Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

రసాభాసగా పట్టాల పంపిణీ

$
0
0

మైలవరం, నవంబర్ 8: విజయవాడ డివిజన్ పరిధిలోని పేదలకు ప్రభుత్వం అట్టహాసంగా చేపట్టిన భూ పట్టాల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. ఆరవ విడత భూ పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమం ద్వారా 40 ఎకరాల ప్రభుత్వ భూమిని 31 మంది పేదలకు పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. నియోజకవర్గ అసైన్‌మెంట్ కమిటీ చైర్మన్ అయిన స్థానిక ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఉదయం 9 గంటలకు హాజరుకావాల్సి ఉంది. లబ్ధిదారులంతా వివిధ గ్రామాలనుండి ఉదయం 9 గంటలకే సమావేశ స్థలానికి వచ్చినప్పటికీ ఎమ్మెల్యే మధ్యాహ్నం 1గంటకు సమావేశానికి వచ్చి పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుండగా సీపీఎం పార్టీ మైలవరం డివిజన్ కార్యదర్శి పివి ఆంజనేయులు ఆధ్వర్యంలో అప్పటికే అక్కడికి చేరుకున్న పేదలు ఒక్కసారిగా ఎమ్మెల్యే ప్రసంగానికి అడ్డుతగులుతూ నియోజకవర్గంలో దాదాపు 10వేల ఎకరాల ప్రభుత్వం భూమి ఉందని, దీన్ని అర్హత కలిగిన పేదలకు పంపిణీ చేయాలని తాము గతంలో సూచించామని అయినప్పటికీ దానిని పరిగణనలోకి తీసుకోకుండా మొక్కుబడిగా పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం ఏమిటని ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే ఉమ సైతం వారితో జత కలిసి ప్రభుత్వ అసమర్థత, చేతగానితనం, నిర్లక్ష్యం కారణంగానే పేదలకు భూములు దక్కటం లేదని ఆరోపించారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ భూమిని గుర్తించి మొత్తం పేదలకు పంపిణీచేసే వరకూ ప్రస్తుతం జరగాల్సిన పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జరగనివ్వబోమని పేదలు హెచ్చరించటంతో ఎమ్మెల్యే సైతం కార్యక్రమాన్ని వాయిదావేయాలని తహశీల్దార్‌లకు సూచించారు. వెంటనే జిల్లా కలెక్టర్‌తో ఉమ ఫోన్‌లో మాట్లాడారు. పేదల ఆందోళన విషయాన్ని ఆయనకు వివరించి 15 రోజుల్లో
సమస్యను పరిష్కరించిన అనంతరం పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కలెక్టర్ హామీ ఇవ్వటంతో పేదలు శాంతించారు. అసమర్థ ప్రభుత్వంలో పేదలకు దిక్కులేదని పేదల సమస్యలను పరిష్కరించకుండా అధికారం కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని ఉమ ఆరోపించారు. సీపీఎం డివిజన్ కార్యదర్శి పివి ఆంజనేయులు మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గంలో 10వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని తాము సర్వే నెంబర్లతో సహా చెప్పినా పట్టించుకోవటం లేదని ఆరోపించారు. గణపవరం జమీందార్, ఇబ్రహీంపట్నం మాజీ సర్పంచ్ మల్లెల పద్మనాభరావులకు చెందిన భూమిని ప్రభుత్వం తీసుకుని పేదలకు పంపిణీ చేయాలని కోర్టు ఉత్తర్వులిచ్చినా ఎందుకు స్పందించటంలేదని ప్రశ్నించారు. అసైన్‌మెంట్ కమిటీ సమావేశం విషయంలో ఒక దశలో ఎమ్మెల్యేకు, సీపీఎం నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి ఎమ్మెల్యే వారిని అనునయించి పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకుని సమావేశాన్ని అర్థంతరంగా వాయిదా వేసి వెళ్ళిపోయారు. దీంతో తమకు పట్టాలొస్తాయని దూర ప్రాంతాలనుండి పనులు మానుకుని వచ్చిన పేదలకు నిరాశే మిగిలింది.

తప్పుడు కేసులకు భయపడను
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, నవంబర్ 8: కొన్ని రాజకీయ శక్తుల ప్రమేయంతో అర్ధరాత్రివేళ తనపై దుర్గగుడి అధికారులు మోపిన తప్పుడు కేసులకు తాను భయపడేది లేదని మాజీ శాసనసభ్యుడు వంగవీటి రాధాకృష్ణ తెలిపారు. దీనిపై తాను హైకోర్టులో సవాల్ చేస్తానన్నారు. దుర్గగుడిలో అడుగడుగునా అవినీతి చోటుచేసుకుందని ఈ విషయమై తాను ఏనాడో దేవాదాయశాఖ మంత్రి రామచంద్రయ్య దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ప్రస్తుత ఇఓ రఘునాథ్ నియామకంలోనే భారీఎత్తున ముడుపులు చేతులు మారాయన్నారు. కాదని ఎవరైనా నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం చేయగలనన్నారు. అలా కాకపోతే మంత్రి రామచంద్రయ్య తన పదవికి రాజీనామా చేయాలన్నారు. గురువారం నాడిక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రాధ మాట్లాడారు. దుర్గగుడి ప్రైవేట్ ఆస్తి లేక ఎవరి సొంత సొత్తు కాదని తాను ఓ రాజకీయనేతగా వెళ్లలేదని, ఇఓ ఛాంబర్‌కు తాళాలు వేసారని తెలిసి ఒక భక్తునిగా వెళ్లడం జరిగిందన్నారు. అయితే తనతోపాటు మరో 20మందిపై కేసు నమోదు చేయడం అంటే మున్ముందు తమకు గిట్టనివారిని ఇరికించడం కోసమేనన్నారు. అసలు దుర్గగుడిలో అవినీతిపై మీడియా బహిర్గతం చేస్తున్నా ఎంపి, ముగ్గురు శాసనసభ్యులలో ఏ ఒక్కరూ స్పందించకపోవడం ఏమిటన్నారు. అదే రైతుబజార్‌లో బినామీ షాపులున్నాయంటూ ప్రజాప్రతినిధులు వాటిని ఖాళీ చేయించారు. అలాంటిది దుర్గగుడి ప్రాంగణంలో బినామీ షాపులను ఎందుకు తొలగింపచేయడం లేదని రాధాకృష్ణ ప్రశ్నించారు.

డాక్టర్‌పై మరో డాక్టర్ దాడి
విజయవాడ (క్రైం), నవంబర్ 8: వృత్తిలో పోటీ పడుతున్న ఇద్దరు వైద్యులు ఘర్షణకు దిగారు. ఒకరివద్దకు వచ్చే రోగులను మరో డాక్టర్ హైజాక్ చేస్తున్నాడని ఆరోపణ నేపథ్యంలో డాక్టర్ల మధ్య ఘర్షణ జరిగింది. ఈకారణంతో ఒక వైద్యుడు మరో వైద్యునిపై దాడికి పాల్పడ్డాడు. వ్యవహారం పోలీసుల వరకు వెళ్లడంతో దాడికి పాల్పడిన డాక్టర్‌ను అరెస్టు చేయక తప్పలేదు. పోలీసుల కథనం ప్రకారం సూర్యారావుపేట నక్కలరోడ్డులోని అక్షయ ఫార్మసీ కాంప్లెక్స్‌లో శేఖర్ ఆర్థోపెడిక్ ఆస్పత్రితోపాటు, మరో ఫిజియో థెరపి ఆస్పత్రి కూడా నడుస్తోంది. కాగా తన వద్దకు వచ్చే రోగులను తమవైపు మళ్లించుకుని ప్రాక్టీసు దెబ్బతీస్తున్నాడన్న అక్కసుతో శేఖర్ ఆర్థోపెడిక్ డాక్టర్ మందల రాజశేఖర్ ఆగ్రహించి గురువారం పక్కనే ఉన్న ఫిజియోథెరపి వైద్యుడు డాక్టర్ వట్టిప్రోలు బాబూరాజేంద్రప్రసాద్‌పై దాడికి పాల్పడ్డాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సూర్యారావుపేట పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తుచర్యలు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, నవంబర్ 8: బుడమేరు వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో మెరుగైన పారిశుద్ధ్య పనులు నిర్వహించటంతోపాటు ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నగరపాలక సంస్థ ఇన్‌చార్జి కమిషనర్ కె భాస్కర్ ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. గురువారం వన్‌టౌన్ ప్రాంతంలోని బిఆర్‌పి రోడ్డు, గాంధీజీ మున్సిపల్ స్కూలు రోడ్డు, జెండా వీధి, చేపల మార్కెట్, కొత్తపేట, గణపతిరావురోడ్డు, వించిపేట, నైజాంగేటు, కెఎల్ రావునగర్, మున్సిపల్ కాలనీ, దీన్‌దయాళ్‌నగర్, మిల్క్ ప్రాజెక్ట్, కబేళా, ఊర్మిళానగర్, బైపాస్‌రోడ్డు, సితార జంక్షన్, రోటరీనగర్, జక్కంపూడి, సింగ్‌నగర్, ఎల్‌బిఎస్ నగర్, పటేల్‌నగర్ పరిసర ప్రాంతాలను పర్యవేక్షించి ఆయా ప్రాంతాల్లో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనుల వివరాలను సంబంధిత శానిటరీ అధికారులను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేస్తూ సైడ్ డ్రెయిన్స్ ద్వారా మురుగునీరు పారుదల సక్రమంగా జరిగేలా చూడాలని రోడ్లపై మరియు డ్రెయిన్ల యందు నిలిచిన చెత్త మరియు వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా బుడమేరు వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో నిల్చిన నీరు తగ్గిన ప్రాంతాల్లో ఇంటింటికి శుభ్రం చేసుకొనుటకు అవసరమైన బ్లీచింగ్ మరియు ఫెనాయిల్‌లను అందించాలని, అదే విధంగా ఆయా పరిసర ప్రాంతాల్లో మెరుగైన పారిశుద్ధ్య పనులు చేపట్టి పరిశుభ్రంగా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. నగర ప్రజలకు అందించు రక్షిత మంచినీటి సరఫరాలో అన్ని జాగ్రత్తలు తీసుకొని సరఫరా చేస్తున్నప్పటికీ తాగునీరు కలుషితం అగుటకు అవకాశం ఉన్నందున తాగునీటి కోసం కాచి చల్చార్చి వడబోసిన నీటిని మాత్రమే వినియోగించునట్లుగా ప్రజలకు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో హెల్త్ ఆఫీసర్ డా గోపాల్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.

17నుండి గ్రిగ్ మెమోరియల్ ఆటల పోటీలు
విజయవాడ (స్పోర్ట్స్, నవంబర్ 8: కృష్ణాజిల్లా సెకండరీ స్కూల్స్ 76వ గ్రిగ్ మెమోరియల్ ఆటల, క్రీడల పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎన్‌కెఆర్‌ఎంఆర్‌ఎంసి హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎం నాంచారయ్య తెలిపారు. స్థానిక ఎస్‌కెఆర్‌ఎంఆర్‌ఎంసి స్కూల్‌లో విలేఖరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాంచారయ్య మాట్లాడుతూ ఈ నెల 2వ తేదీన జరిగిన కృష్ణాజిల్లా సెకండరీ స్కూల్స్ స్టోర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో జోన్ల వేదికలు, తేదీలు ఖరాలు చేయడం జరిగిందన్నారు. ఈ నెల 17వ తేదీ నుండి డిసెంబర్ 11వ తేదీ వరకు సబ్ జోన్‌లు, డివిజన్‌లు, సెంట్రల్ జోన్‌ల పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పోటీల్లో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ అన్ ఎయిడెడ్, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు పాల్గొంటాయన్నారు. జోన్, డివిజన్ స్థాయిలో పాల్గొనే ప్రతి జట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయులతో గ్రూప్ ఫొటోతో హాజరుకావాలని పేర్కొన్నారు.
బాలుర సబ్‌జోన్ వేదికలు: విజయవాడ అర్బన్ (బిషప్ గ్రాసీ హైస్కూల్, గుణదల), విజయవాడ రూరల్ (కెనడీ హైస్కూల్, నున్న), ఉయ్యూరు (జెడ్‌పి హైస్కూల్, కాటూరు), నూజివీడు (జెడ్‌పి హైస్కూల్, ఈదర), నందివాడ (డాన్‌బాస్కో బాలికల హైస్కూల్), తిరువూరు (జెడ్‌పి హైస్కూల్, విస్సన్నపేట), చల్లపల్లి (ఎపి రెసిడెన్షియల్, పులిగడ్డ), మచిలీపట్నం (జెడ్‌పి హైస్కూల్, పెడన), గుడివాడ (జెడ్‌పి హైస్కూల్, దోసపాడు), కైకలూరు (జెడ్‌పి హైస్కూల్, ముదినేపల్లి), బాలికల డివిజన్ వేదికలు విజయవాడ (ఎకెటిపిఎంసి హైస్కూల్, సత్యనారాయణపురం), నూజివీడు (జెడ్‌పి హైస్కూల్, గంపలగూడెం), మచిలీపట్నం (లేడి అంప్‌తెల్ ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్), గుడివాడ (జెడ్‌పి హైస్కూల్, చింతపాడు), సెంట్రల్ జోన్‌లు విజయవాడలోని ఎస్‌కెఆర్‌ఎంఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ బాలురు, ఎకెటిపి మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ బాలికలు నిర్వహిస్తారు. ఈ విలేకర్ల సమావేశంలో సెంట్రల్ జోన్ కార్యదర్శి బి లూకాస్, ఎంవి సత్యప్రసాద్, సింగయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రతిభను వెలికితీసేందుకు క్రీడలు దోహదం
విజయవాడ (కల్చరల్), నవంబర్ 8: విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు క్రీడలు దోహదపడతాయని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు మల్లాది విష్ణు అన్నారు. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో రాజగోపాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మల్లాది విష్ణు పాల్గొని పోటీలను ప్రారంభించారు. విశిష్ట అతిథులుగా శాసనమండలి సభ్యులు ఐలాపురం వెంకయ్య, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ప్రతి సంవత్సరం రాజగోపాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆటలపోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ నెల 14వ తేదీన బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న పోటీల్లో విజేతలకు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి , పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి చేతుల మీదుగా బహుమతులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజగోపాల్ ఫొండేషన్ సిఇఒ సామంతపూడి నరసరాజు, కోకన్వీనర్ ఎం నరసింహనాథ్ చౌదరి, సిటి కాంగ్రెస్ ఇన్‌చార్జి అధ్యక్షుడు అడపా శివ నాగేంద్రరావు, యువజన సంక్షేమశాఖాధికారి వెలగాజోషి, మైలవరం కాంగ్రెస్ నాయకుడు అప్పసాని సందీప్, కృష్ణాజిల్లా ఒలింపిక్ సంఘ కార్యదర్శి కెపి రావు, జిల్లా క్రీడాప్రాథికార సంస్థ అధికారి పి రామకృష్ణ, కార్పొరేషన్ డివైఇఓ దుర్గాప్రసాద్, వివిధ పాఠశాలల అధ్యాపకులు పాల్గొన్నారు.

ఉత్సాహంగా జిల్లాస్థాయి ‘పైకా’ పోటీలు
విజయవాడ (స్పోర్ట్స్), నవంబర్ 8: జిల్లా క్రీడాప్రాథికార సంస్థ పైకా ఆధ్వర్యంలో నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో జిల్లాస్థాయి పైకా ఆటలపోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు, శాసన మండలి సభ్యులు ఐలాపురం వెంకయ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. అథ్లెటిక్స్, తైక్వాండో, బాక్సింగ్, హాకీ, వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాంశాల్లో పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమంలో రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ (శాప్) జి చిన్నయ్య, జిల్లా క్రీడాప్రాథికార సంస్థ అధికారి పి రామకృష్ణ, డిఎస్‌ఎ కోచ్‌లు తదితరులు పాల్గొన్నారు. విజేతల వివరాలు ఈవిధంగా ఉన్నాయి.
హాకీ బాలురు: గన్నవరం జోన్ విజయవాడ రూరల్ ప్రథమ స్థానం, మైలవరం జోన్ జి కొండూరు ద్వితీయ స్థానం, మొవ్వ జోన్ చల్లపల్లి తృతీయ స్థానం.
బాలికలు: గన్నవరం జోన్ విజయవాడ రూరల్ ప్రథమ స్థానం, మొవ్వ జోన్ చల్లపల్లి ద్వితీయ స్థానం, మైలవరం జోన్ జి కొండూరు తృతీయ స్థానం.
అథ్లెటిక్స్ బాలురు: మైలవరం జోన్ ప్రథమ స్థానం, ఉయ్యూరు జోన్ ద్వితీయ స్థానం, గుడివాడ జోన్ తృతీయ స్థానం.
బాలికలు: ఉయ్యూరు జోన్, మొవ్వ జోన్, మైలవరం జోన్ వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నాయి.
బాక్సింగ్ విభాగంలో బాలురు: బాలురు 46కేజీల విభాగంలో కె ముజిత్ ప్రథమ స్థానం, ఎన్ ఫణీంద్ర ద్వితీయ స్థానం సాధించారు. 48కేజీల విభాగంలో కె గణేష్ ప్రథమ, ఎన్ నాగరాజు ద్వితీయ స్థానాలు దక్కించుకోగా 57కేజీల విభాగంలో సిహెచ్ ప్రశాంత్‌కుమార్ ప్రథమ స్థానం, కె వెంకట్ గణేష్ ద్వితీయస్థానం, 60కేజీల విభాగంలో ఎ వేణుగోపాల్ ప్రథమ స్థానం, వి చిన్నబాబు ద్వితీయ స్థానం, 85కేజీల విభాగంలో ఎం శివనాగరాజు విజేతగా నిలిచారు.
బాక్సింగ్ విభాగంలో బాలికలు: బాలికల 46కేజీల విభాగంలో సిహెచ్ లావణ్య ప్రథమ స్థానం, ఎ తిరుపతమ్మ ద్వితీయ స్థానం సాధించారు. 50కేజీల విభాగంలో ఎం లత ప్రథమ స్థానం, ఎన్ రామలక్ష్మి ద్వితీయ స్థానం కైవసం చేసుకోగా 52కేజీల విభాగంలో ఎస్ నాగలక్ష్మి ప్రథమ స్థానం, జి సంధ్య ద్వితీయ స్థానం, 60కేజీల విభాగంలో పి హరిత ప్రథమ స్థానం, బి సిరిచందన ద్వితీయ స్థానం దక్కించుకున్నారు.
తైక్వాండో విభాగంలో బాలురు: తైక్వాండో బాలురు 48కేజీలలోపు విభాగంలో పి వెంకటేష్ కె వెంకయ్య, కె కాళిదాస్ వరుసగా మొదటి మూడు స్థానాలను దిక్కించుకున్నారు. 48కేజీల నుండి 51కేజీలలోపు విభాగంలో బి శ్రీహర్ష, 51కేజీల నుండి 55కేజీలలోపు విభాగంలో ఎం మణికంఠ, ఎస్ పవన్‌కుమార్, బిహెచ్ రోహిత్‌లు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను దక్కించుకున్నారు. 55కేజీల నుండి 59కేజీలలోపు విభాగంలో ఎస్ సుమంత్, బిహెచ్ మోహనకుమార్‌లు విన్నర్, రన్నర్‌గా నిలిచారు. 59కేజీల నుండి 63కేజీలలోపు విభాగంలో సిహెచ్ దుర్గామహేష్ ప్రథమ, సిహెచ్ హరీష్‌బాబు ద్వితీయ, 63కేజీల నుండి 68 కేజీల లోపు టి భానుప్రకాష్ ప్రథమ, పి గౌతమ్ హర్ష ద్వితీయ, ఆర్ ఉదయ్‌కిరణ్ తృతీయ స్థానాలు సాధించారు. 68కేజీల నుండి 73కేజీల లోపు విభాగంలో ఆర్ ఉదయ్‌కుమార్ ప్రథమ, ఎస్ మణికంఠ ద్వితీయ, కె షాన్‌ముఖేశ్వర్ తృతీయ స్థానం దక్కించుకున్నారు. 73కేజీలపైన విభాగంలో సిహచ్‌విఎన్ ప్రణీత, అంజనేయులు ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. బాలికల 44కేజీల విభాగంలో పి అర్చనదేవి ప్రథమ, వి జాన్సీ ద్వితీయ, 47కేజీల విభాగంలో టి ప్రియాంక, 51కేజీలలోపు విభాగంలో కె సత్యప్రియాంక, 55కేజీలలోపు విభాగంలో పి నవ్యశ్రీ, 55కేజీలపైన విభాగంలో జిఎల్ కృష్ణసాయి, బి సుస్మితలు మొదటి రెండు స్థానాలు దక్కించుకున్నారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు పాల్గొని విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ (శాప్) జి చిన్నయ్య, కృష్ణాజిల్లా ఒలింపిక్ సంఘ కార్యదర్శి కెపి రావు, జిల్లా క్రీడా ప్రాథికార సంస్థ అధికారి పి రామకృష్ణ, జిల్లా వ్యాయామ విద్య ఉపాధ్యాయుల సంఘ కార్యదర్శి ఎంవి సత్యప్రసాద్, కోచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

త్వరలో లబ్ధిదారులకు భూపంపిణీ
* ప్రభుత్వ విప్ పేర్ని నాని వెల్లడి
మచిలీపట్నం టౌన్, నవంబర్ 8: ఇరవై ఏళ్ళుగా ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వ విప్ పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు. తహశీల్దార్ కార్యాలయంలో బందరు నియోజకవర్గ అసైన్‌మెంట్ కమిటీ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బందరు మండలంలోని పలు గ్రామాలకు చెందిన 481మంది లబ్ధిదారులకు 790 ఎకరాలకు పట్టాలు మంజూరు చేసేందుకు కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. లబ్ధిదారుల్లో 149మంది ఎస్సీలు, 327 మంది బిసిలు, ఐదుగురు ఇతరులు ఉన్నారన్నారు. ఎన్నో ఏళ్ళుగా ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటూ అనుభవంలో ఉన్న లబ్ధిదారులకు ఈ భూములను రెగ్యులరైజ్ చేయనున్నట్లు చెప్పారు. అన్ని గ్రామాల్లో సర్వే చేసి అసైన్‌మెంట్ భూములను గుర్తించి నిరుపేదలకు మరిన్ని ఎకరాలు పంపిణీ చేసేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. ఆర్డీవో ఐ వెంకటేశ్వరరెడ్డి, తహశీల్దార్ శివప్రసాద్, డెప్యూటీ తహశీల్దార్ ఉదయభాస్కర్, కమిటీ సభ్యులు జశ్వంతరావు, గజేంద్ర, సర్వేయర్ శివశంకర్, ఆర్‌ఐలు రఘు, రాజబాబు, విఆర్‌ఓలు పాల్గొన్నారు.

85కోట్ల ఆదాయం లక్ష్యం
* జిల్లా రిజిస్ట్రార్ వెల్లడి
బంటుమిల్లి, నవంబర్ 8: జిల్లాలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఆదాయం 2012-13 సంవత్సరానికి 84కోట్ల 76లక్షలుగా నిర్దేశించినట్లు జిల్లా రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు చెప్పారు. గురువారం బంటుమిల్లి సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈసందర్భంగా విలేఖర్లతో మాట్లాడుతూ గత ఏడాది 58కోట్ల 78లక్షల లక్ష్యానికి గాను 67కోట్ల 98లక్షలు ఆదాయం లభించిందని తెలిపారు. ఈ ఏడాది కూడా లక్ష్యాన్ని అధిగమించనున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ నాటికి 90శాతం లక్ష్యాన్ని పూర్తి చేశామన్నారు. జిల్లాలో అటెండర్ పోస్టులు ఆరు ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. వీటి భర్తీకి జిల్లా కలెక్టర్‌ను కోరామన్నారు. అలాగే జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సొంత భవనాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదించామని చెప్పారు. గ్రామాల్లో భూముల రిజిస్ట్రేషన్‌లపై మాట్లాడుతూ గ్రామకంఠాలకు ఎన్‌ఓసి ఉంటేనే రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. అయితే ప్రస్తుతం ఎన్‌ఓసిలు మంజూరు కావడం లేదన్నారు. బంటుమిల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఈ ఏడాది 5కోట్ల 15లక్షలు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు ఉమామహేశ్వరరావు వివరించారు. బంటుమిల్లి సబ్ రిజిస్ట్రార్ గోపాలకృష్ణ పాల్గొన్నారు.

మా గోడు వినండి
* మంత్రి సారథికి
దళిత మహిళల మొర
మండవల్లి, నవంబర్ 8: మండలంలోని అయ్యవారి రుద్రవరం గ్రామం లో నీలం తుఫాన్ ప్రభావంతో ముం పు బారినపడ్డ పంటపొలాలను రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కెపి సారథి గురువారం సాయంత్రం పరిశీలించారు. అంతకుముందు అయ్యవారి రుద్రవరం దళితవాడ వద్ద మంత్రిని మహిళలు అడ్డుకున్నారు. తమ వాడలో దుర్భర పరిస్థితి నెలకొందని, కనీస వౌలిక వసతులు కరువయినట్లు వాపోయారు. తమ గోడు వినండంటూ మంత్రి చెయ్యి పట్టి మహిళలు దళితవాడలోకి తీసుకెళ్లారు. తమ దుర్భర స్థితిని ఆయనకు వివరించారు. స్పందించిన మంత్రి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా, నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభు త్వం అంకితభావంతో ఉందని పంటల పరిశీలన సందర్భంగా మంత్రి చెప్పారు. నష్టం అంచనాలు వేగవంతంగా వేసేలా అధికారులు చొరవచూపాలని, కౌలురైతులకు పరిహారాన్ని అందించేందుకు జాబితాలను రూపొదించాలని మంత్రి ఆదేశించారు. కొల్లేరు ముంపు ప్రాంతాల్లో బాధితులను ఆదుకునేందుకు, ముంపు వల్ల నష్టపోయిన రహదార్ల అభివృద్ధికి తక్షణమే అంచనాలు వేయాలన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, కెడిసిసి బ్యాంకు డైరెక్టర్ బొర్రా చలమయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రొంటి కృష్ణయాదవ్, గుడివాడ ఆర్డీవో రంజిత్ బాషా, బొబ్బిలి రత్తయ్యనాయుడు, గుడివాడ మురళీకృష్ణ, గుడివాడ తమ్మిస్వామి, తహసిల్దార్ డి విజయశేఖర్, ఎంపిడివో కె రామకృష్ణ పాల్గొన్నారు.
కొల్లేరు సందర్శనకంటూ బయల్దేరి తిరుగుముఖం!
నీలం తుఫాన్ వల్ల ఎగువ కురిసిన వర్షాల వల్ల తీవ్ర స్థాయిలో వరద నీరు కొల్లేరుకు చేరటంతో జలదిగ్బంధంలో చిక్కుకున్న లంక గ్రామాలను పరిశీలించేందుకు మంత్రి కెపి సారథి గురువారం సాయంత్రం బయలుదేరారు. అయ్యవారి రుద్రవరంలో పంటపొలాలు పరిశీలించిన తరువాత కొల్లేరు వైపు బయలుదేరారు. అయితే మండవల్లి మండలం భైరవపట్నం సమీపంలోకి వెళ్తున్న తరుణంలో మంత్రి కారు ఆకస్మికంగా రూట్ మార్చుకొని తిరుగుముఖం పట్టింది. పెనమలూరులో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి హాజరుకావాల్సి ఉందని, అందువల్లే కొల్లేరు టూర్‌ను రద్దు చేసుకున్నట్లు సమాచారం. మంత్రి వస్తారని, తమ సమస్యలను వివరిద్దామని ఎదురుచూసిన కొల్లేటి పెద్దలకు దీంతో నిరాశే మిగిలింది. అయితే మంత్రి మరోసారి వస్దారని కొల్లేటి పెద్దలను సముదాయించేందుకు మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు గురువారం రాత్రి వెళ్లారు.

వరద బాధిత రైతుల్ని ఆదుకోండి
* ఎమ్మెల్సీ మేకా శేషుబాబు డిమాండ్
కలిదిండి, నవంబర్ 8: నీలం తుఫాన్ ప్రభావం వల్ల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు యుద్ధప్రాతిపదికన నష్టపరిహారం అందించాలని పశ్చిమగోదావరి జిల్లా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఇక్కడకు వచ్చిన ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ పంట చేతికందే తరుణంలో కురిసిన భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వేలాది రూపాయలు పెట్టిన పెట్టుబడులు చేతికందే పరిస్థితి లేదన్నారు. తుఫాన్ రిలీఫ్ ఫండ్‌ను విడుదల చేసి బాధిత రైతులను ఆదుకోవాలని కోరారు. తొలుత వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సిపి నేతలు పోసిన చెంచురామారావు, నంబూరి హరికృష్ణమరాజు, పంతగాని విజయ్, భాస్కరరాజు, కందుల వెంకటేశ్వరరావు, ఎస్‌కె జాన్, చాబత్తిన విజయ్, ఇసాబ్ పాల్గొన్నారు.

తాగునీరైనా ఇప్పించండి

గుడివాడ, నవంబర్ 8: వర్షాలు తగ్గి నాలుగురోజులు గడుస్తున్నా ఇంకా మోకాలిలోతు నీటిలోనే గడుపుతున్నామని, కనీసం తాగునీరైనా ఇప్పించాలంటూ స్థానిక పెద ఎరుకపాడు, చంద్రయ్య కాల్వగట్టు ప్రాంతాలకు చెందిన వందలాది మంది బాధితులు అధికారులను వేడుకొంటున్నారు. రోజువారీ కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు వారు నీళ్లలోనే రాకపోకలు సాగిస్తున్నారు. ఎటునుంచి ఏ పాము వస్తుందో తెలియడంలేదని స్థానికురాలు ముత్యాల శ్యామల కన్నీళ్ల పర్యంతమైంది. మరో స్థానికురాలు చిరుకూరి ఝాన్సీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వచ్చే ప్రజాప్రతినిధులు వేల మంది ముంపు బాధల్లో ఉన్నపుడు మాత్రం కన్పించడం లేదన్నారు. చంద్రయ్య డ్రైన్ గట్లను పటిష్ఠం చేయకపోవడం వల్లే తాము ఈ క్షోభ అనుభవిస్తున్నామన్నారు. మరో మహిళ కె లక్ష్మి మాట్లాడుతూ పాములు, దోమలు, దుర్వాసన మధ్య జీవనం సాగిస్తూ రెండుపూటలా అన్నం కూడా తినలేని దీనస్థితిలో ఉన్నామని, ఇళ్లలోని నిత్యావసర వస్తువులన్నీ కొట్టుకుపోయాయని విలపించింది. కాగా మరో వారం రోజులకు కూడా ఈప్రాంతాల్లో ముంపు సమస్య తగ్గేలా కన్పించడంలేదు.

53వేల హెక్టార్లలో వరిపంట నీటమునక
కూచిపూడి, నవంబర్ 8: నీలం తుఫాన్ ప్రభావంతో జిల్లాలో 53వేల 439 హెక్టార్లలో వరిపంట నీట మునిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అందచేసిన నివేదికల ద్వారా వెల్లడవుతోందని జిల్లా ఉప సంచాలకులు ఎన్‌సిహెచ్ బాలూనాయక్ గురువారం తెలిపారు. ఇందులో 37,759 హెక్టార్ల పత్తిపంట పూర్తిగా దెబ్బతిందన్నారు. 2,876 హెక్టార్లలోని పసుపు, కంద, కూరగాయలు, పలు వాణిజ్య పంటలు నీట మునిగినట్లు తెలిపారు. 364 హెక్టార్ల వేరుశనగ, 1180 హెక్టార్ల మొక్కజొన్న, 110 హెక్టార్ల మినుము పంట నీట మునిగిందన్నారు. పొలాల్లో నీరు తగ్గిన తరువాత పంట నష్టాన్ని అంచనా వేసేందుకు శాస్తవ్రేత్తల బృందాలను నియమించినట్లు వివరించారు. ఆయన వెంట మొవ్వ ఎడిఎ ఆర్ ఉషాదేవి, ఏఓ చక్రవర్తి, ఎడిఓ గోవాడ సునిల్, తదితరులు పాల్గొన్నారు.

జాతీయ విపత్తుగా ప్రకటించాలి
నూజివీడు, నవంబర్ 8: తుఫాన్ వల్ల రైతులకు అపారనష్టం జరిగిందని, దీనిని ఎవరూ పూడ్చలేరని సిపిఐ కేంద్రకమిటీ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు అజీజ్ బాష, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పశ్య పద్మలు చెప్పారు. గురువారం నూజివీడు మండలంలో తుఫాన్ కారణంగా పంటలు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. మండలంలోని వెంకటాద్రిపురం, హనుమంతులగూడెం, దిగవల్లి, పోతురెడ్డిపల్లి, ముక్కొల్లుపాడు తదితర గ్రామాల్లో పాడైపోయిన పంటలను వీరు పరిశీలించారు. అక్కడి రైతుల సాధకబాధలను తెలుసుకున్నారు. ఆరుగాలం శ్రమించి పంటలు వేస్తే తుఫాన్ వల్ల తీవ్ర నష్టం ఏర్పడిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వీరు నూజివీడులోని సిపిఐ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులకు నష్టం జరిగిందని, దీన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా రైతులు తీసుకున్న పంట రుణాలు రద్దుచేయాలని, నూతనంగా మరలా రుణాలు మంజూరుచేసి రైతులను ఆదుకోవాలని కోరారు. రైతులకు కావాల్సిన పెట్టుబడులు అందించకపోతే భవిష్యత్‌లో రైతులు ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వం 3వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్లు చెబుతోందని వాస్తవంగా 5వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని వీరు చెప్పారు. తుఫాన్ వల్ల రైతులను ఆప్రమత్తం చేసే విషయంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు. బుడమేరుపై ప్రభుత్వానికి సరైన దృక్పధం లేకపోవటం వల్లే జిల్లాలో బాగా పంట నష్టం జరిగిందని చెప్పారు. వెంటనే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఐ కార్యదర్శి అక్కినేని వనజ, పార్టీ నాయకులు యలమందరావు, చలసాని వెంకట రామారావు, కొమ్మన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

రసాభాసగా పట్టాల పంపిణీ
english title: 
f

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>