పొన్నూరు, నవంబర్ 7: రైతులు బాగుండాలి.. రైతు కూలీల కష్టాలు తీరాలని జీవిత పర్యంతం అహర్నిశలు శ్రమించిన ఆచార్య ఎన్‌జి రంగా నిజమైన రైతు బాంధవుడని రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి కొనియాడారు. పొన్నూరులోని సజ్జావారి కల్యాణ మండపంలో బుధవారం జరిగిన ఎన్‌జి రంగా 113వ జయంతి ఉత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా ప్రసంగించారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో రంగా ఏనాడూ పదవిని, అధికారాన్ని ఆశించలేదని, గెలుపోటములను సైతం సమానంగా స్వీకరించిన మహనీయుడు రంగా అని కొనియాడారు. రైతుల శ్రేయస్సుకు ఏ రాజకీయ పార్టీ అండగా నిలిస్తే ఆ పార్టీ వెంట రంగా నడిచారని తెలిపారు. ఎందరో పెద్దలు కోరుకుంటున్న విధంగా రంగా ఏర్పాటు చేసిన రామినీడు విద్యాలయాన్ని పునరుద్ధరించేందుకు, గుంటూరు జిల్లాకు రంగా జిల్లాగా నామకరణం చేసేందుకు తన వంతు సహకరిస్తానని ఆమె హామీ ఇచ్చారు. సభకు అధ్యక్షత వహించిన మాజీ మంత్రి వి శోభనాధీశ్వరరావు మాట్లాడుతూ ఎందరికో రాజకీయ శిక్షణనిచ్చి దేశానికి అందించిన మహానేత రంగా రాజకీయజ్ఞాని అని కొనియాడారు. సభలో స్థానిక శాసనసభ్యుడు డి నరేంద్రకుమార్, ఎమ్మెల్సీలు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, సింగం బసవపున్నయ్య, మాజీ ఎమ్మెల్యేలు ఎం చిననాగయ్య, ముప్పలనేని శేషగిరిరావు, స్వాతంత్ర సమరయోధుడు పావులూరి శివరామకృష్ణయ్య, రైతాంగ నేత కొసరాజు వెంకట్రాయుడు, డాక్టర్ జక్కంపూడి సీతారామారావు, ప్రొఫెసర్ వెలగా పుష్పకుమారి, డాక్టర్ జానకీదేవి, డాక్టర్ సజ్జాహేమలత, వెలగా సుబ్బారావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. సభారంభంలో పొన్నూరు పట్టణ కూడలిలోని రంగా విగ్రహానికి పూలమాలలు వేయడంతో పాటు, గోభూమిలోని రంగా సమాధిపై పుష్పగుచ్చాలు ఉంచి మంత్రి గల్లా అరుణకుమారి తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు.
డీసీసీ పీఠంపై మక్కెన
గుంటూరు (కార్పొరేషన్), నవంబర్ 7: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లిఖార్జునరావు నియమితులయ్యారు. బుధవారం మధ్యా హ్నం ఈ మేరకు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నుండి సమాచారం అందింది. హైదరాబాద్ గాంధీభవన్ నుండి నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు సైతం అందాయి. మక్కెన మల్లిఖార్జునరావు గతంలో జిల్లా పరిషత్ సభ్యునిగా, వినుకొండ శాసనసభ్యుడిగా పనిచేశారు. మక్కె న నియామకం పట్ల జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు. డిసిసి అధ్యక్షునిగా ఇప్పటివరకు కొనసాగిన సింగం బసవపునయ్య గతంలోనే తనను ఈ పదవి నుంచి తప్పించవలసిందిగా పలుమార్లు ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలకు మనవి చేసినప్పటికీ రాష్ట్రంలో నెలకొన్న సందిగ్ధ పరిస్థితుల దృష్ట్యా ఆయనే్న నేటివరకు నెట్టుకొచ్చారు. గతంలో రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు డిసిసి అధ్యక్షులను మార్చిన సమయంలో గుంటూరు జిల్లా అధ్యక్షుని కూడా మారుస్తున్నట్లు పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి. ఆ సమయంలో మక్కెన మల్లిఖార్జునరావు, చేబ్రోలు నరేంద్రనాధ్ డిసిసి అధ్యక్ష పదవికి పోటీపడ్డారు. ఎట్టకేలకు మక్కెననే డిసిసి అధ్యక్షునిగా నియమిస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. సింగం బసవపున్నయ్య 2007 సంవత్సరంలో డిసిసి అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించి దాదాపు ఐదేళ్ల పాటు కొనసాగారు. ఆయన వివాద రహితుడిగా డిసిసి అధ్యక్ష పదవిని నిర్వహించారు. జిల్లా ప్రజాప్రతినిధుల మధ్య అంతర్గత కలహాల వల్ల వారిని సమన్వయం చేయడంలో విఫలం అయ్యారని, ఇందుకు వయోభారం కూడా కారణంగా పలువురిలో అభిప్రాయం లేకపోలేదు.
పంటనష్టంపై సర్వేలను
త్వరితగతిన పూర్తిచేయాలి
* బాధితులను అన్నివిధాలా ఆదుకుంటాం * మంత్రులు కన్నా, కాసు
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, నవంబర్ 7: నీలం తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటనష్టం, వివిధ శాఖలకు సంబంధించిన నష్టం వివరాలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని రాష్టమ్రంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, కాసు వెంకట కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిధి గృహంలో మంత్రులు కన్నా, కాసు విడివిడిగా అధికారులతో నీలం తుఫాన్ నష్టం, తదనంతర చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జిల్లాలో అధిక వర్షాల కారణంగా 80 వేల హెక్టార్లలో పంటనష్టం జరగగా రాష్టవ్య్రాప్తంగా ఆరు జిల్లాల్లో దాదాపు ఏడున్నర లక్షల హెక్టార్లలో పంటనష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాలు అందాయన్నారు. అధిక వర్షాల కారణంగా మృతిచెందిన కుటుంబాల వారికి ప్రభుత్వం నుంచి త్వరితగతిన పరిహారం అందేలా చూస్తామన్నారు. వరదల కారణంగా నష్టపోయిన రైతులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలతో సహా నివేదికలు తయారు చేయాలన్నారు. ఖాతా లేకుంటే సంబంధిత రైతు చేత ఖాతా తెరిపించేలా చూడాలన్నారు. తయారు చేసిన నివేదికలను గ్రామ పంచాయితీలలో ఉంచి ఏవైనా అభ్యంతరాలుంటే వాటిని పరిష్కరించి తుది జాబితాను త్వరితగతిన అందజేయాలని ఆదేశించారు. తడిసిన ధాన్యం, పత్తి, ఇతర పంట ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రత్యామ్నాయ పంటలకు కావాల్సిన విత్తనాలపై నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. అంతకముందు మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ పంట పొలాలు సాగు చేసుకుంటున్న నిజమైన సాగుదారునికే పరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పంటలను పూర్తిగా కోల్పోయామని, పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని రైతులు వాపోతున్నారని పేర్కొన్నారు. భారీ వర్షల కారణంగా నష్టపోయిన బాధితులను ప్రభుత్వం తప్పక ఆదుకుంటుందన్నారు. సమాజానికి రెండుకళ్లైన రైతు, రైతు కూలీలను తప్పనిసరిగా ఆదుకోవాల్సిన అవసరముందని అన్నారు. పార్టీలకతీతంగా ప్రతి బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు. మంత్రులు ఇరువురూ అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. సమీక్షా సమావేశంలో కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్, జెసి డాక్టర్ ఎన్ యువరాజ్, ఎమ్మెల్సీ సింగం బసవపున్నయ్య, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రమాదంలో గాయపడిన అదనపు జిల్లా జడ్జి మృతి
గుంటూరు (లీగల్), నవంబర్ 7: గుంటూరు రెండవ అదనపు జిల్లా జడ్జి మందిపాటి శ్రీనివాసులురెడ్డి (59) వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి బుధవారం తెల్లవారు ఝామున కన్నుమూశారు. ఈనెల 1వ తేదీన శ్రీనివాసులురెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికలు బంధువులకు అందజేసేందుకు నెల్లూరు వెళ్తుండగా సింగరాయకొండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలయ్యారు. తొలుత ఒంగోలు సంగమిత్ర ఆసుపత్రిలో అత్యవసర చికిత్సల అనంతరం మెరుగైన చికిత్స కోసం మద్రాసులోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం న్యాయమూర్తి శ్రీనివాసులురెడ్డి మృతి చెందారు. ఇలా ఉండగా న్యాయమూర్తి శ్రీనివాసులరెడ్డి అంత్యక్రియలు గురువారం మధ్యాహ్నం నెల్లూరు సమీపంలోని ఆయన స్వగ్రామం నార్త్‌రాజుపాలెంలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
జిల్లాతోనే ఎక్కువ అనుబంధం
న్యాయమూర్తి శ్రీనివాసులురెడ్డి స్వస్థలం నెల్లూరు జిల్లా కోవూరు సమీపంలోని నార్త్‌రాజుపాలెం. 1954 జూలై 2వ తేదీన జన్మించిన శ్రీనివాసులురెడ్డి శ్రీ వెంకటేశ్వరా విశ్వవిద్యాలయం నుండి న్యాయ విద్య పూర్తిచేసి 1980లో రాష్ట్ర బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదయ్యారు. 1989 మే 1వ తేదీన నరసరావుపేట 1వ అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్‌గా తన న్యాయశాఖ ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. బొబ్బిలి, మిర్యాలగూడల్లో పలు బాధ్యతలు నిర్వహించి, తరువాత గుంటూరు 2వ అదనపు జిల్లా జడ్జిగా 2010 సెప్టెంబర్ 18 నుంచి తన విధులను నిర్వర్తిస్తున్నారు. ఆయన భార్య ఇందిర కూడా ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. కుమారుడు యశ్వంత్‌రెడ్డి హైదరాబాదు హెచ్‌సిఎల్‌లో ఇంజనీర్‌కాగా, రెండవ కుమారుడు దుష్యంత్‌రెడ్డి పూనెలోని బర్కర్ బ్యాంక్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు.
పంట నీట మునిగిందే తప్ప
పెద్దగా నష్టంలేదు
* మంత్రి కన్నా
నగరం, నవంబర్ 7: భారీ వర్షాల కారణంగా వరిపైరు నీటిలో మునిగిందే తప్ప పంటలకు పెద్దగా నష్టంలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ రైతులకు పంటనష్టం తక్కువని, నీటిలో ఎక్కువశాతం పంట మునిగిందని చెప్పారు. మురుగు, పంట కాలువల పూడికవల్ల వర్షంనీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి, మురుగునీటి పారుదలలేక పంటపొలాలు మునిగిపోయాయని మంత్రి అన్నారు. మురుగు, పంట కాలువలను వేసవిలో మరమ్మతుత్తులు చేసేందుకు అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటాలని చెప్పారు. మండలాల్లో 50శాతం పొలాలు నీటిలో మునిగితే వాటి వివరాలు నమోదుచేసి జిల్లా అధికారులకు అందజేయాల్సిందిగా ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సంచాకులు శ్రీ్ధర్‌బాబు, రేపల్లె ఏఇ వెంకటేశ్వర్లు, నగరం, నిజాంపట్నం తహశీల్దార్‌లు, ఎఓలు తదితరులు పాల్గొన్నారు.
బాధిత నేతన్నలకు దత్తాత్రేయ పరామర్శ
మంగళగిరి, నవంబర్ 7: నీలం తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాల కారణంగా మంగళగిరి పట్టణ శివారులో గల రత్నాలచెరువు, శ్రామిక నగర్ ప్రాంతాల్లో ఇళ్ళల్లోకి నీరుచేరి నిరాశ్రయులైన బాధితులను బుధవారం కేంద్ర మాజీమంత్రి బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ పరామర్శించారు. రత్నాలచెరువులో చేనేత కార్మికులను ఆయన పరామర్శించి వర్షాలకు దెబ్బతిన్న మగ్గాలను పరిశీలించారు. చెరువులో మూడు దశాబ్దాలుగా సుమారు 500 కుటుంబాలు ఇళ్లు వేసుకుని నివసిస్తున్నారని, డ్రైనేజీ సౌకర్యం కల్పించక పోవడం వల్లే వర్షాలకు వరదనీరు పోయే దారిలేక ఇళ్లల్లోకి చేరిందని బాధితులు వాపోయారు. రత్నాలచెరువు, శ్రామికనగర్ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వస్తామని దత్తాత్రేయ హామీ ఇచ్చారు. పట్టణ బిజెపి అధ్యక్షుడు జగ్గారపు రామ్మోహనరావు, ప్రధాన కార్యదర్శి తాటిపాముల సాంబశివరావు, పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు మునగపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మానవతా విలువలతో కూడిన తీర్పులు
* జడ్జి శ్రీనివాసులు రెడ్డికి గుంటూరు బార్ నివాళి
గుంటూరు (లీగల్), నవంబర్ 7: న్యాయశాస్త్రాల్లో పరిజ్ఞానంతో పాటు దివంగత రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాసులురెడ్డి మానవతా విలువలతో కూడిన తీర్పులను వెలువరించారని, బార్ అసోసియేషన్ న్యాయవాదులను తన కుటుంబ సభ్యులుగా పరిగణిస్తూ బార్-బెంచ్‌ల మధ్య సత్సంబంధాలను బలపర్చారని, గుంటూరు బార్ అసోసియేషన్‌కు చెందిన పలువురు న్యాయవాదులు కొనియాడారు.
ఆయన ఆకస్మిక మరణానికి సంతాప సూచికంగా బుధవారం బార్ న్యాయవాదులంతా తమ విధులకు గైర్హాజరయ్యారు. బార్ అసోసియేషన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సంతాప సభకు బార్ అధ్యక్షుడు లావు అంకమ్మచౌదరి అధ్యక్షత వహించారు. న్యాయమూర్తికి నివాళులర్పిస్తూ సీనియర్ న్యాయవాదులు భీమిరెడ్డి సుబ్బారెడ్డి, వై కోటేశ్వరరావు, తాడిపర్తి రామ్మోహనరావు, చెరుకూరి సత్యనారాయణ, కె శివప్రసాద్, నట్టువ సత్యనారాయణరావు, చేగూడి ఐజయ్య, పివి రమణ, ఎన్ శ్రీనివాసరావు, చుక్కపల్లి రమేష్, దావులూరి శామ్యూల్‌జాన్, కొల్లిశంకరరావు, సిద్దా సత్యనారాయణ, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు వట్టిజోన్నల బ్రహ్మారెడ్డి, మన్నవ జగన్మోహనరావు, బార్ ప్రధాన కార్యదర్శి వజ్రాల రాజశేఖరరెడ్డి, ఉపాధ్యక్షుడు వాసం సూరిబాబు, కార్యదర్శి ఇళ్లా మధుబాబు, మహిళా కార్యదర్శి కె శ్యామల, మాజీ కార్యదర్శి కొండవీటి శ్రీనివాసరావు, బడి మంజుల, నెమలికంటి జింబో తదితరులు ఘనంగా నివాళులర్పించారు. న్యాయమూర్తి శ్రీనివాసులురెడ్డి మరువలేని జడ్జిగా పేర్కొంటూ గుంటూరు న్యాయవాది గుమస్తాల సంఘ అధ్యక్ష, కార్యదర్శులు పోలూరి వెంకటరమణారావు, షేక్ యూసఫ్ ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు.
‘బొట్టు’పై టిటిడి నిర్ణయం సమర్థనీయం
* సి రాఘవాచార్యులు
తెనాలి, నవంబర్ 7: హిందూ ధర్మపరిక్ష కోసం దేవాలయాలున్నాయని, ఆ దేవాలయాల్లో ఉద్యోగులుగా పనిచేస్తున్నవారంతా హిందువులే అయి ఉండాలని, వారు తమ విధుల నిర్వహణకు వచ్చే సమయంలో నుదుటన బొట్టు పెట్టుకోవడం ఎంతైనా అవసరమని, ఇప్పటికైనా తిరుపతి దేవస్థానం ఇఒ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం సమర్థనీయమని ‘సీత’ రాష్ట్ర డైరెక్టర్ సి రాఘవచార్యులు పేర్కొన్నారు. బుధవారం అర్చకుల శిక్షణ తరగతుల పర్యవేక్షణలో భాగంగా, వైకుంఠపురం వచ్చిన ఆయన విలేఖర్లతో మాట్లాడారు. తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగులంతా నుదుట బొట్టు పెట్టుకునే విషయంలో ఎలాంటి ఆక్షేపణ చేయనవసరం లేదన్నారు. ఇటీవల కాలంలోవస్తున్న సినిమాల్లో హాస్యా న్ని పండించుకునే అంశాలను, బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచే సంభాషణలతో చిత్రాలు తీయడం సమంజసం కాదని, దీని తాను వ్యక్తిగతంగా ఖంటిస్తున్నానని అన్నారు. తమ శాఖ ద్వారా చేపడున్న కార్యక్రమాలను వివరిస్తూ 8 ఆగమ అంశాలతో పాటు, దేవాలయ అడ్మినిస్టేషన్, శిల్పం, దేవాలయ నిర్మాణ ఇంజనీరింగ్ విభాగాలకు శిక్షణ నివ్వడం త మ శాఖ విధి విధానంలో ఉన్న అంశాలుగా వివరించారు.
డాక్టర్ వెంకమాంబకు గంగప్ప సాహితీ పురస్కారం
* రేపు ప్రదానోత్సవం
గుంటూరు (కల్చరల్), నవంబర్ 7: కర్ణాటక రాజ్యోత్సవ అవార్డుతో పాటు పలు పురస్కారాలు, సన్మానాలను అందుకున్న ప్రసిద్ధ రచయిత్రి డాక్టర్ సుంకర వెంకమాంబ (్భల్లారి)కి ఈ ఏటి ఆచార్య ఎస్ గంగప్ప సాహితీ పురస్కారం లభించింది. రామాయణంలోని రసరమ్య ఘట్టాలు, కోదండరామ శతకం, రంగనాధ రామాయణం తదితర కావ్యాలపై విస్తృతమైన పరిశోధన చేసి ప్రముఖ రచయిత్రిగా ఖ్యాతినార్జించిన వెంకమాంబకు పురస్కారానికి అందజేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నామని ఆచార్య గంగప్ప సాహితీ పురస్కార కమిటీ పేర్కొంది. బుధవారం కమిటీ సభ్యులు ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ 9వ తేదీ శుక్రవారం సాయంత్రం ఆరున్నర కు బృందావన గార్డెన్స్ అన్నమయ్య కళావేదికపై జరిగే సభలో వెంకమాంబకు ప్రదానం చేస్తారన్నారు.
జాతీయ విపత్తుగా
ప్రకటించాలి: దత్తాత్రేయ
యడ్లపాడు, నవంబర్ 7: నీలం తుఫాన్ కారణంగా రైతులు చావుదెబ్బ తిన్నారని, ప్రధాని మన్మోహన్‌సింగ్ దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. బుధవారం ఆయన యడ్లపాడు మండలం తుర్లపాడు గ్రామంలో పత్తి, తదితర పైర్లను పరిశీలించి, రైతులను పరామర్శించారు. పంటలు తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించి స్పష్టమైన అంచనాలు రూపొందించాలన్నారు. ఖరీఫ్‌లో ఇచ్చిన రుణాలను వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణ,గుంటూరు జిల్లాల్లో పలుచోట్ల పర్యటించానని, ఎక్కడా రెవె న్యూ అధికారులు కనిపించలేదన్నారు.
ని ఆయన విమర్శించారు. దత్తాత్రేయ వెంట బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు శాంతారెడ్డి, రాష్ట్ర కిసాన్‌మోర్చ అధ్యక్షుడు జమ్ముల శ్యాంకిషోర్, బిజెపి జిల్లా అధ్యక్షుడు వల్లెపు కృపారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యడ్లపాటి స్వరూపరాణి, పి పూర్ణచంద్రరావు తదితరులున్నారు.
డెల్టా ఆధునికీకరణపై శే్వతపత్రం విడుదల చేయాలి
* బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు బండారు దత్తాత్రేయ
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, నవంబర్ 7: డెల్టా ఆధునీకరణపై 1966లో అప్పటి ప్రభుత్వం మిత్ర కమిటీని ఏర్పాటు చేసిందని, నాటి నుంచి ఇప్పటివరకూ జరిగిన పనులు, చేపట్టిన చర్యలపై రాష్ట్రప్రభుత్వం శే్వతపత్రం విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. నీలం తుఫాన్ కారణంగా పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో బుధవారం పర్యటించిన దత్తాత్రేయ గుంటూరులో విలేఖర్లతో మాట్లాడారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్లే తరచూ సంభవించే తుఫాన్లు, వరదల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. 2004 నుంచి ఇప్పటివరకు 15 సార్లు వరదలు, తుఫాన్లు సంభవించగా రైతులు దాదాపు 59 వేల కోట్ల రూపాయలు నష్టపోతే కేంద్రప్రభుత్వం కేవలం 2 వేల కోట్ల రూపాయలు మాత్రమే మంజూరు చేసిందని తెలిపారు. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ నిధులు తెచ్చుకోవడంలో రాష్టన్రేతలు విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని దత్తాత్రేయ కోరారు.
సెన్సార్ బోర్డు అవినీతిమయం...
ఇటీవల వస్తున్న కొన్ని సినిమాలు ఆయా వర్గాల ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉంటున్నాయని, వీటిని నియంత్రించాల్సిన సెన్సార్‌బోర్డు పూర్తిగా అవినీతిమయమైందని దత్తాత్రేయ ఆరోపించారు. బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న దేనికైనారెడీ సినిమాపై సెన్సార్‌బోర్డు తక్షణం వివరణ ఇవ్వాలని, ఆ బాధ్యతను నిర్వహించకుంటే బోర్డును రద్దుచేయాలని డిమాండ్ చేశారు. బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతింటే మో హన్‌బాబు క్షమాపణ చెప్పాల్సిందేనని దత్తాత్రేయ స్పష్టం చేశారు.
ప్రకృతి ప్రళయానికి మనమే కారణం
చేబ్రోలు, నవంబర్ 7: ప్రకృతిని పరిరక్షించుకోవాల్సిన మనమే చేజేతులారా నాశనం చేసుకుంటున్నాం... అది మనపై పగబట్టి నిలువునా ముంచేస్తోంది.. ప్రకృతి ప్రళయానికి మనమే కారణం.. అని రాష్ట్ర సహకార శాఖ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి అన్నదాతలను ఓదార్చారు. నీలం తుఫాను దెబ్బకు వట్టిచెరుకూరు మండలంలో నీటమునిగిన పత్తి, మిర్చి, మినుము, పొలాలను బుధవారం ఆయన పరిశీలించారు. మండల పరిధిలోని సౌపాడు, గారపాడు, యామర్రు, పల్లపాడు, చింతపల్లిపాడు గ్రామాల్లో ముంపు ప్రాంతాల్లో మంత్రి కాసు పాదయాత్ర నిర్వహించారు. వర్షంతో చేతికొచ్చిన పంట నీటిపాలైనప్పటికీ ఇంతవరకు వ్యవసాయశాఖ, రెవెన్యూశాఖల అధికారులు పొలాలవైపు కనె్నత్తి కూడా చూడలేదని రైతులు మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు ఎకరాలను కౌలుకు తీసుకుని మిర్చిపంట సాగు చేశామని, వర్షం వచ్చి మొత్తం నీటముంచిందని యామర్రు గ్రామానికి చెందిన రమాదేవి అనే మహిళా రైతు మంత్రి ఎదుట వాపోయింది. ఇందుకు స్పందించిన మంత్రి వెంటనే ఇరిగేషన్‌శాఖ మంత్రి సుదర్శనరెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. రెండవ పంటకు మూడు దఫాలుగా సాగునీరు అందించాలని కోరారు. వరదనష్టం అంచనాలు వేసి రైతులకు పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. పర్యటనలో జెసి డాక్టర్ యువరాజ్, ఆర్‌డిఒ వెంకట రమణ, వ్యవసాయ అధికారి రమణకుమార్, తహశీల్దార్ సాయిప్రసాద్
ప్రభుత్వ తప్పిదం వల్లే కొండవీటి వాగు ముంపు
మంగళగిరి, నవంబర్ 7: ప్రభుత్వం తప్పిదం వల్లే కొండవీటివాగు పొంగి ప్రవహించి కోట్లాది రూపాయల విలువైన పంటలను మింగేసి రైతులకు అపార నష్టం కలిగించిందని సిపిఎం జిల్లా కార్యదర్శి డి రమాదేవి అన్నారు. భారీ వర్షాల కారణంగా కొండవీటి వాగు ముంపునకు గురైన నీరుకొండ, కురగల్లు, బేతపూడి, నవులూరు, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం గ్రామాల్లో బుధవారం రమాదేవి పర్యటించి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. కొండవీటి వాగుముంపుకు శాశ్వత పరిష్కారం తక్షణమే ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం పట్టణంలోని రత్నాల చెరువు, భగత్‌సింగ్ నగర్, శ్రామికనగర్ ప్రాంతాల్లో వరద బాధితులను రమాదేవి పరామర్శించారు. బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శి వై రాధాకృష్ణ, జెవి రాఘవులు, ఏటుకూరి గంగాధరరావు, పకీరయ్య, ఎం రవి, ఎస్‌ఎస్ చెంగయ్య, వి గోపిరెడ్డి, కె అంకమ్మరావు, వెంకయ్య, సాంబిరెడ్డి పాల్గొన్నారు.
జిల్లా సెకండరీ పాఠశాలల క్రీడాపోటీల షెడ్యూలు ఖరారు
మంగళగిరి, నవంబర్ 7: జిల్లా సెకండరీ పాఠశాలల క్రీడా పోటీల నిర్వహణ సమావేశం బుధవారం స్థానిక సికె జూనియర్ కాలేజీలో ప్రిన్సిపాల్ మోహనరావు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా ఉప విద్యాశాఖాధికారిణి విజయలక్ష్మి, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు, వివిధ జోన్‌ల ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బాలికల జోన్ పోటీలు డిసెంబర్ 8 నుంచి 11 వరకు, బాలుర సబ్‌జోన్ పోటీలు వచ్చే జనవరి 21 నుంచి 24 వరకు, సెంట్రల్‌జోన్ పోటీలు జనవరి 28 నుంచి 31 వరకు, బాల బాలికలకు మేజర్ గేమ్స్ జనవరి 5 నుంచి 7 వరకు జరపాలని సమావేశం నిర్ణయించినట్లు ప్రధాన కార్యదర్శి సాంబశివరావు తెలిపారు.
ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలం
* జనచైతన్య ప్రస్థానంలో వైఎస్‌ఆర్ సిపి నేత అప్పిరెడ్డి
గుంటూరు, నవంబర్ 7: రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. జనచైతన్య ప్రస్థానంలో భాగంగా బుధవారం స్థానిక ఎటి అగ్రహారంలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, టిడిపిలు చేసిన కుట్రల గురించి ప్రజలు వాకాబు చేస్తున్నారని, జగన్‌ను సిఎం చేయాలన్న ఆకాంక్ష ప్రజల్లో బలంగా నాటుకుపోయిందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పాటుపడే ఏకైక పార్టీ వైఎస్‌ఆర్ సిపియేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు రాతంశెట్టి సీతారామాంజనేయలు, బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, నసీర్ అహమ్మద్, అంగడి శ్రీనివాస్, చింతగుంట్ల రంగారెడ్డి, సీతారామిరెడ్డి, మార్కెట్‌బాబు, నళినీమోహన్, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ అసమర్థ ప్రభుత్వం వల్లే ప్రజలకు కష్టాలు
మంగళగిరి, నవంబర్ 7: రాష్ట్రంలో పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని అసమర్థ, దద్దమ్మ ప్రభుత్వమని, అందుకే ప్రజలు కష్టాలు పడుతున్నారని బిజెపి సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ విమర్శించారు. నీలం తుఫాన్ బాధితులను, నీరుకొండ, కురగల్లు, ఎర్రబాలెం మొదలైన ప్రాంతాల్లో కొండవీటి వాగు ముంపు వలన దెబ్బతిన్న పంటపొలాలను దత్తాత్రేయ పరిశీలించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ విలేఖర్లతో మాట్లాడుతూ మంగళగిరి పట్టణంలో డ్రైనేజీ పనులు ప్రణాళికా బద్ధంగా లేవని, కొందరు నాయకులకు అనుకూలంగా నిర్మిస్తున్నందువల్లే ఇళ్లల్లోకి ముంపు వచ్చిందని ఆయన విమర్శించారు. బాధితులను స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ కనీసం పరామర్శించక పోవడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. వరదల వల్ల నష్టపోయిన వారికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు. జిల్లాలో పత్తి, మిర్చి పంటలకు బీమా పథకాన్ని వర్తింప చేయాలని ఆయన కోరారు. నీలం తుఫాన్ వల్ల జరిగిన నష్టాన్ని కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించి సాయపడాలని దత్తాత్రేయ అన్నారు. బిజెపి నాయకులు జగ్గారపు రామ్మోహనరావు, మునగపాటి వెంకటేశ్వరరావు, తాటిపాముల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
శాశ్వత పరిష్కారానికి కృషిచేస్తా
* మంత్రి కాసు కృష్ణారెడ్డి
ప్రత్తిపాడు, నవంబర్ 7: ముంపు గ్రామమైన వంగిపురాన్ని భవిష్యత్తులో వరద ముంపు బారిన పడకుండా ముఖ్యమంత్రితో మాట్లాడి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర సహకార శాఖ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి వంగిపురం రైతులకు హామీ ఇచ్చారు.
నీలం తుఫాను ప్రభావం వల్ల వరద ముంపుకు గురైన వంగిపురంతో పాటు ప్రత్తిపాడులో దెబ్బతిన్న మిర్చిపంటను బుధవారం మంత్రి కాసు పరిశీలించారు. అనంతరం అప్పాపురం ఛానల్‌ను కూడా పరిశీలించి ముంపునకు కారణాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి కాసు వెంట జిల్లా జెసి డాక్టర్ ఎన్ యువరాజ్, ఆర్‌డిఒ వెంకట రమణ, పిసిసి సభ్యుడు వణుకూరి శ్రీనివాసరెడ్డి, డిసిసి ఉపాధ్యక్షుడు గంగిరెడ్డి చెన్నారెడ్డి, తహశీల్దార్ ఎ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమ ఫలాలు పేదలకు అందేలా చిత్తశుద్ధితో కృషి: మంత్రి గల్లా
గుంటూరు, నవంబర్ 7: ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల ఫలాలు నిజమైన లబ్ధిదారులకు అందేలా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణతో కలిసి గుంటూరుపశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి గల్లా అరుణకుమారి మాట్లాడుతూ మహిళా, రైతు సంక్షేమం కోసం రాష్ట్రప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. ఫాతిమాపురంలో సుమారు 30 లక్షల రూపాయలు, కృష్ణబాబు కాలనీల్లో 98.20 లక్షల వ్యయంతో సిసి రోడ్లకు మంత్రులు అరుణకుమారి, కన్నా లక్ష్మీనారాయణ శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ కె సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అంతకముందు స్వర్గీయ ఆచార్య ఎన్‌జి రంగా 113వ జయంతి సందర్భంగా స్థానిక బృందావన గార్డెన్స్‌లోని రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కష్టాల్లో రైతులు - ఢిల్లీలో మంత్రులు
మేడికొండూరు, నవంబర్ 7: నీలం తుఫాన్‌తో రాష్ట్రం అతలాకుతలమవుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు ఢిల్లీలో సోనియా, రాహుల్ దర్శనాల కోసం పాట్లు పడుతున్నారని వైఎస్‌ఆర్ సిపి తాడికొండ నియోజకవర్గ నాయకుడు మందపాటి శేషగిరిరావు విమర్శించారు. మండలంలోని సిరిపురంలో వైఎస్‌ఆర్ సిపి కార్యకర్తల సమావేశం మండల కన్వీనర్ అల్లు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా శేషగిరిరావు మాట్లాడుతూ నష్టపోయిన రైతులు, పంట వివరాలను సమగ్రంగా సర్వే చేసి రైతులను ఆదుకోవాలన్నారు. ఈ సమావేశంలో మండల నాయకులు బండ్లమూడి వేణుగోపాలరావు, అప్పికట్ల రమేష్, తోకా అర్జునరావు, కొరివి చెన్నయ్య, చంద్రం, కొప్పెర రాముడు, షేక్ మీరావలి, బాసాని శౌరిరెడ్డి, జోజప్పరెడ్డి, బి చినసాంబయ్య, కాసు రాయపరెడ్డి, జయపాల్‌రెడ్డి పాల్గొన్నారు.