పుట్టపర్తి, నవంబర్ 7: సత్యసాయి సెంట్రల్ చేపట్టనున్న రూ.80 కోట్ల తాగునీటి ప్రాజెక్టుపై సత్యసాయి వాటర్‌బోర్డు సమావేశంలో కీలక చర్చలు జరిగాయి. బుధవారం 34వ వాటర్ బోర్డు సమావేశం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ దుర్గాదాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సత్యసాయి వాటర్‌బోర్డు సాంకేతిక ముఖ్య సలహాదారు కొండలరావు, ట్రస్టు కార్యదర్శి ప్రసాద్‌రావులతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అనంతపురం వంటి కరవు జిల్లాలో ఇప్పటికే 800 గ్రామాల దాహార్తి తీర్చిన సత్యసాయి ట్రస్టు అదే కోవలో రూ.80 కోట్ల వ్యయంతో 118 గ్రామాలకు తాగునీరు అందించడానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వ పరంగా సంపూర్ణ సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి పుట్టపర్తి పర్యటనలో వెల్లడించారన్నారు. ఈ రూ.80 కోట్లతోపాటు ప్రభుత్వం పరంగా సమకూరిన రూ.10 కోట్ల నిధులు జోడించి ప్రాజెక్టు పనులను పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఈ ప్రాజెక్టు అమలుపై సమగ్ర వివరాలు వెల్లడించాలని ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ ప్రభాకర్‌రావును కోరుతూ ప్రధాన అజెండాగా రూ.80 కోట్ల ( ప్రాజెక్టుపైనే చర్చించారు. ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా మంజూరైన రూ.10 కోట్లతో 97 ఓవర్‌హెడ్ ట్యాంక్‌లతోపాటు ఇంటెక్‌ను నిర్మించడం జరుగుతుందన్నారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి మంచినీటిని పంపింగ్ చేసి మద్దెలచెరువు, అప్పరాచెరువు, కృష్ణాపురం, శేషాపురం, కొత్తచెరువులో జిఎల్‌బిఆర్‌కు నీటిని పంపింగ్ చేసి అక్కడి నుండి సరఫరా చేయడం జరుగుతుందన్నారు. కొత్తచెరువులో జిఎల్‌బిఆర్‌ను నిర్మించి అక్కడి నుండి పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం మండలాల్లోని 118 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేయడం జరుగుతుందని వివరించారు. పుట్టపర్తి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో వుంచుకొని 2.5 ఎంఎల్‌డి నీటిని కేటాయించడం జరుగుతుందన్నారు. కొత్తచెరువు నుండి పుట్టపర్తికి 11 కిలోమీటర్ల పైపులైన్ వేసి సంప్‌ను నిర్మిస్తే బాగుంటుందని, అందుకు అవసరమయ్యే నిధులు రూ.5 కోట్లు సత్యసాయి ట్రస్టు సమకూర్చాలని కార్యదర్శి ప్రసాద్‌రావును కలెక్టర్ కోరారు. అదే విధంగా శ్రీరామరెడ్డి తాగునీటి పథకంలో 559 గ్రామాలకు గాను 420 గ్రామాలకు నీటిని అందిస్తున్నామని, మిగిలిన 120 గ్రామాలకు మార్చి లోపు పనులు పూర్తి చేసి నీటిని అందిస్తామని ఆర్‌ఎడబ్ల్యుఎస్ ఎస్‌ఇ చెప్పారు. సత్యసాయిబాబా 87వ జయంతి ఉత్సవాల్లో రూ.80 కోట్ల ప్రాజెక్టు ప్రారంభమవుతుందని కలెక్టర్ వెల్లడిస్తూ నీటిని వినియోగించే వారు చెల్లించాల్సిన పన్నులను సకాలంలో చెల్లించేలా చైతన్యం తీసుకురావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో హెచ్‌ఎల్‌సి ఎస్‌ఇ వాణిప్రసాద్, పబ్లిక్ హెల్త్ ఇఇ శ్రీనాథరెడ్డి, జిల్లా కార్మిక శాఖ అధికారి కృష్ణారెడ్డి, డిపిఓ శంకరయ్య, ఇఇలు సంజీవరెడ్డి, రమణారెడ్డి, ప్రసాదరెడ్డి, సత్యసాయి వాటర్‌బోర్డు డిఇ రాజ్‌కుమార్, తహశీల్దార్ మోహన్‌దాస్, సిఐ శ్రీ్ధర్‌లు తదితరులు పాల్గొన్నారు.
అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒక్కటైతే
ఇంకెక్కడి ప్రజాస్వామ్యం:షర్మిల
గుంతకల్లు, నవంబర్ 7: అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కైతే ఇంకెక్కడి ప్రజాస్వామ్యమని, వైఎస్.జగన్‌కు బెయిల్ రాకుండా అడ్డుకోవాలన్న, తన అక్రమాలపై విచారణ జరుగకుండా వుండాలన్న టిడిపి నేత చంద్రబాబు నాయుడు చీకట్లో చిదంబరాన్ని కలుస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారం నియోజకవర్గ కేంద్రం గుంతకల్లులో జరిగింది. జిల్లాలో షర్మిల పాదయాత్ర పూర్తికానున్న నేపధ్యం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థానిక పొట్టి శ్రీరాములు సర్కిల్‌లో జరిగిన బహిరంగ సభలో టిడిపి చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడింది. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపిన ప్రభుత్వం, టిడిపి అధినేత చంద్రబాబు అక్రమాలపై ఎందుకు విచారణ చేపట్టలేదని ప్రశ్నించారు. దేవుడిచ్చిన వరం కేజీ బేసిన్‌ను రిలయన్స్‌కు అంటగట్టిన చంద్రబాబునాయుడు ఓ పత్రికలో పెట్టుబడులు పెట్టాడని ఆరోపించారు. ఈ విషయంపై అప్పటి ప్రతిపక్ష నాయకులు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆందోళనలు చేసిన, కేంద్రానికి లేఖలు రాసిన ఫలితం లేదన్నారు. రాష్ట్ర ప్రజలకు కేజీ బేసిన్ విషయంలో చంద్రబాబు ద్రోహం చేశారన్నారు. ఎంఆర్ భూమిని ఎకరా రూ. 26 లక్షలకు విక్రయించి, సమీపంలో ఉన్న అతని భార్య పేరుతో ఉన్న భూమిని ఎకరా కోటి రూపాయలకు విక్రయించారని ఆరోపించారు. వీటిపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించడం లేదన్నారు. కేవలం చీకట్లో చిదంబరాన్ని కలుస్తున్న చంద్రబాబు మేనేజ్ చేసుకుంటున్నారన్నారు. గత నెలలో జగన్‌మోహన్ రెడ్డికి బెయిల్ వస్తుందని ఆశించిన తరుణంలో చంద్రబాబు తన ఎంపీలను చిదంబరం దగ్గరకు పంపి జగన్‌కు బెయిల్ రాకుండ కుట్ర పన్నారని ఆరోపించారు. మామను వెన్నుపోటు పోడిచిన చంద్రబాబు నాయుడుకు విశ్వసనీయత అంటే తెలియదన్నారు. ఎన్టీఆర్‌కు అధికారం తెచ్చి పెట్టిన రెండు పథకాలు రెండు రూపాయల కిలో బియ్యం, సంపూర్ణ మద్య నిషేధాలను అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. రాష్ట్రం అంత తిరిగిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రైతుల కష్టాలను గుర్తించి రైతుల సంక్షేమానికి అవసరమైన చర్యలు చేపట్టారన్నారు. ఉచిత విద్యుత్, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులను అందించారన్నారు. రైతులకు రుణమాఫీ చేపట్టి కొత్త రుణాలు అందజేశారన్నారు. చంద్రబాబు పాదయాత్రలో ప్రజా సంక్షేమానికి భరోసా ఇవ్వలేక పోతున్నారన్నారు. ఆనాడు రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలను వల్లిస్తున్నారన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి జిల్లాపై అనంతమైన ప్రేమ అన్నారు. ముఖ్యంగా ఆయన అనంతపురం జిల్లాకు అల్లుడు కావడం, అత్యంత కరవు పీడిత ప్రాంతమైన జిల్లాను సస్యశ్యామలం చేయడానికి ఆయన కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సిపి గుంతకల్లు నియోజక వర్గ కన్వీనర్ వై.వెంకటరామిరెడ్డి, సిఇసి సభ్యులు విశే్వశ్వర రెడ్డి, ఎమ్మెల్యేలు గురునాథ్ రెడ్డి, కాపురామచంద్రారెడ్డి, అమర్ నాథ్ రెడ్డి, నాయకులు పైలా నరసింహయ్య, కడపల మోహన్ రెడ్డి, లింగాల రమేష్, హిందూపురం నాయకులు వేణుగోపాల్, రామ్మోహన్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు యుగంధర్‌రెడ్డి, ఎన్ భీమ లింగప్ప, పట్టణ కన్వీనర్ సుధాకర్, వెంకటేష్, మండల కన్వీనర్ కదిరప్ప, నాయకులు గోవిందనాయక్, త్యాగరాజు, రాజశేఖర్, పామిడి నాయకులు వీరాంజినేయులు, మాబు, షెక్షావలి, సాధిక్ తదితరులు పాల్గొన్నారు.
అందని విత్తనం!
ఆంధ్రభూమిబ్యూరో
అనంతపురం, నవంబర్ 7 : జిల్లాలో గడచిన నాలుగు సంవత్సరాలుగా వరుస కరవులు నెలకొని ఉన్నాయి. ఈ ఖరీఫ్ లోసాగు చేసిన వేరుశెనగ పరిస్థితి కూడా ఏ మాత్రం ఆశాజనకంగా లేకపోవడంతో ఈ సంవత్సరం కూడా అవే పరిస్థితులు పునరావృతం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఈ రబీలోబోరు బావుల కింద వేరుశెనగను సాగు చేయడానికి రైతులు పెద్ద ఎత్తున ఆసక్తి కనపరుస్తున్నారు. దీంతోపాటు విద్యుత్ సరఫరా సరిగాలేకపోవడంతో పలువురు రైతులు వరికి బదులుగా వేరుశెనగను సాగు చేయడం పట్ల మక్కువ చూపుతున్నారు. దీంతోప్రతి యేటా రబీలో సాగయ్యే సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. రైతులు ఇంతగా ఆసక్తి కనపరుస్తున్నావారు ఆశించిన సమయానికి వేరుశెనగ విత్తనం సరఫరా చేయడంలో వ్యవసాయ శాఖ విఫలమయ్యిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నెల ఐదవ తేదీనే రాయితీ వేరుశెనగ విత్తనాన్ని పంపిణీ చేస్తామని వ్యవసాయ శాఖ ఆర్భాటంగా ప్రకటించింది. దీనికి తోడు రబీకి సంబంధించి అదను సమీపించింది. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకూ వేరుశెనగ సాగు చేసుకోవడానికి అనుకూలమైన సమయంగా వ్యవసాయ శాఖ ప్రకటించింది. దీంతోపాటు రబీలో రైతులకు పంపిణీ చేసే విత్తనాన్ని గ్రామోత్పత్తి విత్తన పథకం కింద సరఫరా చేస్తామని వ్యవసాయ శాఖ ప్రకటించింది. రాయితీ పై పంపిణీ చేసే విత్తనానికి బదులు మొత్తం డబ్బులు కట్టి విత్తనం తెచ్చుకోండని అధికారులు సెలవిస్తున్నారు. ఈ రబీలోసాధారణ సాగు విస్తీర్ణం 1,64 వేల హెక్టార్లుగా ఉన్నట్లు వ్యవసాయ శాఖ నిర్ధారించింది. ఇంత పెద్ద మొత్తంలోసాగు చేయడానికి రైతులు ఆసక్తి కనపరుస్తున్నా ఇప్పటికీ ఒక్క బస్తా విత్తనం కూడా జిల్లాకు చేరలేదు. ఇక తాజాగా పంపిణీ చేసిన పప్పుశనగ విత్తన పంపిణీ లోకూడా సమయానికి విత్తనం పంపిణీ చేయలేదు. జిల్లాలో దాదాపుగా 80 శాతం పప్పుశనగ సాగు పూర్తయిన తరువాత రాయితీపై పంపిణీ చేసే విత్తనాన్ని రైతులకు పంపిణీ చేయడానికి తీసుకురాగా ఇది కాస్తా బ్లాక్ మార్కెట్ కు చేరినట్లు ఆరోపణలు వినిపించాయి. రైతులు దుక్కులు దున్ని వ్యవసాయానికి సన్నద్దంగా ఉన్నా వ్యవసాయ శాఖ పంపిణీ చేసే విత్తనం మాత్రం అందుబాటులోలేదు. దీంతోజిల్లా రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంది.
నాణ్యమైన విత్తనాన్ని పంపిణీ చేస్తాం : జెడిఎ
రబీలోసాగు చేయడానికి నాణ్యమైన వేరుశెనగ విత్తనాన్ని పంపిణీ చేసే పనిలో ఉన్నామని వ్యవసాయ శాఖ సంయుక్తసంచాలకులు సాంబశివరావు తెలిపారు. ఈ నెల ఐదవ తేదీనే పంపిణీ చేయాలని అనుకున్నా నాసిరకం విత్తనం అందుబాటులో ఉండడంతోదానిని పంపిణీ చేయలేకపోతున్నామని త్వరలోనే నాణ్యమైన విత్తనం తీసుకువచ్చి పంపిణీ చేస్తామన్నారు. ఇప్పటికయితే నాణ్యమైన విత్తనం అందుబాటులోలేదన్నారు. వారం పది రోజుల్లో రబీకి అవసరమైన విత్తనాన్ని పంపిణీ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లుఆయన తెలిపారు.
సత్యసాయి సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత భక్తులదే...
పుట్టపర్తి, నవంబర్ 7: సత్యసాయిబాబా సంకల్పాన్ని, లక్ష్యాలను ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత భక్తులదేనని పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ పేర్కొన్నారు. బుధవారం హిందూ మనో రథయాత్ర పుట్టపర్తికి విచ్చేసిన సందర్భంగా స్థానిక భక్తులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామీజీ మాట్లాడుతూ సత్యసాయి భౌతికంగా మన మధ్యనే ఉన్నారన్న భావనను, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించడానికే మీ వద్దకు వచ్చానన్నారు. దైవానికి జనన, మరణం ఉండదన్నారు. ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించే పుణ్య పురుషులు ఎందరో పరమ పదించారని, అంత మాత్రాన వారి చైతన్యం, వెలుగులు భక్తుల మధ్యనే ఉంటాయన్నారు. 200 దేశాల్లో భక్తులను కలిగిన సత్యసాయిబాబా దైవమన్నారు. దైవం కాకపోతే ఇన్ని దేశాల నుండి భక్తులు తరలిరారని, విమర్శలు పట్టించుకోని గొప్ప ఔనత్యం బాబాది అన్నారు. విద్యా, వైద్య, తాగునీటి సేవలు ప్రభుత్వాలు సైతం చేయలేదన్నారు. విశ్వాసం ఉన్న వారికి బాబా వెన్నంటి వుంటారని, పుట్టపర్తి దివ్య క్షేత్రంగా అభివృద్ధి చెందుతుందన్నారు.
పాఠశాలల్లో నాణ్యమైన విద్య బోధించండి
అంనతపురం సిటీ, నవంబర్ 7: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధనలు చేయాలని ఆర్‌విఎం పిఓ కెఎస్. రామారావు ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం అనంతపురం రూరల్ మండలంలోని కాట్నేకాలువ గ్రామం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను ఆర్‌విఎం పిఓ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న పిల్లలను కలసి పాఠశాలలో ఏ విధమైన విద్యా బోధనలు ఉపాధ్యాయులు ద్వారా నేర్పించబడుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. అలాగే పాఠశాలలో మొత్తం 75 మంది విద్యార్థినీ విద్యార్థులు హాజరుకావాల్సి వుండగా అతి తక్కువ హాజరు పట్టిక ఉందని పరిశీలించి, పాఠశాల హెచ్‌ఎం సుధను గైర్హాజరుకు గల కారణాలకు వివరణ ఇవ్వాలన్నారు. దీనికి హెచ్‌ఎం మాట్లాడుతూ ప్రస్తుతం పిల్లలందరూ పట్టణాలలోని పాఠశాలలపై మక్కువ చూపుతున్నారని, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం పిఓ మాట్లాడుతూ ప్రస్తుతం పాఠశాలలో 5 మంది ఉపాధ్యాయులు ఉన్నారని, పిల్లలు శాతం తక్కువగా ఉంటే ఎలా అని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధనలు నేర్పించబడుతున్నట్లు గ్రామంలోని పెద్దలను, ప్రజలను కలిసి వారి సహాయ సహకారాలతో విస్తృతంగా ప్రచారం నిర్వహించి, పిల్లలను పాఠశాలలో నమోదు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌విఎం కో ఆర్టినేటర్ విజయశేఖర్‌రెడ్డి, సాక్షర భారతి గ్రామ కో ఆర్టినేటర్ కృష్ణారెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు గంగమ్మ, ప్రతాప్ పాల్గొన్నారు.
సీమ అభివృద్ధిపై పాలకుల శీతకన్ను:బైరెడ్డి
చెనే్నకొత్తపల్లి, నవంబర్ 7: రాయలసీమ అభివృద్ధిపై పాలకులు శీతకన్ను చూపుతున్నారంటూ రాష్ట్ర రాయలసీమ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక రాయలసీమ సాధనలో భాగంగా బుధవారం కొత్తచెరువు నుండి ప్రారంభమైన యాత్ర ఆమిదాలకుంట, వెల్దుర్తి, కనుముక్కల, బసంపల్లి మీదుగా ధర్మవరంకు చేరుకుంది. ఈ సందర్భంగా బసంపల్లి ఆంజనేయస్వామి గుడిలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆది నుండి రాయలసీమ అన్ని రంగాల్లో వెనుకబడిందన్నారు. ఇందుకు ఇటీవల కేంద్రం విధించిన శ్రీకృష్ణ కమిటీ నివేదికే ఆదర్శమన్నారు. తన పాదయాత్ర ముగిసిన వెంటనే ఈ నెల 16న హైదరాబాద్‌లో ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించి శ్రీబాగ్ ఒడంబడికలోని అంశాలను వివరించనున్నట్లు తెలిపారు. పాదయాత్ర ఈ నెల 10న అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ జెఎసి ఉపాధ్యక్షుడు, మాజీ జెడ్పిటిసి కడిమల శరత్‌చంద్రారెడ్డి, కొత్తచెరువు మాజీ జెడ్పిటిసి గఫూర్ సాహేబ్‌లతోపాటు అధిక సంఖ్యలో పాదయాత్రలో పాల్గొన్నారు.
భూసేకరణ నిలిపివేయాలని రైతుల రాస్తారోకో
మడకశిర, నవంబర్ 7: ప్రభుత్వం పరిశ్రమల స్థాపన కోసం రైతులు సాగు చేసుకుంటున్న భూముల సేకరణ వెంటనే నిలిపివేయాలని బుధవారం ఆర్.అనంతపురం, ఈచలెడ్డి గ్రామాలకు చెందిన రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం జిల్లాలోని కదిరి, మడకశిర, కల్యాణదుర్గం, అనంతపురం ప్రాంతాల్లో పరిశ్రమ స్థాపన కోసం వెయ్యి ఎకరాల చొప్పున భూములను సేకరించేందుకు అధికారులను ఆదేశించింది. దీంతో మడకశిర ప్రాంతంలో అధికారులు ఆర్.అనంతపురం, గౌడనహళ్ళి ప్రాంతాల్లో పర్యటించి భూసేకరణ కోసం సర్వే పనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ భూములు చేస్తున్న రైతులు ఆందోళనకు దిగి భూసేకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతులు నరసింహప్ప, శివలింగప్ప, రామాంజి, నరసింహ, లక్ష్మమ్మ, పుట్టమ్మ తదితరులు మాట్లాడుతూ గత 1978 నుండి ఈ భూములను తాము సాగు చేసుకోవడం జరుగుతోందన్నారు. వీటినే నమ్ముకొని వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం భూసేకరణ పనులు నిలిపివేయకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమన్నారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ ఆదిలింగయ్య గ్రామాన్ని చేరుకుని రైతులతో చర్చించారు. ప్రభుత్వం సంబంధిత భూములను స్వాధీనం చేసుకొంటే పరిహారం ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అదే విధంగా ఫల సహాయానికి సైతం డబ్బులు చెల్లించనున్నట్లు తెలిపారు. అయితే చాలా మంది రైతులు తమకు డబ్బులు వద్దని, ఒకవేళ ప్రభుత్వం ఈ భూములను స్వాధీనం చేసుకొంటే మరో ప్రాంతంలో తమకు భూములను కేటాయించాలని కోరారు. ఇందుకు తహశీల్దార్ స్పందిస్తూ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకొంటానని తెలిపారు. కాగా ఉన్నతాధికారుల నుండి స్పష్టమైన హామీ వచ్చే వరకు అధికారులు ఎవరూ ఇక్కడ పర్యటించి భూసేకరణ పనులు చేయడం, సర్వే చేయడం వంటివి చేయకూడదని రైతులు తహశీల్దార్‌తో పేర్కొని ఆందోళన విరమించారు. రాస్తారోకో అనంతరం రైతులు తహశీల్దార్‌కు వినతిపత్రం అందచేశారు.
నేడు జిల్లాలో ముగియనున్న షర్మిల పాదయాత్ర
గుంతకల్లు, నవంబర్ 7: జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల చేపట్టిన పాదయాత్ర గురువారం జిల్లాలో పూర్తి కానుంది. జిల్లాలో దాదాపు 16 రోజుల పాటు సుదీర్ఘంగా పాటు అనంతపురం జిల్లాలో పర్యటించిన షర్మిల బుధవారం ఉదయం నియోజక వర్గకేంద్రమైన గుంతకల్లులో పర్యటించారు. దీంతో పట్టణంలోని పాదయాత్రకు జిల్లాలోని నలమూలల నుండి అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బుధవారం రాత్రి 8.30 గంటలకు గుంతకల్లు- కర్నూలు జిల్లా మద్దికెర మార్గంలోని కసాపురం రోడ్డు సమీపంలో గల ఆయ్యప్ప స్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన విడదిలో ఆమె విశ్రాంతి తీసుకున్నారు. గురువారం ఉదయం గుంతకల్లు మండల పరిధిలోని కసాపురం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం అక్కడి నుండి బుగ్గ సంగాల మీదుగా అనంతపురం జిల్లా పాదయాత్రను ముగించుకుని కర్నూలు జిల్లాలో పాదయాత్ర కొనసాగించనున్నదని వైఎస్‌ఆర్‌సిపి నియోజక వర్గ కన్వీనర్ వై. వెంకటరామిరెడ్డి తెలిపారు. దీంతో అనంతపురం జిల్లాలో షర్మిల చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా ముగుస్తుందన్నారు.
షర్మిల మీ పాదయాత్ర ఏ హోదాలో..?
అనంతపురం కల్చరల్, నవంబర్ 7: దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి కూతురు, వైఎస్.జగన్ సోదరి షర్మిల ఈ హోదాలో, ఎవరికోసం పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఉన్నం హనుమంతరాయచౌదరి డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. వైకాపాలో ఏ పదవిలో లేని షర్మిల ఎందుకు పాదయాత్ర మొదలు పెట్టారో చెప్పాలన్నారు. నేను జగనన్న వదలిన బాణాన్ని అంటూ ప్రజల సానుభూతి సంపాదించడానికా అని ప్రశ్నించారు. రైతులు, విద్యార్థుల కోసం జగన్ జైలుకెళ్లాడంటున్నారు, మీ అన్న జైళ్లో ఎందుకున్నదీ ప్రపంచానికి తెలుసన్నారు. వైఎస్ పాలన రామరాజ్యమంటున్నారు, మీ భర్త అనిల్‌కుమార్‌కు 1.40 లక్షల ఎకరాల బాక్సైట్ భూమిని కట్టబెట్టిన ఘనత ఆయనది కాదా అన్నారు. చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారంటూ ప్రచారం చేస్తున్నారు, రాష్టప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలపరిచింది మీ అన్న కాదా అని ప్రశ్నించారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మీ నాన్నగారి అవినీతి లీలలు అన్నీ ఇన్నీ కావన్నారు. మీ అన్నగారి పార్టీ ఎమ్మెల్యే అయిన గురునాథరెడ్డి అవినీతి చరిత్ర మీకు తెలియదా అని ప్రశ్నించారు. వైఎస్ పాలన స్వర్ణయుగమంటున్న మీరు ఆయన పాలనలో ఎన్ని కోట్ల అవినీతి జరిగింది, ఎవరు ఎంత భోం చేసిందీ, వివరాలను ప్రజలకు వెల్లడించాలని కోరారు.
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ: ఇద్దరి మృతి
గోరంట్ల, నవంబర్ 7: మండల పరిధిలోని వడిగేపల్లి వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు మృతి చెందిగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గోరంట్ల నుండి బుడ్డపల్లికి వెళుతున్న వాహనాన్ని చెక్‌పోస్టు వైపు నుండి వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొనడంతో బలిజేపల్లికి చెందిన నవీన్‌కుమార్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. జాతీయ రహదారి అంబులెన్స్‌లో గాయపడిన వ్యక్తుల ను హిందూపురం ప్రభుత్వాసుపత్రి గా తరలించగా చికిత్స పొందు తూ బుడ్డపల్లికి చెందిన రమేష్‌బాబు మృ తి చెందాడు. లక్ష్మీనారాయణరెడ్డి, రాంప్రసాద్, సుబ్బు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.