బొబ్బిలి, నవంబర్ 6: గత నాలుగురోజులుగా కురిసిన భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య స్పష్టం చేశారు. మండల పరిధిలో ఉన్న కోమటిపల్లి, కలువరాయి, తదితర గ్రామాల్లో నష్టపోయిన వరి, పత్తి పంటలను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులు ఎటువంటి దిగులు చెందవల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే వ్యవసాయ, రెవెన్యూ అధికారులు నష్టపోయిన పంటల వివరాలను నివేదికల ద్వారా అందించారన్నారు. వ్యవసాయశాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ లీలావతిని పంట నష్టం వివరాలను అడిగితెలుసుకున్నారు. బొబ్బిలి మండలంలో దాదాపు వెయ్యి ఎకరాల వరకు వరి పంట, 400 ఎకరాల్లో పత్తి, 300 ఎకరాల్లోను చెరకు నష్టం వాటిల్లినట్లు ఆమె వివరించారు గత ఏడాది నష్టపరిహారాన్ని ఇంతవరకు అధికారులు అందించలేదని కలెక్టర్‌కు కొంతమంది రైతులు ఫిర్యాదు చేశారు. కోమటిపల్లి గ్రామంలో దాదాపు 60మంది రైతులకు 3లక్షల రూపాయల నష్టపరిహారం అందాల్సి ఉందన్నారు. ఆర్డీవో వెంకటరావు, వ్యవసాయశాఖ ఏ.డి. భారతి, తహశీల్దారు కృష్ణారావులతోపాటు తదితరులు పాల్గొన్నారు.
పెళ్ళి మండపం ఎక్కాల్సిన వరుడిని కాటేసిన తుపాను
శృంగవరపుకోట, నవంబర్ 6 : మరో రెండు రోజుల్లో పెళ్లికోడుకుగా పెళ్లి మండపాన్ని ఎక్కాల్సిన వరుడు విగత జీవుడై పాడేక్కాడు. ఈ మండలంలో బొడ్డవర గ్రామానికి చెందిన డిఆర్ నారాయణరాజు (32)ను నీలం తుఫాను పొట్టన పెట్టుకుంది. హైద్రబాద్ నిజాం సుఘర్స్‌లో పని చేస్తున్న నారాయణరాజుకు వివాహం నిశ్చయమైంది. స్వగ్రామానికి వచ్చేందుకు రైలులో బయలు దేరిన నారాయణరాజు తుఫాను కారణంగా రవాణావ్యవస్థ ధ్వంసం కావడంతో బస్సులో స్వగ్రామానికి బయలుదేరాడు. అనుకోకుండా వరద ఉదృతికి నారాయణరాజు బలయ్యాడు. నారాయణరాజు ఆచూకీ కోసం గత 2 రోజులుగా ఆయన కుటుంబీకులు గాలిస్తున్నప్పటికీ తెలియరాలేదు. చివరికి ఎస్. రాయవరం మండలం సమీపంలో నారాయణరాజు మృతదేహాన్ని కనుకోన్న పోలీసులు లభించిన ఆధారాల మేరకు వారి బందువులకు సమాచారం అందిచారు. దీంతో నారాయణరాజు కుటుంబం కన్నీటి పర్యంతమైంది. పెళ్లి కుమారునిగా చూడాల్సిన తమకుమారుడిని విగతజీవునిగా చూసినందుకు ఆకుటుంబీకులు పడిన బాదవర్ణనాతీతం. దీంతో యావత్తు బొడ్డవర గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
14 నుండి బాలల చలన చిత్రాల ప్రదర్శన
విజయనగరం , నవంబర్ 6: నెహ్రు జయంతిన పురష్కరించుకుని నవంబర్ 14 నుండి జిల్లాలో బాలల చిత్రాలను ప్రదర్శించనున్నట్లు జాయింట్ కలెక్టర్ పిఎ శోభ తెలిపారు. రెండు డివిజన్లలో మొత్తం 17 ధియేటర్లతో 12 చలన చిత్రాలను పూర్తిఉచితంగా ప్రదర్శించడం జరుగుతుందన్నారు. మంగళవారం తన ఛాంబర్‌లో సంబందిత అధికారులతో జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుండి 11 వరకు చిత్రాల ప్రదర్శన ఉంటుందని, ఈ నెల 14 నుండి 16 వరకు విజయనగరం డివిజన్లో, 19 నుండి 21వరకూ పార్వతీపురం డివిజన్‌లో చిత్రాలను ప్రదర్శిస్తామన్నారు,