రంగారెడ్డి/గచ్చిబౌలి, నవంబర్ 1: రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ వాణిప్రసాద్ చెప్పారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లోని పోలీస్‌గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన వేడుకలలో ఆమె మాట్లాడుతూ గడచిన 56 సంవత్సరాలలో రాష్ట్రం గణనీయమైన ప్రగతిని సాధించిందని కలెక్టర్ తెలిపారు. విద్య, వైద్య రంగాలలో ఘన విజయాలు సాధించినట్టు చెప్పారు. రైతులకు వ్యవసాయ పెట్టుబడుల కోసం 669 కోట్లు అందిస్తున్నామన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టాలపాలైన రైతులకు 62 కోట్ల రూపాయల ఇన్‌పుట్ సబ్సిడీని రెండు లక్షల 82 వేల మంది బాధితులకు అందించామని వాణిప్రసాద్ చెప్పారు. నగర అవసరాల కోసం కూరగాయల సాగును ప్రోత్సహించడం కోసం జాతీయ హార్టికల్చర్ మిషన్ ద్వారా 8.14 కోట్ల రూపాయలతో ఆరువేల హెక్టార్లలో కూరగాయలు, 250 హెక్టార్లలో పండ్లు, పూలసాగు చేపడుతున్నామన్నారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ద్వారా 450 మినీడెయిరీలు ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 225 పూర్తి చేశామన్నారు. జిల్లాలోని పేదరైతులకు 85 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల ద్వారా ఉచితంగా కరెంట్ అందిస్తున్నామన్నారు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ కింద 27 కోట్ల వ్యయంతో 85 ఉన్నత ప్రాథమికోన్నత పాఠశాలల భవనాలు నిర్మించామని ఆమె వివరించారు. ఇందిరమ్మ పథకంలో భాగంగా 1,359 కోట్ల రూపాయలతో మూడు విడతలుగా రెండు లక్షల ఇళ్లు మంజూరు చేశామని, 600 కోట్లతో 1.30 లక్షల ఇళ్లను పూర్తి చేశామన్నారు. రాజీవ్ ఆవాస్ యోజన పథకంలో భాగంగా 59 కోట్ల వ్యయంతో శేరిలింగంపల్లిలో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం స్ర్తి నిధి పథకాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇందిరాక్రాంతి పథకంలో భాగంగా వికారాబాద్, తాండూరు పట్టణాల్లో స్వయం సహాయక బృందాలకు 5.75 కోట్ల అందించామని కలెక్టర్ వివరించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా 2 లక్షల 97 వేల మందికి జాబ్‌కార్డులు అందించామన్నారు. ఇందిర జలప్రభ, ఇందిరమ్మ పెన్షన్‌లు, రూపాయికి కిలో బియ్యం అర్హులైన పేదవారికి అందిస్తున్నామని చెప్పారు. రాజీవ్ యువకిరణాల కింద జిల్లాలో ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశం కల్పించినట్టు కలెక్టర్ వాణిప్రసాద్ వివరించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఎస్పీ రాజకుమారి, జెసిలు జగన్నాథం, ముత్యాలరాజు, జాయింట్ సిపి అతుల్‌సింగ్ పాల్గొన్నారు. అంతకుముందు పోలీసుల నుంచి కలెక్టర్ వందన స్వీకారాన్ని అందుకున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో విశేష సేవలందించిన పలువురు ఉద్యోగులకు కలెక్టర్ పతకాలను అందించారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని
english title:
welfare programs
Date:
Friday, November 2, 2012