విశాఖపట్నం, నవంబర్ 6: నీలం తుపాను వల్ల జిల్లాలో ఏజేన్సీ ప్రాంతంలో దెబ్బతిన్న గృహాలకు తక్షణమే నష్టపరిహారాన్ని చెల్లించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖామంత్రి పసుపులేటి బాలరాజు అధికారులను ఆదేశించారు. మంగళవారం బీచ్‌రోడ్డులోనున్న తమ నివాసంలో ఐటిడిఏ, పిఓ కె.శ్రీకాంత్ ప్రభాకర్, పాడేరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం.గణపతితో మంత్రి సమావేశమై తుపాను పునరావాస కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడేరు డివిజన్‌లో 11 మండలాల్లో ఇంతవరకు 239 గృహాలు పూర్తిగాను, 1542 గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నట్టు గుర్తించినందున, బాధితులందరికీ వెంటనే నష్టపరిహారాన్ని చెల్లించాలన్నారు. ఈ ఏడాది ఆగస్టులో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను (జిఓ సంఖ్య6 3.8.2012)న అనుసరించి నష్టపరిహారం చెల్లించాలన్నారు. పూర్తిగా దెబ్బతిన్న పక్కాగృహానికి రూ. 35 వేలు, కచ్చా గృహానికి రూ. 15 వేలు, తీవ్రంగా దెబ్బతిన్న పక్కాగృహానికి రూ.6,300లు, కచ్చా గృహానికి రూ. 3,200లు వంతున చెల్లించాలన్నారు. అలాగే పాక్షికంగా కనీసం 15 శాతం మేర దెబ్బతిన్న పక్కా/కచ్చా గృహానికి రూ. 1900లు గుడిసెకు రూ. 2500లు గృహాలతో కలిసి ఉన్న పశువుల పాకకు రూ. 1250లు, వంతున నష్టపరిహారాన్ని చెల్లించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అలాగే 8వేల 302 హెక్టార్లలో సాగులోనున్న వరి, రాగి, మొక్కజొన్న, పొగాకు, సాములు తదితర పంటలు దెబ్బతిన్నట్టుగా గుర్తించినందున, వెంటనే పంట నష్టపరిహారాన్ని అంచనా వేసి ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదించాలన్నారు. భారీ వర్షాల వల్ల రోడ్లు, కల్వర్టులు ఏ మేరకు దెబ్బతిన్నాయని మంత్రి ఆరా తీశారు. గిరిజన సంక్షేమం, పంచాయతీరాజ్,రోడ్డు, భవనాల శాఖలకు సంబంధించిన మొత్తం 66 రోడ్లు, 28 కల్వర్టులు దెబ్బతిన్నట్టు గుర్తించామని, వీటి మరమ్మతులకు రూ. 22 కోట్ల 58 లక్షలు అవసరం ఉంటుందని ఐటిడిఏ పిఓ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వీటికి సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే ప్రభుత్వానికి నివేదిస్తే సత్వరమే నిధులు మంజూరు అయ్యేలా చూస్తానని మంత్రి తెలిపారు. బుధవారం ఏజేన్సీ ప్రాంతంలో పలు మండలాల్లో తాను విస్తృతంగా పర్యటిస్తూ వరద బాధితులకు ఏ మేర పునరావాస, సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో పరిశీలిస్తానన్నారు. ఐటిడిఏ పి.ఓ శ్రీకాంత్ ప్రభాకర్, పాడేరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం.గణపతి, జివిఎంసి మాజీ డిప్యూటీ మేయర్ దొరబాబు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
* అధికారులకు రాష్ట్ర మంత్రి బాలరాజు
english title:
bala raju
Date:
Wednesday, November 7, 2012