగా మారిందన్నారు. నగదు బదిలీ పధకం తమకు వద్దని నినాదాలు చేశారు. బ్యాంకు ఖాతా తప్పని సరి అయితే ఉచితంగా బ్యాంకు ఖాతాను ప్రారంభించేందుకు అవకాశం కల్పించాలని కోరారు. పలువురు రేషన్ కార్డుదారులకు గ్యాస్ కనెక్షన్లు లేనందున 10 లీటర్లు వంతున కిరోసిన్ మంజూరు చేయాలని కోరారు. అలాగే ఆధార్ కార్డు లేని వారికి ఐరిస్ వెంటనే తీయాలని, గ్యాస్ కనెక్షన్ పేరు మార్చుకోవడానికి అవకాశం కల్పించాలని కోరారు. అనంతరం జాయింట్ కలక్టర్‌కు వినతిపత్రం అందజేసారు.
‘గ్రీవెన్స్’లో వినతుల వెల్లువ
విజయనగరం, జూన్ 17 : జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నాటి గ్రీవెన్స్ సెల్‌కు పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ సుమారు వినతులు అందజేసారు. మినీ కాన్ఫరెన్స్‌హాల్‌లో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్‌లో జాయింట్ కలెక్టర్ శోభ వినతులు స్వీకరించారు. లక్కవరపుకోట మండలం శ్రీరాంపురం గ్రామంలో మంచినీటి పధకాలు, బోర్లు ద్వారా వస్తున్న కలుషిత నీటిని గత్యంతరం లేక తాము వాడుతున్నామని ఆ నీటివలన వ్యాధులు సోకి పలువురు బాధపడుతున్నారని ఈవిషయమై ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు లేవని ఉన్నతాధికారులైనా స్పందించి దర్యాప్తు జరిపించాలని ఆర్.రామారావుతోపాటు పలువురు కోరారు. రామభద్రపురం ఎస్సీకాలనీలో మురికినీటి కాలువ లేనందున అపారిశుద్ద్యం పెరిగి స్థానికులు రోగాల బారిన పడుతున్నార అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్.శాంతారావు, తదితరులు కోరారు. సాలూరు మండలం మొకాసదండిగాం గ్రామంలో గతంలో ప్రభుత్వం తమకు ఇచ్చిన డి పట్టా భూములను ఇప్పుడు మినీ హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం బలవంతం తీసుకున్నారని ప్రజారోగ్యం దృష్ట్యా ఆప్రాజెక్టు పనులు ఆపి ఆభూములను తమకు ఇప్పించాలని కోరుతూ కె.శాంతమ్మ తదితరులు కోరారు. ఎస్.కోట మండల కేంద్రంలో బాబు చెరువు గర్భాన్ని కొందరు ఆక్రమించారని అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ చెరువు ఆయట్టు రైతులు పి.అప్పారావుతోపాటు మరికొందరు వినతినిచ్చారు. వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోరుతూ పలువురు వినతులు అందజేసారు.
నాటుసారా నిరోధానికి గట్టి నిఘా
పార్వతీపురం, జూన్ 17: నాటుసారా నిరోధానికి గట్టి నిఘా పెట్టాలని పార్వతీపురం ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్‌వి రమణ ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్లను ఆదేశించారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ ఎక్సైజ్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒడిసా నుండి అక్రమంగా నాటుసారా దిగుమతి కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో నాటుసారా రవాణా కాకుండా చెక్‌పోస్టుల వద్ద నిఘా మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు. అదేవిధంగా ప్రభుత్వం విధించిన మద్యం అమ్మకాల లక్ష్యాలను అధిగమించాలని సూచించారు. అలాగే త్వరలో ప్రభుత్వం చేపట్టనున్న మద్యం పాలసీ చేపట్టనున్నందున మద్యం అమ్మకాలపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం ఇన్‌ఛార్జి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, పార్వతీపురం సి ఐ ఎస్.శ్రీనివాసరావు, బొబ్బిలి, సాలూరు, కురుపాం సి ఐలు కె.సురేష్, ఎస్‌వి రమణమూర్తి, యు.మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.
పలువురు డిపో మేనేజర్ల బదిలీలు
విజయనగరం (్ఫర్టు), జూన్ 17: ఆర్టీసీ విజయనగరం నార్త్‌ఈస్ట్‌కోస్టల్ రీజియన్ పరిధిలో పలువురు డిపోమేనేజర్లను బదిలీ చేస్తూ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఎ.కె.ఖాన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాకుళం రెండోడిపోమేనేజర్ ఆర్.పద్మావతిని విజయనగరం డిపోమేనేజర్‌గా నియమించారు. ఇక్కడ డిపోమేనేజర్‌గా పనిచేస్తున్న పిబిఎంకెరాజును ఆర్.ఎం.కార్యాలయంలో పర్సనల్ అధికారిగా బదిలీ చేశారు. పార్వతీపురం డిపోమేనేజర్‌గా పనిచేస్తున్న ఎన్‌విఎస్ వేణుగోపాల్‌ను విజయనగరం జోనల్ ఎగ్జిక్యూటివ్‌డైరెక్టర్ కార్యదర్శిగా, వేణుగోపాల్ స్ధానంలో డిపోమేనేజర్‌గా విశాఖ ద్వారకాతిరుమల బస్‌స్టేషన్ అసిస్టెంట్‌మేనేజర్ బివిఎస్ నాయుడును నియమించారు. విజయనగరం డిపో అసిస్టెంట్‌మేనేజర్‌గా పనిచేస్తున్న ముత్తిరెడ్డి సన్యాసిరావుకు పదోన్నతి కల్పిస్తూ శ్రీకాకుళం ఒకటోడిపోమేనేజర్‌గా బదిలీ చేశారు. శ్రీకాకుళం రెండోడిపో అసిస్టెంట్‌మేనేజర్‌గా పనిచేస్తున్న ఆర్.ఎస్.నాయుడును ఆళ్లగడ్డ డిపోమేనేజర్‌గా నియమించారు.
20న ఖాదర్‌వలీ బాబా గంధ మహోత్సవం
విజయనగరం(పూల్‌భాగ్), జూన్ 17 : బాబామెట్టా ఖాదర్ నగర్‌లో ఈనెల 20న హజరత్ సయ్యద్ ఖాదర్‌వలీ బాబా గంధ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు దర్గా,దర్భార్ షరీఫ్ ముతవల్లీ ముహమ్మద్ అతావుల్లా షరీఫ్‌షాతాజ్ ఖాదరీబాబా తెలిపారు.సోమవారం సాయంత్ర దర్గా వద్ద ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతన తన ఆధ్యాత్మిక గరువు ఖాదర్‌బాబా ఆశీస్సులతో ఈఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా 19న ఖరాన్ పఠనం చాదర్ సమర్పణ, 20న 10 దర్బార్ షరీఫ్‌లతో ఫకీర్‌మేళా, ఊరేగింపు, 21న ఖవ్వాలి, 22న భక్తులు దర్గా షరీఫ్‌లోచాదర్, ప్రసాదవితరణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.
విధ్యార్థుల బస్సు పాసుల జారీకి ఏర్పాట్లు
విజయనగరం (్ఫర్టు), జూన్ 17: విద్యార్థులకు బస్సుపాసులను జారీ చేసేందుకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అన్ని డిపోల్లో కౌంటర్లను ప్రారంభించారు. ఒకవైపు దరఖాస్తులను అందిస్తూనే మరోవైపుపాసులను జారీ చేశారు. బస్సుపాసుల జారీ రీజనల్‌మేనేజర్ పి.అప్పన్న సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. విజయనగరం రీజియన్ పరిధిలో విజయనగరం, శృంగవరపుకోట, సాలూరు, పార్వతీపురం, పాలకొండ, శ్రీకాకుళం డిపో-1, శ్రీకాకుళం డిపో-2, పలాస, టెక్కలి డిపోలు ఉన్నాయి. ఈ డిపోల పరిధిలో విద్యార్థులకు బస్సులను అందిస్తున్నారు. అన్ని డిపోల్లోను బస్సులను అందించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. బస్సుపాసుల జారీలో గతంలో ఏర్పడిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ సారి గట్టి చర్యలు చేపట్టారు. దీనిలోభాగంగా ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేశారు. బస్సుపాసుల జారీపై స్థానిక డిపో అసిస్టెంట్‌మేనేజర్ కార్యాలయంలో రీజనల్‌మేనేజర్ పి.అప్పన్న సమీక్షించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్‌మేనేజర్లు కొటాన శ్రీనివాసరావు, గండి సత్యనారాయణ, డిపోమేనేజర్ పిబిఎంకె రాజు, అసిస్టెంట్‌మేనేర్ ముత్తిరెడ్డి సన్యాసిరావుతదితరులు పాల్గొన్నారు.
డయల్ 100 కంట్రోల్ యూనిట్ ప్రారంభం
విజయనగరం, జూన్ 17: పట్టణంలోని వన్‌టౌన్‌లో ఏర్పాటు చేసిన డయల్ 100 కంట్రోల్ యూనిట్‌ని కోస్టల్ జోన్ ఐజి ద్వారకా తిరుమలరావు ప్రారంభించారు. సోమవారం జిల్లాకు వచ్చిన సందర్భంగా వన్‌టౌన్‌లో ఏర్పాటు చేసిన డయల్ 100 పనితీరును పరిశీలించారు. డయల్ 100 ద్వారా పోలీసులు ప్రజలకు మరింత చేరువకాగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. దొంగతనాలు, కొట్లాటలు, దొమ్మి, రహదారి ప్రమాదాల వంటి సంఘటనల సమయంలో డయల్ 100కు ఫోన్ చేసి పోలీసు సహాయం పొందవచ్చునని అన్నారు. ఇదిలా ఉండగా పోలీసు స్టేషన్‌కు వచ్చిన ప్రతి ఫిర్యాదుదారునికి రశీదు ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించినట్టు తెలిపారు. పట్టదగిన నేరమైతే వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామన్నారు. లేదా తక్షణ న్యాయం అందిస్తామని వివరించారు.
విశ్రాంతి గది ప్రారంభం
జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన విశ్రాంతి గదిని ఐజి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. అనంతరం ఆర్మ్‌డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసును ప్రారంభించారు. జిల్లా ఎస్పీ కార్తికేయ, ఎఎస్పీ మోహనరావు, ఒఎస్‌డి డి.వి.శ్రీనివాసరావు, ఆర్మ్‌డ్ రిజర్వు డిఎస్పీ జి.శ్రీనివాసరావు, ఎస్.బి. ఇన్‌స్పెక్టర్ ఎంవివి రమణమూర్తి, ఆర్‌ఐలు ఎస్పీ అప్పారావు, నాగేశ్వరరావు పోలీసు అధికారులు పాల్గొన్నారు.
నేడు కలెక్టర్‌గా బాధ్యతలు
స్వీకరించనున్న కాంతిలాల్ దండే
విజయనగరం, జూన్ 17: జిల్లా కలెక్టర్‌గా నియమితులైన కాంతిలాల్ దండే మంగళవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక్కడ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఎం.వీరబ్రహ్మయ్యను కరీంనగర్ జిల్లాకు బదిలీ చేసిన విషయం విదితమే. ఆయన స్థానంలో కాంతిలాల్ దండే నియమితులయ్యారు. ఈయన గతంలో ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. ఈయన వ్యవసాయ పట్ట్భద్రులు. జెనెటిక్స్ ప్లాంట్ బ్రీడింగ్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ పనిచేశారు. గిరిజన సంక్షేమ శాఖలో ప్రాజెక్టు ఆఫీసర్‌గా, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు కమిషనర్‌గా, కడప, గుంటూరు జిల్లాలకు జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. అనంతరం చేనేత జౌళిశాఖ డైరెక్టర్‌గా, టూరిజం డైరెక్టర్‌గా పనిచేశారు. అక్కడ నుంచి విజయనగరం జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు.
దొంగతనాల నియంత్రణకు చర్యలు
విజయనగరం, జూన్ 17: దొంగతనాల నిరోధానికి ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్టు నార్త్ కోస్టల్ జోన్ ఐజి ద్వారకా తిరుమలరావు తెలిపారు. సోమవారం ఇక్కడ జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందమర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల సమస్యల గురించి మాట్లాడుతూ ముందుగా సమాచారం సేకరించి వాటిని నివారించాలన్నారు. అలాగే పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో పెట్రోలింగ్ గస్తీని ముమ్మరం చేసి దొంగతనాలను అరికట్టాలన్నారు. వివిధ సబ్ డివిజన్లలో నెలకొన్న సమస్యల గురించి ప్రస్తావించారు. ఆయా సమస్యల గురించి చర్చించి సమస్యలను పరిష్కరించే విధానం గురించి వివరించారు. సిబ్బంది అంకిత భావంతో పనిచేసి పోలీసు ప్రతిష్టను ఇనుమడింపజేయాలన్నారు. డిఐజి పి.ఉమాపతి, ఎస్పీ కార్తికేయ, ఎఎస్పీలు మోహనరావు, రాహుల్ దేవ్‌శర్మ, పిటిసి డిఎస్పీ మధుసూదనరావు, ఒఎస్‌డి డివి శ్రీనివాసరావు, డిఎస్పీలు కృష్ణప్రసన్న, టి.్ఫల్గుణరావు, జి.శ్రీనివాసరావు, పాల్గొన్నారు.
అక్రమంగా నిల్వ చేసిన పత్తి విత్తనాలు స్వాధీనం
పార్వతీపురం, జూన్ 17: పట్టణంలోని కొత్తవలసలో గల ఓ పత్తివిత్తనాల గోదాంలో సోమవారం శ్రీకాకుళం నుండి వచ్చిన విజిలెన్సు అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజిలెన్సు అధికారులు మాట్లాడుతూ లైసెన్సు ఉన్నచోట గోదాం ఏర్పాటు చేయకుండా వేరొక చోట గోదాంలో పత్తివిత్తనాలు స్టాకు చేశారని విజిలెన్సు అధికారులు తెలిపారు. పత్తివిత్తనాలను కేవలం పార్వతీపురం ఎడి ఎ పరిధిలోని ప్రాంతాల్లోనే అమ్మాల్సి ఉండగా ఒడిశాలోని రైతులకు అమ్మకం చేస్తున్నారని సోదాల్లో తేలినట్టు తెలిపారు. దాడుల్లో గోదాంలోని నిల్వ ఉంచిన 35 సీడ్ బాక్సులు స్వాధీనం చేసుకున్నామని వీటి విలువ రూ.6లక్షలు ఉంటుందని విజిలెన్సు తెలిపారు. విజిలెన్సు సిఐ రేవతి, సిబ్బంది పాల్గొన్నారు.
‘పట్టణ సమస్యలపై దృష్టి సారించాలి’
విజయనగరం , జూన్ 17: పట్టణంలో సమస్యలపై దృష్టి సారించాలని పలువురు కోరారు. డయల్ యువర్ మున్సిపల్ కమిషనర్ కార్యక్రమంలో భాగంగా పట్టణ ప్రజల నుంచి సోమవారం పట్టణ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. పట్టణంలో రోడ్లు మరమ్మతులకు గురయ్యాయని, చాలాచోట్ల గతుకులమయంగా తయారయ్యారని తెలిపారు. ముఖ్యంగా పట్టణ శివారు ప్రాంతాల్లో రోడ్లు మరింత దారుణంగా ఉన్నాయన్నారు. అదేవిధంగా మంచినీటి సరఫరా విభాగం పనితీరు ఏమాత్రం బాలేదన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా ఉందన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది సక్రమంగా పనిచేయడం లేదని పలువురు ఆరోపించారు. అదేవిధంగా సోమవారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన మున్సిపల్ దర్బార్ మంచి స్పందన లభించింది.
జిల్లా కలెక్టర్‌కు సన్మానం
విజయనగరం, జూన్ 17: గత మూడేళ్ల కాలంలో జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అక్షరాస్యత కార్యక్రమానికి సహకారం అందించినందుకు జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య కృతజ్ఞతలు తెలిపారు. అక్షరాస్యత కార్యక్రమానికి 85 శాతం తీసుకువెళ్లలేకపోయామని, దానిని విద్యాశాఖాదికారులు సమన్వయంతో సాధించాలన్నారు. పదో తరగతిలో 2010-11లో 80.65 శాతం, 2011-12లో 89.65 శాతం, 2012-13లో 89.75 శాతం సాధించినట్టు డిఇఒ కృష్ణారావు తెలిపారు. అనంతరం అదనపు జాయింట్ కలెక్టర్ యుసిజి నాగేశ్వరరావు, డ్వామా పిడి కె.శ్రీరాములనాయుడు, రాజీవ్ విద్యా మిషన్ ప్రాజెక్టు అధికారి కె.వెంకటరమణ, వయోజన విద్య డిడి అమ్మాజీరావు, డిఆర్‌డిఎ పిడి జ్యోతి, ఎస్‌హెచ్‌జి సంఘాలు, డిప్యూటీ డిఇఒ నాగమణి తదితరులు కలెక్టర్‌ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పి సిఇఒ మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
గట్టెక్కిన ‘బంగారు తల్లి’
టిఆర్‌ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్
టిడిపి, బిజెపి వాకౌట్
బిల్లుల కోసమే సస్పెన్షన్లు
సిపిఐ, సిపిఎం, ఎంఐఎం సభ్యుల ఆగ్రహం
=======================
హైదరాబాద్, జూన్ 19: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాకరంగా భావించిన ఆంధ్రప్రదేశ్ బంగారు తల్లి బాలికాభ్యుదయ మరియు సాధికారిత బిల్లు-2013 (బంగారు తల్లి)కు శాసనసభ బుధవారం ఆమోదం తెలిపింది. బంగారు తల్లితో పాటు మరో నాలుగు బిల్లుల ఆమోదం కోసం శాసనసభ సాయంత్రం ఐదు గంటలకు ప్రత్యేకంగా సమావేశం కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం సభలో తీర్మానం చేయాలని టిఆర్‌ఎస్, ఐఎన్‌జికి భూముల కేటాయింపు కేసులో చంద్రబాబుపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు పోడియాన్ని చుట్టు ముట్టి సభా కార్యకలాపాలకు అడ్డుపడటంతో ఇరు పార్టీలకు చెందిన 25 మంది సభ్యులను సభ నుంచి ఒకరోజు పాటు సస్పెండ్ చేసారు. అంతకుముందు సాయంత్రం ఐదు గంటలకు సమావేశమైన సభను టిఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సిపి సభ్యులు అడ్డుకోవడంతో సభను అరగంట పాటు స్పీకర్ నాదెండ్ల మనోహర్ వాయిదా వేసారు. తిరిగి సమావేశమయ్యాక కూడా ఇరు పార్టీలకు చెందిన సభ్యులు పోడియాన్ని చుట్టుముట్టి సభా కార్యకలాపలను అడ్డుకోవడంతో వారిని సస్పెండ్ చేయాలని ఆర్థికశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీర్మానం ప్రవేశ పెట్టారు. దీంతో సభ నుంచి 14 మంది టిఆర్‌ఎస్ పార్టీ సభ్యులను, 11 మంది వైఎస్‌ఆర్‌సిపి పార్టీ సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేసినట్టు స్పీకర్ ప్రకటించారు. ఆ తర్వాత సభ ప్రారంభం కాగానే టిడిపి శాసనసభా పక్షం ఉప నాయకుడు అశోక గజపతిరాజు, ముద్దు కృష్ణమనాయుడు మాట్లాడుతూ, సభలో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా విపక్ష సభ్యులు అడ్డుకున్నప్పుడు వారిపై చర్య తీసుకోలేదనీ, సభా సమయాన్ని వృధా చేసినప్పటికీ చర్య తీసుకొని పాలకపక్షం కేవలం బిల్లులను ఆమోదించుకోవడానికే సభ్యులను సస్పెండ్ చేసిందని విమర్శించారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ వైఎస్‌ఆర్‌సిపి కుమ్మక్కై సభలో ప్రజల సమస్యలు చర్చకు రాకుండా చేసారని ఆరోపిస్తూ సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు టిడిపి ప్రకటించింది. సభలో తెలంగాణ తీర్మానం చేయకపోవడాన్ని నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నట్టు బిజెపి సభ్యుడు యెండల లక్ష్మీనారాయణ ప్రకటించారు. అయితే సభా కార్యకలాపాలకు అడ్డుతగిలిన సభ్యులను ఉపేక్షించి, కేవలం బిల్లుల ఆమోదం కోసం మాత్రమే వారిని సస్పెండ్ చేయడం పట్ల నిరసన తెలియజేస్తున్నామని సిపిఐ, సిపిఎం, ఎంఐఎం పార్టీలు పేర్కొన్నాయి.
అనంతరం సభలో బంగారు తల్లి బిల్లును మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ప్రవేశపెట్టారు. బంగారు తల్లి బిల్లుకు చట్టబద్ధత కల్పించడాన్ని కొనియాడుతూ, పాలక పక్షానికి చెందిన సభ్యులతో పాటు, సిపిఐ, సిపిఎం, లోక్‌సత్తా పార్టీల సభ్యులు 16 మంది ప్రసంగించారు.
ఓట్ల కోసం అయితే చట్టం చేసేవాళ్లం కాదు: సిఎం
ఓట్ల కోసమే బంగారు తల్లి బిల్లును చట్టం చేసినట్టు ప్రతిపక్షాలు ఆరోపించడాన్ని ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఓట్ల కోసమే అయితే బంగారు తల్లి బిల్లును చట్టం చేయాల్సిన అవసరం లేదన్నారు. అధికారంలో ఎవరున్నా బంగారు తల్లి పథకం ఆగిపోకూడదనే ఉద్దేశంతోనే చట్టం చేసామని తెలిపారు. ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా ఒర్వకల్లులో పర్యటించినప్పుటు మహిళా పొదుపు సంఘానికి చెందిన ఒక మహిళా చేసిన సూచన నుంచి బంగారు తల్లి పథకానికి అంకురార్పణ జరిగిందని ముఖ్యమంత్రి వివరించారు. మహిళా అభ్యుదయం పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమే బంగారు తల్లికి చట్టబద్ధత అని ముఖ్యమంత్రి కొనియాడారు. దేశంలో మరే రాష్ట్రంలో కూడా లేని విధంగా వినూత్న పథకాన్ని తీసుకురావడాన్ని ప్రణాళిక సంఘం చైర్మన్ మాంటెక్ సింగ్ కూడా అభినందించారని ముఖ్యమంత్రి గుర్తు చేసారు. మహిళా అభ్యుదయం పట్ల కానీ, ఎస్సీ ఉప ప్రణాళిక పట్ల కానీ ప్రధాన ప్రతిపక్షానికి చిత్తశుద్ధి లేదని, అందుకే ఈ రెండు బిల్లులు సభలో ప్రవేశపెట్టినప్పుడు ఆ పార్టీ సభ నుంచి బయటికి వెళ్లిందని ముఖ్యమంత్రి ఆరోపించారు. కళంకిత మంత్రులకు తాను వత్తాసు పలుకుతున్నానని ప్రధాన ప్రతిపక్షం టిడిపి చేసిన ఆరోపణలను ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించారు. తమకు వైఎస్‌ఆర్‌సిపితో కుమ్మక్కు కావాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ పార్టీకి బంగారు తల్లి కాదుకదా, నిలువెత్తు బంగారాన్ని పోసినా తెలంగాణలో ఒక్క ఓటు పడదని సిపిఐ పక్షం నాయకుడు గుండా మల్లేశ్ దుయ్యబట్టారు. బంగారు తల్లి పథకాన్ని ఓట్ల కోసం తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు.
అంతకుముందు టిడిపి ఉప నాయకుడు ముద్దు కృష్ణమనాయుడు చేసిన ఆరోపణలను మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, ఆనం రామనారాయణరెడ్డి తీవ్రంగా ఖండించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతో ప్రధాన ప్రతిపక్షం టిడిపి కుమ్మక్కు కావడం వల్లనే వారి డిమాండ్లను టిడిపి ఎత్తుకుందని కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ సభ్యుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ, తమపై సిబిఐ మోపిన అభియోగాలపై నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేసారు. అభియోగాలు నిరూపణ కాకముందే, తమను జైలుకు వెళ్తారని ప్రతిపక్ష టిడిపి అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అభియోగాలపైనే జైలుకు వెళ్లేటట్టు అయితే ఐఎన్‌జి భూముల కేటాయింపులో చంద్రబాబు కూడా జైలుకు వెళ్లక తప్పదని ధర్మాన విమర్శించారు.
శ్రీకాంత్ ‘నాటుకోడి’ ప్రారంభం
నాని కృష్ణ దర్శక నిర్మాతగా శ్రీకాంత్ కథానాయకుడిగా నిర్మిస్తున్న ‘నాటుకోడి’ చిత్రం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. నానిగాడు సినిమా పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ప్రారంభోత్సవ సన్నివేశంపై గోపీచంద్ క్లాప్ ఇవ్వగా సి.ఆర్.మనోహర్ కెమెరా స్విచ్చాన్ చేశారు. గౌరవ దర్శకత్వం బి.గోపాల్ నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు నాని కృష్ణ మాట్లాడుతూ- ప్రపంచంలో అందరూ చెడ్డవారే ఉన్నారు. అవకాశాలు లేక కొందరు మంచివాళ్ళుగా మిగిలిపోయారు అనే యండమూరి వీరేంద్రనాధ్ చెప్పిన వాక్యం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, నిజాయితీ ఉన్న పోలీస్ తండ్రికి అవినీతితో ఉన్న ఇన్స్‌పెక్టర్ కొడుకుకి మధ్య జరిగే సంఘర్షణే ఈ చిత్ర కథాంశమని, పల్లెల్లో కోడిపందాలాడితే తప్పేంటి అని ఎదురుతిరిగే పోలీస్‌గా శ్రీకాంత్ నటిస్తున్నారని తెలిపారు. శ్రీకాంత్ తండ్రిగా కోట శ్రీనివాసరావు నటిస్తున్న ఈ పక్కా మాస్ మసాలా చిత్రంలో పూర్తిస్థాయి ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందని ఆయన వివరించారు. నాని కృష్ణ దేవదాయ చిత్రంతో తనకు మంచి పేరు వచ్చిందని, ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ వేలో ఈ చిత్రాన్ని అతను రూపొందించడానికి ముందుకు వచ్చాడని గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సెంటిమెంట్ పాళ్ళతో ఫామిలీ ఎంటర్‌టైనర్‌గా కూడా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, త్వరలో రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్ళనుందని కథానాయకుడు శ్రీకాంత్ తెలిపారు. నిర్మాత సత్తిరెడ్డి, అదుర్స్ రఘు, సంగీత దర్శకుడు యాజమాన్య తదితరులు సినిమా విశేషాలు తెలిపారు. ఎం.ఎస్.నారాయణ, జీవా, కొండవలస, రఘు, ప్రభు, చిట్టి, సత్యనారాయణరెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు:రవిరెడ్డి మల్లు, సంగీతం:యాజమాన్య, కెమెరా:మల్లేష్ నాయుడు, నిర్మాత, దర్శకుడు:నానికృష్ణ.
ఓ అమ్మాయి కథ!
ప్రస్తుతం సమాజంలో యువతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, దానికి నిదర్శనంగా తాను ఇటీవల వేధింపులకు గురైన అమ్మాయి సహాయం చేయమని అడిగితే తానేమీ చేయలేకపోయానని, అటువంటి యువతుల కథలతో అనేక చిత్రాలు తీయవచ్చని, తన కథతో నిర్మించిన ‘సైకో’ చిత్రం అటువంటి అమ్మాయి కథేనని దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తెలిపారు. నిషాకొఠారి కథానాయికగా కిశోర్ భార్గవ్ దర్శకత్వంలో వివేకానంద ఆహుజ నిర్మించిన ‘సైకో’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 21న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా కథ, స్క్రీన్‌ప్లే అందించిన రామ్‌గోపాల్‌వర్మ చిత్రం గూర్చి పలు విశేషాలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ- అమ్మాయిలకు ఫోన్లలో వేధింపులు, అలాగే బైటికి వస్తే అనేకమంది పురుషాహంకారం ఉన్న వ్యక్తులతో వేధింపులు ఎదుర్కొంటున్నారని, అటువంటి వ్యక్తుల కథలతో చిత్రం తీసే ప్రయత్నం ఒకటి చేయాలని అనుకున్నానని తెలిపారు. తాను కొన్ని సినిమాలు వినోదం కోసం, కొన్ని సినిమాలు వాణిజ్య అంశాలు దృష్టిలో పెట్టుకొని, కొన్ని ఉబుసుపోక తీసిన సినిమాలు ఉన్నాయని, అయితే ఈ చిత్రం మాత్రం ప్రస్తుతం మన మధ్య జరుగుతున్న అనేక లైంగిక దాడులు, యాసిడ్ దాడుల నేపథ్యంలో నిర్మించిందని, అబ్బాయిలు అమ్మాయిల వెనుక ప్రేమంటూ వెంటబడుతూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారని, ఈ పద్ధతికి వ్యతిరేకంగా ప్రతివాళ్ళూ ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అటువంటి అబ్బాయిలు ఉన్న కుటుంబాలలో వారి కుటుంబ సభ్యులను ముందుగా చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని, ఈ సినిమా ప్రతీ ఒక్క అమ్మాయి చూడదగినదని ఆయన వివరించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈ చిత్రాన్ని 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని ఆయన వివరించారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే:రామ్‌గోపాల్‌వర్మ, నిర్మాత:వివేకానంద ఆహుజ, దర్శకత్వం:కిషోర్ భార్గవ్.
‘కొత్తొక వింత’ సెన్సార్ పూర్తి
అనీల్ కళ్యాణ్, అక్షయ జంటగా సన్‌రైజర్ మీడియా సమర్పణలో గ్రేట్ ఇండియా క్రియేషన్స్ పతకంపై బి.వి.రమణారెడ్డి దర్శకత్వంలో నిర్మించిన ‘కొత్తొక వింత’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. శామ్యూల్ బుస్సా, దాసరి సునీల్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం గూర్చి దర్శకుడు మాట్లాడుతూ- విదేశీ వ్యామోహంలో పడి పెడదారి పడుతున్న నేటి భారత యువత తమ సంస్కృతిని విస్మరిస్తే ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయో, మంచి కథతోఈ చిత్రంలో చూపామని, ముఖ్యంగా చీకటి రహస్యాలను ఈ చిత్రం ద్వారా చర్చించామని తెలిపారు. ఎం.ఎస్.నారాయణ పాత్ర హైలెట్‌గా నిలిచే ఈ చిత్రంలో సంగీతం అందరికీ నచ్చుతుందని, కెమెరా పనితనం కుదిరిన ఈ కమర్షియల్ యూత్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ నేటి యువతకు మోడరన్ ట్రెండ్ ఫిలింగా నిలుస్తుందని ఆయన వివరించారు. వినోదంతోపాటు సందేశం అందించేందుకు ఈ చిత్రం త్వరలో విడుదల కానుందని ఆయన అన్నారు. మంచి కథతో నిర్మించిన ఈ చిత్రం తమ తొలి ప్రయత్నమని, ఈనెలాఖరుకు ఆడియో, జూలైలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చిత్ర నిర్మాతలు తెలిపారు. స్వరూప్ రాజ్, వినీషా నాయుడు, ఎం.ఎస్.నారాయణ, రత్నప్రసాద్, గుండు హనుమంతరావు, ఎస్.ఎమ్.ఎస్.చంటి నటించిన ఈ చిత్రానికి సంగీతం:ఎస్.ఎస్.ఆత్రేయ, కెమెరా: పి.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్:మేనగ శ్రీను, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: బి.వి.రమణారెడ్డి.
21న ‘అనార్కలి’
ఓంకార్ కథానాయకుడిగా గౌరీ శర్మతో జంటగా గౌతమీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పి.ఎన్.రాయ్ దర్శకత్వంలో సక్క్భుయి నిర్మించిన ‘అనార్కలి’ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెల 21న విడుదలకు ముస్తాబవుతుంది. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ హాల్‌లో సినిమా విశేషాలను తెలుపడానికి పాత్రికేయుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా కథానాయకుడు ఓంకార్ మాట్లాడుతూ- తాను హీరోగా నటించిన ‘అనార్కలి’ ప్రివ్యూ చూసి సంతోషించానని ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిందని, 21న విడుదలకానున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉందని తెలిపారు. సంగీత దర్శకుడు విద్యాప్రతాప్ మాట్లాడుతూ- పాటలన్నీ అద్భుతంగా వచ్చాయని, ఓ సాదాసీదాగా ఉండే కుర్రాడు అమ్మాయి ప్రేమలో పడ్డాక ఎటువంటి పరిణామాలను ఎదుర్కొన్నాడు అన్న కథనంతో, అన్ని కమర్షియల్ విలువలతో ఈ చిత్రం తెరకెక్కిందని నేపథ్య సంగీతం అద్భుతంగా కుదిరిందని తెలిపారు. కోట శ్రీనివాసరావు, ఎం.ఎస్.నారాయణ, ప్రభ, దేవిశ్రీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:వెంకట హనుమ, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, పాటలు: ఎం.వి.ఎస్. సుబ్రహ్మణ్యం, ఎడిటింగ్:మోహన్ రామారావు, నిర్మాత: సక్క్భుయి, దర్శకత్వం:పి.ఎన్.రాయ్.
ప్రిన్స్ కొత్త చిత్రం మొదలైంది...
అరుణాచల అకాడెమీ పతాకంపై చరిత్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా రామానాయుడు స్టూడియోలో బుధవారం ఉదయం ప్రారంభమైంది. ప్రిన్స్, మృదులా భాస్కర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రతాప్ సిహెచ్.నాగరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్తపు సన్నివేశానికి వి.వి.వి నాయక్ క్లాప్‌నివ్వగా కొత్తపల్లి సుబ్బారాయుడు కెమెరా స్విచ్చాన్ చేశారు. గౌరవ దర్శకత్వాన్ని సంతోష్ శ్రీనివాస్ నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు చరిత్ మాట్లాడుడూ- లవ్ కామె డీ, ఫామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జూలై 10 నుండి ప్రారంభవౌతుందని, ఆగస్టు సెప్టెంబర్‌లలో మరో రెండు షెడ్యూల్స్ చేస్తామని తెలిపారు. హైదరాబాద్, రాజమండ్రి, అరకుల్లో నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంగీతం హైలెట్‌గా నిలుస్తుందని ఆయన అన్నారు. కామెడీ లవ్ ప్రధానంగా సాగే ఈ చిత్రం తనకొక డ్రీమ్ ప్రాజెక్టులాంటిదని, సినిమాలో సెకెండాఫ్‌లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుందని కథనాయకుడు ప్రిన్స్ తెలిపారు. కార్యక్రమంలో కథానాయిక మృదుల భాస్కర్, మిక్కీ జె మేయర్ పాల్గొన్నారు. తనికెళ్ల భరణి, అలీ, రావూ రమేష్, బ్రహ్మాజీ, ప్రవీణ్, ధన్‌రాజ్, రఘు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు:అనంత్ శ్రీరామ్, మాటలు:వసంత్.కె, ఎడిటింగ్:కార్తీక్ శ్రీనివాస్, కెమెరా:లలిత్ సాహు, సంగీతం:మిక్కీ జె.మేయర్, నిర్మాతలు:ప్రతాప్, సిహెచ్.నాగరాజు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:చరిత్.
ప్రయోగాల బాటలో...
నాగార్జునతో సంకీర్తన, కోకిల, ప్రియతమా చిత్రాలతో మంచి అభిరుచి వున్న దర్శకుడిగా గుర్తింపు పొందిన గీతాకృష్ణ స్టార్ దర్శకుడిగా గుర్తింపు పొందలేకపోయారు. సినీ అభిమానులకు పెద్దగా ఆయన పరిచయం లేకపోయినా పరిశ్రమలో పెద్దలందరికీ ఆయన పేరు బాగా తెలుసు. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా సరికొత్త కథనంతో ఆయన రూపొందించే చిత్రాలను పరిశ్రమలోని వ్యక్తులు ఇష్టపడుతుంటారు. తాజాగా కాఫీబార్ అంటూ ఆయన హల్‌చల్ చేశారు. సక్సెస్‌లకు, ఫెయిల్యూర్‌లకు దూరం గా ఉంటూ రియలిస్టిక్ చిత్రాలను నిర్మించే ఆయన త్వరలో ఓ భారీ ప్రాజెక్టును చేపట్టనున్నారు, అది కూడా 150 కోట్ల భారీ బడ్జెట్‌తో. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా ఇంత పెద్ద బడ్జెట్‌తో చేస్తున్న ప్రాజెక్టు సినిమాకు సంబంధించింది కాదు. భారతీయ సంస్కృతి, చారిత్రక ప్రదేశాలు, రాజకీయాలు వంటి అనేక విషయాల నేపధ్యంలో ఓ డాక్యుమెంటరీని ఆయన రూపొందించనున్నారు. ఇందుకోసం భారతదేశంలోని అనేక ప్రాంతాలలో పర్యటించి షూటింగ్ చేస్తారు. మై కంట్రీ ఇండియా టైమ్ క్యాప్సుల్ అనే పేరుతో రూపొందిస్తున్న ఈ ఫ్యూచరిక్ ఫిలిమ్ డాక్యుమెంటరీని తొమ్మిది భాగాలుగా రూపొందిస్తారని తెలుస్తోంది. భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ఉన్న విశేషాలతో సరికొత్తగా నిర్మించనున్న ఈ డాక్యుమెంటరీ ధర 9,999 రూపాయలుగా నిర్ణయించారు. అదే విధంగా డాక్యుమెంటరీని తొమ్మిది భాగాలుగా రూపొందిస్తారు. ధర కాస్త ఎక్కువైనా ప్రాజెక్టు ఖర్చు 150 కోట్లు దాటుతుండడంతో ఈ మాత్రం ధర తప్పదంటున్నారు. సినిమాలతో గుర్తింపు పొందలేకపోయినా ఈ భారీ బడ్జెట్ డాక్యుమెంటరీతో గీతాకృష్ణ ఎటువంటి ఫలితాలను సాధిస్తారో వేచి చూడాల్సిందే.
రెండేళ్ల పారితోషికం...!
ఇప్పటికే గుబురుగా పెంచిన గడ్డంతో ప్రభాస్ అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. ఆ గడ్డం ఎస్.ఎస్. రాజవౌళి దర్శకత్వంలో నిర్మించబోయే ‘బాహుబలి’ కోసం పెంచుతున్నాడన్న ప్రచారం కూడా బాగానే జరుగుతోంది. అయితే ఈ చిత్రం కోసం ప్రభాస్ రెండు సంవత్సరాల భారీ కాల్షీట్స్ ఇచ్చాడట. మరే చిత్రంవైపు ఆయన కనె్నత్తి కూడా చూడడం లేదు. ఈ రెండు సంవత్సరాల్లో ఎన్ని సినిమాల్లో నటించవచ్చో అన్ని సినిమాల పారితోషికాన్ని ఈ ఒక్క సినిమాకే తీసుకుంటున్నాడన్న పుకారు కూడా టాలీవుడ్‌లో షికారు చేస్తోంది. ‘బాహుబలి’ సినిమా కోసం ప్రభాస్ పారితోషికం విషయంలో అనేక రకాల వదంతులు వినిపిస్తున్నాయి. పారితోషికం భారీ సంఖ్య అవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒక హీరోకు ఇంత రెమ్యూనరేషన్ ఇస్తారా? అని ఆశ్చర్యపడే రీతిలో ఈ సంఖ్యలు ఉంటున్నాయి. ఒకరేమో 20 కోట్లు అంటే మరి కొందరు 30 కోట్లు అంటున్నారు. ఇవన్నీ కాదు ప్రభాస్ రెండు సంవత్సరాల పారితోషికం 40కోట్లు అని చెబుతున్నారు. మరి ఇంత పారితోషికం ఇచ్చే స్థాయి తెలుగు సినిమా పరిశ్రమకు ఉందా? మళ్లీ పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందా? అన్న చర్చ కూడా ప్రస్తుతం సాగుతోంది. ఈ సినిమాకోసం ప్రభాస్ అనేక చిత్రాలను వదులుకోవాల్సి వస్తోంది. కాబట్టి రెండేళ్లలో అతను చేయగలిగే సినిమాలకు పొందే పారితోషికాన్ని బాహుబలి సినిమా నిర్మాతలే భరించనున్నారని కూడా ఓ వార్త వినిపిస్తోంది. దీంతో ప్రభాస్ రెమ్యూనరేషన్‌పై అనేక గాసిప్‌లు మొదలయ్యాయి. చిట్టచివరికి ఈ చిత్రానికి ఆయనకి ఎంత ముడుతుందో కానీ నిర్మాత సేఫ్ అయితే అంతే చాలని ఫిలిమ్ వర్గాలు విశే్లషిస్తున్నాయి!
సమంత
రాశి రీ ఎంట్రీ!
‘శుభాకాంక్షలు’ చిత్రం విడుదలయ్యాక ఆ చిత్రంలో నటించిన రెండో కథానాయిక గురించి అప్పట్లో అనేక చర్చలు జరిగాయి. యువ హృదయాలను దోచుకున్న ఆ సౌందర్య రాశి పేరు నిజంగానే రాశి అని తెలిసి యువ ప్రేక్షకులు సంతోషపడ్డారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన రావుగారిల్లు చిత్రంతో బాల నటిగా తెరంగేట్రం చేసిన రాశి ఆ తర్వాత అనేక చిత్రాల్లో బాల నటిగా చేసి, కథానాయికగా ప్రమోషన్ పొందింది. గోకులంలో సీత, పెళ్లిపందిరి, ఏవండీ పెళ్లిచేసుకోండి, పండగ, వసంత, సుప్రభాతం, గిల్లికజ్జాలు, స్నేహితులు, మనసిచ్చి చూడు, కలవారి చెల్లెలు కనకమహాలక్ష్మి, నేటి గాంధీ, స్వప్నలోకం, హరిశ్చంద్ర, వీడుసామాన్యుడు కాడు, శీను, కృష్ణబాబు, సముద్రం, ప్రేయసిరావె, ఎకె-47, పోస్ట్‌మెన్, మనస్సు పడ్డాను కానీ, బలరామ్, ఒక మాట, శివాజీ, మూడుముక్కలాట, చెప్పాలని వుంది, దీవించండి, అక్కా బావెక్కడ, నాగప్రతిష్ఠ, దేవి అభయం లాంటి చిత్రాలు చేసి ఆ తర్వాత కనుమరుగయ్యారు. ఆమధ్య తేజ చిత్రంలో విలన్ పక్కన ఉండే వాంప్‌గా కూడా నటించారు. ఆ తర్వాత చిత్రాలేమీ ఆమె ఖాతాలో లేవు. ఇప్పుడు తాజాగా 9 సంవత్సరాల తర్వాత రీఎంట్రీ ఇస్తోంది రాశి. ఈ సందర్భంగా పరిశ్రమ ఏమీ తనకు కొత్తగా అనిపించడం లేదని, రాజేంద్రప్రసాద్‌తో కలిసి నటిస్తున్న ఈ చిత్రం తనకు, సరైన రీ ఎంట్రీగా భావిస్తున్నానంటోంది. అయితే ఇంకా హీరోయిన్ పాత్రలు వేయాలంటే మాత్రం కుదరదని, ఎటువంటి పాత్రలు వచ్చినా నటించడానికి సిద్ధమంటోంది ఈ అమ్మడు. చూద్దాం ఎటువంటి పాత్రల్లో మళ్లీ ప్రేక్షకులను మెప్పిస్తుందో? బాల నటినుండి సాగిన ప్రయాణం చివరికి ఎక్కడివరకు వెళుతుందో వెండి తెరపై చూడాల్సిందే! రాశి చిత్రాల వాశి ఎంతవరకూ ప్రేక్షకులకు నచ్చుతుందో చూద్దాం!