విజయనగరం , నవంబర్ 6: ఉత్తరాంధ్ర ప్రజల కల్పవల్లి చల్లని తల్లి పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం మంగళవారం కన్నుల పండువగా జరిగింది. వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాన్ని తిలకింఛి పులకించారు. మంగళవారం సాయంత్రం వనంగుడి నుండి వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా పల్లకీలో పెద్దచెరువు ఒడ్డుకు అమ్మవారిని తీసుకువచ్చారు. అక్కడ విద్యుత్ దిపాలతో దివ్యంగా హంస ఆకారంలో అలంకరించిన తెప్పలో అమ్మవారు తన పుట్టినిల్లు చెరువులో తక్కువ దూరంలో మూడు పర్యాయాలు జలవిహారం చేసారు.తెప్పలో దేవాదాయ శాఖ డి.సి. భ్రమరాంబ, ఆలయప్రధాన పూజారి తాళ్ళపూడి భాస్కరరావు, వేద పండితులు శంబర శంకరం, అప్పన్నబాబు సన్నాయి బృందం, ఆలయ, అగ్నిమాపక సిబ్బంది, పాల్గొన్నారు. డిఎస్పీ ఇషాక్ అహ్మద్ ఆద్యర్యంలో గట్టిపోలీసు బందోబస్తు ఏర్పాటు చేసారు. ఉత్సవాన్ని ఆర్డీఓ రాజకుమారి, ఆలయ కార్యనిర్వహణాధికారి వి. శ్యామలాదేవి, మున్సిపల్ కమీషనర్ గోవింద స్వామి తదితరులు పాల్గొన్నారు. చివరగా డి.సి.భ్రమరాంబ మాట్లాడుతూ శ్రీపైడిమాంబ మహిమ కారణంగా వాతావరణ అనుకూలించి ఈ ఉత్సవం జయప్రధంగా జరిగిందన్నారు.ఈ నెల 20న చదురుగుడి వద్ద అమ్మవారి ఉయ్యాల కంబాల ఉత్సవం జరుగుతుందని ఆమె తెలిపారు.
‘వచ్చే నెలాఖరుకు కంప్యూటరీకరణ పూర్తి’
విజయనగరం , నవంబర్ 6: రాష్ట్రంలోని అన్ని జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో వచ్చేనెలాఖరునాటికి కంప్యూటీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు (ఆప్కాబ్) చీఫ్ జనరల్‌మేనేజర్ వి.గిరిధర్ తెలిపారు. మంగళవారం విలేఖరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 580 డిసిసిబి బ్రాంచ్‌లు ఉన్నాయని, ఇందులో 200 బ్రాంచ్‌ల్లో ఇప్పటికే కంప్యూటీకరణ ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. మిగతా బ్రాంచ్‌ల్లో డిసెంబర్‌నాటికి కంప్యూటీకరణ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.
‘ఎర్న్రన మృతి టీడీపీకి తీరని లోటు’
గంట్యాడ, నవంబర్ 6 : కేంద్ర మాజీ మంత్రి, దివంగత కింజరాపు ఎర్రంనాయుడు ఆకస్మికమృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటని మాజీ మంత్రి పడాల అరుణ అన్నారు. మండల తెలుగు దేశం పార్టీ అధ్యర్యంలో మంగళవారం గంట్యాడలో సంతాప సభ జరిగింది. ఈ సందర్బంగా ఎర్రంనాయుడు చిత్ర పటం వద్ద మాజీ మంత్రి అరుణ తోపాటు పార్టీ నాయుకులు ఘన నివాళులుర్పించారు. కింజరాపు ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు వౌనం పాటించారు. అనంతరం కార్యకర్తలనుద్దేశించి పడాల అరుణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం నమ్ముకున్న కార్యకర్తల కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి ఎర్రంనాయడు అని కోనియాడారు. కార్యక్రమంలో డా. కె.ఎ నాయుడు, మాజీ ఎంపిపి కొండలరావు మాజీ జెడ్పిటిసి చింతల అప్పారావు మండల దేశం పార్టీ అధ్యక్షుడు కె రమేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.