విశాఖపట్నం, నవంబర్ 6: తుపాను ప్రభావం రైళ్ళ రాకపోకలపై ఇంకా కొనసాగుతోంది. హైదరాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్ రథ్ మంగళవారం రద్దయ్యింది. ఇది హైదరాబాద్‌లో బయలుదేరకపోవడంతో బుధవారం ఉదయం ఇక్కడకు రాదని సంబంధితాధికారి ఒకరు తెలిపారు. విజయవాడ-హైదరాబాద్‌ల మధ్య పలుచోట్ల రైల్వేట్రాక్ దెబ్బతినడం, పట్టాలపై మీదుగా నీటి ప్రవాహం వంటి కారణాలతో దీనిని రద్దు చేసినట్టు తెలిసింది. హౌరా-హైదరాబాద్ (18645) ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను బుధవారం రద్దు చేశారు. ఇది హౌరాలో బుధవారం బయలుదేరదు. అలాగే కిరండూల్ పాసింజర్‌ను మంగళవారం రద్దు చేశారు. ఇది గత నాలుగు రోజులుగా నిలిచిపోగా, ఈ మార్గంలో రైల్వేట్రాక్‌పై కొండ చరియలు విరిగిపడటం, మరికొన్ని చోట్ల ట్రాక్ దెబ్బతిన్న పరిస్థితులు దీనికి బ్రేక్ వేసాయి.
రీ షెడ్యూల్ రైళ్ళు
చెన్నై-చంత్రగాఛీ (08042) చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ చెన్నైలో ఉదయం 11 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, ఇది మంగళవారం మధ్యాహ్నాం 3 గంటలకు బయలుదేరింది. అలాగే చెన్నై-హౌరా (12842) కోరమండల్ ఎక్స్‌ప్రెస్ చెన్నైలో మంగళవారం ఉదయం 8.45 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, ఇది మధ్నాహ్నాం 3.30 గంటలకు బయలుదేరింది. హౌరా-సికింద్రాబాద్ (12703) ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ మంగళవారం ఉదయం 7.25 గంటలకు హౌరాలో బయలుదేరాల్సి ఉండగా, ఇది రీ షెడ్యూల్ కావడంతో సాయంత్రం 4.10గంటలకు బయలుదేరింది. వీటితోపాటు అలుప్పుజా (13352) ఎక్స్‌ప్రెస్ మంగళవారం ఉదయం ఆరు గంటలకు బయలుదేరాల్సి ఉండగా, రాత్రి 11 గంటలకు బయలుదేరనుంది. అలాగే విశాఖ-కిరండూల్ మధ్య నడిచే పలు గూడ్స్‌లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోజుకీ 20 గూడ్స్ వరకే నడిచే ఈ మార్గంలో తుపానుతో ఏర్పడిన పరిస్థితుల వలన ఈ సంఖ్య సగానికి పడిపోయింది. ఇనుప ఖనిజం, బొగ్గు ప్రధానంగా గూడ్స్‌ల ద్వారా రవాణా అవుతుంది. ఎన్టీపీసి, స్టీల్‌ప్లాంట్‌లకు పలుచోట్ల నుంచి బొగ్గును ఇక్కడు రప్పించాలన్నా, ఇక్కడ నుంచి ఇనుప ఖనిజం ఇతర దేశాలకు ఎగుమతి చేయాలన్నా గూడ్స్‌లు ప్రతిరోజు నడవాల్సిందే. విశాఖ-కిరండూల్ మధ్యనే వీటన్నింటినీ నిర్వహించాల్సి ఉండగా, మావోయిస్టుల ప్రభావం, వర్షాకాలంలో నిత్యం ట్రాక్‌పై పడే కొండ చరియలు వంటి కారణాలతో గూడ్స్‌ల నిర్వహణ సాధ్యపడటంలేదు. పొరపాటున ట్రాక్ దెబ్బతింటే విశాఖ నుంచి రిలీఫ్ వ్యాన్, దాదాపు 50 మంది అధికారులు, సిబ్బంది తరలివెళ్ళాల్సిందే. ఆ తరువాత రేయింబవళ్ళు పునరుద్దరణ పనులు చేపట్టిన కనీసం రెండు నుంచి మూడు రోజులు పడుతుంది. అనేక రకాలుగా గూడ్స్‌లు నిలిచిపోతున్న పరిస్థితులు వాల్తేరు డివిజన్ ఆదాయానికి గండి కొడుతున్నాయి. అసలే ఈ మార్గంలో నడుస్తున్న గూడ్స్ రవాణా తగ్గిపోతుంటే దీనికి మూడు రోజుల తుపాను శాపమైంది. గూడ్స్‌ల రవాణా నిలిచిపోవడంతో దాదాపు 20 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. పాసింజర్ నాలుగు రోజులుగా నడవకపోడవంతో లక్షల్లోనే నష్టం తప్పలేదు. భారతీయ రైల్వే ఆర్థిక వెన్నుముకగా నిలిచిన వాల్తేరు డివిజన్‌కు సరుకు రవాణా ద్వారానే అధిక శాతం ఆదాయం వస్తుంది. అటువంటిది ఈ మార్గంలో తరచూ ఎదురుతున్న నష్టాలతో డివిజన్ అధికారులు ఆందోళన చెందుతున్నారు.
* ఇదే బాటలో కిరండూల్ * మరికొన్ని రైళ్ళు రీ షెడ్యూల్ * ఇంకొన్ని గంటల ఆలస్యం * నిలిచిన గూడ్స్‌లతో భారీ నష్టం
english title:
garib rath
Date:
Wednesday, November 7, 2012