విశాఖపట్నం, నవంబర్ 6: నగర అభివృద్ధి ప్రణాళిక కోసం జరుగుతున్న కసరత్తు అంతా వాస్తవ దూరమని తేలిపోతోంది. నగరాభివృద్ధికి కావల్సిన ప్రణాళికలను సిద్ధం చేసేందుకు ప్రభుత్వం నియమించిన కమిటీలు ఇప్పటికే రెండు పర్యాయాలు నగరానికి వచ్చాయి. వారు నిర్వహించిన రెండు సమావేశాలూ స్టార్ హోట్లళ్లలోనే జరిగాయి. బుధవారం కూడా ఈ కమిటీ నగరానికి వస్తోంది. ఈ సమావేశాన్ని కూడా స్టార్ హోటల్‌లో నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
నగరంలో ఎన్ని మురికివాడలు, మురికివాడల కన్నా కాస్తంత మెరుగైన ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి? అలాగే బాగా అభివృద్ధి చెందిన ప్రదేశాలు ఎన్ని ఉన్నాయి? ఆయా ప్రాంతాల్లో ప్రజల జీవన శైలి ఎలా ఉంది? నగర అభివృద్ధికి భవిష్యత్‌లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రాజెక్ట్‌లు ఏంటి? ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్ట్‌లు ఏంటి? నగరాభివృద్ధికి జివిఎంసి చేసింది ఎంత? చేయాల్సింది ఏంటి? అన్న అనేక అంశాలను కమిటీ క్షేత్రస్థాయికి వెళ్లి సమీక్షించాల్సిన అవసరం ఉంది. కానీ ఈ కమిటీ ఎసి గదుల్లోనే కూర్చుని అధికారులు ఇచ్చిన నివేదికలను, పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లను చూసి వెళ్లిపోతోంది. ఇలా చేయడం వలన నగరాభివృద్ధికి కచ్చితమైన ప్రణాళిక సిద్ధం కావడం లేదన్నది అందరి అభిప్రాయం. గత రెండు సమావేశాలూ స్టార్ హోటల్స్‌లో నిర్వహించడం పట్ల ప్రజా సంఘాలు అక్కడే తీవ్ర అభ్యంతరం తెలుపుతూ నిరసనలు చేపట్టాయి. కానీ కమిటీ తీరులో ఏమాత్రం మార్పు లేదు. దీంతో బుధవారం కూడా బీచ్ రోడ్డులోని స్టార్ హోటల్‌లో జరగనున్న సమావేశానికి ప్రజా సంఘాలు నిరసన తెలియచేయడానికి సమాయత్తం అవుతున్నాయి.
* క్షేత్ర పరిశీలనకు వెళ్లని కమిటీ
english title:
star hotel
Date:
Wednesday, November 7, 2012