విశాఖపట్నం, నవంబర్ 6: వరదలతో తీవ్రంగా నష్టపోయిన విశాఖ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన మొక్కుబడిగా సాగటం బాధితుల్లో తీవ్ర అసంతృప్తి మిగిల్చింది. జిల్లాలో ముఖ్యంగా పాయకరావుపేట, ఎస్.రాయవరం, చోడవరం, అనకాపల్లి, మునగపాక తదితర మండలాల్లోని అనేక ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అనకాపల్లిలోని శారదా నదికి పెద్ద ఎత్తున వరదలు రావడంతో పట్టణ ప్రజలంతా భయభ్రాంతులయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటి వరకూ 29 మంది మరణించగా, ఒక్క విశాఖ జిల్లాలోనే 19 మందికి పైగా మరణించారు. ఇంత జరిగినా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి మాత్రం జిల్లాలోని బాధితులను పరామర్శించకపోవడం దురదృష్టకరం. ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించేందుకు ఆయన హైదరాబాద్ నుంచి రెండు గంటల ఆలస్యంగా బయల్దేరారు. కృష్ణా, ఖమ్మం, ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించి అధికారులతో సమీక్షలు నిర్వహించి, బాధితులను పరామర్శించారు. కానీ విశాఖ జిల్లాకు వచ్చేప్పటికీ సమయాభావం వలన వెనుదిరిగిపోయారు. తుని నుంచి రోడ్డు మార్గంలో వస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డి కాన్వాయ్‌ను ధర్మవరం దగ్గర బాధిత రైతులు ముఖ్యమంత్రి కోసం వేచి ఉన్నారు. సాక్షాత్తూ మంత్రి బాలరాజే వారిని అక్కడికి చేర్చి, ముఖ్యమంత్రితో మాట్లాడించే ప్రయత్నం చేశారు. సిఎం వచ్చే సమయానికి అక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ముఖ్యమంత్రి అసహనంగానే బస్సులో నుంచి దిగారు. రైతులను పరామర్శించలేదు. చీకట్లోనే వరహా నదిని చూసేసి, తిరిగి బస్సు ఎక్కేశారు. ఎయిర్‌పోర్టులో ముఖ్యమంత్రి కోసం రాకకోసం అధికారులు గంటల తరబడి ఎదురు చూశారు. కానీ వారితో కొద్ది సేపు మాట్లాడ్డానికి కూడా ముఖ్యమంత్రి అంగీకరించలేదు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించి వెళ్లిపోయారు.ఎయిర్‌పోర్టుకు వచ్చిన కిరణ్‌కుమార్ రెడ్డి విలేఖరులతో మాట్లాడేందుకు కూడా అసహనం వ్యక్తం చేశారు. మొక్కుబడిగా మాట్లాడి వెళ్లిపోయారు. అయితే తుని నుంచి విశాఖ వచ్చినప్పుడే, బస్సులోనే అధికారులు, ఎమ్మెల్యేలతో ఇవన్నీ మాట్లాడారని చెపుతున్నారు. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న బస్సులో ఎమ్మెల్యేలు అవంతి శ్రీనివాసరావు, కన్నబాబు రాజు, ఇద్దరు మంత్రులు మాత్రమే ఉన్నారు. నగరానికి చెందిన ఎమ్మెల్యేలంతా ఎయిర్‌పోర్టులోనే ఉండిపోయారు. ముఖ్యమంత్రి తీరుపట్ల ప్రజా ప్రతినిధులు, ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
మంత్రుల సమీక్షలు
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు గంటా శ్రీనివాసరావు, బాలరాజు విడివిడిగా మంగళవారం సమీక్షలు నిర్వహించారు. రోడ్లు, గండ్లు పూడ్చేందుకు వెంటనే నిధులు విడుదల చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. నిధుల కొరత లేదని గంటా చెపుతున్నారు. మరోపక్క మంత్రి బాలరాజు కూడా వరద నష్టాలపై సమీక్ష జరిపారు. ఏజెన్సీకి బయల్దేరి వెళతానని చెప్పుకొచ్చారు.
* బస్సులోనే సమీక్ష * సర్వత్రా నిరసన
english title:
cm impatience
Date:
Wednesday, November 7, 2012