తార్నాక, అక్టోబర్ 31: నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న విషజ్వరాలపై ముందస్థు నివారణ చర్యలు తీసుకోకపోతే టిడిపి ఆధ్వర్యంలో ప్రజాందోళన చేపట్టగలమని టిడిపి గ్రేటర్ హైదరాబాద్ అధికార ప్రతినిధి ఎం.ఆనంద్‌కుమార్‌గౌడ్ హెచ్చరించారు. ఈ మేరకు బుథవారం పార్టీ నేతలు అస్లాం, సుభాష్, నర్సింగ్, ఉమేశ్, మనోజ్‌లతో కల్సి సౌత్‌జోన్ జోనల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. నగరంలోని కోల్సావాడి, చందన్‌వాడీ, జగ్జీవన్‌రాంనగర్, బహబూబ్‌గంజ్, మహరాజ్‌గంజ్, కిషన్‌గంజ్, గౌలిగూడ, బేగంబజార్, చుడిబజార్, నింబుమార్కెట్, మంగళ్‌హాట్, ఉస్మాన్‌షాహీ, దూల్‌పేట్ తదితర ప్రాంతాల్లో అస్తవ్యస్తమైన పారిశుధ్యం, దోమలు విజృంభించడంతో ప్రజలు విషజ్వరాల బారిన పడి ఆసుపత్రులలో కొట్టుమిట్టాడుతున్నారని విష జ్వరాలు ప్రబలుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులుఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
విద్రోహదినం పిలుపుతో గట్టి పోలీస్ బందోబస్తు
బేగంపేట, అక్టోబర్ 31: తెలంగాణ జెఎసి ఆధ్వర్యంలో నవంబర్ 1ని విద్రోహదినంగా పాటించాలని పిలుపునివ్వడంతో నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ముందస్తు చర్యలో భాగంగా నార్త్‌జోన్ పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. గురువారం జరుగనున్న వేడుకల సందర్భంగా సికింద్రాబాద్‌లోని ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్డీవో, తహశీల్దార్, చీఫ్ రేషన్‌నింగ్ కార్యాలయం వద్ద పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేశారు. బేగంపేట ఎయిర్‌పోర్టు, అమెరికా కాన్సులేట్ వద్ద ఏసిపి సూర్యనారాయణ బుధవారం బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు. మహంకాళి, రాంగోపాల్‌పేట, మార్కెట్, గోపాలపురం పోలీస్‌స్టేషన్ల పరిధిలో మందస్తు బందోబస్తు చర్యలు చేపట్టారు.
కొత్త ఒరవడిని సృష్టిస్తున్న రాహుల్
తార్నాక, అక్టోబర్ 31: దేశంలో కొత్త ఒరవడితో యువతలో చైతన్యం తీసుకువస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి యువ నేత రాహుల్‌గాంధీ ముందుకు సాగుతున్నారని పిసిసి కార్యదర్శి బండ చంద్రారెడ్డి పేర్కొన్నారు. బుధవారం దాదాపు రెండు వందల మంది విద్యార్థులు ఎన్‌ఎస్‌యుఐ నాయకుడు మణికంఠ ఆధ్వర్యంలో చంద్రారెడ్డి సమక్షంలో ఎన్‌ఎస్‌యుఐలో చేరారు. ఈ సందర్భంగా చంద్రారెడ్డి విద్యార్థుల నుద్దేశించి మాట్లాడుతూ, విద్యార్థులు రాజకీయ చైతన్యం కలిగి ఉండాలని నేడు దేశంలోని గొప్ప నాయకులు విద్యార్థి దశనుంచే నాయకత్వ లక్షణాలను అలవర్చుకుని నేడు గొప్ప నాయకులుగా ఉన్నారని అన్నారు. అదే సమయంలో యువతరం దేశం కోసం దేశ సామాజిక అంశాలను అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. యువత దేశానికి వెన్నముకలాంటి వారని అలాంటి యువతరం తొందరపాటు కాకుండా జరుగుతున్న పరిస్థితులను అవగాహన కల్పించుకుని అవినీతిరహిత సమాజం కోసం దేశం అన్ని రంగాల్లో ముందుకు సాగి ప్రపంచంలో అగ్రగామిగా వెలుగొందడానికి కృషి చేయాల్సిన బాధ్యత యువతరంపైనే ఉందని బండ చంద్రారెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులు తమ రంగంలో రాణిస్తూనే దేశ రాజకీయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిస్థితులు అవగతం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు రాజ్‌కుమార్, షబ్బూబాయ్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు భాషోద్యముడికి అభినందన సత్కారం
నల్లకుంట, అక్టోబర్ 31: నిస్వార్ధ రాజకీయ నాయకుడు, తెలుగు భాష, సంస్కృతి సంప్రదాయాలకు విశేష సేవలందించి అందరికీ ఆత్మీయుడైన సౌజన్యశీలి మండలి బుద్ధప్రసాద్ అని పలువురు వక్తలు అన్నారు. బుధవారం రవీంద్రభారతిలో కినె్నర ఆర్ట్ థియేటర్స్, జంటనగరాల సాహితీ సాంస్కృతిక సంస్థల సహకారంతో తెలుగు భాషోద్యమ రథసారధి మండలి బుద్ధప్రసాద్ ఆంధ్రప్రదేశ్ అధికార భాష సంఘం అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర శాసనమండలి అధ్యక్షుడు డా.ఎ.చక్రపాణి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలే కాకుండా ప్రపంచలోని తెలుగు ప్రజలు అందరూ తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా కోరుకునే వ్యక్తి మండలి బుద్ధప్రసాద్ అని అన్నారు. తెలుగు భాష అభివృద్ధికి ఒక కమిటిని వేశామని, ఆ కమిటీ మన సంస్కృతి సంప్రదాయాలు, పండుగలు, కళల అభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు. తెలుగు భాష అభివృద్ధికి తన పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని హామి ఇచ్చారు. పద్మభూషణ్ డా. సి.నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలలో ప్రభుత్వ కార్యాలయాలలో వారి ప్రాంతీయ భాష ఉండగా మన రాష్ట్రంలో అందుకు భిన్నంగా ఉండడం శోఛనీయమాన్నారు. వాడుకలో తెలుగు తగ్గుతుందని, ఇంగ్లీషు వారు వెళ్ళిపోయినా భాషలో ఇంకా చొరబడే ఉన్నారన్నారు. పరాయి పదాలు, కిరాయి పదాలు వాడుకలో ఎక్కువయ్యాయని ఎద్దేవా చేశారు. సభాధ్యక్షత వహించిన రాష్ట్ర సాంస్కృతిక శాఖ సలహాదారు డా.కెవి రమణాచారి మాట్లాడుతూ తెలుగు భాష ఉన్నతికి దిశనిర్ధేశనానికి సమర్ధుడైన మండలిని అధికార అధ్యక్షుడిగా నియమించడం అభినందనీయమన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర సాంస్కతిక శాఖ సలహాదారుడిగా డా.కెవి రమణాచారి, రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షులుగా ఆర్వీ రమణమూర్తి, సాంస్కృతిక శాఖ సంచాలకులుగా డా.రాళ్ళబండి కవితా ప్రసాద్‌తో పాటు అధికార భాష సంఘం అధ్యక్షుడిగా మండలి బుద్ధప్రసాద్ పదవీ బాధ్యలు స్వీకరించడంతో ఒకరికొకరు సమన్వయించుకుంటూ భాషాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సినీ నటి జమున, అధికార భాష సంఘం పూర్వ అధ్యక్షుడు ఎబికె ప్రసాద్, తెలుగు అకాడమీ డైరెక్టర్ డా.యాదగిరి, అక్కినేని నాటక కళాపరిషత్ అధ్యక్షుడు కొండలరావు, ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ బుద్ధప్రసాద్‌ను కొనియాడుతూ మాట్లాడారు. నిర్వాహక సంస్థపక్షాన అతిథులు, జంటనగరాల సాహితీ సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు మండలిని అభినందించి సత్కరించారు. సంస్థ అధ్యక్షుడు డా.ఆర్. ప్రభాకరరావు, మద్దాళి రఘురాం సభకు స్వాగతం పలికారు. సభకు ముందు దేవులపల్లి ఉమా బృందంచే నిర్వహించిన కూడిపూడి నృత్య ప్రదర్శన ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది.
విష జ్వరాల నివారణకు చర్యలు తీసుకోకపోతే ఆందోళన
english title:
f
Date:
Thursday, November 1, 2012