‘అవునంటే కాదనిలే.. కాదంటే అవుననిలే’ అంటూ కళ్లు మూసుకుని కూనిరాగాలు తీస్తున్న మిత్రుణ్ణి చూస్తుంటే నవ్వొచ్చింది. అయినా నా నవ్వును పెదాలు దాటనీకుండా - ‘ఏమిటా పారవశ్యం?’ అంటూ సోఫాలో కూలబడ్డా.
పారవశ్య భంగమైనట్లు, వేళాపాళా లేకుండా వచ్చానన్నట్లు.. వొకింత కళ్లు చిట్లించి.. తన అసహనం బయటపడకుండా కాస్తంత సర్దుకున్నాడు - నేను సన్నిహితుణ్ణి కాబట్టి. మాటామంతీ అయ్యాక-
‘కూనిరాగాలు తీస్తున్నావ్ సరే.. ఇంతకీ కాదు అనగల ధైర్యం నీకుందా? పోనీ నీ పనులనైనా కొన్నింటిని కాదు అనుకుని చేయకుండా ఉండగలవా?’ అన్నా.
‘వాట్ డు యూ మీన్ అన్నట్టు చూపు పారేసి ‘దేన్నయినా తట్టుకోగల కెపాసిటీ ఉంది’ అన్నాడు.. కాస్త గట్టిగానే.
‘తట్టుకోవడం వేరు.. కాదు అనగలగటం వేరు’ అన్నాను.
ఏ విషయాన్నయినా సీరియస్‌గా తీసుకోకపోవడం నా మిత్రుడి అదృష్టం.. అలాగే తనను సైతం తాను కాదనుకోలేడు.. ఇతరులనూ కాదనలేడు. ఇలా ‘కాదు’ అనక తనకు తానే మంచివాడనని కితాబునిచ్చుకుంటుంటాడు.
తను ‘అవును’ అన్నపుడల్లా గంగిరెద్దు తలాడించినట్లు అనిపిస్తుంటుంది. నోటి వెంట మాట వస్తే చాలు.. మాట ఆగితే చాలు.. తలాడించటం అది నేర్చిన విద్య. దానికి ‘టైమ్ సెన్స్’ ‘సౌండ్ సెన్స్’ ఎక్కువ. దానికామాత్రం కామన్‌సెన్స్ ఉన్నందువల్లనే దాని యజమాని బ్రతికి బట్ట కట్టగలుగుతున్నాడు. కాని నా మిత్రుడి సెన్స్ మాత్రం అవునుకే పరిమితం కావటంతో ఎప్పటికప్పుడు ఇరకాటంలో పడుతుంటాడు. ఇబ్బంది పాలవుతుంటాడు. ఇంతకీ ‘కాదు’ అనగల నేర్పరితనం నా చిన్ననాటి స్నేహితుడి విషయంలో ఈ జన్మకు అబ్బుతుందన్న గ్యారంటీ లేదు.. నమ్మకమూ లేదు.
నా మిత్రుడనే కాదు - నూటికి తొంభై మంది ‘కాదు’ అంటే తమ అంతస్తు తరిగిపోతుందనుకుంటారు. ‘నో’ అన్నపుడల్లా తాము నెగెటివ్‌గా ప్రతిబింబితమవుతా మనుకుంటారు. నిజానికి ‘కాదు’ అనటంలో ఉన్న ‘సెల్ఫ్ రెస్పెక్ట్’ వారికి తెలిసి రావటం లేదు. ‘కాదు’ అనగలిగి ఆత్మగౌరవాన్ని దక్కించుకోవటమూ అంత తేలిక కాదు.
మనకు మనంగా ‘కాదు’ అనగలగటం, అనుకోగలగటం సెల్ఫ్ డినయల్‌లా అనిపించే సెల్ఫ్ రెస్పెక్ట్. అంతేకానీ కాదు అనటం ఆత్మహత్యా సదృశం అనుకుంటే ఎలా? దాన్ని న్యూనతగా పరిగణిస్తే ఎలా?
మనకు అనేకానేక ఇష్టాలు. ఈ ఇష్టాలన్నీ ఒక విధంగా కోరికలే. ఇష్టాన్ని కాదనుకుంటే కోరికను త్యజించినట్లే - అని అనుకోకూడదు. అయితే కొన్ని ఇష్టాలను కాదనుకోవటం వల్ల మనం మరింత శక్తివంతుల మవుతాం. అంటే కొన్నిటిని నియంత్రించటం వల్ల, కొన్నిటిని దూరంగా ఉంచటంవల్ల, కొన్నిటిపై ఇష్టాన్ని పెంచుకోక పోవటంవల్ల వాటిని ఆ సమయానికి, సందర్భానికి అనవసరాలుగా గుర్తించినట్లే. వాటిని ముఖ్యమైనవి కాదని ముద్ర వేసినట్లే. అంతేకానీ వాటిని నిషేధించినట్లు కాదు.. పైగా జీవితంలో జాగ్రత్త పడుతున్నట్టు! కాలం విలువ తెలిసి వస్తున్నట్లు!!
ఓ పది పనె్నండేళ్ల వరకు మనది తెలిసీ తెలియని ప్రాయం.. అవసరాలు అనవసరాలు అన్న విచక్షణ ఉండదు. పిల్ల చేష్టలతో మారాం చేసి, సాధించేస్తాం. సక్సెస్‌కు అర్థం తెలీకపోయినా గెలిచినట్లు ఫోజు పెడ్తాం. ఆ తర్వాతి ఏడెనిమిదేళ్లు వ్యామోహాల వెంట పడతాం. మనం నీలం షర్ట్ వేసుకుని మిత్రుడు వైట్‌షర్ట్ వేసుకున్నా ఇంటికొచ్చి వైట్ షర్ట్ కోసం అమ్మానాన్నలపై అలుగుతాం. ఉన్న చుడీదార్‌తో వెళ్తే మిత్రురాలు చీరతో వస్తే త్వరలో మనమూ అటువంటి చీరతో ప్రత్యక్షం కావలసిందే! ఇదంతా అసూయ కాదు కానీ పోటీ తత్వం.. సమఉజ్జీలం అనిపించుకోవాలనే మనస్తత్వం. మనకు నచ్చినట్లు ఉంటూ ఇతరాలపై మోజు పెంచుకోవటం ఎందుకు?
మనకు ఇబ్బడిముబ్బడిగా ఇష్టాలుండవచ్చు. అన్ని ఇష్టాలు వ్యసనాలుగా పరిణమిస్తే నష్టం మనకే! కొన్నింటిని కాదనుకోవటమే సెల్ఫ్ డినయల్. ‘కాదు’ అనటం త్యజించటమే. టీవీకి అతుక్కుపోవటమూ, సెల్‌ఫోన్‌కు అంకితమై పోవటమూ ఈనాడు కామన్ అయిపోయిన వ్యసనాలు. ఈ ఇష్టాల్ని వ్యసనాలు అంటున్నందుకు నాకు కామన్‌సెన్స్ లేదని విమర్శించినా ‘నో’ అనగల ధైర్యం నాకుంది. ఎందుకంటే ఈ రెండింటి వల్లా జీవితంలో ఎంత నష్టపోతున్నామో తెలుసు కాబట్టి.. జీవితం ఎంత వెనకబడుతోందో తెలుసు కాబట్టి.
అసలు ఇంటి తెర దేని కోసం.. అలసి సొలసిన మనసు, దేహం కాస్తంత సేద తీరేందుకు. ఎక్కడ ఉన్నా సెల్‌ఫోన్ అందుబాటులో ఉండేదెందుకోసం.. అవసర సమాచారాన్ని జాగు చేయకుండా అవతలి వ్యక్తికి చేరవేయటానికి. అంతే కానీ మనసులను కలుషితం చేసుకోవటానికి ఇంటి తెర అవసరమా? నాడీ వ్యవస్థను దెబ్బతీసే సెల్‌ఫోన్‌లు అవసరం ఎంత వరకు?
కాలజ్ఞానం లేక జీవితాన్ని ఎలా దొర్లించేస్తున్నామో కాస్త ఆలోచిద్దాం. కనీసం ఇప్పటినుండైనా కొన్నిటిని కాదనుకుందాం. సెల్‌ఫోన్‌ని సైలెంట్ మోడ్‌లోకి పంపిస్తే దానికీ కాస్త కునుకు పడుతుంది. మనకూ నిద్రాభంగం కాదు. స్టడీస్ పరంగా స్టెడీగా ఉండగలుగుతాం. టీవీ ఛానెల్స్ 24 ఇంటు 7 ఆకర్షిస్తున్నప్పటికీ అన్ని ఛానెల్స్ అన్నిటినీ ప్రసారం చేయటం లేదు కదా? కొన్నిటిని ‘నో’ అంటున్నాయి. మనం సైతం కొన్ని ప్రోగ్రామ్స్‌ను నో అనగలిగితే మన ఆలోచనలు వక్రించవు.. దృష్టిమాంద్యం ఏర్పడదు.. అయిన వారిపై అక్కసులు తగ్గుముఖం పడతాయి.
సెల్‌ఫోన్‌ను కాదనుకుని, బుల్లితెరను కాదనుకుని ఇంటర్నెట్ ముందు కూలబడితే టైమ్ పాస్ అవుతుందనుకుంటే జీవితం దానికంతట అదే జరిగిపోతుంటుందే తప్ప మనసైన రీతిన సాగదు. కారణం మనసు స్టక్ అయిపోయింది కాబట్టి. మనసు స్టక్ అయితే మనం సిక్ అయినట్లే!
చివరకు ఫేస్‌బుక్‌కు అడిక్ట్ అయిపోయినా మనం ఎన్నో విధాల మొహం చాటేయవలసి వస్తుంది. ఒకప్పుడు మద్యం ఒక్కటే మనిషిని బానిసను చేసేది. ఇప్పుడు ఆల్కహాల్‌ను మించి కిక్ ఇచ్చే సాధనాలు అనేకాలు. మనం ఇష్టపడుతూ, అవుననుకుంటూ ఆహ్వానం పలుకుతున్న వాటిని సంయమనంతో ‘కాదు’ అనగలిగితే అవి మనసును దాటి హృదయాన తిష్టవేయవు.
మనల్ని మనం కాదనుకోగలగాలి
అమ్మయ్య -- సిసింద్రి కథ
రఘురామపురంలో సకల సంపత్తులు కలుగజేసే యోగి పుంగవుడున్నాడని తెలిసి సంతాన భాగ్యం కోసం పరితపిస్తూ వున్న జానకిరామయ్య భార్యతోసహా పయనమై ఆ ఊరు చేరుకున్నాడు.
యోగధ్యానంలో వున్న స్వామి ఈ లోకంలోకి వచ్చేవరకు అక్కడే కూర్చున్నారు. కొద్దిసేపటి తరువాత కనులు తెరచిన స్వామి ఎదురుగా ఉన్న దంపతులను చూసి విషయమేమిటని అడిగాడు.
‘స్వామీ! మాకు పెళ్లై 20 సంవత్సరాలు గడుస్తున్నా సంతానం కలుగలేదు. పిల్లల కోసం పరితపిస్తున్న మేము తిరగని క్షేత్రం లేదు. మొక్కని దేవుడు లేడు. అలా తిరిగి తిరిగి వేసారిన మాకు మీరు వచ్చారన్న వార్త విని ఆనందం కలిగింది. మాయందు దయ తలచి సంతానం కలిగే మార్గం చూపండి స్వామీ’ అని ఎంతో వినయంతో వేడుకున్నారు జానకిరామయ్య దంపతులు.
వారు చెప్పింది విని మళ్లీ ధ్యానంలోకి వెళ్లి కాసేపు అలాగే ఉండి కనులు తెరచి, ‘అన్ని పుణ్య క్షేత్రాలూ తీర్థాలూ తిరిగాం అంటున్నారు. ఎందరి దేవుళ్లకో మొక్కాం అంటున్నారు. మీ తల్లిదండ్రులను పూజిస్తున్నారా?’ ప్రశ్నించాడు యోగి పుంగవుడు.
‘మా అమ్మానాన్నలు ఎప్పుడో పరమపదించారు స్వామీ!’ నిరుత్సాహంగా చెప్పాడు జానకిరామయ్య. ‘అమ్మానాన్నలు బతికి వున్నారా, చనిపోయారా అని కాదు. బతికుంటే గౌరవించాలి. చనిపోతే పూజించాలి. మాతా పితలంటే ఎవరనుకున్నారు? మనకు కనిపించే దేవుళ్లు. వారిని మరచి దేవుళ్లను పూజించటం వ్యర్థం. తల్లిదండ్రులు బిడ్డలను ఏ విధంగా పెంచుతారో మీకు తెలియదా? బిడ్డలకు కావలసినవన్నీ ఏ విధంగా సమకూర్చుతారో నీవు ఎరుగవా? ఒక కోడి పెట్టను చూడండి. కాళ్లతో మట్టిని తవ్వి తన పిల్లలకు ఏ విధంగా ఆహారాన్ని అందిస్తుందో చూశావా? అలాగే మనకు కావలసిన వాటి కోసం వారు ఎప్పుడూ శ్రమిస్తూనే ఉంటారు. కాబట్టి ఇక నుంచి మీరు వేకువనే లేచి కాలకృత్యాలు తీర్చుకుని ముందుగా తల్లిదండ్రులను మనస్ఫూర్తిగా పూజించి ఆ తరువాత మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఇష్టదైవంతోపాటు మీ తల్లిదండ్రులు కూడా మీ కోరిక సిద్ధించటానికి ఎంతో కృషి చేస్తారు. ఈ ప్రక్రియ మీ సంతతి కూడా అలవర్చుకుంటుంది.’ ఎంతో నిశ్చలంగా పలికాడు స్వామి. యోగి పలుకులకు పరవశించిపోయిన దంపతులు ‘స్వామీ! తీర్థయాత్రలు చేసిన మాకు కనిపించే దేవుళ్లే తల్లిదండ్రులు అన్న సత్యం మాకు తెలియలేదు. సృష్టి రహస్యం చెప్పి మా కళ్లు తెరిపించారు. ఇక నుంచి ప్రతిరోజూ మీరు చెప్పినట్టే నడుచుకుంటాం.’ అంటూన్న జానకిరామయ్య మనసంతా ఉత్సాహంతో నిండిపోయింది.
‘మీరే కాదు -ప్రతి ఒక్కరూ కూడా అమ్మానాన్నలను అవగాహన చేసుకొనే పదమే ‘అమ్మయ్య’. ఈ పదాన్ని ప్రతి ఒక్కరూ కూడా కూర్చున్నా, లేచినా, ఏ పని మొదలుపెట్టినా భగవంతుని కన్నా ముందుగా అమ్మయ్య అనే పదమే మీ నోటి వెంట ఉచ్ఛరించాలి. అప్పుడే జన్మనిచ్చిన తల్లిదండ్రులకు సార్థకత ఏర్పరచిన వారౌతారు.’
‘అర్థమైంది స్వామీ! మేం ఇంతవరకు ఏం కోల్పోయామో ఇప్పుడే తెలుసుకున్నాను స్వామి. నేనే కాదు. ప్రతి ఒక్కరూ కూడా ఈ పదం పలికేటట్లు చేస్తాను. ఈ విధంగా అందరికీ తెలియజేస్తే ఆ పుణ్యానైనా మా కోరిక తీరుతుందని నమ్మకం కలుగుతుంది. ఈ అమ్మయ్య అనే పదాన్ని అమృతంలాగా అందరికీ తారకమంత్రంగా చేరవేస్తాను. నేను మళ్లీ బిడ్డతో మీ దర్శనం చేసుకుంటానని నమ్మకం కలుగుతుంది. అలా జరిగేటట్టు ఆశీర్వదించండి స్వామీ’ అని యోగి దీవెన పొంది ఎంతో తృప్తితో స్వామి నుంచి సెలవు తీసుకున్నారు జానకిరామయ్య దంపతులు. *
పీడనం కలుగజేసే బలం -
చేసి చూద్దాం
కొద్ది నీటితో తడిపిన మైదాపిండిని బాగా పిసికి ముద్దగా చేయాలి. ఈ ముద్దపై ఒక అగ్గిపెట్టెను బల్లపరుపుగా ఉంచాలి. ఒక సీసా నిండుగా ఇసుక తీసుకుని ఆ సీసాను అగ్గిపెట్టెపై ఉంచాలి. ఆ విధంగా కొంత సమయం ఉంచాలి.
ఇప్పుడు ముద్దగా తయారైన మైదాపిండిని మరి కొంత తీసుకోవాలి. ఇప్పుడు దీని మీద అగ్గిపెట్టెను తక్కువ వెడల్పుగల భాగం మీద ఆనుకుని ఉండేట్లు ఉంచాలి. అగ్గిపెట్టె రెండవ భాగంపై మరల ఇసుకతో నింపిన సీసా ఉంచాలి. ఈ అమరికను కూడా కొంత సమయం ఉంచాలి.
ఈ దఫా తడిపిన మైదా పిండి ముద్దపై అగ్గిపెట్టెను నిటారుగా ఉంచాలి. అంటే దాని చిన్న భాగం ముద్దపై అనునట్లు ఉంచాలి. అగ్గిపెట్టె రెండవ వైపున ఉండే చిన్న భాగంపై ఇసుకతో నింపిన సీసాను ఉంచాలి.
ఈ ప్రయోగంలో ఉపయోగించే మూడు సీసాలు ఒకే పరిమాణంలో ఉండాలి. వాటిలో నింపిన ఇసుక సమానంగా ఉండాలి.
పిండి ముద్దపై అగ్గిపెట్టె పీడనం కలుగజేసే బలం వలన ముద్దలోని అగ్గిపెట్టె దిగుతుంది. ఈ ప్రయోగంలో అగ్గిపెట్టె చిన్నభాగం ముద్దపై ఉంచినపుడు అగ్గిపెట్టె ముద్దలో ఎక్కువ లోతుకు దిగినట్లు గమనిస్తారు. దీనికి కారణం ఇసుక సీసా పీడనం కలుగజేసిన బలం మిగిలిన సందర్భాలకన్నా ఈ సందర్భంలో ఎక్కువ.
-సి.వి.సర్వేశ్వరశర్మ
కాపీకేట్ - స్ఫూర్తి
సుఖేష్ తండ్రి తన తొమ్మిదేళ్ల కొడుకులో ఇటీవల వచ్చిన మార్పుని గమనించాడు. భాషలోని మార్పు, ‘ఎనీవేస్’ అనే పదాన్ని కొత్తగా వాడుతున్నాడు. షర్ట్ కాలర్‌ని తన ఫేవరేట్ సినిమా హీరో నటించిన కొత్త సినిమాలోలా పైకి ఎత్తి పెట్టుకుంటున్నాడు. తనకి మినపరొట్టె వద్దని, పీజా కావాలని తల్లిని అడగడం విన్నాడు. కొత్తగా ఓ హిందీ పాటని ఆలపిస్తున్నాడు. తన మిత్రులని ఫోన్‌లో ‘హాయ్ బడీ’ అని పిలవడం కూడా విన్నాడు.
‘మీరు గమనిస్తే సుఖేష్ బొత్తిగా కాపీకేట్ అవుతున్నాడు కదండి’ ఆ రోజు వాడి తల్లి తన భర్తని అడిగింది.
‘అవును. గమనించాను. అది మంచిది కాదు.’
ఆ సాయంత్రం ఆఫీస్ నించి ఇంటికి తిరిగి వచ్చాక సుఖేష్ తండ్రి కొద్దిసేపు యూ ట్యూబ్‌లో ఓ కార్టూన్ సినిమా కోసం వెదికి దాన్ని పట్టుకున్నాడు. తర్వాత సుఖేష్‌ని పిలిచి చెప్పాడు.
‘నీకో చిన్న సినిమా చూపిస్తారా. దీంట్లో ఏదైనా నీతి ఉందేమో చూసి చెప్పు’
సినిమా అనగానే సుఖేష్ ఆసక్తిగా వచ్చాడు. ఇద్దరు కలిసి ‘ఇగుమన్’ అనే ఆ సినిమాని చూశారు. ఇగుమన్ తొండ లాంటి ఓ జంతువు. అది తనకి పరిచయం అయిన ఇతర జంతువుల్లా కనిపించే ప్రయత్నం చేయసాగింది. దాంతో జీబ్రాలా ఒంటికి తెలుపు, నలుపు చారలని పూసుకుంది. ఏనుగులా ఓ రబ్బరు గొట్టాన్ని తొండంలా అమర్చుకుంది. గుర్రానికి ఉన్న జూలుని చూసి, తన మెడ మీద జుట్టు అతికించుకుంది. పక్షిని చూసి ఈకలని అతికించుకుంది. దాని రూపం చూసి సుఖేష్ పగలబడి నవ్వుతూ చెప్పాడు.
‘క్రేజీ! అది బఫూన్‌లా తయారైంది. ఎనీవేస్ సినిమా బావుంది నాన్నా’
ఓ రోజు ఇగుమన్ మిత్రులంతా కాస్ట్యూమ్ పార్టీని ఏర్పాటు చేసి దాన్ని కూడా ఆహ్వానించారు. ఆ పార్టీకి వచ్చిన వాళ్లంతా ఇగుమన్ లాగే ఉండటం చూసి ఇది వెంటనే బాత్‌రూంలోకి వెళ్లి తను తొడుక్కున్న, అలంకారాలన్నీ తీసేసి వచ్చింది. దానికి ఆ పార్టీలో ‘బెస్ట్ డ్రెస్ట్ ఇగుమన్’ బహుమతి లభించింది.
‘దీని నీతి ఏమిటి?’ సుఖేష్‌ని సినిమా అయ్యాక వాడి తండ్రి అడిగాడు.
‘ఇతరుల్ని చూసి క్రేజీ వేషాలు వేయకూడదు’
‘నాకు నువ్వు వేషం తీయక మునుపటి ఇగుమన్‌లాగా కనిపిస్తున్నావు తెలుసా?’ ఆయన నవ్వుతూ చెప్పాడు.
‘్ఛ! నేనేం మెడకి జుట్టు అతికించుకుని, మొహానికి తొండం తగిలించుకోలేదే? ఎందుకలా కనిపిస్తున్నాను?’ సుఖేష్ అడిగాడు.
‘నువ్వు కూడా దానిలాగే ఇతరుల్ని అనుకరించడం గొప్పనుకుంటున్నావు. ‘ఎనీవేస్’ అనే పదాన్ని మీ అక్క స్నేహితురాలి దగ్గర నేర్చావు. సినిమా హీరోని చూసి కాలర్ పైకి ఎగరేసావు. నల్ల బూట్లకి బ్రౌన్ రంగు లేసులని ఓ క్రికెటర్‌ని చూసి అనుకరిస్తూ కట్టుకుంటున్నావు. ఇవన్నీ చూస్తూంటే నాకు నువ్వు అచ్చం ఆ ఇగుమన్‌లానే అనిపిస్తున్నావు?’
‘నిజమా?’
‘ఎవరికైతే తమ మీద ఆత్మవిశ్వాసం ఉండదో వారు ఇతరులని అనుకరిస్తారు. నువ్వు ఇంకొకర్ని అనుకరించడం కాదు. నినే్న ఇతరులు అనుకరిస్తే అది నీ గొప్పతనం అవుతుంది. ఎనీవేస్ నువ్వే ఆలోచించుకో’ ఆయన నవ్వుతూ చెప్పాడు.
ఆ తర్వాత సుఖేష్ ఎన్నడూ కాపీకేట్‌లా ప్రవర్తించలేదు.
-మల్లాది వెంకటకృష్ణమూర్తి
అమ్మాయిలు, స్వీట్లు, పుస్తకాలు, సంగీతం
తినే తిండిని ఆనందంగా అనుభవించాలని, ఆదరా బాదరాగా తినగూడదని మాకు తెలియకుండానే అలవాటయింది. నాన్న బడిపంతులు! స్థితిపరులం కాదనే చెప్పాలి! కానీ తిండి సంగతిలో మాత్రం, ఎప్పుడూ లోటు లేదు. నాన్న వంటకు ఉపక్రమిస్తే, ఇక పండగే. ఒకసారి అమ్మ ఊళ్లో లేనప్పుడు, నూగులు, కొత్తిమీర, పచ్చిమిర్చిలతో నాన్న చేసిన పచ్చడి నాకు ఇవాళటికీ గుర్తుందంటే నమ్మండి. మాకంతా, ‘వంటొచ్చిన మగవాళ్లు’ అని పేరుంది! ఇక్కడ, ఎక్కువ తినడం గురించి కాదు సంగతి. ఇష్టంగా తినడం గురించి.
యూనివర్సిటీ రోజుల్లో ననుకుంటాను. ఎవరో నన్ను, నీకిష్టమయిన విషయాలు ఏమిటి? అని అడిగారు. ‘అమ్మాయిలు, స్వీట్లు, పుస్తకాలు, శాస్ర్తియ సంగీతం’ అన్నాను. ‘నాట్ నెససరిలీ ఇన్ దట్ ఆర్డర్’ అని కూడా అన్నాను. వరుస అదే కానవసరం లేదని భావం! ‘జిహ్వోపస్థ పరిత్యాగీ’ అని మొదలుపెట్టి నాన్న ఒక శ్లోకం చెప్పారు. నా యిష్టాలలో మొదటి రెండింటి మీద ఆసక్తి లేని వాడి బతుకు దండగ అని శ్లోక భావం మాత్రం గుర్తుంది. నేను పెళ్లి చేసుకోను దేశాన్ని ఉద్ధరిస్తాను! అన్నప్పుడు ఈ సంగతి చెప్పినట్లు నా అనుమానం. సందర్భం సరిగా గుర్తు రావడంలేదు.
నాన్న ఒక ట్రాన్సిస్టర్ రేడియో కొని తెచ్చాడు. నేను దాన్ని ‘సన్నవిల్లలాగ’ (చంటిపాపలాగ) చంకనేసుకుని తిరుగుతానని అందరూ అనేవారు. రకరకాల కార్యక్రమాలు వింటూ కాలం గడపడం అలవాటయింది. సిలోన్, వివిధ భారతి స్టేషన్ల నుంచి వచ్చే హిందీ సినిమా పాటలు పిచ్చిగా వినడం అలవాటయింది. తెలుగు పాటలు వారానికి రెండు అరగంటలూ, సాయంత్రం సిలోన్‌లో కొన్నీ వినిపించేవి అంతే. మా ప్రాంతంలో శాస్ర్తియ సంగీతం వినడం నిజానికి ఎవరికీ అలవాటు లేదు. నాన్న మాత్రం గద్వాల సంస్థానంలో బాల్యం, ఆ తరువాత కూడా చదువుకున్నారు. అక్కడ నాటకం, సాహిత్యం, సంగీతం లాంటి రుచులన్నీ ఆయనకు తగిలాయి. అప్పుడప్పుడు పాత పద్ధతిలో ఆయన పాడుతూ ఉండేవారు కూడా! నన్నొకసారి పిలిచి ‘నాన్నా! ఊరికే అస్తమానం ఆ సినిమా పాటలు వింటున్నావు. అప్పుడో ఇప్పుడో సంగీతం (శాస్ర్తియం) విని చూడగూడదా?’ అన్నారు. నిజం చెపుతున్నాను. ఆయన మాత్రం ప్రయత్నంగా సంగీతం విన్నట్లు నాకు గుర్తులేదు.
నాన్న ఈ మాటలన్నది నవంబరు, డిసెంబరు రోజులనుకుంటాను. రేడియో సంగీత్ సమ్మేళన్ అని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కచ్చేరీలు వచ్చేవి. మద్రాసు ‘సంగీతోత్సవం’ కచేరీలను హైదరాబాద్ రేడియో వారు కూడా ‘రిలే’ చేసేవారు. (తమిళంలో అనౌన్స్‌మెంట్లు వస్తాయని మానేశారట!) మొత్తానికి కారుకురుచ్చి అరుణాచలం, టి.ఆర్.మహాలింగం, చెంబై వైద్యనాథ భాగవతార్ వంటి మహామహుల సంగీతం విన్నాను. ‘సంగీతమంటే ఇది గదా!’ అన్న భావం ఒకటి బలంగా నాటుకుపోయింది.
నాకు ఇష్టమని చెప్పుకున్న విషయాల్లో మొదటి రెండింటి మీద, అంత ప్రేమ లేదు! నిజం! పుస్తకం, సంగీతం లేనిదే రోజు గడవదు. ఇది అంతకన్నా నిజం!
* ‘అత్త పత్తెమయితే, ఇల్లల్ల పత్తెమ’ని మాకొక మాట ఉన్నది. ఇక్కడ పత్తెమంటే, పథ్యం. తిండిలో నిబంధన. నాకు ఇష్టమయిన సంగతులు, అందరికీ ఇష్టముండాలని ఎక్కడా లేదు. కానీ, బతుకంటే ఇష్టం లేనివాళ్లు ఉండరు, ఉండగూడదని నా నమ్మకం. అమ్మ, నాన్న నాకు బతుకు నేర్పించినట్లే, బతుకు మీద ప్రేమ నేర్పించి, వారి దారిన వారు వెళ్లిపోయారు. అమ్మా, నాన్నా పెద్దవాళ్లయి, పోవడం సహజం! అయినా, వాళ్లు ఉన్నారనుకునే బతుకుతున్నాను. మన వాళ్లందరూ, అనుక్షణం మన కళ్ల ముందు ఉన్నారు గనుకనా?
* మాత, పిత, గురుదేవులు, హితులు - వీళ్లే దేవుళ్లనుకుంటే ఎంత బాగుంటుంది? అంతా కనిపించే దేవుళ్లు! కనిపిస్తారు, పలకరిస్తారు, కనికరిస్తారు!
* కోతి రాగమ్మ - చింతకాయ తొక్కు
‘కోతి రాగమ్మ చింతకాయ తొక్కు’ అన్న మాట వినగానే మీకేమయినా తోచి ఉండాలి. చాలామందికి తోచదు. కొన్ని మాటలు, జోకులు, కథలు, ఒకో ప్రాంతం, వర్గంలో మాత్రమే ప్రచారంలో ఉంటాయి. రాఘవులు, రాగడవుతాడు.. రాఘవమ్మ రాగమ్మవుతుంది. దంచడం, తొక్కడం, నూరడం సమానార్థకాలు కాకున్నా ఇంచుమించు ఒకే పనిని సూచిస్తాయి. పచ్చడి అని కొందరనే పదార్థాన్ని మేము ‘తొక్కు’ అంటాము. తొక్కింది తొక్కు. చింతకాయలు అందరికీ తెలిసినవే. ఇంత తెలిసినా, శీర్షిక అర్థం మాత్రం తెలియదు.
రాగమ్మ ముందే కోతివంట మనిషి. పనులను తన పద్ధతిలో చేసుకుంటుంది. ఆమె చింతకాయ తొక్కు పెట్టడానికి ఉద్యమించింది. పెట్టడమంటే, నిలువతొక్కు తయారుచేసి కాగు (బాన) నింపడమని భావం. ఎవరికో పెట్టడం కాదు. సరే, చింతకాయలు దంచి, నారలు కొంతవరకు తీసి పడేయాలి. పసుపు, మెంతుల పొడి, జిలకర మొదలయినవి కలపాలి. ఇక పచ్చిమిర్చి, ఉప్పు ముఖ్యంగా చేర్చాలి. అంతా అయింతర్వాత రుచి చూస్తే, కారం ఎక్కువయింది. కనుక కొంత ఉప్పు చేర్చింది. ఈసారి రుచి చూస్తే ఉప్పు మరీ ఎక్కువయింది. కనుక ఈసారి మరిన్ని చింతకాయలు దంచి కలిపింది రాగవ్వ! రుచి చూస్తే ఉప్పు తక్కువయింది. మళ్లీ సర్దుబాటు చర్యలు!
మొత్తానికి ఒక్క కాగు అనుకోని మొదలుపెట్టిన తొక్కు మూడు కాగులయింది.
అదీ కథ! అందుకే, ఎవరన్నా పనులను ఈ పద్ధతిలో సర్దడానికి ప్రయత్నిస్తే కోతి రాగమ్మ చింతకాయ తొక్కు అంటారు మా వాళ్లు!
* జొన్న చేనుకు పోయి, సొగసుకత్తెను చూచి, నిన్న మాపటి నుంచి నిద్ర లేదు. దాన్ని నన్ను గూర్చి దయ చేయి మాధవా! పొన్న పూలతోటి పూజసేతు!
పద్యం హృద్యంగా ఉంది కదూ! ఈ పద్యాన్ని మాకు సంగతేమిటో అర్థంకాని చిన్న వయసులోనే నేర్పించారు. నాట్యం పేరున చిన్నచిన్న పిల్లలు, ‘రాడాయెనే స్వామి’ అనీ, ‘స్వామిరార!’ అనీ గుప్పిగంతులు వేస్తుంటే నాకు ఈ పద్యం గుర్తుకు వస్తుంది.
* బూతుల్లోనూ అందమయినవి కొన్ని, అసహ్యమయినవి కొన్ని ఉంటాయి. సంస్కృత భాషలో ఉన్నంత మాత్రాన మాటలన్నీ ఒక పరిష్కారం గలవి కావు. ‘సుతా సురత సౌందర్యం, జామాతా వేత్తి, నో పితా!’ అని ఒక మాట ఉంది. ‘అమ్మాయి రతి సౌందర్యము, అల్లునికి తెలుస్తుంది, తండ్రికి కాదు!’ అని భావం. నిజమే, కానీ ఎంత చీదరగా ఉంది ఈ మాట! బాగలేదు!
* ఇతి శం! కోతి రాగమ్మ చింతకాయ తొక్కు, ఇక ఆగును!
వధూవర గణ సమ్మేళన పట్టిక
ఈ వధూవర గణ సమ్మేళనం పట్టిక ఒక పెద్ద తప్పుల పట్టిక. గతంలో 1950 వరకు ఎక్కడా పుస్తకాలలో, పంచాంగాలలో దర్శనం ఇవ్వని ఈ పట్టిక ఇప్పుడు పంచాంగాలలో కంప్యూటర్లలో ప్రథమ స్థానాన్ని సంపాదించింది. అయితే ఈ అంశం పూర్తి స్థాయి తప్పులతోనే ఉంది. ప్రాచీన కాలంలో ఎవరో గమనించి ఏర్పరచిన ఈ పట్టికనే ఆధారం చేసుకొని చాలామంది వివాహ సంబంధాలు పాడు చేసుకుంటున్నారు. ‘యద్యదా చరతి శ్రేష్ఠః తత్తదేవేతరోజనః సయత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే’ అని గీతాచార్యుడు బోధించిన రీతిగా ఎవరో శ్రేష్ఠుడు దీనిని గుర్తిస్తే ఇప్పుడు అదే అందరూ ఆచరిస్తూ చివరకు జ్యోతిష గ్రంథములు, సిద్ధాంతుల మాటలు కూడా పక్కన పెట్టేసి ఇది ఒక వజ్రాయుధం వంటిది అనుకొని ముందుకు పోతున్నారు. అయితే మీకు కొన్ని అంశాలు చెప్పాలి. అసలు ఈ పట్టికలోని ఆంతర్యం ఏమిటి అంటే అమ్మాయి నక్షత్రం నుండి అబ్బాయి నక్షత్రం వరకు చూచే ద్వాదశ కూటములలో వర్ణకూటమికి ఒక పాయింటు, వశ్యకూటమికి 2 పాయింట్లు, ధన కూటమి తారాబలానికి 3 పాయింట్లు, యోని కూటమికి 4 పాయింట్లు, గ్రహమైత్రి ఐదు పాయింట్లు గణ కూటమికి 6 పాయింట్లు, రాశి కూటమి ఏడు పాయింట్లు, నాడీ కూటమి విషయంలో ఎనిమిది పాయింట్లు ఇచ్చారు. సరే బాగుంది. రాశి కూటమికి భకూటమి అని పేరు. ద్విద్వాద శేవానవ పంచమేవా షష్ఠాష్టకే రాక్షస కన్యకాయాః - ఏకాధిపత్సే ప్యుభయోస్సుహృత్వే పాణిగ్రహో మంగళ మాతనోతి అని చెప్పబడింది. అనగా ద్విద్వాదశ షష్ఠ్ధాష్టకములు కలిగిన నక్షత్రముల వారికి ఆయా స్ర్తి పురుష రాశ్యాధిపతులకు మైత్రి ఉన్ననూ ఇరువురి రాశ్యాధిపతులూ ఒకరే అయిననూ చాలా శ్రేష్ఠము అని వున్నది. ఇది అగణ సమ్మేళనంలో పరిగణనలోకి తీసుకోలేదు. అలాగే తారాబలం దినం కూటమితో వద్దు అని చెప్పినవి అన్నియు మహేంద్ర కూటమిలో సరియనెను. రెండవ నవకం మూడవ నవకంలోని జన్మతారలు మూడు నవకములలోని నైధన తారలు దిన కూటమి తారాబలంలో వద్దని చెబితే మహేంద్ర కూటమిలో అవి గ్రాహ్యమని చెప్పారు. అందుకే కాలామృతంలో తారాబలం అనేది ప్రాధాన్యత లేని కూటమి అని చెప్పారు. ఇక గ్రహమైత్రి కూటమి ‘ఉభయోస్సప్తమస్తత్రి గ్రహమైత్రం నశోధయేత్’ అని వున్న కారణంగా సమసప్తక రాశుల విషయంలో గ్రహమైత్రి చూడనవసరం లేదు. పాయింట్ల పట్టికలో సింహ కుంభరాశి దంపతులకు గ్రహమైత్రి విషయంగా సున్నా పాయింట్లు తీసుకొని గణన చేశారు. పై సిద్ధాంతం ప్రకారం ఐదుకు ఐదు పాయింట్లు ఇవ్వాలి. చిత్త 1,2 వారికి మృగశిర 1,2 వారికి వివాహం చేయవలసి వచ్చినప్పుడు పంచాంగం పట్టికలో 12 పాయింట్లు ఉంటాయి. కానీ పైన చెప్పుకున్న తారాబలం, రాశి కూటమి దోషాపవాద పాఠం ప్రకారం ఇంకా తొమ్మిది పాయింట్లు కలిపి 21గా చూపాలి. కేవలం దోషాలు మాత్రమే పరిగణనలోకి తీసుకుని దోషాపవాదములు పరిగణనలోకి తీసుకోకుండా ఏర్పరచిన సిద్ధాంతమే ఈ పట్టిక. అందువలన పంచాంగాలలోని ఈ పట్టికను నమ్మవద్దని వినతి. ఇంకా వాడే కూటమి గూర్చి మీరు ముహూర్త దర్పణం, ముహూర్త చింతామణి, కాలామృతం, ముహూర్త సుధ వంటివి పరిశీలిస్తే ఈ పట్టిక దోషభూయిష్టమయినది అని మనకు ప్రత్యక్ష నిదర్శనం అవుతుంది.
జ
సందేహాలు - సమాధానాలు
యజ్ఞనారాయణ (కొత్తగూడెం)
ప్రశ్న: ద్వితీయ పుత్రుడు 15.11.91 ఉ.9.47కు పుట్టాడు. ఇతడికి ఏ విద్యలు వస్తాయి?
జ: మీ అబ్బాయి జాతకంలో కుజ శుక్రుల బలం బాగా వున్నది. అందువలన మీ వాడికి ఇంజనీరింగ్ మరియు లలిత కళలు రెండూ వస్తాయి.
పి.శంకర్ (హైదరాబాద్)
ప్రశ్న: పుట్టిన తేదీ 26.6.88 రాత్రి 12.40. ఊరు తెనాలి. భవిష్యత్తు ఎలా ఉంటుంది?
జ: 2008-09-19 నుండి బుధ దశ. బుధుడు సంచారం అనుకూలమే కానీ మీన లగ్న జాతకులకు పెద్ద రాజయోగం ఇవ్వడు. భక్తి మార్గాల ద్వారా శాంతిని ఇస్తాడు. మంచి అభివృద్ధి క్రమేణా రాగలదు. గోచారంలో శని రాహు సంచారం బాగాలేదు. రోజూ ‘శ్రీరామ శ్శరణం మమ’ అంటూ 11 ప్రదక్షిణలు రోజూ చేయుట వల్ల సమస్యలు తట్టుకోగలుగుతారు.
వి.సుధాకర్ (ఖమ్మం)
ప్రశ్న: 19.1.41 - 1.00 ఎ.ఎం. ఆర్థిక స్థితిలో వృద్ధి చేకూరుతుందా?
జ: తులాలగ్నమునకు చంద్రుడు వ్యయంలో వున్న కారణంగా స్థిరచిత్తం చెడగొడతాడు. అయితే రాబోవు కాలంలో శని ప్రభావం అనుకూలం. రాహు ప్రభావం అనుకూలం లేకపోవుట దృష్ట్యా ఆర్థిక స్థితి బాగుంది మానసిక స్థితి ఇబ్బందికరం అవుతుంది. రోజూ దుర్గాపూజ చేయడం శ్రేయస్కరం. తద్వారా మానసిక శాంతి ఉంటుంది.
=================
కప్పగంతు సుబ్బరామ శర్మ (సుబ్బరామ సోమయాజులు)
కామకోటినగర్, శంకరమఠం వీధి,
నృసింహ కృప బిల్డింగ్, విజయవాడ - 520 012.
ఇంటర్నెట్‌లో తెలుగు వనరులు
జాను తెనుగే మేము.. జాతి ఘనతే మేము - అన్నాడో ప్రముఖ కవి. తెలుగు సంస్కృతీ వికాసానికీ, భాషాభివృద్ధికీ ఇతోధికంగా, సాయపడుతున్న వారిలో అధిక సంఖ్యాకులు విదేశాలలోని ఐటి నిపుణులేనని చెప్పాలి. తెలుగులో దాదాపు 3వేల దాకా బ్లాగులున్నాయి. ఈ మధ్య తెలుగు బ్లాగులన్నిటినీ ఒకేచోట చూడటానికి వీలుగా కూడలి. జల్లెడ, హారం, మాలిక, తెలుగు బ్లాగర్స్ వంటి కొన్ని వెబ్‌సైట్‌లూ, బ్లాగులూ కూడా వెలిసాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడెమీ అటు జర్నలిస్టులకూ, ఇటు భాషాభిమానులకూ మాత్రమే కాకుండా సామాజిక పరిశోధకులకూ, సాహితీ పిపాసులకూ కూడా పనికొచ్చే విధంగా ఒక వెబ్‌సైట్‌ను రూపొందించింది. దీనికి నేషనల్ ఇన్‌ఫర్మేటిక్ సెంటర్, హైదరాబాద్ సాంకేతిక సహాయాన్ని అందించి అందరికీ అందుబాటులోకి తెచ్చింది. ఈ వెబ్‌సైటులో దాదాపు 10 లక్షల పైచిలుకు పేజీల సమాచారంతో 600 గిగాబైట్ల తెలుగు సమాచారం నిక్షిప్తమై ఉంది. ఈ వెబ్‌సైట్‌లో ఆంధ్ర పత్రిక, గోలకొండ పత్రిక, ఆంధ్రప్రభ, కృష్ణా పత్రిక వంటి పాత తెలుగు దినపత్రికల సంచికలూ, పలు ఉర్దూ దినపత్రికల సంచికలూ చోటు చేసుకున్నాయి. భారతి, ఆంధ్ర మహిళ, తెలుగు స్వతంత్ర, చింతామణి, యువ, జ్యోతి వంటి అనేక మాస పత్రికల పాత మాణిక్యాలూ ఉన్నాయి. ఇవేకాక జయంతి, వీణ, ప్రబుద్ధాంధ్ర, విజయవాణి, కినె్నర, చిత్రగుప్త, చందమామ వంటి పత్రికలనూ ఇందులో చదువుకోవచ్చు. కేవలం దిన, మాస పత్రికలే కాదు. దిన, వార, పక్ష, మాస, ద్వైమాస, త్రైమాస పత్రికల సంచికలున్నాయి. ఆంధ్రపత్రిక ఉగాది సంచికలూ ఉన్నాయి. జమీన్ రైతు వంటి పత్రికలూ ఉన్నాయి. మెకంజీ కైపియత్తులు వెదకాలని ఆరాటపడే చరిత్ర పరిశోధకులకు అనేకానేక కైఫియత్తులు ఈ వెబ్‌సైట్‌లో దర్శనమిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని తెలుగు పత్రికలూ ఇందులో చోటు చేసుకోనున్నాయి.
ఆంధ్రభారతి అనే వెబ్‌సైటు తెలుగు భాషాభిమానుల పాలిట మరో పెన్నిధిగా చెప్పాలి. ఇందులో పొందుపరచిన ప్రాచీన సాహిత్యమంతా ఒక ఎత్తు. ఆన్‌లైన్‌లో తెలుగు నిఘంటువులను వాడుకోగల సౌకర్యం మరో ఎత్తు. దీనికి అమెరికా తెలుగు సంస్థ తానా సాయం చేసింది. ఈ నిఘంటువుల్లో ఒక పదం వెదకటం సులభమే. మనకు ఏ పదానికి అర్థం కావాలో ఆ పదాన్ని టైపుచేస్తే, 16 నిఘంటువుల్లో దాని అర్థం వెదికి పట్టిస్తుంది. శబ్దరత్నాకరం, తెలుగు వ్యుత్పత్తికోశం, ఆంధ్ర వాచస్పత్యం, సిపి బ్రౌన్ నిఘంటువు - ఇలా ప్రామాణికమైన 16 నిఘంటువులు నిక్షిప్తమై ఉన్నాయి. ఈ వెబ్‌సైట్‌లో కొన్ని శతకాలూ, త్యాగరాజ కీర్తనలూ కూడా మనకు తగులుతాయి. తెలుగు డాట్ చాగంటి డాట్‌కామ్ అనే సైట్, తెలుగు డిక్షనరీ డాట్ తెలుగు పీడియా డాట్‌కామ్, తెలుగు డిక్షనరీ డాట్ ఓఆర్‌జి అనే సైట్లలో తెలుగు నిఘంటువులున్నాయి. తమిళ క్యూబ్ డాట్‌కామ్ అనే ఇంగ్లీష్ నుంచి తెలుగు, తెలుగు నుంచి ఇంగ్లీషు నిఘంటువులున్నాయి. ఈ సైటు నుంచి మొబైల్ ఫోను నుంచి కూడా వెదుక్కోవచ్చు. డిఎస్‌ఎఎల్, యూచికాగో డాట్ ఇడియు అనే వెబ్‌సైటులో డిక్షనరీ విభాగంలో బ్రౌన్, గ్విన్ నిఘంటువులు ఉన్నాయి. అలాగే, ఆంధ్రప్రదేశ్ ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఒక శబ్ద కోశాన్ని, వివిధ రకాలుగా లభిస్తున్న వేమన పద్యాలనీ తమ వెబ్‌సైట్‌లో పెట్టి మంచి పని చేసింది. ఈ వెబ్‌సైటు నుంచి మనం దేనినీ మన కంప్యూటర్‌లోకి దింపుకోలేం. సుందరయ్య విజ్ఞాన కేంద్రం కూడా అనేక పుస్తకాలను డిజిటైజ్ చేసి తమ వెబ్‌సైట్‌లో ఉంచింది. ఉచితంగా వీటిని అందరూ డౌన్‌లోడ్ చేసి చదువుకోవచ్చు కూడా.
ఆర్కీవ్ డాట్ ఓఆర్ జి అనే వెబ్‌సైటులో మనకు వేరే ఎక్కడా దొరకని రీతిలో పాత తెలుగు పుస్తకాలు దొరుకుతున్నాయి. ఎన్నో చక్కని ప్రచురణలు ఇందులో దొరుకుతున్నాయి. విద్యానిధి డాట్ ఓఆర్ జి డాట్ ఇన్ అనేది వివిధ విశ్వవిద్యాలయాల్లో జరిగే పరిశోధనా సిద్ధాంత గ్రంథాలు అందిస్తోంది. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా పేరుతో మరో వెబ్‌సైటు కూడా ఉంది. ఇందులో కూడా అనేక భాషల్లో, అనేక విలువైన రచనలను డిజిటైజ్ చేసి పొందుపరిచారు. చిక్కల్లా ఒక్కటే. ఈ వెబ్‌సైటులో పుస్తకాలు ఒక పట్టాన తెరచుకోవడం లేదు. చదువుకోవడం కుదురుతుందే తప్ప మన కంప్యూటర్‌లోకి దింపుకోవడం కాని పని. ఇందులో మన దేశంలో ఉండే వివిధ గ్రంథాలయాలలో ఉండే పుస్తకాలను డిజిటైజ్ చేసి ఉంచారు. గూగుల్ బుక్స్‌లో కూడా ఎన్నో ప్రాచీన పుస్తకాలున్నాయి. ఆ మధ్య వీటిని మన కంప్యూటర్‌లోకి దింపుకునే సౌలభ్యాన్ని ఉంచిన గూగుల్, ఎందుకో ఉచిత డౌన్‌లోడ్ సౌలభ్యాన్ని నిలిపేసింది.
తెలుగు వికీపీడియా అనేది మరొక ఉచిత వెబ్‌సైట్. చరిత్ర, సంస్కృతి, నగరం, పల్లె, పట్టణం, నాయకులు - ఇలా ఎన్నో అంశాలపై దాదాపు 40 వేలపైగా తెలుగు వ్యాసాలు అందులో ఉన్నాయి. దీనికి 15 వందల మంది సభ్యులు ఉచిత సేవల నందిస్తున్నారు.
షార్ట్ కట్స్ (ఫోటోషాప్ 7.0 టూల్స్)
shift + R సైకిల్ బ్లర్/ షార్పన్/ స్మడ్జి టూల్స్ వాడటానికి
shift + S క్లోన్/ పాటర్న్ స్టాంప్‌లను టాగిల్ చేసి వాడటానికి
shift + U సైకిల్ షేప్/ లైన్ టూల్స్ సైకిల్ చేయడానికి
shift + Y హిస్టరీ/ ఆర్ట్ హిస్టరీ టాగిల్ చేసి వాడటానికి
నెట్ న్యూస్
గూగుల్ తాలూకు హెడ్
మైక్రోసాఫ్ట్‌కు
చినమాయను పెనుమాయ.. చిన చేపను పెద చేప.. అది స్వాహా.. అని మాయాబజార్ చిత్రంలో కృష్ణుడు మారువేషంలో ఘటోత్కచుడితో అంటాడు. గుర్తొచ్చిందా? సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో సాధారణంగా జరిగేదదే. చక్కగా పేరొస్తున్న చిన్న కంపెనీలను బడా సంస్థలు కొనేస్తాయి. లేదా అక్కడి మనుష్యులను తెచ్చేసుకుంటాయి. ఐతే దీనికి భిన్నంగా ఇటీవల ఒక సంఘటన జరిగింది. ఒక పెద్ద సంస్థకు సంబంధించిన పెద్ద ఉద్యోగిని మరో సంస్థ కొనేయడం (లేదా కొట్టేయడం) ఇటీవల జరిగింది. గూగుల్ సంస్థ, మైక్రోసాఫ్ట్ సంస్థ - ఈ రెండూ ఎంత ప్రముఖమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయా సంస్థలు మార్కెట్లోకి తెచ్చే ఉత్పత్తుల గురించీ చెప్పక్కర్లేదు. గూగుల్ వరల్డ్ వైడ్ ఆన్‌లైన్ మాప్స్ అనేది అందరికీ అందుబాటులోకి వచ్చింది. దానికి సమాధానంగా మైక్రోసాఫ్ట్ కూడా బింగ్ మాప్స్ అని ప్రవేశపెట్టింది. అంతదాకా బాగానే ఉంది. ఇటీవల గూగుల్ వరల్డ్ వైడ్ ఆన్‌లైన్ మాప్స్ ఇంజనీరింగ్ డైరెక్టర్‌ను మైక్రోసాఫ్ట్ సంస్థ తన బింగ్ మాప్స్‌ను మరింతగా అభివృద్ధి చేయడానికని తన సంస్థకు తెచ్చేసుకుంది.
తెలుసుకోవాల్సిన సంగతి..
ఇంటర్నెట్ వర్క్
ఇంటర్నెట్ అనేది అనేక కంప్యూటర్ల మధ్య సంబంధాన్ని ఏర్పరచి వాటి మధ్య డేటాను పరస్పర మార్పిడి చేసుకొనేలా చూస్తుంది. ఈ కంప్యూటర్లన్నీ ప్రభుత్వ, విశ్వవిద్యాలయ, సంస్థల, వ్యక్తిగత - ఇలా వివిధ సంస్థలకు, మనుష్యులకు చెందినవిగా ఉంటాయి. రెండు అంతకన్నా ఎక్కువ నెట్‌వర్క్‌లు లేదా నెట్‌వర్క్ విభాగాలను రూటర్ వంటి ఉపకరణాల ద్వారా కలపడమే ఇంటర్నెట్ వర్కింగ్. పబ్లిక్, ప్రైవేటు, వాణిజ్య, పరిశ్రమల నెట్‌వర్క్‌ల మధ్య అనుసంధానం ఏర్పరచినా దానినీ ఇంటర్నెట్ వర్కింగ్ అనే అంటారు. ఇపుడు కొత్తగా ఒకదానికొకటి కలిపి ఉన్న నెట్‌వర్క్‌లు ఇంటర్నెట్ ప్రోటోకోల్ వాడి పని చేస్తాయి.
సామెత:
ముందు ట్విట్టరూ వెనక ఫేసుబుక్కూ...
హరికృష్ణ రాజీనామా
హైదరాబాద్, ఆగస్టు 4: రాష్ట్ర విభజన తీరు బాగాలేదని నిరసన వ్యక్తం చేస్తూ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్‌కు ఫ్యాక్స్‌లో పంపారు. అదే విధంగా టిడిపి అధ్యక్షునికి రాజీనామా లేఖ పంపారు. విభజనను స్వాగతిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించిన హరికృష్ణ ఈరోజు రాజీనామా చేశారు. దీంతో టిడిపి సీమాంధ్ర ఎంపిలంతా విభజనపై రాజీనామా చేసినట్టు అయింది. సీమాంధ్రలోని ముగ్గురు లోక్‌సభ సభ్యులు, ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. హరికృష్ణ ఆదివారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చి ఎన్టీఆర్‌కు నివాళి అర్పించారు. అన్ని ప్రాంతాలకు సమ న్యాయం జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. కేంద్రం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం ప్రతి తెలుగు వాడిని దిగ్భ్రాంతికి గురి చేస్తోందని అన్నారు. విభజనకు తాను వ్యతిరేకం కాదని, అదే విధంగా టిడిపి సైతం విభజనకు వ్యతిరేకం కాదని అన్నారు. కేంద్రం ఏకపక్షంగా విభజన చేసిందని, విభజన తీరుకు నిరసనగానే రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. తెలుగు వారంతా కలిసి ఉండాలని ఎన్టీఆర్ కోరుకున్నారని, ఎవరిని అడిగి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందనిప్రశ్నించారు. విభజనపై నిర్ణయం తీసుకునే ముందు కేంద్రం అన్ని ప్రాంతాల వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదని అన్నారు. విభజనకు వైఎస్‌ఆర్ కారణం అని, సోనియాగాంధీ తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టారని మండిపడ్డారు. తెలుగువారిని విడగొట్టే హక్కు సోనియాగాంధీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఎంతవరకు పరిగణలోకి తీసుకున్నారని ప్రశ్నించారు. రాజధాని, నీటివాటాలు తదితర అంశాలు తేలిన తరువాతనే విభజన ప్రక్రియ చేపట్టాలని కోరారు.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద రాజీనామా పత్రంపై సంతకం చేస్తున్న నందమూరి హరికృష్ణ
హైదరాబాద్ ఉమ్మడి రాజధానే
రాజమండ్రి, ఆగస్టు 4: రాష్ట్ర విభజనంటూ జరిగితే హైదరాబాద్‌ను ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉంచాలని లేదా కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని రాజమండ్రి ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఎంపి పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆదివారం రాత్రి రాజమండ్రి చేరుకున్న ఆయన సుబ్రహ్మణ్య మైదానంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు సంబంధించిన బిల్లు అసలు పార్లమెంటులో పాస్ కాదన్నారు. ఒక వేళ చర్చల ద్వారా విడిపోవాల్సి వస్తే హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలన్నదే తన ప్రతిపాదన అన్న ఆయన రాష్ట్ర విభజన ఉద్యమాల్లో ఇదే ఆఖరి ఉద్యమం కావాలన్నారు. కాగా, విభజనంటూ జరిగితే మూడు రాష్ట్రాలను ఏర్పాటుచేయాలని, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ రాష్ట్రాలను ఏర్పాటుచేసి, మూడు రాష్ట్రాలకు కూడా హైదరాబాద్‌నే రాజధానిగా ఉంచాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, హైదరాబాద్ రాజధాని అంటే సరిపోదని, త్వరలో హైదరాబాద్ ఉద్యమం కూడా మొదలవుతుందన్న ఉండవల్లి.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం జరగకుండా పార్లమెంటులో తీర్మానం ఎలా ప్రవేశపెడతారని ప్రశ్నించారు. 1972-73 జై ఆంధ్ర ఉద్యమాల్లో మనం ప్రత్యేక రాష్ట్రంగా రాజధానిని ఏర్పాటుచేసుకునే ప్రయత్నంలో ఉన్నపుడు, హైదరాబాద్ ఎంపిలు మనల్ని బతిమాలి హైదరాబాద్‌లో కలుపుకున్నారని ఉండవల్లి పేర్కొన్నారు. అందువల్లే అప్పటి కన్నా ఇపుడు హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందిందన్నారు. శ్రీకృష్ణ కమిషన్ నివేదికలో ఇలాంటి అనేక వాస్తవాలు ఉన్నాయని, కానీ పార్లమెంటు ముందు ఆ నివేదికను ఎందుకు ఉంచలేదో చెప్పాలని పార్లమెంటు సమావేశాల్లో అడగాలని తాను భావించానన్నారు. తెలంగాణ కావాలని కెసిఆర్ ఒక పక్క అడుగుతూ, మరోపక్క మనల్ని పొమ్మని తన్నుతున్నాడన్నారు. ఈ విషయం ఇతర రాష్ట్రాల వారికి తెలియదని, తెలిసేలా మనం చెప్పలేకపోయామన్నారు. తెలంగాణ ఏర్పడుతోందంటే ఎక్కువ భయపడేది కెసిఆరేనన్నారు. అయినా రాజధాని ఉన్న ప్రాంతానికి చెందిన వారు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమం చేయటం ఇదే తొలిసారన్నారు. ఇంత వరకు వచ్చిన తరువాత ఎవరు ఎంత అభివృద్ధి చెందారో లెక్కలు తేల్చుకోక తప్పదన్నారు. అయినా 60ఏళ్ల పాటు హైదరాబాద్‌ను రాజధానిగా చేసుకుని, ఎంతో అభివృద్ధి చేసుకున్న తరువాత ఎలా వదులుకుంటామని, ఎవరో వెళ్లిపోవాలంటే ఎలా వెళ్లిపోతామని ఉండవల్లి ప్రశ్నించారు. హైదరాబాద్, రాయలసీమ అన్ని పరిష్కారాలు ఇప్పుడే జరగాలన్నారు. ఎవరెన్ని చెప్పినా అంతిమ విజయం మనదేనని ఉండవల్లి చెప్పారు.
కెసిఆర్ వంటి వారికి తగిన బుద్ధి చెప్పటానికి, ఆంధ్రప్రాంతానికి చెందిన వారికి కూడా వాటా ఉన్న హైదరాబాద్‌పై అందరికీ సమాన హక్కు ఉండటానికి, స్వర్గీయ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు దేశానికి హైదరాబాద్‌ను రెండో రాజధానిగా చేయాలన్నారు. తెలంగాణ ఏర్పాటుతో దేశంలో 17రాష్ట్రాల్లో ఉద్యమాలు ఉవ్వెత్తున లేస్తాయన్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఉద్యమాలు తారాస్థాయికి చేరాయన్నారు.
..............
రాజమండ్రిలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతున్న ఉండవల్లి
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి
హైదరాబాద్, ఆగస్టు 4: రాష్ట్రంలో నెలకొని ఉన్న విపత్కర పరిస్థితితో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా తయారయింది. ఒకవైపు తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర కాంగ్రెస్ నేతలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని కోరుతుండగా, సమైక్యాంధ్ర కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉండాలంటూ సీమాంధ్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు కిరణ్‌కుమార్‌పై తీవ్రమైన వత్తిడి పెంచుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా జూలై 30 న కాంగ్రెస్ అధిష్టానం, యుపిఎ భాగస్యామ్య పక్షాలు ప్రకటన చేసిన తర్వాత రాజకీయ కార్యక్రమాలను, అధికారిక కార్యక్రమాలను క్యాంపు కార్యాలయం నుండే ముఖ్యమంత్రి నిర్వహిస్తున్నారు. కిరణ్‌కుమార్ రెడ్డి జన్మతః రాయలసీమ (చిత్తూరు జిల్లా) కు చెందిన వారైనప్పటికీ, ఆయన పుట్టిపెరిగింది తెలంగాణ (హైదరాబాద్) లో కావడం వల్ల రెండు ప్రాంతాలతో ఆయనకు అనుబంధం ఉంది. ఈ కారణంగా ఆయన స్పష్టంగా ఏ ప్రాంతానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణ విషయంలో కేంద్రం చాలా స్పష్టమైన నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణా ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూనే, ఈ అంశంపై ముఖ్యమంత్రినుండి పూర్తి సహాయ సహకారాలు కావాలని కోరుతున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అధికారికంగా తాను వ్యతిరేకించే పరిస్థితి లేదని, కేంద్రం అభీష్టం మేరకు నడుచుకుంటానని తెలంగాణ ప్రజాప్రతినిధులతో ఆయన స్పష్టం చేస్తున్నారు.
తెలంగాణకు అనుకూలంగా కేంద్రం తీసుకున్న నిర్ణయం ముఖ్యమంత్రికి ముందుగానే తెలిసినప్పటికీ, ఆయన అడ్డుకోలేకపోయారన్న ఆరోపణలు సీమాంధ్రవైపు నుండి వెల్లువెత్తుతున్నాయి. సీమాంధ్ర మంత్రులతో జరిగిన చర్చల సందర్భంగా కూడా ఆయన తన మనసులో మాటను వాళ్ల ముందు ఉంచారు. సోనియాగాంధీ, ఆశీస్సులతోనే తనకు ముఖ్యమంత్రి పదవి లభించిందని, అలాగే సీమాంధ్రకు చెందిన వారిని మంత్రులుగా ఎంపికచేయడంలో సోనియాగాంధీ ఆమోదముద్ర ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నట్టు తెలిసింది. సిఎం క్యాంపు కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో చేసిన తీర్మానాలపై సంతకాలు చేసిన విషయాన్ని పిసిసి అధ్యక్షుడు బొత్స ఆదివారం ధృవీకరించారు. ఈ విధంగా సంతకాలు చేయడం వెనుక కాంగ్రెస్‌ను సీమాంధ్రలో కూడా బతికించుకోవాలన్నదే ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది. సీమాంధ్రలో కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఆదరణ తగ్గకుండా ఉండేందుకే శనివారం సీమాంధ్ర కాంగ్రెస్ నేతల సమావేశంలో చేసిన తీర్మానంపై సిఎం సంతకం చేశారని తెలుస్తోంది.
కాంగ్రెస్ పట్ల ఒకవైపు సీమాంధ్రలోనూ, మరోవైపు తెలంగాణాలోనూ ఆదరణ తగ్గలేదని ఇటీవలి పంచాయతీ ఎన్నికలు స్పష్టం చేశాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ధీనంగా ఉంటుందేమోనని జరిగిన ఊహాగానాలకు ప్రజలు తెరదించారు. కాంగ్రెస్‌కు ఆదరణ ఉందని ఎన్నికలు స్పష్టం చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ సర్పంచ్ స్థానాలను అధిక సంఖ్యలో గెలుచుకుని కాంగ్రెస్ ప్రతిష్టను సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇనుమడింపచేశారన్న పేరు వచ్చింది. భవిష్యత్తులో కూడా రెండు ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించాలన్నదే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోందని తెలిసింది.
శాంతి, భద్రతల విషయంలో కేంద్రం నుండి ముఖ్యమంత్రిపై వత్తిడి పెరుగుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులకు ఎలాంటి నష్టం కలగకుండా చూడాలని, శాంతి, భద్రతల పరిరక్షణలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కేంద్రం నుండి స్పష్టమైన ఆదేశాలందాయి. రాజీవ్, ఇందిరాగాంధీ విగ్రహాలపై సీమాంధ్రలో దాడులు జరగడం, విగ్రహాలను కూల్చివేయడం సంఘటనలపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రజల మనోభావాలకు విఘాతం కలగకుండా ఒకవైపు చూస్తూ, ప్రభుత్వ ఆస్తులకు, ఇతరత్రా నష్టం జరగకుండా చూడాలంటూ పోలీసు ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.
లడఖ్‌లో ఆగని చైనా ఆగడాలు
లేహ్/న్యూఢిల్లీ, ఆగస్టు 4: ఇటీవలి కాలంలో జమ్మూ, కాశ్మీర్‌లోని లడఖ్ ప్రాంతంలోకి వరసగా పలు ర్లు చొరబడిన చైనా ఇప్పుడు భారతీయ సైన్యం సరిహద్దుల్లో తమ భూభాగంలోపల సైతం గస్తీ నిర్వహించడాన్ని సైతం అడ్డుకునే చర్యలకు పాల్పడుతోంది. గత వారం చోటు చేసుకున్న సంఘటనతో చైనా సైనికుల దుందుడుకు చర్య వెలుగులోకి వచ్చింది. గత వారం లడఖ్ ఉత్తర ప్రాంతంలోని ట్రేడ్ జంక్షన్ ప్రాంతంనుంచి వాస్తవాధీన రేఖ వెంబడి ఎగువ పర్వత ప్రాంతాల్లో 14 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న రెండు సైనిక పోస్టుల వద్దకు భారతీయ సైన్యం గస్తీని చేపట్టినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. భారీ, తేలిక పాటి వాహనాలు ఎక్కి వచ్చిన చైనా సైనికులు భారతీయ సైనికులను ఆపివేసినట్లు అధికార వర్గాలు ఆదివారం తెలిపాయి. అంతేకాదు, ఇది చైనా భూభాగమని, ముందుకు వెళ్లడానికి వీల్లేదని తెలిపే ఒక బ్యానర్‌ను కూడా చైనా సైనికులు గస్తీ బృందానికి చూపించారని ఆ వర్గాల తెలిపాయి. తమ సైనిక కేంద్రాల వద్ద ఉన్న భారత గస్తీ బృందాన్ని ఆపేటప్పుడు చైనా సైనికులు కాస్త దుందుడుకుగానే ప్రవర్తించినట్లు కూడా వారు తెలిపారు. ఈ సైనిక పోస్ట్‌లు భారత భూభాగంలోపలే ఉన్నట్లు కూడా వారు స్పష్టం చేసారు.
ఈ ఏడాది ఏప్రిల్‌నుంచి ఇప్పటివరకు భారత గస్తీ బృందం 21 సార్లు ఈ సరిహద్దు సైనిక కేంద్రాల వద్దకు బయలుదేరగా, రెండు సార్లు మాత్రమే తమ యాత్రను పూర్తి చేయగలిగిందని వారు చెప్పారు. చైనా సైన్యం ఒక అబ్జర్వేషన్ పోస్ట్‌ను కూడా నిర్మించిందని, అది భారతీయ సైనికుల కదలికలపై నిఘా పెట్టి, భారత గస్తీ బృందం బయలుదేరడానికి సిద్ధపడగానే మధ్యలోనే ఆపేసి వెనక్కి పంపించేస్తున్నారని కూడా ఆ వర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని చుషుల్‌లో జరగబోయే తదుపరి సరిహద్దు సైనికాధికారుల సమావేశంలో లేవనెత్తనున్నట్లు కూడా ఆ వర్గాలు తెలిపాయి. కాగా, గత ఏప్రిల్‌లో దాదాపు 21 రోజుల పాటు ఇరు దేశాల సైన్యాల మధ్య ఉద్రిక్తతకు కారణమైన దెప్సంగ్ బల్జె, దౌలత్ బేగ్ ఓల్డి ప్రాంతంలో కూడా చైనా మిలిటరీ వాహనాలు కనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయని, అయితే ఈ వాహనాలు కనిపించిన వెంటనే ప్రధానంగా ఐటిబిపి జవాన్లతో కూడిన భారత సైన్యం భారత భూభాగంలో చైనా వాహనాలు స్వేచ్ఛగా తిరగడాన్ని అడ్డుకున్నాయని ఆ వర్గాలు తెలిపాయి. వాస్తవాధీన రేఖపై చైనా వైపున దెమ్‌చోక్ ఫుక్చే సెక్టార్‌లో చైనా ఒక టవర్ నిర్మాణం చేపడుతుండడంపై కూడా ఇంతకు ముందు జరిగిన ఇరు దేశాల సైనికాధికారుల సమావేశంలో అభ్యంతరాలు లేవనెత్తినట్లు ఆ వర్గాలు తెలిపాయి. కల్నల్ వాంగ్ జున్ జియాన్ నేతృత్వంలో పాల్గొన్న చైనా బృందానికి 1993లో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందానికి ఈ నిర్మాణం వ్యతిరేకమని భారత బృందం స్పష్టం చేసింది. ఈ ఒప్పందం ప్రకారం వాస్తవాధీన రేఖ వద్ద ఏ దేశం కూడా నిర్మాణాలు చేపట్టకూడదు. అయితే అది ఆ ప్రాంత ప్రజల కోసం నిర్మిస్తున్న వాతావరణ కేంద్రమని చైనా వాదించడమే కాకుండా భారత సైన్యం సైనిక కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ ప్రత్యారోపణ చేసింది. అయితే పిఎల్‌ఏ దళాలు తరచూ భారత భూభాగంలోకి చొరబడుతున్నాయని బ్రిగేడియర్ సంజీవ్ రాయ్ నేతృత్వంలోని భారత బృందం చైనాకు స్పష్టం చేసిందని కూడా ఆ వర్గాలు తెలిపాయి.
అబూ సలేం అభ్యర్థనపై నేడు సుప్రీంకోర్టు తీర్పు
న్యూఢిల్లీ, ఆగస్టు 4: తనను భారతదేశానికి అప్పగించడాన్ని పోర్చుగల్ సుప్రీంకోర్టు భారతీయ అధికారులు నేరస్థుల అప్పగింతకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంటూ రద్దు చేసినందున భారత దేశంలో తనపై వివిధ కేసుల్లో జరుగుతున్న విచారణలను కొట్టివేయాలంటూ అండర్‌వరల్డ్ డాన్ అబూ సలేం చేసుకున్న అభ్యర్థనపై సుప్రీంకోర్టు సోమవారం తన తీర్పును ప్రకటించనుంది. ఒక వేళ నేరం రుజువయిన పక్షంలో సలేంకు మరణ శిక్ష విధించడం కానీ, 25 ఏళ్లకన్నా ఎక్కువ కాలం నిర్బంధంలో ఉంచడం కానీ చేయబోమని అతడి అప్పగింత సమయంలో పోర్చుగల్ ప్రభుత్వానికి హామీ ఇచ్చిన దృష్ట్యా టాడా, పేలుడు పదార్థాల చట్టం కింద అతనిపై పెట్టిన కొన్ని అభియోగాలను తొలగించడానికి తాము సిద్ధంగా ఉన్నామని సిబిఐ తెలియజేసిన తర్వాత తీర్పును తర్వాత ప్రకటిస్తామని గత నెల 9న ప్రధాన న్యాయమూర్తి పి సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది. పోర్చుగల్ కోర్టుకు ఇచ్చిన హామీలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అటార్నీ జనరల్ జిఇ వాహనవతి చెప్తూ,ట్రయల్ కోర్టు సలేంపై మోపిన అదనపు అభియోగాలను ఉపసంహరించుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతిని కూడా కోరారు. దాదాదపు మూడేళ్ల న్యాయ పోరాటం తర్వాత సలేం, అతని గర్ల్ ఫ్రెండ్, సినీ నటి మోనికా బేడీని 2005, నవంబర్ 11న పోర్చుగల్‌నుంచి భారత్‌కు తీసుకు రావడం తెలిసిందే. సలేం ప్రస్తుతం ముంబయిలోని ఆర్థర్ రోడ్డు జైల్లో ఉన్నాడు.
కేంద్ర ప్రభుత్వోద్యోగులకు 10 శాతం డిఎ పెంపు?
న్యూఢిల్లీ, ఆగస్టు 4: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కరవు భత్యాన్ని ఇప్పుడున్న 80 వాతంనుంచి 90 శాతానికి పెంచుతూ ప్రభుత్వం వచ్చేనెల ఒక ప్రకటన చేయనుంది. పండగల సీజన్‌కు ముందు చేసే ఈ ప్రకటన వల్ల 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, మరో 30 లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ప్రాథమిక అంచనాలను బట్టి కరవు భత్యం పెంపు 10నుంచి 11 శాతం దాకా ఉండవచ్చని, ఇది ఈ ఏడాది జూలై 1నుంచి అమలులోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం గత నెల 31న విడుదల చేసిన తాత్కాలిక గణాంకాల ప్రకారం ఫ్యాక్టరీ కార్మికులకు సంబంధించిన రిటైల్ ద్రవ్యోల్బణం జూన్ నెలలో 11.06 శాతం ఉంది. మామూలు పద్ధతి ప్రకారం అయితే డిఏ పెంపుకోసం ప్రభుత్వం 12 నెలల సగటు రిటైల్ ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకుంటుంది. ఇది ఈ సారి 10 శాతం దాకా ఉంటుందని, సెప్టెంబర్‌లో దీనిపై ప్రభుత్వం ప్రకటన చేస్తుందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కానె్ఫడరేషన్ సెక్రటరీ జనరల్ కెకెఎన్ కుట్టి చెప్పారు.
సమైక్య ప్రకటన వచ్చేవరకూ దీక్ష
చిత్తూరు, ఆగస్టు 4: రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ చిత్తూరు ఎమ్మెల్యే సికె బాబు చేపట్టిన నిరాహార దీక్ష ఆదివారం సాయంత్రానికి 96గంటలు (నాలుగు రోజులు) పూర్తయ్యింది. ఆయన మీడియాతో మాట్లాడుతూ, సమైక్యాంధ్రకు అనుకూలంగా తీర్పు వచ్చేంతవరకూ దీక్ష కొనసాగిస్తానని ప్రకటించారు. తన దీక్షను భగ్నం చేయాలని చూస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. చిత్తూరులో న్యాయవాదులు చేస్తున్న దీక్ష ఆదివారం నాటికి నాలుగోరోజుకు చేరుకుంది. ఇదిలావుండగా తిరుపతి ఆర్ అండ్‌బి అతిథిగృహంలో సమావేశమైన కాంగ్రెస్ నేతలు, శాప్స్ నేతలు తిరుపతి ఎంపి డాక్టర్ చింతామోహన్‌ను ఎంపి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామాలు చేస్తే సమస్య పరిష్కారం కాదని, తనతో కొంతమంది వస్తే ప్రధానితో మాట్లాడిస్తానని చెప్పారు. ఆందోళనకారుల ర్యాలీలు, మానవహారాలతో తిరుపతి హోరెత్తింది. చంద్రగిరి మండల ఐక్య కార్యాచరణ సమితి నేత సురేష్ నేతృత్వంలో ఆదివారం కొన్ని వందల మంది చంద్రగిరి కోటను ఎక్కి జాతీయ జెండాతో నిరసన తెలిపారు.
ప్రకాశం జిల్లాలో..
ఒంగోలు: ప్రకాశంజిల్లాలో 5వ రోజు కూడా ఉద్యమం కొనసాగింది. ఒంగోలు లోని శ్రీప్రతిభ కాలేజీ వద్ద సమైకాంధ్ర విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో ఆదివారం యుపిఏ ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ రాస్తోరోకో నిర్వహించారు. దీంతో ఒంగోలు వైపు నుండి కర్నూలు వైపు వెళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయ.
నెల్లూరులో భారీ ర్యాలీ
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం విస్తరిస్తోంది. జిల్లాలోని ఎమ్మెల్యేలందరితోపాటు అధికార కాంగ్రెస్‌పార్టీకి చెందిన ఎంఎల్‌సి కూడా ఇప్పటికే సమైక్యగళంతో తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. గత నాలుగు రోజులుగా విద్యాసంస్థలన్నీ మూసివేశారు. మరో రెండురోజులపాటు విద్యాసంస్థల బంద్ కొనసాగనుందనే ప్రకటనలు వెలువడ్డాయి. ఎన్‌జిఓలు విధులకు దూరంగా వ్యవహరిస్తామంటూ కూడా ప్రకటించారు. విద్యార్థి సంఘాల నేతృత్వంలోనే కీలకంగా నిర్వహిస్తున్న ఈ ఉద్యమం దశలవారీగా ఉద్యోగవర్గాలకు ఎగబాకింది. నగర శివారు ప్రాంతంలోని ఐదవ నెంబర్ జాతీయ రహదారిపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు క్రికెట్ ఆటతో వాహనాల రాకపోకలను గంటల తరబడి అడ్డుకున్నారు. జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరంలో టిడిపి నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నగరంలోని స్థానిక విఆర్‌సిసెంటర్ నుండి గాంధీబొమ్మ మీదుగా నర్తకిసెంటర్‌లోని ఎన్‌టిఆర్ విగ్రహం వరకు సాగింది.
నేడు కడప జిల్లా దిగ్బంధం
ఆర్టీసీకి రూ. 12 కోట్ల నష్టం
ఆంధ్రభూమి బ్యూరో
కడప, ఆగస్టు 4: కడప వైఎస్సార్ జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం పరాకాష్టకు చేరుతోంది. రాజీవ్, ఇందిరాగాంధీ విగ్రహాల విధ్వంసం కొనసాగుతోంది. సోనియాగాంధీతోపాటు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలను ధ్వంసం చేస్తున్నారు. ఇప్పటి వరకు పట్టణాలు, నియోజకవర్గం, మండల కేంద్రాలకు పరిమితమైన ఉద్యమం గ్రామస్థాయికి చేరింది. దీనితో గ్రామీణులంతా తిండీతిప్పలు మానేసి రోడ్డెక్కుతున్నారు. రైతులు ఎడ్ల బండ్లతో రోడ్లపైకి వచ్చి నిరసనలో పాల్గొంటున్నారు. రోడ్లపైనే వంటావార్పు చేపట్టడంతో ఇళ్లకు వెళ్లడం లేదు. సోమవారం నుండి జిల్లా వ్యాప్తంగా ఎన్జీవోలు విధులు బహిష్కరించి ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొంటున్నారు. సమైక్యాంధ్ర ఉద్యోగులు హైదరాబాద్ విడిచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేసిన తెరాస అధినేత కెసిఆర్‌ను జైలుకు పంపే వరకు నిద్రపోయేది లేదని న్యాయవాదులు శపథం చేశారు. నాలుగురోజులుగా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న న్యాయవాదుల్లో సీనియర్లంతా ఇప్పుడు న్యాయశాస్త్రాలను తిరగేస్తున్నారు. ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. టిడిపి ఆధ్వర్యంలో సోమవారం జిల్లా దిగ్బంధానికి సన్నాహాలు చేస్తున్నారు. రాత్రి నుండే ఆందోళనకారులు జిల్లా సరిహద్దులకు చేరిపోయారు. విభజన నిర్ణయంపై పునరాలోచన జరిగే వరకు దిగ్బంధం సాగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. జమ్మలమడుగులో బ్రాహ్మణ సంఘాలన్నీ కలిసి భారీ ఎత్తున ప్రదర్శన నిర్వహించాయి. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులతోపాటు అన్ని వర్గాల ప్రజలు ప్రదర్శనలో పాల్గొన్నారు. ఇదిలావుండగా సోమవారం కేంద్ర మాజీమంత్రి ఎ సాయిప్రతాప్, రాష్ట్ర మాజీమంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. విభజన నిర్ణయం ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదన్నారు. విభజన నిర్ణయం తీసుకుంటారని పార్టీలోనూ ప్రభుత్వంలోనూ భాగస్వాములమైన తమకు కనీస సమాచారం ఇవ్వకపోవడం ప్రజాప్రతినిథులను అధిష్ఠానం చులకన చేయడమేనన్నారు. విభజనపై పునరాలోచన చేయకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆంధ్రులంతా ఉమ్మడిగా అభివృద్ధి చేసుకున్న రాజధాని హైదరాబాద్ విషయంలో యుపిఏ ప్రభుత్వం విచక్షణతో ఆలోచించాలన్నారు.
కిరణ్, బొత్స పదవులు వదిలి
ఉద్యమంలోకి రావాలి : డిఎల్
ఆంధ్రభూమి బ్యూరో
కడప, ఆగస్టు 4: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తమ పదవులకు రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నప్పుడే సీమాంధ్ర ప్రజలకు న్యాయం జరుగుతుందని మాజీమంత్రి, కడప వైఎస్సార్ జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన మైదుకూరు, కడప ప్రాంతాల్లో జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన విషయం రెండు నెలల క్రితమే ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులకు తెలుసన్నారు. దీనిపై తనకు స్పష్టమైన సమాచారం ఉన్నప్పటికీ కేంద్రంపై వారిద్దరికీ ఉన్న నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదనే ఉద్దేశ్యంతో నోరుమెదపలేదన్నారు. తెలంగాణ నేతలు ప్రత్యేక తెలంగాణతో పాటు హైదరాబాద్‌ను కోరడంలో అర్థం లేదన్నారు. హైదరాబాద్ తెలుగువారందరి సొత్తన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం సమైక్యవాదుల వాణిని వినిపించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సిఎం, పిసిసి చీఫ్ సమైక్యాంధ్రుల అభిప్రాయాలను అధిష్ఠానానికి వినిపించడంలో విఫలమయ్యారన్నారు. విభజనపై అధిష్ఠానం పునఃపరిశీలించాలన్నారు. తెలంగాణ సమస్య ఇప్పటిది కాదన్నారు. ప్రజాసంక్షేమం కోసం పాటు పడే పార్టీలు అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. విభేదాలు సృష్టించి రెచ్చగొట్టే పార్టీలు మనుగడ సాగించలేవన్నారు. సమైక్యాంధ్ర ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని కిరణ్, బొత్స తమ పదవులకు రాజీనామా చేసి అధిష్ఠానంపై ఒత్తిడి తేవాలన్నారు.
మంత్రులతో కెవిపి రహస్య మంతనాలు!
హిందూపురం, ఆగస్టు 4: మంత్రి రఘువీరారెడ్డి తల్లి నరసమ్మ వైకుంఠ సమారాధన కార్యక్రమానికి హాజరైన మంత్రులతో కెవిపి అరగంట పాటు రహస్య మంతనాలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో ఆదివారం జరిగిన కార్యక్రమానికి హాజరైన రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్రరావు, పర్యటనశాఖ మంత్రి వట్టి వసంతకుమార్, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యేలు కన్నబాబు, సుధాకర్ దాదాపు అరగంట పాటు ఓ గదిలో రహస్య మంతనాలు సాగించారు. రాష్ట్ర విభజన అనివార్యమయితే హైదరాబాద్‌ను శాశ్వత ఉమ్మడి రాజధానిగా లేదా కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించే విధంగా ఒత్తిడి తీసుకురావాలని వీరు నిర్ణయంచినట్లు తెలుస్తోంది.
బాలికపై అత్యాచారం
కారంచేడు, ఆగస్టు 4: బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన శనివారం అర్ధరాత్రి ప్రకాశంజిల్లా కారంచేడులో జరిగింది. ఎస్‌ఐ షేక్ నసీజ్ బాష తెలిపిన వివరాల ప్రకారం విజయనగరం జిల్లా బొబ్బిలి సమీపంలోని వేజార గ్రామానికి చెందిన 14ఏళ్ల బాలికను కారంచేడుకు చెందిన ఒకరు గత నాలుగేళ్లుగా పెంచుకుంటున్నాడు. సాయంత్రం ఆమె బజారుకు వెళ్లి తిరిగి వస్తుండగా గాదె గోపి అనే యువకుడు ఆమెను నిర్మాణంలో ఉన్న ఓ ఇంటిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఏడుస్తూ జరిగిన విషయాన్ని ఆ బాలిక పెద్దలకు చెప్పటంతో వారు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. నిందితుడు గోపిపై నిర్భయ చట్టం కింద కేసు పెట్టి బాలికను చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. గోపి పరారీలో ఉన్నాడని, అతని కోసం ప్రత్యేక బృందాలను నియమించామని సిఐ చెప్పారు.
కోతిగట్టు కొండపై క్రైస్తవుల అక్రమాలు
ఆదోని, ఆగస్టు 4: కర్నూలు జిల్లా ఆదోనిలోని కోతిగట్టులో క్రైస్తవ మతప్రచారాలకులు నిర్మించిన అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని హిందు ధర్మరక్షణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. సమితి రాష్ట్ర కార్యదర్శి రామాంజినేయులు, రాష్ట్ర నాయకులు గౌరయ్య, సత్యనారాయణమూర్తి, శ్రీలంకకు చెందిన బౌద్దబిక్షువు సుమేధస్వామితో కలిసి ఆదివారం కొతిగట్టును సందర్శించారు. అక్కడి బౌద్దరామాలను, ధ్వంసమైన ఆంజనేయస్వామి విగ్రహాన్ని, హిందూ దేవతల రాతి బొమ్మలను పరిశీలించారు. అనంతరం వారు విలేఖరులతో మాట్లాడుతూ స్థానిక ప్రజలు కోతిగట్టుగా పిలుచుకునే కొండను క్రైస్తవులు ఆక్రమించుకున్నారని, శిలువలు ఏర్పాటు చేసి రేకులషెడ్లులో ప్రార్థనలు చేయడం చట్టవ్యతిరేకమన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా మతప్రచారం కోసం కొండను ఆక్రమించుకోవడం నేరమన్నారు. కొండకు 2000 గజాల దూరంలో బుద్ధుడి విగ్రహాలు, బౌద్దరామాలున్నాయన్నారు. కోతిగట్టు కింది భాగంలో ఉన్న ఆంజనేయస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారన్నారు. స్వామివారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం ద్వారా హిందువుల మనోభావాలను దెబ్బతీశారని తీవ్రస్థాయిలో విమర్శించారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోతిగట్టుపై ఉన్న అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలన్నారు. సామాన్యుల ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలంటే సవాలక్షా నిబంధనలు విధించే విద్యుత్‌శాఖ అధికారులు కోతిగట్టు కొండపై నిర్మించిన అక్రమ నిర్మాణానికి ఏ నిబంధన కింద విద్యుత్ కనెక్షన్ ఇచ్చారని వారు ప్రశ్నించారు. ఎలాంటి అనుమతులు లేకుండా కొండను ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు చర్యలు తీసుకోపోతే ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. అవసరమైతే కోతిగట్టు కొండ ఆక్రమణపై న్యాయపోరాటం చేస్తామని హిందూ ధర్మ పరిరక్షణ సమితి నాయకులు స్పష్టం చేశారు.
కోతిగట్టు కొండపై బుద్ధుడి విగ్రహాలను పరిశీలిస్తున్న శ్రీలంక బౌద్ధ
భిక్షువు సుమేధాస్వామి, హిందూ ధర్మ పరిరక్షణ సమితి నాయకులు
ముఖ్యమంత్రికీ సమైక్య సెగ
హిందూపురం, ఆగస్టు 4: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఆదివారం అనంతపురం జిల్లాలో సమైక్య సెగ తగిలింది. రాష్ట్ర విభజన నిర్ణయం అనంతరం తొలిసారి హైదరాబాద్ వీడిని ముఖ్యమంత్రికి సమైక్యాంధ్రుల నుంచి నిరసన ఎదురైంది. సిఎం డౌన్ డౌన్, సమైక్యాంధ్ర జిందాబాద్ అంటూ సమైక్యవాదులు నినాదాలు చేశారు. మంత్రి రఘువీరారెడ్డి తల్లి నరసమ్మ వైకుంఠ సమారాధన కార్యక్రమంలో పాల్గొనేందుకు పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో కలిసి కిరణ్‌కుమార్‌రెడ్డి బెంగళూరు నుండి ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో ఆదివారం సాయంత్రం 4.50 గంటలకు అనంతపురం జిల్లా నీలకంఠాపురం చేరుకున్నారు. అనంతరం మంత్రి ఇంట్లో దాదాపు 20 నిమిషాల సేపు చర్చలు జరిపారు. బయటకు రాగానే పెద్దఎత్తున మీడియా ప్రతినిధులు సిఎంతో మాట్లాడేందుకు ప్రయత్నించగా చేతులు ఊపుతూ వాహనం వైపు వెళ్లిపోయారు. హెలిప్యాడ్ వద్దకు వెళ్లేందుకు వాహనం ఎక్కుతూ దూరంగా ఉన్న ప్రజలను చూసి చేతులు ఊపుతుండగా ఒక్క పెట్టును సమైక్యవాదులు నినాదాలు చేశారు. సిఎం డౌన్ డౌన్, కెసిఆర్ డౌన్‌డౌన్, ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, సమైక్యాంధ్ర జిందాబాద్, సమైక్యాంధ్ర వర్ధిల్లాలి అంటూ అంటూ జనం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హెలిప్యాడ్ వరకు రోడ్డుకు ఇరువైపుల బారికేడ్ల ఆవల ఉన్న యువకులు, మహిళలు సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. అయినా ముఖ్యమంత్రి నవ్వుకుంటూ ముందుకు వెళ్లిపోయారు.
విపక్షాల వైఖరి వల్లే విభజన
రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో విభజించవద్దని సీమాంధ్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ, యుపిఎ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని రాష్ట్ర మంత్రులు కొండ్రు మురళి, గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకు కారకులైన చంద్రబాబు, వెంకయ్యనాయుడు, నారాయణను సీమాంధ్ర వాసులు అడ్డుకోవాలని, వారి ఫ్లెక్సీలు, చిత్రపటాలు, దిష్టిబొమ్మలు తగులబెట్టాలని పిలుపునిచ్చారు. త్వరలో హైదరాబాద్‌లో జరిగే గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ బహిరంగ సభను సమైక్యవాదులందరూ అడ్డుకోవాలన్నారు. ఒకటి, రెండు రోజుల్లో సీమాంధ్ర స్టీరింగ్ కమిటీ సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటుందన్నారు. మరోమారు ఢిల్లీ వెళ్లి సీమాంధ్ర ప్రజల మనోభావాలను వివరిస్తామన్నారు. అవసరమైతే సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం పదవులను కూడా వదులుకుంటామని స్పష్టం చేశారు.
కర్నూలులో ఆగని సమైక్య జ్వాల
కర్నూలు: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఆదివారం కూడా ఆగ్రహజ్వాలలు ఎగసిపడ్డాయ. కలెక్టరేట్ ఎదుట ఉద్యోగ, ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ప్రదర్శన నిర్వహించి ధర్నా చేశారు. జర్నలిస్టులు రాజ్‌విహార్ సెంటర్‌లో మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. రజక సంఘం యువకులు గాడిదల మెడలో ప్లకార్డులు తగిలించి తెలుగుతల్లి విగ్రహం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట, న్యాయవాదులు కృష్ణదేవరాయలు విగ్రహం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. డాక్టర్ ప్రసాద్ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. జిల్లాలో అన్ని బస్సు డిపోల నుంచి ఒక్క బస్సు కూడా రహదారిపైకి రాకుండా ఆందోళనకారులు అడ్డుకున్నారు.
ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న సమైక్యవాదులు
రత్నాచల్‌ను ఆపేసిన సమైక్య వాదులు
విశాఖపట్నం, ఆగస్టు 4: సమైక్యాంధ్రకు మద్దతుగా విశాఖలో ఉద్యమం ఉద్ధృత రూపం దాల్చింది. ఉద్యమకారులు విజయవాడ వెళ్లే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను ఎన్‌ఎడి కూడలి వద్ద, తిరుమల, బొకారో ఎక్స్‌ప్రెస్‌లను దువ్వాడ స్టేషన్ వద్ద నిలిపివేశారు. ఎయులో ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమించిన విద్యార్థి జెఎసి ప్రతినిధులు లగుడు గోవిందరావు, ఆరేటి మహేష్, బి.కాంతారావు, సురేష్ కుమార్ తదితరుల ఆరోగ్యం క్షీణించడంతో కెజిహెచ్‌కు తరలించి అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. అయితే, జెఎసి ప్రతినిధులు మాత్రం దీక్ష విరమించేందుకు నిరాకరించారు. కెజిహెచ్‌లోనే దీక్ష కొనసాగిస్తున్నారు. వీరిని వైద్య, ఆరోగ్య మంత్రి కోండ్రు మురళీ ఆదివారం రాత్రి పరామర్శించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయడం తనకు పెద్ద విషయం కాదన్నారు. తాము ఇప్పటికీ సమైక్యాంధ్రకే కట్టుబటి ఉన్నామన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యార్థులు చేసిన నినాదాలతో కెజిహెచ్ హోరెత్తింది. ఆ తర్వాత ఎయు పూర్వ విద్యార్థులు సమాఖ్య, ఎయు ఉద్యోగుల సంఘం ప్రతినిధులు రిలే నిరాహార దీక్షలకు సన్నద్ధమయ్యారు. వర్శిటీ క్యాంపస్‌లో భారీ ర్యాలీ నిర్వహించి సీమాంధ్రకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. అంతకు ముందు ఎయు గాంధీ విగ్రహం వద్ద సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి ప్రతినిధుల దీక్షాశిబిరాన్ని స్వాతంత్య్ర సమరయోధుడు, తొలి పార్లమెంటేరియన్ తిలక్ సందర్శించి సంఘీభావం తెలిపారు.
ఇది విదేశీ కుట్ర
సమైక్యంగా ఉన్న రాష్ట్రంలో సోనియాగాంధీ విభజన చిచ్చు రగిల్చారని వైఎస్సార్ పార్టీ నాయకుడు దాడి వీరభద్రరావు ఆరోపించారు. తెలుగు ప్రజల మనోభావాలను అర్థం చేసుకోకుండా రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయం తీసుకోవడం వెనుక విదేశీయత స్పష్టంగా కన్పిస్తోందని ఆయన ఆరోపించారు.
విజయనగరం జిల్లాలో శిరోముండనాలు..
విజయనగరం: సమైక్యాంధ్ర ఉద్యమ నినాదాలు.. రాస్తారోకోలు... మానవహారాలు.. శిరోముండనంతో నిరసనలు.. రిలే నిరాహార దీక్షలతో విజయనగరం జిల్లా హోరెత్తుతోంది. పట్టణంలోని ఎత్తు బ్రిడ్జి వద్ద టిడిపి ఆధ్వర్యంలో వంటావార్పు, మానవహారం, ఆటాపాట కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. సమైక్యాంధ్ర జెఎసి కన్వీనర్ మామిడి అప్పలనాయుడు నేతృత్వంలో సమైక్యావాదులు శిరోముండనం చేసుకొని తమ నిరసనను వ్యక్తం చేశారు. మయూరి కూడలి వద్ద మోటారు యూనియన్ కార్మికులు రాస్తారోకో, మానవహారం నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. కస్పా స్కూల్ వద్ద ఉపాధ్యాయ సంఘాలు తమ నిరసనను వ్యక్తం చేశాయి. చీపురుపల్లి, ఎస్.కోట ప్రాంతాల్లో కాంగ్రెస్, ఐకాసా ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి.
వంటావార్పును ప్రారంభిస్తున్న టిడిపి నేత అశోకగజపతిరాజు
విభజనపై ‘అనంత’ నిరసనలు
అనంతపురం, ఆగస్టు 4: అనంతపురం జిల్లాలో రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనగా ర్యాలీలు, ప్రదర్శనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా సోనియాగాంధీ, కెసిఆర్‌ల శవయాత్రలు, దిష్టిబొమ్మ దహనాలు జరుగుతున్నాయి. నగరంలో ముస్లింలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. సప్తగిరి సర్కిల్, క్లాక్‌టవర్ కూడళ్లలోబ్రాహ్మణుల ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర హోమం నిర్వహించారు. ఆటో, జెసిబి యూనియన్ల ఆధ్వర్యంలో జెసిబిలు ఆటోలతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనల్లో వికలాంగులతోపాటు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బత్తలపల్లి మండలానికి చెందిన మల్లీశ్వరి అనే విద్యార్థిని రాష్ట్ర విభజన వల్ల భవిష్యత్తు అంధకారమైపోతుందంటూ ఆత్మహత్య చేసుకుంది. మడకశిరలో రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి తల్లి పెద్ద కర్మకు హాజరైన పలువురు నేతల వాహనాలను సమైక్యాంధ్ర ఉద్యమకారులు ధ్వంసం చేశారు. రాజీవ్ విగ్రహంపై రాళ్లు రువ్వారు. వివిధ పార్టీల నేతలను అడ్డుకున్నారు. తాడిపత్రిలో విద్యార్థి జెఎసి నేత రాజశేఖరరెడ్డి విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కొత్తచెరువు మండలానికి చెందిన బోయ చంద్ర విభజనకు నిరసనగా విషం తాగాడు. రోడ్డు పైనే సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ పడిపోయాడు.
ఎంపి అనంతను అడ్డుకున్న విద్యార్థులు
ఎస్‌కె యూనివర్శిటీకి వెళ్లిన అనంతపురం ఎంపి అనంత వెంకటరామిరెడ్డిని నిరసనకారులు అడ్డుకున్నారు. సమైక్యాంధ్ర సభలో పాల్గొన్న ఉపాధ్యాయ, విద్యార్థి జెఎసిలకు సంఘీభావం తెలపడానికి వెళ్లిన ఆయనను ఎంపి గోబ్యాక్ అంటూ తిప్పి పంపేశారు. జిల్లాలో ఐదవ రోజు కూడా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. వ్యాపార, వాణిజ్య సముదాయాలన్నీ మూతపడ్డాయి.
విద్యార్థి ఆత్మహత్యాయత్నం
హిజ్రాల ఆధ్వర్యంలో ధర్నా
గుంటూరు: గుంటూరు జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా వివిధ సంఘాలు, పార్టీలు, సమైక్యాంధ్ర, విద్యార్థి జెఏసిలు ఆందోళనలు, నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. గుంటూరు నగరంలో సమైక్యాంధ్ర హిజ్రాల జెఏసి ఆధ్వర్యంలో ఆదివారం ర్యాలీ నిర్వహించి, స్థానిక శంకర్‌విలాస్ సెంటర్‌లోని ఓవర్ బ్రిడ్జి వద్ద రాస్తారోకో నిర్వహించి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. అనంతరం కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కెసిఆర్ కుటుంబ సభ్యులు తమ ఆస్తులను కూడబెట్టుకునేందుకే తెలంగాణ ప్రత్యేక ఉద్యమం చేపట్టారని, అవసరమైతే భిక్షాటన చేసైనా నగదు ఇస్తామని, రాష్ట్రాన్ని విడదీయవద్దని హిజ్రాలు వేడుకున్నారు. అలాగే సమైక్యాంధ్ర జెఏసి, విద్యార్థి జెఏసి ఆధ్వర్యంలో నగరంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి స్థానిక లక్ష్మీపురంలోని మధర్‌థెరిస్సా విగ్రహం వద్ద మానవహారం ఏర్పాటుచేసి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈక్రమంలో బిటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఇమ్రాన్ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో విద్యార్థి జెఏసి నాయకులు, గుంటూరు పశ్చిమ డిఎస్పీ వెంకటేశ్వరావు అడ్డుకున్నారు.
తెనాలి డివిజన్‌లో..
సమైక్య జెఏసి ఆధ్వర్యంలో గత ఐదురోజులుగా జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం ఆదివారం కూడా కొనసాగింది. వివిధ రాజకీయ, విద్యార్థి, స్వచ్ఛంద సంస్థలు, విద్యా, వ్యాపార, మహిళా సంఘాల నాయకులు నిరసన ర్యాలీల్లో పాల్గొని మద్దతు తెలిపారు. ఈసందర్భంగా పట్టణంలోని గాంధీచౌక్, శివాజీబొమ్మ సెంటర్, వీనస్ థియేటర్, అంబేద్కర్ కళాశాల, గంగాణమ్మపేట, బస్టాండ్, చెంచుపేట ప్రాంతాల్లో వివిధ సంఘాల నాయకులు సమైక్యాంధ్రకు మద్దతుగా రాస్తారోకో, మానవహారం నిర్వహించారు.
నరసరావుపేట డివిజన్‌లో..
సమైక్యాంధ్రను కోరుతూ నరసరావుపేట డివిజన్‌లో ఆదివారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు జరిగాయి. ఈమేరకు సోమవారం పట్టణ కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో నిరసన దీక్షలు, టిడిపి ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించనున్నట్లు ఆపార్టీ నాయకులు ప్రకటించారు.
హోరెత్తించిన చిన్నకార్ల ర్యాలీ
మచిలీపట్నం: సమైక్యాంధ్ర ఉద్యమం ఆదివారం కూడా పెద్దఎత్తున కొనసాగింది. పలు ప్రాంతాల్లో భారీ ర్యాలీలు నిర్వహించి నిరసన తెలిపారు. మచిలీపట్నంలో వందలాది చిన్నకార్లతో ర్యాలీ నిర్వహించారు. కెసిఆర్, సోనియాగాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డ్రైవర్లందరూ మూకుమ్మడిగా హారన్‌లు మోగించటంతో పట్టణం దద్దరిల్లింది. అలాగే గుడివాడలో ఆటో, బైక్, మినీ వ్యాన్‌ల ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దాదాపు పట్టణంలో ఉన్న వాహనాలన్నీ ర్యాలీలో పాల్గొనటంతో రోడ్లు కిక్కిరిసాయి. జగ్గయ్యపేటలో రంగవల్లులతో రోడ్లను తీర్చిదిద్ది సమైక్యాంధ్రను పరిరక్షించాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఉద్యోగులు ఉద్యమంలో భాగస్వాములు కావటంతో ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించాయి. ప్రభుత్వ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఏర్పడిన జాయింట్ యాక్షన్ కమిటీ ఉద్యమాన్ని ఉరుకులు పెట్టిస్తోంది.
అందరి నోటా...సమైక్యగళం
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో అన్నివర్గాలు కలిసి సమైక్యంగా ముందుకు కదులుతుండటంతో రోజు రోజుకు ఉద్యమ తీవ్రత పెరుగుతోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ రాష్ట్రాన్ని విభజిస్తే సహించేది లేదంటూ నినదిస్తున్నారు. ఆదివారం కూడా జిల్లావ్యాప్తంగా ర్యాలీలు, రాస్తారోకోలు, రోడ్లపై వంట వార్పులు కొనసాగాయి. ఏలూరులో జూట్‌మిల్లు కార్మికులు పెద్దఎత్తున రాస్తారోకో నిర్వహించారు. అలాగే వసంతమహల్ సెంటరులో శ్రీ గాయత్రి బ్రాహ్మణ పురోహిత సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర రహదారిపై వంటావార్పు నిర్వహించారు. ఫైర్‌స్టేషన్ సెంటరులో ఉదయం నుంచి రాత్రి వరకు ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. జంగారెడ్డిగూడెంలో ద్విచక్ర వాహనాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని బోసుబొమ్మ సెంటరులో విద్యార్ధులు, సమైక్యవాదులు మానవహారం నిర్వహించగా, జడ్పీ ఉన్నతపాఠశాల వద్ద యువకులు ఆశ్వారావుపేట రహదారిపై వంటావార్పు చేపట్టి నిరసన తెలిపారు. జంగారెడ్డిగూడెం ప్రాంతీయ బ్రాహ్మణ పరిషత్తు ఆధ్వర్యంలో రాష్ట్ర విభజనను నిరసిస్తూ శాంతిహోమం నిర్వహించారు.
తూ.గో.జిల్లాలో..
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉద్ధృతంగా జరిగింది. ఈనెల 6న కార్యకలాపాలను స్తంభింపజేయనున్నట్టు కోకనాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించింది. జిల్లా కేంద్రం కాకినాడలోని కల్పన సెంటర్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద సోనియాగాంధీ, కెసిఆర్‌ల దిష్టిబొమ్మలను దగ్ధం చేసి పిండ ప్రదానం చేశారు. నగరంలోని జగన్నాథపురం వంతెన వద్ద సమైక్యవాదులు రాస్తారోకో నిర్వహించారు. సోమవారం పెద్ద ఎత్తున బంద్‌కు ఉద్యోగ జెఎసి పిలుపునిచ్చింది. జిల్లా వ్యాప్తంగా సోమవారం అన్ని పెట్రోల్ బంకులు మూసివేయాలని పెట్రోలియం డీలర్లు నిర్ణయించారు.
అనంతపురం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించిన ముస్లింలు, గుంటూరులో ఆత్మాహుతికి ప్రయత్నించిన విద్యార్థి ఇమ్రాన్
సమ్మె విరమణకు వారం గడువు లేకుంటే ఉత్పత్తి తరలింపు
పుణె, ఆగస్టు 5: బజాజ్‌కు చెందిన చకన్ ప్లాంట్‌లో సమ్మె విరమణకు బజాజ్ ఆటో చీఫ్ రాజీవ్ బజాజ్ సోమవారం వారం రోజుల గడువు ఇచ్చారు. ఈలోగా అక్కడి యాజమాన్యం, యూనియన్లు సమ్మె సమస్యను పరిష్కరించుకోకుంటే అక్కడి నుంచి ఉత్పత్తి కార్యక్రమాన్ని తరలిస్తామని ఆయన స్పష్టం చేశారు. వారంలోగా సమస్యను పరిష్కరించుకోలేకపోతే యాజమాన్యం ఉత్పత్తి పనులను వేరే తరలించక తప్పని పరిస్థితి ఎదురవుతోందని ఆయన తెలిపారు. కనుక సమ్మెను విరమించాల్సిందిగా బజాజ్ ఆటో మేనేజింగ్ డైరక్టర్, చీఫ్ ఎగ్జిక్యుటివ్ రాజీవ్ బజాజ్ సిబ్బందిని కోరారు. ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, ‘ఇక్కడ సమస్య వారంలో తీరకుంటే ఇక్కడ ఉన్న ఉత్పత్తి సామర్ధ్యంకలో కనీసం 50 శాతాన్ని ఔరంగాబాద్, పంత్‌నగర్ ప్లాంట్లకు తరలించాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇందుకోసం ఈ విషయాన్ని బోర్డు దృష్టికి తీసుకువెళ్దామని భావిస్తున్నాను. అయితే చకన్‌లో అన్ని సౌకర్యాలను మూసివేయం. ఎందుకంటే ఇక్కడ ఆర్ అండ్ బి వ్యవస్థ ఉంది’ అని అన్నారు. ఇప్పటికే అమ్మకాలు దెబ్బతిన్నాయని, ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో ఇలా కొనసాగించే పరిస్థితి లేదని ఆయన చెప్పారు. జూన్ 25 నుంచి పూణెలోని చకన్ బజాజ్ ప్లాంట్‌లో కార్మికులు సమ్మె చేస్తున్నారు. వేతనాలు పెంచాలని, ఇఎస్‌వోపి ద్వారా ప్రతి కార్మికునికి 500 షేర్లను ఇవ్వాలని, తొలగించిన కార్మికులను పనిలోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు. ‘ఇంతకాలం ఓపిక పట్టాం. ఇక కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది’ అని ఆయన స్పష్టం చేశారు.
ఐటి నియామకాల్లో 17 శాతం క్షీణత
న్యూఢిల్లీ, ఆగస్టు 5: ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటి రంగంలో నియామకాలు 17 శాతం తగ్గి 1,50,000 మందికి ఉద్యోగాలు లభించవచ్చునని నాస్కామ్ అంచనా వేసింది. వివిధ సంస్థలలో పెరిగిన ఆటోమేషన్‌కు తోడు పోటీ అంతగా లేకపోవడం ఇందుకు కారణమని భావిస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. 108 బిలియన్ డాలర్ల ఐటి, ఱటియేతర సేవల రంగం 3 మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. ‘ఈ ఏడాది 150,000 నుంచి 180,000 నియామకాలు ఉండవచ్చు. కిందటేడు 180,000 నియామకాలు జరిగాయి’ అని నాస్కామ్ అధ్యక్షుడు సోమ్ మిట్టల్ చెప్పారు. నియామకాల పరిస్థితి గురించి ప్రశ్నించగా, తాత్కాలిక, కింది స్థాయి పనుల్లో ఆటోమేషన్ పెరిగింది. సామర్ధ్యం గల నిపుణుల నియామకాలే ఉండవచ్చు. గతంలో ఉద్యోగ నియామకాల్లో సంస్థల మధ్య పోటీ 20 శాతం ఉండగా ఈ సారి 14-15 శాతానికి తగ్గింది. నియామక విధానాల్లో మార్పు చోటు చేసుకోడంతో ప్రాంగణ నియామకాలు కూడా తగ్గుతున్నాయి. కిందటేడాదిలాగే ప్రాంగణ నియామకాలు 60 శాతం ఉండవచ్చు. ఇప్పుడు చాలా సంస్థలు సాంకేతిక నైపుణ్యం కంటె సాఫ్ట్ స్కిల్స్, లీడర్ షిప్ క్వాలిటీ గల అభ్యర్థుల నియామకాలపైనే దృష్టి పెట్టారు’ అని ఆయన అన్నారు. మూడేళ్ల కిందట సాంకేతిక నైపుణ్యంపై 80 శాతం దృష్టి ఉండేదని, ఇప్పుడు కేవలం 40 శాతం సాంకేతిక నైపుణ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సాఫ్ట్ స్కిల్స్, సామర్ధ్యాన్ని చూస్తున్నారని మరో నిపుణుడు వ్యాఖ్యానించారు. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ నెలల్లో నాలుగు ఐటి కంపెనీల నియామకాలు 60 శాతం తగ్గాయి. ఈ త్రైమాసికంలో ఆ నాలుగు కంపెనీలు 4,100 మందిని నియమించారు. కిందటేడు 10,900 మందిని నియమించారు.
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఊపందుకుంటున్న రియల్ ఎస్టేట్
విజయవాడ, ఆగస్టు 5: రాష్ట్ర విభజనపై అధికారపక్ష కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ, యుపిఎ భాగస్వామ్య పార్టీలు ఓ నిర్ణయం తీసుకోవడమే గాక కేంద్ర ప్రభుత్వం సోమవారం రాజ్యసభలో రాష్ట్ర విభజన ప్రక్రియ ఆరంభమైందంటూ ప్రకటన చేసిన నేపథ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రియల్‌ఎస్టేట్ వ్యాపారం ఊపందుకోడం ఆరంభమైంది. దీనికి తగ్గట్టే తెలుగుదేశంపార్టీ నేతలు విజయవాడ- గుంటూరు నగరాల మధ్య రాజధాని నిర్మాణం జరగాలంటూ పట్టుబడుతున్నారు. అసలు తెలంగాణాలో కెసిఆర్ ఉద్యమానికి శ్రీకారం చుట్టినప్పుడే విజయవాడ- గుంటూరు మధ్య రాజధాని నిర్మాణం జరుగగలదంటూ రియల్‌ఎస్టేట్ వ్యాపారం హుషారుగా సాగింది. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో రియల్ వ్యాపారం చతికిలబడింది. ఇదిలా ఉంటే రెవెన్యూ ఉన్నతాధికారులు కొందరు పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఎంతో గోప్యంగా ప్రభుత్వ బంజరు, అటవీ, దేవాదాయ భూముల రికార్డులను పరిశీలిస్తున్నారని తెలిసింది. దీంతో ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే ఒక్క కృష్ణా జిల్లాలో అదీ ఒక్క నూజివీడు డివిజన్‌లోనే దాదాపు 15 వేల ఎకరాల దేవాదాయ, అటవీ బంజరు భూములు పెద్దల గుప్పెట్లో ఉన్నాయి. అలాగే గుంటూరు జిల్లాలో నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట సిమెంటు ఫ్యాక్టరీ భూముల పరిసరాల్లో కనీసం వంద ఎకరాలు ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందంటున్నారు. పైగా గతంలో గుంటూరు కలెక్టర్లుగా పనిచేసిన కొందరు ఉద్దేశపూర్వకంగానే విలువైన ప్రభుత్వ భూమిని రియల్‌ఎస్టేట్ వ్యాపారులకోసం రహదారి పేరిట ధారదత్తం చేశారు. ఇక కృష్ణా జిల్లాలో ఆరు వేల ఎకరాల వక్ఫ్ భూములు ఉండగా వీటిల్లో అనేకం కబ్జాకు గురయ్యాయి. ఒకవేళ రాజధాని నిర్మాణం జరగాలంటే ఏదైనా ప్రభుత్వ కార్యకలాపాల కోసం ముందుగా ఈ ఆక్రమణ భూములన్నింటినీ తొలి దశలోనే స్వాధీనపరచుకోవాల్సి ఉంటుందని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారి ఒకరు ఆంధ్రభూమి ప్రతినిధితో అన్నారు. ఇక అందరి కళ్లూ నాగార్జున విశ్వవిద్యాలయంపైనే పడ్డాయి. దాదాపు 300 ఎకరాల భూమి అందులో అత్యధిక భవనాలు నిరుపయోగంగా ఉన్నాయంటున్నారు. మంగళగిరి టిబి పాత ఆసుపత్రి ప్రాంగణంలో 214 ఎకరాల భూమి ఉండగా ఇటీవలే అందులో 50 ఎకరాల భూమిని ప్రకృతి వైపరీత్యాల సంస్థకు అప్పగించడం జరిగింది. మిగిలిన భూమి ఖాళీగానే ఉంది. గతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కోసం కూడా పరిశీలించారు. ఇక మరోవైపు కృష్ణాలో గన్నవరం, హనుమాన్ జంక్షన్, అంబాపురం, పాతపాడు ప్రాంతాల్లోనూ, నందిగామ పరిసరాల్లోనూ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పటికే ఊపందుకుంటున్నది. రాజకీయ నాయకులు కొందరు ముందస్తు సమాచారంతో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో బినామీ పేర్లతో వందలాది ఎకరాల భూములు కొనుగోలు చేశారనే ప్రచారం సాగుతున్నది. ఏది ఏమైనా సీమాంధ్ర ప్రాంత భూముల ధరలకు రెక్కలొచ్చాయని గన్నవరం ప్రాంతంకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ ఆదిత్య హౌసింగ్, ఇన్‌ఫ్రా హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిడెట్ సంస్థ డైరెక్టర్ రవిచంద్ర అంగీకరిస్తున్నారు. రాష్ట్ర విభజన అంటూ జరిగితే బందరు పోర్టుకు మరింత ప్రాధాన్యం పెరుగుతుందనే అభిప్రాయంతో మచిలీపట్నం పరిసరాల్లో మళ్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆరంభమైంది. 2008లో ఒకసారి పోర్టు పేరుతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీనికి శంకుస్థాపన జరిగినా పోర్టు నిర్మాణం కనుచూపు మేరలో కనిపించకపోవడంతో భూముల కొనుగోలుపై భారీగా పెట్టుబడులు పెట్టిన రియల్‌ఎస్టేట్ వ్యాపారులు అప్పులపాలయ్యారు. తాజాగా రాష్ట్ర విభజన పేరుతో మళ్లీ తెరపైకి వచ్చారు. వాస్తవానికి బందరు పరిసరాల్లో కృష్ణా డెల్టా పంట భూములు మినహా మరి ఏ ఇతర భూములూ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుకూలం కాకపోయినా మాగాణి భూములను ప్లాట్లుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడ- బందరు జాతీయ రహదారి పక్కనే ఉన్న భూముల ధరలు కోటి నుంచి 2 కోట్ల రూపాయల వరకు ధర పలుకుతున్నదని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇలా పుంజుకునే కొద్దీ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు భూసేకరణ తీవ్ర విఘాతాన్ని కల్గిస్తుందనే చెప్పాలి. ఇప్పటికే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి స్థలాభావం వల్ల ఆ ప్రాజెక్టు నిలిచిపోయిందనే విషయం తెలిసిందే...
సమైక్యాంధ్రతోనే రాష్ట్రం సుభిక్షం
మచిలీపట్నం (కల్చరల్), ఆగస్టు 5: సమైక్యాంధ్రతోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నాగార్జున పబ్లిక్ స్కూలు అధినేత సుందరరాం అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా సోమవారం పాఠశాల ఆవరణలో విద్యార్థులు ‘సమైక్యాంధ్ర’ ఆకృతిలో ఏర్పడి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ విద్యుత్ ఉద్యోగుల బైక్ ర్యాలీ
గుడివాడ, ఆగస్టు 5: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో గుడివాడ డివిజన్‌లోని ఉద్యోగులు, కార్మికులు పట్టణంలో సోమవారం భారీ ఎత్తున మోటారు బైక్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా స్థానిక ఏలూర్ రోడ్డులోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద జరిగిన సభలో జేఏసీ జి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 56 ఏళ్ళుగా కలిసి ఉన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దుర్భుద్ధితో ఇప్పటికిప్పుడు విడగొట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కేవలం తెలంగాణాలో కాంగ్రెస్ మనుగడను కాపాడుకోడానికి రాష్ట్రాన్ని ముక్కలు చేశారని విమర్శించారు. యుపిఎ ప్రభుత్వం తీసుకున్న విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాజకీయేతర జేఏసీతో కలిసి పెద్దఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు మండలి హనుమంతరావు, షేక్ ఫరీద్‌భాషా, జి రాజేంద్రప్రసాద్, విద్యుత్ జేఏసీ నేతలు యు కృష్ణారావు, మోహనరావు, ఒ రాఘవయ్య, ఎల్ రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక మోడల్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ప్లకార్డులతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
8 రోజుల నష్టాలకు తెర
ముంబయి, ఆగస్టు 5: ముంబయి స్టాక్ మార్కెట్ ఇండెక్స్ సెన్సెక్స్ సోమవారం 18 పాయింట్లు లాభపడడంతో ఎనిమిది రోజుల నష్టాలకు బ్రేక్ పడినట్లయింది. ఐసిఐసిఐ బ్యాంక్, ఐటిసి, రిలయన్స్ కంపెనీల స్టాక్స్‌కు కొనుగోలు మద్దతు లభించడంతో పాటు, అంతర్జాతీయ మార్కెట్లలో అనుకూల ధోరణులు ఏర్పడడంతో దేశీయ మార్కెట్ కూడా అదే ధోరణిలో సాగింది. గత ఎనిమిది సెషన్స్‌లో 1,139 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ సోమవారం 18.24 పాయింట్ల లాభంతో 0.10 శాతం పెరిగి 19,182.26 వద్ద ముగిసింది. ఇదే విధంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి ఇండెక్స్ నిఫ్టీ 7.50 పాయింట్లు వృద్ధి చెంది 0.13 శాతం పెరిగి 5,685.40 వద్ద ముగిసింది. గత వారంగా మార్కెట్ 3 శాతం క్షీణించడంతో ప్రాథమికంగా బలంగా ఉండే కంపెనీల స్టాక్స్ ఆకర్షణీయంగా తక్కువ ధరకు లభిస్తుండడంతో మదుపరులు వాటి కొనుగోలు పట్ల మొగ్గు చూపారు. కాగా ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణులు నెలకొనగా, ఐరోపా మార్కెట్ గరిష్టంగా ప్రారంభం కావడంతో సెంటిమెంట్‌కు మద్దతు ఇచ్చినట్లయింది. గత వారం దాదాపు 74 శాతం క్షీణించిన ఫైనాన్షియల్ టెక్నాలజీస్ స్టాక్ ఈ వారం 30.88 శాతం లాభపడింది. ఇలా ఉండగా, బిఎస్‌ఇ ఇండెక్స్‌లోని 30 స్టాక్స్‌లో 18 లాభాలతో ముగియగా, 12 నష్టాలను చవిచూసాయి. ఐటిసి, కోల్ ఇండియా, స్టెరిలైట్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హీరో మోటార్ కార్పొరేషన్, ఐసిఐసిఐ బ్యాంక్, హిందూస్తాన్ యూనీలివర్ స్టాక్స్ లాభపడ్డాయి. మరో వైపు బిహెచ్‌ఇఎల్ నికర లాభం క్షీణించడంతో ఆ కంపెనీ స్టాక్ 19.08 శాతం నష్టపోయింది. మెటల్ రంగం 2.67 శాతం, బ్యాంకింగ్ ఇండెక్స్ 0.97 శాతం, ఐటి 0.90 శాతం, ఎఫ్‌ఎంసిజి 0.58 శాతం లాభపడింది. మరో వైపు క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 3.58 శాతం, పవర్ ఇండెక్స్ 1.02 శాతం క్షీణించింది.
గోద్రెజ్ ప్రచారం
ముంబయిలో సోమవారం గోద్రెజ్ గ్రూప్ కంపెనీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న హిందీ నటుడు అమీర్ ఖాన్, గోద్రెజ్ గ్రూప్ ఎగ్జిక్యుటివ్ డైరక్టర్, ప్రెసిడెంట్ (మార్కెటింగ్) తన్యా దుబాష్.