నరసన్నపేట, జూన్ 27: ప్రభుత్వ పాఠశాలల ఖ్యాతిని, ఉన్నతిని పరిరక్షించడమే కాకుండా వాటి స్థాయిని పెంచాలని కలెక్టర్ సౌరభ్‌గౌర్ సూచించారు. గురువారం మండలంలో సుందరాపురం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో రాష్ట్రీయ మాధ్యమిక విద్యా అభియాన్ ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న సుమారు 300 పాఠశాలలకు పైగా పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించి ఉన్నత విద్యను అందించేందుకు తల్లిదండ్రులు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ప్రస్తుతం కార్పొరేట్ స్కూళ్లలో పల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తమ చదువుల పట్ల ఆసక్తి చూపించడంతోపాటు ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నారన్నారు. ఆ దిశగానే జిల్లాలో 53 జెడ్పీ హైస్కూల్‌లలో ఈ ఏడాది జరిగిన పదోతరగతి పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. ప్రభుత్వపాఠశాలల్లో ఉత్తమమైన విద్యను అందిస్తున్నారనడానికి ఇది నిదర్శనమన్నారు. దీనికి సంబంధించి ఉత్తమ ఫలితాలు సాధించిన 30 మంది పదోతరగతి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వౌళిక సదుపాయాలు కల్పించేందుకు కృషిచేస్తున్నామని స్పష్టంచేసారు. గత ఏడాది 80 కోట్ల రూపాయలతో పాఠశాలల్లో అదనపు తరగతి భవనాలు నిర్మించామని, ఈ ఏడాది మరో 137 కోట్ల రూపాయలతో అదనపు తరగతి భవనాల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. అలాగే జిల్లాలో 18 మోడల్ స్కూల్స్ ఉన్నాయని, ఆయా పాఠశాలల్లో సుమారు 20 వేల మందికి పైగా విద్యార్థులకు ప్రవేశం కల్పించామని చెప్పారు. దీనికి సంబంధించి సిబిఎస్‌ఇ సిలబస్ ప్రకారం ఆంగ్లబోధనను కూడా అందిస్తున్నామని వెల్లడించారు. బాలికల వసతిగృహాల కోసం ఈ ఏడాది 2.50 కోట్ల రూపాయలు మంజూరయ్యాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం మూడున్నర లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారన్నారు. పదోతరగతిలో శతశాతం సాధించిన పాఠశాలలకు ‘విజయం’ పేరిట పతాకాన్ని అందించామన్నారు. అనంతరం విజయం పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. అలాగే తల్లిదండ్రులచే ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయించారు. ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావుతోపాటు పాఠశాల ఉపాధ్యాయులను ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి.ఇ.ఒ బలివాడ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఆదర్శ విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దేందుకు కృషి
*అంబేద్కర్ వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవ ముగింపు సభలో కలెక్టర్ సౌరభ్‌గౌర్
ఎచ్చెర్ల, జూన్ 27: జిల్లాకు విద్యాఫలాలు అందిస్తున్న అంబేద్కర్ యూనివర్శిటీని మోడల్‌గా తీర్చిదిద్ది జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించేలా కృషిచేస్తానని కలెక్టర్ సౌరభ్‌గౌర్ పేర్కొన్నారు. ఐదేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా యూనివర్శిటీలో నిర్వహిస్తున్న వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమం గురువారం ముగిసింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పరిపాలనా దక్షత ఉన్న వైస్ ఛాన్సలర్ లజపతిరాయ్ వర్శిటీకి రావడం జిల్లా ప్రజల అదృష్టమన్నారు. సమర్ధవంతమైన సేవలందించేలా అనేక ప్రణాళికలతో ముందుకు సాగుతున్న వర్శిటీకి పూర్తి సహాయ సహకారాలందిస్తామన్నారు. విశ్వవిద్యాలయం డిగ్రీలిచ్చే కేంద్రంగా ఉండకూడదని, పరిశోధనలతో సమాజాభివృద్ధి ముందుకు సాగాలన్నారు. జిల్లాలో ఇప్పటికే పూరె్తైన ఆర్థిక గణన, జనగణనతోపాటు సామాజిక స్థితిగతులపై సేకరించిన వివరాల ఆధారంగా వర్శిటీ గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించినట్లయితే ప్రభుత్వ పథకాలు సమర్ధవంతంగా అర్హులకు దక్కుతాయన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విసి లజపతిరాయ్ మాట్లాడుతూ 20 సూత్రాలు పథకానికి ఇక్కడ విభాగాలను అనుసంధానం చేసి జిల్లా అభివృద్ధికి మరింత కృషిచేస్తామన్నారు. ఎమ్మెల్యే కృష్ణదాస్ మాట్లాడుతూ సమాజంలో రుగ్మతలను పారద్రోలేందుకు త్రికరణ శుద్ధితో వర్శిటీ అధ్యాపకులు, విద్యార్థులను భాగస్వాములను చేస్తూ కృషిచేయాలన్నారు. ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్ మాజీ పార్లమెంటు సభ్యులు కణితి విశ్వనాధం మాట్లాడుతూ డిగ్రీలతో సరిపెట్టుకోకుండా ఉన్నత ఉద్యోగాలు పొందిననాడే వర్శిటీకి మంచి భవిష్యత్ ఉంటుందని స్పష్టంచేసారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియ, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు హనుమంతు కిరణ్‌కుమార్, రిజిస్ట్రార్ వి.కృష్ణమోహన్, ప్రిన్సిపాల్ ఎం.చంద్రయ్య, సిడిసి డీన్ జి.తులసీరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతీ రమేష్ ఆలపించిన సినీగేయాలు పలువురిని ఆకట్టుకున్నాయి. అంబేద్కర్ ఖ్యాతిని ఇనుమడింపజేసేలా దుక్కు గురునాయుడు ఆలపించిన గేయం అలరించింది.
గోల్డ్‌మెడల్‌కు విరాళాలు
వర్సిటీలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు గోల్డ్‌మెడల్ అందించేందుకు కావాల్సిన మొత్తాన్ని విరాళాల రూపంలో సేకరించేందుకు వీసీ శ్రీకారం చుట్టారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కృష్ణదాస్ తన సోదరుడు వాసు పేరిట లక్ష రూపాయలు ప్రకటించారు. అలాగే డిసిఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్‌లు చెరో లక్ష రూపాయలు అందిస్తామని వెల్లడించారు. ఇదిలా ఉండగా వర్శిటీ అభివృద్ధికి విజయనగరం ఎంపి బొత్స ఝాన్సీలక్ష్మీ, ఎమ్మెల్యేలు మీసాల నీలకంఠంనాయుడు, కొర్ల భారతిలు ఐదు లక్షల రూపాయలు వంతున విరాళాలు అందిస్తామని ప్రకటించారు. అలాగే దివంగత కేంద్ర మాజీమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు తనయుడు రామ్మోహన్‌నాయుడు గోల్డ్‌మెడల్ కోసం ఇప్పటికే లక్ష రూపాయలు మొత్తాన్ని వీసీకి అందించేందుకు ముందుకు వచ్చిన తెలిసిందే.
వస్తామనుకోలేదు
సైన్యం ఆదుకుంది
స్వస్థలాలకు చేరుకున్న చార్‌ధామ్ యాత్రికులు
ఇంకా చేరాల్సింది 47మంది
కవిటి/ఇచ్ఛాపురం/పాతశ్రీకాకుళం, జూన్ 27: ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్రకు వెళ్లి వరదలకు చిక్కుకున్న యాత్రికులు బుధవారం అర్థరాత్రి క్షేమంగా తమ స్వస్థలాలకు చేరుకున్నారు. సుమారు వారం రోజుల పాటు బిక్కు బిక్కు మంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించామని, తిరిగి స్వస్థలాలకు వస్తామనుకోలేదని వివరించారు. కాగా, తమ వారి వివరాలు తెలియక క్షణమొక యుగంలా గడిపిన వారి కుటుంబసభ్యులు వారి రాకతో ఊపిరిపీల్చుకున్నారు. గత నెల 29న కవిటి కొత్తూరుకు చెందిన దవలపు అప్పారావుతో పాటు నలుగురు కుటుంబసభ్యులు, కవిటికి చెందిన ఢిల్లేశ్వరమ్మ, రాజులమ్మ,శివశంకర్, జాడుపుడికి చెందిన మరో ముగ్గురు చార్‌ధామ్‌కు యాత్రకు వెళ్లారు. ఈ నెల 18 వరదల్లో చిక్కుకున్న వీరు అనంతరం ఆర్మీ శిబిరంలో తలదాచుకున్నారు. ఆర్మీ, టిడిపి సహాయంలో బుధవారం అర్ధరాత్రి వారంతా క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ వరద ప్రాంతానికి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వచ్చి తమపై చూపిన అభిమానాన్ని మరువలేమన్నారు. ప్రభుత్వ, ప్రతిపక్షాలకు చెందిన నేతలు తమ ముందే కొట్లాటకు దిగడంతో కాస్తా భయపడ్డామని, కానీ తమ గ్రామ దేవత చింతామణి తల్లి ఆశీస్సులతో ఇళ్లకు చేరుకున్నామని తెలిపారు. బాధితులను పలు పార్టీలకు చెందిన నేతలు పరామర్శించారు.
అవస్థలు పడి ఇంటికి చేరిన కేదారినాద్ యాత్రికులు
ఇచ్ఛాపురం పట్టణం, మండలానికి చెందిన 11 మంది కేదారినాథ యాత్రికులు అష్టకష్టాలు పడి గురువారం తమ ఇళ్లకు చేరారు. తీవ్రమైన వరదలు కారణంగా తీవ్ర అవస్థలు పడ్డామని స్వగ్రామానికి చేరుకున్న్ల యాత్రికులు ముకుందరావు, వి.సావిత్రి, దేశమ్మ, శేషమ్మ, వరలక్ష్మి, డి.లీలమ్మ, డి.ఉమా, బొడ్డకాళికి చెందిన సాయి కనకమ్మ, రత్నాలు తెలిపారు. కేదారినాద్ నుండి తిరిగి వస్తుండగా వరద తీవ్రత పెరిగిందని, దీంతో అక్కడ లాడ్జిలో వారం రోజుల పాటు తలదాచుకున్నామని వారు వివరించారు. మిలట్రీ, టిడిపి నాయకుల సహకారంతో హెలికాప్టర్, బస్సులు, విమానాల ద్వారా విశాఖపట్నానికి చేరి, అక్కడ నుండి స్వగ్రామానికి చేరుకున్నట్లు చెప్పారు.
చేరాల్సింది 47 మంది యాత్రికులు
చార్‌ధామ్ యాత్రకు వెళ్లిన సిక్కోలు వాసులు ఇంకా 47 మంది చేరాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు అందిన వివరాల మేరకు పలాస, లావేరు, పోలాకి, సంతబొమ్మాళి, టెక్కలి, కోటబొమ్మాళి, నరసన్నపేటలకు చెందిన 28 మంది రెడ్డిట్రావెల్స్‌లో మరో నాలుగురోజుల్లో జిల్లాకు చేరుకోనున్నారు. వీరు ప్రస్తుతం కాశీలో ఇతర పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. అలాగే పాలకొండ, నరసన్నపేట, శ్రీకాకుళాలకు చెందిన 17 మంది డొమెస్టిక్ ట్రావెల్స్‌లో ప్రస్తుతం ఒడిశాకు చేరుకున్నారు. వీరు శనివారానికి సిక్కోలుకు చేరుకుంటారు. ఇదిలా ఉండగా విజయలక్ష్మీ ట్రావెల్స్‌లో బయలుదేరిన శ్రీకాకుళం పట్టణానికి చెదిన ఇద్దరు చార్‌ధామ్ యాత్రను ముగించుకుని ప్రస్తుతం గుజరాత్‌లో ఉన్నట్లు సమాచారం. వీరు జూలై ఐదవ తేదీన జిల్లాకు చేరుకోనున్నట్లు తెలిసింది.
‘గజ’ వణుకు
ఏజెన్సీలో తిష్ట వేసిన ఏనుగులు
ధ్వంసమవుతున్న పంటలు, తోటలు
ఖరీఫ్‌పై గిరిజనులు వెనుకడుగు
ఆర్థికంగా నష్టపోయామంటూ గిరిపుత్రులు ఆవేదన
సీతంపేట,జూన్ 27:ఒడిశా రాష్ట్రం నుండి విజయనగరం జిల్లా మీదుగా సీతంపేట ఏజెన్సీలో ప్రవేశించిన గజరాజులు గిరిజనుల బతుకులపై కోలుకొలేని దెబ్బతీస్తున్నాయి. ఏనుగులు ఈ ప్రాంతానికి వచ్చి సుమారుగా ఐదేళ్లు గడుస్తున్నప్పటికి సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపడంలో విఫలం చెందిందనే చెప్పాలి. ఏనుగులను తరలించడంలో ప్రభుత్వం విఫలంకావడంతో ఆ ప్రభావం గిరిజనుల జీవనంపై పడింది. కాయ, కష్టం, కొండపోడు వ్యవసాయం చేస్తే కాని బతుకు సాగని పరిస్థితిలో ఉండే గిరిపుత్రులకు ఏనుగులు సవాల్‌గా నిలిచాయి. చెమటోడ్చి పండించే పంటలను గజరాజులు ధ్వంసంచేస్తున్నాయి. వాణిజ్య పంటలైన జీడి, మామిడి, అరటి, పనస తోటలను కూడా సర్వనాశనం చేసి గిరిజనులను కోలుకోలేని స్థితిలోకి నెట్టుతున్నాయి. గత ఐదేళ్లుగా ఇదే పరిస్థితి పునరావృతం కావడంతో గిరిజనులు నిస్సాహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
గడచిన రెండు నెలలుగా పులిపుట్టి, హడ్డుబంగి పంచాయతీల పరిధి ముకుందాపురం, కె గుమ్మడ, ఆనపకాయలగూడ, ఇప్పగూడ, వెంపలగూడ, పులిపుట్టి గ్రామాల సమీపంలో సంచరిస్తున్న ఏనుగులు పంటల పై దాడి చేసి గిరిజనులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. పంటలకు నష్టపరిహారం చెల్లించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నప్పటికీ వారి మొర అరణ్య రోదనగానే మిగిలింది. అంతే కాకుండా తరచూ తమ గ్రామాల సమీపంలో సంచరిస్తున్న ఏనుగుల నుండి తమకు రక్షణ కల్పించేందుకు సోలార్‌లైట్లు ఏర్పాటు చేయాలని పదే పదే కోరితే ఎట్టకేలకు సోలార్‌లైట్లను పంపిణి చేసారని పులిపుట్టి పంచాయతీ మాజీ సర్పంచ్ సవరతోట మొఖలింగం తెలిపారు.
ఖరీఫ్‌పై గజరాజుల ప్రభావం
ఏజెన్సీలో గిరిజనులు పండించే పంటల్లో ప్రధానమైనది పంట వరి. ఈ ఖరీఫ్ సీజన్‌లో దుక్కులు దున్ని,నాట్లు వేసే పరిస్థితి ఉంది. అయితే ఏనుగుల భయంతో గిరిజనులు ఈ ఏడాది వరినాట్లు వేసేందుకు భయపడుతున్నారు.అప్పులు చేసి వరి పంట పండించినప్పటికీ ఏనుగులు పంటను ఎక్కడ నాశనం చేస్తాయోనని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.గతంలో ఏనుగులు కొండ ఎగువభాగాన సంచరించేవని అయితే గడచిన మూడు నెలలుగా సీతంపేట ఏజెన్సీలో స్వైరవిహారం చేస్తు పంటలను నాశనం చేస్తున్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెందుతున్నారు.ఏనుగుల సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపి తమ మనుగడను కాపాడాలని గిరిజనులు కోరుతున్నారు.
ఏనుగుల సంచారానికి అనుకూల ప్రదేశం
విశాలమైన అటవీప్రాంతం, తినేందుకు నచ్చిన పంటలు, తాగేందుకు ఊటజలాలు, గెడ్డలు కారణంగా ఈ ప్రాంతంలో గజరాజులు తిష్టవేశాయి. వీటికి తోడు భీకరమైన పొదలు, కొండ ప్రాంతం గజరాజుల సంచారానికి అనుకూలంగా ఈ ప్రాంతం మారింది.
ఏనుగుల కారిడార్‌కు ప్రతిపాదన
సీతంపేట, పాలకొండ, వీరఘట్టం మండలాల్లో సంచరిస్తున్న ఏనుగులను ఈ ప్రాంతంలోనే ఉంచి, ఏనుగుల కారిడార్ ఏర్పాటుకు సంబంధించి అటవీశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.అయితే దీని పై గిరిజనుల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ ప్రతిపాదనను తాత్కాలికంగా విరమించుకున్నారు.అయితే ఏనుగులను ఈ ప్రాంతం నుండి తరలించకపోతే గిరిజనుల జీవనం రానున్న రోజుల్లో ప్రశ్నార్ధకంగా మారే అవకాశం ఉంది.
చార్‌ధామ్ యాత్రికులను ఆదుకోవడమే ధ్యేయం
* టిడిపి నేత రామ్మోహన్‌నాయుడు
నరసన్నపేట, జూన్ 27: ఉత్తరాఖండ్‌లో విపత్తుకు సంబంధించి రాష్ట్రానికి చెందిన యాత్రికులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి కింజరాపు రామ్మోహన్‌నాయుడు డిమాండ్ చేశారు. ఉత్తరాఖండ్ నుండి తిరుగుముఖం పట్టిన మండలంలో కరగాం గ్రామ వాసులను ఆయన గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేలాది మంది ఆంధ్రావాసులు ఉత్తరాఖాండ్‌లో పలు ప్రాంతాల్లోనేటివరకు చిక్కుకుని ఉన్నారన్నారు. సంఘటన జరిగిన పదిరోజులైనా ప్రభుత్వం మాత్రం పూర్తిస్థాయిలో ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు. తమ పార్టీ తరపున సేవ చేసేందుకు యాత్రికులను ఆదుకునేందుకు ప్రయత్నం చేస్తుంటే కొంతమంది కాంగ్రెస్ నాయకులు వాటిని అడ్డుకుని వారి నీచ సంస్కృతిని చాటుకున్నారని ఎద్దేవా చేశారు. ఏదిఏమైనా చంద్రబాబు ఆధ్వర్యంలో యాత్రికులను రక్షించేందుకు తమవంతు కృషిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బగ్గు రమణమూర్తి, బలగ నాగేశ్వరరావు, చింతు పాపారావు తదితరులు పాల్గొన్నారు.
యాత్రికులను ఆదుకోవాలి
శ్రీకాకుళం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చార్‌ధామ్ యాత్రికులను ఆదుకోవాలని భారతస్వాభిమాన్ ట్రస్టు అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతీ ప్రభుత్వాన్ని కోరారు. ఎన్‌జిఒ హోమ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రా యాత్రికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. వరదలలో చిక్కుకున్న కొంతమంది తెలుగువారు జాడ కానరాలేదని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించి సహాయక చర్యలు చేపట్టినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ఎ.పి.్భవన్‌లో బుధవారం జరిగిన సంఘటనలో రాష్ట్ర గౌరవాన్ని కాంగ్రెస్ నాయకులు మంటగలిపారన్నారు. ప్రజల కోసం ఏ పార్టీ సాయం చేస్తే వారిని స్వాగతించాలే తప్ప విమర్శలు మానుకోవాలన్నారు. కాంగ్రెస్ నేతలు బేస్ క్యాంపులకు ఎవరైనా వెళ్లారా అని ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎన్ని ధనుంజయ్‌రావు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శవ్వాన ఉమామహేశ్వరిలు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యాత్రికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ తరపున వైద్య బృందాలు ఏర్పాటు చేశామని, సొంత ప్రయోజనాలకు పాటుపడలేదన్నారు. కాంగ్రెస్ చర్యలను తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ సమావేశంలో సూరి చంద్రశేఖర్, శిమ్మ వెంకట్రావు, అప్పలరాజు తదితరులు ఉన్నారు.
స్థూల ఆదాయంపై క్షేత్ర పరిశీలన
* ఆరవ ఆర్థిక గణన పూర్తి
* జిల్లా గణాంక శాఖాధికారి లక్ష్మణరావు
నరసన్నపేట, జూన్ 27: జిల్లాలో రాష్ట్ర స్థూల ఆదాయం కోసం క్షేత్ర పరిశీలనను చేపడుతున్నామని జిల్లా గణాంక శాఖాధికారి లక్ష్మణరావు తెలిపారు. గురువారం తహశీల్దార్ కార్యాలయానికి విచ్చేసిన ఆయన విలేఖరులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతీ ఒక్క ఆదాయ వనరుల నుండి స్థూల ఆదాయం ఏ మేరకు ఉంటుందోనన్న దానిపై పరిశీలన చేస్తున్నామన్నారు. దీనికి సంబంధించి కోఆపరేటివ్, కంపెనీల చట్టం, కార్మిక చట్టం, చిన్నతరహా పరిశ్రమలకు సంబంధించి జిల్లాలో వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. వీటి వివరాలు వచ్చిన తరువాత కేంద్రానికి నివేదిక పంపిస్తామన్నారు. అలాగే ఆరవ ఆర్థిక గణనకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలన పూరె్తైందని, దీనిపై కోడింగ్, పరిశీలన చేయాల్సి ఉందని వెల్లడించారు. ఈ ఏడాది అనుకున్న మేరకు అధిక వర్షపాతం నమోదవుతుందని 19 శాతం మేర అధికంగా ఈనెలలో వర్షాలు పడ్డాయని తెలిపారు. 23 మండలాల్లో అధిక వర్షపాతం నమోదు కాగా 12 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైందన్నారు. జిల్లాలో సహాయ గణాంకాధికారుల పోస్టులు 20 ఖాళీగా ఉన్నాయని, ప్రస్తుతం 13 మంది విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఈయన వెంట డిప్టూటీ ఎస్.ఒ వెంకటరమణ, తహశీల్దార్ ఎం.వి.రమణ, ఎ.ఎస్.ఒ రమణమూర్తిలు పాల్గొన్నారు.
పిజి సెమిస్టర్ ఫలితాలు విడుదల
ఎచ్చెర్ల, జూన్ 27: పి.జి. మొదట సెమిస్టర్ ఫలితాలను అంబేద్కర్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ హనుమంతు లజపతిరాయ్ గురువారం విడుదల చేశారు. ఆయన ఛాంబర్‌లో ఎం.బి.ఏ, ఎం.సి.ఏ, ఎల్.ఎల్.బి, కోర్సులకు సంబంధించిన సెమిస్టరీ ఫలితాల సీడీని విడుదల చేసారు. ఎం.బి.ఏ కోర్సుకు సంబంధించి 54 మంది పరీక్షకు హాజరు కాగా 44 మంది ఉత్తీర్ణులై 84.48 శాతం సాధించారు. ఎం.సి.ఏ కోర్సుకు తొమ్మిది మంది హాజరు కాగా ఏడుగురు పాసై 78.78 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఎల్.ఎల్.బి మూడవ సంవత్సరం పరీక్షలో 43 మంది హాజరు కాగా 23 మంది ఉత్తీర్ణులై 58.14 శాతం సాధించారు. ఎల్.ఎల్.బి ఐదవ సంవత్సరం ఏడుగురు పరీక్షకు హాజరు కాగా ఒక్కరే పాసై 14.29 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ వి.కృష్ణమోహన్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ చిరంజీవులు ఉన్నారు.
రిమ్స్‌లో మొక్కలు నాటే కార్యక్రమం
* ప్రారంభించిన మాజీ మంత్రి ధర్మాన
శ్రీకాకుళం, జూన్ 27: మొక్కలు పెంచడం ద్వారా పర్యావరణాన్ని కాపాడినవారమవుతామని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. గురువారం ఇక్కడి రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (రిమ్స్)లో జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్‌తో కలిసి మొక్కలునాటే కార్యక్రంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలో, వివిధ సంస్థల్లో మొక్కలు ఉంటే జీవం ఉట్టుపడుతూ సుందరంగా అగుపిస్తుందన్నారు. రిమ్స్‌లో 15 వందల మొక్కలు నాటే కార్యక్రమానికి కలెక్టర్, రిమ్స్ డైరెక్టర్ చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. మొక్కలు నాటే కార్యక్రమంలో రిమ్స్ అందరికీ ఆదర్శప్రాయం కావాలని ఆకాంక్షించారు. అలాగే వైద్య కళాశాలకు అనుబంధంగా నర్శింగ్ కళాశాల మంజూరైనందున, త్వరలోనే నర్శింగ్ కళాశాల ఏర్పాటు కానుందన్నారు. . రిమ్స్‌లో నాటిన మొక్కలను విద్యార్ధులు పరిరక్షించుకోవాలని, తద్వారా పచ్చదనాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. మొక్కలకు అవసరమైన సుమారు 73 ట్రీ గార్డులను ట్రైమాక్స్ సంస్థ రిమ్స్‌కు అందజేసింది. కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ టి.జయరాజ్, సూపరింటెండెంటు ఆర్.అరవింద్, డాక్టర్ సంపత్‌కుమార్, డాక్టర్ తిరుపతిరావు, ఏఆర్‌ఎంవో అప్పలనాయుడు, డిసిసి అధ్యక్షుడు నర్తు నరేంద్రయాదవ్, పురపాలక సంఘం మాజీ చైర్మెన్ ఎం.వి.పద్మావతి, చల్లా అలివేలుమంగ, తదితరులు పాల్గొన్నారు.
ఆడపిల్ల పుడితే భయపడనవసరం లేదు
మంత్రి కోండ్రు మురళీమోహన్
వంగర, జూన్ 27: మండలంలో కొత్తపేట, శ్రీహరిపురం, బాగెంపేట, నీలాయిపేట, పట్టువర్థనం, మడ్డువలస, శివ్వాం, వంగర, వాణి ,మగ్గూరు, సంగాం గ్రామాల్లో మంత్రి కోండ్రు మురళీమోహన్ గురువారం పర్యటించారు. దేవకి వాడ పంచాయతీలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం బంగారుతల్లి పథకం ఆడపిల్లలకోసం ప్రవేశపెట్టిందని, ఇకపై ఆడపిల్ల పుట్టినా భయపడాల్సిన పనిలేదన్నారు. అమ్మాయి పుట్టిన వెంటనే 3500రూపాయలు, ఇంటర్ వరకు చదివితే 50వేలు, డిగ్రీ వరకు చదివితే ఒక లక్ష రూపాయలు ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. దేవకివాడ గ్రామస్థులు ఇళ్ళ స్థలాలు, కింజంగినుండి దేవకి వాడ , బాగెంపేట నుండి కొత్తపేట వరకు రహదారి సౌకర్యం కల్పించాలని, ప్రాజెక్టులో నీటి మట్టం 64మీటర్ల లెవల్ ఉండే విధంగా చూడాలని మంత్రిని స్థానికులు కోరారు. మూడు గ్రామాలకు నూతనంగా సిసి రహదారులు, డ్రైనేజిలు నిర్మించి మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే మడ్డువలస, బాగెంపేట గ్రామాల్లో సిసి రహదారులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీ ఒ బి.దయానిధి, బొత్స వాసునాయుడు, బొక్కేల సత్యంనాయుడు, కర్రి గోవిందరావు, డిసిసిబి వైస్ చైర్మన్ ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.
* మరో 14 మోడల్ స్కూళ్ల ఏర్పాటు * జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్
english title:
savrab gaur
Date:
Friday, June 28, 2013