విశాఖపట్నం, నవంబర్ 6: రెండు రోజులపాటు ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. పలు మండలాల్లో అంధకారం అలుముకుంది. విద్యుత్ సబ్‌స్టేషన్లు నీట మునిగాయి. ట్రాన్స్‌పార్మర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. అనేకం విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. అయితే నిలకడగా కురిసిన వర్షంతో భారీ నష్టం నుంచి సంస్థ బయటపడగలిగింది. ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) పరిధిలోకి వచ్చే ఐదు జిల్లాలకు సంబంధించి రూ. 3.86 కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించింది. ఎక్కువుగా ఉభయ గోదావరి జిల్లాలో పలు మండలాలు, గ్రామాలకు చెందిన విద్యుత్ సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు దెబ్బతిన్నాయి. దీంతో జిల్లాల వారీగా అధికారులు, సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు నిర్వహిస్తున్నారు. దీంతో ఇప్పటికే 60 నుంచి 70 శాతం మేర విద్యుత్ వ్యవస్థ మెరుగుపడింది. మిగిలిన దానిని మరో రెండు రోజుల్లో అందుబాటులోకి తీసుకువచ్చే క్రమంలో చర్యలు తీసుకుంటున్నారు. రేయింబవళ్ళు అని తేడా లేకుండా పునరుద్ధరణ పనులు కొనసాగిస్తున్నారు. సంస్థ పరిధిలోకి వచ్చే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 13 విద్యుత్ సబ్‌స్టేషన్ల పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటిలో 12 సబ్‌స్టేషన్లను ఇంతవరకు పునురుద్దరించగలిగారు. మరొకటి త్వరలో అందుబాటులోకి రానుంది. జిల్లాలో చూచుకొండ విద్యుత్ సబ్‌స్టేషన్ పూర్తిగా నీట మునగడంతో దీనిని అందుబాటులోకి తీసుకువచ్చేసరికి మరో రెండు రోజులు పట్టవచ్చని సంబంధితాధికారులు చెబుతున్నారు. 33కెవి విద్యుత్ ఫీడర్లు 41 వరకు దెబ్బతినగా కేవలం ఒకటి మాత్రమే పునరుద్ధరించాల్సి ఉంది. 33కెవి విద్యుత్ స్థంభాలు 42 నేలకూలగా, ఇందులో 24 స్థంబాలను పునరుద్ధరించగలిగారు. అలాగే 11కెవి ఫీడర్లు 494 వరకు నీటి మునిగి దెబ్బతినగా, వీటిలో ఇంచుమించుగా అన్నింటినీ అందుబాటులోకి తీసుకురాగా, మరో నాలుగింటికి మరమ్మతులు నిర్వహిస్తున్నారు. 11కెవి విద్యుత్ స్థంభాలు 851 పడిపోగా, ఇందులో 365 స్థంబాలను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. 11 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు పూర్తిగా దెబ్బతినగా వీటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో భాగంగా వీటి స్థానంలో వేరే ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశారు. లో టెన్షన్ (ఎల్‌టి) విద్యుత్ స్థంబాలు 1189 వరకు దెబ్బతినగా 70 శాతం మేర స్తంబాలను మెరుగుపర్చిగలిగారు. మరో 1422 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు ఇందులో కొన్నింటినీ మార్పు చేసి కొత్త వాటిని ఏర్పాటు చేయగా, మరికొన్నింటినీ పునరుద్ధరించారు. విశాఖ జిల్లాలో ధర్మవరం, పాయకరావుపేట, యలమంచిలి, మునగపాక, తాండవ, చోడవరం, విజయనగరం, పార్వతీపురం, రాజమండ్రి, తుని పట్టణాలు, 103 మండలాలు వరద ముంపునకు గురయ్యాయి. వీటితోపాటు ఐదు జిల్లాల్లో 787 గ్రామాలకు విద్యుత్ నిలిచిపోయింది. వీటిలో ఇంతవరకు 746 గ్రామాల విద్యుత్‌ను మెరుగుపర్చగా, మరో 41 గ్రామాల్లో పునరుద్ధరణ పనులు సాగుతున్నాయి. కాగా 1.84లక్షల మంది వినియోగదారుల నుంచి విద్యుత్ సంబంధిత ఫిర్యాదులు అందగా, 90 శాతం మేర వీటిని పరిష్కరించగలిగారు.
ఏజెన్సీలో సమస్యల్లేవు
ఆయా జిల్లాల్లో గిరిజన గ్రామాలకు సంబంధించి విద్యుత్ సమస్యలు తలెత్తలేదని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ అంతరాయాలు తప్ప, విద్యుత్ లైన్లు, స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఎటువంటి సాంకేతిపరమైన సమస్యలు రాలేదన్నారు.
సిఎండి విస్తృత పర్యటన
ఐదు జిల్లాల్లో అస్తవ్యస్తమైన విద్యుత్ వ్యవస్థను పూర్తిస్థాయిలో మెరుగుపర్చేందుకు వీలుగా ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ అహ్మద్ నదీమ్ ఆధ్వర్యంలో డైరెక్టర్ హెచ్‌వై దొర, ఇతర అధికారుల బృందం గత రెండు రోజులుగా పలు జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తోంది. నీట మునిగిన విద్యుత్ సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్లను యుద్ధప్రాతిపదికన మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మరో 24 గంటల్లో ఐదు జిల్లాల్లో పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా మెరుగుపడాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
సంక్షోభాల్లో భారతదేశం
విశాఖపట్నం , నవంబర్ 6: పెట్టుబడిదారీ వ్యవస్థలో సరళీకరణ సంస్కరణల కారణంగా దేశంలో అనేక రంగాలు సంక్షోభాల్లో కూరుకుపోతున్నాయని అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షులు రామచంద్రన్ పిళ్లై ఆందోళన వ్యక్తం చేశారు. ఆలిండియా మత్స్యకారులు, మత్స్యకార్మిక సమాఖ్య రెండవ జాతీయ మహాసభలను విశాఖలో మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక మందగమనం, వ్యవసాయ సంక్షోభం, పారిశ్రామిక ఉత్పత్తి క్షీణించడం తదితర సంక్షోభాలను దేశం ఎదుర్కొంటోందని చెప్పారు. వ్యవసాయాధారిత భారత్‌లో ఇప్పుడు అన్నదాతకు వ్యవసాయం లాభసాటి కాని ఉపాధిగా మారిందని చెప్పరు. ఒకపక్క నిత్యావసర ధరలు రోజు రోజుకూ చుక్కల్ని తాకుతుంటే వ్యవసాయోత్పత్తులకు సరైన ధర రావడం లేదని అన్నారు. దీంతో అన్నదాత వ్యవసాయానికి దూరమవుతున్నాడని, పాడి ద్వారా ఉపాధినిచ్చే పశుసంపదను, బంగారాన్ని పండించే భూముల్ని అమ్ముకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అధిక వడ్డీ రుణాలు రైతుల్ని ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం వ్యవసాయం తరువాత మత్స్య పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని అన్నారు. నిత్యావసర, ఆహార ధాన్యాల ధరలు రోజు రోజుకు పెరుగుతుంటే లోపాలను సరిచేసి ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టపరచాల్సిన ప్రభుత్వం ఏకంగా దానిని ఎత్తివేస్తానని చెబుతోందని, దాని స్థానంలో ప్రమాదకర నగదు బదిలీని ప్రవేశపెడతానంటోందని అన్నారు. మహాసభకు అధ్యక్షత వహించిన ఆలిండియా మత్స్యకారులు, మత్స్యకార్మిక సమాఖ్య ఉపాధ్యక్షులు ఎంఎం.లారెన్స్ మాట్లాడుతూ సంక్షోభం తరువాత అమెరికన్లు ఒక ఉద్యోగం చేస్తే గడవని పరిస్థితుల్లో ఉన్నారని చెబుతూ అమెరికా ఆర్థిక సంక్షోభాన్ని వివరించారు. ప్రొఫెసర్ చోడిపల్లి వెంకట సుధాకర్ మాట్లాడుతూ దేశంలో మత్స్యకారులు తీవ్రంగా వెనుకబడి ఉన్నారని చెప్పారు. దేశంలో 8,158 కిమీ తీర ప్రాంతం ఉందని, అనేక మత్స్యకార కుటుంబాలు సముద్రంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. సముద్రంలో వేటకు వెళుతున్న మత్స్యకారులు తెలియక పొరుగుదేశాల సముద్ర జలాల్లోకి వెళ్ళి అరెస్టు అవుతున్నారని, దీనిపై దేశాల మధ్య అవగాహన అవసరమని అన్నారు. ఐటిడిఎ మాదిరిగా ఇంటిగ్రేటెడ్ మత్స్యకారుల అభివృద్ధి సంస్థ (ఐఎఫ్‌డిఎ)ని ఏర్పాటు చేయాలని, ప్రత్యేక కోస్తా మండలాలను ప్రకటించాలని, మత్స్యకారులకు ప్రత్యామ్నాయ ఉపాధి కార్యక్రమాలు రూపొందించాలని, ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పాలని, గ్రామస్థాయి విపత్తు నివారణ కమిటీలు ఏర్పాటు చేయాలని, కొల్డ్ స్టోరేజీలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఎంతో ఉత్సాహంగా ప్రారంభమైన ఈ మహాసభలకు ముందు ఎఐఎఫ్‌ఎఫ్‌డబ్ల్యూఎఫ్ పతకాన్ని ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు ఎంఎం.లారెన్స్ జెండాను ఎగురవేసారు. పతాకావిష్కరణ సందర్భంగా ప్రజానాట్యమండలి కళాకారులు సందర్భోచితంగా ‘ఎత్తరా మన సంఘ జెండా’ మత్స్యకార్మిక కలల పంట అంటూ పాడిన గీతం ప్రతినిధుల్ని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఆలిండియా అధ్యక్షులు ఎకె.పద్మనాభన్, మత్స్యకారుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.హేమలత, కోశాధికారి నూర్‌హుడా, కేరళ ఫిష్ ఫెడ్ మాజీ చైర్మన్ శిశీంధ్రన్, ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎంవిఎన్.శర్మ, టిఐయు రాష్ట్ర మాజీ అధ్యక్షులు సిహెచ్.నర్సింగరావు, మత్స్యకార నాయకులు శాంతారామ్, కె.పాలయ్య తదితరులు పాల్గొన్నారు.
‘నీలం’తో నష్టపోయిన రైతాంగానికి రుణమాఫీ ప్రకటించాలి
* మాజీ మంత్రి కొణతాల
చోడవరం, నవంబర్ 6: తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించాల్సిన అవసరం ఉందని వైఎస్సార్ పార్టీ రాష్టన్రాయకుడు, మాజీమంత్రి కొణతాల రామకృష్ణ అన్నారు. మంగళవారం మండలంలో వరదముంపులో చిక్కుకున్న భోగాపురం, లక్ష్మీపురం, గౌరీపట్నం గ్రామాల్లో పర్యటించి నీటమునిగిన పంటపొలాలు, దెబ్బతిన్న రహదారులను పరిశీలించి వరద బాధితులను పరామర్శించారు. 22 సంవత్సరాల క్రితం సంభవించిన వరద నష్టం కన్నా ప్రస్తుతం నీలం తుఫాన్ సృష్టించిన బీభత్సం అధికంగా ఉందన్నారు. రాష్ట్రంలో సుమారు పదిలక్షల ఎకరాల్లో పంటనష్టం సంభవించిందని ఈ విపత్తును దృష్టిలో ఉంచుకుని ఖరీఫ్ సీజన్‌లో రైతాంగం తీసుకున్న రుణాలను మాఫీచేసి ఆదుకోవాలన్నారు. తుఫాన్ కారణంగా సంభవించిన వరదల మూలంగా సుమారు లక్ష ఎకరాలలో వరి, చెరకు పంటలతోపాటు కాయగూరలు, తమలపాకుల పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. తుఫాన్ ప్రభావం ఉందన్న విషయం తెలిసినవెంటనే ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోని కారణంగానే తీవ్రంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆయన ఆరోపించారు. గణపర్తి, చూచుకొండ, మెలిపాక, యాదగిరిపాలెం పలు గ్రామాలు ఇప్పటికీ నీటిముంపులో చిక్కుకుని ఉన్నాయన్నారు. బాధితులకు తాగునీరు, రేషన్ లేక నానా అవస్థలు పడుతున్నారని, తక్షణం వరద బాధితులకు ఆహారదినుసులను అందించాలని డిమాండ్ చేశారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. తక్షణం నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం కనీసం ఈ సీజన్‌లో తీసుకున్న రుణాలను అయినా మాఫీచేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతులను ఆర్థికంగా ఆదుకునే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఆయ న స్పష్టం చేశారు. ఆయనవెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారు సత్యనారాయణ, బొడ్డేడ సూర్యనారాయణ, అడపా నర్సింహమూర్తి, కాండ్రేగుల డేవిడ్, సిమ్మినాయుడు, రాపేటి నాగేశ్వరరావు, పి. సునీల్, అల్లం రామఅప్పారావు పాల్గొన్నారు.
వరద బాధితులకు సాయం అందిస్తాం: కలెక్టర్
చోడవరం, నవంబర్ 6: మండలంలోని తీవ్రంగా నష్టపోయిన పిఎస్‌పేట గ్రామంలో జిల్లా కలెక్టర్ శేషాద్రి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ముంపునకు గురైన బంగారమ్మపాలెం, ఎస్‌సి కాలనీ, పిఎస్‌పేట కాలనీలతోపాటు జెన్నవరం వంతెన సమీప ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారిని పరామర్శించి వరదనష్టంపై ఆరాతీశారు. ఆయా ప్రాంతాల్లో ఏ మేరకు నష్టం వాటిల్లింది అధికారులతో కలసి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తాము గత ఐదురోజులుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, ఇప్పటికీ వరద నీరు తొలగిపోలేదని, తమకు తక్షణం సహాయాన్ని అందించాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ శేషాద్రి మాట్లాడుతూ వరదనీరు తగ్గుముఖం పట్టేందుకు కొద్దిరోజుల సమయం పడుతుందని, అన్నివిధాలా సహాయ సహకారాలు అందజేస్తామని, ప్రస్తుతం అధికారులంతా నష్టాలను అంచనా వేయడంలో నిమగ్నమై ఉన్నారు. అధైర్యపడాల్సిన అవసరం లేదని ఆయన బాధితులకు భరోసా ఇచ్చారు.
సి.ఎం. మన్యం పర్యటన మళ్ళీ వాయిదా
* దీపావళి తర్వాతే ఇందిరమ్మ బాట
పాడేరు, నవంబర్ 6: విశాఖ మన్యం లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందిరమ్మ బాట దీపావళి అనంతరం జరిగే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఈ నెల 8,9 తేదీల్లో మన్యంలో ముఖ్యమంత్రి ఇందిరమ్మ బాట నిర్వహించాలని ముందుగా భా వించినప్పటికీ భారీ వర్షాల కారణంగా సి.ఎం. పర్యటన వాయిదా పడినట్టు తె లుస్తోంది. నీలం తుపాను కారణంగా రాష్టవ్య్రాప్తంగా భారీవర్షాలు కురిసి అనేకచోట్ల అపారమైన నష్టం వాటిల్లడమే కాకుండా మన్యంలో దీని ప్రభా వం అధికంగానే కనిపించింది. దీంతో ముఖ్యమంత్రి ఈనెల 8వ తేదీ పర్యటనకు ఏర్పాట్లు చేయడానికి భారీ వర్షా లు అడ్డంకిగా మారడంతో మన్యంలో ఇందిరమ్మ బాట వాయిదాకు దారితీసింది. ఈనెల 13వ తేదీన దీపావళి కావడంతో 14,15 తేదీల్లో ముఖ్యమంత్రి మన్యంలో ఇందిరమ్మ బాట నిర్వహించవచ్చునని అధికారులు భావిస్తున్నారు. సి.ఎం. పర్యటన అధికారికంగా ఇంకా ఖరారు కావల్సి ఉంది.
బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
* అశోక్ గజపతిరాజు
చోడవరం, నవంబర్ 6: వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం చెందిందని దేశం పార్టీ పాలిట్‌బ్యూరో సభ్యుడు పి.అశోక్‌గజపతిరా జు విమర్శించారు. మంగళవారం అశోక్‌గజపతిరాజుతోపాటు ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, కెఎస్‌ఎన్ రాజు, జిల్లా పార్టీ అధ్యక్షుడు అయ్యన్నపాత్రుడు, మాజీ ఎమ్మెల్యే అప్పలనర్సింహరాజు, జిల్లా పార్టీ కార్యదర్శి కోన తాతారావు బృందం ముంపు ప్రాంతమైన గౌరీపట్నంలో పర్యటించి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా అక్కడ విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడంలో విఫలం చెందిందని ఆరోపించారు. గతనెల 27వతేదీనుండి తుఫాన్ ప్రభావంతో రాష్ట్రం అతలాకుతలమైపోతుంటే ఢిల్లీకి, పెళ్లికి వెళ్లడంపై చూపిన శ్రద్ధ బాధితులపై చూపలేదని వారు అన్నారు. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రం మొత్తం మీద 24 మంది మృతి చెందగా, ఒక్క విశాఖ జిల్లాలోనే 14 మంది మృత్యువాత పడ్డారని, అయినప్పటికీ ఆయా వరద ప్రాంతాల్లో బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిందే తప్ప ఎక్కడా సక్రమంగా బాధితులను ఆదుకునే ప్రయత్నాలు చేయలేదని వారు ఆరోపించారు. నష్టా న్ని అంచనా వేయడంలో అధికారులు, మంత్రులు చెప్పే మాటలకు పొంతన కుదరడం లేదని, ప్రజలను ఇబ్బందుల కు గురిచేయడం తగదని వారు అన్నా రు. రైతులకు వడ్డీలకు అప్పులు తెచ్చి వ్యవసాయ పెట్టుబడులు పెట్టి పంటలు పండించారని, వారి రుణాలను మాఫీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో లక్షా 14వేల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని, ఆర్‌అండ్‌బి రోడ్లకు సుమారు 200 కిలోమీటర్ల వరకు నష్టం వాటిల్లిందని, వీటన్నింటికి తక్షణం అంచనాలు వేసి బాధితులకు ఆర్థిక సహాయాన్ని అందించాలన్నారు. నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు పదివేల రూపాయల వంతున ఆర్థిక సహాయా న్ని అందించాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు అయ్యన్నపాత్రుడు అన్నారు. పాడైపోయిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. అలాగే ఒండ్రుమట్టితో కూడిన పంటకు కూడా నష్టపరిహారాన్ని అందించాలన్నారు. ముంపుప్రాంతాల్లోని ప్రజలకు 20కిలోల వంతున బియ్యాన్ని, ఆహార దినుసులను సమకూర్చాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గూనూరు మల్లునాయుడు, రమణ పెదప్పడు, డి. శ్రీను, గ్రామస్థులు పాల్గొన్నారు.
‘ఇంటింటా అన్నమయ్య’ చిత్ర నిర్మాణంలో అపశ్రుతి
* క్రేన్ టెక్నీషియన్ దుర్మరణం
* హెల్పర్‌కు గాయాలు
అరకులోయ, నవంబర్ 6: అరకులోయ ప్రాంతంలో గత రెండు రోజులుగా జరుగుతున్న సినిమా షూటింగ్‌లో అపశృతి చోటుచేసుకుని చిత్ర పరిశ్రమకు చెందిన క్రేన్ టెక్నిషియన్ మంగళవారం సాయంత్రం దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటనలో చిత్ర నిర్మాణానికి చెందిన మరో వ్యక్తి తీవ్ర గాయాలకు గురయ్యారు. దీంతో చిత్ర నిర్మాణ యూనిట్‌లో విషాదం అలముకుంది. అరకులోయ పరిసర ప్రాంతాలలో ఈనెల 4వతేది ఆదివారం నుంచి సాయిబాబా మూవీస్ బ్యానర్‌పై రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఇంటింటా అన్నమయ్య తెలుగు చలన చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మండలంలోని సిరిగాం పంచాయతీ వర్రా, కోడిపుంజువలస గ్రామాల చుట్టుపక్కల మంగళవారం చలనచిత్ర నిర్మాణాన్ని చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు చిత్ర నిర్మాణానికి అవసరమైన క్రేన్‌ను పైకి తీసుకువెళుతుండగా విద్యుత్ తీగలకు తగిలి షార్టుసర్క్యూట్ సంభవించడంతో క్రేన్‌పై ఉన్న జి.్భనుప్రకాష్ (36) అనే టెక్నీషియన్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ సంఘటనలో టెక్నీషియన్‌కు సహాయకునిగా ఉన్న కృష్ణ (26) గాయాలపాలై స్థానిక ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన భానుప్రకాష్ పశ్చిమగోదావరి జిల్లా యల్‌పూర్ గ్రామానికి చెందిన వారు. ఈ ప్రమాద సంఘటనపై చిత్ర ప్రొడక్షన్ మేనేజర్ జి.పి.నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరకులోయ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మాచ్‌ఖండ్‌లో తగ్గిన విద్యుదుత్పత్తి
* జనరేటర్‌కు మరమ్మతులు
ముంచంగిపుట్టు, నవంబర్ 6: ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో సాంకేతిక లోపం తలెత్తి మూడవ నెంబర్ జనరేటర్ మంగళవారం మరమ్మత్తులకు గురి కావడంతో ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. మూడవ నెంబర్ జనరేటర్‌లో సి.పి.పైప్ వాల్(బైపాస్) లీకేజీ కావడంతో వరదనీరు చేరింది. జనరేటర్‌లో వరదనీరు చేరడంతో అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు సిబ్బంది, కార్మికులు విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసి ఎటువంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్త పడ్డారు. వరద నీరు దారి మళ్ళించి ఒకటి, రెండు జనరేటర్లలో నీరు చేరకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని వీటిద్వారా 34 మెగావాట్ల విద్యుత్‌ను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. జోలాపుట్టు, డుడుమ రిజర్వాయర్ల నుంచి నీటి విడుదల అధికంగా ఉండడంతో వరద నీరు జనరేటర్లకు చేరుతున్న దృష్ట్యా నీటి విడుదలను తగ్గించారు. జోలాపుట్టు ప్రధాన రిజర్వాయర్ నుండి నాలుగు వేల క్యూసెక్కుల నీటిని, డుడుమ డ్యాం నుండి రెండు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ ప్రాజెక్టులో వరద నీరు చేరకుండా చర్యలు తీసుకున్నట్టు ఉద్యోగ వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై ప్రాజెక్టు ఎస్.ఇ.ని వివరణ కోరగా సాంకేతక లోపంతో మూడవ నెంబర్ జనరేటర్ మంగళవారం ఉదయం 11 గంటల నుండి మరమ్మత్తులకు గురైందని, కార్మికుల సహాయంతో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడుతున్నామని, అర్ధరాత్రిలోగా పునరుద్ధరిస్తామని ఆయన వివరించారు.
మంచినీటికి కటకట!
* తహశీల్దార్‌ను నిర్భందించిన దేశం నాయకులు
కశింకోట, నవంబర్ 6: వరద ముంపునకు గురైన వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని తహశీల్దార్ సత్యారావును మంగళవారం సాయంత్రం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి దాడి రత్నాకర్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, బాధిత కుటుంబాలు అడ్డుకుని నిర్బంధించారు. మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించినా అధికారులు పట్టించుకోకపోవడం, ప్రజాప్రతినిధుల వైఫల్యం తెలుస్తుందన్నారు.