Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

వరద నష్టం నివేదిక వేగవంతం

$
0
0

విశాఖపట్నం, నవంబర్ 8 : వరద నష్టాల అంచనాను వేగవంతంగా పూర్తి చేయాలని, గ్రామసభలు నిర్వహించి వరద నష్టాల అంచనాల తుది నివేదికను రూపొందించాలని రాష్ట్ర వౌలిక వసతులు, పెట్టుబడులు, ఓడరేవుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఉదయం స్థానిక సర్క్యూట్ హౌస్‌లో జిల్లా కలెక్టర్ వి.శేషాద్రి, జివిఎంసి కమిషనర్ ఎం.వి .సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌తో వరద సహాయ కార్యక్రమాలపై సమీక్షించారు. వరద ముంపునకు గురైన గ్రామల్లో కనీస అవసరమైన రక్షిత మంచినీటి సరఫరా చేయాలని, మంచినీటి బావులు, ట్యాంకులలో క్లోరినేషన్ చేయాలని, అవసరమైన ట్యాంకర్ల ద్వారా ఆయా గ్రామాలకు మంచినీటిని సరఫరా చేయాలని, మంత్రి గంటా అధికారులకు సూచించారు. పరిశుభ్రమైన నిరు త్రాగాలి. కాచివడపోసిన నీరు తగ్గితే మంచిది అనే అంశాలపై ప్రజలకు చైతన్య పర్చాలని మంత్రి అన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా వైద్యాధికారులు గ్రామాల్లో పర్యటించాలని, అవసరమైన చోట వైద్య శిబిరాలు నిర్వహించాలని మంత్రి తెలిపారు. గ్రామా ల్లో బ్లీచింగ్ చేస్తూ పారిశుద్ధానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గ్రామాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం కలుగ కుండా చూడాలన్నారు. ఇటీవల వర్షాల కారణంగా రిజర్వాయర్ల నుండి విడుదలయిన వరద నీటి వలన దెబ్బతిన్న కాల్వ గట్లకు, గ్రోయిన్లకు మరమ్మతులు చేపట్టాలన్నారు.

శ్యాంబాబ్ ఫైర్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, నవంబర్ 8: నగర నడిబోడ్డున బాణాసంచా అమ్మకాలకు ఎందుకు అనుమతిస్తున్నారంటూ జివిఎసి స్పెషల్ ఆఫీసర్ శ్యాంబాబ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. గురువారం ఆయన నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి, జివిఎంసికి వస్తున్న సమయంలో బాణాసంచా అమ్మకాలకు సంబంధించి వ్యాపారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీన్ని గమనించిన శ్యాంబాబ్ సిటీ ప్లానర్‌ను పిలిచి, నగర నడిబొడ్డున దుకాణాల ఏర్పాటుకు ఎందుక అనుమతిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ సంవత్సరం బాణాసంచా విక్రయాలు అనుమానమే. ఇదిలా ఉండగా జివిఎంసిలోని జోనల్ కమిషనర్ల, ఆయా శాఖాధిపతులు బాధ్యతాయుతంగా పనిచేయాలంటూ స్పెషల్ ఆఫీసర్ శ్యాంబాబ్ అధికారులకు క్లాస్ తీసుకున్నారు. శ్యాంబాబ్ జివిఎంసిలోని తన చాంబర్‌లో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరాభివృద్ధిలో జోనల్ కమిషనర్ల పాత్ర కీలకమని, వారు సక్రమంగా పనిచేయకపోతే, అనేక సమస్యలు తలెత్తుతాయని అన్నారు. కొంతమంది అధికారులు సక్రమంగా పనిచేయకపోవడం విషయం శ్యాంబాబ్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన కొంతమంది అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతంగా పనిచేయాలంటూ ఆయన అధికారులకు క్లాస్ తీసుకున్నారు. నగరంలో చేపట్టిన ప్రాజెక్ట్‌ల ప్రగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్ట్ పనులను వెంటనే చేపట్టాలని ఆయన ఆదేశించారు. నగరంలో పారిశుద్ధ్య పనుల గురించి వాకబు చేశారు. బయోమెట్రిక్ విధానం అమలు జరుగుతోందా? లేదా? అని ఆరా తీశారు. భారీ వర్షాల కారణంగా దెబ్బ తిన్న రోడ్లను వెంటనే బాగు చేయించాలని ఆయన ఆదేశించారు. ఇదిలా ఉండగా సమావేశంలో శ్యాంబాబ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమయంలో మీడియా ప్రతినిధులు సమావేశ మందిరంలోనే ఉన్నారు. ఈ విషయాన్ని గమనించిన కమిషనర్ మీడియాను బయటకు పంపించేయాలని కోరారు.

వరద బాధితులకు బియ్యం, కిరోసిన్
విశాఖపట్నం, నవంబర్8: జిల్లాలో వరద ముంపునకు గురైన గ్రామాల్లోని 62 వేల కుటుంబాలకు తక్షణ సహాయంగా 13 వందల మెట్రిక్ టన్నుల బియ్యం, 307 కిలోలీటర్ల కిరోసిన్‌ను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వి.శేషాద్రి గురువారం తెలిపారు. ప్రతి కుటుంబానికి 20 కిలోల బియ్యాన్ని, ఐదు లీటర్ల కిరోసిన్‌ను పంపిణీ చేస్తారన్నారు. ఇప్పటి వరకూ 12 వేల కుటుంబాలకు రేపు సాయంత్రంలోగా పంపి ణీ చేస్తారని తెలిపారు. వర్షాలు, వరదల వల్ల మత్స్యకారులు వేటకు వెళ్ళలేకపోయారని, ప్రతి కుటుంబానికి పదికిలోల బియ్యాన్ని పంపిణీ చేయాలని ఆదేశించామన్నారు. 65మంది వైద్యాధికారులతో ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసి వరద ముంపు ప్రాంతాలకు పంపామని, వారందరూ విస్తృతం గా పర్యటిస్తున్నారన్నారు. ముంపునకు గురైన ప్రాంతంలో ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహిస్తారని ఇప్పటి వరకూ సుమారు 9వేల మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారన్నారు. ఆశా కార్యకర్తలు వద్ద అవసరమైన అన్ని మందులతో కూడిన కిట్లను అందుబాటులో ఉంచామన్నారు. ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వైద్యాధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. పట్టణ, గ్రామ ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్త శిబిరాన్ని తొలగించేందుకు వీటిని ఏర్పాటు చేశామన్నారు. పంట నష్టాన్ని దెబ్బతిన్న గృహాలకు అంచనావేసేందుకు మండల, గ్రామస్థాయిలో బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

‘గీతం’ వర్శిటీని సందర్శించిన స్వీడన్ బృందం

ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, నవంబర్ 8: బోధన, పరిశోధన రంగాల్లో అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొల్పడానికి గీతం యూనివర్శిటీ స్వీడన్‌లోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన మాలార్‌డలెన్ వర్శిటీతో త్వరలో ఒక ఒప్పందాన్ని కుదర్చుకోబోతోంది. దీనికి సంబంధించి ఐదుగురు సభ్యులతో కూడిన స్వీడన్ బృందం గురువారం గీతం యూనివర్శిటీని సందర్శించి, వైస్‌చాన్స్‌లర్ జి.సుబ్రహ్మణ్యం, రిజిస్ట్రార్ ఎం.పోతరాజుతో చర్చించారు. మాలార్‌డలెన్ యూనివర్శిటీలో ఎంబడెడ్ సిస్టం, ఇన్నోవేషన్ అండ్ ప్రొడక్ట్ రియలైజేషన్, ఇండస్ట్రియల్ ఎకనమిక్స్, పర్యావరణం, విండ్ ఎనర్జీ, ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్ అంశాలపై పరిశోధనలు జరుగుతున్నాయని బృందం తెలియచేసింది. ఈ సందర్భంగా వైస్‌చాన్స్‌లర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ త్వరలోనే తమ విశ్వవిద్యాలయానికి చెందిన బృందం స్వీడన్‌లో పర్యటించనుందని అన్నారు. మాలార్‌డలెన్ వర్శిటీలో పరిశోధన, సిలబస్‌లపై నెల రోజులు అధ్యయనం చేస్తుందని తెలియచేశారు. సైన్స్, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ రంగాలలో ఈ రెండు విశ్వవిద్యాలయాల మధ్య సంయుక్త అధ్యయనాలకు త్వరలోనే ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నామని వైస్‌చాన్స్‌లర్ ప్రకటించారు. స్వీడన్ బృందంలో ప్రొఫెసర్ ఎఎస్‌ఎ లండ్‌విస్ట్, ఫెడరిక్ వేలిన్, పాల్స్‌డాటియర్ తదితరులు ఉన్నారు.

నకిలీ ఎక్సైజ్ పోలీసుల ముఠా అరెస్ట్
పాడేరు(రూరల్) నవంబర్ 8: ఎక్సైజ్ పోలీసుల మని చెప్పి గంజాయి స్మగ్లర్లను బెదిరించి వారినుండి గంజాయి, నగదును స్వాధీన పరుచుకుని మళ్ళీ గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న తొమ్మిది మంది స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్టు పాడేరు ఎ.ఎస్.పి. ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. స్ధానిక పోలీస్‌స్టేషన్ ఆవరణలో గురువారం విలేఖరులతో ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతం నుండి మైదాన ప్రాంతాలకు గంజాయిని తరలించే స్మగ్లర్లను మార్గమధ్యలో అడ్డుకుని ఎక్సైజ్ పోలీసులమంటూ బెదిరించి వారి వద్ద నుండి గంజాయితోపాటు నగదు స్వాధీన పరుచుకున్నారని తెలిపారు. మైదాన ప్రాంతాల నుండి వచ్చిన గంజాయి స్మగ్లర్లకు పాడేరుకి చెందిన ఉద్దండం ప్రభాకర్, కొర్రా కమలహాసన్, ముసలిగంటి రాజేష్, లకే అయ్యప్ప అనే ఆటోడ్రైవర్లు గంజాయిని తరలించేందుకు బేరం కుదుర్చుకుని స్మగ్లర్ల వివరాలతోపాటు ఎక్కడ నుండి గంజాయిని తరలించనున్నది వారి ముఠా సభ్యులైన లగిశపల్లికి చెందిన కుంబిడి చిన్నబాబు, పాంగి నాగేశ్వరరావు, పాంగి గణపతి, వంతల ఆనందబాబు, కోసెడి రవి ఎర్రయ్యలకు తెలియపరచే వారని చెప్పారు. తొమ్మిది మంది ముఠా సభ్యులు పథకం ప్రకారం గంజాయి స్మగ్లర్లు తరలిస్తున్న ఆటోను మిగిలిన సభ్యులు మార్గం మధ్యలో అడ్డగించి స్మగ్లర్లను భయబ్రాంతులకు గురిచేసి వారివద్ద నుండి గంజాయితో పాటు నగదును స్వాధీన పరుచుకుంటుండే వారని తెలిపారు. ఫిర్యాదులు అందక ఇంతకాలం వీరి ఆటలు సాగాయని చెప్పారు. ఈ సమాచారం తెలిసి ముఠాను గురువారం జి.మాడుగుల మండలం మత్య్సపురంవద్ద మాటువేసి అరెస్ట్ చేశామని దామోదర్ చెప్పారు. వీరివద్ద నుండి సుమారు 30 వేల రూపాయలతోపాటు సుమారు లక్ష రూపాయలు విలువ చేసే 21కేజీల గంజాయిని స్వాధీన పరుచుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గఫూర్, ఎస్.ఐ. జి.అప్పన్న, ట్రైనీ ఎస్.ఐ.నాగుల్ మీరాతోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

వరదలు రాకుండా శాశ్వత చర్యలు
* రూ.14 కోట్లతో వరాహ నది
గట్లు పటిష్టం
అచ్యుతాపురం, నవంబర్ 8: జిల్లాలో వరదలు రాకుండా శాశ్వత చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ వి.శేషాద్రి అన్నారు. గురవారం వరద ప్రాంతాలైన పెదపాడు, ఖాజీపాలెం, జగ్గన్నపేట గ్రామాల్లో పర్యటించారు. ముంపునకు కారణమైన ఉప్పరగెడ్డను పరిశీలించారు. వైద్యసిబ్బంది ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని సందర్శించారు. ఎస్సీ కాలనీలో పరిస్థితులను చూసి చలించిపోయారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ యుద్ధప్రాదికపై వరదప్రాంతాల్లో పనులు చేపట్టారి కలెక్టర్ చెప్పారు. వరద నీరు తగ్గాక పనులు చేస్తామన్నారు. జిల్లాలో వరద కారణంగా 216 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్లు తెలిపారు. పంట నష్టంపై అంచనా వేసి విచారణ తరువాత ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. జిల్లాలో 34 సెంటీమీటర్ల వర్షం కురిసిందన్నారు. దీని వలన శారద, గోస్తనీ, తాండవ, వరాహ నదులు పొంగి గ్రామాల్లో ముంపు ఏర్పడిందన్నారు. వరదలు రాకుండా శాశ్వత చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. వరద ప్రాంత గ్రామాల్లో విద్యుత్‌ను సరఫరాను అందించగా, మునగపాక మండలంలో ఆరు గ్రామాల్లో విద్యుత్ ఇవ్వాల్సిఉందన్నారు. ఇంటి నష్టపరిహారం గతంలో ఇచ్చిన మాదిరిగా ఇప్పుడు కూడా అందజేస్తామన్నారు. పశువుల పాకలకు 1500 వందలు నష్టపరిహారం ఇస్తామని, వాటర్ ట్యాంకుల ద్వారా మంచినీటి సరఫరా చేస్తున్నామని, పశువులకు బీమా నష్టపరిహారం అందని పక్షంలో ప్రభుత్వ సహాయం అందిస్తామన్నారు. జిల్లాలో 9 వేల హెక్టార్లలో చెరకు నీటి ముంపునకు గురైందని గుర్తించామని, వరికి కూడా ఎక్కువ నష్టం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ అధికారి షరీప్ తహశీల్దార్ సీతారామారావు, ఎంపీడీవో మంజులావాణి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోన లచ్చన్ననాయుడు, అధికారులు పాల్గొన్నారు.

ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు
చోడవరం, నవంబర్ 8: వరద ముంపుప్రాంతాల్లో మంత్రులు గంటా, పి.బాలరాజు పర్యటించి బాధితులను పరామర్శిస్తున్నారు. నీలం తుఫాన్ ప్రభావం కారణంగా మండలంలో తీవ్రంగా నష్టానికి గురైన భోగాపురం, పిఎస్ పేట ఇతర గ్రామాల్లో వీరు పర్యటించి వరద బాధితులను పరామర్శించి తుఫాన్ నష్టాలపై అధికారులతో సమీక్షించారు. భోగాపురం గ్రామానికి చెందిన పాడిరైతులు జలదిగ్బంధంలో చిక్కుకుని క్షేమంగా ఇళ్లకు చేరుకున్న సంగతి తెలిసిందే. వీరిని మంత్రి గంటా శ్రీనివాసరావు పరామర్శించి వారు జలదిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుండి అన్నివిధాలా సహాయక చర్యలు అందజేస్తామని వారికి హామీ ఇచ్చారు. అలాగే మంత్రి బాలరాజు వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన బొడ్డేరు కాజ్‌వేను మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీతో కలసి పరిశీలించి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ వంతెన విషయమై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరలో నిర్మాణ పనులు జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, ఏడువాక సత్యారావు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పంట నష్టపరిహారానికి రైతుల ఆందోళన
మునగపాక, నవంబర్ 8: నీలం తుఫాన్ ప్రభావంతో మునగపాక ప్రాంతంలో వరి, చెరకు పంటలు తీవ్ర ంగా దెబ్బతిన్నాయని, రెవెన్యూ అధికారులు తక్షణమే సర్వే చేయించి రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని రైతులు పెద్దఎత్తున తహశీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుసంఘం మాజీ అధ్యక్షుడు పొలిమేర గణేష్ మాట్లాడుతూ తుఫాన్ దెబ్బకు చెరకు, వరిపంటలు తీవ్రంగా నష్టపోయారని, రెవెన్యూ అధికారులు తక్షణమే పంటనష్టాన్ని గుర్తించి రైతులకు పరిహారాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం మాజీ కార్యదర్శి ఆడారి మహేష్ మాట్లాడుతూ కౌలురైతులకు నేరుగా నష్టపరిహారం అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ మాజీ అధ్యక్షుడు దాడి ముసిలి అప్పారావు, పెంటకోట రమణబాబు, పంటకోట ఆదిశివ, బొడ్డేడ త్రినాధరావు, టెక్కలి దేవకీ, టెక్కలి పరశురామ్, రైతులు పాల్గొన్నారు.

వరద నష్టం అంచనాకు అఖిలపక్షం వేయాలి
* ఎమ్మెల్సీ దాడి వీరభద్రరావు డిమాండ్
ఎస్.రాయవరం, నవంబర్ 8: వరద నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రభుత్వం అఖిలపక్ష కమిటీని నియమించి నష్టం వివరాలను క్షేత్రస్థాయిలో సేకరించాలని రాష్ట్ర శాసనమండలి ప్రతిపక్ష నేత దాడి వీరభద్రరావు డిమాండ్ చేశారు. మండలంలో ముంపునకు గురైన ఎస్.రాయవరం, సోమదేవపల్లి, ధర్మవరం ఒమ్మవరం, పిట్లపాలెం, కర్రివానిపాలెం గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించి నష్టం వివరాలను సేకరించా రు. ఈ సందర్భంగా స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ జిల్లాకు వరదనష్టాన్ని పరిశీలించేందుకు వచ్చిన ముఖ్యమం త్రి పర్యటన మొక్కుబడిగా సాగిందని, ప్రభుత్వం నుండి స్పందన లేదన్నారు. జిల్లాలోని శారదా, వరాహ తాండవ నదుల గట్లు బలహీనంగా ఉన్నాయని, వాటిని పటిష్ఠపరిచేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి కేవలం జాతీయ రహదారి పక్కనే నిలబడి నష్టాన్ని చూస్తే తెలియదని, పోలీస్ బలగాలు వదిలి ప్రజల్లోకి వెళ్లి నష్టాన్ని తెలుసుకోవాలని ఆయన అన్నారు. ప్రభుత్వపరంగా బాధితులకు అందాల్సిన పరిహారం ఇతర సహాయంపై శాసనమండలి శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వై.వినోద్‌రాజు, జిల్లా నాయకులు టి.నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, ఖాదర్‌బాబా, నర్సింహమూర్తి పాల్గొన్నారు.

మున్సిపాలిటీలో ప్రిన్సిపల్ కార్యదర్శి
వరద నష్టం పరిశీలన
అనకాపల్లి, నవంబర్ 8: వరద ప్రభావంతో అనకాపల్లి మున్సిపాలిటీకి వాటిల్లిన నష్టాన్ని పురపాలక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శ్యాంబాబు గురువారం పరిశీలించారు. వరద ప్రభావంగా దెబ్బతిన్న శారదానది తీరానగల శాంతి పార్కు, వాటర్ వర్క్స్, మంచినీటి రిజర్వాయర్ తదితర వాటిని పరిశీలించారు. వరద ప్రభావంతో మున్సిపాలిటీకి 2.20కోట్ల రూపాయల ఆస్తులకు నష్టం వాటిల్లినట్లు మున్సిపల్ కమిషనర్ మురళీధర్ ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శికి నివేదించారు. మంచినీరు కలుషితం కాకుండా చూడాలని, పారిశుద్ధ్యం మెరుగుపరచకుండా ఉద్యోగులు ఎవరికీ సెలవులు మంజూరు చేయరాదని మున్సిపల్ ప్రిన్సిపల్ కార్యదర్శి శ్యాంబాబు ఆదేశించారు. ఈ పర్యటనలో ఆయన వెంట వుడా వైస్‌చైర్మన్ కోన శశిదర్, పబ్లిక్ హెల్త్ ఎస్‌ఇ కృష్ణారెడ్డి, ఇఇ నర్సింహమూర్తి, మున్సిపల్ స్పెషలాఫీసర్ పివిఎల్ నారాయణ పాల్గొన్నారు.
తహశీల్దార్ పనితీరుపై
ఆర్డీవోకు ఎమ్మెల్సీ ఫిర్యాదు
కోటవురట్ల, నవంబర్ 8: తహశీల్దార్ పనితీరుపై నర్సీపట్నం ఆర్డీవోకు ఎమ్మెల్సీ డి.వి. సూర్యనారాయణరాజు, ఐ.సి.డి.ఎస్..పి.ఓ జి. అనంతలక్ష్మి ఫిర్యాదు చేశా రు. తహశీల్దార్ లక్ష్మణమూర్తి విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ ఆర్డీవో దృష్టికి తీసుకువెళ్ళారు. ముంపునకు గురైన గ్రామాల్లో తహశీల్దార్ ఇం తవరకు పర్యటించలేదని ఎమ్మెల్సీ తెలిపారు. కనీసం వి.ఆర్.ఓ.లను గ్రామాలకు పంపించలేదన్నారు. వరదలకు తడిసి పాడైపోయిన పౌష్టికాహారానికి నష్టాన్ని అంచనా వేయడం కోసం గిడ్డంకి రావాలని మూడు రోజులపాటు తిరిగినా తహశీల్దార్ స్పందించలేదని ఐ.సి.డి.ఎస్.పి.ఓ. ఫిర్యాదు చేశారు. పైగా తాను రానని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసుకోమని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని పి.ఓ. ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆర్డీవో మాట్లాడుతూ వరద ప్రాంతాలకు తక్షణం వి.ఆర్. ఓ.లను పంపించాలని ఆర్.ఐ. ఆనంద్‌ను ఆదేశించారు. పౌష్టికాహార నష్టానికి తహశీల్దార్‌తో తాను సంప్రదించానని. నివేదిక ఇస్తానని చెప్పారని అన్నారు.

వరద నష్టానికి రూ.2.50 కోట్లు
ఎంపి నిధులు
* అనకాపల్లి ఎంపి సబ్బం హరి
రావికమతం, నవంబర్ 8: వరద కారణంగా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రోడ్లు, చెరువులు, గ్రోయిన్లకు జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు రెండున్నర కోట్ల రూపాయలు ఎం.పి.నిధుల నుండి తక్షణం కేటాయించనున్నట్లు అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సబ్బంహరి తెలిపారు. తుఫాన్ వర్షాలకు గెడ్డలో కొట్టుకుపోయిన గొర్లె నాగరాజు కుటుంబాన్ని ఆయన గురువారం పరామర్శించారు. కుటుంబానికి ప్రభుత్వపరంగా ఆర్ధిక సహాయం వీలైనంత త్వరగా అందేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో అత్యధికంగా రాంబిల్లి మండలంలో నష్టం జరిగిందన్నారు. వరద బాధితులను ఆదుకోవడానికి ఎం.పి.నిధులు ప్రస్తుతం రెండున్నరకోట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. వీటితో దెబ్బతిన్న చెరువులు, రోడ్లు, చెక్‌డ్యాంలు మరమ్మతులు పూర్తి చేస్తామన్నారు. అలాగే శారదానది ఒడ్డు పటిష్టంగా లేకపోవడం వల్ల ఈ నది పరివాహక ప్రాంతంలో అధికంగా వర్షాలకు నష్టం జరుగుతుందని గుర్తించామన్నారు. దీని నివారణకు ఎం.పి.నిధుల నుండి ఎన్ని నిధులైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. తుఫాన్‌కు అధికారులు, ప్రభుత్వం స్పందించలేదన్న బాబు ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. జిల్లాలో అధికారులు 70 శాతం మెరుగ్గా సహాయక చర్యలు చేపట్టారన్నారు. రావికమతం మండలంలో అద్దెపల్లి వారి గెడ్డను పూడ్చేందుకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కౌలుదారులకు కూడా పంటనష్టాన్ని ఇవ్వాలని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానని ఆయన పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో మాజీ ఎం.పి.టి.సి. లావేటి నాగేశ్వరరావు, పందల దేవ, ఎం.ఆర్. ఓ, ఎడీవో పాల్గొన్నారు.

ఎనిమిది వేల ఎకరాల్లో పంట నష్టం
* ఎమ్మెల్యే సివేరి సోమ
అరకులోయ, నవంబర్ 8: భారీ వర్షాలకు నియోజకవర్గంలో ఎనిమిది వేల ఎకరాల్లో పంటనష్టం జరిగినట్టు శాసనసభ్యుడు సివేరి సోమ తెలిపారు. గురువారం విలేఖరులతో ఆయన మా ట్లాడుతూ పంటలు దెబ్బతినడంతో పాటు ఏడువందల నలభై ఇళ్లు కూలిపోయాయన్నారు. నలభై ఆరు మూగజీవులు మృతి చెందగా, ఓ గిరిజనుడు మరణించినట్టు ఆయన తెలిపారు. అ నంతగిరి మండలానికి చెందిన మరో గిరిజనుడు గల్లంతయ్యాడని, ఇప్పటి వరకు అతడి ఆచూకీ లభ్యం కాలేదని ఆయన చెప్పారు. అరకులోయ మండలంలో ఏడువందల నలభై ఎకరాల్లో వరి, చోడి పంటలు దెబ్బతినగా, అనంతగిరిలో 3,723 ఎకరాల్లో, డుంబ్రిగుడలో 360 ఎకరాల్లో, హుకుంపేటలో 1,964 ఎకరాల్లో, ముంచంగిపుట్టులో 491 ఎకరాల్లో, పెదబయలు మండలంలో 710 ఎకరాల్లో వరి, చోడి పంటలకు నష్టం వాటిల్లిందని ఆయన వివరించారు. ఆరు మండలాల్లో ఎనిమిది వందల ఇరవై ఐదు ఎకరాల్లో రాజ్‌మా పంట నాశనం అయిందని ఆయన చె ప్పారు. నీలం తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన గిరిజన రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమా ండ్ చేశారు. పంటనష్టంపై త్వరలో జరిగే శాసనసభ సమావేశంలో ప్రస్తావించి గిరిజన రైతులకు పంట నష్టపరిహారం సత్వరమే అందించేందుకు కృషి చేస్తానని శాసనసభ్యుడు సివేరి సోమ తెలిపారు. విలేఖరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సివేరి అబ్రహం, శెట్టి బాబూరావు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

పురుగు మందు తాగిన యువకుడి మృతి
అరకులోయ, నవంబర్ 8: తండ్రి మందలించాడని మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఆసుపత్రి పాలైన గిరిజన యువకుడు గురువారం మరణించాడు. డుంబ్రిగుడ మండలం ఆర్మా గ్రామానికి చెందిన కిల్లో అర్జున్ ప్రవర్తన సంతృప్తికరంగా లేకపోవడంతో ఆగ్రహించిన తండ్రి బుధవారం మందలించాడు. దీంతో మనస్ధాపానికి గురైన తనయుడు పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పటివరకు ఆరోగ్యంగా ఉన్న కొడుకు పరిస్ధితి ఆందోళనకరంగా మారడంతో అర్జున్‌ను కుటుంబ సభ్యులు స్ధానిక ఏరియా ఆసుపత్రిలో చేర్పించి ప్రధమ చికిత్స చేయించారు. గత రెండు రోజులుగా ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న అర్జున్ ఆసుపత్రిలో గురువారం తుది శ్వాస విడిచాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు డుంబ్రిగుడ మండల పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్ మురళీకృష్ణ విలేఖరులకు తెలిపారు.

‘ఇంటింటా అన్నమయ్య’ షూటింగ్
మళ్లీ ప్రారంభం
అరకులోయ, నవంబర్ 8: తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన క్రేన్ టెక్నీషియన్ భానుప్రకాష్ మృతితో నిలిచిపోయిన ఇంటింటా అన్నమయ్య సినిమా షూటింగ్ గురువారం మళ్లీ ప్రారంభమైంది. మండలంలోని సిరిగాం సమీపంలో హీరో,హీరోయిన్లపై పాటను చిత్రీకరిస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో క్రేన్ టెక్నీషియన్ దుర్మరణం చెందడంతో గత రెండు రోజులుగా సినిమా షూటింగ్ కార్యకలాపాలను నిలిపివేశారు. క్రేన్ టెక్నీషియన్ మృతదేహానికి బుధవారం స్ధానిక ఏరియా అసుపత్రిలో శవపరీక్షలు నిర్వహించి కుటుంబీకులకు అప్పగించి చిత్ర యూనిట్ సభ్యులు మళ్లీ షూటింగ్ పనుల్లో నిమగ్నమయ్యారు. దర్శకేంద్రు డు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో అరకులోయ పరిసరాల్లో చిత్రీకరిస్తున్న ఇంటింటా అన్నమయ్య సినిమా కోసం మాడగడ వద్ద తాళ్లపాక అన్నమాచార్యుల సెట్‌ను ఏర్పాటుచేశారు. మాడగడ గ్రామ సమీపంలో నెలకొల్పిన అ న్నమయ్య భారీ విగ్రహంవద్ద సినిమా పాటలు, సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉన్నప్పటికీ ఆ ప్రదేశంలో షూటింగ్ జరపకుండా అరకులోయకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న తోకవలస పంట భూముల్లో నృత్య బృందం సభ్యులతో హీరోయిన్ అనన్యపై పాటను గు రువారం చిత్రీకరించారు. సాయంత్రం వరకు పాటను చిత్రీకరిస్తుండడంతో షూటింగ్‌ను చూసేందుకు చుట్టుపక్క గ్రామాల గిరిజనులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. షూటింగ్ సమయంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, చిత్ర యూనిట్ సభ్యులకు ఇబ్బందులు తలెత్తకుండా సాయిబాబా మూవీస్ యూనిట్ ముందు జాగ్రత్తలు తీసుకోవడం విశేషం.

తుఫానుకు దెబ్బతిన్న పంటలు, రోడ్లు
సబ్బవరం, నవంబర్ 8: మండలంలో నీలం తుపాను మిగిల్చిన విషాదం నుంచి రైతులు కోలుకోలేని పరిస్థితి ఎదురైంది. ఖరీఫ్ వరి పంటతోపాటు కూరగాయల పంటలకు తీవ్ర నష్టం కలిగిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. పంటల నష్టం వేయాల్సిన ఉద్యానవనశాఖ అధికారులు ఇంతవరకు గ్రామా ల్లో పర్యటించలేదని అంటున్నారు. జిల్లా అధికారులు వరద ఉద్ధృతి తగ్గితే గాని పంటనష్టాలపై అంచనాలు వేయలేమని చెప్పిన సంగతి తెలిసిందే. కేవలం వర్షాధార ప్రాంతమైన మండలంలో ఈసారి సాధారణ వరి విస్తీర్ణం కంటే అధికంగా సుమారు 2389 హెక్టా ర్ల విస్తీర్ణంలో ఖరీఫ్ వరి నాట్లు వాతావరణంలో మార్పుల వల్ల ఆలస్యంగా పడ్డాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. నీలం తుపాను తర్వాత ప్రాధమికంగా తేలిన లెక్కల ప్రకారం సుమారు 120-150 ఎకరాల వరి పంట దెబ్బతిందని నివేదికలు పంపినప్పటికీ వరదనీరు కిందికి జారిపోయాక ఇక ఆ వరి చేను పంటకు పనికి రాదని చిరుపొట్టదశలో వరికి తీవ్రమైన నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు.
దెబ్బతిన్న రోడ్లు
భారీ వర్షాలకు మండలంలోని పలు గ్రామాల రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. నీలం తుపాను ప్రభావం కేవలం వరి పంటపైనే కాకుండా కూరగాయల పం టలకు తీవ్రనష్టం కలిగిన సంగతి తెలిసిందే. భారీవర్షాలకు వాగులు,గెడ్డల ప్రవాహానికి తారు రోడ్లు కొట్టుకుపోయి గండ్లుపడ్డాయి. అయ్యన్నపాలెంవద్ద గుల్లేపల్లి-కె.కోటపాడు రోడ్డుకు భారీ యెత్తున గండి పడింది. పాత సబ్బవరం వద్ద సబ్బవరం-చోడవరం రోడ్డునీరు నిల్వఉండటం వల్ల దెబ్బతింది. నారపా డు పంచాయతీ పరిధిలోని అనకాపల్లి మండల సరిహద్దుగ్రామం బలిజపాలెం -కొండుపాలెం మధ్యగల తారు రోడ్డుబాగా దెబ్బతినటంతో రాకపోకలకు ఎంతో ఇబ్బందిగా ఉందని, ఆ రోడ్డుపై ప్రయాణం చేసే 17 గ్రామాల ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. సబ్బవరం-అనకాపల్లిరోడ్డునుంచి అమ్ములపాలెం వెళ్లేరోడ్డుగోతులు పడిపోగా ఇటీవల మరమ్మతులు చేసిన సబ్బవరం- అనకాపల్లిరోడ్డుకు తుపాను కారణంగా పెద్దగోతులతో ప్రయాణం నరకాన్ని మరపిస్తుందంటున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని రోడ్లునిర్మాణం చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

మావోయిస్టుల కలకలం
జి.మాడుగుల, నవంబర్ 8: మండలంలోని నుర్మతిలో మావోయిస్టుల బ్యానర్లు ఉదయం దర్శనమిస్తే మరో ముందడుగు వేసి మద్దిగరువు వారపు సంతలో మావోలు ప్రవేశించి నాటుసారా, బెల్ట్‌షాపులను ధ్వంసం చేసినట్టు తెలిసింది. మండలంలోని నుర్మతిలో కామ్రేడ్ చార్ ముజుందార్, కామ్రెడ్ చటర్జీ అమరత్వం జోహార్ అనే నినాదాలతో ఈస్ట్ డివిజన్ కమిటీ పేరున బ్యానర్ వెలసింది. మద్దిగరువు వారపు సంతల్లో మావోయిస్టులు ప్రవేశించి నాటుసారా వ్యాపారులను, బెల్ట్‌షాపు నిర్వాహకులకు తీవ్రంగా హెచ్చరించి సారా, మద్యంను ధ్వంసం చేసినట్టు పలువురు తెలిపారు. ఇకపై నాటుసారాతోపాటు సారా తయారీకి ఉపయోగించే ముడిసరుకును అమ్మకాలు సాగించినా, బెల్ట్‌షాపుల ద్వారా మద్యం విక్రయాలకు పాల్పడినా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించినట్టు తెలిసింది.

‘పంట నష్టాలను చెల్లించాలి’
ముంచంగిపుట్టు, నవంబర్ 8: మండలంలో నీలం తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం మండల సి.పి.ఎం. ఆధ్వర్యంలో రాస్తారోకో, ర్యాలీ నిర్వహించి తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా సి.పి.ఎం. నాయకుడు పి.శా స్ర్తీబాబు మాట్లాడుతూ తుపాను సంభవించి వారం రోజులు గడుస్తున్నా అధికారులు పంట నష్టాలు అంచనా వేయడంలో విఫలం చెందారన్నారు. అధికారులు గ్రామాలను సందర్శించి పంట నష్టాలపై అంచనా వేసి గిరిజన రైతులకు పరిహారం అందించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అధికారులు, ప్రభుత్వం తుపాను ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పరిహారం చెల్లించడంలో మొండిచేయి చూపిస్తున్నారని ఆయన విమర్శించారు. గతఏడాది తుపాను ప్రభావంతో జీడిమామిడి నష్టపోయిన రైతులకు నేటికీ పరిహారం అందించకపోవడం విచారకరమన్నారు. ఇప్పటికైన అధికారులు పంటల నష్టాలపై అధ్యాయనం చేసి బాధిత రైతులకు సకాలంలో పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సి.పి.ఎం.నాయకులు పి.లైకోన్, పి.బీమరాజు, పి.రా మన్న, ఎస్.వెంకటరావు, జెర్రెల, కరిముఖిపుట్టు, దారెల, వనబసింగి, ఏనుగురాయి ప్రాంత రైతులు పాల్గొన్నారు.

అద్భుత వస్తువుల పేరిట మోసగాళ్ల ముఠాల సంచారం
పాడేరు(రూరల్) నవంబర్ 8: గిరిజన ప్రాంతంలో మహిమలు, అద్భుత శక్తులు గల పాత్రలు, బాటిళ్లు, కాయిన్స్, అద్దాలు లభిస్తాయని మభ్యపెట్టే వారి మాటలకు మోసపోవద్దని ఎ.ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ సూచించారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడు తూ గిరిజన ప్రాంతంలో బ్రిటీష్ కాలం నాటి విలువైన అద్భుత శక్తులు గల వస్తువులు లభిస్తున్నాయని, వాటి ద్వారా అనేక లాభాలతోపాటు ఆర్ధికంగా కోట్లాది రూపాయలు సంపాదించవచ్చనే అసత్య ప్రచారాల ద్వారా కొందరు మైదాన ప్రాంతీయులు మోసం చేస్తున్నారని చెప్పారు. ఇటువంటి మోసగాళ్ల సంఖ్య నానాటికి పెరిగిపోతుందని, మైదాన ప్రాంతంలోని అత్యాశ పరుల బలహీనతలతో ఇటువంటి మోసగాళ్లు మితిమీరిపోతున్నారని ఆయన చెప్పారు. వాస్తవానికి గిరిజన ప్రాంతంలో అటువంటి వస్తువులు గాని, అద్భుత శక్తులు, మహిమలు గల అద్దాలు, నాణేలు, బాటిళ్లు, జంతువులు ఎక్కడా లభ్యం కావని, బలహీనతలను అడ్డంపెట్టుకుని కొందరు మోసగాళ్లు ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నారే తప్ప ఇందులో ఎంత మాత్రం వాస్తవంలేదని ఆయన చెప్పారు. ఇటీవల ఇటువంటి మోసగాళ్ల ముఠాలను రెండింటిని అరకులోయలో అరెస్ట్ చేశామని ఆయన తెలిపారు. గిరిజన ప్రాంతంలో ఎవరైనా ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నా, లేక అటువంటి వస్తువులు ఉన్నాయని ఇతరులను ప్రలోభపెడుతున్నా తమకు సమాచారం అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇకపై ఇటువంటి వారిపై ప్రత్యేక దృష్టి సారించనున్నామని, అద్భుత వస్తువుల పేరిట మోసాలకు పాల్పడిన వారితో పాటు కొనుగోలు చేస్తామని చెప్పి గిరిజన గ్రామాల్లో ఎవరైనా సంచరించినా, ఇటువంటి క్రయవిక్రయాలను ప్రోత్సహించిన అనంతరం మోసపోయిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నామని ఎ.ఆర్.దామోదర్ హెచ్చరించారు. ఇకపై ఇటువంటి వస్తువులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిన వారిపైనా దృష్టి సారించనున్నామని, తప్పుడు కార్యక్రమాలకు ప్రోత్సహించడం నేరమన్న విషయాన్ని గ్రహించాలని చెప్పారు.

వరద నష్టం నివేదిక వేగవంతం
english title: 
f

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>