మహబూబ్‌నగర్, నవంబర్ 1: తొమ్మిదేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో జలయజ్ఞం పథకాన్ని ధనయజ్ఞంగా మార్చి కాంగ్రెస్ నాయకులు కోట్లాది రూపాయలను దండుకున్నారని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. వస్తున్నా మీకోసం పాదయాత్రలో భాగంగా గురువారం దేవరకద్ర నియోజకవర్గంలోని దమగ్నపూర్, సీతారాంపేట, నెల్లికొండి, లాల్‌కోట గ్రామాలలో చంద్రబాబునాయుడు తన పాదయాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా దమగ్నాపూర్ గ్రామంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం భష్ఠుపట్టిపోయిందని విమర్శించారు. తాను రైతుల రుణాలను మాఫి చేస్తానంటే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అదేలా సాధ్యమని అనడం ఆయన చేతగాని పరిపాలనకు నిదర్శనమని ఆరోపించారు. అసలు ముఖ్యమంత్రి రైతుల రుణాలను మాఫి చేయనని దమ్ముంటే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రైతులు అప్పుల ఊబిలో కూరుకొని ఎన్నో ఇబ్బందులు పడుతుంటే సిఎం ఇందిరమ్మ బాట పేరుతో తిరగడం కాదని ఆ పేరుతో పత్తితో తులాభారం చేసుకుంటున్నారని, సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రైతులకే తులాభారమయ్యాడని ఎద్దేవా చేశారు. ఒక వ్యక్తి ఎవ్వరి కోసం జైలుకు వెళ్లాడని, ఆయన ప్రజలకోసం పోరాటం చేసా అని ప్రశ్నించారు. జగన్ తన తండ్రి పదవిని అడ్టంపెట్టుకొని కోట్లాది రూపాయలను దోచుకొని జైలుకు వెళ్లి అడ్డదిడ్డంగా డబ్బులు సంపాదించి ఎమ్మెల్యేలను బలి పశువులుగా కొంటున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పటంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఉంచడం జరిగిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి పధాన్ని తొలగించి ప్రపంచ పటంలో హైదరాబాద్‌ను అవినీతి రాష్ట్రంగా తీసుకొని వెళ్లారని బాబు ధ్వజమెత్తారు. తెలంగాణ విషయంలో ఓడిపోయిన వారి దగ్గరికి వచ్చి అడిగితే ఏమిలాభమని, నాకు అధికారంలేదని అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం భష్ట్రుపట్టడానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు. కాంగ్రెస్ తొమ్మిది సంవత్సరాల పాలన రాష్ట్ర ప్రజలకు శాపంగా మారిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ముస్లింలకు 8శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకుంటానని అన్నారు. ఐదువందల జనాభా ఉన్న గిరిజన తండాలను తాను అధికారంలోకి వస్తే ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేస్తానని అన్నారు. టిడిపిని బలహీనపర్చేందుకు కొందరు కాంగ్రెస్‌తో లాలూచి పడి తమను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. నెల్లికొండి గ్రామంలో నిర్వహించిన సభలో వర్షం వచ్చిన చంద్రబాబునాయుడు తన ప్రసంగాన్ని ఆపకుండా కొనసాగించారు. గురువారం జరిగిన పాదయాత్ర ముసురువర్షంలో కొనసాగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం కురవడంతో తెలుగుదేశం కార్యకర్తలు తడిచిముద్దయ్యారు. ఈ యాత్రలో తెలంగాణ టిడిపి ఫోరం కన్వీనర్ దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు సీతమ్మ, దయాకర్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, రాములు, ఎర్ర శేఖర్, టిడిపి జిల్లా అధ్యక్షుడు మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవానికి విద్రోహ దినం ఎఫెక్ట్
* వెలవెలబోయిన పోలీసు పరేడ్ గ్రౌండ్
* విద్రోహ దినం జరుపుకున్న తెలంగాణ వాదులు
మహబూబ్‌నగర్, నవంబర్ 1: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవానికి తెలంగాణ వాదులు చేపట్టిన విద్రోహ దినం ఎఫెక్ట్ పడింది. గురువారం జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర రాజకీయ పార్టీ నాయకులు ఎవరు హాజరుకాలేరు. కేవలం కొంతమంది విద్యార్థులతోనే ఈ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. కలెక్టర్ ప్రసంగం సమయంలో కూడా కొందరు జిల్లా అధికారులు, అక్కడికి విచ్చేసిన కొంత మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఒకపక్క పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు కొనసాగుతున్న నేపథ్యంలోనే మరోపక్క తెరాస నాయకులు, తెలంగాణ వాదులు బయట నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నల్ల జెండాలు ఎగుర వేసి తెలంగాణ విద్రోహ దినాన్ని జరుపుకున్నారు. జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్‌లో పొట్టి శ్రీరాములు విగ్రహం ముందు తెరాస నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. జెఎసి నాయకులు తెలంగాణ చౌరస్తాలో నల్ల జెండాను ఎగుర వేసి నిరసన వ్యక్తం చేశారు. కొల్లాపూర్ తహశీల్దార్ కార్యాలయంపై ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు నల్ల జెండాను ఎగుర వేసి విద్రోహ దినాన్ని పాటించారు. చిన్నచింతకుంటలో జెఎసి నాయకులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట నల్ల జెండాను ఎగుర వేసి విద్రోహ దినాన్ని పాటించారు. జిల్లాలో గ్రామగ్రామాన తెలంగాణ విద్రోహ దినాన్ని తెలంగాణ వాదులు జరుపుకోగా జిల్లా ఉన్నతాధికారులు మాత్రం పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించగా అక్కడ జనం లేక వెలవెలబోయింది. వేసిన కుర్చీలన్ని ఖాళీగా కనబడ్డాయి. మాజీ ఎంపి రుమాండ్ల రాంచంద్రయ్య, తెరాస పొలిట్‌బ్యూరో సభ్యుడు ఇబ్రహీం, టిఆర్‌ఎస్ జిల్లా కోకన్వీనర్ బెక్కం జనార్దన్‌తో పాటు పలువురు ఎస్పీ కార్యాలయ సమీపంలో గల పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో ఎస్పీ కార్యాలయ ప్రధాన గేటు దగ్గర భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమవుదాం
* 57వ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో కలెక్టర్ గిరిజాశంకర్
మహబూబ్‌నగర్, నవంబర్ 1: జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పునరంకింతం కావాలని జిల్లా కలెక్టర్ గిరిజాశంకర్ ప్రజలకు పిలుపునిచ్చారు. 57వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలను గురువారం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను అవిష్కరించారు. అంతకుముందు అమరిజీవి పొట్టి శ్రీరాములు, తెలుగుతల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి సందేశాన్ని ఇస్తూ జిల్లాలో వివిధ రంగాలలో అభివృద్దిపర్చేందుకు పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ఈ సంవత్సరం రబీలో రైతులకు ఇప్పటి వరకు 80వేల క్వింటాళ్ల వేరుశెనగ విత్తనాలను, 1.40లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను సరఫరా చేసినట్లు తెలిపారు. ఈ సంవత్సరం 9.73కోట్ల వ్యయంతో 50శాతం సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు అందచేస్తున్నామని, 6.12 కోట్లతో స్ప్రింక్లర్లు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఈయేడాది రైతులకు రూ. 1024 కోట్లు పంట రుణాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. 22లక్షలతో వ్యయంతో 14 సంచార చాప్‌కట్టర్‌లను అందించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లాలో 14,107 మంది చేనేత కార్మికులకు నెలకు రూ.2వందలు చొప్పున పింఛన్లు ఇస్తున్నట్లు తెలిపారు. నిర్మల్ భారత్ అభియాన్ పథకం కింద 327 గ్రామపంచాయతీలలో 1.17 లక్షల మరుగుదొడ్లు కట్టించనున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం జిల్లాలో 324 కోట్లతో 22 సమగ్ర రక్షితమంచినీటి పథకాలను చేపట్టేందుకు మంజూరైనట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 132/32 కెవి సామర్థ్యం కలిగిన 14 సబ్‌స్టేషన్లు, 33/11 సామర్థ్యం కలిగిన 269 కొత్త సబ్‌స్టేషన్‌లను రూ.40కోట్లతో నిర్మించడం జరుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ గృహ నిర్మాణం కింద జిల్లాకు సుమారు 5.10లక్షల గృహాలు మంజూరు కాగా, ఇప్పటి వరకు 2.39 లక్షల గృహాలు నిర్మించినట్లు తెలిపారు. జిల్లాలోని 9,49,129 దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు రూపాయికి కిలో బియ్యం ఇస్తున్నట్లు తెలిపారు. 2012 డిఎస్సీ ద్వారా జిల్లాలో 1847 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందన్నారు. మహిళా స్వయం బృందాలకు ఈ సంవత్సరం 377 కోట్ల రూణాలు ఇవ్వాలని లక్ష్యంకాగా, ఇప్పటి వరకు 146 కోట్లు రుణాలు ఇవ్వడం జరిగిందన్నారు. గ్రామీణ పొదుపు కుటుంబాల జీవనోపాధిని బలోపేతం చేసేందుకు జిల్లాలో పాలమూరు పాలవెల్లువ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివిధ పథకాల కింద దాదాపు రూ.3కోట్లు విలువ చేసే ఆస్తులను పంపిణీ చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బాలభవన్ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఎస్పీ నాగేంద్రకుమార్, ఇన్‌చార్జి జెసి భారతీలక్పతీనాయక్, డిఆర్‌వో రాంకిషన్, ఆర్‌డివో వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కుంటుపడిన గ్రామ పాలన
వస్తున్నా మీకోసంలో చంద్రబాబు
చిన్నచింతకుంట, నవంబర్ 1: అధికార కాంగ్రెస్ పాలనలో గ్రామ పరిపాలన వ్యవస్థ కుంటుపడిందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం మీకోసం వస్తున్నా పాద యాత్రలో భాగంగా మండల పరిధిలోని దమగ్నాపూర్, సీతారంపేంట్, నెల్లికొండి, లాల్‌కోట గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కుంటుపడటంతో పాటు అభివృద్ధి పథకాలు కాంగ్రెస్ కార్యకర్తలకే అప్పగిస్తున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించక పోవడంతో గ్రామాల అభివృద్ధికోసం రావాల్సిన 1200 కోట్ల నిధులు సద్వినియోగం కాకపోవడంతో వెనక్కి పంపిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు పండించిన పంటలకు చేసిన అప్పులకే సరిపోతున్నాయని, దీంతో అప్పులు చెల్లించలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువుల ధరలు విపరీతంగా పెరగడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, వ్యవసాయానికి 9 గంటల విద్యుత్‌ను అందించడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని, టిడిపి హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ఉన్నదని, జలయజ్ఞంపేరిట కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు దోచుకుంటున్నారని ఆరోపించారు. తన హయాంలో ప్రాజెక్టులను ప్రారంభిస్తే నేటి ప్రభుత్వం పూర్తి చేయలేదని ఆయన అన్నారు.
బాబుకు ఘన స్వాగతం
చిన్నచింతకుంట మండలంలో మీకోసం వస్తున్నా పాదయాత్ర చేపడుతున్న చంద్రబాబుకు గ్రామగ్రామాన టిడిపి జెండాలతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మహిళలు ఘనస్వాగతం పలికారు. ముందుగా దమగ్నాపురం చేరుకోగానే మహిళలు బొడ్డెమ్మలతో స్వాగతం పలికారు. గ్రామంలోని వీధుల్లో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. సీతారాంపేట గ్రామానికి రాగానే గిరిజన మహిళలు సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. జమ్మా మజీద్‌లో మైనార్టీలు చంద్రబాబుకు సమస్యలు తెలిపారు. అక్కడి నుండి నెల్లికొండికి చేరుకోగానే సగరులు చంద్రబాబుకు పూలమాలలతో సత్కరించి వినతిపత్రాన్ని అందజేశారు. స్పందించిన చంద్రబాబు సగరులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అక్కడి నుండి లాల్‌కోట వెళ్తుండగా ఉస్మానియా విద్యార్థులు వినతిపత్రాన్ని ఇస్తూ పాదయాత్రలో పాల్గొన్నారు. హైకోర్టు న్యాయవాధులు పాదయాత్రకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఎమ్మెల్యేలు దయాకర్ రావు, రేవంత్ రెడ్డి, రాములు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, సీతమ్మ, దయాకర్ రెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్, స్ధానిక నేతలు వాజీర్ బాబు, మోహన్ గౌడ్, ఉమామహేశ్వర్ రెడ్డి, మహదేవన్ గౌడ్, జనార్దన్, కరుణాకర్ రెడ్డి, ఆయా గ్రామాల ఫ్రజలు పాల్గొన్నారు.
‘తెలంగాణ కోసం ఐక్య ఉద్యమం’
కోస్గి, నవంబర్ 1: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఐక్య ఉద్యమం అనుసరించాల్సిన అవసరం ఉందని మండల టిటిజెఎసి నాయకులు కృష్ణగౌడ్, రాజేందర్‌రావులు పిలుపునిచ్చారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని వ్యతిరేకిస్తూ గురువారం టిటిజెఎసి ఆధ్వర్యంలో విద్రోహ దినం పాటించారు. అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఈ మేరకు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులు నల్ల చీరలు ధరించి జై తెలంగాణ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. శివాజీనగర్ చౌరస్తాలో విద్యార్థులచే మానవహారం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం శాంతియుత ఉద్యమం నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో టిటిజెఎసి నాయకులు కృష్ణగౌడ్, రాజేందర్‌రావు, మధుసూదన్‌రెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో 1200 మంది ఆత్మబలిదానాలు చేసుకున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏర్పాటు జరిగేంత వరకు ఉద్యమం కొనసాగుతుందని, తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను, ఆకాంక్షను ఇప్పటికైనా పాలకులు గుర్తించాలని, వెంటనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాగా టిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జి శాసం రామకృష్ణ తదితరులు శివాజీనగర్ చౌరస్తాలో నల్ల జెండా ఎగుర వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిటిజెఎసి నాయకులు రాంగోపాల్, జనార్దన్‌రెడ్డి, దివాకర్‌రెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు శ్యామ్, నీలప్ప, చెన్నప్ప, సలీం పాల్గొన్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి
* టిఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు జితేందర్ రెడ్డి
బాలానగర్, నవంబర్ 1: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని టిఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు జితేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డిలు డిమాండ్ చేశారు. గురువారం బాలానగర్‌లో నిర్వహించిన విలేఖ రుల సమావేశంలో వారు మాట్లా డుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి అవలంభి స్తున్నాయని ధ్వజమెత్తారు. మద్రాస్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలం గాణ ప్రాంతాన్ని ఆంధ్రరాష్ట్రంలో కలిపారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆవతరణ దినోత్సవమైన నవంబర్ 1వ తేదీని తెలంగాణ ప్రాంత ప్రజలు విద్రోహ దినంగా పాటించాలని వారు అన్నారు. విద్య, ఉద్యోగ తదితర రంగాలలో తెలంగాణ ప్రాంత నాయకులకు తీవ్ర అన్యాయం జరుగు తోందని అన్నారు. అంతేకాకుండా తెలంగాణ ప్రాంత వనరులను ఆంధ్ర నాయకులు దోచుకెళ్తున్నారని అన్నారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ నిరంతరం ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని గతంలో సమ్మె నిర్వహిస్తే తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తున్నామని తెలిపి, ఆంధ్రా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోందని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమించాలని వారు కోరారు. ఈ విలేఖరుల సమావేశంలో టిఆర్‌ఎస్ నాయకులు రాంగోపాల్, వాల్యా నాయక్, వెంకటాచారి, నర్సింహ్మ, మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
‘అడ్డుకాకపోతే తెలంగాణకు జైకొట్టు బాబూ’
నారాయణపేటటౌన్, నవంబర్ 1: తెలంగాణ రాష్ట్రానికి అడ్డుకాదని పదేపదే చెబుతున్న మీరు తెలంగాణలో పాదయాత్ర చేస్తూ తెలంగాణకు ఎందుకు జై కొట్టరని, చిత్తశుద్ధి ఉంటే తెలంగాణకు జై కొట్టాలని బిజెపి తెలంగాణ ఉద్యమ కమిటీ కన్వీనర్ నాగూరావు నామాజీ టిడిపి అధినేత చంద్రబాబును డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఒకవైపు రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేస్తూనే తెలంగాణలో పాదయాత్ర చేస్తూ తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రదర్శించకుండా తెలంగాణ ప్రజలను దగా చేస్తున్నారన్నారు. ప్రధానంగా పాలమూరు జిల్లా నుండి గత ఎన్నికల్లో తెలంగాణవాదంలో బరిలోకి దిగడంతో జిల్లా ప్రజలు ఆదరించి తొమ్మిది మంది ఎమ్మెల్యేలను గెలిపించారన్నారు. కాని తెలంగాణవాదంతో గెలిచిన టిడిపి ఎమ్మెల్యేలు ఆ వాగ్దానాన్ని విస్మరించారన్నారు. అధినేత వైఖరిని జీర్ణించుకోలేని నాగం జనార్దన్‌రెడ్డి పార్టీని వీడి తెలంగాణ ప్రజల మద్దతును చూరగొన్నారన్నారు. మిగిలిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ప్రజా విశ్వాసాన్ని విస్మరిస్తే పతనం తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో బిజెపి నాయకులు జాజాపూర్ సిద్రామప్ప, ప్రభాకర్‌వర్దన్, బోయ లక్ష్మణ్, సిద్ది వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.