విజయనగరం , నవంబర్ 6: జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల మంచినీటి ఊటబావుల్లోకి వర్షం నీరు చేరినందున మంచినీరు కలుషితమైందని, అందువల్ల సురక్షితమైన మంచినీటిని వాటర్‌ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ ఎస్.గోవిందస్వామి తెలిపారు. పట్టణంలో 38 వార్డుల్లో 14 ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నామన్నారు. ప్రతి వార్డులో రెండుముఖ్యమైన ప్రాంతాల్లో మంచినీటిని సరఫరా చేస్తున్నామన్నారు. నెల్లిమర్ల ఊటబావుల నుంచి మంచినీరు రావడం వల్ల కొత్తపేట రక్షిత మంచినీటిపథకం పరిధిలో ఉన్న ప్రాంతాలకు రోజు విడిచి రోజు మంచినీటిని సరఫరా చేస్తామన్నారు. అయితే తాటిపూడి జలాశయం నుంచి గోస్తనీనదిలోకి నీటిని విడుదల చేయడం వల్ల ముషిడిపల్లి ఊటబావుల్లో మంచినీరు కలుషితమయ్యే అవకాశం ఉందన్నారు. అందువల్ల కంటోనె్మంట్ రక్షిత మంచినీటిపథకం పరిధిలో ఉన్న ప్రజలకు మరోరెండురోజుల పాటు వాటర్‌ట్యాంక్‌ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తామన్నారు. తాటిపూడి జలాశయం గేట్లు మూసివేసిన 24 గంటల్లో ముషిడిపల్లి ఊటబావుల ద్వారా సురక్షితమైన మంచినీటిని సరఫరా చేస్తామన్నారు.
‘పంట రుణ పరపతి పెంపునకు డిసిటిసి నిర్ణయం’
విజయనగరం , నవంబర్ 6: జిల్లాలో ఈ ఏడాది పంటరుణాల పరపతిని పెంచాలని జిల్లాస్థాయి సాంకేతిక కమిటీ (డిసిటిసి) సమావేశం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం ఇక్కడ డిసిసిబి ప్రధాన కార్యాలయంలో కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డిసిసిబి వైస్‌చైర్మన్ వంగపండు నారాయణప్పలనాయుడు మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయమదుపులు పెరిగినందున రైతులకు ఇచ్చే పంటరుణాల పరపతిని కూడా పెంచాలని కోరారు. ఖరీఫ్, రబీసీజన్‌లకు సంబంధించి పంటరుణాల పరపతిని పెంచడం ద్వారా రైతులను ఆదుకున్నట్లవుతుందన్నారు. డిసిఎంఎస్ చైర్మన్ కె.వి.సూర్యనారాయణరావుమాట్లాడుతూ జిల్లాలో రైతులను ఆదుకునేందుకు డిసిసిబి ద్వారా విరివిరిగా రుణాలను అందిస్తున్నారని తెలిపారు. గ్రామస్థాయిలో రైతులందరికీ రుణాలు అందేటట్లు చూడాలన్నారు. డిసిసిబి సిఇఒ వంగపండు శివశంకర ప్రసాద్ మాట్లాడుతూ పెంచిన రుణపరపతి ప్రకారం ఎకరానికి వరికి 21వేల రూపాయలు, చెరకుపంటకు 41వేలు, అరటికి 35వేలు, మిరపపంటకు 45వేలు, కూరగాయలపంటలకు 23వేల రూపాయలవరకు రుణాలు అందిస్తామన్నారు. అదేవిధంగా ఈ ఏడాది కొత్తగా బొప్పాయి, బంతితోటల పెంపకానికి కూడా రుణాలు అందించాలని నిర్ణయించామన్నారు. జిల్లా సహకార అధికారి డి.నారాయణరావు, నాబార్డు జిల్లా అభివృద్ధి అధికారి ఇ.శ్రీనివాస్, లీడ్‌బ్యాంకు జిల్లా మేనేజర్ రవీంద్రరెడ్డి, డిసిసిబి డిప్యూటీ జనరల్‌మేనేజర్ టి.వెంకటేశ్వరరావు, పాల్గొన్నారు.
తేరుకుంటున్న జిల్లా
విజయనగరం, నవంబర్ 6 : నీలం తుఫాను ప్రభావం నుండి జిల్లా ఇపుడిప్పుడే తేరుకుంటుంది. రైతు వెన్నువిరిచిన నీలం తుఫాను కారణంగా జిల్లాలో సుమారు 50 వేల ఎకరాలకు పైగా పంటలు నీటి పాలైయ్యాయి. 5 రోజులపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు మంగళవారం తగ్గుముఖం పట్టడంతో రైతాంగం ప్రజానికం, అధికార యంత్రాంగం ఊపిరిపీల్చకుంటుంది. వద్దనుకుంటూనే వేసిన వరి తుఫాను కారంణగా నీట మునిగింది. దాదాపు 40 వేల ఎకరాల్లో వరి, 2 వేల ఎకరాల్లో పత్తి, వెయ్యి ఎకరాల్లో మొక్కజొన్న, 2 వేల ఎకరాల్లో ఇతర పంటలు నీట మునిగాయి. ఇక ఎడతెరిపిలేకుండా విస్తారంగా కురిసిన వర్షాలకు జిల్లా వ్యాప్తంగా పలు ప్రధాన రహదాలతోపాటు లింక్‌రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. నీలం తుపాను కారంణగా జిల్లా రహాదారులు, భవనాల శాఖకు అత్యధికగా నష్టం వాటిల్లింది. వర్షాలకు దెబ్బతిన్న రహరాలను తిరిగి పురుద్ధరించేందుకు దాదాపు 100 కోట్లరూపాయలు అవసరమవుతాయని ప్రాధనిక అంచనా. ఇక నీటి పారుదల శాఖకు సంబందించి నష్టంకూడా భారీగా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. చెరువులకు గండ్లు, తదితరు అంశాలను పరిశీలించిన నీటి పారుదల శాఖ దాదాపు 15 కోట్ల రూపాయల మేర నష్టం జరిగిఉంటుందని ప్రాధమికంగా అంచనావేసినప్పటికీ మరింత పెరిగె అవకాశం కనిపిస్తోంది. జిల్లా యంత్రాంగం ఇప్పుడిప్పుడే మండలాల్లో పర్యటించి తుఫాను నష్టాన్ని అంచనా వేసే పనిలోనిమగ్నమైంది. పంట, ఆస్థినష్టం వివరాలను గ్రామపెద్దలు, గ్రామకమిటీలు నెత్రుత్వంలో చేపట్టాలని జిల్లా మంత్రి బొత్స సత్యన్నారాయణ ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. మొత్తం మీద నీలం తుఫాను ప్రభావం నుండి జిల్లా ప్రజానికం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది.
గజపతినగరం: తుఫాను వలన కురిసిన భారీ వర్షాలకు ఆహార పంటలుతో సహా వాణిజ్య పంటలకు తీవ్ర నష్టం కలిగింది. వర్షాలు తగ్గు ముఖం పట్టినందున పంట నష్టం ఎంత మేరకు జరిగింది అధికారులు గ్రామాలలో పర్యటించి వివరాలు సేకరిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఇంకా పంట నీట మునిగే ఉన్నది. ఖరీఫ్‌లో 3,650 హెక్టార్లలో వరిపంట సాగు చేయగా ఈ దురుగాలులతో కూడిన వర్షం కురిసినందున 450 ఎకరాలలోని వరిపంట నేలమట్టమైపాడైంది. కౌలుకు అలాగే స్వంత భూములలో సాగు చేసిన వరి పంటతో సహా వాణిజ్య పంటలు పత్తి, మొక్కజొన్న, అపరాల పంటలకు తీవ్ర నష్టం సంభవించింది. పంటన నష్టం వివరాలు సేకరించిన తరువాత నివేదిక ద్వారా జిల్లా అధికారులకు అందజేయనున్నట్లు మండల వ్యవసాయాధికారి మోపాడ ఉమామహేశ్వరనాయుడు తెలిపారు. ఈ మేరకు వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు.
తుపాను నష్టం రూ. 150 కోట్లు: కలెక్టర్
బొబ్బిలి, నవంబర్ 6: నీలం తుఫాన్ తాకిడికి జిల్లాలో 150కోట్ల రూపాయల ఆస్తినష్టం సంభవించినట్లు జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య తెలిపారు. స్థానిక ఆర్.అండ్.బి.బంగ్లాలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మేరకు జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురవడంతో అపారనష్టం సంభవించిందన్నారు. నష్టాన్ని అంచనా వేసేందుకు వి. ఆర్. ఓ., ఏ. ఇ. ఓ.లు ఆదర్శ రైతులతో కమిటీని వేసినట్లు తెలిపారు. మండల స్థాయిలో వ్యవసాయశాఖ అధికారులు, తహశీల్దారు సర్వే చేసి పూర్తిస్థాయిలో నష్టపరిహారాన్ని అంచనా వేయనున్నట్లు తెలిపారు. ఇంతవరకు తనకందిన సమాచారం మేరకు జిల్లాలో నాలుగు కల్వర్టులతోపాటు ఆర్.అండ్.బి. రోడ్లు మరమ్మతులు కావడంతో 82కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. వీటిని తాత్కాలికంగా మరమ్మతులు చేయించేందుకు 9కోట్లు అవుతుందన్నారు. జిల్లాలో వివిధ ప్రాజెక్టుల కింద ఉన్న చెరువులు, కాలువల గండ్లుకు 20కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. తాత్కాలిక పనులకు 4కోట్ల 50లక్షల రూపాయలు అవుతుందన్నారు. మీడియం ఇరిగేషన్ పరిధిలో 107 ప్రాంతాల్లో గండ్లు పడ్డాయని, వీటిని తాత్కాలికంగా మరమ్మతులు చేయించేందుకు 2కోట్ల 20లక్షలు అవుతుందన్నారు.శాశ్వత పనులకు 10కోట్లు వ్యయం అవుతుందన్నారు. మైనర్ ఇరిగేషన్ పరిధిలో 391 పనులకు 12కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. తాత్కాలిక పనులకు 2కోట్ల 20లక్షల రూపాయలు అవుతుందన్నారు. బొబ్బిలి, పార్వతీపురం, విజయనగరం, సాలూరు మున్సిపాల్టీల పరిధిలో తుఫాన్ కారణంగా ఏర్పడిన పనులకు 5కోట్ల రూపాయలు వ్యయం అవుతుందన్నారు. ఇందులో 10కిలోమీటర్ల రోడ్డు, మూడున్నర కిలోమీటరు కాలువ దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. 226 విద్యుత్ స్తంభాలు మరమ్మతులకు గురయ్యాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 506 ఇళ్లు మరమ్మతులకు గురైనట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా 365 ఇళ్లు పాక్షికంగాను, 103 ఇళ్లు దెబ్బతినగా 38 ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయని తమకు సమాచారం అందిందన్నారు. దాదాపు 15వేల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు గుర్తించారన్నారు. ఈ మేరకు నష్టపరిహారానికి సంబంధించిన వివరాలను 19,20,21తేదీలలోపు తాము వేసిన కమిటీలు పూర్తిస్థాయి నివేదికలు అందించాల్సి ఉందన్నారు.