ఏలూరు, జూలై 2: కొల్లేరు సమస్యను పరిష్కరిస్తే పార్టీలకు అతీతంగా కొల్లేరు ప్రజలంతా కేంద్ర మంత్రి కావూరి వెంటే ఉంటారని కృష్ణా జిల్లా కైకలూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జయమంగళ రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించి, తొలిసారి ఏలూరు వచ్చిన కావూరికి పశ్చిమగోదావరి జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం అభినందన సభ జరిగింది. ఈసభకు చివర్లో వచ్చిన టిడిపి ఎమ్మెల్యే జయమంగళ రామారావు తనకు మాట్లాడే అవకాశమివ్వాలని కోరారు. కొల్లేరు సమస్యను పరిష్కరిస్తే తానూ కెసిఆర్ తరహాలోనే వ్యవహరిస్తానని, ఇకపై కావూరి వెంటే ఉంటానని చెప్పారు. తెలంగాణా ఇస్తే టిఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో కలిపేస్తానని కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ అదే తరహాలో కొల్లేరు సమస్యను పరిష్కరించి, ప్రతి ఒక్కరికి అర ఎకరం చొప్పున భూమిని ఇచ్చి మిగిలిన సమస్యలను పరిష్కరిస్తే ఇక మీ వెంటే ఉంటామని చెప్పారు. ఈ సమస్య పరిష్కారమైతే కొల్లేరు ప్రజలతోపాటు తాను కూడా మీ వెంటే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. ఇంతకుముందు కూడా గత ఏడాది జరిగిన ఒక కార్యక్రమంలో కూడా వెంకటరమణ ఇదే తరహాలో వ్యాఖ్యలు చేయటం సంచలనానికి కారణమైంది. కొల్లేరు విషయంలో భరోసాగా నిలిస్తే పార్టీలను పక్కనపెట్టి మీ వెంటే ఉంటానని అప్పుడు కూడా ఆయన ప్రకటించారు. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో వ్యాఖ్యలు చేయటం కాంగ్రెస్, టిడిపిల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ప్రమాణస్వీకారాలు చేసే సమయంలో ప్రతిపక్ష నేతలు కూడా హాజరవుతారని అదేతరహాలో తాను ఈ కార్యక్రమానికి హాజరయ్యానని చెప్పారు.
ర్యాలీలో అపశ్రుతి: ఒకరి మృతి
విజయవాడ, జూలై 2: మూడు దశాబ్దాలపైగా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో తొలిసారి కేంద్రమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి హంగు ఆర్భాటంతో మంగళవారం భారీ ర్యాలీతో కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం నుంచి ఏలూరుకు బయలుదేరిన కేంద్ర జౌళిశాఖ మంత్రి కావూరి సాంబశివరావు ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. బాణసంచాతో కూడిన టాటా ఏస్ ట్రక్‌లో సంభవించిన పేలుళ్లలో ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భీతావహులయ్యారు. అయితే అప్పటికే విఐపి కాన్వాయ్ ముందుకు సాగింది. టపాస్‌లు కాల్చటానికి ఆ ట్రక్‌లో ఉన్న విజయవాడ కృష్ణలంకకు చెందిన బోడా సత్యనారాయణ ఎలియాస్ సత్తి (25), సూదల ఎర్రన్న ఎలియాస్ సూరిబాబు (30) మంటల్లో చిక్కొని రోడ్డుపైకి దూకేసారు. సత్యనారాయణకు తలకు బలమైన గాయం తగిలి అక్కడికక్కడే మరణించగా ఎర్రన్నతోపాటు వ్యాన్ డ్రైవర్ వడ్లమూడి పుల్లయ్య (60)కు తీవ్ర గాయాలు కాగా వెంటనే సమీప పిన్నమనేని సిద్ధార్థ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కావూరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటున్నారని తెలిసి ఏలూరు నుంచి నాయకులు, కార్యకర్తలు 40 వాహనాల్లో తరలివచ్చి ర్యాలీగా బయలుదేరారు. బాణసంచా కాలుస్తూ పెద్దపెట్టున నినాదాలతో సాగారు.
కిడ్నాపైన బాలుడు దారుణ హత్య
పెద్దారవీడు, జూలై 2: ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ పెద్దారవీడు మండలంలోని బోడిరెడ్డిపల్లిలో ఆదివారం అర్ధరాత్రి కిడ్నాప్‌కు గురైన చిట్టె హర్షత్‌రెడ్డి (3)ని కిడ్నాపర్లు దారుణంగా హత్యచేసి గ్రామసమీపంలోని శివాలయం వద్ద చిల్లచెట్లలో వదిలివెళ్లారు. సోమవారం ఉదయం కిడ్నాప్ విషయం తెలుసుకున్న మార్కాపురం డివైఎస్పీ జి రామాంజనేయులు హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి కిడ్నాపర్ల కోసం వేట ప్రారంభించారు. కిడ్నాపర్ల డిమాండ్ తెలియజేస్తూ ఇచ్చిన 9951171780 సెల్‌నెంబర్ ఆధారంగా పోలీసులు అప్రమత్తమై దర్యాప్తు వేగవంతం చేశారు. కిడ్నాపర్లు నాగారామ్, శ్రీనివాస్ ను గుంటూరుజిల్లా సిరిగిరిపాడు, వెల్దుర్తి అని గుర్తించిన అక్కడి పోలీసుల సహాయంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా మృదేహాన్ని పడవేసిన స్థలాన్ని మంగళవారం ఉదయం చూపించారు. పోలీసులు మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. ఇదిలావుండగా చిన్నారి బాలుడు కిడ్నాపర్ల చేతిలో హత్యకు గురైన విషయాన్ని తెలుసుకున్న మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పాలపర్తి డేవిడ్ రాజు, జంకే వెంకటరెడ్డి సంఘటనా స్థలానికి వచ్చి కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాలుడు హత్యకు పరిహారం ఇప్పించాలంటూ వారితో కలిసి రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో కలెక్టర్ వచ్చి సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు.
రోడ్డు ప్రమాదంలో
నలుగురు దుర్మరణం
చౌటుప్పల్, జూలై 2: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం శివారులో 65వ నెంబర్ జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. నార్కట్‌పల్లి శివారులోని కామినేని మెడికల్ కళాశాలలో పూజాగుప్తాను చేర్పించేందుకు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నుంచి వెళ్తున్న ఎపి 28బియు 7582 అనే నంబర్ గల మారుతి ఇకో కారులో కొయ్యలగూడెం శివారులో జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న ఎపి 37వి 8669 నెంబర్ లారీని అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కూకట్‌పల్లికి చెందిన పూజాగుప్తా (18) ఆమె తమ్ముడు కరక్‌గుప్తా (12), దోమలగూడకు చెందిన ఆమె మేనత్త రీతూగుప్తా (30), ఎర్రగడ్డకు చెందిన కారు డ్రైవర్ పి.శ్రీనివాస్‌రావు (50) అక్కడికక్కడే మృతిచెందారు. పూజాగుప్తా తల్లి సరితాగుప్తా తీవ్రంగా గాయపడింది. ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆగి ఉన్న లారీ వెనకభాగంలోకి చొచ్చుకుపోయింది. కారు పూర్తిగా నుజ్జునుజ్జయంది. క్రేన్ సాయంతో వాహనాన్ని బయటకు లాగారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను స్థానిక పోలీసులు, ప్రజలు బయటకు తీశారు. రోడ్డు ప్రమాదంతో సుమారు గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. చౌటుప్పల్ సిఐ జగన్నాథరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కాంగ్రెస్ విధానాలను స్పష్టం చేస్తే
మద్దతుపై పునరాలోచన: నారాయణ
నర్సీపట్నం, జూలై 2: కాంగ్రెస్ పార్టీ తన విధానాలను స్పష్టం చేస్తే కేంద్రంలో మద్దతుపై పునరాలోచన చేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ పేర్కొన్నారు. మంగళవారం విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మతతత్వ బిజెపికి మద్దతిచ్చే అవకాశం లేకపోవడంతో గతంలో కేంద్రంలో యుపిఎకు మద్దతిచ్చామన్నారు. అణువిద్యుత్ నిర్ణయంతో దేశాన్ని అమ్మేందుకు యుపిఎ ప్రభుత్వం కుట్ర చేయడంతో దూరమయ్యామని స్పష్టం చేసారు. రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని, సిద్ధాంతాలను ప్రకటిస్తే మద్దతిచ్చే విషయాన్ని పునరాలోచన చేస్తామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫ్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపిలతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదన్నారు. ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. టిడిపి, సిపిఎం ముందుకొస్తే కలిసి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని నారాయణ ప్రకటించారు.
కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వం రిలయన్స్ సంస్థకు తొత్తుగా మారిందని నారాయణ ఆరోపించారు. రిలయన్స్ అధిపతిని ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడిగా చేయాలని మన్మోహన్ ప్రభుత్వం ఉవ్విళ్ళూరుతోందని విమర్శించారు. ప్రతిసారీ వంట గ్యాస్ ధరలు పెరగడానికి రిలయన్స్ సంస్థే ప్రధాన కారణమని ఆరోపించారు. రిలయన్స్ చెప్పిన రీతిలోనే కేంద్రం నడుస్తోందన్నారు. యుపిఎ ప్రభుత్వం రిలయన్స్ సంస్థకు అమ్ముడుపోయిందని నారాయణ ధ్వజమెత్తారు.
శ్రీకాకుళం కోర్టుకు
అభయ గోల్డ్ ఎండి
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, జూలై 2: శ్రీకాకుళం జిల్లాలో డిపాజిట్‌దార్లకు ఎక్కువ వడ్డీ ఆశచూపి వారికి చెల్లింపులు చేయకపోవడంతో జిల్లా కేంద్రంలోని మార్కెట్‌రోడ్‌కు చెందిన పిచ్చిక రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అభయగోల్డ్ మేనేజింగ్ డైరెక్టర్ కూకట్ల శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేసి మంగళవారం స్థానిక జుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చారు. రాష్ట్రంలో అభయగోల్డ్ పేరుతో కూకట్ల శ్రీనివాసరావు సుమారు 60 బ్రాంచిలు నెలకొల్పి, ఆయా బ్రాంచిల ద్వారా అధిక వడ్డీ ఆశచూపి డిపాజిట్‌లు కలెక్షన్ చేస్తూ ఉండేవారు. ఇదే విధంగా పట్టణంలోని రాయ్‌కాలనీలో ఒక బ్రాంచిని నెలకొల్పి అనేకమంది నుండి డిపాజిట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే డిపాజిట్ దారులకు గడువుమీరుతున్నా సొమ్ము చెల్లించకపోవడంతో ఇటీవల విజయవాడలో ఇతనిపై కొందరు చీటింగ్ కేసు నమోదుచేయగా, ఆ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న మార్కెట్‌రోడ్డుకు చెందిన పిచ్చిక రాజు మే నెల 26వ తేదీన స్థానిక టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాజు నెలకు 1500 రూపాయలు చొప్పున పది నెలలు కట్టగా, సంవత్సరం పాటు ఇదే విధంగా చెల్లిస్తే ఒక నెల సొమ్ము బోనస్‌గా ఇస్తామని చెప్పినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే అప్పటికే విజయవాడలో అరెస్టయిన అభయగోల్డ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావును ఇక్కడి పోలీసులు మే నెల 28వ తేదీన పిటి వారెంటుతో తీసుకువచ్చి మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చారు. ఇలాఉంటే పి.టి.వారెంట్‌పై టుటౌన్ పోలీసులు తీసుకువచ్చిన అభయగోల్డ్ ఎండి శ్రీనివాసరావుకు ఈ నెల 16వ తేదీవరకు రిమాండ్ విధిస్తూ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ నాగమణి తీర్పునిచ్చారు.
మంత్రి కావూరి అభినందన సభలో టిడిపి ఎమ్మెల్యే సంచలన ప్రకటన